పంట పెట్టడం ఒకెత్తయితే… అది ఆరోగ్యంగా ఎదిగేలా చూసుకోవడం ఒకెత్తు. మార్కెట్‌లో నూటారు పేర్లతో గ్రోత్ ప్రమోటర్లను అమ్ముతున్నారు. అయితే, వీటిని కొనకుండా కొద్దిపాటి శ్రమతో ఇంటి వద్దే పెద్ద ఖర్చేమీ లేకుండా తయారుచేసుకోవచ్చు. మొక్కల ఎదుగుదలకు ఉపయోగపడే ఆక్సిన్స్, జిబ్బరిల్లిన్ తదితరాలు ‘నర్రెంగ’ మొక్కలో దండిగా ఉన్నాయి. దీని శాస్త్రీయ నామం ‘అల్బీజీయా అమరా’. నర్రెంగ ఆకులను ఒక కిలో తీసుకొని, ఐదు లీటర్ల పుల్ల మజ్జిగలో వేసి, వారం రోజుల పాటు పులియబెట్టాలి. ఆ తరువాత వడకట్టి లీటర్ ద్రావణాన్ని 20 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి. నర్రెంగ మొక్కలు దొరకకపోతే మరో మార్గం ఉంది. పచ్చి కొబ్బరిని రుబ్బి, పాలు తీయాలి. ఐదు లీటర్ల కొబ్బరి పాలకు ఐదు లీటర్ల మజ్జిగను చేర్చి… ఒక ప్లాస్టిక్ డ్రమ్ములో పోసుకొని పులియబెట్టుకోవాలి. వారం తరువాత ద్రావకాన్ని వడకట్టుకొని లీటరు ద్రావణాన్ని 20 లీటర్ల నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. ఈ రెండు ద్రావణాలు పంటల ఎదుగుదలకే కాకుండా పూత, పిందె బాగా రావడానికి ఉపయోగపడతాయి.
యంత్రం లేదా ఇనుప డ్రమ్ అందుబాటులో లేని పరిస్థితుల్లో చిన్న గొయ్యి ద్వారా కూడా బయోచార్‌ను తయారు చేయవచ్చు. ఇందుకోసం సుమారు ఒక మీటరు లోతు గల గొయ్యిని తవ్వాలి. ఆ గొయ్యిలో పొడి పంట అవశేషాలను నింపి, పైభాగం నుంచి మంట వేయాలి. అవశేషాలు నల్లని రంగులోకి మారడం ప్రారంభమైన తరువాత గొయ్యిని మట్టి లేదా ఇనుప రేకుతో కప్పి, గాలి ప్రవేశాన్ని పరిమితం చేయాలి. ఈ దశలో ఆక్సిజన్ ప్రవేశం నియంత్రించబడటం వల్ల అవశేషాలు పూర్తిగా కాలిపోకుండా పైరోలిసిస్ ప్రక్రియ ద్వారా బయోచార్‌గా మారతాయి.
కొంత సమయం తరువాత గొయ్యిని పూర్తిగా చల్లారనివ్వాలి. అనంతరం మట్టి లేదా ఇనుప రేకును తొలగించి బయోచార్‌ను బయటకు తీసుకోవాలి. బూడిద ఏర్పడి ఉంటే దానిని వేరుచేసి, బయోచార్‌ను నిల్వ చేసుకోవచ్చు లేదా కంపోస్టు, పశువుల ఎరువు లేదా వర్మీ కంపోస్టుతో కలిపి పొలంలో ఉపయోగించవచ్చు.
ఈ పద్ధతిలో ఆక్సిజన్ ప్రవేశాన్ని పరిమితం చేయడం అత్యంత ముఖ్యమైన అంశం. గాలి ఎక్కువసేపు లోపలికి ప్రవేశిస్తే పంట అవశేషాలు పూర్తిగా కాలిపోయి బూడిదగా మారతాయి. అటువంటి పరిస్థితిలో నాణ్యమైన బయోచార్ తయారు కాదు.
నేల దేశ సంపద, దేశం సుభిక్షంగా ఉండాలంటే నేల ఆరోగ్యంగా ఉండాలి. నేల అనగా అనేక బిలియన్ల బ్యాక్టీరియా, శిలీంధ్ర, నాచు ఇంకా అనేక రకాల సూక్ష్మజీవుల సహజీవనంతో తొణికిసలాడే సజీవమైన జీవధార వ్యవస్థగా గుర్తించాలి. ఇవి మొక్కల ఎదుగుదలకు పోషకంగానే కాక వర్షపు నీరును క్షామం కాలం వరకు ఉంచుకొని మొక్కలకు అందజేస్తా ఆరోగ్యంగా ఉంటేనే ఆహార భద్రత, ఆరోగ్యకరమైన పర్యావరణంతోనే మానవాళి శ్రేయస్సు సాధ్యపడుతుంది.
ఇటీవల కాలంలో రైతాంగం విచక్షణ రహితంగా రసాయనిక ఎరువులను, పురుగు మందులను వాడడం, అలాగే పంటల అవ శేషాలను కాల్చి వేయడం ద్వారా భూసారం గణనీయంగా క్షీణించడమే గాక పర్యావరణ కాలుష్యం, ఉపయోగకరమైన బ్యాక్టీరియా వినాశనానికి దారి తీస్తూ జీవన వైవిధ్యం వినాశనం సంభవిస్తుంది. తద్వారా సరైన పోషకాలు లేని బీడు భూములు ఏర్పడుతున్నాయి. మనకు స్వాతంత్య్రం వచ్చినపుడు ప్రతి కిలో ఎరువుకు 17 నుండి 18 కిలోల ధాన్యం పండేది. కానీ ప్రస్తుతం ప్రతి కిలో ఎరువుకు కేవలం 3 కిలోల ధాన్యం మాత్రమే పండుతుంది. ఇది భూసారం క్షీణించడాన్ని సూచిస్తుంది.
భూసారాన్ని పెంచడానికి, నేల ఉత్పా దకతను మెరుగుపరచడానికి సూక్ష్మజీవుల పాత్ర చాలా గొప్పది. ఎందుకంటే ఇవి నజ్రజనిని స్థిరీకరిస్తాయి, పోషకాలను కరిగిస్తాయి. పోషకాలను విచ్ఛిన్నం చేసే లక్షణాలను కలిగి ఉంటాయి. ఈ సూక్ష్మజీవులు సహజంగానే భూమిలో ఉంటాయి. కాని వీటి సంఖ్య త్వరీతంగా తగ్గుతూ వస్తుంది. పంటల దిగుబడిని పెంచడానికి సూక్ష్మ జీవులను కృత్రిమంగా పెంచి ఎక్కువ సంఖ్యలోకి తెచ్చి సూటి అయిన ఘన పదార్ధాలలో కలిపి మరల భూమిలో వెయ్యవచ్చు.
నత్రజనిని స్థిరికరించే జీవన ఎరువులు :
జీవన ఎరువులు వాడవలసిన మోతాదు ఏ ఏ పంటలకు
రైజోబియం 200 గ్రా. కంది,పెసర , మినుము, శనగ వంటి పంటలకు
అజటోబాక్టర్ 2 కిలోలు పప్పుజాతి పంటలను మినహాయించి మిగతా అన్ని పంటలకు
నీలి ఆకుపచ్చనాచు 4 కిలోలు వరి పంటకు మాత్రమే వాడాలి.
రైజోబియం: లెగ్యూమ్ జాతి పంటలు అనగా అపరాల (పప్పుజాతి) పంటలకు నత్రజని అందించే జీవన ఎరువుగా వాడవలెను. పప్పుజాతి పైర్లలో ముఖ్యమైనవి కంది, పెసర, మినుము, శనగ వంటి పైర్లకు, వేరుశనగ, సోయాచిక్కుడు వంటి నూనె గింజల పైర్లకు రైజోబియం కల్చర్‌ను విత్తనమునకు పట్టించి ఉపయోగించాలి. ఉపయోగించే విధానం: వంద మిల్లీలీటర్ల నీటిలో పది గ్రాముల పంచదార, బెల్లం, లేక గంజి పౌడర్‌ను కలిపి పది నిమిషాలు మరగబెట్టి చల్లార్చాలి. ఈ చల్లార్చిన ద్రావణం పది కిలోల విత్తనాలపై చల్లి, దానికి 200 గ్రాములు రైజోబియం కల్చర్ పొడిని బాగా కలపాలి. విత్తనం చుట్టూ పొరలు ఉండేలా జాగ్రత్త వహించాలి.
ఈ ప్రక్రియకు రైతులు పాలిథిన్ సంచిగానీ, ప్లాస్టిక్ తొట్టిని గాని ఉపయోగించుకోవచ్చు. పది నిమిషాలు నీడలో ఆరబెట్టిన తరువాత రైతులు పొలంలో నాటుకోవలెను
అజటోబాక్టర్: పప్పుజాతి పంటలను మినహాయించి, మిగతా అన్ని పంటలకు నత్రజని జీవన ఎరువుగా ఉపయోగపడుతుంది. ఈ బాక్టీరియా నత్రజనిని స్థిరీకరించడమే కాక, మొక్కకు కావాల్సిన హార్మోన్లు, విటమిన్లు అందిస్తుంది.
ఈ బాక్టీరియా ముఖ్యంగా సేంద్రియ కర్బనం ఎక్కువగా ఉన్న భూమిలో సమర్థవంతంగా పని చేస్తుంది. అందువల్ల ఈ జీవన ఎరువు ఆకుకూరలు, కూరగాయలు, పూల తోటలకు సిఫారసు చేయబడుతుంది.
వాడే విధానం: ఏ పంటకు వాడినా రెండు కిలోల కల్చర్‌ను 200 కిలోల సేంద్రియ ఎరువుతో కలిపి విత్తనం నాటే సమయంలో ఒక ఎకరం నేలపై వెదజల్లాలి. ఇది చల్లిన సమయంలో కాని, వెనువెంటనే భూమిలో తగినంత తేమ ఉండేలా జాగ్రత్త తీసుకోవాలి
అజోస్ప్తెరిల్లమ్ : ఈ మధ్యకాలంలో దీని ప్రాముఖ్యత అధికంగా గుర్తించారు. ఈ బాక్టీరియా మొక్క వేర్ల చుట్టూ పెరుగుతూ అవకాశమున్న చోట వేర్లలోకి చరొబడి కూడా జీవిస్తాయి. ఈ కారణంగా ఈ జీవన ఎరువు స్థిరీకరించిన నత్రజని నేరుగా మొక్కకు ఎక్కువశాతం అందుబాటులో ఉంటుంది. ఈ జీవన ఎరువును లెగ్యూమ్‌జాతి పంటలకు తప్పించి, మిగతా పంటలకు వాడుకోవచ్చు. ఇది వరి, చెరకు, పత్తి, మిర్చి, జొన్న, సజ్జ, ప్రొద్దుతిరుగుడు, అరటి పంటలకు బాగా ఉపయోగపడుతుంది. సేంద్రియ పదార్థం తక్కువగా ఉన్న నేలలో ఇది పని చేస్తుంది.
ఉపయోగించే విధానం:
తక్కువ కాలం పంటలకు రెండు కిలోల అజోస్పెరిల్లమ్ కల్చర్‌ను 80-100 కిలోల సేంద్రియ ఎరువుతో కలిపి ఒక ఎకరం పొలంలో విత్తనం కింద పడేలా వేసుకోవాలి. నారుమడి వేసుకొనే పంటలకు నారు పీకేందుకు ముందుగా నారుమడి వద్ద 70 నుంచి 80 లీటర్లు పట్టే చిన్న మడిని తయారు చేసుకోవాలి.
