ఉద్యాన పంటల్లో చెట్లచుట్టూ కలుపు తీయాలన్నా, పాదులు చేయాలనా రైతులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు, దీనికి ఎక్కువ మంది కూలీలు అవసరం. పంటలకు ధరలున్నప్పుడు రైతులు ఎలాంటి ఇబ్బంది లేకుండా కూలీలను పెట్టుకొని కలుపు తీయడం, పాదులు చేయించడం చేస్తారు. అదే ధరలు లేని సమయంలో ఈ పని తలకు మించిన భారం అవుతుంది. పంట దిగుబడికి ఈ పనులు తప్పనిసరి. అలాగే వదిలేస్తే చెట్లు బ్రతకకుండా ఉండే ప్రమాదం కూడా ఉంది.
ఇలాంటి పరిస్థితుల నుంచి గట్టెక్కిచ్చేందుకు ఒక ప్రత్యామ్నాయ పరికరాన్ని మెకానికల్ అడ్వాంటేజ్ అనే సూత్రం తో తయారు చేసి ఈ పరికారానికి సుదర్శన్ వీడర్ గా పేరు పెట్టారు ప్రొఫెసర్ ముప్పా లక్ష్మణ రావు
ఉద్యానవన పంటల్లో అంతర్ కృషి పరికరం
ఈ పరికరం కోసం ఒక పొడవాటి ఇనుప పైపును తీసుకొని చక్రా కారం లో వంచి కింద బాగాన చిన్న పాటి కర్రులు అమర్చి వెల్డింగ్ ద్వారా అనుసంధానం చేసి పరికరాన్ని తయారు చేశారు, చెట్టు వద్ద 5 నిముషాలలో కలుపు, పాది రెండూ చేసుకోవచ్చు. ఉద్యానవన రైతులకు ఈ పరికరం ఎంతో ఉపయోగంగా ఉంటుంది. ట్రాక్టర్లు, ఎద్దుల సహాయంతో రైతులు ఉద్యాన పంటల్లో కలుపు తీసే కార్యక్రమం చేస్తుంటారు. అయితే చెట్టు పాది లో అంతర కృషి చేయాలంటే మనుషుల సహాయం అవసరం ఉంటుంది.
ఈ పరికరాన్ని చెట్టుకు అమర్చి ఒక వ్యక్తి చుట్టూ తిరగడం వల్ల గుంటక తరహాలో మడకలు భూమిని చదును చేయడంతో పాటు పాది ఏర్పడుతుంది. దీనివల్ల రైతులకు ఖర్చు మిగులుతుంది. శ్రమ తక్కువగా ఉండటంతో పాటు ఒక్క మనిషి గంట వ్యవధిలోనే అర ఎకరా పొలం పూర్తి చేయవచ్చు.
దీనికి 4 వేల వరకు ఖర్చు వస్తుంది. చెట్టు సైజు ని బట్టి పరికరం ధర మారుతుంది.
రైతుల కోరితే వారికి తయారు చేసి ఇస్తారు. ఈ పరికరానికి పేటంట్ చేయడం జరిగింది. పేటెంట్ నెంబర్ :507641-001
ఈ పరికరం కోసం శ్రీ ఆంజనేయ స్మాల్ అగ్రి టూల్స్ రీసెర్చ్ సెంటర్ డైరెక్టర్ రైతునేస్తం ముప్పా లక్ష్మణరావు, ఫోన్ : 9849140465 లో సంప్రదించగలరు.
నాడెప్ కంపోస్ట్ పద్ధతిని నారాయణ్ డియోరావ్ పండరి పాండే అనే మహారాష్ట్ర రైతు అభివృద్ధి చేశారు. నాడెప్ కంపోస్టు పద్ధతి ప్రత్యేకంగా పశువులు లేని రైతులకు మంచి ప్రత్యామ్నాయం.
కంపోస్ట్ పిట్ పరిమాణం: పొడవు: 10 అడుగులు, వెడల్పు: 6 అడుగులు, ఎత్తు : 3 అడుగులు. ఒక అడుగు ఎత్తు వరకు ఇటుకల మధ్య ఎటువంటి ఖాళీలు ఉండకూడదు. తర్వాత ఒక్కో ఇటుకకు మధ్య 6 అంగుళాల ఖాళీ ఉండాలి.
