దీనిని తాజా ఆవు పేడను చనిపోయిన ఆవు కొమ్ములలో నింపి సారవంతమైన భూమిలో ఆకురాలుకాలం నుండి వసంత రుతువు వరకు పాతిపెట్టి తయారుచేస్తారు. తయారయిన కొమ్ము ఎరువు శక్తివంతమైన భూమి చైతన్య కారకం. దీనిని భూమిలో కాల్షియం చురుకుదనాన్ని, సూర్యుని / జీవ శక్తులను భూమికి తీసుకురావడానికి ఉపయోగిస్తారు. ఈ శక్తులు విత్తనం మొలకెత్తడం, వేర్లు వృద్ధి చేయడం, మొక్క పెరగడంతోపాటు భూమిలో హ్యూమస్ ఏర్పడటానికి దోహదపడతాయి. కొమ్ము ఎరువును భూమి నిర్మాణానికి, భూమిలో ప్రయోజనకర బాక్టీరియా, శిలీంద్రాలు, వానపాములను పెంచుతాయి. ఎకరానికి 85 గ్రాముల కొమ్ము ఎరువుని సరిపడే నీటిలో కలిపి సవ్యదిశలో ఒక గంటసేపు కలిపి మధ్యాహ్నం తర్వాత భూమిపై సంవత్సరానికి కనీసం రెండుసార్లు వసంత ఋతువు, ఆకులు రాల్చే కాలంలో నీటి బిందువుల రూపంలో పిచికారి చేయాలి. కొమ్ము ఎరువు అసలైన బయోడైనమిక్ ఎరువు.
నల్లఈశ్వరి 5-6 మీ. ఎత్తు పెరిగే బహువార్షిక తీగ. ఆకులు కణుపుకి ఒకటి చొప్పున ఏర్పడతాయి. ఇవి తమలపాకు వాసన కలిగి దాదాపు దీర్ఘచతురస్రాకారంలో చివరి భాగంలో కొంచెం వెడల్పుగా, సూది లాంటి కొనగలిగి ఉంటాయి. పూవుల ఆకర్షణ పత్రావళి ఆకుపచ్చ ఛాయ గల వంగపండు రంగుతో చిన్న ఈగల వంటి కీటకాలు లోపలికి వెళితే బయటకు రావడానికి వీలు లేకుండా నూగు అమర్ౘ్బడిన గొట్టం లాంటి బోను వలే ఉంటుంది. కాయలు గుండ్రంగా ఉండి బద్ధలైతే ఉట్టి (తిరగబడిన గొడుగు) ఆకారంలో ఉంటాయి. దీనిని విత్తనాల ద్వారా వ్యాప్తి చేయవచ్చు.
ఉపయోగాలు : ఔషధరంగంలో …
మొక్కలోని అన్ని భాగాలు ఔషధగుణాలు కలిగి ఉంటాయి. దీనిలో అరిస్టొలోకిక్ ఆమ్లాలు, ఆవిరయ్యే నూనె, టానిన్లు ఉంటాయి.
దీనిని పాము, పురుగుల కాటుకు విరుగుడుగా ఉపయోగిస్తారు.
జ్వరం, గాయాలు, గుండెజబ్బులు, బొల్లి, కుష్టు, చర్మవ్యాధులు, మూర్ఛ, మానసిక వ్యాధుల చికిత్సలో దీనిని ఉపయోగిస్తారు.
దీని కషాయాన్ని వ్రణములు, ఉబ్బసం, బ్రాంకైటిస్ వ్యాదులను నయం చేయడానికి ఉపయోగిస్తారు.
వ్యవసాయరంగంలో …
నల్లఈశ్వరి మిథనాల్ ద్రావణాలు క్యూలెక్స్ జెలిడస్, క్యూలెక్స్ క్వింక్విఫేసియేటస్ లార్వాలను అత్యధికంగా చంపాయి. (కామరాజ్, అతని అనుచరులు, 2010).
అరస్టొలోకియా ఆకు ఇథైల్ ఎసిటేట్ ద్రావణం (5%) స్పోడోప్టెరా లిటూరపై అధిక యాంటిఫీడెంట్ చర్య (56.06%), తినడాన్ని అరికట్టడానికి లీథల్ కాన్‌సెంట్రేషన్ (3.69%), లార్విసైడల్ (40.66%), పూపిసైడల్ (28%), మొత్తం చావు (68.66%), పొడిగించబడిన లార్వల్ ప్యూపల్ సమయం (12.04 -13.08 రోజులు) నమోదు చేసింది (బాస్కర్, అతని అనుచరులు, 2011).
అరిస్టొలోకియా బీటికా మిథనాల్ ద్రావణం ట్రైబోలియం కాస్టానియంపై మంచి కీటకనాశక చర్యను ప్రదర్శించింది (జ్బిలో, అతని అనుచరులు, 2006).
అరిస్టొలోకియా బ్రాక్టియోలేట కాయల హెక్సేన్ ద్రావణం (5%) జొన్నగింజల నిల్వ సమయంలో ఆశించే ఖాప్రాబీటిల్, ట్రోగోడెర్మా గ్రానేరియం నుండి గింజలను కాపాడాయి (ఎలామిన్ అండ్ సత్తి, 2012).
నల్ల ఈశ్వరి మిథనాలిన్ ద్రావణంలో అరిస్టొలోకిక్ యాసిడ్, అరిస్టోలోకిక్ యాసిడ్ అనే రెండు మిశ్రమాలున్నాయి. అరిస్టోలోకిన్ యాసిడ్ అనోఫెలెస్ స్టెఫెన్సి లార్వాలపై అరిస్టాలోకిక్ యాసిడ్ కన్నా అధిక విషచర్యను ప్రదర్శించింది (ప్రదీప్ వెంకటరామన్, ఆమె అనుచరులు, 2015).
నల్లఈశ్వరి ఆకుల క్రూడ్ ద్రావణం మరియు ఆకుల నీటి ద్రావణం నుండి సంకలనం చేసిన సిల్వర్ నానోపార్టికల్స్ హెలికోవర్పా ఆర్మిజరా 3వ దశ లార్వాలపై గరిష్ట యాంటిఫీడెంట్ మరియు లార్విసైడల్ చర్యలను ప్రదర్శించాయి. (శివ అండ్ సంతోష్ కుమార్, 2015).అరిస్టొలోకియా టగల యాంటిఫీడెంట్ లక్షణాలు నమోదు చేయబడ్డాయి. (కాస్సి, 1983).
అరిస్టొలోకియా టగల స్పోడోప్టెరా లిటూరపై వికర్షక, యాంటిఫీడెంట్ చర్యలను ప్రదర్శించింది. లార్వా, ప్యూపా, పెద్ద పురుగుల దశలపై ఈ ప్రభావాలు ప్రస్పుటంగా కనిపించాయి. (లిట్ అండ్ రెజెసస్, 1990).
ఈ మొక్క క్రూడ్ ద్రావణం ఆసియాటిక్ మొక్కజొన్న కాండంతొలుచు పురుగు, ఆస్ట్రినియా ఫర్నకాలిసీని నివారించింది (లిట్ అండ్ రెజెసస్, 1989).
