ఎకరా వరకూ.. రైతు భరోసా నిధులు విడుదల

యాసంగి సీజన్‌కు పంటల పెట్టుబడి కోసం తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం మొదటి విడతలో 68,89,955 మంది రైతులకు రూ.3,446.94 కోట్లను రైతు భరోసా కింద ఆదివారం నిధుల విడుదలకు ఆమోదం తెలిపింది. ఆదివారం సెలవు దినం కావడంతో సోమవారం ఈ నిధులు రైతుల ఖాతాల్లో జమ కానున్నాయి. మొదటి విడతలో ఎకరం వరకు భూమి ఉన్న వారిని పరిగణనలోకి తీసుకొని 57,44,907.19 ఎకరాలకు ఈ సాయం విడుదల చేస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. ఎకరాకు రూ. 6 వేల చొప్పున విడుదల చేశారు. నిధుల్లో అత్యధికంగా నల్గొండ జిల్లాలో 5,22,313 మంది రైతులకు రూ. 268.57 కోట్లు విడుదలయ్యాయి. అత్యల్పంగా మేడ్చల్ జిల్లాలో 24,935 మంది రైతులకు రూ.10.43 కోట్లు విడుదలయ్యాయి. సోమవారం ఉదయం నుంచి రైతుల ఖాతాల్లో నిధులు జమ అవుతాయని… ఆమేరకు బ్యాంకుల నుంచి సందేశాలు వస్తాయని వ్యవసాయ అధికారులు తెలిపారు. ఎకరం వరకు భూమి ఉండి, నిధులు జమ కాని వారు సంబంధిత వ్యవసాయాధికారిని సంప్రదించాలని సూచించారు.

Read More

సబ్సిడీపై పాడి పశువులు

తెలంగాణా రాష్ట్రంలోని మహిళా స్వయంసహాయక సంఘాల సభ్యులకు ఒక్కొక్కరికీ రెండేసి పాడి గేదెలు / ఆవులను ఇందిరా డెయిరీ ప్రాజెక్టు కింద పంపిణీ చేయనుంది. ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రాతినిధ్యం వహిస్తున్న మధిర నియోజకవర్గంలో దీనిని పైలట్‌ ప్రాజెక్టుగా చేపట్టింది. రాష్ట్రంలోని కొడంగల్‌ సహా ఇతర ప్రాంతాలకు దీనిని విస్తరించేందుకు కార్యాచరణను సిద్ధం చేస్తోంది. రాష్ట్రంలో పాల కొరత తీవ్రంగా ఉంది. రోజూ 30 లక్షల లీటర్లు వినియోగమవుతుండగా.. ప్రభుత్వ రంగ సంస్థ విజయ డెయిరీకి పాడి రైతులు కేవలం 4 లక్షల లీటర్లు సరఫరా చేస్తున్నారు. మిగిలిన 26 లక్షల లీటర్లను ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో పాడి పరిశ్రమను ప్రోత్సహించాలని రాష్ట్ర పాడి పరిశ్రమాభివృద్ధి సమాఖ్య ప్రభుత్వాన్ని కోరింది. దీంతో ప్రభుత్వం ఇందిరా డెయిరీ ప్రాజెక్టుపై దృష్టి సారించింది. ఈ పథకం కింద ప్రతి మండలాన్ని మూడు జోన్లుగా విభజిస్తారు. ప్రతి పది గ్రామాలను ఒక యూనిట్‌గా ఏర్పాటు చేస్తారు. ఒక్కో మహిళా స్వయం సహాయక సంఘ సభ్యురాలికి రూ.2 లక్షల యూనిట్‌ ధరతో రెండు పాడి గేదెలు/ఆవులను అందజేస్తారు. ఈ సొమ్ములో రాష్ట్ర ప్రభుత్వం 70 శాతం సబ్సిడీ(రూ.1.40 లక్షలు)గా అందజేస్తుంది. మిగిలిన 30 శాతం (రూ.60 వేలు) లబ్ధిదారు వాటాగా బ్యాంకులు రుణంగా ఇస్తాయి. రవాణా కోసం ప్రభుత్వం ట్రాలీ ఆటోలను అందజేస్తుంది. షెడ్లకు సౌరవిద్యుత్‌ సదుపాయాన్ని కల్పిస్తుంది. పశువుల ఆరోగ్యం కోసం పశువైద్యులు ప్రతి నెలా తనిఖీలు చేసి హెల్త్‌ కార్డులు జారీ చేస్తారు.
మధిర నియోజకవర్గంలోని మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యుల కోసం ఇందిరా డెయిరీ పైలట్‌ ప్రాజెక్టును ప్రభుత్వం ప్రారంభించింది. రూ. 781.82 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేసింది. దీనికి బీసీ సంక్షేమశాఖ ద్వారా ఇప్పటికే రూ.286 కోట్లను విడుదల చేసింది. తాజాగా మరో రూ.124.92 కోట్ల విడుదలకు పరిపాలన అనుమతి లభించింది. మరో రూ.370 కోట్ల మేరకు నిధులు విడుదల కావాల్సి ఉంది.

