కామాక్షి చెట్టు మొదలు లావుగా ఉండి మందమైన కార్క్ వంటి బెరడుతో కప్పబడి ఉంటుంది. చెట్టు చివరన పొడవాటి, ప్రకాశవంతమైన ఆకుపచ్చ రంగు, మెరిసే ఆకులు ఏర్పడతాయి. ప్రతి ఆకు 150 నుండి 170 సెం.మీ. పొడవుండి 54 నుండి 110 చిన్న ఆకులు కలిగి ఉంటుంది.. మగ కామాక్షి మొక్కలు పసుపుగోధుమ రంగు అండాకారపు కోన్స్ కలిగి ఉంటాయి. ఇవి 24-48 సెం.మీ. పొడవు, 12-18 సెం.మీ. వ్యాసం కలిగి ఉంటాయి. ఆడ మొక్కలో కోన్స్ ఏర్పడవు. అవి పొడవాటి, ఆకువంటి స్పోరోఫిల్స్పై గింజలు కలిగి ఉంటాయి. అవి కురచగా, వత్తుగా ఉన్న నారింజ రంగు నూగు కలిగి 20-35 సెం.మీ. పొడవుంటాయి. కామాక్షి గింజలు చిన్నవిగా 3-9 మి.మీ. పొడవుండి లేత ఎరుపుపసుపు రంగు గుజ్జుతో కప్పబడి ఉంటాయి. చెట్టు 3-5 మీ. ఎత్తు పెరుగుతుంది.

సాధారణ నామం : సాగోపామ్ శాస్త్రీయ నామం : సైకాస్ సిర్సినాలిస్ కుటుంబం: సైకడేసి
ఉపయోగాలు : ఔషధరంగంలో …
- పుప్పొడి నార్కోటిక్, కామాక్షి మొక్క బెరడు, గింజలను నూరి నూనెతో కలిపి పేస్టు చేసి గాయాలు, వాపులపై పట్టీగా వేస్తారు.
- లేత ఆకుల రసాన్ని వాంతుల చికిత్సలో ఉపయోగిస్తారు. ఈ మొక్క పిత్ నుండి సగ్గుబియ్యం తయారు చేస్తారు. ఆకుల కషాయాన్ని దగ్గు నివారణకు త్రాగుతారు.
వ్యవసాయరంగంలో
- సంప్రదాయ వ్యవసాయంలో కామాక్షి పూలను పురుగుల యాజమాన్యంలో ఉపయోగిస్తారు. దీని మగపూలు కుళ్ళినపుడు ఒక ఘాటైన వాసనని విడుదల చేస్తాయి (మమన్నన్ & నటరాజన్, 2010).
- కామాక్షి మగచెట్టు, పూవులను కోసి వరి పంట స్థాయి కన్నా ఎక్కువ ఎత్తు ఉన్న కర్రలకు కట్టాలి.
- ఈ కర్రలను గడ్డితో చుట్టి పూలను కట్టి వరి పొలంలో 10-15 చోట్ల పాతాలి. వీటి వాసనకు కంకినల్లి పెద్ద పురుగులు వికర్షింపబడి 2 వారాల పాటు పొలంలోకి ప్రవేశించలేవు. ఈ సమయానికి పాలుపోసుకునే దశ పూర్తయి, పంట పరిపక్వ దశకు చేరుకుంటుంది.
- కామాక్షి పూలలో ఉన్న సైకాస్టిన్ అనే రసాయనం కీటకనాశక మరియు నిరోధక లక్షణాలు కలిగి ఉంది. శ్రీలంక వరి రైతులు ‘కెమ్ కామ’ పద్ధతులు అనే పురుగు యాజమాన్య పద్ధతులను మొక్క ఆధారిత పదార్థాలు మరియు సాగు పద్ధతులనుపయోగించి వృద్ది చేశారు. మొక్కలలోని రసాయన పదార్థాలను గురించి అవగాహన లేనప్పటికీ శ్రీలంక వరి రైతులు ఈ విజయవంతమైన సస్యరక్షణ పద్ధతిని వృద్ధి చేయడానికి కొన్ని దేశీయ మొక్కలను గుర్తించారు. ఈ కెమ్ పద్ధతులు పురుగు మందు ప్రభావం, జిగట ఎరలు, దీపపు ఎరలు వంటి వివిధ రకాల చర్యలను కలిగి ఉంటాయి. ఆధునిక విజ్ఞానం వృద్ధి చెందడంతో, కెమ్ పద్ధతిలో దాగి ఉన్న రహస్యాలను ఏ మొక్క ఆధారిత రసాయనం ఏ పురుగుకి సరైన ఎంపిక అనే విషయాన్ని పరిశోధించవచ్చు. వరి పొలాల దగ్గర కదురు (సెర్బెరమ్గడ్డి) కర్రలను మంట పెట్టడం వల్ల దీపపు ఎరతో పాటు రసాయన వికర్షకాన్ని కూడా పురుగుల నివారణకు ఉపయోగించినట్లు పరిగణనలోకి తీసుకోవచ్చు. ఇది ఒక ‘కెమ్ కామ’ పద్ధతి. కామాక్షి పూలలో సైకాసిన్ ఒక ముఖ్య రసాయనం. దీనికి కీటకనాశక మరియు కీటక నిరోధక లక్షణాలున్నాయి. దీని ద్వారా ఆధునిక శాస్త్రీయ పరిశోధనలు పురాతన కెమ్ పద్ధతిలో పోలి వున్నాయని విశదమయింది. ఇటువంటి చర్యలు గల అనేక మొక్క జాతులున్నాయి. జిల్లేడు, మీలియా, క్రోటాన్ లాసిఫర్, యూఫర్బియా యాంటిక్సోరం సంప్రదాయ పద్ధతులతో సరితూగుతున్నాయి. ఇవి పర్యావరణహిత పద్ధతులు.