ఈ మొక్క ద్రావణం డైమండ్ బ్యాక్ మాత్, ప్లూటెల్లా క్ౙెåలోస్టెల్లాపై విష చర్యను ప్రదర్శించింది (లిట్ అండ్ రెజెసస్, 1999)
ఈ మొక్క ఆకుల 5% ఇథైల్ అసిటేట్ ద్రావణం యాంటిఫీడెంట్, ఫీడింగ్ డిటరెంట్, లార్విసైడల్, ప్యూపిసైడల్, పూర్తిచావు, లార్వల్‌ప్యూపల్ సమయం పొడిగించబడటం వంటి చర్యలను ప్రదర్శించింది (భాస్కర్, అతని అనుచరులు, 2011)
నల్లఈశ్వరి ఆకుల ఆల్కహాల్ ద్రావణం (5%) 100% ప్రొడీనియాలిటూర, 3% ఆకుల ద్రావణం 100% యూప్రోక్టిస్ ఫ్రటర్నా; 3% ఆకులు, కాండాలు, లేదా కాయల ద్రావణం, 20% ఆకులు, కాండాల పొడి ద్రావణం 48% మామిడి తేనె మంచు పురుగు (హాపర్) పిల్ల పురుగులను చంపాయి. (పుట్ట రుద్రయ్య అండ్ సుబ్రమణ్యం, 1955Ð1956)
ఈశ్వరి వేరు ద్రావణం స్పోడోప్టెరా లిటూరపై గుడ్డు పెట్టకుండా నిరోధించే చర్యను ప్రదర్శించింది (అరివోలి అండ్ టెన్నిసస్, 2013).
అరిస్టొలోకియా బ్రాక్టియేట కంకిపొడిని వేరుశనగ పిండితో కలిపి తయారు చేసిన మిశ్రమాన్ని ఎలుకల బొరియల దగ్గర ఉంచి ఎలుకలను నివారించవచ్చు (పటేల్, గుప్తా, అతని అనుచరులు, 1991).
పురుగుల యాజమాన్యానికి నల్లఈశ్వరి సిల్వర్ నానోపార్టికల్స్‌ని సిఫారసు చేశారు (యశుర్ అండ్ రాణి, 2015).
అరిస్టొలోకియా రింజెస్ వేరు పదార్థం వేర్‌హౌస్‌మాత్, ఎఫెస్టియా కౌటెల్లా పెద్ద పురుగులను సమర్ధవంతంగా నివారించింది (ఐన్, అతని అనుచరులు, 2013).
నల్లఈశ్వరి ఆకుల నీటి ద్రావణం వరి పంటలో కాండం కుళ్ళు కలిగించే శిలీంద్రం, స్ల్కీరోషియం ఒరైజె పెరుగుదలనరికట్టింది (వెంకటేశ్వర్లు, అతని అనుచరులు, 2013). నేలవేము, జిల్లేడు, యూకలిప్టస్ 2% ఆకుల ద్రావణం రసాయన శిలీంద్రనాశనుల కన్నా అధిక సమర్ధవంతంగా కాండం కుళ్ళు తెగులును నివారించింది.
రైతునేస్తం ప్రచురణ ‘ఔషధ వేదం’ పుస్తకం కొరకు ఫోన్: 9676797777కు సంప్రదించండి
కదంబం మధ్యస్థం నుండి పెద్దగా పెరిగే ఆకురాల్చే వృక్షం. దీని మాను స్థూపాకారంలో ఉంటుంది. శాఖలు సమాంతరంగా ఉండి శిఖర భాగం గుండ్రంగా ఉంటుంది. బెరడు చిక్కటి గోధుమ రంగులో ఉండి నిలువుగా పగుళ్ళు కలిగి పొలుసులుగా ఊడిపోతుంది. ఆకులు అండాకారం లేదా దీర్ఘ అండాకారంలో ఉండి ఎదురెదురుగా ఏర్పడతాయి. ఆకుల అడుగు భాగంలో నూగు ఉంటుంది. పూలు సువాసన కలిగి పసుపు లేదా నారింజ రంగులో గుండ్రంగా ఉంటాయి. కాయలు గుండ్రంగా ఉండి పండితే పసుపు రంగులోకి మారతాయి.
సాధారణ నామం : వైల్డ్ సింఖోన / రుద్రాక్షాంబ శాస్త్రీయ నామం : ఆంతోసిఫాలస్ కైనెన్సిస్, ఆంతోసిఫాలిస్ కదంబం కుటుంబం: రూబియేసి
ఉపయోగాలు : ఔషధరంగంలో …
కదంబం బెరడు, ఆకులు, పండ్లు ఔషధగుణములు కలిగి ఉంటాయి. వాటిలో కాడంబైన్, ఆకడమైన్, బీటాసైటోస్టిరాల్ మొదలగు ఆల్కలాయిడ్లు మరియు కాదంబజెనిక్ ఆమ్లం ఉంటాయి.
కదంబం బెరడు టానిక్‌లా పనిచేస్తుంది. జ్వరాలను తగ్గిస్తుంది.
ఆకుల కషాయం పుండ్లు, గాయాలు మొదలైన వాటిని తగ్గిస్తుంది. పండ్లు కడుపులో వికారం మరియు జ్వరాలను తగ్గిస్తాయి.
కదంబం కాయలు మరియు పండ్లు ఆల్కహాలిక్ మరియు నీటి ద్రావణాలు స్టెఫైలోకోకస్ ఆరియస్, ఎస్కెరిచియా కోలి, సూడోమోనాస్ ఈరూజినోసాపై గణనీయమైన యాంటిబాక్టీరియల్ చర్యను ప్రదర్శించాయి.
కదంబం మిథనాల్ ఆకుద్రావణం మరియు బయోసింథసిస్ చేసిన నిమ్మగడ్డి గోల్డ్ నానోపార్టికల్స్ క్యూలెక్స్ క్వింక్వెఫాసియేటస్ మొదటిదశ లార్వాలు ప్యూపాలు, పెద్దపురుగుల జీవితకాలాన్ని పెంచాయి. ఈ మొక్కలో ఉన్న చురుకైన రసాయనాలు లార్వా, ప్యూపా, పెద్ద పురుగుల విడుదలను గణనీయంగా అరికట్టాయి. (జయలలిత, ఆమె అనుచరులు, 2016)
రైతునేస్తం ప్రచురణ ‘ఔషధ వేదం’ పుస్తకం కొరకు ఫోన్: 9676797777కు సంప్రదించండి
సాధారణ నామం : కస్టర్డ్ యాపిల్ శాస్త్రీయ నామం : అనోనా స్క్వామోసా కుటుంబం: అనోనేసి
సీతాఫలం పంటను అతి తక్కువ వర్షపాత ప్రాంతాల్లో మెట్ట భూముల్లో సాగు చేయవచ్చు. సీతాఫలం పండ్లు కార్బోహైడ్రేట్లు, విటమిన్ సి, విటమిన్ ఎ, మెగ్నీషియం, పొటాషియం, విటమిన్ బి6, రాగి, పీచుపదార్థం, తక్కువ కొవ్వు కలిగి ఉండి అనేక ఆరోగ్య ప్రయోజనాలను సమకూరుస్తాయి. సీతాఫలం ఆకులు, గింజలు మరియు ఇతర భాగాల్లో ‘అనోనైన’ అనే పదార్థం ఉండటం వలన చేదు గుణం కలిగి ఉంటుంది. అందుకే సీతాఫలం ఆకులను పశువులు, మేకలు తినవు. ఆకులు, గింజల నుండి తీసిన రసంలో కీటకనాశిని లక్షణాలున్నాయి.
సీతాఫలం ఆకు కషాయం : 500 గ్రా. సీతాఫలం ఆకులను 2 లీ. నీటిలో ఉడికించాలి. ఒక లీటరు ద్రావణం మిగిలే వరకు ఉడికించాలి. ఈ ద్రావణాన్ని వడపోసి 10 15 లీ. నీటిలో కలిపి పురుగులు సోకిన మొక్కలు బాగా తడిచేటట్లు పిచికారి చేసి పేనుబంక, సుడిదోమ, గొంగళిపురుగులు, డైమండ్ బ్యాక్ మాత్, పచ్చదోమ, పచ్ౘ్నల్లి పురుగులను నివారించవచ్చు.
