ఎల్ నినో వేళ ఖరీఫ్ పంట అమ్మకానికి సూత్రాలు

ఈ ఏడాది ఎల్ నినో ప్రభావంతో వానాకాలం (ఖరీఫ్) వర్షాలు తగ్గాయి. తెలంగాణలో జూన్ 1 నుంచి సెప్టెంబర్ చివరి వరకు సుమారు 17 శాతం లోటు వర్షపాతం నమోదైంది. ఇలాంటి సంవత్సరంలో దిగుబడి కొంత తగ్గినప్పటికీ, పంటను జాగ్రత్తగా ఆరబెట్టి, శుభ్రం చేసి, గ్రేడింగ్ చేసి నాణ్యతను కాపాడుకుని సరైన మార్గంలో అమ్ముకుంటే మంచి ధర పొందవచ్చు. అందుకే చేతికి వచ్చిన పంటకు మంచి ధర పొందాలంటే ఎక్కడ, ఎప్పుడు, ఎలా అమ్మాలో ముందుగానే ఆలోచించుకోవడం చాలా ముఖ్యం.

మొదట కనీస మద్దతు ధర (MSP) తెలుసుకోండి
కేంద్ర ప్రభుత్వం 2026-27 ఖరీఫ్ సీజన్ కు ప్రకటించిన కనీస మద్దతు ధరలు ఇవి. మార్కెట్లో ధర తగ్గినప్పుడు ఇది రైతుకు రక్షణగా ఉంటుంది.
పంట MSP (రూ. / క్వింటాల్)
వరి (సాధారణ రకం) 2,441
వరి (గ్రేడ్ ఎ) 2,461
పత్తి (మధ్యస్థ పింజ) 8,267
పత్తి (పొడవు పింజ) 8,667
మొక్కజొన్న 2,410
కంది 8,450
పెసర 8,780
మినుము 8,200
వేరుశనగ 7,517
సోయాచిక్కుడు (పసుపు) 5,708
జొన్న (హైబ్రిడ్) 4,023

MSP కేవలం కనీస ధర మాత్రమే. ఈ ధర రావాలంటే పంటలో తేమ, శుభ్రత నిర్దేశించిన పరిమితుల్లో ఉండాలి (ఉదాహరణకు వరిలో తేమ సుమారు 17 శాతం లోపు, పత్తిలో 8 నుంచి 12 శాతం లోపు). కాబట్టి పంటను బాగా ఆరబెట్టి, శుభ్రం చేసి తీసుకెళ్లండి.

ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో అమ్మకం
• వరి: ధాన్యాన్ని గ్రామంలో ఏర్పాటు చేసే కొనుగోలు కేంద్రాల్లో (సహకార సంఘాలు, ఐకేపీ కేంద్రాలు) MSPకి అమ్మవచ్చు.
• పత్తి: భారత పత్తి సంస్థ (CCI) మద్దతు ధరకు కొంటుంది. సీసీఐ నిర్ణయించే నమోదు, స్లాట్ విధానం ఉంటే ముందుగానే నమోదు చేసుకోండి.
• పప్పుధాన్యాలు, నూనెగింజలు: కంది, పెసర, మినుము, వేరుశనగ, సోయాచిక్కుడు వంటి పంటల కొనుగోలుకు మార్క్ ఫెడ్ ద్వారా కేంద్రాలు తెరిచినప్పుడు అక్కడ అమ్మవచ్చు.
• కావలసిన పత్రాలు: పట్టాదార్ పాస్ బుక్, ఆధార్, బ్యాంక్ ఖాతా వివరాలు, పంట నమోదు రుజువు దగ్గర ఉంచుకోండి. కేంద్రాల వివరాలను మీ మండల వ్యవసాయ అధికారి (AEO/MAO) ద్వారా తెలుసుకోండి.

మార్కెట్ కమిటీ (APMC) యార్డులో అమ్మకం
పంటను వ్యవసాయ మార్కెట్ కమిటీ యార్డుకు తెచ్చి బహిరంగ వేలంలో అమ్మడం మన రాష్ట్రంలో సాధారణ పద్ధతి. ఇక్కడ ఈ జాగ్రత్తలు పాటించండి:
• అమ్మే ముందు రెండు మూడు యార్డుల ధరలను పోల్చి చూడండి. దగ్గరి యార్డులో ధర తక్కువగా ఉంటే కొంచెం దూరమైనా మెరుగైన యార్డుకు వెళ్లడం లాభమో కాదో రవాణా ఖర్చుతో లెక్కించండి.
• లైసెన్స్ ఉన్న కమీషన్ ఏజెంట్ (అడీదారు) ద్వారానే అమ్మండి. తూకం, తరుగు, కమీషన్, ధర వివరాలు ఉన్న రసీదు (సేల్ బిల్లు) తప్పనిసరిగా తీసుకోండి.
• చెల్లింపు ఎప్పుడు, ఎలా వస్తుందో అమ్మే ముందే అడిగి తెలుసుకోండి. బ్యాంక్ ఖాతాకు నేరుగా చెల్లింపు పొందడం మంచిది.
• యార్డులో రద్దీ పెరిగే రోజుల్లో ధర తగ్గే అవకాశం ఉంటుంది. వీలైతే పంటను విడతలుగా తెచ్చి అమ్మండి.

ఆన్ లైన్ అమ్మకం: ఈ-నామ్ (e-NAM)
• ఈ-నామ్ అనేది మార్కెట్ యార్డులోనే జరిగే ఆన్ లైన్ వేలం. ఇక్కడ ఇతర ప్రాంతాల వ్యాపారులు కూడా పాల్గొనడం వల్ల పోటీ పెరిగి మంచి ధర రావచ్చు.
• ముందుగా మీ యార్డులో ఈ-నామ్ కింద రైతుగా నమోదు చేసుకోండి (ఆధార్, బ్యాంక్ ఖాతా, మొబైల్ నంబర్ అవసరం).
• ఈ-నామ్ యాప్, అగ్ మార్క్ నెట్ (Agmarknet) వెబ్ సైట్లలో రోజువారీ మార్కెట్ ధరలు చూసి, ధర బాగున్న రోజు అమ్మకానికి తీసుకెళ్లండి.
• పంట నాణ్యతను పరీక్షించి గ్రేడ్ ఇస్తారు. శుభ్రంగా, ఒకే రకంగా ఉన్న పంటకు ఎక్కువ ధర వస్తుంది.
• ఎఫ్.పి.ఓలు (రైతు ఉత్పత్తిదారుల సంఘాలు) ఈ-నామ్ వంటి వేదికల ద్వారా కూడా పంటను అమ్మే అవకాశం ఉంది.

నేరుగా అమ్మకం (డైరెక్ట్ మార్కెటింగ్)
• సంఘంగా అమ్మడం: రైతు ఉత్పత్తిదారుల సంఘం (FPO) లేదా రైతు గ్రూపు ద్వారా అందరి పంటను కలిపి పెద్ద మొత్తంలో అమ్మితే వ్యాపారులు, మిల్లర్లతో బేరం చేసే శక్తి పెరుగుతుంది. రవాణా, తూకం ఖర్చులు కూడా తగ్గుతాయి.
• మిల్లర్లు, ప్రాసెసర్లకు నేరుగా అమ్మడం: రైస్ మిల్లర్లు, జిన్నింగ్ మిల్లులు, మిరప, పసుపు ప్రాసెసింగ్ సంస్థలతో ముందుగానే ధర, నాణ్యత, చెల్లింపు తేదీ రాతపూర్వకంగా నిర్ణయించుకోండి.
• రైతు బజార్లు, నేరుగా వినియోగదారులకు కూరగాయలు, పండ్లు, తక్కువ మొత్తంలో ధాన్యం, పప్పులను రైతు బజార్ లేదా గ్రామ, పట్టణ సంతల్లో నేరుగా అమ్మితే మధ్యవర్తుల వాటా తగ్గుతుంది.

నిల్వ చేసి అమ్మడం
కోత సమయంలో ఒకేసారి అందరూ అమ్మడం వల్ల ధరలు తగ్గుతాయి. ఆర్థికంగా వీలైతే పంటను గోదాములో నిల్వ చేసి తర్వాత అమ్మవచ్చు. గోదాము రసీదు (e-NWR) పై రుణం తీసుకునే సౌకర్యం ఉన్న గోదాముల గురించి మీ ప్రాంత అధికారులను అడగండి. అయితే ధర తర్వాత తప్పకుండా పెరుగుతుందనే హామీ లేదు. తేమ, పురుగుల వల్ల నష్టం కూడా జరగవచ్చు. కాబట్టి అప్పు తీర్చడం వంటి అత్యవసర అవసరాలకు కావలసినంత మాత్రమే ముందుగా అమ్మి, మిగిలినది విడతలుగా అమ్మడం మంచిది.

ఎల్ నినో సంవత్సరంలో ప్రత్యేక జాగ్రత్తలు
• దిగుబడి తగ్గే అవకాశం ఉన్నందున ధర తప్పకుండా పెరుగుతుందని అనుకోకండి. దేశవ్యాప్తంగా సరఫరా, ప్రభుత్వ నిల్వలు, దిగుమతులు ధరను ప్రభావితం చేస్తాయి. రోజూ మార్కెట్ ధరలను గమనించండి.
• అప్పు తీర్చడానికో, అత్యవసరానికో తక్కువ ధరకు తొందరపడి అమ్మకండి. ముందుగా MSP, యార్డు ధరను పోల్చి చూడండి.
• వర్షాభావంతో గింజ సన్నబడటం, రంగు మారడం, గింజ పొట్టిగా ఉండటం జరగవచ్చు. పంటను శుభ్రం చేసి, గ్రేడింగ్ చేసి అమ్మితే నాణ్యత తక్కువ వల్ల కలిగే నష్టం కొంత తగ్గుతుంది.
• యార్డులో లైసెన్స్ ఉన్న ఏజెంటు ద్వారానే అమ్మి, రసీదు తీసుకోండి. చెల్లింపు నేరుగా బ్యాంక్ ఖాతాకు పొందండి.
• ప్రభుత్వం నీటి నిల్వలు, యాసంగి సాగు గురించి ఇచ్చే సూచనలను గమనించి, తర్వాతి పంట నిర్ణయం తీసుకోండి.

డా. డి. ఎ. రజిని దేవి మరియు డా. కే. శేఖర్
అసిస్టెంట్ ప్రొఫెసర్స్, వ్యవసాయ కళాశాల, రాజేంద్రనగర్, ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం. Ph: 9032128124

Read More

ఎల్‌నినో నేపథ్యం లో ఉత్తర కోస్తా జిల్లాలలో ఖరీఫ్ సాగు పరిస్థితి రబీ పంటల ప్రణాళిక మరియు ఉద్యాన పంటలలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు

ఎల్‌నినో అనేది పసిఫిక్ మహాసముద్రంలోని మధ్య మరియు తూర్పు ప్రాంతాల్లో సముద్ర ఉపరితల జలాలు సాధారణం కంటే ఎక్కువగా వేడెక్కే ఒక వాతావరణ పరిణామం. ఈ సముద్ర ఉష్ణోగ్రతల్లో వచ్చే మార్పులు ప్రపంచంలోని అనేక ప్రాంతాల వాతావరణంపై ప్రభావం చూపుతాయి. మన భారతదేశంలో ఎల్‌నినో పరిస్థితుల వల్ల నైరుతి రుతుపవనాలు తీవ్రంగా ప్రభావితం అయ్యాయి. ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యంగా ఉత్తర కోస్తా జిల్లాల్లో నైరుతి రుతుపవనాలు ఎల్నినో ప్రభావం వల్ల విఫలమై సాధారణ వర్షపాతం కంటే చాలా తక్కువ వర్షపాతం నమోదయ్యి ఖరీఫ్ సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గిపోయింది.

