మొక్కజొన్న పంట సాగు, దిగుబడులు పెరగాలి

మొక్కజొన్నను ఇథనాల్‌ ఉత్పత్తికి వాడటము వలన డిమాండ్‌ భారీగా పెరిగిందని, అందుకు అనుగుణంగా సాగు, దిగుబడులు పెంచేందుకు పరిశోధనలు జరుగుతున్నాయని భారత చిరుధాన్యాల పరిశోధన సంస్థ (ఐఐఎంఆర్‌) డైరెక్టర్‌ హెచ్‌ఎస్‌ జాట్‌ తెలిపారు. హైదరాబాద్‌లో జాతీయ వ్యవసాయ పరిశోధన విస్తరణ సంస్థ (నార్మ్‌)లో ‘మొక్కజొన్న పరిశోధనలో డేటా సేకరణ, విశ్లేషణ’ అంశంపై జాతీయ సదస్సును ప్రారంభించిన ఆయన మాట్లాడుతూ.. డేటా ఆధారిత పరిశోధన విధానాలు మొక్కజొన్న సాగు విస్తరణలో కీలకపాత్ర పోషిస్తాయి. మొక్కజొన్నలు ఇథనాల్‌ ఉత్పత్తికి అనుకూలంగా ఉండటంతో కంపెనీలు అధికశాతం ఆ పంట వైపు మొగ్గు చూపుతున్నాయి’ అని సూచించారు. నార్మ్‌ డైరెక్టర్‌ గోపాల్‌ లాల్‌, డైరెక్టర్‌ ఆఫ్‌ పౌల్ట్రీ రీసెర్చ్‌ ఛటర్జీ, అగ్రివర్సిటీ సీడ్స్‌ డైరెక్టర్‌ నగేశ్‌కుమార్‌ లుథియానా వ్యవసాయ శాస్త్రవేత్త సునిల్‌ పాల్గొన్నారు.

Read More

పొగాకు పంటను ఫసల్‌ బీమా యోజనలో చేర్చేలా కృషి

గుంటూరులోని శ్రీకన్వెన్షన్‌లో పొగాకు బోర్డు 50వ వసంతాల వేడుకలు శుక్రవారం జరిగాయి. ముఖ్య అతిథిగా హాజరైన యశ్వంత్‌ కుమార్‌ మాట్లాడుతూ 1976లో అప్పటి కేంద్ర మంత్రి కొత్త రఘురామయ్య, ఆచార్య ఎన్‌.జి. రంగా తదితర నాయకుల కృషితో గుంటూరులో ఏర్పాటైన పొగాకు బోర్డు రైతుల అభివృద్ధి, సంక్షేమం కోసం 50 సంవత్సరాలుగా కృషి చేస్తోందన్నారు. భారత్‌ నుంచి 100 మిలియన్‌ కిలోల పొగాకును విదేశాలకు విక్రయిస్తుంటే.. అనధికారికంగా 30 మిలియన్‌ కిలోలను విక్రయించడం వల్ల రూ.750 కోట్లు కోల్పోతుండటంతో అనధికారిక విక్రయాలను నివారించేలా ప్రధాని మోదీ ఆదేశాలు జారీ చేశారన్నారు. రానున్న రబీ సీజన్‌ నాటికి ప్రధాన మంత్రి ఫసల్‌ బీమా యోజన కింద పొగాకు పంటను చేర్చేలా చూస్తాం’ అని భారత పొగాకు బోర్డు ఛైర్మన్‌ చిడిపోతు యశ్వంతకుమార్‌ అన్నారు. పొగాకు బోర్డు కార్యనిర్వాహక సంచాలకులు (ఈడీ) బి. విశ్వశ్రీ మాట్లాడుతూ సంపూర్ణ ఆన్‌లైన్‌ విధానంలో రైతుల పేర్ల నమోదు, యాప్‌ను తీసుకొస్తున్నామని వివరించారు. పొగాకు బోర్డు వేలం విభాగం సంచాలకుడు శ్రీనివాస్‌, ఐసీఏఆర్‌-నిర్కా సంచాలకుడు ఎం. శేషుమాధవ్‌, ఐటీఏ కార్యదర్శి వై. అంకమ్మచౌదరి ప్రసంగించారు. బ్యారన్‌ ఎన్యుమరేషన్‌ యాప్‌తోపాటు తెలుగు, కన్నడ, ఆంగ్లం, హిందీ భాషల్లో పొగాకు బోర్డు వెబ్‌సైట్లను అతిథులు ప్రారంభించారు. ఈడీ విశ్వశ్రీ పొగాకు బోర్డు 2026 డైరీని, తెలుగుభాషలో గుడ్‌ అగ్రికల్చరల్‌ ప్రాక్టీసెస్‌ పుస్తకాలను ఆవిష్కరించారు. ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన 26 మంది ఉత్తమ రైతులకు పురస్కారాలు అందజేశారు. సమావేశంలో పొగాకు బోర్డు కార్యదర్శి డి.వేణుగోపాల్‌, మాజీ ఛైర్మన్‌ యడ్లపాటి రఘునాథబాబు, మాజీ ఎమ్మెల్యే మొహమ్మద్‌ ముస్తఫా, పాలకమండలి సభ్యులు, రైతులు, వ్యాపారులు పాల్గొన్నారు.