వివిధ ఆకుల కషాయం : వేపాకు1 కి., కానుగ 1 కి., బిల్వం 1కి., విషముష్టి 1/2 కి., వావిలాకు 1 కి., తంగేడు 1 కి., సీతాఫలం 1/2 కి., పిచ్చి తులసి 1 కి., పుదీనా 1/2 కి., పాలకొడిస 1/2కి., కొత్తిమీర 1/2కి., నేరేడు 1 కి., నేలవేము 1/2 కి., యూకలిప్టస్ 1 కి., అత్తాకోడలు ఆకు 1 కి., ఈ ఆకులలో ఏవైనా 5 రకాల ఆకులను పైన చెప్పిన మోతాదులో తీసుకుని 10 లీ. నీటిలో అరగంట సేపు బాగా ఉడికించి, ఉడుకుతున్న ఈ ద్రావణాన్ని కర్రతో మధ్య మధ్య కలుపుతూ, కషాయాన్ని బాగా చల్లార్చి పలుచని గుడ్డతో వడపోయాలి. కషాయానికి 100 గ్రా. సబ్బుపొడి లేదా 500 గ్రా. కుంకుడు రసం కలిపి, ఈ ద్రావణానికి 100 లీ. నీటిని చేర్చి సాయంత్రం వేళ పంటపై పిచికారి చేయాలి.
ఈ కషాయం అనేక పంటలనాశించే రసం పీల్చే పురుగులు, పెద్ద దశలోనున్న లద్దె పురుగులు, శనగపచ్చ పురుగులు, ఆకులనుతినే గొంగళిపురుగులపై బాగా పనిచేస్తుంది.
దశపర్ణి కషాయం : వేప ఆకులు 5కి., నల్లేరు ఆకులు 2కి., అరిస్టాలోకియా ఆకులు 2కి., బొప్పాయి ఆకులు 2కి., సీతాఫలం ఆకులు 2 కి., కానుగ ఆకులు 2 కి., ఆముదం ఆకులు 2 కి., గన్నేరు ఆకులు 2 కి., జిల్లేడు ఆకులు 2 కి., టైనోస్పోరా కార్డిఫోలియా ఆకులు 2 కి., పచ్చి మిరప కాయల పేస్టు 2 కి., వెల్లుల్లి పేస్టు 2కి., ఆవుపేడ 3 కి., ఆవు మూత్రం 5 లీ.
వీటినన్నింటినీ నూరి 200 లీ. నీటిలో కలిపి ఒక నెల రోజులు పులియబెట్టాలి. ఈ మిశ్రమాన్ని రోజుకి మూడుసార్లు కలియతిప్పాలి. నెల రోజుల తర్వాత వడపోయాలి. ఈ కషాయాన్ని 6 నెలల వరకు నిల్వ చేయవచ్చు. ఈ కషాయాన్ని ఒక ఎకరం పొలంలో ఫాగింగ్ మెషిన్‌తో చల్లి తామర పురుగులు, ఆకుముడత పురుగు, లీఫ్ హాపర్స్‌ని నివారించవచ్చు.
సీతాఫలం విత్తన నూనె కషాయం : పచ్చి కాయల నుండి గింజలను తీసి గ్రైండర్‌లో వేసి నూనె తీయాలి. ఒక భాగం నూనెని 20 భాగాల నీటిలో కలిపి డైమండ్ బ్యాక్‌మాత్ ఆశించిన పంటపై పిచికారి చేయాలి.
రైతునేస్తం ప్రచురణ ‘ఔషధ వేదం’ పుస్తకం కొరకు ఫోన్: 9676797777కు సంప్రదించండి
ఈ మిశ్రమం సూక్ష్మక్రిములకు, వానపాములకు ఆహారంగా ఉపయోగపడి మొక్క ఆరోగ్యంగా పెరుగుటకు దోహదపడుతుంది.
మోతాదు : ఎకరానికి 50 లీటర్లు
కావలసిన పదార్థాలు : ఆవుపేడ : 25 కిలోలు; నీరు : 50 లీటర్లు; కుళ్ళిన పండ్లు లేదా కూరగాయలు : 20 కిలోలు.
తయారు చేయు విధానం: ఒక ప్లాస్టిక్ డ్రమ్ములో నీరు, ఆవుపేడ కలిపి నాలుగు రోజులు మురగబెట్టాలి. కుళ్ళిన పండ్లు లేదా కూరగాయలను ఒక డ్రమ్ములో వేసి మూతబెడితే 4 రోజులలో కుళ్ళిపోతాయి. వీటిని అదే రోజున మెత్తగా పిసికి, ఆవుపేడ, నీళ్ళు కలిపిన డ్రమ్ములో వేసి కలియ పెట్టాలి. ఆపైన మూత వదులుగా పెట్టి, మరుసటి రోజున ఈ మిశ్రమాన్ని కర్రతో కలిపి డ్రమ్ముపై మూతపెట్టాలి. 10 రోజులలో మిశ్రమం తయారవుతుంది. 11వ రోజున ఈ మిశ్రమాన్ని వడబోసి, సుమారు 50 లీటర్లు ఒక ఎకరం పొలంలో నీటిద్వారా గాని, లేదా కళ్ళాపిలా గాని నేలపై చల్లాలి.
జీడిమామిడిని భూసారం తక్కువగా ఉన్న నేలల్లో భూమి కోతను తగ్గించడానికి సాగు చేస్తారు. జీడిమామిడి మధ్యస్త పరిమాణంలో ఉండే చెట్టు. ఇది ఎల్లప్పుడూ ఆకుపచ్చ రంగులో ఉండి, అనేక కొమ్మలు విస్తరించి ఉండి 12 మీ. ఎత్తు వరకు పెరుగుతుంది. ప్రథమ వేరు ప్రస్ఫుటంగా ఉండి అనేక ప్రక్క వేర్లు, సింకర్ వేర్ల వ్యవస్థ కలిగి ఉంటుంది. ఆకులు ఒకదానిని విడిచి ఇంకొకటిగా ఏర్పడి, అండాకారంలో, లేత ఆకుపచ్చ రంగులో గుండ్రని చివర్లు కలిగి 10-18 x 8-15 సెం.మీ. పరిమాణంలో చిన్న ఆకు తొడిమ కలిగి వుంటాయి. లేత ఆకులు ఎరుపు రంగు, ముదురు ఆకులు ముదురు ఆకుపచ్చ రంగులో ఉంటాయి. జీడిమామిడి 3-5 సంవత్సరాలలో పూతకు వస్తుంది. పూగుచ్ఛం గుత్తిలో అనేక మగపూలు, ద్విలింగ పుష్పాలు ఏర్పడతాయి. జీడికాయ ఎండి, విషపూరిత గుల్లలో పెద్ద, వంపు తిరిగిన గింజ (2.5 సెం.మీ.) కలిగి ఉంటుంది. జీడి కాయ పసుపు రంగులో పలుచని చర్మంతో, మెత్తని కండతో, అధిక రసం కలిగి ఉంటుంది.
సాధారణ నామం : కాష్య్ణు, శాస్త్రీయ నామం : అనకార్డియం ఆక్సిడెంటేల్, కుటుంబం: అనకార్డియేసి
ఉపయోగాలు : ఔషధరంగంలో …
జీడిమామిడి సిరప్ దగ్గు, జలుబులకు మంచి మందు, జీడిమామిడి రసం సిఫిలిస్ చికిత్సలో సమర్ధవంతంగా పనిచేస్తుంది.
పాతజీడిమామిడి లిక్కర్ తక్కువ మోతాదులో కడుపునొప్పి తగ్గిస్తుంది, జీడిమామిడి గుల్ల నుండి తీసిన నూనెని గ్రామస్థులు కాలి మడమ పగుళ్ళను నయం చేయడానికి ఉపయోగిస్తారు.
జీడిమామిడిని కలరా, మూత్రపిండ సమస్యల చికిత్సలో ఉపయోగిస్తారు.
జీడిమామిడి పెంకు నుండి తీసిన నూనెని విరేచనకారిగా, మధుమేహం, కిడ్నీ సమస్యలు, కాలి మడమ పగుళ్ళ, ఆనెల నివారణలో ఉపయోగిస్తారు.