ఆ నీటిలో రెండు కిలోల అజోస్పెరిల్లమ్ జీవన ఎరువును బాగా కలిపి, ఆ ద్రావణంలో పది నిమిషాలు వేళ్లను మాత్రమే ముంచి వెంటనే నాటుకోవాలి. చెరకు పంట విషయంలో నాటే విత్తనం చెరకు ముక్కలను పది నిమిషాలు ముంచి నాటుకోవాలి.
పంట మొక్కలకు వేసిన లభ్య భాస్వరం, భూమిలో చేరిన కొద్ది రోజుల వ్యవధిలో భూమి ఉదజని సూచకను అనుసరించి, వివిధ రకములైన లభ్యంకాని భాస్వరం రూపంలోని మారుతుంది.
ఒక వేళ భూమి క్షార గుణం కలిగి వున్న, వేసిన భాస్వరం కాల్షియం, మెగ్నీషియం ఫాస్పేట్స్‌గా మారి, మొక్కకు లభ్యంకాదు.
ఈ పరిస్థితుల్లో భాస్వరానికి సంబంధించి జీవన ఎరువులు వేస్తే లభ్యంకాని రూపంలో ఉన్న భాస్వరం మొక్కకు దొరుకుతుంది.
భాస్వరంను అందించే జీవన ఎరువులు PSB (ఫాస్ఫరస్ సొల్యుబిలైజింగ్ బాక్టీరియా) 2 కిలోలు/ 500 మీ.లీ/ఎకరాకు అన్ని పంటలకు వాడుకోవచ్చు
ఫాస్ప్ ఫంగై 2 కిలోలు అన్ని పంటలకు వాడుకోవచ్చు
ఫాస్పేట్ మోబి లైజింగ్ మైకోరైజా 5 కిలోలు అన్ని పంటలకు వాడుకోవచ్చు
పొటాషియం మోబిలైజర్స్: ప్రటూరియా అరాషనియా 2 కిలోలు నూనెగింజల పంటలకు ఎక్కువ ఉపయోగపడుతుంది
ఫాస్పోబాక్టీరియా : ఈ జీవన ఎరువు భూమిలోని మొక్కలకు లభ్యంకాని రూపంలో ఉన్న భాస్వరాన్ని లభ్యమయ్యే రూపంలోకి మార్చుతుంది. ఈ జీవన ఎరువును అన్ని పంటలకు వాడుకోవచ్చు.
ఇది సమర్థవంతంగా పని చేసేందుకు సేంద్రియ కర్బనము అత్యవసరం. దీన్ని సేంద్రియ ఎరువుతో కలిపి వాడాలి. ఈ జీవన ఎరువు మొక్కకు రోగ నిరోధక శక్తిని పెంచి, తద్వారా పంట దిగుబడి పెంచుతుంది
వాడే విధానం : ఎకరాకు 2.0 కిలోల ఫాస్పోబాక్టర్‌ను లేదా ద్రవ రూపంలో ఫాస్ఫరస్ సొల్యుబిలైజింగ్ బాక్టీరియా 500 మీ.లీ, 200 కిలోల పశువుల ఎరువుతో కలిపి దుక్కిలోగానీ, మొక్క నాటినప్పుడుగానీ సాళ్లలో పడేలా వేసుకోవాలి. వరి విషయంలో నాట్లు వేసిన మూడు నుంచి ఏడు రోజుల వ్యవధిలో వేసుకోవాలి. ఈ జీవన ఎరువులు వాడే సమయంలో పొలంలో తగినంత తేమ ఉండేలా జాగ్రత్త తీసుకోవాలి.
పొటాషియం మొబిలైజర్స్ : ఈ జీవన ఎరువు భూమిలో మొక్కకు అందుబాటులో లేని పొటాషియంను అందుబాటులోకి తెచ్చును. ఈ జీవన ఎరువుల్లో ఉండేటటువంటి మొబిలైజింగ్ సూక్ష్మజీవులు, విడుదల చేసే ఎంజైముల వల్ల ఈ ప్రక్రియ జరుగుతుంది.
వాడే విధానం : ఎకరాకు 2.0 కిలోల పొటాషియం రిలీసింగ్ బాక్టీరియా లేదా ద్రవరుపం లో పొటాషియం రిలీసింగ్ బాక్టీరియా 500 మీ.లీ, 200 కిలోల పశువుల ఎరువుతో కలిపి దుక్కిలోగానీ, మొక్క నాటినప్పుడుగానీ సాళ్లలో పడేలా వేసుకోవాలి. వరి విషయంలో నాట్లు వేసిన మూడు నుంచి ఏడు రోజుల వ్యవధిలో వేసుకోవాలి. ఈ జీవన ఎరువులు వాడే సమయంలో పొలంలో తగినంత తేమ ఉండేలా జాగ్రత్త తీసుకోవాలి.
డా. ఎం. వెంకట లక్ష్మి(సస్య పోషణ), డా.డి.సుధా రాణి (సీనియర్ శాస్త్రవేత్త మరియు అధిపతి), డా. కె. రేవతి (సస్య రక్షణ) కృషి విజ్ఞాన కేంద్రం, ఘంటసాల, కృష్ణాజిల్లా – 521 133. Ph: 8008201253
“పంట ఒక్కటే కాదు… పంటతో పాటు మరెన్నో ఆదాయ మార్గాలు ఉన్నాయి”
ఈరోజుల్లో రైతు వ్యవసాయం చేయడం ఒక్కటే సరిపోవడం లేదు. ఎరువులు, విత్తనాలు, కూలీల ఖర్చులు పెరుగుతుండగా పంటల ధరలు మాత్రం ఎప్పుడూ ఆశించిన స్థాయిలో ఉండవు. కొన్ని సంవత్సరాల్లో వర్షాభావం, మరికొన్ని సంవత్సరాల్లో అధిక వర్షాలు, తెగుళ్లు రైతును నష్టాలకు గురిచేస్తాయి. ఇలాంటి పరిస్థితుల్లో రైతు కుటుంబానికి స్థిరమైన ఆదాయం రావాలంటే వ్యవసాయంతో పాటు అదనపు ఆదాయ మార్గాలను కూడా అభివృద్ధి చేసుకోవాలి. ఇదే భావనతో ప్రభుత్వం, వ్యవసాయ విశ్వవిద్యాలయాలు మరియు శాస్త్రవేత్తలు “ద్వితీయ వ్యవసాయం (Secondary Agriculture)” అనే భావనను ప్రోత్సహిస్తున్నాయి.
ద్వితీయ వ్యవసాయం అంటే ఏమిటి? పొలంలో పంటను పండించడం ప్రాథమిక వ్యవసాయం. ఆ పంటను శుభ్రపరచడం, ప్రాసెసింగ్ చేయడం, విలువను పెంచడం, ప్యాకింగ్ చేయడం, వ్యవసాయ వ్యర్థాలను ఉపయోగించి కొత్త ఉత్పత్తులను తయారు చేయడం, పశుపోషణ, కోళ్ల పెంపకం, చేపల పెంపకం, తేనెటీగల పెంపకం వంటి అనుబంధ కార్యకలాపాలను ద్వితీయ వ్యవసాయం అంటారు.
సరళంగా చెప్పాలంటే… “పంటను మాత్రమే అమ్మకుండా, పంటతో పాటు మరిన్ని ఉత్పత్తులను తయారు చేసి ఆదాయం పెంచుకోవడమే ద్వితీయ వ్యవసాయం.”
పంటలకు విలువ జోడించండి – ఎక్కువ ధర పొందండి చాలా మంది రైతులు పంట కోసిన వెంటనే మార్కెట్‌కు తీసుకెళ్లి అమ్మేస్తారు. అప్పుడు ధర తక్కువగా ఉంటుంది. అదే పంటను ప్రాసెసింగ్ చేసి అమ్మితే మంచి లాభం వస్తుంది. వరిని బియ్యంగా మార్చడం ,బియ్యంతో అటుకులు, మురమురాలు తయారు చేయడం ,వేరుశెనగతో నూనె, పీనట్ బటర్ తయారు చేయడం ,మిరపతో మిరప పొడి తయారు చేయడం ,పసుపును పాలిష్ చేసి పసుపు పొడిగా విక్రయించడం , మామిడితో జ్యూస్, జామ్, పల్ప్ తయారు చేయడం.దీనివల్ల రైతు సాధారణంగా పొందే ఆదాయం కంటే 20–100 శాతం వరకు అదనపు ఆదాయం పొందే అవకాశం ఉంటుంది. చిరుధాన్యాలకు విలువ జోడించడం అనేది ద్వితీయ వ్యవసాయంలో అత్యంత లాభదాయకమైన మరియు స్థిరమైన రంగం. ముడి ధాన్యాన్ని మాత్రమే విక్రయించే బదులు, పిండి, రవ్వ, రెడీ-టు-కుక్, రెడీ-టు-ఈట్, బేకరీ, ఆరోగ్య ఆహార ఉత్పత్తులుగా మార్చి బ్రాండ్ పేరుతో విక్రయిస్తే రైతులు గణనీయమైన అదనపు ఆదాయాన్ని పొందవచ్చు. మహిళా సంఘాలు, యువ రైతులు, FPOలు మరియు గ్రామీణ పారిశ్రామికవేత్తలకు ఇది ఉపాధి కల్పించడంతో పాటు, పోషకాహార భద్రతను మెరుగుపరచి గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తుంది. అందువల్ల చిరుధాన్యాల విలువ జోడింపును ద్వితీయ వ్యవసాయం అభివృద్ధికి ఒక ప్రధాన వ్యూహంగా ప్రోత్సహించడం అవసరం.
కోత అనంతర నష్టాలను తగ్గించండి భారతదేశంలో ప్రతి సంవత్సరం పండ్లు, కూరగాయలు, ధాన్యాలలో కోత అనంతరం గణనీయమైన నష్టం సంభవిస్తుంది. సరైన నిల్వ, గ్రేడింగ్, ప్యాకింగ్ లేకపోవడం దీనికి ప్రధాన కారణం.
రైతులు ఈ చర్యలు పాటించాలి: పంటను బాగా ఆరబెట్టాలి, నాణ్యత ఆధారంగా గ్రేడింగ్ చేయాలి ,తేమ రాకుండా నిల్వ చేయాలి, అవసరమైతే కోల్డ్ స్టోరేజ్ ఉపయోగించాలి, శుభ్రమైన సంచుల్లో ప్యాకింగ్ చేయాలి.
గ్రామంలోనే చిన్న ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేయండి గ్రామంలోనే చిన్న రైస్ మిల్లు, ఆయిల్ మిల్లు, పప్పు మిల్లు లేదా మసాలా పొడి తయారీ యూనిట్ ఏర్పాటు చేస్తే రైతులకు దగ్గరలోనే మార్కెట్ లభిస్తుంది.అదనంగా గ్రామ యువతకు కూడా ఉపాధి లభిస్తుంది. చిన్న పరిశ్రమలు : రైస్ మిల్లు, నూనె గానుగ , పప్పు మిల్లు, పిండి మిల్లు , మసాలా తయారీ, పండ్ల ప్రాసెసింగ్
పాల ఉత్పత్తుల ద్వారా ప్రతిరోజూ ఆదాయం రైతు ఇంట్లో ఆవులు లేదా గేదెలు ఉన్నా ప్రతి రోజు ఆదాయం వస్తుంది. పాలను నేరుగా అమ్మడం కంటే పెరుగు, నెయ్యి, పనీర్, వెన్న, చీజ్ తయారు చేసి అమ్మితే మరింత లాభం వస్తుంది.పాడి పరిశ్రమ రైతు కుటుంబానికి సంవత్సరం పొడవునా ఆదాయాన్ని అందించే అత్యుత్తమ అనుబంధ వృత్తి.
