తేనెటీగలు – పుప్పొడి

తేనెటీగలు పుప్పొడిని సేకరించుకొనుట
తేనెటీగలు పుప్పొడిని సేకరించుకోవాలనే ప్రేరణ తేనెపట్టు అవసరం మీద ఆధారపడి ఒక క్రమబద్ధీకరణ ద్వారా జరుగుతుంది. తేనెటీగలు పొలం వెళ్ళి సేకరించే పుప్పొడి పరిమాణం మీద ఆధారపడి పట్టులో పిల్లల అభివృద్ది ఉంటుంది. పట్టులో పిల్లల ఫ్రేములు రెండింతలు చేసినట్లయితే, సేకరించే పుప్పొడి పరిమాణం ఒకరోజులో రెండితలు పెరుగుతుంది. దీనికి తోడుగా రాణి ఈగ ఎక్కువగా గ్రుడ్లు పెట్టినట్లయితే ఇది పుప్పొడి సేకరణను పెంచుతుంది. ఈ పరిణామాలన్నీ ఫిరమోనుల ద్వారా జరిగించబడుతాయని సూచిస్తుంది.

తేనెటీగలు పుప్పొడిని ఎలా సేకరించి ప్యాక్ చేసుకుంటాయి?
కూలి ఈగ ఆహారము సేకరించుకొనే సమయములో దాని శరీరమంతా పుప్పొడి రేణువులతో ధూళిలాగ నింపబడుతుంది (dusted with pollen) తరువాత తేనెటీగ తన నాలుకను చాపి ఒక చుక్క మకరందమును లేక తేనెను ఉమ్ముతుంది, ముందు కాళ్ళు ఈ మకరందము లేక తేనెతో తడపబడతాయి. ఈ ముందు కాళ్ళు తల మీద స్పర్శకముల మీద మరియు మొండెము (thorax) ఎదుట వున్న పరాగ రేణువులను బ్రష్ చేస్తాయి. మొండెము వెనుక భాగమున ఉన్న పరాగ రేణువులను మద్య కాళ్ళు (middle legs) తొలగించి వేస్తాయి (combed off) మరియు ఉదరము మీద ఉన్న పరాగ రేణువులు వెనుక కాళ్ళ (hind legs) కదలికల ద్వారా సేకరించబడతాయి. చివరికి పుప్పొడి అంతా వెనుక కాళ్ళకు బదలీ చేయబడుతుంది. మధ్య కాళ్ళు, పుప్పొడిని మలచడానికి (mold) ప్యాక్ చెయ్యడానికి (pack) మరియు పుప్పొడి గుళికలు మూత్ర పిండాకారము (kidney shape) నకు మలచబడుతుంది.

పట్టులో పుప్పొడిని నిల్వ ఉంచుట
పుప్పొడి, తేనె పట్టులోనికి రాగానే, పుప్పొడిని సేకరించిన కూలిఈగ సాధారణంగా తన వద్ద వున్న పుప్పొడి ముద్దను విడిపించుకుంటుంది (grooms herself). తరువాత సరియైన ఏ మైనపు గదిలో ఈ పుప్పొడిని వుంచవలెనో ఆ గది కొరకు వెదకుతుంది. ఈ గది ఒకవేళ ఖాళీ గది కావచ్చును. సాధారణముగా లద్దె పురుగులు ఎదిగే ప్రాంతమై యుంటుంది లేదా ఇంతకు ముందే పుప్పొడి ఉన్న గది అయి కూడ వుండవచ్చును. కూలిఈగ మైనపు గదిని ఎంచుకున్నపుడు తన ఉదరమును గదిలో పూర్తిగాను, కాళ్ళను పాక్షికముగాను ముంచి, తన మధ్య కాళ్ళనుపయోగించి రహస్యముగా (pry) తన పుప్పొడి ముద్దను గదిలో పడునట్లుగా అనుమతిస్తుంది. పుప్పొడి తిత్తిలో (pollen basket) మిగిలియున్న చిన్న చిన్న పుప్పొడి ముద్దలు ఏవైనావున్నట్లయితే వాటినికూడా గదిలో వదిలించుకుంటుంది మరియు ఇంకొక కూలిఈగ వచ్చి పుప్పొడిని గది అడుగులోనికి త్రోసి తన దంతములు మరియు ముందు కాళ్ళతో అదిమి ప్యాక్ చేయటకు వీలుగా పొలం నుండి వచ్చిన ఈగ గదిని విడిచిపెడుతుంది.వెళ్ళిన కూలి ఈగ తను తీసుకొచ్చిన పుప్పొడిని మైనపుగదిలో వుంచిన తరువాత ఇంకొక కూలి ఈగ ఉండి సాధారణముగా కొంత తేనెను ఇమ్మని కోరుతుంది. మరియు తరువాత అహారం సేకరించుటకు పొలము వెళుతుంది.

