బాగా కుట్టే (దూకుడుగా ఉన్న) తేనె పట్టులతో ఏ విధoగా వ్యవహరించాలి ?(How to deal with aggressive honey bee colonies ?)
ప్రతి తేనె పెంపకం పరిశ్రమలో కనీసం ఒకటి లేదా రెండు పట్టులు దూకుడుగా (Aggressive) ఉంటాయి. అనగా కుట్టే స్వభావం ఎక్కువగా ఉంటుంది. కొంతమంది తేనెటీగల పెంపకందారులకు ఈ లక్షణం ఉన్న పట్టులంటే ఇష్టము. ఎందుకనగా ఇలాంటి పట్టులు మంచి తేనెను సేకరించే లక్షణము, వ్యాధి నిరోధక శక్తిని లేక ఇతర విలువైన లక్షణాలను కలిగి ఉంటాయని భావిస్తారు. ఏది ఏమైనప్పటికీ దూకుడుగా వ్యవహరించే పట్టులకు నెమ్మదిగా ఉండు రాణి ఈగలను రక్షించాలనే మనస్సాక్షి గల తేనెటీగల పెంపకం దారులు ఏ సంకోచం లేకుండా చేస్తారు. తేనెటీగల పట్టులలో దూకుడు గల లక్షణం అనేది వంశపారంపర్యమైన లక్షణం అని చెప్పడానికి ఏ సందేహము లేదు. అంతేకాకుండా పెద్ద పట్టులు ఎప్పుడూ దూకుడుగానే ఉంటాయి. ఎందువలన అనగా ఆ పట్టులో ఎక్కువ సంఖ్యలో తేనెటీగలుంటాయి కాబట్టి ఏది ఏమైనా బలమైన సులువుగా యాజమాన్యం చేయగల పట్టులు అలానే ఉండాలనేది తేనెటీగల పెంపకందారుల లక్ష్యం కూడాను.

సామన్యమైన, సూటిగా రాణి ఈగ ఎంపిక అనేది బాగా స్థిరపడిన విషయమే కాకుండా ఈ ప్రక్రియ ఆ ప్రాంతంలో తేనెటీగల స్వభావమును మార్చుతుంది. సంవత్సరాలుగా తేనెటీగలను నెమ్మదిగా ఉండే, వ్యాధి నిరోధకత కల్గి, తేనె ఉత్పత్తి ఎక్కువగా చేయగల తక్కువ ప్రపోలిస్ ను, ఎక్కువ పుప్పొడిని సేకరించు లక్షణాలు గల పట్టుల ఈగలను (Selection) ఎంపిక చేస్తున్నారు. ఎక్కువ సంఖ్యలో గల పట్టులు ఖచ్చితంగా తేనెటీగల స్వభావము మీద ఆ ప్రాంత ప్రభావము ఉంటుంది. ఇంకా పొరుగువారి తేనె పట్టులకు చాలా దగ్గరగా పనిచేసినట్లయితే తరుచుగా ఆ ప్రాంతమంతటి మీద కలిగే ప్రభావముగా ఫలితం ఉంటుంది.
పోతుటీగలు వీటిన్నింటి మీద ఒక కారకము (Factor) ఎందువలన అనగా సగం జన్యు పదార్ధము పోతుటీగల వైపు నుండి వస్తుంది. పోతుటీగల లద్దె పురుగులను, కోశస్థ దశలను దూకుడుగా ఉన్న పట్టులలో నాశనం చేసినపుడు దూకుడు అనే లక్షణాన్ని మోసుకెళ్ళే పోతుటీగల జన్యువులు పట్టులో తగ్గిపోతాయి. ఇది ఒక ఎంపిక మాత్రమే అయినప్పుటికీ సమయం చాలా తీసుకునే (Time consuming) ప్రక్రియ. ఇంకొక ఎంపిక ఏమంటే పోతుటీగల కృత్రిమ మైనపు అట్టను పట్టుకు సరఫరా చేయడం లేదా మంచి పట్టుల నుండి పోతుటీగలున్న లద్దె పురుగుల ఫ్రేములను సరఫరా చేయవలెను.