జీడి పప్పుని డయేరియా అరికట్టడానికుపయోగిస్తారు, మొగ్గలు, లేత ఆకులను చర్మవ్యాధులను నయం చేయడానికుపయోగిస్తారు.
గింజల రసాన్ని మానసిక సమస్యలకు, కీళ్ళనొప్పులకు ఉపయోగిస్తారు.
జీడి మామిడి కాయ రసం (20%) కొబ్బరిలో ఎర్రముట్టె పురుగు (రెడ్‌పామ్ వీవిల్)ని కాండానికి ఇంజక్ట్ చేయడం, మొవ్వులో పోయడం ద్వారా సమర్ధవంతంగా నివారించవచ్చు. ఇది రసాయన పురుగుమందు కార్బరిల్‌కి ప్రత్యామ్నాయం.
జీడిమామిడి పెంకు ద్రవం నిల్వ ధాన్యాలను ఆశించే సైటోఫిలా ఒరైజే బీటిల్‌ని సమర్ధవంతంగా నివారిస్తుంది (బక్ట్సన్, అతని అనుచరులు, 2017).
జీడిమామిడి చెట్టు అన్ని భాగాల ద్రావణాలు కీటకనాశక, పురుగు వికర్షక లక్షణాలు కలిగి చెద పురుగులు, కాఫీ గింజలను తొలిచే తెల్ల పురుగులను నివారించాయి. గింజల నుండి తీసిన నూనె ప్రత్తిలో రెడ్ కాటన్ బగ్, పొగాకులద్దె పురుగులను అరికట్టాయి (రిచర్డ్ విలియం హే ఫ్లూక్, 1999)
జీడిమామిడి ద్రావణం (నీటిలో కలిపిన) అనేక చెట్లకు నష్టం కలిగించే మాక్రోటెరిమస్ చెద పురుగుని నివారించింది (ఓసిపిటన్, & ఓసెవేమి, 2012).
జీడిమామిడి ఆకు పొడి చెద పురుగు ఒడొంటో టెర్మెస్ ఒబెసస్‌ని 53.33% నివారించాయి (రంజిత్, అతని అనుచరులు, 2017).
జీడిమామిడి బంక ద్రావణం కొన్ని శిలీంద్రాలు, బాక్టీరియా పెరుగుదల నరికట్టింది. కాల్లసోబ్రూకస్ మాక్యులేటస్ (బ్రూచిడ్) పెద్ద పురుగుల సంఖ్యను తగ్గించింది. (మార్క్వెస్, అతని అనుచరులు, 1992)
చేప-బెల్లం ద్రావణంలో ఎన్నో రకాల ‘అమినో యాసిడ్’ లు ఉంటాయి. ఇవి పంటల యొక్క పెరుగుదలకు ఉపయోగపడతాయి.
కావలసిన పదార్థాలు: చేప వ్యర్థాలు : 1 కిలో (ఎముకలు, మొప్పలు, చర్మం మొ॥); బెల్లం : 1 కిలో
తయారు చేయు పద్ధతి (చోహాన్ క్యూ పద్ధతి):
ఒక కిలో చిన్న చిన్న ముక్కలుగా కత్తిరించిన చేపల వ్యర్థ పదార్థాలను, ఒక కిలో బెల్లం పొడిని తీసుకొని బాగా కలిపి ఒక కుండలో నిలువ చేయాలి.
కుండపై మూతపెట్టి 10-12 రోజుల పాటు ఆ మిశ్రమాన్ని పులియబెట్టాలి.
ఈ మిశ్రమాన్ని ప్రతిరోజూ కర్రతో బాగా కలపాలి.
ఈ మిశ్రమాన్ని 10-12 రోజుల తర్వాత వడపోసి, ఒక లీటరు మిశ్రమానికి 100 లీటర్ల నీటిని కలిపి (1 శాతం) ఒక ఎకరం పొలంలో పంటపై గానీ, పొలంలోని భూమిపైగానీ, కంపోస్టు గుట్టపైగానీ పిచికారీ చేయాలి. సూచనః
పంటకాలంలో 1-2 సార్లు పంటపై పిచికారి చేస్తే సత్ఫలితాలు పొందవచ్చు.
ఈ ద్రావణాన్ని అన్ని పంటలలో, పండ్ల తోటలలో వాడవచ్చు.
ద్రావణాన్ని తయారు చేసిన వెంటనే ఉపయోగించుకోవాలి. నిల్వ ఉంచరాదు.
రైతునేస్తం ప్రచురణ ‘స్వేద వేదం’ పుస్తకం కొరకు ఫోన్: 9676797777కు సంప్రదించండి
ప్రతి తేనె పెంపకం పరిశ్రమలో కనీసం ఒకటి లేదా రెండు పట్టులు దూకుడుగా (Aggressive) ఉంటాయి. అనగా కుట్టే స్వభావం ఎక్కువగా ఉంటుంది. కొంతమంది తేనెటీగల పెంపకందారులకు ఈ లక్షణం ఉన్న పట్టులంటే ఇష్టము. ఎందుకనగా ఇలాంటి పట్టులు మంచి తేనెను సేకరించే లక్షణము, వ్యాధి నిరోధక శక్తిని లేక ఇతర విలువైన లక్షణాలను కలిగి ఉంటాయని భావిస్తారు. ఏది ఏమైనప్పటికీ దూకుడుగా వ్యవహరించే పట్టులకు నెమ్మదిగా ఉండు రాణి ఈగలను రక్షించాలనే మనస్సాక్షి గల తేనెటీగల పెంపకం దారులు ఏ సంకోచం లేకుండా చేస్తారు. తేనెటీగల పట్టులలో దూకుడు గల లక్షణం అనేది వంశపారంపర్యమైన లక్షణం అని చెప్పడానికి ఏ సందేహము లేదు. అంతేకాకుండా పెద్ద పట్టులు ఎప్పుడూ దూకుడుగానే ఉంటాయి. ఎందువలన అనగా ఆ పట్టులో ఎక్కువ సంఖ్యలో తేనెటీగలుంటాయి కాబట్టి ఏది ఏమైనా బలమైన సులువుగా యాజమాన్యం చేయగల పట్టులు అలానే ఉండాలనేది తేనెటీగల పెంపకందారుల లక్ష్యం కూడాను.
సామన్యమైన, సూటిగా రాణి ఈగ ఎంపిక అనేది బాగా స్థిరపడిన విషయమే కాకుండా ఈ ప్రక్రియ ఆ ప్రాంతంలో తేనెటీగల స్వభావమును మార్చుతుంది. సంవత్సరాలుగా తేనెటీగలను నెమ్మదిగా ఉండే, వ్యాధి నిరోధకత కల్గి, తేనె ఉత్పత్తి ఎక్కువగా చేయగల తక్కువ ప్రపోలిస్ ను, ఎక్కువ పుప్పొడిని సేకరించు లక్షణాలు గల పట్టుల ఈగలను (Selection) ఎంపిక చేస్తున్నారు. ఎక్కువ సంఖ్యలో గల పట్టులు ఖచ్చితంగా తేనెటీగల స్వభావము మీద ఆ ప్రాంత ప్రభావము ఉంటుంది. ఇంకా పొరుగువారి తేనె పట్టులకు చాలా దగ్గరగా పనిచేసినట్లయితే తరుచుగా ఆ ప్రాంతమంతటి మీద కలిగే ప్రభావముగా ఫలితం ఉంటుంది.
