మన రైతులకు నీళ్లిస్తే బంగారం పండిస్తారు ముఖ్యమంత్రి చంద్రబాబు

మన రైతులకు నీళ్ళిస్తే బంగారం పండిస్తారని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. హంద్రీ నీవా ప్రాజెక్టు ప్రధాన కాలువ సామర్థ్యాన్ని 2,200 క్యూసెక్కుల నుంచి 3,850 క్యూసెక్కులకు పెంచడంతో రాయలసీమ రైతాంగానికి మేలు జరుగుతుందని వివరించారు. హంద్రీ నీవా ప్రధాన కాలువ విస్తరణ పనుల్ని శరవేగంగా పూర్తిచేశామని, ఇదే స్ఫూర్తితో త్వరలోనే ఫేజ్‌-2 పూర్తి చేద్దామని పిలుపునిచ్చారు. జలహారతి కార్యక్రమంలో భాగంగా గురువారం హంద్రీ నీవాకు నీరు విడుదల చేసిన చంద్రబాబు ఎక్స్‌ వేదికగా స్పందిస్తూ.. ”నాకు చాలా సంతోషంగా, సంతృప్తిగా ఉంది. రాయలసీమ ప్రాంతానికి నీళ్లిచ్చి రైతన్నలకు మంచి చేస్తే కలిగే సంతోషం ఎప్పుడూ ప్రత్యేకమే. నాలుగు ఉమ్మడి జిల్లాల్లో 33 లక్షల మందికి తాగు నీరు, 6 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే ప్రాజెక్టును పూర్తిచేస్తాం. ప్రతి ఎకరాకు నీరు అందించాలనే సంకల్పాన్ని అందరి దీవెనలతో నెరవేరుస్తాం. రైతన్నల సాగునీటి కష్టాలు తీర్చి వారి జీవన ప్రమాణాలు మెరుగుపరుస్తాం” అని వివరించారు.

Read More

జాతీయ పురస్కారం అందుకున్న పార్వతీపురం శాస్త్రవేత్త

పార్వతీపురం మన్యం జిల్లా మక్కువ మండలం చప్పబుచ్చింపేట గ్రామానికి చెందిన వ్యవసాయ శాస్త్రవేత్త డా. వైకుంఠపు పాపారావుకు ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ రైస్‌ రీసెర్చ్‌లో రాష్ట్రీయ కృషి విజ్ఞాన జాతీయ స్థాయి పురస్కారం లభించింది. ఐసీఏఆర్‌ స్థాపన దినోత్సవం సందర్భంగా దిల్లీలో నిన్న నిర్వహించిన కార్యక్రమంలో కేంద్ర వ్యవసాయ శాఖా మంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ చేతుల మీదుగా ఈ పురస్కారం అందుకున్నారు.

Read More

పార్లమెంటు క్యాంటీన్‌లో రాగి ఇడ్లీ, జొన్నల ఉప్మా

పార్లమెంటును సందర్శించే వారికి పోషకాలతో నిండిన ఆహారాన్ని అందించేలా కొత్త మెనూ తయారైంది. లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా సూచనలతో రుచికరమైన, ఆరోగ్యవంతమైన ఆహారాన్ని తీసుకువస్తున్నారు. కొత్త మెనూలో రాగి ఇడ్లీ, జొన్నల ఉప్మా, మూంగాల్‌ చిల్లా, కాల్చిన చేప వంటి రకరకాల వంటలను ఉంచారు. చిరుధాన్యాలతో తయారు చేసిన భోజనం, పీచు పదార్థాలు అధికంగా ఉండే సలాడ్లు, ప్రొటీన్‌లతో నిండిన సూప్‌లను మెనూలో ఉంచారు. ఈ ఆహారాన్ని ఎంపీలకు మాత్రమే కాకుండా అధికారులకు, పార్లమెంటు సందర్శకులకు సైతం అందించనున్నారు.