Read More

పంట మార్పిడి, సేంద్రియ వ్యవసాయంపై అవగాహన కల్పించాలి

ఉద్యాన పంటలు, పప్పుదినుసుల సాగు పెంపుదలకు కృషి చేయాలని.. పంట మార్పిడి, సేంద్రియ వ్యవసాయంపై రైతుల్లో అవగాహన కల్పించాలని, దీని కోసం క్షేత్రస్థాయి పర్యటనలు చేపట్టాలని వరి మాదిరిగానే ఇతర పంటల రైతులకు ప్రోత్సాహకాలు ఇవ్వాలని యోచిస్తున్నామని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రైతు కమిషన్‌కు తెలిపారు. శుక్రవారం కమిషన్‌ ఛైర్మన్‌ కోదండరెడ్డి, సభ్యులు గంగాధర్‌, కేవీఎన్‌ రెడ్డి, భవాని, గోపాల్‌రెడ్డి, సునీల్‌లు సీఎంను శాసనసభ ప్రాంగణంలో కలిశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ”రాష్ట్రంలో కూరగాయలు, పండ్ల సాగు పెరగాలి. సంప్రదాయ పంటల సాగును ప్రోత్సహించాలి. ఈ మేరకు ప్రణాళిక రూపొందించి నివేదిక సమర్పించాలి. దాన్ని ప్రభుత్వం ఆచరిస్తుంది” అని తెలిపారు. కేరళ మాదిరిగా ఉద్యాన పంటలు, కౌలు రైతుల విధానాన్ని తెలంగాణలోనూ అమలు చేయాలని కోదండరెడ్డి కోరారు.