పోతుటీగలు వీటిన్నింటి మీద ఒక కారకము (Factor) ఎందువలన అనగా సగం జన్యు పదార్ధము పోతుటీగల వైపు నుండి వస్తుంది. పోతుటీగల లద్దె పురుగులను, కోశస్థ దశలను దూకుడుగా ఉన్న పట్టులలో నాశనం చేసినపుడు దూకుడు అనే లక్షణాన్ని మోసుకెళ్ళే పోతుటీగల జన్యువులు పట్టులో తగ్గిపోతాయి. ఇది ఒక ఎంపిక మాత్రమే అయినప్పుటికీ సమయం చాలా తీసుకునే (Time consuming) ప్రక్రియ. ఇంకొక ఎంపిక ఏమంటే పోతుటీగల కృత్రిమ మైనపు అట్టను పట్టుకు సరఫరా చేయడం లేదా మంచి పట్టుల నుండి పోతుటీగలున్న లద్దె పురుగుల ఫ్రేములను సరఫరా చేయవలెను.
బాగా కుట్టే స్వభావము గల పట్టులలో ఎక్కువ సంఖ్యలో కూలి ఈగలు మనల్ని కుట్టకుండా రాణి ఈగను గుర్తించడం బహుశా అన్నిటికంటే కష్టమైన పని. తరచుగా ఇలాంటి పట్టులన్నింటిలో ఎక్కువ సంఖ్యలో కూలి ఈగలుంటాయి. రాణి ఈగను కనగొనడం చాలా కష్టము. కొన్నిసార్లు అసాధ్యముగా అనిపిస్తుంది. సాధారణంగా బాగా కుట్టే పట్టులకు ఎక్కువ మోతాదులో పొగ ఇచ్చి బాగా కుట్టే స్వభావము గల పట్టులను పరిశీలిస్తుంటాము. రాణి ఈగ పట్టును వదిలి తేనె పెట్టెలో ఏ భాగములోకైనా వెళుతుంది. బాగా పొగబారించినపుడు కూలి ఈగలు పట్టులోను మరియు పట్టుకు వెలపల గుంపులు గుంపులుగా ఏర్పడతాయి, ఒకవేళ రాణి ఈగ ఈ గుంపులలో ఉన్నట్లయితే రాణి ఈగను గుర్తించడం అసాధ్యము.
బాగా కుట్టే పట్టులలో రాణి ఈగను కనుగొనడానికి రెండు పద్దతులున్నాయి. రెండు పద్దతులలో కొంత ఎక్కువ సమయము మరియు కృషి అవసరమవుతుంది. ఈ రెండు పద్దతులను కూడా కూలి ఈగలు ఆహారం సేకరణకు వెళ్ళినపుడు, వెచ్చని వాతావరణములో (Warm days) చేయవలసి ఉంటుంది. పొలములో ఎక్కువ మోతాదు లో పుప్పొడి మరియు మకరందము లభ్యమయ్యేటప్పుడు మంచిది. ఎందుకంటే ఎక్కువ కూలి ఈగలు పొలానికి వెళతాయి కాబట్టి.
మొదటి పద్ధతిలో, మొదటిగా పట్టులో లద్దె పురుగులు, కోశస్థ దశలో ఉన్న (Brood nest) ఫ్రేములను గుర్తించి, పెట్టెతో సహా 50 నుండి 75 అడుగుల దూరం వరకు మోసుకెళ్ళి ఒక పొద చాటున లేక ఇతర అడ్డుగా ఉన్న (Obstrucion) నీడలేని ప్రదేశంలో ఉంచాలి. వయస్సు మళ్ళిన కూలి ఈగలు, పాలంకెళ్ళిన కూలి ఈగలు, కాపలా కాసే ఈగలతో సహా అన్ని తిరిగి వాటి పాత స్థానంలోకి ఎగరి వెళతాయి. కారణం వాటికి తెలిసిన వాటి పాత ఇల్లు అదే అని, దానిని కాపాడుకోవాలని అంతే తప్ప ఈ కొత్త స్థలం కాదు కాబట్టి. పైన చెప్పబడిన చిట్కా కూడ, కుట్టే ఈగల పట్టును తెరచి పరీక్షించునపుడు, మరియు ఇతరులకు చూపేటపుడు (Live demonstration) ఉపయోగపడుతుంది. పట్టును ఎత్తుకొని వేరే చోటుకి వెళ్ళడము ద్వారా ఎదురాడే కూలి ఈగలు ఎగిరి తిరిగి వాటి అసలు స్థానానికి వెళతాయి.
ఒకసారి లద్దె పురుగులున్న పెట్టె మరియు రాణి ఈగ, వేరు స్థానానికి మార్చినపుడు, తక్కువ పొగ అవసరముంటుంది. వెదకే విషయంలో మందుకు వెళ్ళవచ్చును. పొగ ఉపయోగించడం వల్ల తేనెటీగలకు రాణి ఈగతో సహా దిక్కు దిశ తెలియకుండా అవుతుంది. సాధారణ పరిస్థితులలో, నెమ్మదిగా ఉన్న పట్టులో రాణి ఈగ, లద్దెపురుగులున్న ప్రేములపై కనబడుతుంది. ఎక్కువ పొగ పట్టుకు ఇచ్చినపుడు రాణి ఈగ ఎక్కడైనా ఉండవచ్చును. రాణి ఈగను గుర్తించే రెండవ పద్ధతిలో (కుట్టే ఈగలు గల పట్టులలో) తేనె పట్టును విభజించి రాణి ఈగను వేరు పరుచు జల్లెడను ప్రతి భాగము (మీద పిల్లల గది మరియు తేనె గదిపై) పై ఉంచి పట్టు ద్వారమును మూసివేయవలెను. ఈ విధంగా చేయడం వల్ల మనకు రాణి ఈగ ఒక దానిలో ఖచ్చితంగా ఉoటుందని నమ్మవచ్చును. మూడు లేక నాలుగు రోజులు తర్వాత గుడ్లన్నీ రాణి ఈగ లేని భాగములో (Hive Part) పొదగబడతాయి. దేనిలో గుడ్లు ఉంటాయో దానిని (ఆ భాగమును) ఒక ప్రక్క ఉంచి అడుగు బల్ల మరియు పై మూతను పెట్టాలి. తిరిగి వయస్సు మళ్ళిన కూలి ఈగలు వాటి పాత స్థానమునకు తిరిగి వెళతాయి. అదే రోజున గాని, తరువాత రోజు గాని రాణి ఈగ కొరకు తక్కువ సంఖ్యలో ఉన్న కూలి ఈగలు పట్టులో తక్కువగా ఉన్నందువలన సులువుగా రాణి ఈగను కనగొనవచ్చును.
మన లక్ష్యం ఇక్కడ అసలు పట్టులో (Original) రాణి ఈగను తిరిగి ప్రవేశ పెట్టడం (Requeening). పట్టు తనంతట తానుగా రాణి ఈగను తయారు చేసుకోనివ్వకూడదు. అలా కొత్తగా వచ్చిన రాణి ఈగ తన తల్లి నుండి అనవసరమైన లక్షణాలు ఏమైన పొందుకొనవచ్చునని ఆలోచించాలి.
పట్టులో నూతనంగా తిరిగి రాణి ఈగను ఉత్పత్తి చేసుకోనవలయుననుకుంటే తగిన శ్రేష్టమైన మార్గము ఏమంటే ఒక వార్తా పత్రికను (News paper) పాత పట్టుపై ఉంచి పైభాగాన ఉంచే పిల్లల గదిని దానిపై పెట్టుకోవాలి. పై భాగమున ఉన్న పిల్లల గదిలో మంచి లక్షణాలు గల నూతనముగా సంపర్కము చెందిన రాణి ఈగ ఉండేటట్లుగా చూసుకొనవలెను. వార్తా పత్రికను కూలి ఈగలు నెమ్మదిగా నమిలి పట్టులు రెండు నెమ్మదిగా కలిసిపోతాయి. మీ సొంత తేనె పట్టుల సామర్థ్యమును త్వర త్వరగా పెంచుకోవాలనుకుంటే మీరే రాణి ఈగను ఉత్పత్తి చేసుకోవాలి. ఎంపిక ప్రక్రియ నెమ్మదిగా ఉండే ఫలవంతమైన తల్లియైన రాణి ఈగల ద్వారా చేసుకొనవచ్చును.