తేనెటీగల పెంపకం – తేనెతో పాటు పంట దిగుబడీ పెరుగుతుంది తేనెటీగల పెంపకానికి ఎక్కువ భూమి అవసరం లేదు. దీని ద్వారా తేనె , బీస్‌వాక్స్, రాయల్ జెల్లీ లభిస్తాయి. అంతేకాదు, తేనెటీగలు పరాగసంపర్కం చేయడం వల్ల ప్రొద్దుతిరుగుడు, నువ్వులు, కూరగాయలు, పండ్ల పంటల దిగుబడి బాగా పెరుగుతుంది.
పుట్టగొడుగుల సాగు – చిన్న గదిలో పెద్ద ఆదాయం వరి గడ్డి, మొక్కజొన్న కాండాలు వంటి వ్యవసాయ అవశేషాలను ఉపయోగించి పుట్టగొడుగులను పెంచవచ్చు. చిన్న గదిలోనే సాగు చేయవచ్చు.ఈ వ్యాపారం మహిళలకు, యువతకు , స్వయం సహాయక సంఘాలకు అత్యంత అనుకూలంగా ఉంటుంది.
చేపల పెంపకం – నీటి వనరులతో అదనపు ఆదాయం వ్యవసాయ కుంటలు, చెరువులు, ఫార్మ్ పాండ్లలో చేపల పెంపకం చేపట్టవచ్చు. వరి సాగుతో పాటు చేపల పెంపకం (Rice-Fish Farming) చేపడితే ఒకే భూమి నుండి రెండు రకాల ఆదాయం పొందవచ్చు.
పశుపోషణ – రైతుకు నమ్మకమైన ఆదాయం వ్యవసాయం మరియు పశుపోషణ ఒకదానికొకటి పరస్పర అనుబంధమైనవి. పంట అవశేషాలు పశుగ్రాసంగా ఉపయోగపడతాయి. పశువుల పేడ : వర్మీకంపోస్ట్ ,బయోగ్యాస్ ,సేంద్రియ ఎరువులు తయారు చేయడానికి ఉపయోగపడుతుంది.
కోళ్ల పెంపకం – తక్కువ పెట్టుబడి, త్వరగా ఆదాయం పంటల సాగు నిలిచిపోతే రైతులు, గ్రామీణ కుటుంబాల ఆదాయం దెబ్బతింటుంది. దీనిని నివారించేందుకు ప్రతి ఇంటా నాటుకోళ్లను పెంచాలి. గుడ్లు, మాంసం సొంత అవసరాల వినియోగానికే కాకుండా అమ్మకాలతో ఆదాయం కూడా పొందవచ్చు. గుడ్లు, మాంసానికి సంవత్సరమంతా మార్కెట్ ఉంటుంది. చిన్న స్థాయిలో ప్రారంభించి క్రమంగా విస్తరించవచ్చు. గిరిరాజ, వనరాజ, గ్రామ ప్రియ, స్వర్ణధార, శ్రీనిధి వంటి మేలు రకం కోడి పిల్లలను పెంచుకోవచ్చు
ప్రస్తుతం ఉత్పత్తి అవుతున్న కోడిగుడ్లు, కోడి మాంసంలో 75-80 శాతాన్ని పట్టణాల్లో ఉండే 25 శాతం జనాభా తింటుంటే.. గ్రామీణ ప్రజలు ఇప్పటికీ పోషకాహార లోపంతో బాధపడుతున్నారు. ఈ అంతరాన్ని తొలగించడానికి పెరటి కోళ్ళ పెంపకం ఎంతో దోహదపడుతుంది. గ్రామీణ ప్రాంతాల్లో ఐదు సంవ త్సరాల్లోపు పిల్లల మరణాలకు 69 శాతం కారణం పోషకాహార లోపమే. సంప్రదాయ భారతీయ ఆహారంలో ప్రొటీన్ల లోపం ఉంటుంది. వంద గ్రాముల కోడిగుడ్లలో లభించే 6.9 గ్రాముల నాణ్యమైన ప్రొటీన్ తక్కువ ధరకే లభిస్తుంది. కోడి మాంసంలో కూడా 22 శాతం ప్రొటీన్ ఉండి, కొవ్వు పదార్థాలు తక్కువగా ఉంటాయి.
వ్యవసాయ వ్యర్థాలను సంపదగా మార్చండి చాలా మంది రైతులు వరి గడ్డి, మొక్కజొన్న కాండాలు, చెరకు ఆకులు వంటి అవశేషాలను కాల్చివేస్తారు. అలా చేయకుండా వాటిని ఉపయోగించి వర్మీకంపోస్ట్ , కంపోస్ట్ ,బయోగ్యాస్ ,బయోచార్ ,పుట్టగొడుగుల సాగు , పశుగ్రాసం తయారు చేయవచ్చు. ఇది పర్యావరణాన్ని కాపాడటంతో పాటు ఆదాయాన్ని కూడా పెంచుతుంది.
పూలు, ఔషధ మొక్కలు – తక్కువ విస్తీర్ణంలో అధిక ఆదాయం మల్లె, గులాబీ, బంతి వంటి పూల సాగుతో పాటు తులసి, కలబంద, అశ్వగంధ, లెమన్ గ్రాస్ వంటి ఔషధ, సుగంధ మొక్కల సాగు ద్వారా మంచి ఆదాయం పొందవచ్చు.
నర్సరీలు మరియు విత్తన ఉత్పత్తి నాణ్యమైన నారు మొక్కలు, ధృవీకరించిన విత్తనాలకు రైతుల్లో ఎల్లప్పుడూ డిమాండ్ ఉంటుంది. కూరగాయల నారు , పండ్ల మొక్కలు, పూల మొక్కలు ,అటవీ మొక్కలు తయారు చేసి విక్రయించడం ద్వారా స్థిరమైన ఆదాయం పొందవచ్చు.
స్వపరాగసంపర్క పంటల్లో వరి , శనగ ,పెసర , మినుము ,ఉలవలు మరియు వేరుశెనగ నాణ్యమైన విత్తన ఉత్పత్తి అనేది ద్వితీయ వ్యవసాయం కింద అత్యంత లాభదాయకమైన కార్యకలాపాలలో ఒకటి. ధృవీకరించిన విత్తన ఉత్పత్తి, శుభ్రపరచడం, గ్రేడింగ్, విత్తన శుద్ధి, ప్యాకింగ్, బ్రాండింగ్ వంటి విలువ జోడింపు చర్యలను చేపట్టడం ద్వారా రైతులు సాధారణ ధాన్యం విక్రయంతో పోలిస్తే అధిక ఆదాయాన్ని పొందవచ్చు. ఇది రైతుల ఆర్థికాభివృద్ధికి, గ్రామీణ ఉపాధి పెంపుకు మరియు నాణ్యమైన విత్తనాల లభ్యతకు ముఖ్యమైన సాధనంగా నిలుస్తుంది.
అగ్రో టూరిజం – వ్యవసాయాన్ని ఆదాయ వనరుగా మార్చండి ఇటీవలి కాలంలో నగర ప్రజలు గ్రామీణ జీవనశైలిని అనుభవించడానికి ఆసక్తి చూపుతున్నారు. రైతులు తమ పొలాల్లో ప్రకృతి సందర్శన, సేంద్రీయ వ్యవసాయ ప్రదర్శనలు , గ్రామీణ ఆహారం ,పంటల సందర్శన వంటి కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా అదనపు ఆదాయం పొందవచ్చు.
రైతుల ఆదాయ వృద్ధికి దోహదపడే అనుబంధ ద్వితీయ వ్యవసాయ కార్యకలాపాలు: టెర్రస్ వ్యవసాయం (Terrace Farming) : ఇళ్ల పైకప్పులపై (Terrace) కుండీలు, గ్రో బ్యాగులు, ట్రేలు లేదా ఎత్తైన బెడ్లలో కూరగాయలు, ఆకుకూరలు, సుగంధ ద్రవ్యాలు, పూలు మరియు ఔషధ మొక్కలను సాగు చేయడాన్ని టెర్రస్ వ్యవసాయం అంటారు. పట్టణ ప్రాంతాల్లో భూమి కొరత ఉన్నప్పటికీ, పైకప్పు స్థలాన్ని సద్వినియోగం చేసుకొని తాజా, సురక్షితమైన మరియు రసాయన అవశేషాలు తక్కువగా ఉండే కూరగాయలను ఉత్పత్తి చేయవచ్చు. టెర్రస్‌లో పండించిన ఉత్పత్తులను సేంద్రియ కూరగాయలుగా విక్రయించడం, నారు మొక్కలు తయారు చేసి అమ్మడం, సేంద్రియ ఎరువులు తయారు చేయడం, విలువ జోడింపు చేసి ప్యాకింగ్ చేయడం ద్వారా అదనపు ఆదాయం పొందవచ్చు.
కిచెన్ గార్డెన్ (Kitchen Garden / పోషక తోట) ఇంటి పరిసరాల్లో లేదా పెరట్లో కుటుంబ అవసరాలకు సరిపడా కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు, సుగంధ ద్రవ్యాలు మరియు ఔషధ మొక్కలను పండించే తోటను కిచెన్ గార్డెన్ లేదా పోషక తోట అంటారు. దీని ప్రధాన లక్ష్యం కుటుంబానికి ఏడాది పొడవునా తాజా పోషకాహారాన్ని అందించడం.
కిచెన్ గార్డెన్ ద్వారా ఉత్పత్తి చేసిన అదనపు కూరగాయలు, నారు మొక్కలు లేదా విత్తనాలను విక్రయించడం ద్వారా కుటుంబానికి అదనపు ఆదాయం లభిస్తుంది. అలాగే ఇంట్లో తయారుచేసిన కంపోస్ట్, వర్మీకంపోస్ట్, జీవామృతం వంటి సేంద్రియ ఉత్పత్తులను ఉపయోగించడం ద్వారా ఖర్చు తగ్గి ఆదాయం పెరుగుతుంది.
ప్రభుత్వ పథకాల వినియోగం రైతులు ఈ పథకాల ద్వారా శిక్షణ, రుణాలు, సబ్సిడీలు పొందవచ్చు. • ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార పరిశ్రమల అభివృద్ధి పథకం (PMFME) • వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధి (Agriculture Infrastructure Fund) • జాతీయ తేనెటీగల మరియు తేనె మిషన్ • డెయిరీ అభివృద్ధి పథకాలు • NABARD గ్రామీణ వ్యవసాయ ఆధారిత పరిశ్రమల పథకాలు
నేటి వ్యవసాయ పరిస్థితుల్లో “పంట పండించడం మాత్రమే కాదు… పంటకు విలువ జోడించడం కూడా రైతు విజయానికి కీలకం.” ద్వితీయ వ్యవసాయం ద్వారా రైతులు పంటలతో పాటు పాలు, తేనె, పుట్టగొడుగులు, చేపలు, కోళ్లు, సేంద్రియ ఎరువులు, ప్రాసెసింగ్ ఉత్పత్తులు, నర్సరీలు వంటి అనేక ఆదాయ మార్గాలను అభివృద్ధి చేసుకోవచ్చు. దీనివల్ల కుటుంబానికి సంవత్సరం పొడవునా స్థిరమైన ఆదాయం లభించడమే కాకుండా, గ్రామీణ యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. అందువల్ల ప్రతి రైతు తన వ్యవసాయానికి అనువైన కనీసం ఒకటి లేదా రెండు ద్వితీయ వ్యవసాయ కార్యకలాపాలను చేపట్టి “ఉత్పత్తిదారుడు” నుండి “వ్యవసాయ పారిశ్రామికవేత్త”గా ఎదగడానికి కృషి చేయాలి.”వ్యవసాయంలో వైవిధ్యం – రైతు కుటుంబానికి స్థిరమైన ఆదాయం” అనే లక్ష్యంతో ద్వితీయ వ్యవసాయాన్ని ప్రతి గ్రామంలో విస్తృతంగా ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది.