ఉత్తరకోస్తా జిల్లాలలో నైరుతి రుతుపవనాలు పై ఎల్‌నినో ప్రభావం
2026 జూన్ 1వ తేదీ నుంచి ఆగస్టు 31వ తేదీ వరకు ఉత్తరాంధ్ర జిల్లాల్లో నమోదైన వర్షపాతం పరిస్థితిని గమనించినట్లయితే అనకాపల్లి జిల్లాలో, ఖరీఫ్ సాధారణ వర్షపాతం 479.6 మిల్లీమీటర్లు కాగా, వాస్తవంగా 229.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు అయ్యి సాధారణంతో పోలిస్తే 52.2 శాతం లోటు నమోదు అయ్యింది. విశాఖపట్నం జిల్లాలో, సాధారణ వర్షపాతం 427 మిల్లీమీటర్లు కాగా, వాస్తవ వర్షపాతం 175.7 మిల్లీమీటర్లు నమోదు అయ్యి 58.9 శాతం లోటు లో ఉంది. విజయనగరం జిల్లాలో, సాధారణ వర్షపాతం 484.4 మిల్లీమీటర్లు కాగా, వాస్తవంగా 288.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. సాధారణంతో పోలిస్తే 40.4 శాతం లోటు ఉంది. శ్రీ కాకుళం జిల్లాలో, సాధారణ వర్షపాతం 503 మిల్లీమీటర్లు కాగా, వాస్తవంగా 293.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అంటే 41.7 శాతం లోటు ఉంది. ఈ లోటు వర్షపాతం వల్ల ఖరీఫ్ సాగు విస్తీర్ణం తగ్గి పోవడమే కాక సాగులో ఉన్న పంటల దిగుబడులపై ప్రభావం చూపనుంది. ఎల్నినో ప్రభావం వల్ల అనకాపల్లి జిల్లాలో 26,434 హెక్టార్లు, విశాఖపట్నం జిల్లాలో 2,586 హెక్టార్లు. విజయనగరం జిల్లాలో 24,289 హె . విస్తీర్ణం ఖాళీగా సాగు కాకుండా ఉన్నాయి. శ్రీకాకుళం జిల్లాలో ఇతర నీటి వనరులు ఉండడం వల్ల ఖరీఫ్ సాగు విస్తీర్ణం అంతగా తగ్గలేదు.

  సెప్టెంబర్ మాసము లో బంగాళాఖాతం లో తీవ్ర అల్పపీడనం వల్ల ఉత్తర కోస్తా జిల్లాలలో మంచి వర్షపాతం నమోదు అయ్యి రబీ సాగుకు అనుకూల పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ అల్పపీడనం వల్ల అనకాపల్లి జిల్లాలో 310.4 మి.మీ, విశాఖపట్నం జిల్లాలో 363.8 మి.మీ, విజయనగరం జిల్లాలో 288.4 మి.మీ అలాగే శ్రీకాకుళం జిల్లాలో 330.5 వర్షపాతం నమోదు అయ్యింది. భూగర్భజలమట్టం కూడా పెరగడం రబీ సాగుకు చాలా అనుకూలంగా ఉంది. నీటిలభ్యతను బట్టి రబీ పంటల ప్రణాళికను రూపొందించుకోవాలి.

ఆచార్య ఎన్ జి రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం లోని మార్కెట్ ఇంటెలిజెన్స్ విభాగం ఆర్ధిక శాస్త్రవేత్తలు రాబోయే కాలం లో ఏ ఏ పంటలకు మార్కెట్ డిమాండ్ ఉంటుందో ముందుగానే తెలియజేస్తారు. మొక్కజొన్న: ప్రస్తుత ధర క్వింటాల్ రూ. 2,580. అదే జనవరి 2027: రూ. 3,080-3,388. ఫిబ్రవరి 2027 రూ. 3,190-3,445 వరకు ఉండవచ్చును. ఈ విధంగా అన్ని పంటలకు ప్రస్తుత మార్కెట్ ధర రాబోయే కాలంలో మార్కెట్ ధర ముందుగానే రైతులు తెలుసుకోవచ్చు. ఈ అంశాలను పరిగణలోనికి తీసుకొని రబీ పంటల ప్రణాలళికను రూపొందించుకోవాలి.

ఉత్తర కోస్తా జిల్లాల రబీ పంటల ప్రణాళిక
ఆచార్య ఎన్ జి రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం మరియు వ్యవసాయ శాఖ సంయుక్తంగా అన్ని అంశాలను పరిగణ లోనికి తీసుకొని రబీ పంటల ప్రణాలళికను రూపొందించడం జరిగింది శ్రీకాకుళం జిల్లాలో మొత్తం 73,376 హెక్టార్లలో వివిధ పంటలు సాగుకు ప్రణాళిక రూపొందించడం జరిగింది. వరి – 6,929 హెక్టార్లలో సాగు చేయనున్నారు. అలాగే మిగిలిన విస్తీర్ణంలోఆరుతడి పంటలైన మొక్కజొన్న, రాగి , పప్పుదినుసు పంటలైన పెసర , మినుము వేరుశనగ, చెరకు, ఉలవలు, నువ్వులు, పొద్దుతిరుగుడు మరియు జీలుగ పంటలను సిఫారసు చేయడం జరిగింది.

అలాగే విజయనగరం జిల్లాలో సాధారణ రబీ విస్తీర్ణం మరియు ఖరీఫ్ లో సాగు చెయ్యకుండా మిగిలిన విస్తీర్ణం కలిపి 69030 హెక్టార్లు కాగా, రబీ 2026–27లో సుమారు 1,000 హెక్టార్లలో వరి సాగు చేయాలని ప్రతిపాదించడం జరిగింది. మిగిలిన విస్తీర్ణంలో ఆరుతడి పంటలైన జొన్న, మొక్కజొన్న, రాగి, ఉలవలు పప్పుదినుసు పంటలైన పెసర, మినుము శనగ, వేరుశనగ, చెరకు, నువ్వులు, జనుము పంటలను సిఫారసు చేయడం జరిగింది.

విశాఖపట్నం జిల్లాలో రబీ 2026–27 సీజన్‌కు సంబంధించి విశాఖపట్నం జిల్లాలో సాధారణ రబీ విస్తీర్ణం మరియు ఖరీఫ్ లో సాగు చెయ్యకుండా మిగిలిన విస్తీర్ణం కలిపి 3125 హెక్టార్లు. 596 హెక్టార్లలో వరి మిగిలిన విస్తీర్ణంలో ఆరుతడి పంటలైన మొక్కజొన్న, రాగి, ఉలవలు పప్పుదినుసు పంటలైన పెసర, మినుము, వేరుశనగ, చెరకు, నువ్వులు, జనుము పంటలను సిఫారసు చేయడం జరిగింది.

అనకాపల్లి జిల్లాలో రబీ 2026–27 సీజన్‌కు సంబంధించి జిల్లాలో సాధారణ రబీ విస్తీర్ణం మరియు ఖరీఫ్ లో సాగు చెయ్యకుండా మిగిలిన విస్తీర్ణం కలిపి 22,689 హెక్టార్లు. 3200 హెక్టార్లలో వరిమిగిలిన విస్తీర్ణంలో ఆరుతడి పంటలైన మొక్కజొన్న, రాగి, ఉలవలు, అలసందలు, పప్పుదినుసు పంటలైన పెసర, మినుము, వేరుశనగ, చెరకు, నువ్వులు, పొద్దుతిరుగుడు, జనుము పంటలను సిఫారసు చేయడం జరిగింది.

రకాల ఎంపిక మరియు విత్తన లభ్యత
వరి లో స్వల్పకాలిక రకాలైన NLR-3449, MTU-1064, MTU-1061, MTU-1121 మరియు RNR-15048
మొక్కజొన్న లోమార్కెట్ లో దొరికే ప్రైవేట్ హైబ్రిడ్ రకాలను ఉపయోగించవచ్చు.
రాగి: వేగావతి, ఇంద్రావతి మరియు శ్రీ చైతన్య.
పెసర: ఎల్.జి.జి-630, ఎల్.జి.జి -607, ఎల్.జి.జి -574, టి.ఎం.-96-2 మరియు ఐ.పి.ఎం.-2-14
మినుము: ఎల్.బి.జి-904, టి.బి.జి-129, ఎల్.బి.జి-884, జి.బి.జి-1, టి.బి.జి-104, ఎల్.బి.జి-752 మరియు పి.యు-31.
ఉలవలు: ఎ.టి.పి-11 మరియు వి.జెడ్.ఎమ్-1.
అలసంద: రకాలు ఆర్కా సమృద్ధి, ఆర్కా మంగళ మరియు ఆర్కా అర్జున్
వేరుశెనగ: రకాలు టి.జి.సి.ఎస్. 1694 మరియు కె.-6.
నువ్వులు: రకాలు వై.ఎల్.ఎమ్ -66 మరియు వై.ఎల్.ఎమ్ -146.
పొద్దుతిరుగుడు: ప్రైవేట్ హైబ్రిడ్ రకాలను ఉపయోగించవచ్చు.
జనుము: ఎస్.హెచ్-4, సువిన్

రబీ పంటల సాగుకు అవసరమైన విత్తనాల్లో కొంతమేర రైతుల వద్దనే అందుబాటులో ఉన్న సొంత విత్తనాన్ని వినియోగించుకోవచ్చు. ముఖ్యంగా పప్పుధాన్యాలు, నువ్వులు, రాగి, చెరకు పంటల్లో రైతుల వద్ద సుమారు 30 శాతం వరకు సొంత విత్తనం అందుబాటులో ఉంటుంది

మిగిలిన నాణ్యమైన విత్తనాలను ఏపీ సీడ్స్, విజయనగరం, కృషి విజ్ఞాన కేంద్రం, ఆముదాలవలస, వ్యవసాయ పరిశోధనా కేంద్రం రాగోలు, వ్యవసాయ కళాశాల నైరా, వ్యవసాయ పరిశోధనా కేంద్రం యలమంచిలి, ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా కేంద్రం అనకాపల్లి మరియు ఇతర ANGRAU విత్తన విక్రయ కేంద్రాల ద్వారా పొందవచ్చు.

రబీ పంటలు విత్తే కాలం
రబీ పంటల సాగులో సరైన సమయంలో విత్తనాలు విత్తడం చాలా ముఖ్యమైన విషయం. పంటను బట్టి అనుకూలమైన విత్తే సమయం మారుతుంది. కాబట్టి రైతులు స్థానిక వాతావరణ పరిస్థితులను గమనిస్తూ సరైన సమయంలో విత్తడం ద్వారా మంచి దిగుబడిని పొందవచ్చు.

మొక్కజొన్న అక్టోబర్ 15 నుంచి నవంబర్ 15 వరకు విత్తుకోవచ్చు. జొన్న పంటను అక్టోబర్ నెలలో విత్తుకోవచ్చు. రాగి పంటకు నవంబర్ నుంచి డిసెంబర్ వరకు విత్తే సమయం అనుకూలంగా ఉంటుంది. పెసర మరియు మినుము పంటలను అక్టోబర్ నెలలో విత్తుకోవచ్చు. శనగ పంటను అక్టోబర్ 15 నుంచి నవంబర్ 15 వరకు విత్తుకోవచ్చు. ఉలవ పంటకు సెప్టెంబర్ నుంచి అక్టోబర్ వరకు విత్తే సమయం అనుకూలంగా ఉంటుంది. వేరుశనగ పంటను నవంబర్ 15 నుంచి డిసెంబర్ వరకు విత్తుకోవచ్చు. అలాగే జనుము పంటను అక్టోబర్ నుంచి నవంబర్ వరకు విత్తుకోవచ్చు.

పప్పుదినుసు పంటలైన మినుము పెసర సాగు చేసినప్పుడు పూత మరియు కాయ దశలో ఒక తేలికపాటి తడిని ఇవ్వవలిసి ఉంటుంది. బరువు నేలలలో అయితే మినుము తేలికపాటి నేలలలో అయితే పెసర పంటను వేసుకోవడంమంచిది.

జనుము పంటను రబీ కాలంలో విత్తనోత్పత్తి కోసం రైతులు సాగు చేస్తారు. అయితే జనుము పంటను లోతట్టు ప్రాంతాలలో వెయ్యకూడదు. తేమ ఎక్కువ అయితే జనుము పంట తట్టుకోలేదు. అలాగే కాయ దశలో పురుగు ఆశించే అవకాశం ఉన్నందున పంటను పరిశీలిస్తూ తగిన సస్య రక్షణ చర్యలు తీసుకోవాలి.

