తెలంగాణా రాష్ట్రంలోని మహిళా స్వయంసహాయక సంఘాల సభ్యులకు ఒక్కొక్కరికీ రెండేసి పాడి గేదెలు / ఆవులను ఇందిరా డెయిరీ ప్రాజెక్టు కింద పంపిణీ చేయనుంది. ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రాతినిధ్యం వహిస్తున్న మధిర నియోజకవర్గంలో దీనిని పైలట్ ప్రాజెక్టుగా చేపట్టింది. రాష్ట్రంలోని కొడంగల్ సహా ఇతర ప్రాంతాలకు దీనిని విస్తరించేందుకు కార్యాచరణను సిద్ధం చేస్తోంది. రాష్ట్రంలో పాల కొరత తీవ్రంగా ఉంది. రోజూ 30 లక్షల లీటర్లు వినియోగమవుతుండగా.. ప్రభుత్వ రంగ సంస్థ విజయ డెయిరీకి పాడి రైతులు కేవలం 4 లక్షల లీటర్లు సరఫరా చేస్తున్నారు. మిగిలిన 26 లక్షల లీటర్లను ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో పాడి పరిశ్రమను ప్రోత్సహించాలని రాష్ట్ర పాడి పరిశ్రమాభివృద్ధి సమాఖ్య ప్రభుత్వాన్ని కోరింది. దీంతో ప్రభుత్వం ఇందిరా డెయిరీ ప్రాజెక్టుపై దృష్టి సారించింది. ఈ పథకం కింద ప్రతి మండలాన్ని మూడు జోన్లుగా విభజిస్తారు. ప్రతి పది గ్రామాలను ఒక యూనిట్‌గా ఏర్పాటు చేస్తారు. ఒక్కో మహిళా స్వయం సహాయక సంఘ సభ్యురాలికి రూ.2 లక్షల యూనిట్ ధరతో రెండు పాడి గేదెలు/ఆవులను అందజేస్తారు. ఈ సొమ్ములో రాష్ట్ర ప్రభుత్వం 70 శాతం సబ్సిడీ(రూ.1.40 లక్షలు)గా అందజేస్తుంది. మిగిలిన 30 శాతం (రూ.60 వేలు) లబ్ధిదారు వాటాగా బ్యాంకులు రుణంగా ఇస్తాయి. రవాణా కోసం ప్రభుత్వం ట్రాలీ ఆటోలను అందజేస్తుంది. షెడ్లకు సౌరవిద్యుత్ సదుపాయాన్ని కల్పిస్తుంది. పశువుల ఆరోగ్యం కోసం పశువైద్యులు ప్రతి నెలా తనిఖీలు చేసి హెల్త్ కార్డులు జారీ చేస్తారు.
మధిర నియోజకవర్గంలోని మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యుల కోసం ఇందిరా డెయిరీ పైలట్ ప్రాజెక్టును ప్రభుత్వం ప్రారంభించింది. రూ. 781.82 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేసింది. దీనికి బీసీ సంక్షేమశాఖ ద్వారా ఇప్పటికే రూ.286 కోట్లను విడుదల చేసింది. తాజాగా మరో రూ.124.92 కోట్ల విడుదలకు పరిపాలన అనుమతి లభించింది. మరో రూ.370 కోట్ల మేరకు నిధులు విడుదల కావాల్సి ఉంది.

2 Jan, 2026