కంపోస్టు తయారీకి కావలసిన పదార్థాలు :
పంట అవశేషాలు లేదా ఎండు / పచ్చి ఆకులు – 1350-1400 కి.
పశువుల పేడ లేదా బయోగ్యాస్ / గోబర్ గ్యాస్ స్లర్రీ – 98-100 కి.
జల్లెడ పట్టిన మట్టి – 1675 కి.
నీరు – 1350-1400 లీ. కంపోస్ట్ తయారు చేసే పదార్థాలను పిట్‌లో నింపే ముందు గోడలను పేడతో అలకాలి. నాడెప్ కంపోస్ట్ తయారీలో ముఖ్య అంశం పిట్‌ని కావలసిన పదార్థాలతో 24 గంటలలోపు ఒకేసారి నింపడం.
మొదటి పొరః 6 నుంచి 10 అంగుళాల వరకు పంట అవశేషాలు, ఆకులు మొదలైనవి.
రెండవ పొర : 4 కిలోల పేడను 100 లీ. నీటిలో కలిపి మొదటి పొరపై చల్లాలి.
మూడవ పొర : 60 కిలోల మట్టిని పొరలాగా చల్లాలి.
పై విధంగా 10Ð12 పొరలుగా కంపోస్ట్ పిట్ నింపడం పూర్తి చేయాలి. అలా నింపిన తర్వాత, జీవ పదార్థాన్ని 3 అంగుళాల మందంగల మట్టితో కప్పి పేడ మరియు మట్టి పేస్టుతో అలకాలి.
కంపోస్ట్ పిట్‌ని నింపిన 15-20 రోజుల తర్వాత నాడెప్ కంపోస్ట్ పిట్ 2 అడుగులు కుంగడం జరుగుతుంది. కుంగిన పిట్‌ని పైన పేర్కొన్న విధంగా 2-3 పొరలు నింపి మరలా పేడ మరియు మట్టి పేస్టుతో అలకాలి. తర్వాత 3 నెలల వరకు, 10-15 రోజులకొకసారి నీరు చిలకరించడానికి తప్ప కదిలించరాదు. మొత్తం కంపోస్ట్ పిట్‌ని తాటాకులతో కప్పాలి. ఎటువంటి పరిస్థితులలోను బీటలు ఏర్పడకుండా చూడాలి. ఒకవేళ ఏర్పడితే వెంటనే వాటిని స్లర్రీతో నింపాలి. 90-120 రోజుల తర్వాత సుమారు 2.5 టన్నుల కంపోస్టు తయారవుతుంది. ఈ కంపోస్ట్ ఎరువులో నత్రజని 1.0 శాతం, భాస్వరం 0.5 శాతం, పొటాష్ 1.2 శాతం ఉంటాయి. సాధారణ కంపోస్టు పద్ధతిలో తయారైన కంపోస్టు కంటే 3-4 రెట్లు పోషక పదార్థాలు అధికంగా ఉంటాయి.
ప్రయోజనాలు : రసాయన ఎరువుల ఖర్చు తగ్గుతుంది. భూసారం పెరుగుతుంది. పంట దిగుబడి పెరుగుతుంది. సేంద్రియ పంటల సాగుకు దోహదపడుతుంది. బయట ఉత్పాదకాలపై ఆధారపడటం తగ్గుతుంది.
తేనెపట్టుల ప్రవాసము (Migration of Bee Honeycolonies)
సంవత్సరం పొడవునా సాధారణంగా ఏ ప్రాంతంలోకూడా పుష్పించే మొక్కలు ఉండవు, అయినప్పటి తేనెటీగలు వాటి రోజూవారి అవసరములకొరకు పుప్పాడిని, మకరంధమును సేకరించుకొని తేనెను ఉత్పత్తిచేస్తాయి. ఒకవేళ పుప్పొడి మరియు మకరందము లభ్యము కాని పక్షంలో అనుబంధ ఆహారాన్ని అందించవలసి ఉంటుంది. క్యాలెండరును బట్టి తేనెటీగలకు పుష్పజాతులు లభ్యమయ్యే ప్రాంతాలకు తేనెపట్టులను తీసుకుని పోవలసియుంటుంది. దీనినే తేనెపట్టుల ప్రవాసము (Migration) అంటారు. పెద్ద ఎత్తున దీనిని అవలంభించినప్పుడు తేనెటీగల పెంపకంలో తేనెపట్టుల ప్రవాసము (Migratory Bee keeping) అంటారు.