ఎల్‌నినో నేపథ్యంలో ఉధ్యాన వన తోట పంటలలో సూచనలు
ఎల్‌నినో ప్రభావంతో వర్షపాతం తక్కువగా నమోదైనప్పటికీ, సెప్టెంబరు నెలలో కురిసిన వర్షాలతో ఉత్తర కోస్తా జిల్లాల్లో భూగర్భజల లభ్యత కొంత మెరుగుపడింది. ఈ పరిస్థితులను బట్టి రైతులు తమ వద్ద ఉన్న నీటి వనరులను అంచనా వేసుకొని టమాటా, మిరప, వంకాయ, బెండ, ఉల్లి వంటి కూరగాయలను సాగు చేసుకోవచ్చు. పంటను ఎంచుకునేటప్పుడు నీటి అవసరంతో పాటు స్థానికంగా ఉన్న మార్కెట్‌ డిమాండ్‌ను కూడా దృష్టిలో ఉంచుకోవాలి. కూరగాయల సాగుకు మంచి నాణ్యత కలిగిన నారును ఉపయోగించడం వల్ల పంట ప్రారంభ దశలోనే మంచి మొక్కల పెరుగుదల సాధ్యమవుతుంది. నర్సరీలను నీరు నిల్వ ఉండని ప్రదేశాల్లో ఏర్పాటు చేసి, అవసరమైనంత తేమను మాత్రమే అందిస్తూ, తెగుళ్లు మరియు వ్యాధుల లక్షణాలను ఎప్పటికప్పుడు గమనించాలి.

మామిడి, జీడి, కొబ్బరి, అరటి వంటి పండ్ల తోటల్లో అందుబాటులో ఉన్న నీటిని పొదుపుగా ఉపయోగించుకోవడం ఈ సమయంలో చాలా ముఖ్యం. బిందు సేద్యం, చెట్ల చుట్టూ మల్చింగ్‌ చేయడం వంటి పద్ధతులతో నేలలో తేమను నిలుపుకోవడంతో పాటు నీటి వృథాను తగ్గించవచ్చు. ముఖ్యంగా పూత, పిందె దశల్లో నీటి కొరత రాకుండా చూసుకోవాలి. తోటలను క్రమం తప్పకుండా పరిశీలిస్తూ తెగుళ్లు, వ్యాధులను ప్రారంభ దశలోనే గుర్తించి తగిన చర్యలు తీసుకుంటే మంచి దిగుబడితో పాటు రైతులకు మెరుగైన ఆదాయం పొందే అవకాశం ఉంటుంది.

*డా .వి .గౌరి, డా.ఎన్.రాజ్ కుమార్, *డా.ఎ.అలివేణి, *డా.ఎన్.భారతి, డా.ఎం.బి.జి.ఎస్.కుమారి, డా.కె.లక్ష్మణ, డా. కె.భాగ్యలక్ష్మి మరియు *డా. సి.హెచ్.ముకుందరావు, ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం, అనకాపల్లి, ఆచార్య ఎన్ జి రంగా వ్యవసాయ విశ్వ విద్యాలయం, Ph: 6304852859, 8074670166

Read More

ప్రస్తుత ఎల్‌నినో పరిస్థితులలో మన పశువులను మరియు కోళ్లను కాపాడుకుందాం ఇలా..!- డా. జి. మిథున్

ఎండలు ముదురుతున్న కొద్దీ మనుషులకే కాదు, పశువులు-కోళ్లకు కూడా వేడి ఒత్తిడి పెరుగుతుంది. దీనికి తోడు మేత, తాగునీటి లభ్యత తగ్గితే పశువుల ఆరోగ్యం, పాలు, మాంస ఉత్పత్తి, కోళ్లలో గుడ్లు, మాంస ఉత్పత్తిపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉంది. అయితే ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటే ఈ నష్టాలను గణనీయంగా తగ్గించుకోవచ్చు. అవేంటో చూద్దాం రండి.

మన పశువులు ఎంత వేడిని తట్టుకోగలవు?
• సంకర జాతి (క్రాస్‌బ్రీడ్) ఆవులు: 27°C వరకు మాత్రమే హాయిగా ఉంటాయి
• మన దేశీ ఆవులు (ఒంగోలు లాంటివి): 33°C వరకు తట్టుకుంటాయి
• గేదెలు: 36°C వరకు తట్టుకుంటాయి
అంటే ఒంగోలు, పుంగనూరు లాంటి మన స్థానిక జాతులు ఎండను ఎక్కువగా తట్టుకుంటాయి. అందుకే వీటిని పూర్తిగా వదిలేయకుండా పెంచుకోవడం మంచిది.

ఉష్ణ ఒత్తిడి (ఎండదెబ్బ/ వేసవితాపం) – గుర్తించడం, వెంటనే చేయాల్సినవి
లక్షణాలు: మేత మానేయడం, నోరు తెరిచి రొప్పుతూ ఊపిరి తీయడం, నాలుక వేలాడేసి చొంగ కార్చడం, పాలు దిగుబడి తగ్గడం, పరిస్థితి తీవ్రమైతే స్పృహ కోల్పోవడాన్ని మనం చూడవచ్చును. చిన్న దూడలు, చూడి పశువులు, గేదెలపై దీని ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుంది.

వెంటనే చేయాల్సినవి:
• జ్వరం తగ్గించే మందులు ఈ సమయమునందు ఉపయోగపడవు – చల్లటి నీళ్లతోనే చికిత్స.
• తడి గోనె సంచి లేదా గుడ్డను పశువు శరీరంపై కప్పి, తరచూ చల్లటి నీటితో తడపాలి.
• ఫ్యాన్/స్ప్రింక్లర్లను ప్రతి అరగంటకోసారి 5 నుండి 10 నిమిషాలు వేయడం మంచిది.
• ఎలక్ట్రోలైట్ ద్రావణాన్ని పశువులకి తాగించాలి. ఇంటి వద్దనే ఎలక్ట్రోలైట్ ద్రావణం తయారి: పెద్ద పశువులకు, 20 లీటర్ల నీళ్లలో 160 గ్రా ఉప్పు + పొటాషియం క్లోరైడ్ 20 గ్రా (4 స్పూన్లు) + కాల్షియం క్లోరైడ్ 10 గ్రా + ప్రొపైలిన్ గ్లైకాల్ 300 మి.లీ కలిపి తాగించాలి.
• పశువు యొక్క ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణిస్తే పశువైద్యుడిని వెంటనే సంప్రదించాలి.

షెడ్డు మరియు నీళ్ల ఏర్పాట్లు
• పైకప్పుకు తెల్ల సున్నం వేస్తే లోపలి వేడి 2°C వరకు తగ్గుతుంది – చాలా చౌక ఉపాయం.
• షెడ్డు గోడలకు తడి గోనె సంచులు కట్టి రోజుకు 3-5 సార్లు తడపాలి.
• వరిగడ్డి లేదా కొబ్బరాకులతో పైకప్పు కప్పితే వేడి తగ్గుతుంది.
• ప్రతి పశువుకు రోజుకు 40 నుండి 60 లీటర్ల నీళ్లు కావాలి – నీళ్ల తొట్టెలు నీడలో పెట్టాలి.
• మేతకు ఉదయం 6 – 11, సాయంత్రం 4 – 6 గంటల మధ్యే పంపాలి. మధ్యాహ్నం షెడ్డులోనే ఉంచాలి.

గ్రాసం మరియు దాణా ఏర్పాట్లు
కరువును తట్టుకునే మేత రకాలు (APBN-1, CO-4, CO-5, తెలంగాణ జొన్న CSV-41 వంటివి) ఇప్పుడే వేసుకోవాలి.

మిగిలిన మేతను నిల్వ చేసుకునే 2 పద్ధతులు:

  1. సైలేజి (మాగుడు గడ్డి): పచ్చిమేతను చిన్న ముక్కలుగా కోసి, గాలి చొరబడకుండా గుంతలో లేదా సైలేజ్‌ బంకర్‌లో బాగా నొక్కి కుదించి, పైభాగాన్ని ప్లాస్టిక్‌ లేదా టార్పాలిన్‌తో గట్టిగా మూసివేయాలి. సుమారు 3 నుండి 4 వారాలు పులియబెట్టిన తర్వాత సైలేజ్‌గా ఉపయోగించుకోవచ్చు. గాలి, నీరు లోపలికి చొరబడకుండా చూడటం మంచి నాణ్యమైన సైలేజ్‌కు అత్యంత ముఖ్యం.
  2. యూరియా గడ్డి: 100 కిలోల వరిగడ్డికి 4 కిలోల యూరియా 50 నుండి 60 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసి, గాలి తగలకుండా 3 వారాలు మూసి ఉంచాలి.
    మేత దొరకనప్పుడు: వేరుశనగ పొట్టు, పత్తి లేదా మొక్కజొన్న కాడలు, రావి-మర్రి-మామిడి-వేప ఆకులు, కూరగాయల మార్కెట్ వ్యర్థాలు వాడుకోవచ్చు.

దాణాలో కలపాల్సినవి: రోజుకు మినరల్ మిక్చర్ 50-100 గ్రా, టన్ను దాణాకు విటమిన్-సి 100 గ్రా + విటమిన్-ఇ 50 గ్రా.

రైతులు మర్చిపోకూడని విషయం – పునరుత్పత్తి
ఎండ వేడికి ఆవులు/గేదెల్లో ఎద లక్షణాలు సరిగ్గా కనిపించవు (సైలెంట్ హీట్), గర్భం ఆలస్యమవుతుంది, పదే పదే కట్టు సూది వేయించినా కట్టు నిలవదు (రిపీట్ బ్రీడింగ్). దీనికి పరిష్కారాలు:
• రోజుకు 2 సార్లు (తెల్లవారుజామున, సాయంత్రం) ఎద లక్షణాల కోసం పశువును జాగ్రత్తగా గమనించాలి.
• పదేపదే ఎదకు వచ్చినా గర్భం దాల్చని పశువులను పశువైద్యుడితో పరీక్షించించి, ఆయన సూచన మేరకు PGF2 వంటి హార్మోన్ చికిత్సను చేయించాలి.
• పశువు ఈనిన తేదీ, మరలా కట్టిన తేదీ వంటి ముఖ్యమైన వివరాలను రాసి పెట్టుకోవాలి.

వ్యాధులు మరియు పురుగుల నియంత్రణ
వేసవికాలంలో గొంతువాపు, జబ్బవాపు, గాలికుంటు వంటి వ్యాధుల ముప్పు పెరిగే అవకాశం ఉన్నందున, పశువులకు అవసరమైన టీకాలను పశువైద్యుల సూచన మేరకు సకాలంలో వేయించాలి.

కాలేయ పురుగులు, గోమార్లు, పేలు వంటి పరాన్నజీవుల నియంత్రణకై:
• దవడ కింద వాపు, కళ్లు లేదా చిగుళ్లు తెల్లగా కనిపించడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే పశువైద్యుడిని సంప్రదించాలి.
• పశువైద్యుల సూచన లేకుండా ఒకే రకం డీవార్మింగ్‌ మందును పదేపదే ఉపయోగించకూడదు.
• పశువుల పేడ, మురుగునీరు షెడ్‌ పరిసరాల్లో నిల్వ ఉండకుండా ఎప్పటికప్పుడు శుభ్రపరచాలి.

కోళ్ల పెంపకందారులకు జాగ్రత్తలు
కోళ్లకు చెమట గ్రంథులు ఉండవు కాబట్టి వేసవి వేడిని తట్టుకోవడం కష్టమవుతుంది. అందువల్ల వేసవిలో నీటి అవసరం 3 నుండి 4 రెట్లు పెరిగే అవకాశం ఉన్నందున, ఎప్పుడూ చల్లటి, పరిశుభ్రమైన నీరు అందుబాటులో ఉంచాలి. ట్యాంకులో వేడెక్కిన నీటిని ముందుగా తొలగించి కొత్త నీరు పెట్టాలి. ఈ వేసవి సమయంలో కోళ్లు తగినంత నీరు తాగేలా 0.2% ఉప్పు కలిపిన నీటిని అందించవచ్చు.
• షెడ్ పైకప్పుకు సున్నం పూత వేయడం, తడి గోనె సంచులు ఏర్పాటు చేయడం ద్వారా లోపలి వేడిని తగ్గించాలి.
• వేడి తక్కువగా ఉండే సమయాల్లోనే మేతను అందించడం మంచిది; ముఖ్యంగా తెల్లవారుజామున 4-5 గంటల మధ్య, రాత్రి 12-1 గంటల మధ్య మేత ఇవ్వవచ్చు.
• ఇంటి వద్ద దాణా తయారు చేసేటప్పుడు 5 భాగాల మొక్కజొన్న + 2 భాగాల జొన్న/సజ్జలు + 2 భాగాల వేరుశనగ/సోయా పిండి + గుడ్డు పెంకుల పొడి మిశ్రమాన్ని ఉపయోగించవచ్చు.
• వేసవి కాలంలో షెడ్‌లోని కోళ్ల సంఖ్యను సుమారు 10% తగ్గించి, వాటికి తగినంత స్థలం కల్పించాలి.
• న్యూకాజిల్ (రాణిఖేత్), గంబోరో వంటి వ్యాధులకు సంబంధించిన టీకాలను నిర్ణీత సమయంలో వేయించాలి.