Read More

సబ్సిడీపై పాడి పశువులు

తెలంగాణా రాష్ట్రంలోని మహిళా స్వయంసహాయక సంఘాల సభ్యులకు ఒక్కొక్కరికీ రెండేసి పాడి గేదెలు / ఆవులను ఇందిరా డెయిరీ ప్రాజెక్టు కింద పంపిణీ చేయనుంది. ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రాతినిధ్యం వహిస్తున్న మధిర నియోజకవర్గంలో దీనిని పైలట్‌ ప్రాజెక్టుగా చేపట్టింది. రాష్ట్రంలోని కొడంగల్‌ సహా ఇతర ప్రాంతాలకు దీనిని విస్తరించేందుకు కార్యాచరణను సిద్ధం చేస్తోంది. రాష్ట్రంలో పాల కొరత తీవ్రంగా ఉంది. రోజూ 30 లక్షల లీటర్లు వినియోగమవుతుండగా.. ప్రభుత్వ రంగ సంస్థ విజయ డెయిరీకి పాడి రైతులు కేవలం 4 లక్షల లీటర్లు సరఫరా చేస్తున్నారు. మిగిలిన 26 లక్షల లీటర్లను ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో పాడి పరిశ్రమను ప్రోత్సహించాలని రాష్ట్ర పాడి పరిశ్రమాభివృద్ధి సమాఖ్య ప్రభుత్వాన్ని కోరింది. దీంతో ప్రభుత్వం ఇందిరా డెయిరీ ప్రాజెక్టుపై దృష్టి సారించింది. ఈ పథకం కింద ప్రతి మండలాన్ని మూడు జోన్లుగా విభజిస్తారు. ప్రతి పది గ్రామాలను ఒక యూనిట్‌గా ఏర్పాటు చేస్తారు. ఒక్కో మహిళా స్వయం సహాయక సంఘ సభ్యురాలికి రూ.2 లక్షల యూనిట్‌ ధరతో రెండు పాడి గేదెలు/ఆవులను అందజేస్తారు. ఈ సొమ్ములో రాష్ట్ర ప్రభుత్వం 70 శాతం సబ్సిడీ(రూ.1.40 లక్షలు)గా అందజేస్తుంది. మిగిలిన 30 శాతం (రూ.60 వేలు) లబ్ధిదారు వాటాగా బ్యాంకులు రుణంగా ఇస్తాయి. రవాణా కోసం ప్రభుత్వం ట్రాలీ ఆటోలను అందజేస్తుంది. షెడ్లకు సౌరవిద్యుత్‌ సదుపాయాన్ని కల్పిస్తుంది. పశువుల ఆరోగ్యం కోసం పశువైద్యులు ప్రతి నెలా తనిఖీలు చేసి హెల్త్‌ కార్డులు జారీ చేస్తారు.
మధిర నియోజకవర్గంలోని మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యుల కోసం ఇందిరా డెయిరీ పైలట్‌ ప్రాజెక్టును ప్రభుత్వం ప్రారంభించింది. రూ. 781.82 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేసింది. దీనికి బీసీ సంక్షేమశాఖ ద్వారా ఇప్పటికే రూ.286 కోట్లను విడుదల చేసింది. తాజాగా మరో రూ.124.92 కోట్ల విడుదలకు పరిపాలన అనుమతి లభించింది. మరో రూ.370 కోట్ల మేరకు నిధులు విడుదల కావాల్సి ఉంది.

Read More

34.60 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేశాము

ప్రస్తుత ఖరీఫ్‌లో 34.60 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని, ఇది గతేడాది కంటే ఎనిమిది లక్షల మెట్రిక్‌ టన్నులు అదనం అని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌ తెలిపారు. సచివాలయంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. 5.59 లక్షల మంది రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యానికి రూ.8,206 కోట్లు చెల్లించాం. రైతులు నష్టపోకుండా మద్దతుధర అందించాం. ఎన్టీఆర్‌ భరోసా కింద రూ.50 వేల కోట్లు పింఛన్ల కింద ప్రజలకు అందజేశాం. ప్రస్తుతం పెద్దఎత్తున రోడ్లు నిర్మిస్తున్నాం. ఇందుకోసం తాజాగా రూ.2,500 కోట్లు కేటాయించాం. ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ పల్లె పండగ కార్యక్రమాన్ని చేపట్టి, పెద్దఎత్తున అభివృద్ధి పనులు చేయిస్తున్నారు. డేటా లేక్‌ ద్వారా ప్రజలకు ఇంకా మెరుగైన సేవలు అందించాలని సీఎం చంద్రబాబు సూచించారు. రాష్ట్రాన్ని మూడు క్లస్టర్లుగా విభజించి, పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తున్నాం. శాంతిభద్రతల పరిరక్షణలో ప్రభుత్వం తగు చర్యలు తీసుకుంటోంది’ అని మనోహర్‌ వివరించారు.

Read More

సరిపడా యూరియా నిల్వలు

యాసంగి సీజన్‌కు రాష్ట్రంలో సరిపడా యూరియా నిల్వలున్నందున యూరియా సరఫరాలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు రానీయొద్దని తెలంగాణా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కలెక్టర్లను ఆదేశించారు. సోమవారం సచివాలయంలో ఆయన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సబ్యసాచి ఘోష్‌లతో కలిసి కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ”ప్రస్తుతం రాష్ట్రంలో 2.15 లక్షల టన్నుల యూరియా నిల్వలున్నాయి. ఇంటి నుంచి బుకింగ్‌ కోసం ఏర్పాటుచేసిన యాప్‌ ద్వారా 82,059 మంది 2,01,789 బస్తాలు కొనుగోలు చేశారు. జిల్లాల వారీగా యూరియా నిల్వలు, డిమాండ్‌, పంపిణీపై కలెక్టర్లు పరిశీలిస్తూ అవసరమైతే అదనపు కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలి” అని మంత్రి సూచించారు.