Read More

సరిపడా యూరియా నిల్వలు

యాసంగి సీజన్‌కు రాష్ట్రంలో సరిపడా యూరియా నిల్వలున్నందున యూరియా సరఫరాలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు రానీయొద్దని తెలంగాణా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కలెక్టర్లను ఆదేశించారు. సోమవారం సచివాలయంలో ఆయన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సబ్యసాచి ఘోష్‌లతో కలిసి కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ”ప్రస్తుతం రాష్ట్రంలో 2.15 లక్షల టన్నుల యూరియా నిల్వలున్నాయి. ఇంటి నుంచి బుకింగ్‌ కోసం ఏర్పాటుచేసిన యాప్‌ ద్వారా 82,059 మంది 2,01,789 బస్తాలు కొనుగోలు చేశారు. జిల్లాల వారీగా యూరియా నిల్వలు, డిమాండ్‌, పంపిణీపై కలెక్టర్లు పరిశీలిస్తూ అవసరమైతే అదనపు కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలి” అని మంత్రి సూచించారు.

సహకార సంఘాలను బలోపేతం కోసం పటిష్ఠ చర్యలు
తెలంగాణలో సహకార సంఘాల బలోపేతం కోసం రాష్ట్ర ప్రభుత్వం పటిష్ఠ చర్యలు తీసుకుంటోందని హైదరాబాద్‌లో నాబార్డు ఆధ్వర్యంలో జరిగిన అంతర్జాతీయ సహకార వారోత్స వాల సదస్సులో మంత్రి తుమ్మల తెలిపారు. ”సహకార సంఘాలను కంప్యూటరీకరించి డిజిటల్‌ సేవలు అందించాం. ఆధార్‌ ఆధారిత చెల్లింపులు, బీమా సాయం అందిస్తున్నాం. 2024- 25లో పీఏసీఎస్‌ ద్వారా రైతులకు రూ.7,500 కోట్ల రుణాలు ఇచ్చాం. 311 సంఘాలను రైతు ఉత్పత్తి సంఘాలుగా మారుస్తున్నాం” అని తుమ్మల తెలిపారు. వంథాతం రుణాల రికవరీ, వ్యాపార నిర్వహణలో పురోగతి సాధించిన 11 ప్రాథమిక వ్యవసాయ సంఘాలకు ఈ సందర్భంగా మంత్రి పురస్కారాలు అందించారు. సమావేశంలో నాబార్డు తెలంగాణ, మహారాష్ట్రల సీజీఎంలు ఉదయభాస్కర్‌, మణికుమార్‌, ఆర్బీఐ ప్రాంతీయ సంచాలకుడు చిన్మయ్‌కుమార్‌, ఎన్‌సీడీసీ రీజనల్‌ డైరెక్టర్‌ శార్దూల్‌ జాదవ్‌, రాష్ట్ర సహకార బ్యాంకుల సంఘం జాతీయ చైర్మన్‌ కొండూరి రవీందర్రావు, తెలంగాణ ఫిషరీస్‌ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ సాయికుమార్‌, తదితరులు పాల్గొన్నారు.