Read More

వ్యవసాయ పరిశోధన సంచాలకుడు బలరామ్‌ ఆవిష్కరించిన హైబ్రిడ్‌ వరి విత్తనోత్పత్తికి మూడు దేశాల పేటెంట్‌

హైబ్రిడ్‌ వరి పరిశోధనలో నూతన ఆవిష్కరణకు గాను తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయ పరిశోధన సంచాలకుడు మరాఠి బలరామ్‌ మూడు దేశాల పేటెంట్లను పొందారు. ఇప్పటికే ఆయనకు భారత్‌తోపాటు అమెరికాలో పేటెంట్‌ లభించింది. తాజాగా ఫిలిప్పీన్స్‌ నుంచి పేటెంట్‌ పొందారు. బలరామ్‌ అంతర్జాతీయ వరి పరిశోధన సంస్థ(ఐఆర్‌ఆర్‌ఐ)లో ఫెలోషిప్‌ సందర్భంగా పరిశోధన చేపట్టారు. ఆఫ్రికాలో ఏడాదికి పైగా పండే వరి పంట రకాన్ని తీసుకొని దాని జీవకణాన్ని మరో మొక్కతో పరపరాగ సంపర్కం ద్వారా కొత్త హైబ్రిడ్‌ రకాన్ని కనుగొన్నారు. దీనికి 2020లో అమెరికా పేటెంట్‌ లభించగా.. 2023లో భారత్‌లో పేటెంట్‌ వచ్చింది. తాజాగా బుధవారం ఆయనకు పేటెంట్‌ను మంజూరు చేస్తూ ఫిలిప్పీన్స్‌ ప్రభుత్వం ధ్రువీకరణపత్రాన్ని పంపింది. 2036 జూన్‌ 5 వరకు దీని కాలపరిమితి ఉంటుందని వెల్లడించింది. ఈ సందర్భంగా తెలంగాణా వ్యవసాయ విశ్వవిద్యాలయ ఉపకులపతి అల్దాస్‌ జానయ్య, ఇతర ఉన్నతాధికారులు, శాస్త్రవేత్తలు ఆయనను అభినందించారు.

Read More

వ్యవసాయ రంగ అభివృద్ధిలో నాబార్డ్‌ కీలక పాత్ర పోషించింది : మంత్రి తుమ్మల

నాబార్డ్‌’ వ్యవసాయ రంగ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించిందని, గ్రామీణ అభివృద్ధికి నాబార్డ్‌ చేసిన సేవలను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రశంసించారు. నేషనల్‌ బ్యాంక్‌ ఫర్‌ అగ్రికల్చర్‌ అండ్‌ రూరల్‌ డెవలప్‌మెంట్‌ (నాబార్డ్‌) 44వ వార్షిక స్థాపన దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి తుమ్మల మాట్లాడుతూ…. రాష్ట్రవ్యాప్తంగా సాగునీటి ప్రాజెక్టులు, వ్యవసాయ మౌలిక సదుపాయాలు, రైతులకు రుణాల రూపంలో అందిస్తున్న సహాయంపై సంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం, నాబార్డ్‌ సంయుక్తంగా పనిచేసి మరిన్ని గ్రామీణ అభివృద్ధి పథకాల అమలుకు కృషి చేద్దామని మంత్రి కోరారు.

Read More

సహకార రంగంలో నూతన ఒరవడికి శ్రీకారం: మంత్రి తుమ్మల

  • దేశంలోనే ఎక్కడాలేని విధంగా ప్రాథమిక సహకార సంఘాలను రైతు ఉత్పత్తిదారుల సంఘాలుగా మార్చడానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం
  • ప్రాథమిక సహకార సంఘాలు ‘ఒన్‌ స్టాప్‌ సెంటర్‌’గా మారాలి
  • ఎఫ్‌.పి.ఓ.లుగా ఎంపికైన ప్రాథమిక సహకార సంఘాలన్ని బిజినెస్‌ మోడల్స్‌తో సిద్ధం కావాలి
  • ఎన్‌.సి.డి.సి. సహకారంతో రాష్ట్రంలో 311 ప్రాథమిక సంఘాలు ఎఫ్‌.పి.ఓ.లుగా మార్పు : మంత్రి తుమ్మల

