గుంటూరులోని శ్రీకన్వెన్షన్‌లో పొగాకు బోర్డు 50వ వసంతాల వేడుకలు శుక్రవారం జరిగాయి. ముఖ్య అతిథిగా హాజరైన యశ్వంత్ కుమార్ మాట్లాడుతూ 1976లో అప్పటి కేంద్ర మంత్రి కొత్త రఘురామయ్య, ఆచార్య ఎన్.జి. రంగా తదితర నాయకుల కృషితో గుంటూరులో ఏర్పాటైన పొగాకు బోర్డు రైతుల అభివృద్ధి, సంక్షేమం కోసం 50 సంవత్సరాలుగా కృషి చేస్తోందన్నారు. భారత్ నుంచి 100 మిలియన్ కిలోల పొగాకును విదేశాలకు విక్రయిస్తుంటే.. అనధికారికంగా 30 మిలియన్ కిలోలను విక్రయించడం వల్ల రూ.750 కోట్లు కోల్పోతుండటంతో అనధికారిక విక్రయాలను నివారించేలా ప్రధాని మోదీ ఆదేశాలు జారీ చేశారన్నారు. రానున్న రబీ సీజన్ నాటికి ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన కింద పొగాకు పంటను చేర్చేలా చూస్తాం’ అని భారత పొగాకు బోర్డు ఛైర్మన్ చిడిపోతు యశ్వంతకుమార్ అన్నారు. పొగాకు బోర్డు కార్యనిర్వాహక సంచాలకులు (ఈడీ) బి. విశ్వశ్రీ మాట్లాడుతూ సంపూర్ణ ఆన్‌లైన్ విధానంలో రైతుల పేర్ల నమోదు, యాప్‌ను తీసుకొస్తున్నామని వివరించారు. పొగాకు బోర్డు వేలం విభాగం సంచాలకుడు శ్రీనివాస్, ఐసీఏఆర్-నిర్కా సంచాలకుడు ఎం. శేషుమాధవ్, ఐటీఏ కార్యదర్శి వై. అంకమ్మచౌదరి ప్రసంగించారు. బ్యారన్ ఎన్యుమరేషన్ యాప్‌తోపాటు తెలుగు, కన్నడ, ఆంగ్లం, హిందీ భాషల్లో పొగాకు బోర్డు వెబ్‌సైట్లను అతిథులు ప్రారంభించారు. ఈడీ విశ్వశ్రీ పొగాకు బోర్డు 2026 డైరీని, తెలుగుభాషలో గుడ్ అగ్రికల్చరల్ ప్రాక్టీసెస్ పుస్తకాలను ఆవిష్కరించారు. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన 26 మంది ఉత్తమ రైతులకు పురస్కారాలు అందజేశారు. సమావేశంలో పొగాకు బోర్డు కార్యదర్శి డి.వేణుగోపాల్, మాజీ ఛైర్మన్ యడ్లపాటి రఘునాథబాబు, మాజీ ఎమ్మెల్యే మొహమ్మద్ ముస్తఫా, పాలకమండలి సభ్యులు, రైతులు, వ్యాపారులు పాల్గొన్నారు.

4 Jan, 2026