Smokers- పొగ డబ్బా అనేక సంవత్సరముల వరకు తేనెటీగల పెంపకముదారులు మండే ఎండిన చెక్కను (punk wood), గట్టిగా కట్టిన ఎండుగడ్డిని మరియు ఇతరమైన వాటిని తేనెపట్టులో పొగబారించుటకు వాడేవారు. ఈ పదార్దములు మండి పొగను ఉత్పత్తి చేయుట వలన అట్టలపై అడ్డముగా పొగబారించేవారు. ఇవి కొద్దిమొత్తములోనే పొగ ఉత్పత్తి చేసేవి. కోపముతోవున్న పట్టులను అదుపుచేయుటకు సరిపడునంతగా ఉండేది కాదు
మోజస్ క్విన్బి(Moses Quinby) 1875వ సంవత్సరములో మొట్టమొదటి ఆచరణాత్మకమైన పొగడబ్బాని, ఈ పొగడబ్బాలో మంట మండించే స్తలము (fire pot) మరియు గాలితిత్తులు (bellows), ఒక విధముగా ఆధునిక తేనెటీగల పెంపకము చేపట్టిన తరువాత ఆలస్యముగా కనుగొనబడిన పొగడబ్బానుండి, పొగను గురిపెట్టి అవసరమైనచోటకు పడేలా గొట్టం ద్వారా పొగడబ్బా చివర కొనకు అమర్చబడివుంటుంది.
మండుచున్న పొగడబ్బాల వలన, చుట్టు ప్రక్కల వున్నకట్టెలు, గడ్డి అంటుకొని అనవసరమైన కార్చిచు ప్రారంభమవుతుంది. ఇది పొగడబ్బాలోని నిప్పు సులువుగా అంటుకొనే పదార్ధము లేక వేడినిప్పురవ్వలు పొగ మూతి నుండి వెలువడడము ద్వారా జరుగుతుంది. తేనెటీగల పెంపకముదారులు పొగడబ్బాను మండించిన తరువాత గుప్పెడు పచ్చగడ్డిని మంటపై భాగమున వుంచుతారు. ఎందుకనగా వేడి పొగను చల్లబరచి, మంటనుండి వెలువడు నిప్పురవ్వలను పొగడబ్బా మూతి నుండి (nozzle) వెలువడకుండా ఆపుతుంది. తేనెపట్టులున్న ప్రాంతములో కొన్నిసార్లు వాడిన పొగడబ్బాలో వున్న మంటను ఆర్పకుండా, బయట పడవేయడము వలన మంటల వ్యాప్తికి కారణమవుతంది.
Smoking Honey bee colonies- తేనెపట్టు దూకుడుగాను మరియు పట్టులోని ఈగలు దాడిచేయుటకు ముందుగా నెమ్మదిగా వుంచుటకు పొగబారించుట ముఖ్యము. ఒక్కసారి కాపలాకాయు ఈగలు ప్రమాదమును పసిగట్టి నట్లయితే, హెచ్చరిక వాసనను (alarm odour) బయటకు పంపిస్తాయి. అలాంటి పరిస్థితిలో తరచుగా ఆ పట్టు మరియు చుట్టు ప్రక్కల వున్నపట్టులను నియంత్రించుట కష్టము.
తేనెపట్టులున్న ప్రాంతములోనికి ప్రవేశించుటకు ముందుగానే, పొగడబ్బాను వెలిగించుకొని సరైన స్థితిలో ప్రవేశించవలెను. పని ప్రారంభించుటకు ముందుగానే పట్టులన్నింటికి పొగనివ్వనవసరము లేదు. ఎందువలననగా ఎవైనా కంపనములు (vibrations) మొదటి పట్టునుండి వెలుపడినట్లయితే అవి ఇతర పట్టులను రేపుతాయి. అయినప్పటికిని పట్టులన్నింటికి స్టాండువద్ద పొగ బారించవలెను.
మొదటి పట్టును తెరచునపుడు పొగబారించునపుడు, గుర్తుపెట్టుకొనవలసినదేమనగా అన్ని పట్టులు ద్వారములవద్ద కాపలాకాయు కూలిఈగలుంటాయి. మకరందము లభించనప్పుడు పట్టుద్వారము వద్ద ఎక్కువ సంఖ్యలో కాపలాకాయు ఈగలుంటాయి మరియు కొద్ది సంఖ్యలో బాగా తేనె లభించు కాలములో కాపలా కాయు ఈగలుంటాయి. ఒక అడుగు దూరమునుండి రెండు లేక మూడుసార్లు పట్టుద్వారము వద్ద పొగను పారించిన యెడల, కాపలాకాయు ఈగలను నిరాయుధులుగా (disarm) చేస్తుంది. ఒకవేళ ఒకటికన్నా ఎక్కువ ద్వారములున్నట్లయితే అన్ని ద్వారముల ముందు ఇలాగే పొగబారించవలెను. తరువాత పై మూతను తీసి పట్టుకొని, అలాగే పొగనివ్వవలెను. లోపలిమూతను వాడినపుడు కూడ ఇలానే పొగనివ్వవలెను
తరువాత సూపర్ గదిలోవున్న ఏ ఫ్రేమును తీయవలెనని చూడవలెను. చాల సుళువుగా తీయగల్గిన ఫ్రేము, మొదటి ఫ్రేము. ఈ ఫ్రేముమీదనే అతితక్కువ తేనెటీగలుంటాయి మరియు వికృతరూపము (burr) గల్గిన మైనపు అట్టలుంటాయి. ఈ విధముగా ఏ ఈగలు కూడా నలిగిపోకుండా, ఇతర ఫ్రేములపై వున్న తేనెటీగలకు కోపము రాకుండా చేయడము సులువు. సాధారణముగా ప్రక్కనున్న ఫ్రేమును మొదటిగా తీస్తారు. మొదటి ఫ్రేముల చివరలకు పొగబారించవలెను, ఈ విధముగా దారిలో ఈగలు లేకుండావుండి, చేతి వ్రేళ్ళతో గట్టిగా పట్టుకొనవచ్చును.
మొదటి ఫ్రేమును తీసినపుడు, పట్టుపరిశీలన మధ్యలోవున్నపుడు, అవసరమైనయెడల మరలా ఒకసారి పొగనివ్వవచ్చును. ఫ్రేముల మధ్యలో తేనెటీగలు అలవాటు పడియుండుటను చూడవచ్చును. ఎప్పుడైతే అయిదు నుండి పదిహేను ఈగలు రెండు ఫ్రేముల మధ్యవాటి తలలుంచి చూచుచున్నపుడు, పొగ ఇవ్వవలసిన సమయము అదే అని భావించవలెను. రెండు, మూడు పఫ్ ల పొగను ఫ్రేములపై అడ్డముగా బారించినపుడు నెమ్మదిగా తేనెటీగలన్నియు వెనుకకు వెళ్ళతాయి. రెండు ఫ్రేముల మధ్య తొంగి చూచుచున్న ఈగలు పొగ బారించినను వెళ్ళకపోయినట్లయితే, నెమ్మదిగా వుండకపోతే అవి ఎగిరి కుట్టవచ్చును. పట్టులోని ఈగలు ఒక్కొక్కటి రేపబడి, అన్ని ఈగలు కూడా ఈ విధముగా సహకరించి పనులు చేసుకుంటాయి.