వాణిజ్యపరంగా తేనెటీగల పెంపకమును చేపట్టినపుడు తేనెపట్టుల ప్రవాసము అనునది చాలా ముఖ్యమైనది. దీని ముఖ్యఉద్దేశ్యము
తేనె ఉత్పత్తిని పెంచుట కొరకు
తేనెపట్టులను బలపరచుకొని, విభజించుకొనడానికి
అనుబంధ పోషణ ఖర్చు తగ్గించుకొనడానికి మరియు తేనెటీగల పరాగ సంపర్కము ద్వారా పంటల ఉత్పత్తి పెంచుకొనడానికి
అడవి మరియు వ్యవసాయ మొక్కలలో జీవవైవిద్యమును పరపరాగ సంపర్కము ద్వారా కాపాడుకొనుటకు గాను తేనెపట్టుల ప్రవాసము ఉపయోగపడును.
గుర్తించకొనదగిన విషయాలు (Points to consider) తేనెటీగల పెంపకము యొక్క ముఖ్యవుద్దేశ్యము ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించుకొని తేనె దిగుబడిని పెంచుకొనడము. అందుకనే తేనెటీగల పెంపకముదారులు తేనెటీగలకు ఆహారమును సరఫరా చేయు మొక్కలను మొదటిగా గుర్తించవలెను. తేనెపట్టులను మార్చుటకు (Migration) లేదా ప్రవాసము కొరకు అగు ఖర్చును తెలుసుకొనాలి మరియు సరైన శాస్త్రీయ పరిజ్ఞానము మరియు నిపుణత, పట్టులను ప్రవాసము చేయుటకు ఉండాలి. తేనెపట్టులను ప్రవాసము కొరకు ప్రణాళిక వేయునపుడు (Migration) ఈ క్రింది సూచనలు పాటించాలి.
ప్రవాసము చేయు స్థలము ఎంపిక
తేనెపట్టులు మార్చుకునే ప్రదేశములో లభ్యమయ్యే మొక్కలు, చెట్లు, వృక్షములు ఏరకమునకు చెందినవో, ఏ సీజనులో ఎంతకాలం పుష్పిస్తాయో ఎంత విస్తీర్ణములో ఉన్నవో, ప్రస్తుతం తేనెపట్టులున్న ప్రదేశం కంటే కొత్తగా పట్టులు పెట్టుకొను ప్రాంతములో ఎంత తేనెదిగుబడి వస్తుందో అంచనా వేసుకొనాలి.
తేనెపట్టులకు లభ్యమయ్యే పుష్పజాతుల పంటల మీద పురుగుమందులు పిచికారీ చేస్తారేమోనన్న విషయాన్ని స్థానిక వాతావరణ పరిస్థితులను గూర్చిన వివరణను సంపాదించాలి.
ప్రకృతి సిద్ధముగా తేనెపట్టులపై దాడిచేయు శత్రువుల విషయమైన సమాచారాన్ని సేకరించి, శత్రువుల దాడి తక్కువగా ఉన్న ప్రాంతాన్ని ఎంచుకొనాలి.
తేనెటీగల పట్టుల ప్రవాసము కొరకు ఎంత లాభము, ఎంత నష్టము ఉంటుందో విశ్లేషణ చేసుకొనాలి.
తేనెపట్టుల ఎంపిక మరియు ప్రవాసము కొరకు తేనెపట్టులను సిద్ధపరచుట
బలమైన, ఆరోగ్యకరమైన మరియు తేనెను సేకరించగల పట్టులను మాత్రమే ప్రవాసం (Migration) కొరకు ఎంపిక చేసికొనాలి.
తేనెపట్టులను ప్రవాసము తీసుకొని వెళ్ళడానికి ముందు కనీసం రెండు నెలలు నుండి బలవరచుకొనాలి. కావలసిన వస్తువులు, పరికరములన్నీ ఉదాహరణకు తేనె అరలు, ఫ్రేములు, కృత్రిమ మైనపు అట్టలు, తేనె యంత్రము మరియు తేనెను సేకరించి నిల్వవుంచుకొనుటకు కావలసిన పాత్రలు సిద్ధపరచుకొనవలెను.