Read More

వ్యవసాయ యంత్రపరికరాలపై 50% సబ్సిడీ

గతంలో ఆగిపోయిన వ్యవసాయ యాంత్రీకరణ పథకం పునరుద్ధరణకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో రూ.101.83 కోట్లతో ఈ పథకాన్ని అమలు చేయనుంది. సన్నకారు, చిన్న, ఎస్సీ, ఎస్టీ, మహిళా రైతులకు 50 శాతం, ఇతరులకు 40 శాతం సబ్సిడీతో 1,31,182 వ్యవసాయ పరికరాలు మంజూరు చేసేందుకు వ్యవసాయశాఖ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. వీటికయ్యే ఖర్చులో కేంద్రం 60%, రాష్ట్రం 40% భరించనున్నాయి. వ్యవసాయ యాంత్రీకరణ (సబ్‌ మిషన్‌ ఆన్‌ అగ్రికల్చరల్‌ మెకనైజేషన్‌-స్మామ్‌) పథకం కింద కేంద్రం ఇస్తున్న నిధులకు తమ వాటా కలిపి పథకాన్ని అమలు చేసేందుకు రాష్ట్రం సన్నద్ధమైంది.

మార్గదర్శకాలు…
పేరొందిన 16 కంపెనీలను గుర్తించి ఎంప్యానెల్‌లో చేర్చింది. వాటి నుంచి రైతులు స్వయంగా పరికరాలను కొనుగోలు చేయాలి. సబ్సిడీని కంపెనీలకు అందజేస్తారు. పంపిణీ చేసిన పరికరాల వినియోగాన్ని వ్యవసాయాధికారులు ఐదేళ్లపాటు పర్యవేక్షించేలా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. గతంలో రూ.లక్ష కంటే ఎక్కువ సబ్సిడీ పొందిన వారు ఆరేళ్లవరకు, రూ.3 వేల నుంచి రూ.లక్ష వరకు పొందిన వారు మూడేళ్ల వరకు మళ్లీ దరఖాస్తు చేసుకోవడానికి అనర్హులుగా ప్రకటించింది. రూ. లక్ష, అంత కంటే ఎక్కువ విలువైన యంత్రాలకు జియో ట్యాగింగ్‌ చేస్తారు. ట్రాక్టర్లు, ఇతర స్వయం చాలిత యంత్రాలకు ఏఐ-ఆధారిత టెలిమాటిక్స్‌ కిట్‌ అమరుస్తారు. దీంతో యంత్రం ఎక్కడ ఉందో, ఎంత పని చేసిందో ట్రాక్‌ చేయవచ్చు. యంత్రాలపై చెరిపివేసే వీలు లేకుండా లేజర్‌ కట్‌తో గుర్తింపు సంఖ్య ఉంటుంది.

సబ్సిడీపై అందుబాటులో ఉండే యంత్రాలు…
విత్తనాలు చల్లే యంత్రాలు, కోత యంత్రాలు, స్ప్రేయర్లు, ట్రాక్టర్లతో నడిచే రొటోవేటర్లు, ప్లౌ, ట్రాలీ, సీడర్‌, కలుపు తీసే యంత్రాలు, పవర్‌ టిల్లర్లు, వీడర్లు, సీడ్‌ కమ్‌ ఫెర్టిలైజర్‌ డ్రిల్‌, స్ట్రాబాలర్లు, బండ్‌ ఫార్మర్‌ వంటి 15 రకాల యంత్రాలకు ఈ సబ్సిడీ వర్తింపజేస్తున్నారు. ప్రభుత్వం త్వరలో వీటిని పంపిణీ ప్రారంభించనుంది. ఈ పరికరాలతో పంటల దిగుబడి పెరగడంతో పాటు వ్యవసాయ పనుల్లో సమయం, ఖర్చు రెండూ తగ్గుతాయని అధికారులు అంటున్నారు.