Fuel for smokers – పొగడబ్బాలో వాడు ఇంధనము పొగడబ్బాలో వాడవలసిన శ్రేష్ఠమైన ఇంధనము ఏది అనునది తేనెటీగల పెంపకదారుల మధ్య జరిగే తీవ్ర చర్చయైయున్నది. పొగ ఎందుకు తేనెటీగలను నెమ్మది పరుస్తుంది అను విషయమైన దానిలో తక్కువ పరిశోధన జరిగినది. ఆధునిక ఆలోచన ఏమనగా పట్టును తెరవగానే కూలిఈగలు హెచ్చరిక ఫిరమోనును స్పర్శకముల మీదవున్న స్పర్శగ్రాహకములు గ్రహించకపోవుట వలన అని. ఇది నిజమైనట్లయితే, ఏ ఇంధనమైనను ఎక్కువ పరిమాణములో పొగను ఉత్పత్తి చేయునదైతే తేనెటీగలను నెమ్మది పరుస్తుంది. పొగడబ్బాలో వాడు ఇంధనము విషయమైన ముఖ్య సమస్య ఏమనగా ఎక్కువ సేపు మండకపోవుట, అనగా త్వరగా కాలిపోవుట మరియు పొగడబ్బాను నిరంతరముగా మండునట్లుగా రీచార్జి (recharge) చేయుట. తేనెటీగల పెంపకదారులు ఆకులను, గడ్డిని, గోనెసంచి గుడ్డలు లేక ఇతర పాతగుడ్డలు, అరిగిపోయిన త్రాళ్ళు, చెక్కపొట్టు, చెక్కముక్కలు ఒక అంగుళము సైజుగలవి (బ్లాక్స్ రూపములో తయారుచేసి) వాడుదురు. ఇవి ఎక్కువ సమయము మండుతాయి మరియు కొంతమంది తేనెటీగల పెంపకము దారులు వాడుచున్నారు.
డా. కె. మోహన్ రావు, ప్రధాన శాస్త్రవేత్త (కీటక విభాగము) మరియు అధిపతి అఖిల భారత సమన్వయ తేనెటీగలు మరియు పరాగ సంపర్కము జరుపు కీటకముల పరిశోధన పథకము, వ్యవసాయ పరిశోధన స్థానము, విజయరాయి- 534475, ఏలూరు జిల్లా. Phone: 9493304643
జి.అలేఖ్య, యంగ్ ప్రొఫెషనల్ -1, అఖిల భారత సమన్వయ తేనెటీగలు మరియు పరాగ సంపర్కము జరుపు కీటకముల పరిశోధన పథకము, వ్యవసాయ పరిశోధన స్థానము, విజయరాయి -534475, ఏలూరు జిల్లా.
వర్మి వాష్ తయారీ విధానం: 200 లీ. డ్రమ్ముని తీసుకుని, దాని అడుగు భాగం నుండి కొంచెం పైన కుళాయి బిగించాలి. డ్రమ్ములోపల 15 సెం.మీ. వరకు ఇసుకపోసి, ఇసుకపై డ్రమ్ముపై వరకు ఎర్రమట్టి పోయాలి. దానిపైన పేడ, కూరగాయల వ్యర్థాలను వేసి వానపాములను వదలాలి. ప్రతిరోజూ డ్రమ్ములో 2 లీ. నీటిని పోస్తూ ఉండాలి. ఇలా 15 రోజులు చేసిన తర్వాత డ్రమ్ములోని నీటిని కుళాయి ద్వారా పాత్రలో సేకరించి 15 రోజుల కొకసారి మొక్కలపై పిచికారి చేయాలి. డ్రిప్ ద్వారా వారానికొకసారి పంపించాలి. దీనివలన మొక్కలు ఆరోగ్యవంతంగా పురుగులు, తెగుళ్ళు సోకకుండా పెరుగుతాయి.
తేనెటీగలు పుప్పొడిని సేకరించుకొనుట తేనెటీగలు పుప్పొడిని సేకరించుకోవాలనే ప్రేరణ తేనెపట్టు అవసరం మీద ఆధారపడి ఒక క్రమబద్ధీకరణ ద్వారా జరుగుతుంది. తేనెటీగలు పొలం వెళ్ళి సేకరించే పుప్పొడి పరిమాణం మీద ఆధారపడి పట్టులో పిల్లల అభివృద్ది ఉంటుంది. పట్టులో పిల్లల ఫ్రేములు రెండింతలు చేసినట్లయితే, సేకరించే పుప్పొడి పరిమాణం ఒకరోజులో రెండితలు పెరుగుతుంది. దీనికి తోడుగా రాణి ఈగ ఎక్కువగా గ్రుడ్లు పెట్టినట్లయితే ఇది పుప్పొడి సేకరణను పెంచుతుంది. ఈ పరిణామాలన్నీ ఫిరమోనుల ద్వారా జరిగించబడుతాయని సూచిస్తుంది.
తేనెటీగలు పుప్పొడిని ఎలా సేకరించి ప్యాక్ చేసుకుంటాయి? కూలి ఈగ ఆహారము సేకరించుకొనే సమయములో దాని శరీరమంతా పుప్పొడి రేణువులతో ధూళిలాగ నింపబడుతుంది (dusted with pollen) తరువాత తేనెటీగ తన నాలుకను చాపి ఒక చుక్క మకరందమును లేక తేనెను ఉమ్ముతుంది, ముందు కాళ్ళు ఈ మకరందము లేక తేనెతో తడపబడతాయి. ఈ ముందు కాళ్ళు తల మీద స్పర్శకముల మీద మరియు మొండెము (thorax) ఎదుట వున్న పరాగ రేణువులను బ్రష్ చేస్తాయి. మొండెము వెనుక భాగమున ఉన్న పరాగ రేణువులను మద్య కాళ్ళు (middle legs) తొలగించి వేస్తాయి (combed off) మరియు ఉదరము మీద ఉన్న పరాగ రేణువులు వెనుక కాళ్ళ (hind legs) కదలికల ద్వారా సేకరించబడతాయి. చివరికి పుప్పొడి అంతా వెనుక కాళ్ళకు బదలీ చేయబడుతుంది. మధ్య కాళ్ళు, పుప్పొడిని మలచడానికి (mold) ప్యాక్ చెయ్యడానికి (pack) మరియు పుప్పొడి గుళికలు మూత్ర పిండాకారము (kidney shape) నకు మలచబడుతుంది.
పట్టులో పుప్పొడిని నిల్వ ఉంచుట పుప్పొడి, తేనె పట్టులోనికి రాగానే, పుప్పొడిని సేకరించిన కూలిఈగ సాధారణంగా తన వద్ద వున్న పుప్పొడి ముద్దను విడిపించుకుంటుంది (grooms herself). తరువాత సరియైన ఏ మైనపు గదిలో ఈ పుప్పొడిని వుంచవలెనో ఆ గది కొరకు వెదకుతుంది. ఈ గది ఒకవేళ ఖాళీ గది కావచ్చును. సాధారణముగా లద్దె పురుగులు ఎదిగే ప్రాంతమై యుంటుంది లేదా ఇంతకు ముందే పుప్పొడి ఉన్న గది అయి కూడ వుండవచ్చును. కూలిఈగ మైనపు గదిని ఎంచుకున్నపుడు తన ఉదరమును గదిలో పూర్తిగాను, కాళ్ళను పాక్షికముగాను ముంచి, తన మధ్య కాళ్ళనుపయోగించి రహస్యముగా (pry) తన పుప్పొడి ముద్దను గదిలో పడునట్లుగా అనుమతిస్తుంది. పుప్పొడి తిత్తిలో (pollen basket) మిగిలియున్న చిన్న చిన్న పుప్పొడి ముద్దలు ఏవైనావున్నట్లయితే వాటినికూడా గదిలో వదిలించుకుంటుంది మరియు ఇంకొక కూలిఈగ వచ్చి పుప్పొడిని గది అడుగులోనికి త్రోసి తన దంతములు మరియు ముందు కాళ్ళతో అదిమి ప్యాక్ చేయటకు వీలుగా పొలం నుండి వచ్చిన ఈగ గదిని విడిచిపెడుతుంది.వెళ్ళిన కూలి ఈగ తను తీసుకొచ్చిన పుప్పొడిని మైనపుగదిలో వుంచిన తరువాత ఇంకొక కూలి ఈగ ఉండి సాధారణముగా కొంత తేనెను ఇమ్మని కోరుతుంది. మరియు తరువాత అహారం సేకరించుటకు పొలము వెళుతుంది.