తేనెపట్టుల ప్రవాసము కొరకు తగిన సమయము (Timing of Migration) తేనెటీగలకు పుప్పొడిని, మకరందమును అందించే ఎక్కువ మొక్కలు పుష్పించేదశలో ఉన్నపుడు తేనెపట్టులను ప్రవాసము తీసుకువెళ్ళవలెను (కనీసం 5 శాతం పుష్పములు ఉన్నపుడు).
తేనెపట్టులను సిద్దపరచుట (Preparation of Bee colonies) తేనెపట్టులను చాల జాగ్రత్తగా ప్రవాసముకొరకు సిద్ధపరచుకొనవలెను. ఈ సిద్దపరచడం సరిగా చేయకపోయినట్లుయితే కొన్ని ఈగలు వెనుక వదిలి పెట్టబడి లేక ప్రవాసం చేయునపుడు చనిపోతాయి.
తేనేపెట్టెలను క్రింద చెప్పబడిన విధముగా సిద్ధపరచుకొనాలి
తేనెపట్టులను శుభ్రపరచాలి.
అధికముగా ఉన్న తేనెను, తేనెయంత్రంతో తీసుకొనాలి మరియు తేనెగదిని తీసివేయాలి. తేనెతో నింపబడిన ఫ్రేములతో పాటుగా ప్రవాసము చేసినట్లయితే తేనెటీగలు చనిపోతాయి. ఫ్రేములను పట్టులలో గట్టిగా బిగించుకోనాలి.
తేనెపట్టుల ప్రవాసము సుదీర్ఘమైనదైనట్లయితే (Long distance) అనుబంధ ఆహారాన్ని (Supplementary feeding) ఏర్పాటు చేసుకొనాలి.
చెక్కలతో (Wooden reapers) పై నుండి క్రిందివరకు అడుగుబల్లను, తేనెగదిని, పిల్లలగదితో బిగించుకొనాలి. ఎండాకాలంలో వేడి ఎక్కువగా ఉన్నసమయంలో పట్టులను ప్రవాసం తీసుకొని వెళ్ళునపుడు వైరుల వలతో ఉన్న లోపలిమూతను వాడుకొనాలి.
సుదీర్ఘప్రవాసం అయితే, వేడిగా ఉన్న సమయంలో పైమూతను (Outer cover) తీసివేసుకొనాలి.
వైరుతోగాని, పెట్టె బెల్టుతో గాని లేక త్రాడుతోగాని పట్టును బయట కవరును తీయకుండానే కొద్ది దూరపుప్రవాసముల విషయమంలో కట్టుకొనాలి.
కూలిఈగలన్నీ సాయంత్రమునకు పట్టుకు చేరుకున్న తరువాత వైరునెట్ తోగాని, గుడ్డముక్కతో గాని పట్టుద్వారమును మూసివేయాలి. ద్వారము వద్ద ఈగలన్నీ గుమికూడి గుంపుగా ఉన్నట్లయితే నీరుచల్లిగాని, లేక పొగబారించుట ద్వారా గాని ఈగలు పట్టులోనికి వెళ్లునట్లుగా ప్రాత్సాహించాలి.
తేనెపట్టుల ప్రవాసము (Bee colonies migration)
తేనెపట్టులను, ట్రక్కు లేక ట్రాక్టరు లేక ఆటోరిక్షా, కూలికి మనుష్యులను పెట్టుకొనిగాని ఒకచోట నుండి మరొకచోటికి మార్చుకొనవచ్చును లేక వివిధ పద్దతులను కలిపిగాని, తేనెపట్టులు మొదటిస్థానం నుండి తేనెటీగలకు ఆహారం లభించే స్థలానికి మార్చుకొనవచ్చును.
సాధ్యమయినట్లయితే పట్టుల ప్రవాసమును రాత్రిపూట (శీతాకాలం సా||గం.5.00ల నుండి ఉ॥ గం.10.00లు, ఎండాకాలం అయితే సా||గం. 7.00ల నుండి ఉగం. 7.00ల మధ్య) చేపట్టాలి.
తేనెపట్టుల మధ్య గాలి ప్రవహించేలా ఉండాలి.
తేనెపట్టులను జాగ్రత్తగా ట్రక్కులలో భద్రంగా చేర్చుకొనాలి.
వాహనము నెమ్మదిగా సాధ్యమైనంతవరకు ఏవిధమైన ఒడిదుడుకులు లేకుండా నడపాలి.