ప్రభుత్వ పథకాల సాయం
• జాతీయ పశుసంపద మిషన్ (NLM): పశుగ్రాస యూనిట్లు, సైలేజ్/హే యూనిట్లకు 50% సబ్సిడీ (గరిష్టం రూ.50 లక్షలు) కోసం ఈ nlm.udyamimitra.in లో దరఖాస్తు చేసుకోవచ్చు.
• అన్నదాత సుఖీభవ పథకం: అర్హులైన రైతు కుటుంబాలకు ఏటా ఈ పధకం ద్వారా ఆర్థిక సాయం. దీన్ని మేత కొనుగోలు, షెడ్డు మరమ్మతులకు వాడుకోవచ్చు.

గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు

  1. పశువులకు తగినంత నీరు తరచుగా అందించాలి.
  2. నీడ, గాలి ప్రసరణ ఉండేలా చూడటం మరియు తడి గోనె సంచులతో వేడి తగ్గించడం వంటి విషయాలపై ప్రత్యేక దృష్టి ఉంచాలి.
  3. ముందుగానే మేత పండించి, అవసరమైనంత నిల్వ చేసుకోవాలి. తీవ్ర ఎండలో పశువులను కట్టివేయడం మానివేయ్యాలి. ఎద లక్షణాలను జాగ్రతగా గమనించుకోవాలి.
  4. కోళ్లకు చల్లటి నీరు, అవసరమైన ఎలక్ట్రోలైట్లు అందించి వేడి ఒత్తిడిని తగ్గించాలి.
  5. నష్టభయంతో పశువులను తొందరపడి అమ్మకుండా, ప్రభుత్వ సహాయ పథకాలను వినియోగించుకోవాలి.
    స్థానిక పశువైద్యులు, పశుసంవర్ధక శాఖ అధికారుల సలహాలు తీసుకుంటూ ఈ జాగ్రత్తలు పాటిస్తే మన పశు సంపదపై ఎల్‌నినో ప్రభావాన్ని బాగా తగ్గించుకోవచ్చు.

డా. జి. మిథున్, అసిస్టెంట్ ప్రొఫెసర్ (CTF),
పశువైద్య మరియు పశుసంవర్ధక విస్తరణ విద్యా విభాగము,
శ్రీ వేంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయం,
పశువైద్య కళాశాల, గరివిడి. మొబైల్: 7799804000.

Read More

ఎల్‌నినో ప్రభావం: పంటలపై కీటకాల ఉధృతి — రైతులు తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలు

వాతావరణ మార్పులతో మారుతున్న కీటకాల ప్రవర్తనను అర్థం చేసుకొని, సమగ్ర సస్యరక్షణ యాజమాన్యంతో నష్టాలను నివారిద్దాం

పరిచయం
వ్యవసాయం పూర్తిగా ప్రకృతిపై ఆధారపడిన జీవన విధానం. విజయవంతమైన పంటల సాగుకు అనుకూలమైన వాతావరణం, సకాలంలో వర్షాలు, సరైన ఉష్ణోగ్రతలు, తగిన నేల తేమ వంటి అంశాలు అత్యంత కీలకం. అయితే ఇటీవలి కాలంలో ప్రపంచవ్యాప్తంగా చోటుచేసుకుంటున్న వాతావరణ మార్పులు (Climate Change) వ్యవసాయ రంగంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. అధిక ఉష్ణోగ్రతలు, అనిశ్చిత వర్షపాతం, దీర్ఘకాలిక కరువు, అకస్మాత్తుగా కురిసే భారీ వర్షాలు, వడగాడ్పులు (Heat Waves) వంటి పరిస్థితులు రైతులను తీవ్రంగా ఇబ్బందులకు గురిచేస్తున్నాయి.

ఈ వాతావరణ హెచ్చుతగ్గులకు దోహదపడే ప్రధాన కారణాల్లో ఎల్‌నినో (El Niño) ఒకటి. ఎల్‌నినో ప్రభావం పంటల పెరుగుదలపైనే కాక, పంటలను ఆశించే కీటకాల జీవన చక్రం, సంతానోత్పత్తి రేటు, వ్యాప్తి, హానికారకత్వంపై కూడా గణనీయమైన మార్పులు తీసుకువస్తుంది. కొన్ని కీటకాలు అసాధారణంగా విజృంభించి పంటలకు తీవ్ర నష్టం కలిగిస్తే, మరికొన్నింటి ఉధృతి తగ్గే అవకాశం ఉంటుంది.

కాబట్టి “ఎల్‌నినో సంవత్సరాల్లో ఏ కీటకాలు ఎక్కువగా విజృంభిస్తాయి? ఏ పంటల్లో ఎక్కువ నష్టం సంభవించే అవకాశం ఉంది? రైతులు ఎలాంటి ముందస్తు, సమగ్ర యాజమాన్య చర్యలు చేపట్టాలి?” అనే అంశాలపై సరైన అవగాహన కలిగి ఉండటం నేటి పరిస్థితుల్లో అత్యవసరం.

ఎల్‌నినో అంటే ఏమిటి?
ఎల్‌నినో అనేది మధ్య మరియు తూర్పు భూమధ్యరేఖా పసిఫిక్ మహాసముద్రంలోని ఉపరితల జలాల ఉష్ణోగ్రత సాధారణ స్థాయి కంటే 0.5°C లేదా అంతకంటే ఎక్కువ పెరిగి, ఆ పరిస్థితి కనీసం ఐదు వరుస నెలలపాటు కొనసాగినప్పుడు నిర్ధారించే ఒక సహజ సముద్ర-వాతావరణ దృగ్విషయం (ENSO వ్యవస్థలో వెచ్చని దశ).
సాధారణ పరిస్థితుల్లో తూర్పు నుండి పడమర వైపు వీచే వాణిజ్య పవనాలు (Trade Winds) వెచ్చని ఉపరితల జలాలను ఇండోనేషియా వైపుకు నెట్టివేస్తాయి. ఎల్‌నినో సమయంలో ఈ గాలులు బలహీనపడటం వల్ల వెచ్చని నీరు మధ్య-తూర్పు పసిఫిక్‌లోనే పేరుకుపోయి, ప్రపంచ వాతావరణ ప్రసరణ మార్గాల్లో మార్పులకు కారణమవుతుంది.

ఈ మార్పుల ప్రభావం ప్రపంచంలోని అనేక దేశాలపై, ముఖ్యంగా భారత ఉపఖండంపై స్పష్టంగా కనిపిస్తుంది. సాధారణంగా ఎల్‌నినో సంవత్సరాల్లో ఈ కింది పరిస్థితులు ఏర్పడే అవకాశం ఎక్కువ:
• సాధారణం కంటే తక్కువ, అనిశ్చిత వర్షపాతం
• నైరుతి రుతుపవనాల బలహీనత లేదా ఆలస్యం
• పగటిపూట అధిక ఉష్ణోగ్రతలు
• నేల తేమ తగ్గుదల
• దీర్ఘకాలిక పొడి వాతావరణ పరిస్థితులు

గమనిక: ఇవి సంభావ్యతలు మాత్రమే — ఎల్‌నినో ఉన్న ప్రతి సంవత్సరం భారతదేశంలో కరువు తప్పనిసరిగా వస్తుందని కాదు; స్థానిక భౌగోళిక అంశాలు, హిందూ మహాసముద్ర డైపోల్ (IOD) వంటి ఇతర అంశాలు కూడా తుది ఫలితాన్ని ప్రభావితం చేస్తాయి.

ఎల్‌నినో కీటకాలపై ఎలా ప్రభావం చూపుతుంది?
కీటకాలు శీతల రక్త జీవులు (Poikilothermic/Cold-blooded organisms) — వాటి శరీర ఉష్ణోగ్రత పరిసర వాతావరణంపై ఆధారపడి ఉంటుంది. అందువల్ల వాతావరణంలో స్వల్ప మార్పులు కూడా వాటి పెరుగుదల రేటు, జీవిత చక్రంపై గణనీయమైన ప్రభావం చూపుతాయి.

ఉష్ణోగ్రత పెరిగినప్పుడు:
• గుడ్లు వేగంగా పొదుగుతాయి
• లార్వా దశ తక్కువ వ్యవధిలో పూర్తవుతుంది
• ప్యూపా దశ కాలం తగ్గుతుంది
• పెద్ద పురుగులు త్వరగా లైంగిక పరిపక్వత చెంది సంతానోత్పత్తి ప్రారంభిస్తాయి
• ఒకే పంట కాలంలో ఎక్కువ తరాలు (generations) అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది

తక్కువ వర్షపాతం వల్ల:
• భారీ వర్షాల ద్వారా సహజంగా కొట్టుకుపోయే పురుగుల మరణాల రేటు తగ్గుతుంది
• ఆకులపై నివసించే చిన్న, మృదుకాయ కీటకాలు సులభంగా మనుగడ సాగిస్తాయి
• అధిక తేమ అవసరమయ్యే కీటక-పరాన్నజీవి శిలీంధ్రాలు (entomopathogenic fungi వంటివి) సమర్థంగా వృద్ధి చెందక, కీటకాల సహజ మరణాల రేటు తగ్గుతుంది
ఫలితంగా కొన్ని కీటక జాతుల జనాభా వేగంగా పెరిగి, ఆర్థిక నష్టపు గరిష్ఠ స్థాయిని (Economic Threshold Level) దాటే అవకాశం ఏర్పడుతుంది.

ఎల్‌నినో పరిస్థితుల్లో ఎక్కువగా విజృంభించే కీటకాలు
ఎల్‌నినో ప్రభావంతో అన్ని కీటకాలు ఒకేలా పెరగవు. ప్రధానంగా వేడి, పొడి వాతావరణానికి అనుకూలంగా ఉండే జాతులు మాత్రమే వేగంగా విస్తరిస్తాయి.