పుప్పొడికి అనుబంధమైనవి మరియు పుప్పొడికి ప్రత్యామ్నాయ పదార్ధములు (Pollen supplements and substitutes)
పుప్పొడి అనుబంధ పదార్ధము అనగా, ఏ పదార్ధమునైతే, సహజ పుప్పొడికి (natural pollen) తేనెటీగలు సేకరించిన పుప్పొడికి (bee collected pollen) కలుపుతారో దానిని పుప్పొడి అనుంధ పదార్ధమని అంటారు. పుప్పొడి ప్రత్యామ్నాయ పదార్ధము అనగా అసలు అందులో పుప్పొడి వుండదు. అనుబంధ పదార్ధములలో సాధారముగా పదినుండి ఇరవై శాతము సహజ పుప్పొడిని కల్గియుంటుంది. ఈ పదార్థము ప్రాధమికముగా తేనెటీగలకు అనువుగా (రుచిగా) మరియు ఆకర్షనీయముగా వుంటుంది. పుప్పొడి అనుబంధ మరియు ప్రత్యామ్నాయ పదార్ధములు తేనెటీగలకు ఎక్కువ ఆకర్షనీయముగా వుండటకు గాను పంచదార పాకమును లేదా తేనెను కలుపుతారు.తేనెను కలిపినట్లయితే అది ఆపాయకరముగా వుండవచ్చును, కారణము, రోగమును/ వ్యాధికారక బాక్టీరియా లేక స్పోరులను కల్గియుండవచ్చును. పుప్పొడి అనుబంధ పదార్ధములకు చాక్ బ్రూడ్ లేక యూరోపియన్ ఫౌల్ బ్రూడ్ వ్యాధితో కలుషితమైన పుప్పొడిని కలిపినట్లయితే వ్యాధులు వ్యాప్తి చెందుతాయి.

సోయా చిక్కుడు పిండిని మరియు బ్రూయర్స్ ఈస్ట్ ఈ రెండిటిని తరచుగా పుప్పొడి అనుబంధ పదార్ధములలో మరియు ప్రత్యామ్నాయ పదార్ధములలో వాడతారు. ఎక్కువమంది తేనెటీగల పెంపకముదారులు వారి సొంత పుప్పొడి అనుబంధ మరియు ప్రత్యామ్నాయ పదార్ధములను తయారు చేసుకుంటారు. ఒక పేరుగాంచిన సూత్రములో 3 పాళ్ళు సోయా చిక్కుడు పిండి, ఒక భాగము పుప్పొడి, రెండు పాళ్ళు చక్కెర (పంచదార) మరియు ఒక పాలు నీరు కల్గియున్నది. ఒక వేళ పుప్పొడిని ఉపయోగించకపోయినట్లయితే బ్రూయర్స్ ఈస్ట్ ను ప్రత్యామ్నాయంగా వాడుకొనవచ్చును. ఈ పదార్ధములన్నింటిని, కలిపి గట్టి ముద్దగా ఒక పౌoడు బరువుగలదిగా చేసికొని, దీనిని మైనపు పేపరుపై ముక్కలుగా ఉంచుకొనవలెను అడుగున మైనపు పేపరుతో ఈ ముక్కలను (patties) చేసినట్లు ఫ్రేములపై (top bars) వసంత కాలములో ఉంచుకొనవలెను. ఒక్కసారి పుప్పొడి అనుబంధ పదార్థమును పట్టుకు ఇవ్వడము ఆరంభిస్తే సహజ సిద్దమైన పుప్పొడి పొలములో సేకరించుట ఆరంభించు వరకు ఇవ్వవలెను మాంసకృత్తులు లభ్యముకాని సమయంలో ఉపయోగించుకొనుటకు గాను ఈ కృత్రిమ ఆహారమును మధ్యలో ఆపివేసినట్లయితే, పెరిగిన పట్టుకు ఎంతో ప్రమాదకరముగా పరిణమిస్తుంది. అంతేకాకుండా పట్టు కూడా చనిపోవచ్చు.