సహకార సంఘాలను బలోపేతం కోసం పటిష్ఠ చర్యలు
తెలంగాణలో సహకార సంఘాల బలోపేతం కోసం రాష్ట్ర ప్రభుత్వం పటిష్ఠ చర్యలు తీసుకుంటోందని హైదరాబాద్‌లో నాబార్డు ఆధ్వర్యంలో జరిగిన అంతర్జాతీయ సహకార వారోత్స వాల సదస్సులో మంత్రి తుమ్మల తెలిపారు. ”సహకార సంఘాలను కంప్యూటరీకరించి డిజిటల్‌ సేవలు అందించాం. ఆధార్‌ ఆధారిత చెల్లింపులు, బీమా సాయం అందిస్తున్నాం. 2024- 25లో పీఏసీఎస్‌ ద్వారా రైతులకు రూ.7,500 కోట్ల రుణాలు ఇచ్చాం. 311 సంఘాలను రైతు ఉత్పత్తి సంఘాలుగా మారుస్తున్నాం” అని తుమ్మల తెలిపారు. వంథాతం రుణాల రికవరీ, వ్యాపార నిర్వహణలో పురోగతి సాధించిన 11 ప్రాథమిక వ్యవసాయ సంఘాలకు ఈ సందర్భంగా మంత్రి పురస్కారాలు అందించారు. సమావేశంలో నాబార్డు తెలంగాణ, మహారాష్ట్రల సీజీఎంలు ఉదయభాస్కర్‌, మణికుమార్‌, ఆర్బీఐ ప్రాంతీయ సంచాలకుడు చిన్మయ్‌కుమార్‌, ఎన్‌సీడీసీ రీజనల్‌ డైరెక్టర్‌ శార్దూల్‌ జాదవ్‌, రాష్ట్ర సహకార బ్యాంకుల సంఘం జాతీయ చైర్మన్‌ కొండూరి రవీందర్రావు, తెలంగాణ ఫిషరీస్‌ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ సాయికుమార్‌, తదితరులు పాల్గొన్నారు.

Read More

సాగు పరికరాలు అద్దెకు

రైతులకు పెట్టుబడి ఖర్చులు తగ్గేలా సాగుకు అవసరమైన పరికరాలను అద్దెకు ఇచ్చేందుకు కస్టమ్‌ హైరింగ్‌ సెంటర్ల (సీహెచ్‌సీ)ను ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అందుబాటులోకి తీసుకురానుంది. డ్వాక్రా మహిళా రైతులతో (వారి కుటుంబ సభ్యులు)కూడిన ఎఫ్‌పీవోల ఆధ్వర్యంలో ఇవి పనిచేస్తాయి. రాష్ట్రవ్యాప్తంగా 520 ఫార్మర్‌ ప్రొడ్యూస్‌ ఆర్గనైజేషన్లు (ఎఫ్‌పీవో) ఉండగా వాటి పరిధిలో తొలి విడతగా 300 సీహెచ్‌సీలను ఏర్పాటు చేయనున్నారు. వచ్చే ఏడాది మార్చి నాటికి ఇవి అందుబాటులోకి రానున్నాయి. వ్యవసాయం, ఉద్యాన, పశుసంవర్ధకశాఖల సహకారంతో ఈ పథకాన్ని అమలు చేయనున్నారు.

60 కోట్లు కేటాయింపు
జాతీయ జీవనోపాధుల కార్యక్రమం కింద సీహెచ్‌సీల నిర్వహణకు కేంద్ర ప్రభుత్వం 60 కోట్లు కేటాయించింది. రాష్ట్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో ఈ కేంద్రాలను నిర్వహిస్తారు. సీహెచ్‌సీల ఏర్పాటుకు ఒక్కో ఎఫ్‌పీవోకు రూ.20 లక్షలు చొప్పున ప్రభుత్వం ఇప్పటికే విడుదల చేసింది.