  1. రసం పీల్చే పురుగులు (Sap-Sucking Insects)
    ఎల్‌నినో పరిస్థితుల్లో అత్యధికంగా పెరిగే కీటక సమూహం ఇదే. ఇందులో తెల్లదోమలు, తామర పురుగులు (Thrips), పేనుబంక (Aphids), జాసిడ్లు, మీలీబగ్స్, స్కేల్ కీటకాలు ప్రధానమైనవి. ఇవి మొక్కల ఆకులు, లేత కొమ్మలు, పూతలు, పిందెల నుండి కణరసాన్ని పీల్చి మొక్కలను బలహీనపరుస్తాయి.
    ఎక్కువగా పెరగడానికి కారణాలు: తక్కువ వర్షపాతం, అధిక ఉష్ణోగ్రత, తక్కువ సాపేక్ష ఆర్ద్రత, వేగవంతమైన జీవితచక్రం, అధిక సంతానోత్పత్తి సామర్థ్యం.
    కలిగించే నష్టం: మొక్కల పెరుగుదల మందగించడం, ఆకులు పసుపు రంగులోకి మారడం, ఆకులు ముడుచుకుపోవడం, పూత-పిందె రాలిపోవడం, దిగుబడి తగ్గుదల, వైరస్ వ్యాధుల వేగవంతమైన వ్యాప్తి.
  2. తామర పురుగులు (Thrips)
    ప్రపంచవ్యాప్తంగా ఎల్‌నినో సంవత్సరాల్లో అధికంగా నమోదయ్యే కీటకాల్లో ఇవి ముఖ్యమైనవి. మిరప, ఉల్లి, వేరుశెనగ, పత్తి, ద్రాక్ష, పూల పంటల్లో తీవ్ర నష్టం కలిగిస్తాయి. త్రిప్స్ ఆకు ఉపరితలాన్ని గీరి కణరసాన్ని పీల్చడం వల్ల ఆకులపై వెండి-బూడిద రంగు మచ్చలు/గీతలు (silvering) కనిపిస్తాయి. తీవ్ర ఉధృతిలో ఆకులు ఎండిపోయి పంట పెరుగుదల పూర్తిగా దెబ్బతింటుంది. మిరపలో ఇవి “ఆకుముడత” (leaf curl) వ్యాధి వ్యాప్తికి కూడా దోహదపడతాయి.
  3. తెల్లదోమ (Whitefly)
    తెల్లదోమ అనేక మొక్కల వైరస్ వ్యాధులకు (ముఖ్యంగా బిగోమోవైరస్‌లకు) ప్రధాన వాహకం. ఎల్‌నినో పరిస్థితుల్లో వీటి జనాభా వేగంగా పెరిగే అవకాశం ఉంది. ఇది ముఖ్యంగా పత్తి, టమాట, బెండ, మిరప, సోయాబీన్ పంటల్లో అధిక నష్టం కలిగిస్తుంది — ప్రత్యక్ష రసం పీల్చడం ద్వారానే కాక, వైరస్ వ్యాప్తి ద్వారా కూడా.
  4. పచ్చ నల్లి / స్పైడర్ మైట్స్ (Spider Mites)
    సాంకేతికంగా మైట్స్ కీటకాలు (Insecta) కాదు — ఇవి అష్టపాద జాతికి (Arachnida) చెందినవి. అయినప్పటికీ వ్యవసాయ సస్యరక్షణలో వీటిని హానికర కీటకాలతో పాటే పరిగణిస్తారు. అధిక ఉష్ణోగ్రతలు, పొడి వాతావరణంలో వీటి అభివృద్ధి అత్యంత వేగంగా జరుగుతుంది. పత్తి, మిరప, వంకాయ, కూరగాయలు, పండ్ల తోటల్లో తీవ్ర నష్టం కలిగిస్తాయి.
  5. మీలీబగ్స్ (Mealybugs)
    మామిడి, బొప్పాయి, దానిమ్మ, ద్రాక్ష, పత్తి వంటి పంటల్లో ఎల్‌నినో సంవత్సరాల్లో మీలీబగ్స్ ఉధృతి పెరిగే అవకాశం ఉంది. వీటి తీపి విసర్జనం (honeydew) మీద నల్లటి బూజు తెగులు (Sooty mold) ఏర్పడి కిరణజన్య సంయోగక్రియకు ఆటంకం కలిగిస్తుంది.
  6. ఫాల్ ఆర్మీవార్మ్ మరియు స్పోడోప్టెరా జాతులు
    ఫాల్ ఆర్మీవార్మ్ (Spodoptera frugiperda) మరియు టుబాకో కాటర్‌పిల్లర్ (Spodoptera litura) వంటి ఆకుతినే పురుగుల తీవ్రత ఎల్‌నినో ఒక్క కారణం వల్లనే పెరుగుతుందని చెప్పడం శాస్త్రీయంగా సరికాదు. అయితే దీర్ఘకాలిక పొడి వాతావరణం వల్ల మొక్కలపై ఒత్తిడి (Plant stress) పెరగడం, సహజ శత్రు కీటకాల (parasitoids, predators) సంఖ్య తగ్గడం, ఆలస్యంగా వచ్చే వర్షాలు వంటి పరోక్ష కారణాల వల్ల కొన్ని ప్రాంతాల్లో వీటి ఉధృతి పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి మొక్కజొన్న, వేరుశెనగ, సోయాబీన్, కూరగాయల పంటల్లో క్రమం తప్పకుండా పర్యవేక్షణ అవసరం.

రైతులు తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలు
ఎల్‌నినో సంవత్సరాల్లో కీటకాల ఉధృతిని పూర్తిగా నివారించలేకపోయినా, సమగ్ర సస్యరక్షణ యాజమాన్యం (Integrated Pest Management – IPM) ద్వారా నష్టాన్ని గణనీయంగా తగ్గించవచ్చు.

  1. పంట ప్రారంభానికి ముందు తీసుకోవాల్సిన చర్యలు
    • తట్టుకునే/తక్కువ కాలపరిమితి గల రకాలను ఎంపిక చేసుకోవడం
    • విత్తనశుద్ధి తప్పనిసరిగా చేపట్టడం (సిఫారసు చేసిన శిలీంధ్రనాశక/కీటకనాశక మోతాదులతో)
    • భూసార పరీక్ష ఆధారంగా సమతుల్య ఎరువుల
    • పంట మార్పిడి (Crop rotation) పాటించడం
    • పంట చుట్టూ ట్రాప్ పంటలు (marigold, castor వంటివి) వేయడం
  2. పంట పెరుగుదల దశలో నిరంతర పర్యవేక్షణ
    • ప్రతి వారం పొలాన్ని పరిశీలించి కీటకాల ఉనికిని గుర్తించడం
    • పసుపు/నీలం రంగు జిగురు అట్టలు (Yellow/Blue sticky traps) – తెల్లదోమ, తామర పురుగుల పర్యవేక్షణకు
    • లింగాకర్షక బుట్టలు (Pheromone traps) – ఆకుతినే పురుగుల ముందస్తు హెచ్చరికకు
    • ఆర్థిక నష్టపు స్థాయి (Economic Threshold Level – ETL) దాటిన తర్వాతే నివారణ చర్యలు చేపట్టడం — ముందుగానే మందులు వాడకపోవడం
  3. నీటి యాజమాన్యం
    • అందుబాటులో ఉన్న నీటిని పొదుపుగా వాడుతూ, డ్రిప్/స్ప్రింక్లర్ పద్ధతుల ద్వారా క్రమం తప్పకుండా తేమ నిర్వహణ
    • తేలికపాటి తుంపర్లు (light irrigation/sprinkling) ఇవ్వడం ద్వారా ఆకులపై పేరుకున్న కొన్ని రసం పీల్చే పురుగులను తగ్గించుకోవచ్చు
    • నీటి ఎద్దడి (moisture stress) లేకుండా చూసుకోవడం, ఎందుకంటే ఒత్తిడికి గురైన మొక్కలు కీటకాలకు మరింత లోబడతాయి
  4. జీవ నియంత్రణ (Biological Control) ప్రోత్సాహం
    • క్రైసోపెర్ల, లేడీబర్డ్ బీటిల్స్ వంటి సహజ శత్రు కీటకాలను సంరక్షించడం
    • NPV, బ్యూవేరియా బాసియానా వంటి జీవ కీటకనాశకాలను తగిన పరిస్థితుల్లో వినియోగించడం
  5. సమగ్ర రసాయన యాజమాన్యం
    • స్థానిక వ్యవసాయ శాఖ / కృషి విజ్ఞాన కేంద్రం సిఫారసులను పాటించడం
    • పురుగుల, తెగుళ్ల నిరోధకత (resistance) ఏర్పడకుండా జాగ్రత్త పడటం
    • పిచికారీకి ముందు వాతావరణ సూచనలు పరిశీలించడం — ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న మధ్యాహ్న వేళల్లో పిచికారీ మానుకోవడం
  6. సమాచార వినియోగం
    • భారత వాతావరణ శాఖ (IMD), రాష్ట్ర వ్యవసాయ శాఖల ముందస్తు హెచ్చరికలను నిరంతరం అనుసరించడం
    • సమీప కృషి విజ్ఞాన కేంద్రం (KVK) నిపుణుల సలహాలు తీసుకోవడం
    • తోటి రైతులతో అనుభవాలు పంచుకుంటూ ఉమ్మడి నిర్ణయాలు తీసుకోవడం

ముగింపు
ఎల్‌నినో వంటి వాతావరణ దృగ్విషయాలు రైతుల నియంత్రణలో లేనప్పటికీ, వాటి ప్రభావాన్ని ముందుగానే అంచనా వేసి, తగిన సమగ్ర సస్యరక్షణ యాజమాన్య పద్ధతులను అనుసరించడం ద్వారా పంట నష్టాలను గణనీయంగా తగ్గించుకోవచ్చు. నిరంతర పర్యవేక్షణ, సకాలంలో నిర్ణయాలు, జీవ-రసాయన నియంత్రణ పద్ధతుల సమతుల్య వినియోగం ద్వారా రైతులు ఎల్‌నినో సంవత్సరాల్లో కూడా తమ పంటలను సురక్షితంగా కాపాడుకోగలరు.

ఈ వ్యాసంలోని సూచనలు సాధారణ మార్గదర్శకాలు మాత్రమే. నిర్దిష్ట పంట, ప్రాంతం, తెగుళ్ల తీవ్రతను బట్టి స్థానిక వ్యవసాయ శాఖ లేదా కృషి విజ్ఞాన కేంద్రం నిపుణుల సలహా తీసుకోవడం ఉత్తమం.

డా. టి. నరేష్, సహాయ ఆచార్యులు (కీటక శాస్త్రం) మరియు డా. హరీషా ఎన్. , సహాయ ఆచార్యులు (వ్యవసాయ విస్తరణ శాస్త్రం), విజ్ఞాన్ వ్యవసాయ మరియు సాంకేతిక సంస్థ విజ్ఞాన్ విశ్వవిద్యాలయం, గుంటూరు.

Read More

ముంచుకొస్తున్న కరువు… పాడి రైతు గుండె చెరువు

ఎల్‌నినో ప్రభావం వలన పశుగ్రాస కొరత నానాటికీ పెరిగిపోతోంది. గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో కీలకమైన పాడిరంగం కునారిల్లుతోన్న ఈ పరిస్థితికి పాడి పరిశ్రమకు తగిన ప్రోత్సాహం అందకపోవడం వలన చాలామంది పాడికి దూరం అవుతున్నారు. పశువుల దాణా, మేపు ఖర్చులు  పెరగడం, పచ్చిమేత లభ్యత తగ్గడం, గ్రామాల్లో పశువైద్య సేవలు అరకొరగా ఉండటం, పాలకు గిట్టుబాటు ధర రాకపోవడం - ఇలా ఎన్నో కారణాల వలన పాల ఉత్పత్తి తగ్గుతున్న మాట వాస్తవం. గత 7 సం॥ల్లో 35% పాడి పశువులు తగ్గాయని గణాంకాలు తెలియజేస్తున్నాయి.
వాతావరణ శాఖ అంచనా ప్రకారం, నైరుతి రుతుపవనాలు, ఈశాన్య రాష్ట్రాల్లో సాధారణంగా ఉన్నా మధ్య, దక్షిణ భారత దేశంలో సాధారణం కన్నా తక్కువ ఉండవచ్చు.
3.7.26 ప్రకారం ఖరీఫ్ నాట్లు వరి (-15%), పల్లీ (-18%), సోయా (-65%), పత్తి (-28%) మాత్రమే నమోదయింది. ఈ ఆలస్యం ధాన్యం/నూనెగింజల ఉత్పత్తిపైనే కాక, ఎండుమేత, తవుడు, పత్తి చెక్కల లభ్యతపై కూడా ప్రభావం చూపుతుంది. ఇప్పటికే, భారత ప్రభుత్వం 262 జిల్లాలను కరువు ప్రభావితంగా గుర్తించింది.
ఎన్‌డిడిబి అంచనా ప్రకారం, ఎండుమేత నిలువలు, అవసరమైనది 431 మిలియన్ మెట్రిక్ టన్నులు అయినా, 620 మిలియన్ మెట్రిక్ టన్నులు ఉన్నట్లు, పచ్చిమేత అవసరం 1140 మి.మె.ట. కాగా, 752 మి.మె.ట. ఉన్నట్లు, దాణా 32% కొరత ఉన్నట్లు గుర్తించింది.
దేశంలోని వాణిజ్యస్థాయి దాణా తయారీ, 14.5 మి.మె.ట. కాగా, ఈ వాతావరణ ప్రతికూలత వలన లభ్యత 5Ð10% తగ్గగలదని అంచనా.
మార్చి 26 నుండి జూన్ 26 వరకు చూస్తే, పచ్చిమేత ధరలు రూ. 3/80 నుండి రూ. 4/04 కి ఎగబాకగా, దాణాధరలు రూ.23.80 కిలో నుండి రూ.25.06 కి చేరింది. దాణా తయారీకి ముఖ్యమైన తవుడు ధరలు ఏకంగా 21% పెరిగాయి.
17 రాష్ట్రాల్లోని 262 కరువు ప్రభావిత జిల్లాల్లో పశు జనాభా ఇలా ఉంది.
పాలు ఇచ్చే పశువులు  31.19 మిలియన్లు
ఎండిపోయిన పశువులు   13.34 మిలియన్లు
దూడలు       37.16 మిలియన్లు
మొత్తం      81.70 మిలియన్లు
దీనికై, ఎండుమేత 1.1 మిలియన్ మె.ట., పచ్చిమేత 1.4 మి.మె.ట, దాణా 0.4 మి.మె.ట. గా ఉంటుంది. ముఖ్యంగా ఈ అవసరం రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, గుజరాత్, ఒడిసా, బిహార్, తమిళనాడు, మహారాష్ట్రల్లో ఉంది.

