తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మరియు శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఈ రోజు వికారాబాద్ జిల్లా కోత్రేపల్లి గ్రామంలో నిర్వహించిన మేగా ఆయిల్ పామ్ మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొని ఆయిల్‌పామ్ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా వారు రైతులతో మాట్లాడుతూ ఆయిల్ పామ్ సాగు ప్రాధాన్యత, దీని ద్వారా లభించే ఆర్థిక లాభాలు, మరియు ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహక చర్యలను వివరించారు.
ఆర్గనైజర్ల వ్యవస్థను రద్దు చేసి, విత్తన కంపెనీలు నేరుగా పత్తి విత్తనోత్పత్తి రైతులతో ఒప్పందాలు చేసుకోవాలని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. పెండింగ్‌లో ఉన్న రూ.700 కోట్ల బకాయిలను నెల రోజుల్లో రైతులకు విడుదల చేయాలని, జాప్యం చేస్తే లైసెన్స్‌ల రద్దుకూ వెనకాడబోమని స్పష్టం చేశారు. జోగులాంబ గద్వాల జిల్లా పత్తి రైతులకు రావాల్సిన పెండింగ్ బిల్లుల సమస్యపై సోమవారం సచివాలయంలో పర్యాటక, ఆబ్కారీశాఖల మంత్రి జూపల్లి కృష్ణారావుతో కలిసి తుమ్మల సమీక్ష నిర్వహించారు. వ్యవసాయ సంచాలకుడు గోపి, విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ అన్వేష్ రెడ్డి, ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, విత్తన కంపెనీల ప్రతినిధులు, రైతు సంఘాల నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తుమ్మల మాట్లాడుతూ… ”50 వేల ఎకరాల్లో పత్తి విత్తనోత్పత్తితో దేశంలోనే గద్వాల జిల్లా ప్రథమ స్థానంలో ఉంది. పత్తి సాగు చేసినవారికి నిధులు వెను వెంటనే ఇవ్వకపోవడంతో రైతులు ఇబ్బంది పడుతున్నారు. విత్తన కంపెనీలు ఆర్గనైజర్లకు బాధ్యతలు అప్పగించి చేతులు దులిపేసుకొంటున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా రైతులతో నేరుగా ఒప్పందాలు చేసుకొని వెనువెంటనే బిల్లులు చెల్లించాలి” అని సూచించారు.
ఆగస్టు 2న పీఎం కిసాన్ 20వ విడత వాయిదా సొమ్ము రైతుల ఖాతాల్లో జమ కానుంది. వారణాసిలో జరిగే కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ దేశ వ్యాప్తంగా నిధులు విడుదల చేయనున్నారు. రాష్ట్రంలో 41.58 లక్షల రైతు కుటుంబాలకు రూ. 831.60 కోట్లు అందుతాయి. అదే రోజు అన్నదాతా సుఖీభవ సొమ్ము కూడా రైతుల ఖాతాల్లో జమ కానుంది. ఈ మేరకు ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ ఇచ్చారు. పీఎం కిసాన్ నుంచి రూ.2 వేలు, రాష్ట్ర ప్రభుత్వం అన్నదాతా సుఖీభవ కింద తొలివిడతగా రూ. 5 వేలు అందించనున్నాయి. రాష్ట్రంలో అన్నదాతా సుఖీభవ పథకానికి 46.64 లక్షల రైతు కుటుంబాలను అర్హులుగా గుర్తించారు. వీరిలో 46.20 లక్షల కుటుంబాల్లోని రైతులు ఈకేవైసీ పూర్తి చేయగా.. ఇంకా 40,346 మంది రైతులు ఈకేవైసీ చేయాల్సి ఉంది. కార్డుల జారీ ప్రక్రియ పూర్తయ్యాక కౌలు రైతులకు రెండో విడతలో.. మొదటి, రెండో విడత నిధులను కలిపి జమ చేస్తారు.