పుప్పొడికి అనుబంధమైనవి మరియు పుప్పొడికి ప్రత్యామ్నాయ పదార్ధములు (Pollen supplements and substitutes) పుప్పొడి అనుబంధ పదార్ధము అనగా, ఏ పదార్ధమునైతే, సహజ పుప్పొడికి (natural pollen) తేనెటీగలు సేకరించిన పుప్పొడికి (bee collected pollen) కలుపుతారో దానిని పుప్పొడి అనుంధ పదార్ధమని అంటారు. పుప్పొడి ప్రత్యామ్నాయ పదార్ధము అనగా అసలు అందులో పుప్పొడి వుండదు. అనుబంధ పదార్ధములలో సాధారముగా పదినుండి ఇరవై శాతము సహజ పుప్పొడిని కల్గియుంటుంది. ఈ పదార్థము ప్రాధమికముగా తేనెటీగలకు అనువుగా (రుచిగా) మరియు ఆకర్షనీయముగా వుంటుంది. పుప్పొడి అనుబంధ మరియు ప్రత్యామ్నాయ పదార్ధములు తేనెటీగలకు ఎక్కువ ఆకర్షనీయముగా వుండటకు గాను పంచదార పాకమును లేదా తేనెను కలుపుతారు.తేనెను కలిపినట్లయితే అది ఆపాయకరముగా వుండవచ్చును, కారణము, రోగమును/ వ్యాధికారక బాక్టీరియా లేక స్పోరులను కల్గియుండవచ్చును. పుప్పొడి అనుబంధ పదార్ధములకు చాక్ బ్రూడ్ లేక యూరోపియన్ ఫౌల్ బ్రూడ్ వ్యాధితో కలుషితమైన పుప్పొడిని కలిపినట్లయితే వ్యాధులు వ్యాప్తి చెందుతాయి.
సోయా చిక్కుడు పిండిని మరియు బ్రూయర్స్ ఈస్ట్ ఈ రెండిటిని తరచుగా పుప్పొడి అనుబంధ పదార్ధములలో మరియు ప్రత్యామ్నాయ పదార్ధములలో వాడతారు. ఎక్కువమంది తేనెటీగల పెంపకముదారులు వారి సొంత పుప్పొడి అనుబంధ మరియు ప్రత్యామ్నాయ పదార్ధములను తయారు చేసుకుంటారు. ఒక పేరుగాంచిన సూత్రములో 3 పాళ్ళు సోయా చిక్కుడు పిండి, ఒక భాగము పుప్పొడి, రెండు పాళ్ళు చక్కెర (పంచదార) మరియు ఒక పాలు నీరు కల్గియున్నది. ఒక వేళ పుప్పొడిని ఉపయోగించకపోయినట్లయితే బ్రూయర్స్ ఈస్ట్ ను ప్రత్యామ్నాయంగా వాడుకొనవచ్చును. ఈ పదార్ధములన్నింటిని, కలిపి గట్టి ముద్దగా ఒక పౌoడు బరువుగలదిగా చేసికొని, దీనిని మైనపు పేపరుపై ముక్కలుగా ఉంచుకొనవలెను అడుగున మైనపు పేపరుతో ఈ ముక్కలను (patties) చేసినట్లు ఫ్రేములపై (top bars) వసంత కాలములో ఉంచుకొనవలెను. ఒక్కసారి పుప్పొడి అనుబంధ పదార్థమును పట్టుకు ఇవ్వడము ఆరంభిస్తే సహజ సిద్దమైన పుప్పొడి పొలములో సేకరించుట ఆరంభించు వరకు ఇవ్వవలెను మాంసకృత్తులు లభ్యముకాని సమయంలో ఉపయోగించుకొనుటకు గాను ఈ కృత్రిమ ఆహారమును మధ్యలో ఆపివేసినట్లయితే, పెరిగిన పట్టుకు ఎంతో ప్రమాదకరముగా పరిణమిస్తుంది. అంతేకాకుండా పట్టు కూడా చనిపోవచ్చు.
Pollen Traps – పుప్పొడిని సేకరించు బోనులు పొలముకెళ్ళి పుప్పొడిని సేకరించుకొని పట్టుకు తిరిగివచ్చు ఈగల కాళ్ళకున్న పుప్పొడి ముద్దలను పుప్పొడిని సేకరించుబోనులను పట్టు ద్వారమువద్ద బిగించి, పుష్పాడిని సేకరించుకొనుటకు సాధ్యమే. పుప్పొడిని సేకరించుబోను అనుపరికరమును పట్టు ద్వారమువద్ద బిగించుకొని, పట్టులోపలికి (pollen loads), బలవంతముగా నడచివెళ్ళు ఈగల కాళ్ళకు వున్న పుప్పొడిని సేకరించవచ్చును. కూలిఈగలు సన్నని రంధ్రముల ద్వారా వెళ్ళునపుడు వాటి వెనుక కాళ్ళు వెనుకకు నెట్టబడి, వైరు ద్వారా లాగ బడి, పుప్పొడి గుళికలు (pollen balls) తొలగించబడతాయి. తొలగించబడిన పుప్పొడి గుళికలు బోనులోని పెట్టెలో పడతాయి. ఎనిమిది మెష్ వైరును పెట్టెపై వాడటమువలన, తేనెటీగలు అడుగుకు ప్రవేశించి సేకరించబడిన పుప్పొడిని తొలగించలేవు. వివిధ కవర్లను పుప్పొడిని సేకరించుబోనులకు వాడుటవలన, వర్షము వచ్చినప్పుడు పుప్పొడి తడవకుండా వుంటుంది. పుప్పాడిని సేకరించు బోనులను ఎక్కువగా చెక్కతో తయారుచేస్తారు కాని, లోహపు బోనులు ఎక్కువ కాలము మన్నుతాయి. నీటిని తొలగించుకుంటాయి, బహుశ ఎక్కువ ఖర్చయినప్పటికిని విలువైనవి.
Pollination-పరాగ సంపర్కము పుష్పములోని పురుష భాగమైన పరాగకోశము (anther) నుండి స్త్రీ భాగమైన కీలాగ్రము (stigma) మీదకు పరాగ రేణువు (pollen) చేరుటను పరాగసంపర్కము అని పిలుస్తారు. కొన్ని మొక్కలు స్వపరాగ సంపర్కము చెందుతాయి, కాని ఎక్కువ సందర్భములలో గాలి, నీరు, కీటకములు ప్రత్యేకముగా తేనెటీగలు పరాగరేణువుల బదిలీకి కారణమవుతాయి. కొన్ని మొక్కలలో పరాగ సంపర్కము జరుగదు, కాబట్టి వానిలో విత్తనములు ఏర్పడవు. కీటకములలో తేనెటీగలు అనేవాటిలో అనేక జాతులున్నవి. ప్రత్యేకముగా పరాగ సంపర్కము జరుపుటకు అనువైనవి. వీటి శరీరము మీద చీలికలుగా వున్న వెంట్రుకలుండుట వలన, పుప్పొడి సుళువుగా వీటి మధ్య చిక్కుకుంటుంది మరియు ఈ పుప్పొడి ఒక పుష్పము నుండి ఇంకొక పుష్పమునకు సులువుగా మోసికొని పోబడుతుంది.
జి.అలేఖ్య, యంగ్ ప్రొఫెషనల్ -1, అఖిల భారత సమన్వయ తేనెటీగలు మరియు పరాగ సంపర్కము జరుపు కీటకముల పరిశోధన పథకము, వ్యవసాయ పరిశోధన స్థానము, విజయరాయి -534475, ఏలూరు జిల్లా.