ఎల్‌నినో ప్రభావం వలన పశుగ్రాస కొరత నానాటికీ పెరిగిపోతోంది. గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో కీలకమైన పాడిరంగం కునారిల్లుతోన్న ఈ పరిస్థితికి పాడి పరిశ్రమకు తగిన ప్రోత్సాహం అందకపోవడం వలన చాలామంది పాడికి దూరం అవుతున్నారు. పశువుల దాణా, మేపు ఖర్చులు  పెరగడం, పచ్చిమేత లభ్యత తగ్గడం, గ్రామాల్లో పశువైద్య సేవలు అరకొరగా ఉండటం, పాలకు గిట్టుబాటు ధర రాకపోవడం - ఇలా ఎన్నో కారణాల వలన పాల ఉత్పత్తి తగ్గుతున్న మాట వాస్తవం. గత 7 సం॥ల్లో 35% పాడి పశువులు తగ్గాయని గణాంకాలు తెలియజేస్తున్నాయి.
వాతావరణ శాఖ అంచనా ప్రకారం, నైరుతి రుతుపవనాలు, ఈశాన్య రాష్ట్రాల్లో సాధారణంగా ఉన్నా మధ్య, దక్షిణ భారత దేశంలో సాధారణం కన్నా తక్కువ ఉండవచ్చు.
3.7.26 ప్రకారం ఖరీఫ్ నాట్లు వరి (-15%), పల్లీ (-18%), సోయా (-65%), పత్తి (-28%) మాత్రమే నమోదయింది. ఈ ఆలస్యం ధాన్యం/నూనెగింజల ఉత్పత్తిపైనే కాక, ఎండుమేత, తవుడు, పత్తి చెక్కల లభ్యతపై కూడా ప్రభావం చూపుతుంది. ఇప్పటికే, భారత ప్రభుత్వం 262 జిల్లాలను కరువు ప్రభావితంగా గుర్తించింది.
ఎన్‌డిడిబి అంచనా ప్రకారం, ఎండుమేత నిలువలు, అవసరమైనది 431 మిలియన్ మెట్రిక్ టన్నులు అయినా, 620 మిలియన్ మెట్రిక్ టన్నులు ఉన్నట్లు, పచ్చిమేత అవసరం 1140 మి.మె.ట. కాగా, 752 మి.మె.ట. ఉన్నట్లు, దాణా 32% కొరత ఉన్నట్లు గుర్తించింది.
దేశంలోని వాణిజ్యస్థాయి దాణా తయారీ, 14.5 మి.మె.ట. కాగా, ఈ వాతావరణ ప్రతికూలత వలన లభ్యత 5Ð10% తగ్గగలదని అంచనా.
మార్చి 26 నుండి జూన్ 26 వరకు చూస్తే, పచ్చిమేత ధరలు రూ. 3/80 నుండి రూ. 4/04 కి ఎగబాకగా, దాణాధరలు రూ.23.80 కిలో నుండి రూ.25.06 కి చేరింది. దాణా తయారీకి ముఖ్యమైన తవుడు ధరలు ఏకంగా 21% పెరిగాయి.
17 రాష్ట్రాల్లోని 262 కరువు ప్రభావిత జిల్లాల్లో పశు జనాభా ఇలా ఉంది.
పాలు ఇచ్చే పశువులు  31.19 మిలియన్లు
ఎండిపోయిన పశువులు   13.34 మిలియన్లు
దూడలు       37.16 మిలియన్లు
మొత్తం      81.70 మిలియన్లు
దీనికై, ఎండుమేత 1.1 మిలియన్ మె.ట., పచ్చిమేత 1.4 మి.మె.ట, దాణా 0.4 మి.మె.ట. గా ఉంటుంది. ముఖ్యంగా ఈ అవసరం రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, గుజరాత్, ఒడిసా, బిహార్, తమిళనాడు, మహారాష్ట్రల్లో ఉంది.

కార్యాచరణ ప్రణాళికః

  1. కరువును తట్టుకునే పశుగ్రాసాల పెంపకం బాజ్రా, మక్కలు చేపట్టాలి
  2. పశుగ్రాస విత్తనాల లభ్యత ఉండాలి.
  3. బహువార్షిక పశుగ్రాసాల పెంపకాన్ని ప్రోత్సహించాలి.
  4. మాగుడుగడ్డి వాడకం పెంచాలి.
  5. సహకార డెయిరీల ద్వారా ‘సైలేజ్’ సరఫరా చేయించాలి.
  6. టోటల్ మిక్స్‌డ్ రేషన్ (టిఎంఆర్) వాడకం పెంచాలి.
  7. ఉపయోగంలోకిరాని దాణా తయారీ సామర్థ్యం వినియోగించి, 3.6 లక్షల టన్నుల అదనపు దాణా తయారీ చేపట్టి రాబోవు 3 నెలల్లో కరువు ప్రభావిత ప్రాంతాల పాడిరైతులకు అందుబాటులోకి తేవాలి.
  8. ఎల్‌నినో ప్రభావం పాలఉత్పత్తిపైన కూడా ఉంటుంది. కాబట్టి, చల్లని వాతావరణంలో కృత్రిమ గర్భధారణ చేపట్టడం, శక్తివర్ధక దాణా సరఫరా ప్రోత్సహించాలి.
    ఏది ఏమైనా, పాడిపశువులకు పచ్చిమేత, ఎండుమేత, ఉత్పాదకత పెంపుదల చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
    అంతేకాక పాలఉత్పత్తిదారుల సహకార సంఘాలు మాగుడుగడ్డి తయారీ, టిఎంఆర్ వాడకం బాహుళ్యంలో తెచ్చినపుడే పాలఉత్పత్తి నిలకడగా ఉండగలదు. అంతేకాక, పాలధర పెంపుదల కోసం ప్రభుత్వ ప్రోత్సాహకం, పశుగ్రాస పెంపకం కోసం పశుగ్రాస విత్తనాల సరఫరా, బీమా ప్రయోజనాలు విజయ డెయిరీ అందిస్తోంది. వీటితో పాడిరైతులు సహకార డెయిరీకి రక్షణ కవచంలా నిలవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
  • మధుసూదనరావు, జనరల్ మేనేజర్, విజయ తెలంగాణ, హైదరాబాద్. ఫోన్: 9121160553