కార్యాచరణ ప్రణాళికః

  1. కరువును తట్టుకునే పశుగ్రాసాల పెంపకం బాజ్రా, మక్కలు చేపట్టాలి
  2. పశుగ్రాస విత్తనాల లభ్యత ఉండాలి.
  3. బహువార్షిక పశుగ్రాసాల పెంపకాన్ని ప్రోత్సహించాలి.
  4. మాగుడుగడ్డి వాడకం పెంచాలి.
  5. సహకార డెయిరీల ద్వారా ‘సైలేజ్’ సరఫరా చేయించాలి.
  6. టోటల్ మిక్స్‌డ్ రేషన్ (టిఎంఆర్) వాడకం పెంచాలి.
  7. ఉపయోగంలోకిరాని దాణా తయారీ సామర్థ్యం వినియోగించి, 3.6 లక్షల టన్నుల అదనపు దాణా తయారీ చేపట్టి రాబోవు 3 నెలల్లో కరువు ప్రభావిత ప్రాంతాల పాడిరైతులకు అందుబాటులోకి తేవాలి.
  8. ఎల్‌నినో ప్రభావం పాలఉత్పత్తిపైన కూడా ఉంటుంది. కాబట్టి, చల్లని వాతావరణంలో కృత్రిమ గర్భధారణ చేపట్టడం, శక్తివర్ధక దాణా సరఫరా ప్రోత్సహించాలి.
    ఏది ఏమైనా, పాడిపశువులకు పచ్చిమేత, ఎండుమేత, ఉత్పాదకత పెంపుదల చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
    అంతేకాక పాలఉత్పత్తిదారుల సహకార సంఘాలు మాగుడుగడ్డి తయారీ, టిఎంఆర్ వాడకం బాహుళ్యంలో తెచ్చినపుడే పాలఉత్పత్తి నిలకడగా ఉండగలదు. అంతేకాక, పాలధర పెంపుదల కోసం ప్రభుత్వ ప్రోత్సాహకం, పశుగ్రాస పెంపకం కోసం పశుగ్రాస విత్తనాల సరఫరా, బీమా ప్రయోజనాలు విజయ డెయిరీ అందిస్తోంది. వీటితో పాడిరైతులు సహకార డెయిరీకి రక్షణ కవచంలా నిలవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
  • మధుసూదనరావు, జనరల్ మేనేజర్, విజయ తెలంగాణ, హైదరాబాద్. ఫోన్: 9121160553
Read More

ఎల్‌ నినో (El Nino) ప్రభావం మరియు పశువుల సంరక్షణ – సమగ్ర నివేదిక

ఎల్‌నినో అనేది పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడే ఒక తీవ్రమైన వాతావరణ మార్పు. దీని ప్రభావం వల్ల భారతదేశం, ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో వర్షపాతం సాధారణం కంటే తక్కువగా ఉండి, అత్యధిక ఉష్ణోగ్రతలు, వడగాలులు మరియు తీవ్ర కరువు పరిస్థితులు ఏర్పడతాయి. ఈ ప్రతికూల వాతావరణం వ్యవసాయంతో పాటు పాడి మరియు మాంసం కోసం పెంచే పశువుల ఆరోగ్యం, మరియు ఉత్పాదకతపై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతుంది.

పశువులపై ఎల్‌నినో చూపే ప్రభావాలు, వాటి వల్ల కలిగే నష్టాలు, మరియు తీసుకోవాల్సిన సమగ్ర యాజమాన్య, నివారణ చర్యల గురించి కింద వివరంగా వివరించబడింది:

  1. పశువులపై ఎల్‌ నినో చూపే తీవ్ర ప్రభావాలు

ఎ. ఉష్ణోగ్రత మరియు హీట్ స్ట్రెస్:
• ఎల్‌నినో సమయంలో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 6°C వరకు పెరిగే అవకాశం ఉంటుంది.
• పశువులకు వాతావరణంలో ఉష్ణోగ్రత-తేమ సూచిక 68 కంటే తక్కువగా ఉంటే సురక్షితం. కానీ ఎల్‌నినో వల్ల ఈ సూచిక 79 కంటే ఎక్కువగా నమోదై, పశువులు భయంకరమైన హీట్ స్ట్రెస్‌కు గురవుతాయి.
• మనుషుల లాగా పశువులకు చెమట పట్టే సామర్థ్యం చాలా తక్కువ. కాబట్టి వేడిని తట్టుకోవడానికి పశువులు వేగంగా శ్వాస తీసుకోవడం ప్రారంభిస్తాయి. దీనివల్ల పశువు శరీరంలోని శక్తి మాంసం, పాలు ఉత్పత్తికి బదులుగా శ్వాస తీసుకోవడానికే వృథా అవుతుంది.

బి. రోగనిరోధక వ్యవస్థ క్షీణత మరియు వ్యాధులు:
• ఎల్‌నినో సమయంలో వాతావరణ ఒత్తిడి వల్ల పశువుల శరీరంలో కార్టిసోల్ మరియు ఏసీటీఎచ్ అనే ఒత్తిడి హార్మోన్లు విపరీతంగా విడులవుతాయి. ఈ హార్మోన్లు పశువుల రోగనిరోధక శక్తిని అణచివేస్తాయి.
• వేడి, తేమతో కూడిన వాతావరణం వల్ల పేలు, గోమారలు, మరియు ఈగలు ఎక్కువగా వృద్ధి చెంది పశువులకు వ్యాధులను వ్యాపింపజేస్తాయి.
• అలాగే రోగనిరోధక శక్తి తగ్గడం వల్ల గొంతువాపు, జబ్బవాపు, ఆంత్రాక్స్ లాంటి ప్రమాదకరమైన బాక్టీరియా మరియు వైరల్ వ్యాధులు వేగంగా సోకుతాయి.

సి. పాడి ఆవులు, గేదెలపై ప్రభావం:
• ఆవులు తమ శరీరంలో వేడిని తగ్గించుకునే క్రమంలో జీర్ణక్రియను నెమ్మదింపజేస్తాయి. దీనివల్ల దాణా తీసుకోవడం తగ్గిపోతుంది.
• తగినంత దాణా తీసుకోకపోవడం వల్ల పాల దిగుబడి 10% నుంచి 30% వరకు పడిపోతుంది. పాలలో కొవ్వు మరియు ప్రోటీన్ శాతం బాగా తగ్గిపోయి పాలు పలచబడతాయి.
• ప్రత్యుత్పత్తి వ్యవస్థ దారుణంగా దెబ్బతింటుంది. ఈస్ట్రోజెన్, ఎల్‌హెచ్ హార్మోన్ల స్థాయిలు పడిపోయి అండాల నాణ్యత దెబ్బతింటుంది.
• ఆవులు సైలెంట్ హీట్‌కు గురవుతాయి మరియు గర్భస్థ పిండాలు చనిపోయే ప్రమాదం ఉంటుంది.
• ఒక పరిశోధన ప్రకారం, ఎల్‌నినో వల్ల కలిగే హీట్ స్ట్రెస్ సమయంలో ఆవులలో పిండాల ఉత్పత్తి తగ్గిపోతుంది. చల్లటి వాతావరణంలో సజీవ పిండాల శాతం 59.2% ఉండగా, ఎల్‌నినో సమయంలో అది 38.2%కి పడిపోయినట్లు గుర్తించారు.

డి. మాంసం కోసం పెంచే పశువులపై ప్రభావం:
• సరైన పశుగ్రాసం లేకపోవడం వల్ల పశువుల బరువు పెరగడం ఆగిపోతుంది.
• తీవ్రమైన ఎండల వల్ల పశువుల కండరాల్లో నిల్వ ఉండే గ్లైకోజెన్ శక్తి పూర్తిగా హరించుకుపోతుంది.
• దీనివల్ల మాంసం కోసే సమయానికి దాని ఆమ్ల-క్షార స్థాయి 5.8-6.0కు పెరిగిపోయి, మాంసం ముదురు రంగులో, గట్టిగా, పొడిగా మారుతుంది. దీనివల్ల మార్కెట్లో మాంసం నాణ్యత, ధర పడిపోతుంది.

ఇ. నీరు మరియు పశుగ్రాస కొరత:
• ఎల్‌నినో వల్ల వర్షపాతం తగ్గడంతో పచ్చగడ్డి దిగుబడి ఆగిపోయి పశుగ్రాస కొరత ఏర్పడుతుంది. ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటికే 4.5 లక్షల టన్నుల పశుగ్రాసం కొరత ఏర్పడింది.
• చెరువులు, కుంటలు ఎండిపోవడం వల్ల పశువులకు త్రాగునీటి కొరత ఏర్పడుతుంది. ఒకవేళ కలుషితమైన నీరు తాగితే వ్యాధులు ప్రబలుతాయి.

  1. నివారణ మరియు యాజమాన్య చర్యలు

ఎ. పశుగ్రాస నిర్వహణ:
• ముందస్తు ప్రణాళిక: రాబోయే కరువు పరిస్థితులను (ముఖ్యంగా ఫిబ్రవరి నుంచి జూన్ వరకు) దృష్టిలో ఉంచుకొని పశుగ్రాస ప్రణాళిక చేసుకోవాలి.
• సైలేజ్ తయారీ: వర్షాకాలంలో లేదా పచ్చగడ్డి ఎక్కువగా ఉన్నప్పుడు మిగిలిన గడ్డిని వృథా చేయకుండా “సైలేజ్” లేదా ఎండుగడ్డిగా నిల్వ చేసుకోవాలి.
• దాణా మరియు మేత కొలతలు: 400-500 కేజీల బరువుండే పశువుకు రోజుకు 20-25 కేజీల పచ్చగడ్డి, 5 కేజీల ఎండుగడ్డి (వరి గడ్డి లేదా జొన్న), 3-5 కేజీల దాణా విధిగా అందించాలి. పచ్చగడ్డి అందుబాటులో లేకపోతే ఎండు గడ్డికి పోషకాలు కలిపి ఇవ్వాలి.
• ప్రభుత్వ పథకాల వినియోగం: ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో ఉపాధి హామీ పథకం కింద, ప్రకృతి వ్యవసాయం కింద ఖాళీ భూముల్లో పచ్చగడ్డిని పెంచాలి. హరిత గోపాలం పథకం ద్వారా పశుగ్రాస క్షేత్రాలు, నర్సరీలను ఏర్పాటు చేసుకోవాలి.
• పొలాల గట్లపై పెరిగే సహజమైన గడ్డిని నాశనం చేయకుండా పశువుల కోసం భద్రపరచుకోవాలి.

బి. దాణాలో మార్పులు మరియు సప్లిమెంట్లు:
• పశువులు ఎండ సమయంలో మేత తినలేవు, కాబట్టి వాతావరణం చల్లగా ఉండే ఉదయం (6-7 గంటలకు) మరియు సాయంత్రం (4-6 గంటలకు) సమయాల్లో మేత మేపాలి.
• మేతలో పీచు పదార్థాలతో పాటు శక్తిని ఇచ్చే దాణా పెంచాలి. అజీర్తి సమస్యలు రాకుండా ప్రోబయోటిక్స్ వాడాలి.
• వడదెబ్బను, డీహైడ్రేషన్‌ను తట్టుకోవడానికి తాగునీటిలో ఎలక్ట్రోలైట్లు కలపాలి.
• పశువులకు మినరల్ మిక్చర్ మరియు ఉప్పు ఎక్కువగా ఉండే దాణా అందించాలి. విటమిన్ సి, విటమిన్ బి1, మరియు ఎల్-కార్నిటైన్ కలిగిన పోషకాలు పశువులకు ఒత్తిడి నుంచి ఉపశమనం ఇస్తాయి.

సి. నీటి నిర్వహణ:
• ఒక ఆవుకు రోజుకు కనీసం 40-60 లీటర్ల శుభ్రమైన తాగునీరు అవసరం, ఎండాకాలంలో ఈ అవసరం ఇంకా పెరుగుతుంది. పశువులకు ఎల్లప్పుడూ చల్లటి, స్వచ్ఛమైన నీరు అందుబాటులో ఉండేలా చూడాలి.
• వ్యవసాయ క్షేత్రాల్లో పల్లపు ప్రాంతాల్లో ఫార్మ్ పాండ్స్ తవ్వి వర్షపు నీటిని నిల్వ చేసుకోవాలి.