బాగా కుట్టే స్వభావము గల పట్టులలో ఎక్కువ సంఖ్యలో కూలి ఈగలు మనల్ని కుట్టకుండా రాణి ఈగను గుర్తించడం బహుశా అన్నిటికంటే కష్టమైన పని. తరచుగా ఇలాంటి పట్టులన్నింటిలో ఎక్కువ సంఖ్యలో కూలి ఈగలుంటాయి. రాణి ఈగను కనగొనడం చాలా కష్టము. కొన్నిసార్లు అసాధ్యముగా అనిపిస్తుంది. సాధారణంగా బాగా కుట్టే పట్టులకు ఎక్కువ మోతాదులో పొగ ఇచ్చి బాగా కుట్టే స్వభావము గల పట్టులను పరిశీలిస్తుంటాము. రాణి ఈగ పట్టును వదిలి తేనె పెట్టెలో ఏ భాగములోకైనా వెళుతుంది. బాగా పొగబారించినపుడు కూలి ఈగలు పట్టులోను మరియు పట్టుకు వెలపల గుంపులు గుంపులుగా ఏర్పడతాయి, ఒకవేళ రాణి ఈగ ఈ గుంపులలో ఉన్నట్లయితే రాణి ఈగను గుర్తించడం అసాధ్యము.

బాగా కుట్టే పట్టులలో రాణి ఈగను కనుగొనడానికి రెండు పద్దతులున్నాయి. రెండు పద్దతులలో కొంత ఎక్కువ సమయము మరియు కృషి అవసరమవుతుంది. ఈ రెండు పద్దతులను కూడా కూలి ఈగలు ఆహారం సేకరణకు వెళ్ళినపుడు, వెచ్చని వాతావరణములో (Warm days) చేయవలసి ఉంటుంది. పొలములో ఎక్కువ మోతాదు లో పుప్పొడి మరియు మకరందము లభ్యమయ్యేటప్పుడు మంచిది. ఎందుకంటే ఎక్కువ కూలి ఈగలు పొలానికి వెళతాయి కాబట్టి.
మొదటి పద్ధతిలో, మొదటిగా పట్టులో లద్దె పురుగులు, కోశస్థ దశలో ఉన్న (Brood nest) ఫ్రేములను గుర్తించి, పెట్టెతో సహా 50 నుండి 75 అడుగుల దూరం వరకు మోసుకెళ్ళి ఒక పొద చాటున లేక ఇతర అడ్డుగా ఉన్న (Obstrucion) నీడలేని ప్రదేశంలో ఉంచాలి. వయస్సు మళ్ళిన కూలి ఈగలు, పాలంకెళ్ళిన కూలి ఈగలు, కాపలా కాసే ఈగలతో సహా అన్ని తిరిగి వాటి పాత స్థానంలోకి ఎగరి వెళతాయి. కారణం వాటికి తెలిసిన వాటి పాత ఇల్లు అదే అని, దానిని కాపాడుకోవాలని అంతే తప్ప ఈ కొత్త స్థలం కాదు కాబట్టి. పైన చెప్పబడిన చిట్కా కూడ, కుట్టే ఈగల పట్టును తెరచి పరీక్షించునపుడు, మరియు ఇతరులకు చూపేటపుడు (Live demonstration) ఉపయోగపడుతుంది. పట్టును ఎత్తుకొని వేరే చోటుకి వెళ్ళడము ద్వారా ఎదురాడే కూలి ఈగలు ఎగిరి తిరిగి వాటి అసలు స్థానానికి వెళతాయి.