Pollen Traps – పుప్పొడిని సేకరించు బోనులు
పొలముకెళ్ళి పుప్పొడిని సేకరించుకొని పట్టుకు తిరిగివచ్చు ఈగల కాళ్ళకున్న పుప్పొడి ముద్దలను పుప్పొడిని సేకరించుబోనులను పట్టు ద్వారమువద్ద బిగించి, పుష్పాడిని సేకరించుకొనుటకు సాధ్యమే. పుప్పొడిని సేకరించుబోను అనుపరికరమును పట్టు ద్వారమువద్ద బిగించుకొని, పట్టులోపలికి (pollen loads), బలవంతముగా నడచివెళ్ళు ఈగల కాళ్ళకు వున్న పుప్పొడిని సేకరించవచ్చును. కూలిఈగలు సన్నని రంధ్రముల ద్వారా వెళ్ళునపుడు వాటి వెనుక కాళ్ళు వెనుకకు నెట్టబడి, వైరు ద్వారా లాగ బడి, పుప్పొడి గుళికలు (pollen balls) తొలగించబడతాయి. తొలగించబడిన పుప్పొడి గుళికలు బోనులోని పెట్టెలో పడతాయి. ఎనిమిది మెష్ వైరును పెట్టెపై వాడటమువలన, తేనెటీగలు అడుగుకు ప్రవేశించి సేకరించబడిన పుప్పొడిని తొలగించలేవు. వివిధ కవర్లను పుప్పొడిని సేకరించుబోనులకు వాడుటవలన, వర్షము వచ్చినప్పుడు పుప్పొడి తడవకుండా వుంటుంది. పుప్పాడిని సేకరించు బోనులను ఎక్కువగా చెక్కతో తయారుచేస్తారు కాని, లోహపు బోనులు ఎక్కువ కాలము మన్నుతాయి. నీటిని తొలగించుకుంటాయి, బహుశ ఎక్కువ ఖర్చయినప్పటికిని విలువైనవి.

Pollination-పరాగ సంపర్కము
పుష్పములోని పురుష భాగమైన పరాగకోశము (anther) నుండి స్త్రీ భాగమైన కీలాగ్రము (stigma) మీదకు పరాగ రేణువు (pollen) చేరుటను పరాగసంపర్కము అని పిలుస్తారు. కొన్ని మొక్కలు స్వపరాగ సంపర్కము చెందుతాయి, కాని ఎక్కువ సందర్భములలో గాలి, నీరు, కీటకములు ప్రత్యేకముగా తేనెటీగలు పరాగరేణువుల బదిలీకి కారణమవుతాయి. కొన్ని మొక్కలలో పరాగ సంపర్కము జరుగదు, కాబట్టి వానిలో విత్తనములు ఏర్పడవు. కీటకములలో తేనెటీగలు అనేవాటిలో అనేక జాతులున్నవి. ప్రత్యేకముగా పరాగ సంపర్కము జరుపుటకు అనువైనవి. వీటి శరీరము మీద చీలికలుగా వున్న వెంట్రుకలుండుట వలన, పుప్పొడి సుళువుగా వీటి మధ్య చిక్కుకుంటుంది మరియు ఈ పుప్పొడి ఒక పుష్పము నుండి ఇంకొక పుష్పమునకు సులువుగా మోసికొని పోబడుతుంది.

జి.అలేఖ్య, యంగ్ ప్రొఫెషనల్ -1, అఖిల భారత సమన్వయ తేనెటీగలు మరియు పరాగ సంపర్కము జరుపు కీటకముల పరిశోధన పథకము, వ్యవసాయ పరిశోధన స్థానము, విజయరాయి -534475, ఏలూరు జిల్లా.

