భారతదేశంలో పాడి పరిశ్రమ సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా నాడు డా. వర్గీస్ కురియన్- రైతుల భాగస్వామ్యం, సహకార సంఘాల ఏర్పాటు ద్వారా సుస్థిర భారత దేశ అభివృద్ధికి బీజం నాటారు. రైతుల సాధికారిత లక్ష్యంగా ప్రతి అడుగులో రైతుకు మార్గదర్శిలా నిలబడేలా జాతీయ పాడిపరిశ్రమాభివృద్ధి సంస్థ (ఎన్డిడిబి) గుజరాత్‌లోని ఆనంద్ కేంద్రంగా పనిచేస్తోంది. దీని ప్రభావంతోనే రైతు సాధికారిత, ప్రపంచంలోనే పాల ఉత్పత్తిలో భారత్ ప్రథమ స్థానంలో ఉండగలగడం, బలీయమైన గ్రామీణ ఆర్థిక వ్యవస్థ, పోషకాల పూరిత పాలను అందించడం, భావితరాలకు సుస్థిర భవిష్యత్తు ఇవ్వగలగడం సాధ్యమైంది.
ఎన్డిడిబి పాడిపరిశ్రమ అభివృద్ధిపరంగా 6 సంస్థలను ఏర్పాటు చేసింది.
ఇండియన్ ఇమ్యునోజికల్స్ను 1982లో పశువుల్లో వచ్చే వ్యాధుల నివారణకు టీకాలను ఉత్పత్తి చేయడం, అంతేకాక, హెపటైటిస్‌లాంటి టీకాల ఉత్పత్తి చేయడం ద్వారా అటు పశువుల ఆరోగ్యం, ఇటు ప్రజల ఆరోగ్యానికి పెద్ద పీట వేసింది.
1978లో ఐడిఎంసి ని ఏర్పరిచి, దేశీయ పరిజ్ఞానంతో పాడి పరిశ్రమ పరికరాల ఉత్పత్తి ప్రారంభించింది. దీనివలన భారత్, డెయిరీ ఇంజనీరింగ్ రంగంలో స్వయం సమృద్ధత సాధించగలిగింది.
2010లో ఎన్డిఎస్ (ఎన్డిడిబి డెయిరీ సర్వీసెస్) స్థాపించి, సంస్థాగత నిర్మాణం ద్వారా పాడి పరిశ్రమల్లో పాల ఉత్పాదకత పెంపుదలకు కృషి చేస్తోంది. ఇప్పటికే దేశంలో 210 పైగా పాల ఉత్పత్తిదారుల కంపెనీలు ఏర్పడినాయి.
2022లో CALF (Centre for Analysis and Learning in Livestock and Food) ని ఏర్పరిచి, పాల నాణ్యతా పరీక్షలతో పాలనాణ్యతకు పెద్దపీట వేసింది.
2022లో MRIDA అనే సంస్థ ద్వారా పాడిపరిశ్రమలో వ్యర్థాలను పునరుపయోగంలో తెచ్చి పాడిరైతుకు వర్తులాకార ఆర్థిక వ్యవస్థవైపు అడుగులు వేసేలా చేసింది. దీనిద్వారా పశువుల మల, మూత్రాల నిర్వహణ, బయోగ్యాస్ ఉత్పత్తి, సేంద్రియ ఎరువులు ‘సుధన’ పేర తెచ్చి పాడిపరిశ్రమలో కొత్త అధ్యాయం సృష్టించింది. పశువుల పేడ, పర్యావరణానికి పీడగా భావిస్తున్న తరుణంలో ఎన్డిడిబి, దీని పునరుపయోగం ద్వారా పాడిరైతులను సుస్థిర అభివృద్ధి దిశగా ఎలా తీసుకెళ్ళాలో ఆలోచించగా, వెలిగిన ఆశాకిరణం ‘మృదా’. మార్చి 2025లో సుజుకి R & D సెంటర్‌తో చేతులు కలిపి భారత దేశంలో వీలైనన్ని బయోగ్యాస్ ప్లాంట్ల ఏర్పాటు ధ్యేయంగా ప్రయాణం ప్రారంభించింది. తొలుత పశువుల పాకలు, గోశాలల వద్ద బయోగ్యాస్ ప్లాంట్లు ఏర్పాటు చేసారు. ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి, గుజరాత్‌లోని వాసనాలలో ప్రయోగాత్మకంగా ప్రారంభించారు. రోజకు 65-70 మెట్రిక్ టన్నుల పేడ సేకరించి, దానికి గాను రైతులకు రూ. 150 లక్షలు చెల్లించగలిగారు. దీనిద్వారా దగ్గరలోని డెయిరీలకు బాయిలర్లకు ఇంధన సరఫరా, సుమారు 250 కిలో వాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసి చూపించారు. రూట్గార్డ్, గ్రోమాక్స్ లాంటి పశువు…పేడ ఆధారిత ఉత్పత్తులు తయారు చేసి ‘సుధన’ పేర రైతులకు అందజేసారు. ‘గోబర్ సే సమృద్ధి’ ని సాకారం చేసి ‘కార్బన్ క్రెడిట్స్’ పొందగలిగేలా ఎన్డిడిబి కృషి చేస్తోంది. ప్రస్తుతం ఎన్డిడిబి, సస్టెయిన్ ప్లస్ అనే సంస్థ సహకారంతో 10000 ఇళ్ళలో 2 క్యూబిక్ మీటర్ల బయోగ్యాస్ ప్లాంట్ల ఏర్పాటుకు సహకరిస్తోంది. వివరాలకు జయేష్ చవాన్ – ఫోన్: 9405716326 ని సంప్రదించవచ్చు. దీని ధన లబ్ధిదారుని వాటాగా రూ. 11,262/-గా నిర్ధారించారు. ఏది ఏమైనా, దేశంలోనే అగ్రగామి సంస్థగా ఎన్డిడిబి వివిధ సేవల ద్వారా పాడి రైతుల అభివృద్ధికి అవిరళ కృషి చేస్తోంది. ఆనంద్‌లోని ఎన్డిడిబి సంస్థను ప్రతి ఒక్కరూ సందర్శిస్తే, పాడిరైతుల కోసం సంస్థ చేస్తోన్న కృషి తెలిసి వస్తుంది. ఇప్పటికే ఎన్డిడిబి సహకారంతో విజయ తెలంగాణ డెయిరీ ERP సేవలను కొనసాగిస్తోంది. ఇంకెన్నో ఆవిష్కరణలతో ఎన్డిడిబి అగ్రగామిగా ఉండాలని ఆశిద్దాం!
మధుసూదనరావు, జనరల్ మేనేజర్, విజయ డెయిరీ, హైదరాబాద్. ఫోన్: 9121160553