ఒకసారి లద్దె పురుగులున్న పెట్టె మరియు రాణి ఈగ, వేరు స్థానానికి మార్చినపుడు, తక్కువ పొగ అవసరముంటుంది. వెదకే విషయంలో మందుకు వెళ్ళవచ్చును. పొగ ఉపయోగించడం వల్ల తేనెటీగలకు రాణి ఈగతో సహా దిక్కు దిశ తెలియకుండా అవుతుంది. సాధారణ పరిస్థితులలో, నెమ్మదిగా ఉన్న పట్టులో రాణి ఈగ, లద్దెపురుగులున్న ప్రేములపై కనబడుతుంది. ఎక్కువ పొగ పట్టుకు ఇచ్చినపుడు రాణి ఈగ ఎక్కడైనా ఉండవచ్చును. రాణి ఈగను గుర్తించే రెండవ పద్ధతిలో (కుట్టే ఈగలు గల పట్టులలో) తేనె పట్టును విభజించి రాణి ఈగను వేరు పరుచు జల్లెడను ప్రతి భాగము (మీద పిల్లల గది మరియు తేనె గదిపై) పై ఉంచి పట్టు ద్వారమును మూసివేయవలెను. ఈ విధంగా చేయడం వల్ల మనకు రాణి ఈగ ఒక దానిలో ఖచ్చితంగా ఉoటుందని నమ్మవచ్చును. మూడు లేక నాలుగు రోజులు తర్వాత గుడ్లన్నీ రాణి ఈగ లేని భాగములో (Hive Part) పొదగబడతాయి. దేనిలో గుడ్లు ఉంటాయో దానిని (ఆ భాగమును) ఒక ప్రక్క ఉంచి అడుగు బల్ల మరియు పై మూతను పెట్టాలి. తిరిగి వయస్సు మళ్ళిన కూలి ఈగలు వాటి పాత స్థానమునకు తిరిగి వెళతాయి. అదే రోజున గాని, తరువాత రోజు గాని రాణి ఈగ కొరకు తక్కువ సంఖ్యలో ఉన్న కూలి ఈగలు పట్టులో తక్కువగా ఉన్నందువలన సులువుగా రాణి ఈగను కనగొనవచ్చును.
మన లక్ష్యం ఇక్కడ అసలు పట్టులో (Original) రాణి ఈగను తిరిగి ప్రవేశ పెట్టడం (Requeening). పట్టు తనంతట తానుగా రాణి ఈగను తయారు చేసుకోనివ్వకూడదు. అలా కొత్తగా వచ్చిన రాణి ఈగ తన తల్లి నుండి అనవసరమైన లక్షణాలు ఏమైన పొందుకొనవచ్చునని ఆలోచించాలి.
పట్టులో నూతనంగా తిరిగి రాణి ఈగను ఉత్పత్తి చేసుకోనవలయుననుకుంటే తగిన శ్రేష్టమైన మార్గము ఏమంటే ఒక వార్తా పత్రికను (News paper) పాత పట్టుపై ఉంచి పైభాగాన ఉంచే పిల్లల గదిని దానిపై పెట్టుకోవాలి. పై భాగమున ఉన్న పిల్లల గదిలో మంచి లక్షణాలు గల నూతనముగా సంపర్కము చెందిన రాణి ఈగ ఉండేటట్లుగా చూసుకొనవలెను. వార్తా పత్రికను కూలి ఈగలు నెమ్మదిగా నమిలి పట్టులు రెండు నెమ్మదిగా కలిసిపోతాయి.
మీ సొంత తేనె పట్టుల సామర్థ్యమును త్వర త్వరగా పెంచుకోవాలనుకుంటే మీరే రాణి ఈగను ఉత్పత్తి చేసుకోవాలి. ఎంపిక ప్రక్రియ నెమ్మదిగా ఉండే ఫలవంతమైన తల్లియైన రాణి ఈగల ద్వారా చేసుకొనవచ్చును.
Smokers- పొగ డబ్బా
అనేక సంవత్సరముల వరకు తేనెటీగల పెంపకముదారులు మండే ఎండిన చెక్కను (punk wood), గట్టిగా కట్టిన ఎండుగడ్డిని మరియు ఇతరమైన వాటిని తేనెపట్టులో పొగబారించుటకు వాడేవారు. ఈ పదార్దములు మండి పొగను ఉత్పత్తి చేయుట వలన అట్టలపై అడ్డముగా పొగబారించేవారు. ఇవి కొద్దిమొత్తములోనే పొగ ఉత్పత్తి చేసేవి. కోపముతోవున్న పట్టులను అదుపుచేయుటకు సరిపడునంతగా ఉండేది కాదు
మోజస్ క్విన్బి(Moses Quinby) 1875వ సంవత్సరములో మొట్టమొదటి ఆచరణాత్మకమైన పొగడబ్బాని, ఈ పొగడబ్బాలో మంట మండించే స్తలము (fire pot) మరియు గాలితిత్తులు (bellows), ఒక విధముగా ఆధునిక తేనెటీగల పెంపకము చేపట్టిన తరువాత ఆలస్యముగా కనుగొనబడిన పొగడబ్బానుండి, పొగను గురిపెట్టి అవసరమైనచోటకు పడేలా గొట్టం ద్వారా పొగడబ్బా చివర కొనకు అమర్చబడివుంటుంది.