వాహనాన్ని ఎక్కువసేపు ఆపి ఉంచకూడదు. ఒకవేళ రోజంతా లేక ఇంకా ఎక్కువసమయము ఆపివేయాల్సివస్తే పట్టులను వాహనంనుండి దింపి, పట్టుల ద్వారములను తెరచి, ఈగలు ఆహర సేకరణ కొరకు వదలాలి. రాత్రి అయిన తర్వాత తిరిగి ప్యాకింగ్ చేసి తిరిగి వాహనములోనికి లోడు చేసుకొనాలి.
గమ్యస్థానము చేరుకున్న తరువాత వాహనమునుండి నెమ్మదిగా ఒకటి తర్వాత ఒకటి జాగ్రత్తగా పట్టులను దించుకొనాలి.
ఒక గ్రూపుగా పట్టులను పెట్టుకొనాలి. కనీసం పట్టుకు పట్టుకు మధ్య 5 అడుగులు (1.5మీ) వుండునట్లుగా అమర్చుకొనవలెను.
పట్టులను ఆ ప్రాంతంలో పెట్టుకున్న తరువాత పట్టులద్వారాలకున్న గుడ్డ లేక వైరుజల్లెడను ఒకదాని తర్వాత ఒకటి ఒకవైపు ప్రారంభించి రెండవవైపుకు వెళుతూ తీసివేయాలి.
ద్వారాల్ని తెరచిన 30నిమిషముల తర్వాత లేక ప్రొద్దుపొడవగానే, ఈగలు బయటకు ఎగురు చున్నవో లేదో గమనించుకోవాలి. ఒకవేళ రెండురోజుల వరకు ఒకపట్టులోని ఈగలు బయటకు ఎగరని పక్షంలో (ఒకవేళ ఈగలు తేనెతోతడిసి చనిపోయిన ఈగలు లేక నేలమీద పారాడుతున్న ఈగలు) ఏమైనప్పటికీ వెంటనే పట్టును పరిశీలించుకొని తగిన చర్యలు చేపట్టాలి.
పట్టులను కొన్ని రోజులకు ప్రతిసారి పరిశీలించుకొనాలి. పిల్లలగది ఈగలతో నిండిపోయిన వెంటనే తేనె అరను ఏర్పాటుచేసికొనాలి. తేనె అరలో పాతమైనపుఅట్టలు లేక కృత్రిమ మైనపు అట్టలను పెట్టుకొనాలి.
డా. కె. మోహన్ రావు, ప్రధాన శాస్త్రవేత్త (కీటక విభాగము) మరియు అధిపతి, అఖిల భారత సమన్వయ తేనెటీగలు మరియు పరాగ సంపర్కము జరుపు కీటకముల పరిశోధన పథకము, వ్యవసాయ పరిశోధన స్థానము, విజయరాయి- 534475, ఏలూరు జిల్లా. Ph: 9493304643
జి.అలేఖ్య, యంగ్ ప్రొఫెషనల్ -1, అఖిల భారత సమన్వయ తేనెటీగలు మరియు పరాగ సంపర్కము జరుపు కీటకముల పరిశోధన పథకము, వ్యవసాయ పరిశోధన స్థానము, విజయరాయి -534475, ఏలూరు జిల్లా.
పల్నాడు జిల్లా, పిడుగురాళ్ల మండలం, గుత్తికొండ గ్రామానికి చెందిన ఇంజనీర్ నలబోలు కిషోర్ భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి (ఐసిఎఆర్) అందించే ప్రతిష్టాత్మక “నేతాజీ సుభాష్ – ఐసిఎఆర్ అంతర్జాతీయ ఫెలోషిప్ – 2025”కు ఎంపికయ్యారు. ప్రస్తుతం ఆయన ఆచార్య ఎన్.జి. రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలోని డా. ఎన్.టి.ఆర్. వ్యవసాయ ఇంజనీరింగ్ కళాశాల, బాపట్ల యందు వ్యవసాయ యాంత్రీకరణ భాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. తండ్రి నాగేశ్వరరావు, సాధారణ మధ్యతరగతి రైతు మరియు తల్లి గృహిణి.