డా. కె.తేజస్వర రావు మరియు డా . బి. సహదేవ రెడ్డి ఆచార్య N G రంగా వ్యవసాయ విశ్వ విద్యాలయము
మోషపత్రి ఒక వార్షిక మొక్క. దీని కాండం నిటారుగా ఉండి గోధుమ రంగు లేదా ఊదా గోధుమ రంగుతో ఉంటుంది. మొక్క నూగు లేకుండా సహజంగా 30 నుండి 100 సెం.మీ. ఎత్తు పెరుగుతుంది. ఆకులు 3-5 సెం.మీ. పొడవుండి 2 లేదా 3 చిన్న ఆకులుగా విడిపోతాయి. ఆకులు అధిక సువాసన కలిగి ఉంటాయి. ఎండిన ఆకులలో 0 నుండి 1.5% వరకు ఆర్టెమిసినిన్ రసాయనముంటుంది. పూలు 2-2.5 మి.మీ. వ్యాసంతో వదులుగా ఉన్న కంకులతో ఏర్పడతాయి. వాటి రంగు ఆకుపచ్ౘ్పసుపు రంగులో ఉంటుంది. గింజలు గోధుమ రంగులో 0.6-0.8 మి.మీ. వ్యాసంలో ఉంటాయి. సగటు 1000 గింజల బరువు 0.03 గ్రా.
సాధారణ నామం : స్వీట్ వార్మ్‌వుడ్/స్వీట్ అన్నీ శాస్త్రీయ నామం : ఆర్టెమిసియా యాన్యువా కుటుంబం: ఆస్టరేసి
ఉపయోగాలు : ఔషధరంగంలో …
మోషపత్రిని సంప్రదాయకంగా మలేరియా అనుబంధ జ్వరాలతో సహా జ్వరాల చికిత్సకుపయోగిస్తారు. ఇది యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలను కలిగి ఉంటుంది. మోషపత్రిలో ఉండే ఆర్టెమిసినిన్ రోగ నిరోధక వ్యవస్థను పెంచుతుంది.
మోషపత్రి రసంలో ఉండే ఆర్టెమిసినిన్, ఆర్టెసునేట్‌లు క్యాన్సర్ చికిత్సలో అధ్యయనం చేయబడుతున్నాయి. వైరల్, బాక్టీరియల్ ఇన్‌ఫెక్షన్స్ వల్ల వచ్చే జ్వరాల చికిత్సలో ఉపయోగిస్తారు.
ఇవి ముఖ్యంగా డీసెంట్రి, సాధారణ జలుబు, ఫంగల్ ఇన్‌ఫెక్షన్స్ నివారణలో సమర్ధవంతంగా పనిచేస్తాయి. ఆకలి లేకపోవడం, ఇతర జీర్ణ సంబంధ సమస్యల చికిత్సకు ఉపయోగిస్తారు. సోరియాసిస్, ఎక్ౙిమా వంటి చర్మ వ్యాధుల చికిత్సకు ఉపయోగిస్తారు.
వ్యవసాయరంగంలో …
మోషపత్రి ఆకు ద్రావణం అధిక నష్టం కలిగించే లెస్సర్ మల్బరి పైరాలిడ్, గ్లెåఫోడెస్ పైలోయాలిస్ గుడ్లు పొదగడాన్ని అరికట్టింది (రోయాకోస్రలి, అతని అనుచరులు, 2010).
మోషపత్రి ఆకు ద్రావణాలు, ఎసెన్షియల్ ఆయిల్స్ పురుగుల నివారణలో అనేక విధాలుగా బలమైన ప్రభావాన్ని చూపాయి. అవి వికర్షక, ఫూమిగెంట్, యాంటిఫీడెంట్, ఎంజైమ్‌ల చర్యలలో జోక్యం, పురుగు పెరుగుదలలో మార్పులు తెచ్చే పురుగులను నివారించాయి (సెండి, కోస్రలి, 2013)
మోషపత్రి ఎసెన్షియల్ ఆయిల్ ఫ్యూమిగెంట్ చర్య ద్వారా ఎర్ర చీమలను నివారించాయి (లియాంగ్ టాంగ్, అతని అనుచరులు, 2013)
మోషపత్రి ఎసెన్షియల్ మరియు ద్రావణాలు వికర్షక, ఫ్యూమిగెంట్, యాంటీ పీడెంట్ చర్యలు, ఎంజైమ్ చర్యలలో జోక్యం, పురుగు పెరుగుదలలో మార్పు చర్యల ద్వారా పురుగులను సమర్ధవంతంగా నివారించాయి.
మోషపత్రి ద్రావణం నిల్వ ధాన్యంలో ఆశించే బీటిల్ ట్రైబోలియం కాస్టానియంని సమర్ధవంతంగా నివారించింది (జులాటి సెండి, అతని అనుచరులు, 2003)
మోషపత్రి వేరులోని ఎసెన్షియల్ ఆయిల్ 80% ట్రైబోలియం కాస్టానియం పెద్ద పురుగులను నివారించింది (గోయెల్, అతని అనుచరులు, 2007)
మోషపత్రి { మిరప ద్రావణాల మిశ్రమం ప్రత్తి పంటలో గులాబి రంగు కాయతొలుచు పురుగు (పెక్టినోఫొరా గాస్సిపియెల్లా)ను సమర్థవంతంగా నివారించింది (రేడా, అతని అనుచరులు, 2014).
మోషపత్రి ఎసెన్షియల్ ఆయిల్ నిల్వ ధాన్యంలో ఆశించే పురుగులు ట్రెబోలియం కాస్టానియం, కాల్లసోబ్రూకస్ మాక్యులేటస్‌లపై విషపూరిత మరియు వికర్షణ ప్రభావాలను చూపించింది (త్రిపాఠి, అతని అనుచరులు, 2000).
మోషపత్రి ద్రావణం (500 పిపియం మరియు 250 పిపియం) మెలాయిడోగైన్ ఇన్‌కాగ్నిట, రోటివెంక్యులస్ రెనిఫార్మిస్ నెమటోడ్లను నివారించింది (షకీల్, అతని అనుచరులు, 2004).
మోషపత్రి ఆల్కహాల్ ద్రావణం (32.69%) మెలాయిడోగైన్ ఇన్‌కాగ్నిట గుడ్లను అత్యంత సమర్థవంతంగా పొదగకుండా చేశాయి (కటారి, అతని అనుచరులు, 2011).
మోషపత్రి 15, 10, మరియు 5% మిథనాల్ ద్రావణాలు పొటాటో పొడి కుళ్లు కల్గించే శిలీంద్రం ఫ్యుజేరియం సొలాని పెరుగుదలనరికట్టడం, శిలీంద్ర బీజాలు మొలకెత్తకుండా చేయడంలో అత్యుత్తమ ప్రభావం చూపాయి. మోషపత్రి15% మిథనాల్ ద్రావణం ఆలుగడ్డ దుంపల నిల్వ సమయంలో వేరుకుళ్ళు (డ్రైరూట్ రాట్) తెగులు ఆశించకుండా కాపాడింది (మసౌద్ జాకర్, 2014).
మోషపత్రి ద్రావణం ప్రత్తి పంటనాశించే గులాబి రంగు కాయతొలుచు పురుగు లార్వాలు, జీవిత చక్రం, జీవిత కాలం, గుడ్లు పెట్టే సామర్థ్యం, గుడ్లు పొదిగే శాతంపై ప్రతికూల ప్రభావం చూపింది (రేడా, అతని అనుచరులు, 2014).
మోషపత్రి ఎండుఆకులు కలుపు మొక్క రెడ్‌రూట్ పిగ్ వీడ్‌పై అల్లెలోపతి ప్రభావం చూపాయి. (లైడాన్, అతని అనుచరులు, 1997).
మోషపత్రిలో ఉండే అర్టెమిసినస్ అనే రసాయనం స్ట్రెåగా విత్తనాలు మొలకెత్తడాన్ని నివారించింది. కాని చిక్కుడు, మొక్కజొన్న విత్తనాలపై ఎటువంటి దుష్ప్రభావం చూపలేదు (గోమెజ్, 2011).
మోషపత్రి ఎసెన్షియల్ ఆయిల్ నిల్వ ధాన్యంలో ఆశించే పురుగు కాల్లసోబ్రూకస్ మాక్యులేటస్‌ని నివారించడానికి ఉపయోగించవచ్చు. (మొటాగి, అతని అనుచరులు, 2014).
మోషపత్రి తాజా ఆకులు, ఎండిన పదార్థం నుండి తయారు చేసిన ద్రావణాలు బఠాణి పేనుబంక (ఆక్రితోసైఫం పైసమ్) రెక్కలు లేని ఆడపురుగులు, లార్వాలను చంపాయి. అంతేగాక, ఎండు పదార్థం కొలరాడో బీటిల్ పెద్ద పురుగులు తినడాన్ని అరికట్టాయి. ఎండు పదార్థం ద్రావణాలు (5%, 10%), తాజా ఆకుల ద్రావణం (30%) లీఫ్ బీటిల్ లార్వాల నష్టాన్ని తగ్గించాయి (మిలెనారూసిన్, అతని అనుచరులు, 2016).
ఆర్టెమిసియా వుల్గారిస్ అద్భుతమైన యాంటిఫీడెంట్ లక్షణాలు కలిగి ఉంది (గురుసుబ్రమణ్యం, అతని అనుచరులు, 2008). ఈ మొక్కను పూత రాక ముందు సేకరించి ఆకులను, కాండాన్ని చిన్న ముక్కలుగా కత్తిరించాలి. ఒక కిలో కత్తిరించిన ఆకులు, కొమ్మల ముక్కలను ఒక బకెట్‌లో తీసుకుని 10 లీ. నీరు పోసి 16-24 గంటలుంచాలి. తర్వాత ఈ ద్రావణాన్ని వడపోసి తేయాకు పంటనాశించే పురుగుల నివారణకు పిచికారి చేయాలి. 10% ద్రావణం పిచికారి చేసి ఎర్రనల్లిని నివారించవచ్చు.
మోషపత్రి అగ్రో మరియు డిస్టిలేషన్ వ్యర్థాలనుపయోగించి తయారు చేసిన వర్మికంపోస్టు టమాట రూట్‌నాట్ నెమటోడ్‌ని సమర్థవంతంగా నివారించింది (పాండె & కల్రా, 2010).
ఆర్టెమిసియా స్పీసీస్‌ని టమాట రూట్‌నాట్ నెమటోడ్ యాజమాన్యంలో జీవ సేంద్రియ వ్యర్థంగాను, ఎసెన్షియల్ ఆయిల్ ద్రావణం గాను ఉపయోగిస్తారు (బావ, అతని అనుచరులు, 2014, పాండె, 2005).