మండుచున్న పొగడబ్బాల వలన, చుట్టు ప్రక్కల వున్నకట్టెలు, గడ్డి అంటుకొని అనవసరమైన కార్చిచు ప్రారంభమవుతుంది. ఇది పొగడబ్బాలోని నిప్పు సులువుగా అంటుకొనే పదార్ధము లేక వేడినిప్పురవ్వలు పొగ మూతి నుండి వెలువడడము ద్వారా జరుగుతుంది. తేనెటీగల పెంపకముదారులు పొగడబ్బాను మండించిన తరువాత గుప్పెడు పచ్చగడ్డిని మంటపై భాగమున వుంచుతారు. ఎందుకనగా వేడి పొగను చల్లబరచి, మంటనుండి వెలువడు నిప్పురవ్వలను పొగడబ్బా మూతి నుండి (nozzle) వెలువడకుండా ఆపుతుంది. తేనెపట్టులున్న ప్రాంతములో కొన్నిసార్లు వాడిన పొగడబ్బాలో వున్న మంటను ఆర్పకుండా, బయట పడవేయడము వలన మంటల వ్యాప్తికి కారణమవుతంది.
Smoking Honey bee colonies-
తేనెపట్టు దూకుడుగాను మరియు పట్టులోని ఈగలు దాడిచేయుటకు ముందుగా నెమ్మదిగా వుంచుటకు పొగబారించుట ముఖ్యము. ఒక్కసారి కాపలాకాయు ఈగలు ప్రమాదమును పసిగట్టి నట్లయితే, హెచ్చరిక వాసనను (alarm odour) బయటకు పంపిస్తాయి. అలాంటి పరిస్థితిలో తరచుగా ఆ పట్టు మరియు చుట్టు ప్రక్కల వున్నపట్టులను నియంత్రించుట కష్టము.
తేనెపట్టులున్న ప్రాంతములోనికి ప్రవేశించుటకు ముందుగానే, పొగడబ్బాను వెలిగించుకొని సరైన స్థితిలో ప్రవేశించవలెను. పని ప్రారంభించుటకు ముందుగానే పట్టులన్నింటికి పొగనివ్వనవసరము లేదు. ఎందువలననగా ఎవైనా కంపనములు (vibrations) మొదటి పట్టునుండి వెలుపడినట్లయితే అవి ఇతర పట్టులను రేపుతాయి. అయినప్పటికిని పట్టులన్నింటికి స్టాండువద్ద పొగ బారించవలెను.
మొదటి పట్టును తెరచునపుడు పొగబారించునపుడు, గుర్తుపెట్టుకొనవలసినదేమనగా అన్ని పట్టులు ద్వారములవద్ద కాపలాకాయు కూలిఈగలుంటాయి. మకరందము లభించనప్పుడు పట్టుద్వారము వద్ద ఎక్కువ సంఖ్యలో కాపలాకాయు ఈగలుంటాయి మరియు కొద్ది సంఖ్యలో బాగా తేనె లభించు కాలములో కాపలా కాయు ఈగలుంటాయి. ఒక అడుగు దూరమునుండి రెండు లేక మూడుసార్లు పట్టుద్వారము వద్ద పొగను పారించిన యెడల, కాపలాకాయు ఈగలను నిరాయుధులుగా (disarm) చేస్తుంది. ఒకవేళ ఒకటికన్నా ఎక్కువ ద్వారములున్నట్లయితే అన్ని ద్వారముల ముందు ఇలాగే పొగబారించవలెను. తరువాత పై మూతను తీసి పట్టుకొని, అలాగే పొగనివ్వవలెను. లోపలిమూతను వాడినపుడు కూడ ఇలానే పొగనివ్వవలెను
తరువాత సూపర్ గదిలోవున్న ఏ ఫ్రేమును తీయవలెనని చూడవలెను. చాల సుళువుగా తీయగల్గిన ఫ్రేము, మొదటి ఫ్రేము. ఈ ఫ్రేముమీదనే అతితక్కువ తేనెటీగలుంటాయి మరియు వికృతరూపము (burr) గల్గిన మైనపు అట్టలుంటాయి. ఈ విధముగా ఏ ఈగలు కూడా నలిగిపోకుండా, ఇతర ఫ్రేములపై వున్న తేనెటీగలకు కోపము రాకుండా చేయడము సులువు. సాధారణముగా ప్రక్కనున్న ఫ్రేమును మొదటిగా తీస్తారు. మొదటి ఫ్రేముల చివరలకు పొగబారించవలెను, ఈ విధముగా దారిలో ఈగలు లేకుండావుండి, చేతి వ్రేళ్ళతో గట్టిగా పట్టుకొనవచ్చును.