Read More

జీవ ఎరువుల తయారీ కోసం వియత్నాం సంస్థతో ఒప్పందం

హైదరాబాద్‌లోని జయశంకర్‌ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఆధునిక సాంకేతికతతో దేశంలోనే తొలిసారిగా ఆరు గంటల్లోనే వివిధ జీవ వ్యర్థ పదార్థాల(బయోవేస్ట్‌)ను పోషకాలు అధికంగా ఉండే ఎరువు(బయో ఫెర్టిలైజర్‌) గా మార్చే భారీ పరిశ్రమ ఏర్పాటు కానుంది. ఈ మేరకు వియత్నాంకు చెందిన ప్రసిద్ధ జీవ ఎరువుల తయారీ సంస్థ ‘బయోవే’తో అగ్రి వర్సిటీ ఒప్పందం కుదుర్చుకుంది. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం(పీపీపీ)లో రెండు నెలల్లో దీన్ని ఏర్పాటు చేసి ఉత్పత్తిని ప్రారంభించనున్నట్లు వర్సిటీ ఉపకులపతి అల్దాస్‌ జానయ్య తెలిపారు. బయోవే.. 11 దేశాలకు జీవ ఎరువులను ఎగుమతి చేస్తోంది. ఇటీవల విదేశీ పర్యటన సందర్భంగా ఈ కంపెనీ ప్రతినిధులతో సంప్రదింపులు జరిపిన జానయ్య.. అగ్రివర్సిటీలో ప్లాంటును ఏర్పాటు చేయాలని కోరారు. దీనికి వారు అంగీకరించి.. ఒప్పందం కుదుర్చుకున్నారు. వీసీ సమక్షంలో బయోవే సీఈవో లీతి కామ్‌టెన్‌, అగ్రి వర్సిటీ రిజిస్ట్రార్‌ సీహెచ్‌ విద్యాసాగర్‌లు దీనిపై సంతకం చేశారు. ఈ సంస్థ అగ్రి వర్సిటీలో ఎకరం స్థలంలో ప్లాంటు ఏర్పాటుచేసి.. రెండేళ్లపాటు ఉత్పత్తి, ప్లాంటు నిర్వహణ బాధ్యతలను చూసుకుంటుంది. ప్రస్తుతం మన దేశంలో జీవ ఎరువుల తయారీకి ఆరు నుంచి ఏడు రోజుల సమయం పడుతోంది. కొన్ని వ్యర్థాలను మాత్రమే దీనికి వినియోగిస్తున్నారు. బయోవే సంస్థ మాత్రం తమ దేశంలో లభించే వరి, మక్క, ఇతర ఆహార, ఉద్యాన పంటల వ్యర్థాలు, మాంసం వ్యర్థాలు, కుళ్లిపోయిన కూరగాయలు, పండ్లు, గుర్రపుడెక్కతోపాటు ఆహార పదార్థాల వ్యర్థాలను మర ఆడించి ఆ మిశ్రమంలో వాల్కనో నుంచి ఉద్భవించిన బ్యాక్టీరియాను కలిపి ఆరు గంటల్లోనే జీవ ఎరువులను తయారు చేస్తోంది. పది డాలర్ల విలువైన 35 కిలోల ఎరువుల బస్తాను ప్రస్తుతం ఎకరం పొలంలో వాడుతుండగా అది సత్ఫలితాలను ఇస్తోంది. అధిక దిగుబడితోపాటు ఆరోగ్యకరమైన పంటలు ఉత్పత్తి అవుతున్నాయి. ఈ ఎరువుల సాయంతో మేలిమి రకం వరిసాగులో వియత్నాం అగ్రస్థానంలో నిలుస్తోంది.