ఈ ఫెలోషిప్ క్రింద అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ నెబ్రాస్కా - లింకన్‌లో “పక్వ దశలో ఉన్న పత్తి బోళ్లను గుర్తించే మల్టీమోడల్ సెన్సార్ ఫ్యూజన్, మల్టీ పాస్ పీకింగ్ మరియు ప్రెసిషన్ నావిగేషన్ సాంకేతికతలతో సెలెక్టివ్ రోబోటిక్ కాటన్ హార్వెస్టర్ రూపకల్పన మరియు ఆప్టిమైజేషన” అనే అత్యాధునిక పరిశోధన అంశంపై పీహెచ్.డి పరిశోధనలు నిర్వహించనున్నారు. ఇంజనీర్ నలబోలు కిషోర్ వ్యవసాయ ఇంజనీరింగ్ కళాశాల, బాపట్ల యందు 2012వ సంవత్సరంలో వ్యవసాయ ఇంజనీరింగ్ పూర్తిచేశారు ఐఐటీ ఖరగ్‌పూర్ నుండి 2016వ సంవత్సరంలో ఫామ్ మెషినరీ మరియు పవర్ ఇంజినీరింగ్‌లో ఎం.టెక్ పూర్తి చేశారు. 2017 ఆగష్టు నుండి వ్యవసాయ విశ్వవిద్యాలయ పరిధిలోని వ్యవసాయ పరిశోధనా స్థానం, అనంతపురములో తన వృత్తిపరంగా ప్రస్థానం మొదలుపెట్టారు. వ్యవసాయ యంత్రీకరణ, ప్రెసిషన్ వ్యవసాయం, నీటి సంరక్షణ, వ్యవసాయ పరికరాల అభివృద్ధి రంగాల్లో విశేష కృషి చేశారు.
రైతులకు ఉపయోగపడే అనేక వినూత్న వ్యవసాయ యంత్రాలు మరియు సాంకేతిక పరిజ్ఞానాల అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారు. దేశవ్యాప్తంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే ఈ అంతర్జాతీయ ఫెలోషిప్ ద్వారా విదేశీ విశ్వవిద్యాలయంలో ఆధునిక వ్యవసాయ సాంకేతికతలపై పరిశోధనలు చేసే అవకాశం లభించింది. దేశవ్యాప్తంగా వున్న 74 ఐసిఎఆర్ పరిధిలోని వ్యవసాయ విశ్వవిద్యాలయాల్లో మొట్టమొదటిసారిగా నలబోలు కిషోర్ మాత్రమే ఈ ఫెలోషిప్ రావడం పట్ల కుటుంబ సభ్యులు, విశ్వవిద్యాలయ ఉపకులపతి డా. పాలడుగు వెంకట సత్యనారాయణ మరియు అదికారులు, సహచర శాస్త్రవేత్తలు, కళాశాల విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు. ఫెలోషిప్‌లో భాగంగా కిషోర్‌కి మూడు సంవత్సరాల పీహెడీ పూర్తి చేయడానికి 75,000 అమెరికన్ డాలర్లు ఐసిఏఆర్ అందచేయడం జరుగుతుంది.
పంటలో జన్యువులు వృద్ధి కారణంగా వేరుశనగ దిగుబడిలో ప్రతి యేటా పెరుగుదల కనిపిస్తోందని అంతర్జాతీయ మెట్టప్రాంతాల పంటల పరిశోధనా సంస్థ (ఇక్రిశాట్) అధ్యయనంలో వెల్లడైంది. భారత్‌తోపాటు వివిధ ఆసియా, ఆఫ్రికా దేశాల్లోని స్పానింగ్‌బంచ్, వర్జీనియాబంచ్ అనే రెండు ప్రధాన రకాలలో కాయ దిగుబడి, గింజ శాతం, గింజ బరువు ప్రాతిపదికన రెండేళ్లలో నాలుగు పంట సీజన్లలో విస్తృత పరిశోధనలు చేసిన శాస్త్రవేత్తల బృందం ఈ విషయం తేల్చింది. మూడు నుంచి నాలుగు నెలల కాలంలో పండే పంటకు యేటా హెక్టారుకు సుమారు 27 కిలోలు.. ఆరు నెలల్లో కాతకొచ్చే రకాల్లో హెక్టారుకు 25 కిలోల దిగుబడి పెరుగుదలను శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇక్రిశాట్ గత 20 ఏళ్లలో 240 వేరుశనగ రకాలను అభివృద్ధి చేసింది. కంప్యూటెడ్ టోమోగ్రఫీ, జన్యు ఎంపికల వంటి అధునాతన సాధనలతో పరిశోధనలు జరిపి, మరిన్ని మెరుగైన ఫలితాలు సాధిస్తామని ఇక్రిశాట్ డైరెక్టర్ జనరల్ హిమాన్ష్ పాఠక్ తెలిపారు.