మెలాయిడోగైన్ ఇన్ కాగ్నిట (నెమటోడ్) యాజమాన్యంలో మోషపత్రి భూమి క్రింది భాగం (వేరువ్యవస్థ) వికర్షక చర్య ప్రదర్శిస్తుంది. మాషపత్రి వోలటైల్ రసాయనాలలో మోనోటెర్పిన్స్, సెస్క్యిటెర్పిన్స్ అధికంగా ఉంటాయి. అందువలన దీనిని \మాటలో అంతర పం\గా వేసి రూట్‌నాట్ నెమటోడ్‌ని నివారించవచ్చు. (సిడ్ని మ్వాంబ, 2016).
మోషపత్రి ద్రావణాన్ని ఉపయోగించి పొగాకు పంటనాశించే పేనుబంకను నివారించవచ్చు. ద్రావణం తయారీకి తాజా ఆకులను సేకరించి, నీడలో ఆరబెట్టి, ఆల్కహాల్‌లో రాత్రంతా నానబెట్టాలి. ఈ ద్రావణం పొగాకు పేనుబంకను సమర్ధవంతంగా చంపుతుంది. పొగాకు మొగ్గతొలిచే పురుగుని ఇథనాల్ ద్రావణం సమర్ధవంతంగా నివారిస్తుంది.
మోషపత్రి మిథనాల్ ద్రావణం లెస్సర్ మల్బరి పై రాలిడ్ (గ్లెåసోడెస్ పైలాలిస్)ని పంటనాశించకుండా ఆటంక పరచింది (రోయాకోసార్వి, అతని అనుచరులు, 2010).
ప్రత్తి మరియు ఇతర ముఖ్య పంటలనాశించే శనగపచ్చ పురుగు (హెలివకోర్సా ఆర్మిజెరా) నివారణకు మాషపత్రి ఎసెన్షియల్ ఆయిల్‌ని సిఫారసు చేశారు (మహ్‌బేబ్‌కర్, అతని అనుచరులు, 2015).
మోషపత్రి ఎసెన్షియర్ ఆయిల్ మరియు ఆకు ద్రావణాలను హెలికోవర్మా ఆర్మిజరాలార్వాల ఆహారంలో కలిపితే లార్వాల బరువు 69.71% మరియు 60.21% తగ్గింది (నీలిమ అన్షుల్, ఆమె అనుచరులు, 2014)
గుమ్మడి నారు మొక్కలలో పురుగుల నివారణకు మాషపత్రి ద్రావణం పురుగులను తట్టుకునే చర్య కలిగి ఉంది (యుయు, 2017)
మాషపత్రి ఆకులు, కాండం, పూల నుండి తయారు చేసిన ద్రావణాన్ని గుమ్మడి ఆకు కణాలపై ఒక చదరపు సెంటీమీటరుకి 1.5 మి.గ్రా. చొప్పున పిచికారి చేస్తే 100% ఎపిలాక్నా పీన్సులేటా లార్వాలు 87% స్పోడోప్టెరా ఎరిడానియా లార్వాలు తినకుండా ఆటంక పరచబడ్డాయి (డిటర్రెంట్ చర్య). (మాగి, ఆమె అనుచరులు, 2005)
మోషపత్రి ద్రావణం పొటాటో సిస్ట్ నెమటోడ్ (గ్లోబోడెరా రోస్టోకైనెన్సిస్) చిన్న పురుగులను అతి సమర్ధవంతంగా నివారించింది. కాని మెలాయి డోగైన్ ఇన్‌కాగ్నిట చిన్న పురుగులు (జువైనైల్స్) ఎక్కువ కాలం బయలుపరిచితేనే చనిపోయాయి. దీనికి విరుద్ధంగా ఈ ద్రావణం ప్రభావం మెలాయిడోగైన్ గుడ్లు పొదగడాన్ని అత్యంత సమర్ధవంతంగా నివారించింది కాని గ్లోబొడెరాపై అత్యంత తక్కువ ప్రభావం చూపింది. సేంద్రియ వ్యవసాయంలో సుస్థిర నులిపురుగుల యాజమాన్యంలో మోషపత్రి ద్రావణం ముఖ్య పాత్రపోషిస్తుంది. (అడ్డాబ్బో, అతని అనుచరులు, 2013)
15% మోషపత్రి ద్రావణం బంగాళాదుంపలలో ఫ్యుజేరియం సొలాని కలిగించే పొడి వేరుకుళ్ళుని సమర్ధవంతంగా నివారించింది (మసాద్‌జాకర్, 2014).
గ్రామీణ పశుపోషణలో డిజిటల్ విప్లవం వ్యవసాయ రంగాన్ని, ముఖ్యంగా గ్రామీణ ఆర్థిక వ్యవస్థను కొత్త పుంతలు తొక్కిస్తోంది. భారతదేశంలో గ్రామీణ ప్రాంతాల ప్రజల జీవనాధారంలో పశుపోషణకు ముఖ్యమైన స్థానం ఉంది. వ్యవసాయంతో పాటు పశువులను పెంచడం ద్వారా రైతులు అదనపు ఆదాయాన్ని పొందుతున్నారు. గతంలో పశుపోషణ సంప్రదాయ పద్ధతులపై ఆధారపడగా, ప్రస్తుతం డిజిటల్ సాంకేతికత అందుబాటులోకి రావడంతో ఈ రంగంలో గణనీయమైన మార్పులు చోటుచేసుకుంటున్నాయి. మొబైల్ ఫోన్లు, ఇంటర్నెట్, డిజిటల్ యాప్‌లు, ఆన్‌లైన్ సేవలు వంటి సాంకేతిక సాధనాలు రైతులకు పశువుల సంరక్షణ, ఆరోగ్య నిర్వహణ, మార్కెటింగ్ మరియు ఆర్థిక లావాదేవీలలో సహాయపడుతున్నాయి. ఈ నేపథ్యంలో గ్రామీణ పశుపోషణలో డిజిటల్ విప్లవం రైతుల జీవితాలను సులభతరం చేస్తూ, వారి ఆదాయాన్ని పెంచే దిశగా కీలక పాత్ర పోషిస్తోంది.
పశువులకు డిజిటల్ గుర్తింపు (RFID ట్యాగింగ్): ప్రతి పశువు చెవికి ప్రత్యేకమైన డిజిటల్ కోడ్ కలిగిన ట్యాగ్‌ను (RFID – Radio Frequency Identification) అమర్చుతున్నారు. దీని ద్వారా పశువు పుట్టిన తేదీ, యజమాని వివరాలు, ఇచ్చిన టీకాలు, మరియు ఆరోగ్య చరిత్రను కేంద్ర ప్రభుత్వ నేషనల్ డిజిటల్ లైవ్ స్టాక్ మిషన్ (NDLM) డేటాబేస్ లో నిక్షిప్తం చేస్తున్నారు. ఇది పశువుల అక్రమ రవాణాను అరికట్టడానికి మరియు నకిలీ పశువులను గుర్తించడానికి సహాయపడుతుంది.
పశువుల ఆరోగ్యంపై నిరంతర పర్యవేక్షణ- డిజిటల్ టెక్నాలజీ వల్ల వచ్చిన ముఖ్యమైన మార్పుల్లో పశువుల ఆరోగ్య పర్యవేక్షణ ఒకటి.
ప్రస్తుతం పశువులకు స్మార్ట్ కాలర్లు లేదా చెవులకు అమర్చే సెన్సర్లు అందుబాటులో ఉన్నాయి. ఇవి పశువుల శరీర ఉష్ణోగ్రత, కదలికలు, ఆహారం తీసుకునే విధానం వంటి విషయాలను నిరంతరం గమనిస్తాయి.
పశువులో ఏదైనా అసాధారణ లక్షణం కనిపిస్తే వెంటనే రైతు మొబైల్‌కు సమాచారం చేరుతుంది. దీంతో వ్యాధిని ప్రారంభ దశలోనే గుర్తించి చికిత్స చేయవచ్చు. ఫలితంగా పశువుల ఆరోగ్యం మెరుగుపడటమే కాకుండా వైద్య ఖర్చులు కూడా తగ్గుతాయి.
మన దేశంలో కొన్ని AI ఆధారిత వ్యవస్థలు మాస్టైటిస్, లంపీ స్కిన్ డిసీజ్ వంటి వ్యాధులను కూడా ముందుగానే గుర్తించే సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి.
పాల ఉత్పత్తి మరియు విక్రయాలలో డిజిటలైజేషన్: పాల సేకరణ కేంద్రాలలో ‘ఆటోమేటిక్ మిల్క్ కలెక్షన్ యూనిట్స్’ (AMCU) వచ్చాయి. వీటి ద్వారా పాలు ఎన్ని ఉన్నాయి, వాటిలో నాణ్యత (ఫ్యాట్ శాతం) ఎంత ఉందో క్షణాల్లో తెలిసిపోతుంది. రైతు ఖాతాలో నేరుగా డబ్బులు జమ కావడం వల్ల పారదర్శకత పెరుగుతుంది.
డిజిటల్ పరికరాలు పశువుల ఉత్పాదకతను కూడా పెంచుతున్నాయి. పశువులు ఎంత మేత తింటున్నాయి, ఎప్పుడు మేత ఇవ్వాలి, సంతానోత్పత్తికి సరైన సమయం ఎప్పుడు అనే విషయాలను ఇవి గుర్తించగలవు. అలాగే పాల ఉత్పత్తికి సంబంధించిన వివరాలను కూడా విశ్లేషించగలవు.
దీంతో ప్రతి పశువుపై ప్రత్యేక శ్రద్ధ పెట్టడం సాధ్యమవుతుంది. ఫలితంగా పాల ఉత్పత్తి పెరిగి రైతుల ఆదాయం కూడా మెరుగుపడుతోంది.
కృత్రిమ గర్భధారణ (AI) మరియు సంతానోత్పత్తి యాప్‌లు: పశువుల ఈత సమయం, ఎదకు వచ్చే సమయం కచ్చితంగా తెలిస్తేనే పాడి పరిశ్రమ లాభసాటిగా ఉంటుంది. దీని కోసం ప్రత్యేక మొబైల్ యాప్‌లు వచ్చాయి. ఇవి పశువుల ఆరోగ్య చక్రంను పర్యవేక్షించి, రైతులకు సరైన సమయానికి సూచనలు పంపుతాయి.
రైతుల చేతిలో స్మార్ట్‌ఫోన్ శక్తి- నేటి కాలంలో స్మార్ట్‌ఫోన్ రైతులకు ఒక ముఖ్యమైన సాధనంగా మారింది. మొబైల్ యాప్‌ల ద్వారా రైతులు పశువైద్యుల సలహాలు పొందవచ్చు. టెలీమెడిసిన్ సేవలను ఉపయోగించవచ్చు. వాతావరణ సమాచారం తెలుసుకోవచ్చు. వ్యాధులపై హెచ్చరికలు పొందవచ్చు. మార్కెట్ ధరలు తెలుసుకోవచ్చు. అలాగే పశువులు లేదా పాల ఉత్పత్తులను ఆన్‌లైన్‌లో విక్రయించవచ్చు. టీకాలు వేయాల్సిన తేదీలు, మందులు ఇవ్వాల్సిన సమయాల గురించి కూడా యాప్‌లు గుర్తు చేస్తాయి.