మొదటి ఫ్రేమును తీసినపుడు, పట్టుపరిశీలన మధ్యలోవున్నపుడు, అవసరమైనయెడల మరలా ఒకసారి పొగనివ్వవచ్చును. ఫ్రేముల మధ్యలో తేనెటీగలు అలవాటు పడియుండుటను చూడవచ్చును. ఎప్పుడైతే అయిదు నుండి పదిహేను ఈగలు రెండు ఫ్రేముల మధ్యవాటి తలలుంచి చూచుచున్నపుడు, పొగ ఇవ్వవలసిన సమయము అదే అని భావించవలెను. రెండు, మూడు పఫ్ ల పొగను ఫ్రేములపై అడ్డముగా బారించినపుడు నెమ్మదిగా తేనెటీగలన్నియు వెనుకకు వెళ్ళతాయి. రెండు ఫ్రేముల మధ్య తొంగి చూచుచున్న ఈగలు పొగ బారించినను వెళ్ళకపోయినట్లయితే, నెమ్మదిగా వుండకపోతే అవి ఎగిరి కుట్టవచ్చును. పట్టులోని ఈగలు ఒక్కొక్కటి రేపబడి, అన్ని ఈగలు కూడా ఈ విధముగా సహకరించి పనులు చేసుకుంటాయి.
Fuel for smokers – పొగడబ్బాలో వాడు ఇంధనము
పొగడబ్బాలో వాడవలసిన శ్రేష్ఠమైన ఇంధనము ఏది అనునది తేనెటీగల పెంపకదారుల మధ్య జరిగే తీవ్ర చర్చయైయున్నది. పొగ ఎందుకు తేనెటీగలను నెమ్మది పరుస్తుంది అను విషయమైన దానిలో తక్కువ పరిశోధన జరిగినది. ఆధునిక ఆలోచన ఏమనగా పట్టును తెరవగానే కూలిఈగలు హెచ్చరిక ఫిరమోనును స్పర్శకముల మీదవున్న స్పర్శగ్రాహకములు గ్రహించకపోవుట వలన అని. ఇది నిజమైనట్లయితే, ఏ ఇంధనమైనను ఎక్కువ పరిమాణములో పొగను ఉత్పత్తి చేయునదైతే తేనెటీగలను నెమ్మది పరుస్తుంది.
పొగడబ్బాలో వాడు ఇంధనము విషయమైన ముఖ్య సమస్య ఏమనగా ఎక్కువ సేపు మండకపోవుట, అనగా త్వరగా కాలిపోవుట మరియు పొగడబ్బాను నిరంతరముగా మండునట్లుగా రీచార్జి (recharge) చేయుట. తేనెటీగల పెంపకదారులు ఆకులను, గడ్డిని, గోనెసంచి గుడ్డలు లేక ఇతర పాతగుడ్డలు, అరిగిపోయిన త్రాళ్ళు, చెక్కపొట్టు, చెక్కముక్కలు ఒక అంగుళము సైజుగలవి (బ్లాక్స్ రూపములో తయారుచేసి) వాడుదురు. ఇవి ఎక్కువ సమయము మండుతాయి మరియు కొంతమంది తేనెటీగల పెంపకము దారులు వాడుచున్నారు.
- డా. కె. మోహన్ రావు, ప్రధాన శాస్త్రవేత్త (కీటక విభాగము) మరియు అధిపతి
అఖిల భారత సమన్వయ తేనెటీగలు మరియు పరాగ సంపర్కము జరుపు కీటకముల పరిశోధన పథకము, వ్యవసాయ పరిశోధన స్థానము, విజయరాయి- 534475, ఏలూరు జిల్లా. Phone: 9493304643 - జి.అలేఖ్య, యంగ్ ప్రొఫెషనల్ -1, అఖిల భారత సమన్వయ తేనెటీగలు మరియు పరాగ సంపర్కము జరుపు కీటకముల పరిశోధన పథకము, వ్యవసాయ పరిశోధన స్థానము, విజయరాయి -534475, ఏలూరు జిల్లా.