Read More

తేనెపట్టుల ప్రవాసము (Migration of Bee Honeycolonies)

తేనెపట్టుల ప్రవాసము (Migration of Bee Honeycolonies)

సంవత్సరం పొడవునా సాధారణంగా ఏ ప్రాంతంలోకూడా పుష్పించే మొక్కలు ఉండవు, అయినప్పటి తేనెటీగలు వాటి రోజూవారి అవసరములకొరకు పుప్పాడిని, మకరంధమును సేకరించుకొని తేనెను ఉత్పత్తిచేస్తాయి. ఒకవేళ పుప్పొడి మరియు మకరందము లభ్యము కాని పక్షంలో అనుబంధ ఆహారాన్ని అందించవలసి ఉంటుంది. క్యాలెండరును బట్టి తేనెటీగలకు పుష్పజాతులు లభ్యమయ్యే ప్రాంతాలకు తేనెపట్టులను తీసుకుని పోవలసియుంటుంది. దీనినే తేనెపట్టుల ప్రవాసము (Migration) అంటారు. పెద్ద ఎత్తున దీనిని అవలంభించినప్పుడు తేనెటీగల పెంపకంలో తేనెపట్టుల ప్రవాసము (Migratory Bee keeping) అంటారు.

వాణిజ్యపరంగా తేనెటీగల పెంపకమును చేపట్టినపుడు తేనెపట్టుల ప్రవాసము అనునది చాలా ముఖ్యమైనది. దీని ముఖ్యఉద్దేశ్యము

  • తేనె ఉత్పత్తిని పెంచుట కొరకు
  • తేనెపట్టులను బలపరచుకొని, విభజించుకొనడానికి
  • అనుబంధ పోషణ ఖర్చు తగ్గించుకొనడానికి మరియు తేనెటీగల పరాగ సంపర్కము ద్వారా పంటల ఉత్పత్తి పెంచుకొనడానికి
  • అడవి మరియు వ్యవసాయ మొక్కలలో జీవవైవిద్యమును పరపరాగ సంపర్కము ద్వారా కాపాడుకొనుటకు గాను తేనెపట్టుల ప్రవాసము ఉపయోగపడును.

గుర్తించకొనదగిన విషయాలు (Points to consider)
తేనెటీగల పెంపకము యొక్క ముఖ్యవుద్దేశ్యము ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించుకొని తేనె దిగుబడిని పెంచుకొనడము. అందుకనే తేనెటీగల పెంపకముదారులు తేనెటీగలకు ఆహారమును సరఫరా చేయు మొక్కలను మొదటిగా గుర్తించవలెను. తేనెపట్టులను మార్చుటకు (Migration) లేదా ప్రవాసము కొరకు అగు ఖర్చును తెలుసుకొనాలి మరియు సరైన శాస్త్రీయ పరిజ్ఞానము మరియు నిపుణత, పట్టులను ప్రవాసము చేయుటకు ఉండాలి. తేనెపట్టులను ప్రవాసము కొరకు ప్రణాళిక వేయునపుడు (Migration) ఈ క్రింది సూచనలు పాటించాలి.

ప్రవాసము చేయు స్థలము ఎంపిక

  • తేనెపట్టులు మార్చుకునే ప్రదేశములో లభ్యమయ్యే మొక్కలు, చెట్లు, వృక్షములు ఏరకమునకు చెందినవో, ఏ సీజనులో ఎంతకాలం పుష్పిస్తాయో ఎంత విస్తీర్ణములో ఉన్నవో, ప్రస్తుతం తేనెపట్టులున్న ప్రదేశం కంటే కొత్తగా పట్టులు పెట్టుకొను ప్రాంతములో ఎంత తేనెదిగుబడి వస్తుందో అంచనా వేసుకొనాలి.
  • తేనెపట్టులకు లభ్యమయ్యే పుష్పజాతుల పంటల మీద పురుగుమందులు పిచికారీ చేస్తారేమోనన్న విషయాన్ని స్థానిక వాతావరణ పరిస్థితులను గూర్చిన వివరణను సంపాదించాలి.
  • ప్రకృతి సిద్ధముగా తేనెపట్టులపై దాడిచేయు శత్రువుల విషయమైన సమాచారాన్ని సేకరించి, శత్రువుల దాడి తక్కువగా ఉన్న ప్రాంతాన్ని ఎంచుకొనాలి.
  • తేనెపట్టులు పెట్టుకున్న ప్రాంతంనుండి ఎంతదూరంలో తేనెటీగలకు పుప్పొడిని, మకరందాన్నిచ్చే పుష్పజాతులు ఉన్నవో అంచనా వేసుకొనాలి.
  • తేనెటీగల పట్టుల ప్రవాసము కొరకు ఎంత లాభము, ఎంత నష్టము ఉంటుందో విశ్లేషణ చేసుకొనాలి.

