మన రైతులకు నీళ్ళిస్తే బంగారం పండిస్తారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. హంద్రీ నీవా ప్రాజెక్టు ప్రధాన కాలువ సామర్థ్యాన్ని 2,200 క్యూసెక్కుల నుంచి 3,850 క్యూసెక్కులకు పెంచడంతో రాయలసీమ రైతాంగానికి మేలు జరుగుతుందని వివరించారు. హంద్రీ నీవా ప్రధాన కాలువ విస్తరణ పనుల్ని శరవేగంగా పూర్తిచేశామని, ఇదే స్ఫూర్తితో త్వరలోనే ఫేజ్-2 పూర్తి చేద్దామని పిలుపునిచ్చారు. జలహారతి కార్యక్రమంలో భాగంగా గురువారం హంద్రీ నీవాకు నీరు విడుదల చేసిన చంద్రబాబు ఎక్స్ వేదికగా స్పందిస్తూ.. ”నాకు చాలా సంతోషంగా, సంతృప్తిగా ఉంది. రాయలసీమ ప్రాంతానికి నీళ్లిచ్చి రైతన్నలకు మంచి చేస్తే కలిగే సంతోషం ఎప్పుడూ ప్రత్యేకమే. నాలుగు ఉమ్మడి జిల్లాల్లో 33 లక్షల మందికి తాగు నీరు, 6 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే ప్రాజెక్టును పూర్తిచేస్తాం. ప్రతి ఎకరాకు నీరు అందించాలనే సంకల్పాన్ని అందరి దీవెనలతో నెరవేరుస్తాం. రైతన్నల సాగునీటి కష్టాలు తీర్చి వారి జీవన ప్రమాణాలు మెరుగుపరుస్తాం” అని వివరించారు.

18 Jul, 2025