వ్యాధుల నియంత్రణలో డిజిటల్ టెక్నాలజీ పాత్ర పశువుల ప్రవర్తనలో ఏదైనా అసాధారణ మార్పు కనిపిస్తే డిజిటల్ పరికరాలు వెంటనే హెచ్చరికలు పంపిస్తాయి. దీంతో వ్యాధులు ఎక్కువగా వ్యాపించకముందే అవసరమైన చర్యలు తీసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల పశువుల మరణాలు తగ్గడమే కాకుండా రైతులు ఆర్థిక నష్టాల నుంచి కూడా రక్షించబడతారు.
పశువైద్య సేవలు – ఈ-సంజీవని: దూర ప్రాంతాల్లోని రైతులకు పశువైద్యుల సలహాలు, సూచనలు అందించడానికి టెలి-మెడిసిన్ అందుబాటులోకి వచ్చింది. స్థానిక వైద్యాధికారులు అందుబాటులో లేనప్పుడు, స్మార్ట్ ఫోన్ ద్వారా వీడియో కాల్స్ చేసి వ్యాధులను నిర్ధారించి, చికిత్స అందించవచ్చు.
మార్కెట్ అవకాశాల విస్తరణ- డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌ల వల్ల రైతులు తమ ఉత్పత్తులను నేరుగా కొనుగోలుదారులకు విక్రయించే అవకాశం పొందుతున్నారు. దీంతో మధ్యవర్తులపై ఆధారపడాల్సిన అవసరం తగ్గుతుంది. ఉత్పత్తులకు సరైన ధర లభిస్తుంది. మార్కెట్ సమాచారం సులభంగా అందుతుంది. కొత్త వ్యాపార అవకాశాలు కూడా పెరుగుతాయి. అలాగే డిజిటల్ చెల్లింపుల వల్ల డబ్బు లావాదేవీలు మరింత సురక్షితంగా, వేగంగా జరుగుతున్నాయి.
పర్యావరణ పరిరక్షణకు తోడ్పాటు డిజిటల్ టెక్నాలజీ వినియోగం వల్ల యాంటీబయాటిక్స్ అవసరానికి మించి వాడాల్సిన అవసరం తగ్గుతుంది. నీరు, మేత వంటి వనరుల వృథా తగ్గుతుంది. పర్యావరణంపై ప్రభావం కూడా తగ్గుతుంది. దీంతో అందుబాటులో ఉన్న వనరులను మరింత సమర్థవంతంగా ఉపయోగించుకోవచ్చు.
రైతులు ఎదుర్కొంటున్న సవాళ్లు అయితే ఈ మార్పుల మధ్య కొన్ని సవాళ్లు కూడా ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్నెట్ సౌకర్యం ఇంకా పూర్తిగా అందుబాటులో లేకపోవడం. డిజిటల్ పరిజ్ఞానం కొంతమందికి తక్కువగా ఉండటం. ఆధునిక పరికరాల ధరలు ఎక్కువగా ఉండటం వంటి కారణాల వల్ల రైతులందరూ ఈ సాంకేతికతను పూర్తిగా వినియోగించలేకపోతున్నారు. అందుకే రైతులకు శిక్షణ, అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం చాలా అవసరం. ఈ దిశగా ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు, ప్రైవేట్ కంపెనీలు కలిసి పనిచేస్తున్నాయి.
ముగింపు డిజిటల్ టెక్నాలజీ సంప్రదాయ పశుపోషణ పద్ధతులను తొలగించడం లేదు. వాటిని మరింత మెరుగుపరుస్తోంది. రైతుల అనుభవానికి ఆధునిక సాంకేతికత తోడవడంతో పశుపోషణ మరింత సులభంగా, సమర్థవంతంగా మారుతోంది. ఆరోగ్యకరమైన పశువులు, అధిక ఆదాయం, బలమైన గ్రామీణ ఆర్థిక వ్యవస్థ నిర్మాణంలో డిజిటల్ టెక్నాలజీ కీలక పాత్ర పోషిస్తోంది. రాబోయే రోజుల్లో పశుపోషణలో డిజిటల్ సాధనాలు కూడా భూమి, నీరు, మేతల మాదిరిగానే అవసరమైనవిగా మారనున్నాయి. ఈ డిజిటల్ విప్లవం కేవలం పట్టణాలకే పరిమితం కాకుండా, గ్రామీణ ప్రాంతాలకు విస్తరించడం వల్ల పాడి రైతుల జీవితాల్లో కొత్త వెలుగులు వస్తున్నాయి. యువత కూడా ఈ ఆధునిక పశుపోషణ పట్ల ఆసక్తి చూపుతున్నారు.
డా. బద్దం అఖిల (ఎం.వి.ఎస్‌సి.), డా. సంతోషిణి చింత, అసిస్టెంట్ ప్రొఫెసర్, పశువైద్య మరియు పశుసంవర్ధక విస్తరణ విద్య విభాగం, పశువైద్య శాస్త్ర కళాశాల, కోరుట్ల. Ph: 9703121088
పెరుగుతున్న జనాభా, నేల క్షీణత, అస్థిర వాతావరణం ఈ మూడు ఒత్తిళ్లు నేటి ప్రపంచ వ్యవసాయాన్ని చుట్టుముట్టాయి. లోతైన నాగలి దుక్కి మీద ఆధారపడిన సాంప్రదాయ వ్యవసాయ పద్ధతులు నేల కోతకు, పోషకాల నష్టానికి కారణమవుతున్నాయని దశాబ్దాలుగా గుర్తించబడింది. ఈ నేపథ్యంలో, 1970లలో అమెరికాలో మొదలై బ్రెజిల్, అర్జెంటీనా, కెనడా వంటి దేశాలకు విస్తరించిన పరిరక్షణ వ్యవసాయం ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పొందింది. 1970లో కేవలం 10 లక్షల హెక్టార్లలో ఉన్న పరిరక్షణ వ్యవసాయం విస్తీర్ణం, 2019 నాటికి 102 దేశాల్లో సుమారు 20.5 కోట్ల హెక్టార్లకు (ప్రపంచ సాగుభూమిలో దాదాపు 15%) పెరిగింది.
పరిరక్షణ వ్యవసాయం అనేది ఒకే ఒక్క పద్ధతి కాదు ఇది మూడు అంశాల సమీకృత వ్యవస్థ: (1) కనీస యాంత్రిక నేల కదలిక, (2) పంట అవశేషాలు లేదా కవర్ పంటల ద్వారా నేలపై శాశ్వత సేంద్రియ కవచం, (3) పంట మార్పిడి లేదా అంతర పంటల ద్వారా జీవవైవిధ్యం.
తక్కువ కదలిక నేల కణాల నిర్మాణాన్ని కాపాడితే, ఉపరితల అవశేషాలు వర్షపు దెబ్బ నుండి, తేమ నష్టం నుండి ఆ నిర్మాణాన్ని కాపాడతాయి. పంట మార్పిడి జీవ కార్యకలాపాలను పునరుద్ధరించి, చీడపీడల చక్రాలను విచ్ఛిన్నం చేస్తుంది.
నేల ఆరోగ్యంపై ప్రభావం
పరిరక్షణ వ్యవసాయం వల్ల కలిగే జీవశాస్త్రపరమైన మార్పులు అత్యంత స్థిరంగా కనిపిస్తాయి. ప్రపంచవ్యాప్త మెటా-విశ్లేషణ ప్రకారం, అవశేషాల నిలుపుదలతో కూడిన సున్నా-దుక్కి పద్ధతి పై 20 సెం.మీ నేలలో సూక్ష్మజీవుల జీవద్రవ్యరాశిని 37% పెంచుతుంది (శిలీంధ్రాలలో 31%, బ్యాక్టీరియాలో 11% పెరుగుదల). ఇండో-గంగా మైదానాల్లో ఆరేళ్ల అధ్యయనంలో సున్నా-దుక్కి పద్ధతి ఎగువ 15 సెం.మీ నేలలో హెక్టారుకు సుమారు 2 టన్నుల సేంద్రియ కర్బనాన్ని నిల్వ చేసినట్లు తేలింది. అయితే ఈ కర్బన నిల్వ లోతును బట్టి మారుతుంది 60 సెం.మీ లోతు వరకు కొలిచినప్పుడు సాంప్రదాయ, సున్నా-దుక్కి పద్ధతుల మధ్య తేడా గణనీయంగా తగ్గిపోతుందని మరో అధ్యయనం హెచ్చరిస్తోంది. మృత్తిక స్థూల సాంద్రత విషయంలో మాత్రం సాహిత్యంలో నిజమైన భిన్నాభిప్రాయం ఉంది కొన్ని అధ్యయనాలు స్వల్ప పెరుగుదలను, మరికొన్ని తగ్గుదలను నివేదిస్తున్నాయి.
చిత్రం 1: పరిరక్షణ వ్యవసాయపు మూడు మూలస్తంభాలు పరస్పరం బలపరుచుకునే ఒక సమీకృత వ్యవస్థ.
దిగుబడి, ఆర్థిక అంశాలు మెటా-విశ్లేషణ ప్రకారం, సున్నా-దుక్కి పద్ధతి సగటున 5.1% దిగుబడి తగ్గుదలకు దారితీస్తుంది. కానీ ఇది పంట, వాతావరణం మేరకు చాలా తేడాగా ఉంటుంది నూనెగింజలు, పత్తి, పప్పుధాన్యాలలో తగ్గుదల లేదు; మొక్కజొన్న, వరిలో ఎక్కువ తగ్గుదల (సుమారు 7.5%) కనిపించింది. పొడి వాతావరణాలలో వర్షాధార పంటలకు సున్నా-దుక్కి పద్ధతి సాంప్రదాయ పద్ధతితో సమానంగా లేదా మెరుగ్గా పనిచేస్తుంది. మలావిలో జరిగిన క్షేత్ర అధ్యయనాల్లో పరిరక్షణ వ్యవసాయ ఆధారిత మొక్కజొన్న పంట దిగుబడిని 22 – 31%, రైతు ఆదాయాన్ని 50 – 83% పెంచడంతో పాటు హెక్టారుకు 28–39 పని దినాల శ్రమను తగ్గించాయి. పంట మార్పిడి, సరైన పొషకాల యాజమాన్యం లేకుండా పరిరక్షణ వ్యవసాయం పూర్తి ప్రయోజనాలు అందించదని గమనించాలి.
వాతావరణ స్థితిస్థాపకత, కర్బన నిల్వ ఉత్తర చైనా మైదానంలో జరిగిన ఎనిమిదేళ్ల వేడెక్కింపు ప్రయోగంలో, పరిరక్షణ వ్యవసాయం పద్ధతిలో నేల చల్లగా, తేమగా ఉండి, శీతాకాల గోధుమ దిగుబడి వేడెక్కింపు వల్ల 9.3% పెరిగింది. ఈ ప్రయోజనం సంవత్సరాలు గడిచేకొద్దీ మరింత బలపడటం గమనార్హం ఇది స్థిరమైన, కాలానుగుణంగా పెరిగే ప్రయోజనమని సూచిస్తుంది. అదేవిధంగా, నో-టిల్ మరియు తగ్గిన దుక్కి పద్ధతులు నత్రజని ఆక్సైడ్ ఉద్గారాలను సాంప్రదాయ పద్ధతితో పోలిస్తే సుమారు 11% తగ్గిస్తాయని ప్రపంచవ్యాప్త మెటా-విశ్లేషణ తెలిపింది, ముఖ్యంగా తేమతో కూడిన వాతావరణాలలో ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుంది.