తేనెపట్టుల ఎంపిక మరియు ప్రవాసము కొరకు తేనెపట్టులను సిద్ధపరచుట

  • బలమైన, ఆరోగ్యకరమైన మరియు తేనెను సేకరించగల పట్టులను మాత్రమే ప్రవాసం (Migration) కొరకు ఎంపిక చేసికొనాలి.
  • తేనెపట్టులను ప్రవాసము తీసుకొని వెళ్ళడానికి ముందు కనీసం రెండు నెలలు నుండి బలవరచుకొనాలి.
    కావలసిన వస్తువులు, పరికరములన్నీ ఉదాహరణకు తేనె అరలు, ఫ్రేములు, కృత్రిమ మైనపు అట్టలు, తేనె యంత్రము మరియు తేనెను సేకరించి నిల్వవుంచుకొనుటకు కావలసిన పాత్రలు సిద్ధపరచుకొనవలెను.

తేనెపట్టుల ప్రవాసము కొరకు తగిన సమయము (Timing of Migration)
తేనెటీగలకు పుప్పొడిని, మకరందమును అందించే ఎక్కువ మొక్కలు పుష్పించేదశలో ఉన్నపుడు తేనెపట్టులను ప్రవాసము తీసుకువెళ్ళవలెను (కనీసం 5 శాతం పుష్పములు ఉన్నపుడు).

తేనెపట్టులను సిద్దపరచుట (Preparation of Bee colonies)
తేనెపట్టులను చాల జాగ్రత్తగా ప్రవాసముకొరకు సిద్ధపరచుకొనవలెను. ఈ సిద్దపరచడం సరిగా చేయకపోయినట్లుయితే కొన్ని ఈగలు వెనుక వదిలి పెట్టబడి లేక ప్రవాసం చేయునపుడు చనిపోతాయి.

తేనేపెట్టెలను క్రింద చెప్పబడిన విధముగా సిద్ధపరచుకొనాలి

  • తేనెపట్టులను శుభ్రపరచాలి.
  • అధికముగా ఉన్న తేనెను, తేనెయంత్రంతో తీసుకొనాలి మరియు తేనెగదిని తీసివేయాలి. తేనెతో నింపబడిన ఫ్రేములతో పాటుగా ప్రవాసము చేసినట్లయితే తేనెటీగలు చనిపోతాయి. ఫ్రేములను పట్టులలో గట్టిగా బిగించుకోనాలి.
  • తేనెపట్టుల ప్రవాసము సుదీర్ఘమైనదైనట్లయితే (Long distance) అనుబంధ ఆహారాన్ని (Supplementary feeding) ఏర్పాటు చేసుకొనాలి.
  • చెక్కలతో (Wooden reapers) పై నుండి క్రిందివరకు అడుగుబల్లను, తేనెగదిని, పిల్లలగదితో బిగించుకొనాలి. ఎండాకాలంలో వేడి ఎక్కువగా ఉన్నసమయంలో పట్టులను ప్రవాసం తీసుకొని వెళ్ళునపుడు వైరుల వలతో ఉన్న లోపలిమూతను వాడుకొనాలి.
  • సుదీర్ఘప్రవాసం అయితే, వేడిగా ఉన్న సమయంలో పైమూతను (Outer cover) తీసివేసుకొనాలి.
  • వైరుతోగాని, పెట్టె బెల్టుతో గాని లేక త్రాడుతోగాని పట్టును బయట కవరును తీయకుండానే కొద్ది దూరపుప్రవాసముల విషయమంలో కట్టుకొనాలి.
  • కూలిఈగలన్నీ సాయంత్రమునకు పట్టుకు చేరుకున్న తరువాత వైరునెట్ తోగాని, గుడ్డముక్కతో గాని పట్టుద్వారమును మూసివేయాలి. ద్వారము వద్ద ఈగలన్నీ గుమికూడి గుంపుగా ఉన్నట్లయితే నీరుచల్లిగాని, లేక పొగబారించుట ద్వారా గాని ఈగలు పట్టులోనికి వెళ్లునట్లుగా ప్రాత్సాహించాలి.