ప్రస్తుత అవసరాలకు తగ్గట్టు మరియు వ్యవసాయరంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా సహకార పరపతి సంఘాలు తమ దృక్పథం మార్చుకోవాలని, కేవలం ఒకటి లేదా రెండు సేవలకు పరిమితం కాకుండా, రైతులకు సంబంధించి అన్ని సేవల రూపకల్పనలో పాలుపంచుకొన్నట్లయితేనే ఆర్థిక పరిపుష్టి సాధించడంతో పాటు రైతులకు కూడా ప్రయోజనకారిగా ఉండగలమన్నారు తెలంగాణ రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ప్రొ. జయశంకర్‌ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయ ఆడిటోరియంలో నేడు ఎన్‌.సి.డి.సి. మరియు కోఆపరేటివ్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో 311 ఎఫ్‌.పి.ఓ.లతో నిర్వహించిన సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్రంలో ఉండి సహకార రంగంలో దేశవ్యాప్తంగా రోల్‌ మోడల్‌గా గెలిచిన ముల్కనూరు సహకార పరపతి సంఘ విజయాల్ని ప్రస్తావిస్తూ.. సహకార సంఘ బాధ్యతలు నీతిగా, నిజాయితీగా చేస్తు, సంఘ అభివృద్ధికి పాటుపాడితే ముల్కనూరు లాంటి సహకార సంస్థలు మరిన్ని మన తెలంగాణ రాష్ట్రంలో ఉద్భవించే అవకాశాలు ఉంటాయని చెప్పారు. భారత ప్రభుత్వం ద్వారా 10,000 రైతు ఉత్పత్తి సంఘాల ఏర్పాటుకు ప్రోత్సాహం అందిస్తున్న సందర్భములో, ఇప్పటికే ఉన్న ప్రాథమిక సహకార పరపతి సంఘాలను ‘రైతు ఉత్పత్తి సంఘలుగా’ మార్చి, వారికి మరింత ఆర్థికతోడ్పాటు అందించే ఆలోచన రాష్ట్ర ప్రభుత్వం చేసిందని, తదనుగుణంగా ‘నేషనల్‌ కో ఆపరేటివ్‌ డెవలప్‌ మెంట్‌ కార్పొరేషన్‌ సహకారంతో, నిర్లిప్తంగా ఉన్న తెలంగాణ కో-ఆపరేటివ్‌ యూనియన్‌ను క్లస్టర్‌ బేస్‌డ్‌ బిజినెస్‌ ఆర్గనైజేషన్‌గా నియమించి దాని ద్వారా రాష్ట్రంలో 311 సహకార పరపతి సంఘాలను ఎఫ్‌.పి.ఓ.లుగా ఎన్నిక చేయడం జరిగిందని, వీటికి ఒక్కొకదానికి 15 లక్షల ఈక్విటీ గ్రాంటు మరియు 18 లక్షల మేనేజ్‌ మెంట్‌ ఖర్చు (మొత్తం 33 లక్షలు) అనగా 311 ఎఫ్‌.పి.ఓ.లకు సుమారు 167.93 కోట్లు (సిబిబిఓ ఇచ్చే రూ 21 లక్షలు / ఎఫ్‌.పి.ఓ.తో కల్పి) మంజూరు చేయగా ఈ రోజు మొదటి విడతాగా 9 కోట్లు 85 లక్షల 40 వేల రూపాయలు (ప్రతి పి.ఎ.సి.ఎస్‌.కు 3,16,849 రూ) విడుదల చేయడం జరిగిందని తెలిపారు. అంతేకాక కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం క్రెడిట్‌ గ్యారంటీ స్కీమ్‌లో భాగంగా ప్రతి ఎఫ్‌.పి.ఓ.లకు 2 కోట్లు వరకు లోన్‌ గ్యారంటీ సౌకర్యం కూడా ఉందని, కావున ఈ రాష్ట్ర ప్రభుత్వం సహకార సంఘాలన్ని ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి అన్నిరకాల సహాయ సహకారాలు అందించడానికి సిద్దంగా ఉందని వాటిని సద్వినియోగం చేసుకొని ఎదిగే బాధ్యత ప్రతి ఒక్క సభ్యుడి మీద ఉందన్నారు. ఈ సందర్భముగా మెడ్చల్‌ జిల్లా మరియు కొన్ని జిల్లాలలో సహకార పరపతి సంఘాలు సాధించిన విజయాలు ఊటంకిస్తూ రంగారెడ్డి జిల్లా చుట్టుప్రక్కల ఉన్న ప్రాంతాలలో కూరగాయలు, పండ్ల సాగును ప్రోత్సహించాల్సిన బాధ్యత మనందరిదీ అని, ఆదేవిధంగా వ్యవసాయంలో ఎరువుల మరియు రసాయనాల వాడకాన్ని తగ్గించి, సేంద్రీయ వ్యవసాయం దిశగా రైతులను ప్రోత్సహించాల్సిన బాధ్యత ప్రతి సహకార సంఘం తీసుకోవల్సిందిగా సూచించారు.
రైతులకు కావాల్సిన అన్ని అవసరాలను, అనగా మట్టినమూనాలు, విత్తనాలు, యంత్ర పరికరాలు, ఎరువులు, నిల్వ ప్రాసెసింగ్‌, మార్కెటింగ్‌, డైరి, పౌల్ట్రీ ఇలా అన్నీ రంగాలలో వాటి సేవలను విస్తరించే విధంగా బిజినెస్‌ మోడల్‌ రూపకల్పన చేసుకోవాలని, అదే విధంగా సంఘ సమావేశాలలో ఆయరంగాల్లో నిష్ణాతుల సేవలను ఆహ్వానించి, వారి సలహాలు, సూచనలు పొంది సంఘ అభివృద్ధికి పాటుపడాలని కోరారు.
ఈ సందర్భముగా మంత్రితోపాటు ఎన్‌.సి.డి.సి. రీజనల్‌ డైరెక్టర్‌ శార్దూల్‌, తెలంగాణ కో ఆపరేటివ్‌ యూనియన్‌ ఛైర్మన్‌ మోహన రెడ్డి, టి.జి.సి.ఎ.బి. ఛైర్మన్‌ రవీందర్‌ రావుతో పాటు డి.సి.సి.బి.ల ఛైర్మన్‌లు, కోఆపరేటివ్‌ సిబ్బంది, రాష్ట్రం నలుమూలాల నుండి వచ్చిన 311 సొసైటీ ఛైర్మన్‌లు పాల్గొన్నారు.