Read More

రైతుల సంక్షేమం కోసం నాబార్డు భాగస్వామ్యం అవసరం – మంత్రి తుమ్మల

రాష్ట్ర రైతుల ప్రయోజనాల అభివృద్ధి కోసం ప్రభుత్వంతో కలిసి పనిచేయాలని నాబార్డు అధికారులను మంత్రి కోరారు. శుక్రవారం మంత్రి కార్యాలయంలో నాబార్డు సీజిఎం ఉదయ్‌ భాస్కర్‌తో కలిసి నాబార్డు ద్వారా ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా నాబార్డు అధికారులు గ్రామీణాభివృద్ధి కోసం ప్రభుత్వంతో భాగస్వామ్యం, మైక్రో ఇరిగేషన్‌ పథకం కోసం నిధుల విడుదల, బహుళోపయోగ ప్రాథమిక సహకార సంఘాల (M-PACS) ఏర్పాటు వంటి అంశాలపై మంత్రితో చర్చించారు. గ్రామీణ మౌలిక సదుపాయాల అభివృద్ధి, సూక్ష్మ సాగు, సహకార రంగ బలోపేతం వంటి అంశాలలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి నాబార్డ్‌ మద్దతు అందిస్తోందని ఇదేంతో ప్రశంసనీయమని మంత్రి అన్నారు. ఇందుకోసం గ్రామీణ మౌలిక సదుపాయాల అభివృద్ధి నిధి (ఆర్‌ఐడిఎఫ్‌) కింద 2025-26 ఆర్థిక సంవత్సరానికి నాబార్డ్‌ రూ. 300 కోట్లు రాష్ట్రానికి కేటాయించినట్లు నాబార్డు అధికారులు తెలిపారు. ఈ నిధులు తక్కువ వడ్డీ రేటుతో (ప్రస్తుతం 4.25%) అందిస్తున్నట్టు, రాష్ట్ర ప్రభుత్వం నవంబర్‌ 2025 ముగిసేలోపు కొత్త ఆర్‌ఐడిఎఫ్‌ ప్రాజెక్టు ప్రతిపాదనలు సమర్పించినట్లయితే ఈ నిధులను వినియోగించుకునే అవకాశం ఏర్పడుతుందని మంత్రికి తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రం ఆర్‌ఐడిఎఫ్‌ కింద రూ. 41.37 కోట్లు మాత్రమే డ్రా చేసుకుందని, కొనసాగుతున్న ప్రాజెక్టుల కోసం రూ. 1811 కోట్ల డ్రాయబుల్‌ గ్యాప్‌ ఉందని, రాష్ట్ర ప్రభుత్వం మిగిలిన ఈ ఆర్‌ఐడిఎఫ్‌ రుణాలను వినియోగించుకోవాలని అధికారులు మంత్రికి సూచించారు. ఈ విషయమై త్వరలోనే ముఖ్యమంత్రితో మాట్లాడుతానని మంత్రి అధికారులకు తెలిపారు. అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 32 జిల్లాలలో మైక్రో ఇరిగేషన్‌ ప్రాజెక్టు అమలు చేయాలని నిర్ణయించిన నేపథ్యంలో నాబార్డు తెలంగాణ రాష్ట్రానికి మైక్రో ఇరిగేషన్‌ ఫండ్‌ (ఎంఐఎఫ్‌) కింద రూ. 144 కోట్ల నిధులను ఆమోదించినట్టు, ఈ నిధుల విడుదల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఆర్‌బిఐతో ఒప్పంద ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాల్సి ఉందని అధికారులు తెలియజేశారు. అంతేకాకుండా రాష్ట్రంలో 197 కొత్త ఖ-ఆజ్పుఐల ఏర్పాటుకు నాబార్డ్‌ అనుమతి ఇచ్చింది. ఈ ప్రతిపాదనలను రాష్ట్ర సహకార అభివృద్ధి కమిటీ (ఐ్పుఈ్పు) ద్వారా త్వరితగతిన ఆమోదించాల్సి ఉందని మంత్రి దృష్టికి తీసుకురాగా మంత్రిగారు వీటన్నిటిపై త్వరలోనే రాష్ట్ర ముఖ్యమంత్రితో చర్చించి తగిన నిర్ణయం తీసుకుంటామని అన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన చర్యల వలన రైతుల ఉత్పత్తులు గణనీయంగా పెరిగాయని తెలిపారు. పెరిగిన ఉత్పత్తులను అనుగుణంగా నిల్వ సామార్థ్యాలతో గోదాములు నిర్మించాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న గోదాముల నిల్వ సామార్థ్యం, రైతుల ఉత్పత్తి సామార్థ్యానికి అనుగుణంగా లేదని అన్నారు. గతంలో నాబార్డు వారు తక్కవ వడ్డీతో ఇచ్చిన రుణాలతో ప్రభుత్వం గోదాముల నిర్మాణం చేపట్టేదని గుర్తుచేశారు. అదే ప్రక్రియను తిరిగి కొనసాగించి గోదాములు నిర్మించేందుకు తక్కువ వడ్డీతో రుణాలు అందించాలని కోరారు. రైతుల ప్రయోజనాల కోసం, వారి అర్థికాభివృద్ధి కోసం ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని, అందుకు అనుగుణంగా అనేక పథకాలు పునరుద్ధరిస్తున్నట్టు తెలిపారు. రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలలో నాబార్డు భాగస్వామం కొనసాగించాలని ఈ సందర్భంగా నాబార్డు అధికారులను కోరారు.