డి. వసతి మరియు శీతలీకరణ:
• పశువుల పాకల పైకప్పుకు ఆస్బెస్టాస్ లేదా జింక్ రేకులు వాడకూడదు, ఇవి వేడిని ఎక్కువగా ఆకర్షిస్తాయి. కప్పులపై గడ్డి లేదా కొబ్బరి ఆకులు వేసి ఉంచాలి.
• గాలి బాగా ఆడేలా చూసుకోవాలి. పాకలలో వేడిని తగ్గించడానికి ఫాగర్లు, మిస్ట్ డ్రాప్స్, లేదా స్ప్రింక్లర్లు తో పాటు ఫ్యాన్లు ఉపయోగించి సూక్ష్మ వాతావరణాన్ని చల్లగా ఉంచాలి. క్లోజ్డ్ హౌస్ పద్ధతిని వాడితే కూలింగ్ ప్యాడ్స్ ఏర్పాటు చేసుకోవాలి.

ఇ. ఆరోగ్య సంరక్షణ మరియు వ్యాక్సినేషన్:
• ఎల్‌నినో ముప్పు తీవ్రంగా ఉంటుంది కాబట్టి వర్షాకాలానికి ముందే పశువులకు గాలికుంటు వ్యాధి, గొంతువాపు, మరియు జబ్బవాపు లకు తప్పనిసరిగా టీకాలు వేయించాలి.
• పశువులకు క్రమం తప్పకుండా నట్టల నివారణ మందులు త్రాగించాలి. పాకల్లోకి పేలు, గోమారలు రాకుండా పాత మట్టిని తీసేసి కొత్త మట్టి వేయాలి, క్రిమిసంహారకాలు పిచికారీ చేయాలి.
• పాకల్లో రద్దీని తగ్గించాలి. రద్దీ వల్ల వేడి పెరగడమే కాకుండా అమ్మోనియా వాయువు ఉత్పత్తి అయి శ్వాసకోశ వ్యాధులు వస్తాయి.
• ఉరుములు, పిడుగులు పడే సమయంలో పశువులను చెట్ల కింద ఉంచకూడదు. అలాగే ఎండ తీవ్రంగా ఉన్నప్పుడు పశువులను బలవంతంగా లాగడం చేయకూడదు.
పై విధానాలను సూక్ష్మస్థాయిలో ప్రణాళికబద్ధంగా పాటిస్తే, ఎల్‌నినో లాంటి విపత్కర వాతావరణ పరిస్థితుల్లో సైతం పశుగ్రాస కొరతను అధిగమించి, పశువుల ఉత్పాదకత పడిపోకుండా కాపాడుకోవచ్చు. ఏదైనా అనారోగ్య లక్షణాలు కనిపిస్తే తక్షణం పశువైద్యాధికారిని సంప్రదించడం అత్యంత కీలకం.

డాక్టర్.జి.రాంబాబు, పశువైధ్యాధికారి, కడప. Ph: 94945 88885

Read More

ఎల్ నినో పరిస్థితుల్లో రైతు ఆదాయ స్థిరత్వానికి వ్యూహాలు: అనుకూల పంటల ఎంపిక మరియు వ్యవసాయ రికార్డుల నిర్వహణ

భారతదేశ జనాభాలో సుమారు 68.84 శాతం మంది గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తుండగా, మొత్తం శ్రామిక శక్తిలో 54.6 శాతం మంది వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారు. తెలంగాణలో కూడా సుమారు 61.12 శాతం జనాభా గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తుండగా, దాదాపు 55 శాతం మంది వ్యవసాయ రంగంతో అనుసంధానమై ఉన్నారు. వ్యవసాయ గణాంకాల ప్రకారం భారతదేశంలో 86 శాతం కంటే ఎక్కువ వ్యవసాయ కమతాలు చిన్న మరియు సన్నకారు వర్గాలకు చెందుతాయి.

తెలంగాణ వ్యవసాయం నీటిపారుదల మరియు వర్షాధార వ్యవసాయ వ్యవస్థల సమ్మేళనంగా ఉండి, వర్షపాతం వ్యవసాయాభివృద్ధిలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది ఇటీవలి సంవత్సరాల్లో సాగునీటి వసతులు పెరిగినప్పటికీ, వాతావరణ మార్పులు రైతుల నిర్ణయాలను ప్రభావితం చేస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో రైతు తీసుకునే ప్రతి పంట నిర్ణయం కుటుంబ ఆదాయంపై ప్రత్యక్ష ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా వర్షపాతం అస్థిరంగా ఉండే సంవత్సరాలలో పంటల ఎంపిక మరింత కీలకంగా మారుతుంది. ఎల్నినో (Elnino) వంటి వాతావరణ పరిస్థితులు వర్షపాతాన్ని ప్రభావితం చేసి వ్యవసాయ ఉత్పత్తిపై గణనీయమైన ప్రభావం చూపుతాయి. భారత వాతావరణ శాఖ (IMD) అంచనాల ప్రకారం ఎల్నినో ప్రభావం ఉన్న సంవత్సరాలలో సాధారణంగా రుతుపవనాల బలహీనత, సగటు కంటే తక్కువ వర్షపాతం, అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంటుంది. 2025-26 సంవత్సరానికి కూడా వాతావరణ పరిస్థితులపై ఎల్నినో ప్రభావం కొనసాగే అవకాశాలపై వివిధ వాతావరణ సంస్థలు సూచనలు చేస్తున్నాయి.

తెలంగాణలోని ప్రధాన పంటలు మరియు వాటిపై ఎల్ నినో ప్రభావం
వ్యవసాయశాఖ గణాంకాల ప్రకారం తెలంగాణలో 2025 వానాకాలంలో తెలంగాణ రాష్ట్ర మొత్తం పంటల సాగు విస్తీర్ణంలో వరి పంట 50.57 శాతం వాటాతో ప్రథమ స్థానంలో నిలవగా, రెండవ స్థానంలో పత్తి 34.52 శాతం విస్తీర్ణాన్ని ఆక్రమించింది. ఈ గణాంకాలు రాష్ట్ర వానాకాల పంటల సరళిలో వరి మరియు పత్తి పంటల ప్రాబల్యాన్ని సూచిస్తున్నాయి. అయితే ఎల్నినో వంటి వాతావరణ అనిశ్చిత పరిస్థితులు ఎదురైనప్పుడు కేవలం సంప్రదాయ పద్ధతిలో వరి సాగుపైనే ఆధారపడకుండా, నీటి లభ్యత తక్కువగా అవసరం ఉన్న కందులు, పెసర వంటి పప్పుధాన్యాలు లేదా స్థానిక పరిస్థితులకు అనుకూలమైన ప్రత్యామ్నాయ పంటలను కూడా పరిగణనలోకి తీసుకోవడం అవసరం.

డైరెక్టరేట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ ప్రచురించిన గణాంకాల ప్రకారం, ఎల్నినో ప్రభావం ఉన్న సంవత్సరాలలో (2014-15 మరియు 2015-16) తెలంగాణలో ప్రధాన పంటల నికర ఆదాయంలో గణనీయమైన మార్పులు నమోదయ్యాయి.

2015-16 తీవ్రమైన ఎల్ నినోలో పరిస్థితి మరింత తీవ్రంగా కనిపించింది. వరి (-14007.72), మొక్కజొన్న – 11373.53), పత్తి (-10908.38), కందులు (-9818.09), పెసర (-5207.97) పంటలన్నింటిలోనూ నికర ఆదాయాలు గణనీయంగా తగ్గాయి. ఇది తీవ్రమైన వర్షాభావ పరిస్థితులలో పంటలు ఎంతగా దెబ్బతింటాయో సూచిస్తుంది. అదే విధంగా తక్కువ నీటి అవసరం ఉన్న పంటలు వర్షాభావాన్ని తట్టుకొని రైతులకు నష్టాలను తగ్గించే అవకాశాన్ని కల్పించాయి. దీనినిబట్టి ఎల్నినో ప్రభావం ఉన్న సంవత్సరాలలో అన్ని పంటలు ఒకే విధంగా ప్రభావితమవలేదని గమనించవచ్చు. కొన్ని సంవత్సరాలలో వరి అత్యధిక నష్టాలను చవిచూడగా, కొన్ని ప్రత్యామ్నాయ పంటలు లాభాలను మరియు తక్కువ నష్టాలను నమోదు చేశాయి.

అదేవిధంగా పంటల ఎంపికలో కూడా ఒకే సూత్రం అందరికీ వర్తించదు. రైతు నేల స్వభావం, నీటి వనరులు, గత అనుభవం, మార్కెట్ పరిస్థితులు మరియు కుటుంబ అవసరాలను దృష్టిలో ఉంచుకొని నిర్ణయం తీసుకోవాలి. ఈ నిర్ణయాన్ని శాస్త్రీయంగా తీసుకోవడానికి వ్యవసాయ రికార్డులు ఎంతో ఉపయోగపడతాయి. గత సంవత్సరాలలో ఏ పంటకు ఎంత ఖర్చు అయింది, ఎంత దిగుబడి వచ్చింది, ఎంత ఆదాయం లభించింది, వర్షాభావ పరిస్థితుల్లో ఏ పంట మెరుగ్గా నిలిచింది వంటి వివరాలు రికార్డుల ద్వారా స్పష్టంగా తెలుస్తాయి.

దీనికోసం రైతు పొలంలో జరిగే వివిధ కార్యకలాపాలకు వేర్వేరు రికార్డులు అవసరం. రైతు నిర్వహించుకోదలచిన ముఖ్యమైన రికార్డు రకాలు ఇవి:

  1. వ్యవసాయ దినచర్య రికార్డు
  2. పంటల వారీ ఖర్చు-ఆదాయ రికార్డు
  3. ఎరువుల వినియోగ రికార్డు
  4. పురుగుమందుల వినియోగ రికార్డు
  5. కార్మికుల వినియోగ రికార్డు
  6. యంత్రాల వినియోగ రికార్డు
  7. నీటి వినియోగ రికార్డు
  8. దిగుబడి రికార్డు
  9. పశుసంవర్ధక రికార్డు
  10. నిల్వ మరియు విక్రయాల రికార్డు

ప్రస్తుతం తెలంగాణలోని అభ్యుదయ రైతులు కొంతమంది ప్రధానంగా కాగితపు రికార్డుల ద్వారానే వ్యవసాయ సమాచారాన్ని నమోదు చేసి భద్రపరుస్తున్నారు. అయితే, కాలానుగుణంగా అందుబాటులోకి వచ్చిన వివిధ ఆధునిక పద్ధతులను కూడా వినియోగించి వ్యవసాయ రికార్డులను మరింత సమర్థవంతంగా భద్రపరచుకోవచ్చు. వీటిలో సంప్రదాయ కాగితపు పద్ధతులతో పాటు డిజిటల్ రికార్డు పద్ధతులు, స్మార్ట్ఫోన్ ఆధారిత పద్ధతులు మరియు ప్రభుత్వ డిజిటల్ వేదికలు ముఖ్యమైనవి. ఈ పద్ధతుల వివరాలు క్రింది చిత్రంలో చూపించబడ్డాయి.

వివిధ వ్యవసాయ రికార్డుల పద్ధతులు
ప్రస్తుత ఎల్ నినో పరిస్థితుల్లో నీటి లభ్యతను దృష్టిలో ఉంచుకుని తక్కువ నీటి అవసరం గల అనుకూల పంటలను ఎంపిక చేసి సాగు చేయడం రైతుల ఆదాయ స్థిరత్వాన్ని పెంపొందించడంతో పాటు వాతావరణ మార్పులు మరియు వర్షాభావ పరిస్థితుల ప్రభావాలను తగ్గించడంలో ముఖ్యమైన వ్యూహంగా నిలుస్తుంది. అదే సమయంలో, పంటల ఎంపిక, ఖర్చులు, దిగుబడులు, ఆదాయం మరియు వనరుల వినియోగానికి సంబంధించిన వ్యవసాయ రికార్డులను క్రమం తప్పకుండా నమోదు చేసి భద్రపరచడం ద్వారా రైతులు గత అనుభవాలను విశ్లేషించి భవిష్యత్ సాగు నిర్ణయాలను మరింత శాస్త్రీయంగా మరియు సమర్థవంతంగా తీసుకునే అవకాశం కలుగుతుంది. అందువల్ల, అనుకూల పంటల సాగుతో పాటు సమగ్ర వ్యవసాయ రికార్డుల నిర్వహణ కూడా వాతావరణ అనిశ్చితులను ఎదుర్కొంటూ స్థిరమైన మరియు లాభదాయకమైన వ్యవసాయాభివృద్ధికి కీలకమైన అంశంగా పరిగణించబడుతుంది.