సంప్రదాయ ‘కెమ’ పద్ధతులు
మొక్క: క్రోటాన్ లాసిఫెర
నివారించబడే పురుగు: వరి కంకినల్లి
పనిచేసే విధానం: మొక్కల కట్టను వరి పొలంలో మొక్కలపై లాగుతూ పోతే వికర్షక చర్యవల్ల నివారించడతాయి.
మొక్క: కదురు
నివారించబడే పురుగు: వరి కంకినల్లి
పనిచేసే విధానం: వరి పొలాల దగ్గర మంటలు వేయడం ద్వారా దీపపు ఎరలా పురుగులను ఆకర్షిస్తుంది.
మొక్క: కామాక్షి
నివారించబడే పురుగు: వరి కంకినల్లి
పనిచేసే విధానం: కామాక్షి మగపూవు కుళ్ళేటపుడు ఘాటైన వాసన విడుదల చేస్తుంది. ఈ మగపూవుని ఉదయం వేళలో కత్తిరించి ఈ భాగాలను కర్రలకు కట్టి వివిధ ప్రాంతాలలో పాతాలి. మరుసటి రోజు ఈ పూల భాగాలపై నీరు చల్లాలి.
మొక్క: మీలియా
నివారించబడే పురుగు: వివిధ పురుగులు
పనిచేసే విధానం: ఘాటైన వాసన గల మీలియా ద్రావణాన్ని తాటాకులపై చల్లి వరి పొలంలో వివిధ ప్రదేశాలలో ఉంచుతారు. ఈ ద్రావణంలోని ఆల్కలాయిడ్లు, ఫ్లేవనాయిడ్స్, టానిన్స్, టెర్పెనిన్స్, ఎసెన్షియల్ ఆయిల్స్ పురుగులను తినకుండా, గుడ్లు పెట్టకుండా నిరోదిస్తాయి.
మొక్క: జిగట ఎరలు
నివారించబడే పురుగు: రసంపీల్చే పురుగులు
పనిచేసే విధానం: ఇతర పురుగులు విసనకర్ర, కర్ర లేదా తాడుకి జిగురు పూసి (జిల్లేడు, పాలపొద పాలు) పంటపై కదిలిస్తే పురుగులు జిగురుకు అంటుకుంటాయి.
మొక్క: దీపపు ఎరలు
నివారించబడే పురుగు: ఎగిరే పురుగులు
పనిచేసే విధానం: మధుకా లాంగిఫోలియా, వేప, కనారం జీవానికం నూనె ద్రావణాలతో దీపాలను వెలిగించి పెడితే ఆకర్షింపబడిన పురుగులను నాశనం చేయాలి.
(విడనపతిరాన అండ్ దస్సనాయకె, 2013).
- కామాక్షి ఓవ్యూలఎండోటెస్టా మిథనాల్ ద్రావణం బాసిల్లస్ సెరియస్, స్టఫైలోకోకస్ ఆరియస్, ఎస్కరిచియా కోలి, క్ౙాంతోమోనాస్ కాంపెస్ట్రిస్ మాల్వేసియారం లపై వాంకోమైసిన్, పెనిసిలిన్, బాక్టీరిమైసిన్ (యాంటిబయాటిక్స్) కన్నా గణనీయంగా అధిక యాంటీబాక్టీరియల్ చర్యను ప్రదర్శించింది (కల్పశ్రీ అండ్ దవీష, 2013).
- వరిలో కాండం తొలుచు పురుగు ఆశించడం గమనించగానే కామాక్షి పూలను నలగ్గొట్టి పొలంలో నిల్వ ఉన్న నీటిలో కలపాలి (విమలకీర్తి, 2002), అమువిత గమ 2002).
- కామాక్షి, వేప, నిమ్మగడ్డి, పొగాకు ఆకులను నీటిలో వేసి మరగించి కొంత సమయం నానబెట్టాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని వడపోసి 2-4 రోజులు నిల్వ ఉంచాలి. తర్వాత కూరగాయల పంటపై పిచికారి చేస్తే ఈ ద్రావణం ఆకుతొలిచే పురుగు, దీపపు పురుగులు, ఆకుగూడు పురుగు, కొమ్మునల్లి, వీవిల్స్, లార్వాలు, చిత్తపురుగులను వికర్షిస్తుంది (ఒకులోన్లోల అండ్ అకిన్రిన్నోల, 2013).
రైతునేస్తం ప్రచురణ ‘ఔషధ వేదం’ పుస్తకం కొరకు ఫోన్: 9676797777కు సంప్రదించండి.