Read More

జూలై 31వ తేదీకి బదులుగా ఆగస్టు 2వ తేదీన ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణా వ్యవసాయ విశ్వవిద్యాలయం 55వ స్నాతకోత్సవం

రిజిస్ట్రార్‌ డాక్టర్‌ జి.ఇ.సిహెచ్‌. విద్యాసాగర్‌

ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణా వ్యవసాయ విశ్వవిద్యాలయం 55వ స్నాతకోత్సవాన్ని జూలై 31వ తేదీ బదులుగా ఆగస్టు 2వ తేదీ (శనివారం) నిర్వహించనున్నట్లు రిజిస్ట్రార్‌ డాక్టర్‌ జి.ఇ.సిహెచ్‌. విద్యాసాగర్‌ తెలిపారు. రాజేంద్రనగర్‌లోని విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో ఈ స్నాతకోత్సవం జరగనుందని అయన వివరించారు.
స్నాతకోత్సవానికి దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు సూచనలు, అడ్మిట్‌ కార్డు, డ్రెస్‌ కోడ్‌ తదితర వివరాలు త్వరలో విశ్వ విద్యాలయ వెబ్‌సైట్‌ www.pjtau.edu.in లో అందుబాటులో ఉంచనున్నట్లు విద్యాసాగర్‌ పేర్కొన్నారు.

Read More

రైతునేస్తం వ్యవసాయ కుటుంబ మాసపత్రిక2025 రైతునేస్తం పురస్కారాల దరఖాస్తులకు ఆహ్వానం