పంటల సాగులో ఆధునిక సాంకేతికతను అందుబాటులో ఉంచడంతోపాటు ప్రయోగాలు, ఆవిష్కరణల ఫలాలను తెలంగాణ రాష్ట్రంలోని రైతులకు అందించేందుకు వీలుగా ప్రతి జిల్లాకో రైతు విజ్ఞాన కేంద్రం (ఆర్‌వీకే) స్థాపించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆచార్య జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఈ మేరకు ఆర్‌వీకేలపై ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా 9 ఏరువాక కేంద్రాలు, 8 కృషి విజ్ఞాన కేంద్రా(కేవీకే)లు పనిచేస్తున్నాయి. ఇందులో కొద్దిమంది శాస్త్రవేత్తలే పని చేస్తున్నారు. ఏకంగా 15 జిల్లాల్లో శాస్త్రవేత్తలు లేరు. రైతులకు వాతావరణ మార్పులపై అవగాహన కల్పించడం, పంటల మార్పిడి ఆవశ్యకతను వివరించడం, నేరుగా వరి విత్తనం వేయడం, పత్తిలో కలుపు మొక్కల నివారణ వంటి వాటిని ప్రోత్సహించాలని ప్రభుత్వం భావిస్తోంది. డ్రోన్లు, యంత్రాల వినియోగం, కృత్రిమ మేధ, రోబోటిక్స్ వంటి ఆధునిక సాంకేతిక సేవలను అందించాలని యోచిస్తోంది. వీటన్నింటి అమలుకు ప్రత్యేకంగా రైతు విజ్ఞాన కేంద్రాల ఏర్పాటుపై దృష్టి సారించింది. దీనిపై ప్రతిపాదనలు రూపొందించాలని అగ్రివర్సిటీని ఆదేశించింది.
తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న 17 ఏరువాక, కేవీకేలను ఆర్‌వికెలుగా మారుస్తారు. మరో 15 జిల్లాల్లో కొత్త ఆర్‌వికెలను ఏర్పాటు చేస్తారు. అప్పుడు 32 జిల్లాల్లో విజ్ఞాన కేంద్రాలు అందుబాటులోకి వస్తాయి. ప్రతి కేంద్రంలో ఆరుగురు చొప్పున శాస్త్రవేత్తలను నియమిస్తారు. ఇతర సహాయ సిబ్బంది ఉంటారు. వాటిలో ప్రయోగశాలలు ఏర్పాటు చేస్తారు. వాటికి అనుబంధంగా విత్తన, సాగు క్షేత్రాలు ఉంటాయి. వాటిలో డ్రోన్లు, యంత్రాలపై శిక్షణ ఇస్తారు. నిత్యం పరిశోధనలు, ప్రయోగాలకు, రైతు శిక్షణ కార్యక్రమాలకు అవకాశం కల్పిస్తారు. అంకుర సంస్థలకు సైతం స్థలాలను కేటాయిస్తారు.
హైబ్రిడ్ వరి పరిశోధనలో నూతన ఆవిష్కరణకు గాను తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయ పరిశోధన సంచాలకుడు మరాఠి బలరామ్ మూడు దేశాల పేటెంట్లను పొందారు. ఇప్పటికే ఆయనకు భారత్‌తోపాటు అమెరికాలో పేటెంట్ లభించింది. తాజాగా ఫిలిప్పీన్స్ నుంచి పేటెంట్ పొందారు. బలరామ్ అంతర్జాతీయ వరి పరిశోధన సంస్థ(ఐఆర్‌ఆర్‌ఐ)లో ఫెలోషిప్ సందర్భంగా పరిశోధన చేపట్టారు. ఆఫ్రికాలో ఏడాదికి పైగా పండే వరి పంట రకాన్ని తీసుకొని దాని జీవకణాన్ని మరో మొక్కతో పరపరాగ సంపర్కం ద్వారా కొత్త హైబ్రిడ్ రకాన్ని కనుగొన్నారు. దీనికి 2020లో అమెరికా పేటెంట్ లభించగా.. 2023లో భారత్‌లో పేటెంట్ వచ్చింది. తాజాగా బుధవారం ఆయనకు పేటెంట్‌ను మంజూరు చేస్తూ ఫిలిప్పీన్స్ ప్రభుత్వం ధ్రువీకరణపత్రాన్ని పంపింది. 2036 జూన్ 5 వరకు దీని కాలపరిమితి ఉంటుందని వెల్లడించింది. ఈ సందర్భంగా తెలంగాణా వ్యవసాయ విశ్వవిద్యాలయ ఉపకులపతి అల్దాస్ జానయ్య, ఇతర ఉన్నతాధికారులు, శాస్త్రవేత్తలు ఆయనను అభినందించారు.