డా. డి. ఎ. రజిని దేవి, సహాయ ప్రొఫెసర్, వ్యవసాయ ఆర్థిక శాస్త్ర విభాగం, వ్యవసాయ కళాశాల,రాజేంద్రనగర్
డా. కె. శేఖర్, సహాయ ప్రొఫెసర్, సేద్య విభాగం, వ్యవసాయ కళాశాల, రాజేంద్రనగర్, ఫోన్: 9032128184

Read More

‘ఎల్ నినో’ ముప్పు: వ్యవసాయ రంగంలో ఎదురయ్యే సవాళ్లు – నివారణ చర్యలు

ప్రస్తుతం 2026లో ఎల్ నినో (El Niño) అధికారికంగా ప్రారంభమైందని ప్రపంచ వాతావరణ సంస్థ (WMO), అమెరికాకు చెందిన నోవా (NOAA) శాస్త్రవేత్తలు ధృవీకరించారు. ఇది రాబోయే శరదృతువు (Autumn) నాటికి మరింత బలపడి, ప్రమాదకరమైన “సూపర్ ఎల్ నినో” (Super El Niño) స్థాయికి చేరుకునే అవకాశం ఉందని వాతావరణ కేంద్రాలు తీవ్ర హెచ్చరికలు జారీ చేశాయి.

ఎల్ నినో అంటే పసిఫిక్ మహాసముద్రం (Pacific Ocean) యొక్క మధ్య మరియు తూర్పు భాగాలలో సముద్ర ఉపరితల నీటి ఉష్ణోగ్రత సాధారణం కంటే పెరగడం అనే ఒక వాతావరణ దృగ్విషయం. ఇది సాధారణంగా ప్రతి 2 నుండి 7 సంవత్సరాలకు ఒకసారి సంభవిస్తుంది మరియు 9-12 నెలల నుండి కొన్నిసార్లు 2 సంవత్సరాల వరకు కొనసాగవచ్చు. ఈ ఘటన ప్రపంచవ్యాప్తంగా వర్షపాతం, ఉష్ణోగ్రత మరియు గాలుల నమూనాలను మారుస్తుంది. ఇది El Niño–Southern Oscillation (ENSO) అనే పెద్ద వాతావరణ వ్యవస్థలో ఒక దశ. ENSO లో మూడు దశలు ఉన్నాయి:

  1. El Niño (వేడి దశ),
  2. La Niña (చల్లని దశ) మరియు
  3. Neutral (సాధారణ స్థితి).

ఎల్ నినో లక్షణాలు:
• సముద్ర ఉపరితల ఉష్ణోగ్రత పెరుగుదల (+0.5°C లేదా అంతకంటే ఎక్కువ)
• గాలుల నమూనాలలో మార్పులు
• వర్షపాత నమూనాలలో మార్పులు
• దక్షిణ అమెరికా ప్రాంతంలో భారీ వర్షాలు
• ఆస్ట్రేలియా మరియు భారతదేశంలో కరవు పరిస్థితులు

ముఖ్య గమనిక: ఎల్ నినో మాత్రమే వర్షపాతాన్ని నిర్ణయించదు. ఇండియన్ ఓషన్ డైపోల్ (IOD), స్థానిక వాతావరణ వ్యవస్థలు వంటి ఇతర అంశాలు కూడా ప్రపంచవ్యాప్తంగా ప్రాముఖ్యతను కలిగి ఉంటాయి. అందువల్ల, కొన్నిసార్లు ఎల్ నినో ఉన్నప్పటికీ మంచి వర్షాలు కురవవచ్చు (IOD పాజిటివ్‌గా ఉంటే).
భారతదేశంలో వ్యవసాయంపై ఎల్ నినో ప్రభావాలు

భారతదేశ వ్యవసాయం వర్షంపై చాలా ఎక్కువగా ఆధారపడి ఉంటుంది, ముఖ్యంగా నైరుతి రుతుపవనాలపై (south-west monsoon). ఎల్ నినో సంభవించిన సంవత్సరాల్లో రుతుపవనాల వర్షపాతం సాధారణం కంటే తక్కువగా ఉండే అవకాశం మరియు కరవు పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది. ఉదాహరణకు 2002, 2009 మరియు 2015 లలో ఎల్ నినో కారణంగా వర్షపాత కొరత ఏర్పడింది.

  1. వర్షపాత కొరత (Drought): ఎల్ నినో సమయంలో వర్షపాతం తగ్గడం వల్ల కరవు పరిస్థితులు ఏర్పడతాయి. దీనివల్ల నీటి కొరత ఏర్పడి పంటలు ఎండిపోయే అవకాశం ఉంది.
  2. పంట ఉత్పత్తి తగ్గడం: వరి, జొన్నలు, గోధుమలు, పప్పుధాన్యాలు మొదలైన ముఖ్యమైన పంటల ఉత్పత్తి తగ్గుతుంది. దీనివల్ల రైతులకు నష్టం వాటిల్లుతుంది.
  3. నీటిపారుదల సమస్య: జలాశయాలు (రిజర్వాయర్లు) మరియు భూగర్భ జలాల మట్టాలు తగ్గిపోతాయి. దీనివల్ల పంటలకు నీటిపారుదల సౌకర్యం కల్పించడం కష్టమవుతుంది.
  4. కీటకాలు మరియు తెగుళ్ల పెరుగుదల: వాతావరణ మార్పుల కారణంగా కొన్ని రకాల కీటకాలు మరియు వ్యాధులు/తెగుళ్లు పెరుగుతాయి. ఇది పంటల నాణ్యతను మరియు ఉత్పత్తిని దెబ్బతీస్తుంది.

నివారణ చర్యలు

  1. కరవు తట్టుకునే పంటలు: రాగులు, జొన్నలు, సజ్జలు మొదలైన తక్కువ నీరు అవసరమయ్యే పంటలను పండించడం ఉత్తమం.
  2. నీటి సంరక్షణ: వర్షపు నీటి నిల్వ (వాటర్ హార్వెస్టింగ్), వ్యవసాయ కుంటల నిర్మాణం చేయడం.
  3. సరైన పంట ప్రణాళిక: వాతావరణ సమాచారం ఆధారంగా పంట ఎంపిక మరియు విత్తే సమయాన్ని నిర్ణయించడం.
  4. సూక్ష్మ నీటిపారుదల సాంకేతికత: బిందు (డ్రిప్) మరియు తుంపర (స్ప్రింక్లర్) నీటిపారుదల పద్ధతులను ఉపయోగించడం నీటి పొదుపునకు సహాయపడుతుంది.
  5. పంట బీమా (Crop Insurance): పంట నష్టం నుండి రక్షణ పొందడానికి బీమాను ఉపయోగించుకోవడం.

రైతులకు వ్యవసాయ సలహాలు మరియు ముందస్తు జాగ్రత్తలు
జూన్ నెల ఖరీఫ్ సీజన్ ప్రారంభానికి కీలకమైన సమయం. భారత వాతావరణ శాఖ (IMD) మరియు వ్యవసాయ విశ్వవిద్యాలయాల ముందస్తు అంచనాల ప్రకారం, ఈ ఏడాది జూన్ నెల వాతావరణం మరియు రైతులు తీసుకోవలసిన ముందస్తు జాగ్రత్తల సంక్షిప్త సమాచారం:

వ్యవసాయ భూమి సిద్ధం చేయడం మరియు విత్తడం
• నేలను సిద్ధం చేయడం: తొలకరి జల్లులు మరియు ప్రారంభంలో కురిసే వర్షాలను ఉపయోగించుకుని భూమిని లోతుగా దుక్కి దున్ని సిద్ధం చేసుకోండి. ఇది మట్టిలో తేమను పట్టి ఉంచడానికి సహాయపడుతుంది.
• విత్తడానికి తొందరపడవద్దు: కనీసం 50 నుండి 60 మి.మీ. మేర మంచి వర్షం పడి, మట్టిలో తగినంత పదును (తేమ) ఏర్పడే వరకు విత్తే కార్యక్రమాన్ని ప్రారంభించవద్దు.
• కరవును తట్టుకునే రకాల ఎంపిక: వర్షపాత కొరత సూచనలు ఉన్నందున, తక్కువ కాలపరిమితిలో చేతికి వచ్చే మరియు తక్కువ నీరు అవసరమయ్యే ప్రత్యామ్నాయ పంటలు మరియు రకాలను (ఉదాహరణకు: జొన్న, సజ్జ, పెసర, మినుము, కంది మొదలైనవి) ఎంపిక చేసుకోవడం ఉత్తమం.
• భూగర్భ జలాల సద్వినియోగం: వర్షాల అస్థిరత ఉన్నందున వ్యవసాయ కుంటలు (ఫార్మ్ పాండ్స్), బోర్‌వెల్ మరియు బిందు సేద్యం (Drip Irrigation) పద్ధతిని ఉపయోగించడానికి ఇప్పటి నుంచే ప్రణాళిక సిద్ధం చేసుకోండి.

సారాంశం
ప్రపంచవ్యాప్త ఉష్ణోగ్రతల పెరుగుదల కారణంగా ఎల్ నినో పరిణామాలు మరింత తీవ్రమవుతున్నాయి. ఇది వాతావరణ మార్పులకు ఒక ముఖ్యమైన సూచిక. “2026 లో పూర్తి కరవు లేదా పూర్తిగా మంచి వర్షాలు కురుస్తాయని ఖచ్చితంగా చెప్పలేం – కానీ ‘అస్థిర వాతావరణం’ అనేది మాత్రం నిజం.” ఎల్ నినో అనేది ఒక సహజ వాతావరణ ప్రక్రియ అయినప్పటికీ, దాని ప్రభావాలు చాలా తీవ్రంగా ఉంటాయి. ముఖ్యంగా వ్యవసాయం మరియు ఆహార భద్రతపై ఇది పెద్ద ప్రభావాన్ని చూపుతుంది. అందువల్ల, విజ్ఞాన ఆధారిత వ్యవసాయం, వాతావరణ సమాచారం మరియు సరైన ప్రణాళికల ద్వారా మనం దీని ప్రభావాన్ని తగ్గించవచ్చు.

“ఎల్ నినోను నిరోధించడం సాధ్యం కాదు, కానీ దాని ప్రభావాలను తగ్గించడం మన చేతుల్లోనే ఉంది”

డా. బి. చంద్ర శేఖర్, నేల (మృత్తికా) శాస్త్ర అధ్యాపకులు, పీజీఐహెచ్ఎస్ (PGIHS), ములుగు, సిద్దిపేట,
శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం (SKLTGHU)

Read More

ఎల్‌నినో ప్రభావం ఉన్న చోటల్లా పశుగ్రాసం పెంచేలా చర్యలు

ఈ ఏడాది ఎల్‌నినో ప్రభావం ఉన్నా ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా పశుగ్రాసానికి కొరత రావొద్దని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు స్పష్టంచేశారు. ఎల్‌నినో ప్రభావంపై చర్చ సందర్భంగా మంత్రి పయ్యావుల కేశవ్ పశుగ్రాస కొరత రాకుండా జాగ్రత్తలను ప్రస్తావించారు. ఉపాది హామీ పథకం కింద ప్రైవేటు భూముల్లోనూ పశుగ్రాసం సాగుకు అనుమతించామని పీఆర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శశిభూషణ్ కుమార్ చెప్పారు. ‘ఇప్పటివరకు 3,458 ఎకరాలను ఉపాది హామీ పథకం కిందకు తెచ్చి, అక్కడ గ్రాసం సాగుకు విత్తనాలు అందించాం. అనంతపురం జిల్లాలో చెరువు భూముల్లోనూ సాగు కోసం పశు గ్రాసం విత్తనాలను ఉచితంగా ఇస్తున్నామ’ని పశు సంవర్ధక శాఖ డైరెక్టర్ దామోదరాయుడు తెలిపారు. పలు సందేహాలు లేవనెత్తిన సీఎం.. గ్రాసం సాగుకు ఎంత బడ్జెట్ కావాలని ప్రశ్నించారు. రూ.700 కోట్ల అవసరమని డైరెక్టర్ చెప్పగా, ‘రూ.1,000 కోట్ల వరకైనా పర్లేదు. ఎల్‌నినో ప్రభావం ఉన్నచోటల్లా పశుగ్రాసం పెంచేలా చర్యలు చేపట్టండి. కలెక్టర్లు వెంటనే ఈ సాగు మొదలు పెట్టించాలి’ అని ఆదేశించారు.

Read More