ఇటీవల హైదరాబాద్‌లోని జాతీయ వ్యవసాయ విస్తరణ నిర్వహణ సంస్థ (మెనేజ్)లో ‘అగ్రి యురేకా’ పేరిట నిర్వహించిన జాతీయ స్థాయి పోటీలకు దేశవ్యాప్తంగా 500 దరఖాస్తులు వచ్చాయి. అవన్నీ వ్యవసాయం, దాని అనుబంధ రంగాల్లో నెలకొన్న సమస్యలకు పరిష్కారాలపై… వినూత్న ఆలోచనలు, ఆవిష్కరణలు చూపాయి. వాటిలో అంకుర వ్యవస్థాపకుడైన సాయి విష్ణు, విద్యార్థినులు తివిక్ష, యుక్తిక చేసిన ఆవిష్కరణలు అత్యుత్తమమైనవిగా ఎంపికయ్యాయి. వారిని ప్రథమ, ద్వితీయ, తృతీయ విజేతలుగా ఎంపిక చేసి, .. మెనేజ్ డైరెక్టర్ జనరల్ సాగర్ హనుమాన్ సింగ్ బహుమతులను అందజేశారు
.*’హెడ్ బ్యాండ్’తో పశువుల ఆరోగ్య పరిరక్షణకు*
మా ఇంట్లో పశువులు నిత్యం అనారోగ్యంతో బాధపడేవి. చికిత్స ఆలస్యమై చనిపోయేవి. మనుషులకు ఆరోగ్య పరికరాలు అందుబాటులో ఉన్నట్లే. పశువుల కోసం ఏదైనా కనుక్కోవాలని ఆలోచించా. నా సహవిద్యార్థి శివతో కలిసి సౌరశక్తితో పనిచేసే తల పట్టి(హెడ్‌బ్యాండ్)ని తయారు చేశా. బ్యాటరీతో పనిచేసే దీనికి కృత్రిమ మేధను అనుసంధానించా. ఇది జంతువుల శరీర ఉష్ణోగ్రతలతోపాటు దవడ కదలికలను తెలియజేస్తుంది. సరిగా తినకున్నా, నెమరు వేయకున్నా మనకు తెలియజేస్తుంది. హెడ్‌బ్యాండ్‌పై గ్లో-ఇన్-ది-డార్క్ కోటింగ్ కారణంగా రాత్రిపూట కూడా పశువుల ఆరోగ్య స్థితిగతులను తెలుసుకోవచ్చు
పంటలకు కలుపు మొక్కలే ప్రధాన సమస్యగా మారాయి. వీటి కారణంగా దిగుబడులు సరిగా రావడం లేదు. కలుపు నివారణకు రసాయన పురుగు మందులు వాడితే నేల సాంద్రత దెబ్బతింటోంది. వీటిపై అధ్యయనం చేసి చెరకు పిప్పి(బగాస్) తో కలుపు నివారణ మందు ‘బయో హెర్బిసైడ్‌ను తయారు చేశాం. ఇది పర్యావరణ వ్యవస్థలకు ఎలాంటి హాని కలిగించకుండా కలుపు మొక్కలను మాత్రమే నిరోధిస్తుంది. ఈ మందు కలుపు సమస్యకు పరిష్కారం చూపడంతోపాటు రసాయనాల వాడకాన్ని భారీగా తగ్గిస్తుంది.- *ఎ. తివిక్ష*, వ్యవసాయ విద్యార్థిని, హైదరాబాద్*
ఉప్పునీటి నేలలలో పంటల సాగుకు జీవ ఎరువు*
మన దేశానికి 7,516 కి.మీ. పొడవైన సముద్ర తీరప్రాంతముంది. ఇంత భారీస్థాయిలో ఉన్న భూముల్లో పంటలు సాగవక వృథాగా వదిలేయాల్సి వస్తోంది. ఈ ఉప్పునీటి నేలల్లో సాంద్రత తక్కువగా ఉండడంతో రసాయన ఎరువులు వాడినా ప్రయోజనం ఉండదు. ఈ సమస్యపై ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల తీరంలో ప్రయోగాలు చేశాం. హాలోఫిలిక్ బ్యాక్టీరియా ద్వారా జీవ ఎరువును రూపొందించాం. ఇది నేల ఆరోగ్యాన్ని మెరుగు పరచడంతోపాటు మొక్కల వేర్లను అభివృద్ధి చేసి, పైరు ఎదుగుదలకు దోహదపడుతుంది. పర్యావరణ హితమైన ఈ ఎరువు వినియోగం ద్వారా మంచి దిగుబడి కూడా వస్తుంది. నా ప్రయత్నాన్ని మెనేజ్ గుర్తించడం సంతోషంగా ఉంది. మెట్ట ప్రాంతాల్లోనూ దీని వినియోగానికి ప్రయోగాలు చేస్తున్నా. – *కె. సాయి విష్ణు*, అంకుర వ్యవస్థాపకుడు, హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లో పండ్లు, కూరగాయలు, పూలు, సుగంధ ద్రవ్యాలను పండిస్తూ రైతులు అధిక ఆదాయం పొందుతున్నారు. 