తేనెపట్టుల ప్రవాసము (Bee colonies migration)

  • తేనెపట్టులను, ట్రక్కు లేక ట్రాక్టరు లేక ఆటోరిక్షా, కూలికి మనుష్యులను పెట్టుకొనిగాని ఒకచోట నుండి మరొకచోటికి మార్చుకొనవచ్చును లేక వివిధ పద్దతులను కలిపిగాని, తేనెపట్టులు మొదటిస్థానం నుండి తేనెటీగలకు ఆహారం లభించే స్థలానికి మార్చుకొనవచ్చును.
  • సాధ్యమయినట్లయితే పట్టుల ప్రవాసమును రాత్రిపూట (శీతాకాలం సా||గం.5.00ల నుండి ఉ॥ గం.10.00లు, ఎండాకాలం అయితే సా||గం. 7.00ల నుండి ఉగం. 7.00ల మధ్య) చేపట్టాలి.
  • తేనెపట్టుల మధ్య గాలి ప్రవహించేలా ఉండాలి.
  • తేనెపట్టులను జాగ్రత్తగా ట్రక్కులలో భద్రంగా చేర్చుకొనాలి.
  • వాహనము నెమ్మదిగా సాధ్యమైనంతవరకు ఏవిధమైన ఒడిదుడుకులు లేకుండా నడపాలి.
  • వాహనాన్ని ఎక్కువసేపు ఆపి ఉంచకూడదు. ఒకవేళ రోజంతా లేక ఇంకా ఎక్కువసమయము ఆపివేయాల్సివస్తే పట్టులను వాహనంనుండి దింపి, పట్టుల ద్వారములను తెరచి, ఈగలు ఆహర సేకరణ కొరకు వదలాలి. రాత్రి అయిన తర్వాత తిరిగి ప్యాకింగ్ చేసి తిరిగి వాహనములోనికి లోడు చేసుకొనాలి.
  • గమ్యస్థానము చేరుకున్న తరువాత వాహనమునుండి నెమ్మదిగా ఒకటి తర్వాత ఒకటి జాగ్రత్తగా పట్టులను దించుకొనాలి.
  • ఒక గ్రూపుగా పట్టులను పెట్టుకొనాలి. కనీసం పట్టుకు పట్టుకు మధ్య 5 అడుగులు (1.5మీ) వుండునట్లుగా అమర్చుకొనవలెను.
  • పట్టులను ఆ ప్రాంతంలో పెట్టుకున్న తరువాత పట్టులద్వారాలకున్న గుడ్డ లేక వైరుజల్లెడను ఒకదాని తర్వాత ఒకటి ఒకవైపు ప్రారంభించి రెండవవైపుకు వెళుతూ తీసివేయాలి.
  • ద్వారాల్ని తెరచిన 30నిమిషముల తర్వాత లేక ప్రొద్దుపొడవగానే, ఈగలు బయటకు ఎగురు చున్నవో లేదో గమనించుకోవాలి. ఒకవేళ రెండురోజుల వరకు ఒకపట్టులోని ఈగలు బయటకు ఎగరని పక్షంలో (ఒకవేళ ఈగలు తేనెతోతడిసి చనిపోయిన ఈగలు లేక నేలమీద పారాడుతున్న ఈగలు) ఏమైనప్పటికీ వెంటనే పట్టును పరిశీలించుకొని తగిన చర్యలు చేపట్టాలి.
  • పట్టులను కొన్ని రోజులకు ప్రతిసారి పరిశీలించుకొనాలి. పిల్లలగది ఈగలతో నిండిపోయిన వెంటనే తేనె అరను ఏర్పాటుచేసికొనాలి. తేనె అరలో పాతమైనపుఅట్టలు లేక కృత్రిమ మైనపు అట్టలను పెట్టుకొనాలి.

డా. కె. మోహన్ రావు, ప్రధాన శాస్త్రవేత్త (కీటక విభాగము) మరియు అధిపతి, అఖిల భారత సమన్వయ తేనెటీగలు మరియు పరాగ సంపర్కము జరుపు కీటకముల పరిశోధన పథకము, వ్యవసాయ పరిశోధన స్థానము, విజయరాయి- 534475, ఏలూరు జిల్లా. Ph: 9493304643

జి.అలేఖ్య, యంగ్ ప్రొఫెషనల్ -1, అఖిల భారత సమన్వయ తేనెటీగలు మరియు పరాగ సంపర్కము జరుపు కీటకముల పరిశోధన పథకము, వ్యవసాయ పరిశోధన స్థానము, విజయరాయి -534475, ఏలూరు జిల్లా.

Read More