దక్షిణాదిలో తొలిసారి 800 కేంద్రాల్లో ప్యాడీ క్లీనర్ల వినియోగం
తాలు, తరుగు, తేమ సమస్యలు తగ్గాయంటున్న అధికారులు
వెదర్ ఫోర్‌కాస్ట్ టూల్స్ ఉపయోగించి వర్షాలపై అప్రమత్తం
తెలంగాణ విధానాలపై పలు రాష్ట్రాల అధ్యయనం
ధాన్యం కొనుగోళ్లు, మిల్లింగ్ ప్రక్రియలో రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తోంది. దీంతో ఇతర రాష్ట్రాలు తెలంగాణ విధానాలపై అధ్యయనం చేస్తున్నాయి. రాష్ట్రంలో ఇటీవల 800 ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ప్యాడీ క్లీనర్లను ఉపయోగించారు. వీటి వాడకంతో తాలు, తరుగు, తేమ వంటి సమస్యలు గణనీయంగా తగ్గాయని.. దక్షిణాదిలో ఈ విధానాన్ని అవలంబించిన తొలి రాష్ట్రం తెలంగాణేనని పౌరసరఫరాలశాఖ వర్గాలు చెబుతున్నాయి. భవిష్యత్తులో మిగతా కేంద్రాల్లోనూ ప్యాడీ క్లీనర్లను ఉపయోగించాలని పలువురు కోరుతున్నారు. ధాన్యం సేకరణ సమయంలో వర్షాలు కురుస్తుండటం పెద్ద సమస్యగా మారుతోంది. ఈ నేపథ్యంలో వెదర్ ఫోర్‌కాస్ట్ టూల్స్‌ని ఉపయోగించి వర్షం పడే ప్రాంతాల్ని గుర్తించి.. ఆయా కొనుగోలు కేంద్రాలను పౌరసరఫరాల సంస్థ అప్రమత్తం చేస్తోంది.
రైతులకు వ్యయప్రయాసలు తగ్గించాం
డీఎస్ చౌహాన్, పౌరసరఫరాల శాఖ ముఖ్యకార్యదర్శి, కమిషనర్ ధాన్యం కొనుగోళ్లు వీలైనంత సాఫీగా జరిగేందుకు టెక్నాలజీని వాడుతున్నాం. ప్యాడీ క్లీనర్లు వినియోగించి రైతులకు వ్యయప్రయాసలు తగ్గించాం. ప్రతి రోజు టెలికాన్ఫరెన్స్ ద్వారా వాతావరణ ముందస్తు హెచ్చరికల్ని ప్రభావిత కేంద్రాలకు పంపి ధాన్యం తడవకుండా వీలైనంత మేరకు తగ్గించాం. తెలంగాణ పౌరసరఫరాల శాఖ చేపడుతున్న సంస్కరణల్ని పలు రాష్ట్రాలు అధ్యయనం చేశాయి. మరికొన్ని రాష్ట్రాలూ రానున్నాయి.
ఆసక్తి కనబరుస్తున్న ఇతర రాష్ట్రాలు తేమ శాతం నిబంధనల్ని పక్కన పెట్టి ధాన్యం కొనుగోలు చేసేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది.మిల్లర్లకు గ్యారంటీ, బకాయిదారులకు ధాన్యం కేటాయింపులు నిలిపివేయడం తదితర విధానాలను అవలంబించింది. ఈ పరిణామాలు, సంస్కరణల నేపథ్యంలో దేశంలో పలు రాష్ట్రాల మంత్రులు, ఉన్నతాధికారులు తెలంగాణలో పర్యటించి ఇక్కడి విధానాలను అధ్యయనం చేస్తున్నారు.