రైతులకు స్థానికంగా అవసరమయ్యే పరికరాలే అందుబాటులో ఉంచుతారు
రాష్ట్రవ్యాప్తంగా ఒక్కో ఎఫ్‌పీవో పరిధిలో 1500 నుంచి 2 వేల మంది సన్నచిన్నకారు రైతులు సభ్యులుగా ఉన్నారు. ఇవి మండలానికి ఒకటి చొప్పున ఉన్నాయి. రైతులకు స్థానికంగా అవసరమయ్యే పరికరాలను కొని సీహెచ్‌సీల్లో ఉంచుతారు. రైతులకు ఈ పరికరాలను బహిరంగ మార్కెట్‌ కంటే తక్కువ ధరకు అద్దెకిస్తారు. సీహెచ్‌సీల నిర్వహణను ఎఫ్‌పీవోనే చూస్తుంది. వచ్చిన ఆదాయాన్ని తిరిగి వాటి నిర్వహణకే వెచ్చిస్తారు.

Read More

వ్యవసాయ యంత్రపరికరాలపై 50% సబ్సిడీ

గతంలో ఆగిపోయిన వ్యవసాయ యాంత్రీకరణ పథకం పునరుద్ధరణకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో రూ.101.83 కోట్లతో ఈ పథకాన్ని అమలు చేయనుంది. సన్నకారు, చిన్న, ఎస్సీ, ఎస్టీ, మహిళా రైతులకు 50 శాతం, ఇతరులకు 40 శాతం సబ్సిడీతో 1,31,182 వ్యవసాయ పరికరాలు మంజూరు చేసేందుకు వ్యవసాయశాఖ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. వీటికయ్యే ఖర్చులో కేంద్రం 60%, రాష్ట్రం 40% భరించనున్నాయి. వ్యవసాయ యాంత్రీకరణ (సబ్‌ మిషన్‌ ఆన్‌ అగ్రికల్చరల్‌ మెకనైజేషన్‌-స్మామ్‌) పథకం కింద కేంద్రం ఇస్తున్న నిధులకు తమ వాటా కలిపి పథకాన్ని అమలు చేసేందుకు రాష్ట్రం సన్నద్ధమైంది.

మార్గదర్శకాలు…
పేరొందిన 16 కంపెనీలను గుర్తించి ఎంప్యానెల్‌లో చేర్చింది. వాటి నుంచి రైతులు స్వయంగా పరికరాలను కొనుగోలు చేయాలి. సబ్సిడీని కంపెనీలకు అందజేస్తారు. పంపిణీ చేసిన పరికరాల వినియోగాన్ని వ్యవసాయాధికారులు ఐదేళ్లపాటు పర్యవేక్షించేలా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. గతంలో రూ.లక్ష కంటే ఎక్కువ సబ్సిడీ పొందిన వారు ఆరేళ్లవరకు, రూ.3 వేల నుంచి రూ.లక్ష వరకు పొందిన వారు మూడేళ్ల వరకు మళ్లీ దరఖాస్తు చేసుకోవడానికి అనర్హులుగా ప్రకటించింది. రూ. లక్ష, అంత కంటే ఎక్కువ విలువైన యంత్రాలకు జియో ట్యాగింగ్‌ చేస్తారు. ట్రాక్టర్లు, ఇతర స్వయం చాలిత యంత్రాలకు ఏఐ-ఆధారిత టెలిమాటిక్స్‌ కిట్‌ అమరుస్తారు. దీంతో యంత్రం ఎక్కడ ఉందో, ఎంత పని చేసిందో ట్రాక్‌ చేయవచ్చు. యంత్రాలపై చెరిపివేసే వీలు లేకుండా లేజర్‌ కట్‌తో గుర్తింపు సంఖ్య ఉంటుంది.

సబ్సిడీపై అందుబాటులో ఉండే యంత్రాలు…
విత్తనాలు చల్లే యంత్రాలు, కోత యంత్రాలు, స్ప్రేయర్లు, ట్రాక్టర్లతో నడిచే రొటోవేటర్లు, ప్లౌ, ట్రాలీ, సీడర్‌, కలుపు తీసే యంత్రాలు, పవర్‌ టిల్లర్లు, వీడర్లు, సీడ్‌ కమ్‌ ఫెర్టిలైజర్‌ డ్రిల్‌, స్ట్రాబాలర్లు, బండ్‌ ఫార్మర్‌ వంటి 15 రకాల యంత్రాలకు ఈ సబ్సిడీ వర్తింపజేస్తున్నారు. ప్రభుత్వం త్వరలో వీటిని పంపిణీ ప్రారంభించనుంది. ఈ పరికరాలతో పంటల దిగుబడి పెరగడంతో పాటు వ్యవసాయ పనుల్లో సమయం, ఖర్చు రెండూ తగ్గుతాయని అధికారులు అంటున్నారు.