‘రైతునేస్తం’ 21వ వార్షికోత్సవ సందర్భంగా సుప్రసిద్ధ వ్యవసాయ శాస్త్రవేత్త స్వర్గీయ ‘పద్మశ్రీ’ డా|| ఐ.వి. సుబ్బారావు పేరిట వ్యవసాయ, అనుబంధ రంగాలలో విశేష సేవలందిస్తున్న శాస్త్రవేత్తలు, అభ్యుదయ రైతులు, విస్తరణ అధికారులతోపాటు అగ్రి ఇన్నోవేషన్స్‌ను అవార్డులతో సెప్టెంబర్‌లో జరగబోయే వార్షికోత్సవ వేడుకలో ఘనంగా సత్కరించనుంది.
పురస్కారాలకు దరఖాస్తు చేసుకునే వ్యవసాయ, అనుబంధ రంగాల శాస్త్రవేత్తలు, విస్తరణ అధికారులు, అగ్రి ఇన్నోవేషన్స్‌, రైతులు ‘రైతునేస్తం’ వెబ్‌సైట్‌ https://rythunestham.in/awards నుండి అప్లికేషన్‌ ఫారాన్ని డౌన్‌లోడ్‌ చేసుకుని, దాన్ని పూరించి, దానికి వారి పరిశోధనా వ్యాసాలను, సాగు అనుభవాలను జతపరచి ఆగస్టు 31వ తేదీలోగా ‘ఎడిటర్‌, రైతునేస్తం, 6-2-959, దక్షిణ భారత హిందీ ప్రచార సభ కాంప్లెక్స్‌, ఖైరతాబాద్‌, హైదరాబాద్‌ – 500004. ఫోన్‌: 9676 79 77 77 (లేదా) ‘రైతునేస్తం’, డో.నెం. 8-198, పుల్లడిగుంట దగ్గర, కొర్నెపాడు పోస్టు, వట్టిచెరుకూరు మం||, గుంటూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్‌ – 522 017, ఫోన్‌: 97053 83666 చిరునామాలకు పంపగలరు లేదా editor@rythunestham.in కు ఇ-మెయిల్‌ చేయవచ్చు. రెండు తెలుగు రాష్ట్రాలవారు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులే. ఈ వార్షికోత్సవం సెప్టెంబర్‌లో ప్రముఖుల సమక్షంలో ఘనంగా నిర్వహించబడుతుంది.

Read More

ఆదర్శ రైతుల ఎంపిక త్వరలో: కోదండ రెడ్డి

తెలంగాణ రాష్ట్రంలో మళ్లీ ఆదర్శ రైతు వ్యవస్థను తెస్తున్నామని, వ్యవసాయాధికారులు ప్రతి గ్రామానికి ఒక ఆదర్శరైతును త్వరలో ఎంపిక చేయనున్నారని రైతుసంక్షేమ కమీషన్‌ చైర్మన్‌ కోదండరెడ్డి చెప్పారు. వారికి వేతనాలు ఉండవని, గ్రామాల్లో ప్రభుత్వ పథకాలు వారి ద్వారా అమలు జరుగుతాయన్నారు. బుధవారం హైదరాబాద్‌లోని కమిషన్‌ కార్యాలయంలో సభ్యులతో కలిసి మాట్లాడారు. ”ములుగు జిల్లాలో మొక్కజొన్న విత్తనోత్పత్తిలో జరిగిన మోసాలు తెలిసిన వెంటనే కమిషన్‌ విచారణ జరిపి 671 మంది గిరిజన రైతులకు నష్టపరిహారం కింద రూ.4 కోట్లు పంపిణీ చేయించింది. తెలంగాణలో ఏ రైతుకు కష్టం వచ్చినా రైతు కమిషన్‌ అందుబాటులో ఉంటుంది” అని కోదండ రెడ్డి చెప్పారు.

Read More

విశ్రాంత జీవితంలో వేద పఠనం, ప్రకృతి వ్యవసాయం: అమిత్‌ షా

తన విశ్రాంత జీవితంలో వేదాలు, ఉపనిషత్తులు చదవడంతోపాటు ప్రకృతి వ్యవసాయంపై దృష్టి పెడతానని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షా చెప్పారు. ‘ప్రకృతి వ్యవసాయం శరీరాన్ని వ్యాధులకు దూరంగా ఉంచడంతోపాటు వ్యవసాయ ఉత్పాదకతను పెంచుతుంది’ అని పేర్కొన్నారు. గుజరాత్‌, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌ రాష్ట్రాల సహకార సంఘాల మహిళలతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. సహకారశాఖ మంత్రిగా తన ప్రయాణం ఎంతో అద్భుతంగా ఉందని పేర్కొన్నారు. ‘హోంశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పుడు ముఖ్యమైన శాఖ ఇచ్చారని అందరూ అన్నారు. కానీ సహకార శాఖ మంత్రిగా బాధ్యతలు అప్పగించినప్పుడు.. హోంశాఖ కంటే పెద్ద శాఖ ఇచ్చారని నేను భావించా. ఎందుకంటే ఈ శాఖ దేశంలోని రైతులు, పేదలు, గ్రామాలు, పశు సంపద కోసం పని చేస్తుంది’ అని అమిత్‌ షా వివరించారు.

Read More