Read More

ఉచిత చేపపిల్లల పంపిణీకి అనుమతి

గత కొన్నేళ్లుగా తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతున్న ఉచిత చేపపిల్లల పంపిణీ పథకాన్ని ఈ ఏడాదీ అమలు చేసేందుకు అనుమతిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. 2025-26 సంవత్సరానికి 90 కోట్ల చేపపిల్లలను రూ. 122 కోట్లతో కొనుగోలు చేసి పంపిణీ చేయాలని ఆదేశించింది. నెలాఖరు వరకు టెండర్లు పిలిచి వచ్చేనెల 15 నాటికి వాటిని ఖరారు చేయాలని మత్స్యశాఖ ఉన్నతాధికారులు భావిస్తున్నారు.

Read More

తెలంగాణలో అంగన్వాడీ కేంద్రాల్లో జొన్నల ఆహారం

కర్ణాటక విధానంపై అధ్యయనం చేయనున్న అధికారులు

అంగన్వాడీ కేంద్రాల్లో ప్రస్తుతం ఇస్తున్న పోషకాహారంతో పాటు కర్ణాటక తరహాలో జొన్నలతో చేసే రొట్టె, ఇతర పదార్థాలను అందించాలని తెలంగాణా ప్రభుత్వం భావిస్తోంది. మహిళా సంఘాలతో వీటిని తయారు చేయించి సరఫరా చేసేందుకు యోచిస్తోంది. అంగన్వాడీ కేంద్రాలపై సీఎం తాజాగా నిర్వహించిన సమీక్షలో కర్ణాటక తరహాలో ఇక్కడా జొన్నరొట్టె ఇవ్వాలని, మహిళా సంఘాలతో తయారు చేయించాలని సూచించారు. దీంతో అధికారులు దీనిపై దృష్టిసారించారు. ప్రస్తుతం కర్ణాటక అంగన్వాడీ కేంద్రాల్లో అనుబంధ పోషకాహార కార్యక్రమం కింద సంవత్సరంలో మూడు వందల రోజులపాటు జొన్నలతో ఉప్మా, రొట్టె, లడ్డూలు, చిక్కీలు, కిచిడీ తయారు చేసి ఇస్తున్నారు. అక్కడి విధానంపై అధ్యయనానికి త్వరలో తెలంగాణ స్త్రీ శిశుసంక్షేమ, పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్‌) అధికారుల బృందాన్ని పంపించనున్నారు. వారు తుది నివేదిక సమర్పించిన తర్వాత దీనిపై నిర్ణయం తీసుకోనున్నారు. జొన్నరొట్టెలను మహిళలు, కౌమార బాలికలకు, ఇతర పదార్థాలను పిల్లలకు ఇచ్చే అవకాశం ఉందని రాష్ట్ర ప్రభుత్వ అధికారులు తెలిపారు. రాష్ట్రంలో జొన్నల వినియోగం ఇప్పుడిప్పుడే పెరుగుతోంది. సాగు వానాకాలంలో 50 వేల ఎకరాలు, యాసంగిలో 4 లక్షల ఎకరాలు ఉంది. అంగన్వాడీలకు ఆహార పథకంగా చేపట్టిన పక్షంలో సాగు విస్తీర్ణం మరింత పెరిగే అవకాశం ఉందని వ్యవసాయ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

Read More

వ్యవసాయంలో యాంత్రీకరణ పంట దిగుబడులపై ప్రభావం చూపుతుంది

తెలంగాణ రాష్ట్రంలో ఉద్యాన పంటలు, పట్టు సాగు విస్తరణకు ప్రభుత్వం రైతులకు ప్రోత్సాహకాలు అందించాలని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ, రైతు కమిషన్‌ ఛైర్మన్‌ కోదండరెడ్డి సూచించారు. గురువారం తన కార్యాలయంలో పంటల సాగు విస్తీర్ణం పెంపుపై కమిషన్‌ సభ్యులు, వ్యవసాయాధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఉద్యాన, పట్టు పరిశ్రమ శాఖల్లో ఉద్యోగుల కొరతతోపాటు రైతులు యాంత్రీకరణ చేపట్టకపోవడం పంటల దిగుబడిపై ప్రభావం చూపుతోందన్నారు. ప్రభుత్వంతో చర్చించి వీటి పరిష్కారం కోసం కృషి చేస్తామని కోదండరెడ్డి తెలిపారు.

Read More