కలుపు యాజమాన్యం, ఖచ్చితమైన వ్యవసాయ సాంకేతికత నేల కదలిక తగ్గించడం వల్ల దుక్కి ఆధారిత కలుపు నియంత్రణ తొలగిపోతుంది కాబట్టి, విత్తడం, ఎరువులు, కలుపు/చీడ నియంత్రణ వంటి పనులను మరింత ఖచ్చితత్వంతో నిర్వహించాల్సిన అవసరం ఏర్పడుతుంది. ఇక్కడే జిపిఎస్-ఆధారిత యంత్రాలు, రిమోట్ సెన్సింగ్, డ్రోన్‌లు , జియోగ్రాఫిక్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్, వేరియబుల్-రేట్ టెక్నాలజీ వంటి ఖచ్చితమైన వ్యవసాయ సాంకేతికతలు కీలక పాత్ర పోషిస్తాయి. అవశేషాల కవచం వల్ల నేలపై కలుపు మొక్కలను గుర్తించడం కష్టతరం కావడంతో, డ్రోన్ చిత్రాల ఆధారంగా కృతిమ మేధస్సు (ఏ ఐ/ఎం ఎల్/డి ఎల్) సాయంతో కలుపు మ్యాపింగ్, స్థల-ఆధారిత హెర్బిసైడ్ ప్రయోగం వంటి పద్ధతులు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. అయితే యంత్రాలు, మూలధనం, సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో లేకపోవడం చిన్న, సన్నకారు రైతులకు ఈ సాంకేతికతలను చేరువ చేయడంలో పెద్ద అడ్డంకిగా మిగిలిపోయింది.
చిత్రం 2: ఖచ్చితమైన వ్యవసాయం మరియు కలుపు యాజమాన్యం. డ్రోన్లు, రిమోట్ సెన్సింగ్ మరియు కృతిమ మేధస్సు వంటి ఆధునిక సాంకేతికతలను ఉపయోగించి కలుపు మొక్కలను గుర్తించడం, మ్యాపింగ్ చేయడం మరియు లక్షిత ప్రాంతాల్లో మాత్రమే నియంత్రణ చర్యలను చేపట్టే విధానాన్ని ఈ వైజ్ఞానిక చిత్రపటం వివరిస్తుంది. ఇది చిన్న రైతులు ఎదుర్కొంటున్న పెట్టుబడి మరియు సాంకేతిక సవాళ్లను కూడా సూచిస్తుంది
సవాళ్లు, స్వీకరణలో అడ్డంకులు పంట అవశేషాలను పశువుల మేతకు వాడాల్సిన అవసరం, యంత్రాలు-రుణాల లభ్యత, లింగ ఆధారిత అసమానతలు, విస్తరణ సేవల కొరత ఇవన్నీ ముఖ్యంగా చిన్నకారు, వర్షాధార రైతాంగంలో పరిరక్షణ వ్యవసాయం స్వీకరణను నెమ్మదిస్తున్నాయి. అదేవిధంగా, నేల కర్బన కొలత లోతు, నత్రజని ఆక్సైడ్ కొలత విధానాలలో ప్రామాణికత లేకపోవడం వంటి పద్దతిపరమైన అసమానతలు ఈ రంగంలో పరిష్కరించాల్సిన ముఖ్యమైన పరిశోధన అంతరాలుగా మిగిలాయి.
ముగింపు పరిరక్షణ వ్యవసాయం నేల సూక్ష్మజీవుల ఆరోగ్యం, ఇంధన-శ్రమ ఆదా, నిర్దిష్ట పరిస్థితులలో దిగుబడి స్థిరత్వం వంటి నిజమైన ప్రయోజనాలను అందిస్తుందని ఈ సమీక్ష స్పష్టం చేస్తుంది. అయితే బల్క్ డెన్సిటీ, పరాగసంపర్క కీటకాలపై ప్రభావం వంటి అంశాల్లో సాహిత్యంలో ఇప్పటికీ నిజమైన భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. భవిష్యత్తులో పరిరక్షణ వ్యవసాయం ను కేవలం ఒక స్థిర ప్యాకేజీగా కాకుండా, స్థానిక పరిస్థితులకు అనుగుణంగా అమర్చుకోగల సమీకృత వ్యవస్థగా, ఖచ్చితమైన సాంకేతికతతో మేళవించి అభివృద్ధి చేయడం ద్వారానే స్థిరమైన వ్యవసాయ లక్ష్యాలను చేరుకోవచ్చు.
ఇతర వివరముల కొరకు , ఈమెయిల్ మరియు ఫోన్: jcharleswesley@gmail.com, +91 8331816872, చార్లెస్ వెస్లీ జె., పిహెచ్.డి స్కాలర్, అగ్రోనమి, వి.ఐ.టి, వెల్లూరు, డా. తిరుమలైకుమార్ ఆర్., అసిస్టెంట్ ప్రొఫెసర్, అగ్రోనమి, వి.ఐ.టి, వెల్లూరు, డా. సరవణన్ ఎస్., ప్రొఫెసర్, వి.ఐ.టి, వెల్లూరు.
చార్లెస్ వెస్లీ జె¹, తిరుమలైకుమార్ ఆర్², సరవణన్ ఎస్³* ¹, ²&³ వి ఐ టి స్కూల్ ఆఫ్ అగ్రికల్చరల్ ఇన్నోవేషన్స్ అండ్ అడ్వాన్స్‌డ్ లెర్నింగ్, డిపార్ట్‌మెంట్ ఆఫ్ అగ్రోనమీ, వెల్లూరు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (VIT), వెల్లూరు, తమిళనాడు, భారతదేశం.
ఎల్‌నినో ప్రభావం వలన పశుగ్రాస కొరత నానాటికీ పెరిగిపోతోంది. గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో కీలకమైన పాడిరంగం కునారిల్లుతోన్న ఈ పరిస్థితికి పాడి పరిశ్రమకు తగిన ప్రోత్సాహం అందకపోవడం వలన చాలామంది పాడికి దూరం అవుతున్నారు. పశువుల దాణా, మేపు ఖర్చులు పెరగడం, పచ్చిమేత లభ్యత తగ్గడం, గ్రామాల్లో పశువైద్య సేవలు అరకొరగా ఉండటం, పాలకు గిట్టుబాటు ధర రాకపోవడం - ఇలా ఎన్నో కారణాల వలన పాల ఉత్పత్తి తగ్గుతున్న మాట వాస్తవం. గత 7 సం॥ల్లో 35% పాడి పశువులు తగ్గాయని గణాంకాలు తెలియజేస్తున్నాయి.
వాతావరణ శాఖ అంచనా ప్రకారం, నైరుతి రుతుపవనాలు, ఈశాన్య రాష్ట్రాల్లో సాధారణంగా ఉన్నా మధ్య, దక్షిణ భారత దేశంలో సాధారణం కన్నా తక్కువ ఉండవచ్చు.
3.7.26 ప్రకారం ఖరీఫ్ నాట్లు వరి (-15%), పల్లీ (-18%), సోయా (-65%), పత్తి (-28%) మాత్రమే నమోదయింది. ఈ ఆలస్యం ధాన్యం/నూనెగింజల ఉత్పత్తిపైనే కాక, ఎండుమేత, తవుడు, పత్తి చెక్కల లభ్యతపై కూడా ప్రభావం చూపుతుంది. ఇప్పటికే, భారత ప్రభుత్వం 262 జిల్లాలను కరువు ప్రభావితంగా గుర్తించింది.
ఎన్‌డిడిబి అంచనా ప్రకారం, ఎండుమేత నిలువలు, అవసరమైనది 431 మిలియన్ మెట్రిక్ టన్నులు అయినా, 620 మిలియన్ మెట్రిక్ టన్నులు ఉన్నట్లు, పచ్చిమేత అవసరం 1140 మి.మె.ట. కాగా, 752 మి.మె.ట. ఉన్నట్లు, దాణా 32% కొరత ఉన్నట్లు గుర్తించింది.
దేశంలోని వాణిజ్యస్థాయి దాణా తయారీ, 14.5 మి.మె.ట. కాగా, ఈ వాతావరణ ప్రతికూలత వలన లభ్యత 5Ð10% తగ్గగలదని అంచనా.
మార్చి 26 నుండి జూన్ 26 వరకు చూస్తే, పచ్చిమేత ధరలు రూ. 3/80 నుండి రూ. 4/04 కి ఎగబాకగా, దాణాధరలు రూ.23.80 కిలో నుండి రూ.25.06 కి చేరింది. దాణా తయారీకి ముఖ్యమైన తవుడు ధరలు ఏకంగా 21% పెరిగాయి.
17 రాష్ట్రాల్లోని 262 కరువు ప్రభావిత జిల్లాల్లో పశు జనాభా ఇలా ఉంది.
పాలు ఇచ్చే పశువులు 31.19 మిలియన్లు
ఎండిపోయిన పశువులు 13.34 మిలియన్లు
దూడలు 37.16 మిలియన్లు
మొత్తం 81.70 మిలియన్లు
దీనికై, ఎండుమేత 1.1 మిలియన్ మె.ట., పచ్చిమేత 1.4 మి.మె.ట, దాణా 0.4 మి.మె.ట. గా ఉంటుంది. ముఖ్యంగా ఈ అవసరం రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, గుజరాత్, ఒడిసా, బిహార్, తమిళనాడు, మహారాష్ట్రల్లో ఉంది.
ఉపయోగంలోకిరాని దాణా తయారీ సామర్థ్యం వినియోగించి, 3.6 లక్షల టన్నుల అదనపు దాణా తయారీ చేపట్టి రాబోవు 3 నెలల్లో కరువు ప్రభావిత ప్రాంతాల పాడిరైతులకు అందుబాటులోకి తేవాలి.
ఎల్‌నినో ప్రభావం పాలఉత్పత్తిపైన కూడా ఉంటుంది. కాబట్టి, చల్లని వాతావరణంలో కృత్రిమ గర్భధారణ చేపట్టడం, శక్తివర్ధక దాణా సరఫరా ప్రోత్సహించాలి. ఏది ఏమైనా, పాడిపశువులకు పచ్చిమేత, ఎండుమేత, ఉత్పాదకత పెంపుదల చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అంతేకాక పాలఉత్పత్తిదారుల సహకార సంఘాలు మాగుడుగడ్డి తయారీ, టిఎంఆర్ వాడకం బాహుళ్యంలో తెచ్చినపుడే పాలఉత్పత్తి నిలకడగా ఉండగలదు. అంతేకాక, పాలధర పెంపుదల కోసం ప్రభుత్వ ప్రోత్సాహకం, పశుగ్రాస పెంపకం కోసం పశుగ్రాస విత్తనాల సరఫరా, బీమా ప్రయోజనాలు విజయ డెయిరీ అందిస్తోంది. వీటితో పాడిరైతులు సహకార డెయిరీకి రక్షణ కవచంలా నిలవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
మధుసూదనరావు, జనరల్ మేనేజర్, విజయ తెలంగాణ, హైదరాబాద్. ఫోన్: 9121160553
రైతు వారీగా అతి తక్కువ శ్రమ, స్వల్ప ఖర్చుతో తయారు చేసుకోగలిగేది చేప అమినో ఆమ్లం. చేపలతో అమినో ఆమ్లాలను తయారు చేసుకునే పద్ధతిని కొరియా వ్యవసాయ శాస్త్రజ్ఞుడు డాక్టర్ చోహాన్ క్యూ రూపొందించారు. ఈ విధానాన్ని ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాలలో ప్రాకృతిక రైతులు ఆచరిస్తున్నారు.