Read More

మూడు ఎకరాలకు 391 టన్నుల చెరకు దిగుబడి

కర్ణాటకలోని బెళగావి జిల్లా కల్లోళి గ్రామానికి చెందిన 72 ఏండ్ల అభ్యుదయ రైతు బాళప్ప బసప్ప బెళకోడ మూడెకరాల్లో పండిన మొత్తం 391 టన్నుల చెరకును మిల్లుకు తరలించి రూ.12,90,300 బిల్లును పొందారు. ‘సీఓ 86032’ రకం చెరకును నాటుకున్నారు. ‘నాటే ముందు మట్టి పరీక్షలు చేయించా. ఫలితాల ఆధారంగా భూమికి అవసరమైన పోషకాల కోసం సేంద్రియ, పరిమితంగా రసాయనిక ఎరువులను డ్రిప్‌ ద్వారా తోటకు అందించా. ఎకరానికి రూ.65 వేల చొప్పున ఖర్చు వచ్చింది. చెరకు ఎదిగే వరకూ అంతర పంటలుగా మినుము, శనగ, టమాటా, ఉల్లి పండించా. వాటి ఫలసాయం అందాక ఆ మొక్కలను తోటలోనే తొక్కి, ఎరువుగా మార్చా. జీవామృతం, సేంద్రియ ఎరువులు, వర్మీ కంపోస్టును స్వయంగా చేసుకుంటున్నా. సాగు విధానాలు తెలుసుకునేందుకు చైనా, ఇజ్రాయెల్‌, జపాన్‌లకు వెళ్లి వచ్చా. ఎకరానికి 200 టన్నుల దిగుబడి సాధించే దిశగా ఈసారి ఐదెకరాల్లో చెరకు సాగు చేయాలనుకుంటున్నా’ అని బాళప్ప వివరించారు.

Read More

విష పురుగులను పారదోలే ప్రత్యేక కర్ర!

రైతులకు పాముకాట్లు, తేలుకాట్ల బెడద ఎక్కువ. గుజరాత్‌లోని సర్‌ భావసింహ్‌ాజీ పాలిటెక్నిక్‌ కళాశాలకు చెందిన మెకానికల్‌ ఇంజనీరింగ్‌ విద్యార్థి క్రిష్‌ దోడియా, అతడి మిత్రుడు కలిసి ఈ విషపురుగులను పారదోలే ప్రత్యేక కర్రను రూపొందించారు. ఈ కర్ర మూడున్నర మీటర్ల పీవీసీ పైపులో మూడున్నర మీటర్ల వైరు, ఒక స్ప్రింగు, ఒక డీసీ మోటార్‌, రెండు లిథియం బ్యాటరీలు, ఒక బ్యాటరీ కేస్‌, టీ జాయింట్‌, ఒక క్యాప్‌తో రూపొందింది. దీన్ని నేలకు తాకిస్తే ప్రకంపనలు వచ్చి పాములు, తేళ్లను పారదోలతాయి. ఈ కర్ర తయారీకి అయిన ఖర్చు కేవలం రూ.410. దీనికి ఎల్‌ఈడీ బల్బులు అమర్చవచ్చు. రైతు పాముకాటుకు గురైతే పక్కవారిని హెచ్చరించడానికి బజర్‌ను ఏర్పాటు చేసుకోవచ్చు. అలాగే కర్రకు ప్రాథమిక చికిత్స సాధనాలతో చిన్న సంచిని అమర్చవచ్చు. బాధితుడిని ఆస్పత్రికి తీసుకెళ్లేలోపల పాము, తేలు విషం వ్యాప్తిని నిదానింపజేసే మాత్రలనూ ఆ సంచిలో అందించవచ్చు.

Read More