తయారు చేసే విధానం : ముందుగా చేప పొలుసులు, ఈకలు, తోకలు తొలగించాలి. తరువాత చేపను చిన్న, చిన్న ముక్కలుగా కోయాలి. చేప ముక్కలను తూకం వేసి దానికి సరిసమానంగా బెల్లం కలపాలి. వాటిని ఒక ప్లాస్టిక్ జాడి లేదా బకెట్‌లో మూడవ వంతు వరకు నింపుకుని పైన గుడ్డ కట్టి నీడలో పెట్టుకోవాలి. కనీసం రోజుకు ఒకసారి కలియబెట్టాలి. వాతావరణ పరిస్థితులను బట్టి 10 నుండి 15 రోజుల్లో చిక్కటి ద్రావణం తయారవుతుంది. తయారైన ద్రావణం నుండి మధురమైన వాసన వస్తుంది. ఒకవేళ చేపల వాసన వస్తుంటే దానికి మరింత బెల్లం కలిపి మరో 4,5 రోజులుంచాలి.
తయారైన ద్రావణాన్ని లీటరు నీటికి 1 నుంచి 4 మి.లీ. కలిపి పిచికారి చేసుకోవాలి. దీనిని అన్ని పంటలపై పిచికారి చేసుకోవచ్చు.
మైకోప్లాస్మా జాతి సూక్ష్మజీవుల వలన కలిగే వ్యాధుల సమూహాన్ని “మైకోప్లాస్మోసిస్” అంటారు. ఈ జాతి సూక్ష్మజీవులు సుమారుగా 17 రకాలున్నప్పటికీ, 2-3 రకాలు మాత్రమే కోళ్లలో వ్యాధిని కలిగిస్తాయి. అవి మైకోప్లాస్మా గాలిసెప్టికం(అన్ని రకాల పక్షులకు), మైకోప్లాస్మా సైనోవి (సాధారణ కోళ్ళు, టర్కీలు, పావురాలు), మైకోప్లాస్మా మిలియాగ్రిడిస్ (ప్రధానంగా టర్కీలకు). ఈ వ్యాధిలో ప్రధానంగా శ్వాసకోశ సంబందిత లక్షణాలు గమనిస్తాము మరియు దీర్గకాలికంగా ఉంటుంది. అందువలన దీనిని దీర్గ కాలిక శ్వాసకోశ వ్యాధి లేదా క్రానిక్ రేస్పిరెటరి డిసీజ్ (సి.ఆర్.డి) అని అంటారు.
అన్ని వయస్సు కోళ్ళకు ఈ వ్యాధి వ్యాపిస్తుంది. శీతాకాలం వంటి చల్లగా వుండే మాసాల్లో మరియు ఇతర వ్యాధులైనటువంటి ఇ.కోలి, పాశ్చురేల్లోసిస్, ఇన్ఫేక్ట్చువస్ బ్రోoకిటిస్, కొక్కెర తెగులు సోకినప్పుడు ఈ వ్యాధి వ్యాప్తి ఉదృతంగా ఉంటుంది. వ్యాధి సోకిన కోడి ద్వారా, కలుషితమైన గాలి ద్వారా ఆరోగ్యకరమైన ఇతర కోళ్ళకు వ్యాపిస్తుంది. షెడ్ లో కోళ్ళు కిక్కిరిసి వుండి, గాలి, వెలుతురు ప్రసరణ సరిగా లేకుండా ఉన్నప్పుడు వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉంటుంది. కలుషితమైన లిట్టర్, కోళ్ళ మూత్రం ద్వారా, కలుషితమైన దాణా, త్రాగునీటి ద్వారా, ఇతర పక్షులు, కోడి పిల్లల బాక్సులు, పరికరాలు, గ్రుడ్ల ట్రే ల ద్వారా, టీకాలు వేసే సమయంలో, ముక్కు కత్తిరించే సమయంలో పని మనుషుల ద్వారా , బ్రీడింగ్ ఫారాలలో వ్యాధి గ్రస్త పుంజుల వీర్యం ద్వారా, తల్లి కోడి అండాశయం నుండి గ్రుడ్డు ద్వారా కోడిపిల్లలకు వ్యాపిస్తుంది.
లక్షణాలు: మైకోప్లాస్మా గాలిసెప్టికం బారిన పడిన బ్రాయిలర్ కోళ్లలో 4 వారాల తరువాత మరణాల శాతం ఎక్కువగా ఉంటుంది. వ్యాధి బారిన పడిన లేయర్ కోళ్లలో వ్యాధి మెల్లగా వ్యాపిస్తుంది. సూక్ష్మక్రిమి కోళ్ళ శరీరంలోకి ప్రవేశించిన తరువాత 11-18 రోజుల్లో లక్షణాలు కనబడతాయి. ప్రప్రథమంగా శ్వాసకోశ వ్యవస్థ ప్రభావితం అవుతుంది. అందులోను మొదటగా శ్వాసనాళo పైభాగం ఆశించడం వలన శ్వాస తీసుకోవడం కష్టతరమై కోళ్ళు తల పైకెత్తి గాలి పీల్చుకుంటాయి. అలా శ్వాస తీసుకుంటున్నప్పుడు కూతలు కూడా వినబడుతాయి. ఆ తర్వాత సుక్ష్మక్రిమి గాలిగదులు, శ్వాసనాళం కింది భాగాన్ని ఆశించినప్పుడు గాలి గదులు వాచిపోతాయి. శ్వాసనాళంలో నెమ్ము చేరడం వలన గురక శబ్దం వస్తూ ఉంటుంది. కళ్ళు, ముక్కు నుండి నీరు కారుతూ ఉంటుంది. చిన్న పిల్లలలో 30% వరకు మరణాలు సంభవిస్తాయి. గ్రుడ్ల ఉత్పత్తి 20-30% తగ్గిపోతుంది. మేత వినియోగం తగ్గటం వలన పెరిగే కోళ్లలో పెరుగుదల రేటు తగ్గి బరువు తగ్గిపోతుంది. కొన్ని సందర్భాలలో నీళ్ళ విరోచనాలుంటాయి. ఇంకా పెరికార్దిటిస్, పెరిటోనిటిస్, పెరిహేపటైటిస్ తరచుగా కనబడతాయి.
మైకోప్లాస్మా సైనోవి తరచుగా 4-12 వారాల కోడిపిల్లలకు, అలాగే 10-12 వారాల టర్కీకోళ్ళకు సోకుతుంది. ఇది ప్రధానంగా కీళ్ళను ప్రభావితం చేయడం వలన కీళ్ళ వాపులు, కీళ్ళ మధ్యలో మరియు టేండాన్ పొరలలో తెల్లటి చిక్కటి ద్రవం చేరి, కోళ్ళు కుంటుతూ ఉంటాయి.
మైకోప్లాస్మా మిలియాగ్రిడిస్ వ్యాధి బారిన పడిన టర్కీ కోళ్ళలో శ్వాస కష్టమవటం, తక్కువ శరీర పెరుగుదల, మెడ మరియు కాళ్ళ కీళ్ళలో వాపు, గ్రుడ్ల ఉత్పత్తి తగ్గిపోవటం, పొదిగే గ్రుడ్ల నుండి పిల్లల ఉత్పత్తి తగ్గటం, అధిక మరణాలు సంభవించడం వంటివి గమనిస్తాము.
పోస్ట్ మార్టెం చేసి చూస్తే: శ్వాసనాళం ఫైభాగంలో రక్తస్రావాలు ఉంటాయి. తెల్లటి జిగట పదార్ధం కనబడుతుంది. గాలి గదులు మందమై కందిపోయి జున్ను లాంటి పదార్ధం పేరుకొని ఉంటుంది. గుండె, కాలేయం మీద పలుచని పొర ఏర్పడుతుంది. చికిత్స : వ్యాధి గ్రస్త కోళ్ళకు థయాముటిన్, టైలోసిన్ వంటి యాంటిబయోటిక్ మందులను త్రాగే నీళ్ళలో లేదా ఇంజక్షన్ రూపంలో 5-7 రోజులు వాడాలి. ఇవే కాకుండా ఆక్సిటెట్రాసైక్లిన్, క్లోర్టెట్రాసైక్లిన్ ను టన్ను దాణాలో 200-400 గ్రా. చొప్పున కలిపి కూడా వాడవచ్చు.
నివారణ :
పెద్ద కోళ్ళు, కోడి పిల్లలు ఒకే షెడ్లో కాకుండా వేర్వేరు షెడ్లలో ఉంచాలి. ఈ షెడ్లు దూరంగా, ఎడంగా ఉండాలి.
కొత్తగా పిల్లలు తెచ్చే ముందు, షెడ్లను పొటాషియం పెర్మంగానేట్ మరియు ఫార్మలిన్ ద్రావణంతో ఫుమిగేషన్ చేసి 2-3 వారాలు ఖాళీగా ఉంచాలి.
అధిక చలి మరియు గాలి, వెలుతురు లోపం వలన ఈ వ్యాధి వ్యాపిస్తుంది. కావున గాలి,వెలుతురు సక్రమంగా ప్రసరించేలా చూడాలి.
టీకాలు, ఏలికపాముల మందు వేసే సమయంలో, ముక్కు కత్తిరించే సమయంలో కోళ్ళు ఒత్తిడికి గురికాకుండా చూడాలి.
పాత లిట్టర్ తొలగించి, అమోనియా వాయువును నివారించాలి.
వ్యాధితో మరణించిన కోళ్ళను కాల్చి వేయాలి. వ్యాధి సోకిన వాటిని వెంటనే వేరు చేయాలి.
వాహనాలు, దాణా బస్తాలు, క్రేట్లు, పరికరాల ద్వారా వ్యాధి వ్యాపించకుండా జాగ్రత్త వహించాలి.
కోళ్ళ షెడ్లు మరియు పరికరాలను శుభ్రం చేయడానికి ప్రతిపాదిత క్రిమిసంహారణిలైనటువంటి ఫినోలిక్ ఆమ్లం, క్రెసాలిక్ ఆమ్లం, హైపోక్లోరైట్, 10% ఫార్మలిన్, 0.1% గ్లుటరాల్దిహైడ్, బ్లీచింగ్ పౌడర్ ను వాడాలి.
డా. టి. విజయ నిర్మల శాస్త్రవేత్త (పశువైద్య విభాగం), డా. ఎన్. శ్రీ విద్య రాణి శాస్త్రవేత్త (విస్తరణ విభాగం), డా. బి.ఎస్. కాంతి శ్రీ శాస్త్రవేత్త (గృహ విజ్ఞాన విభాగం), డా. ఎస్. ఫిరోజ్ హుస్సేన్, శాస్త్రవేత్త (ఉద్యాన విభాగం), డా. ఎం.బాలకృష్ణ, సీనియర్ శాస్త్రవేత్త & అధిపతి, కృషి విజ్ఞాన కేంద్రం, ఒనిపెంట, వై.ఎస్.ఆర్. కడప జిల్లా-516173, డా. గోవిందరాజులు, ఎ.డి.ఆర్., ఆర్.హెచ్.ఆర్.ఎస్., తిరుపతి & డా. సి.హెచ్. రూత్, విస్తరణ సంచాలకులు, వై.ఎస్.ఆర్. ఉద్యాన విశ్వవిద్యాలయం, వెంకటరామన్నగూడెం, పశ్చిమ గోదావరి జిల్లా ఫోన్ : 8121136184