2024-25లో ఈ పంటల సాగులో అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాలు రూ.30 వేల కోట్ల స్థూల ఉత్పత్తి విలువ జోడింపు (జీవీఏ) సాధించి రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలిచాయి. ప్రకాశం జిల్లా మార్కాపురం, యర్రగొండ పాలెం లాంటి మండలాలూ జీవీఏ సాధనలో అగ్రభాగాన ఉండటం గమనార్హం. ఉద్యాన పంటల జీవీఏలో రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలిచిన జిల్లాలు, డివిజన్లు, మండలాల వివరాలను రాష్ట్ర ప్రభుత్వం రూపొందించింది. లింగాల మండలం అగ్రస్థానంలో… వైఎస్సార్ కడప జిల్లా లింగాల మండలం అత్యధికంగా రూ.2,130 కోట్ల జీవీఏ సాధించింది. బత్తాయి, అరటి, పుచ్చ, టమాటా పంటల సాగు ద్వారా అధిక ఆదాయం లభించినట్లు ఉద్యానశాఖ పేర్కొంది. తూర్పుగోదావరి జిల్లా కడియంలో అలంకరణ మొక్కలు, పండ్ల నర్సరీల ద్వారా గణనీయమైన ఆదాయం లభించింది. ఈ మండలం మొత్తం జీవీఏ రూ. 1,758 కోట్లుగా ఉంది. అగ్ర స్థానంలో ఉన్న జిల్లాలను పరిశీలిస్తే.. అనంతపురం జిల్లా పుట్లూరు, ఎల్లనూరు, ప్రకాశం జిల్లా యర్రగొండ పాలెం, ఎన్టీఆర్ జిల్లా మైలవరం, ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల, అనంతపురం జిల్లా నార్పల, అన్నమయ్య జిల్లా రైల్వేకోడూరు తర్వాత స్థానాల్లో నిలిచాయి. మొదటిస్థానం అనంతపురం.. తర్వాత పులివెందుల డివిజన్లలో… రాష్ట్రంలోనే అత్యధిక జీవీఏ సాధించిన డివిజన్గా అనంతపురం డివిజన్ నిలిచింది. అరటి, బత్తాయి పంటల ద్వారా అక్కడ రూ.9,876 కోట్ల జీవీఏ సాధించింది. రెండోస్థానంలో వైఎస్సార్ కడప జిల్లా పులివెందుల డివిజన్‌లో అరటి, బత్తాయి, టమాటా పంటల ద్వారా రూ.6,177 కోట్ల జీవీఏ లభించింది. మూడోస్థానంలో అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు డివిజన్లో మిరియాలు, పసుపు, కాఫీ ద్వారా రూ.5,674 కోట్లు వచ్చింది. అక్కడ మిరియాల పంట ద్వారా రూ.2,326 కోట్లు, పసుపు ద్వారా రూ.552 కోట్లు, కాఫీ ద్వారా రూ.534 కోట్ల జీవీఏ సమకూరింది. అనంతపురం జిల్లా కల్యాణదుర్గం రూ.5,264 కోట్లు, శ్రీసత్యసాయి జిల్లా పెనుగొండ రూ.4,433 కోట్లు, తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు రూ.4,175 కోట్లు, ప్రకాశం జిల్లా మార్కాపురం రూ.4,028 కోట్లు, అన్నమయ్య జిల్లా రాజ పేట రూ.4,003 కోట్లు, శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరం రూ.3,793 కోట్లు, తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం రూ.3,594 కోట్ల జీవీఏ సాధించాయి.
తక్షణం మరమ్మతులు చేయకపోతే జలాశయం భద్రతకే ముప్పు అని నివేదికలు అందడంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రాయలసీమలో లక్షల ఎకరాలకు ఆధారమైన గోరకల్లు జలాశయాన్ని బాగు చేసేలా నిధులు మంజూరుకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది. రూ.617 కోట్లు ఖర్చు చేసి నిర్మించిన ఈ డ్యాంను ముప్పు నుంచి బయటపడేసేందుకు తాజాగా రూ.53 కోట్లు మంజూరు చేయడం జరిగింది. జలవనరులశాఖ అధికారుల నుంచి మొత్తం రూ.122 కోట్లతో అవసరమైన పనులు చేసేందుకు ప్రతిపాదించారు. ఈ ఏడాది బడ్జెట్‌లో ఇందుకు నిధులు కేటాయించలేదు. డ్రిప్ కింద ప్రతిపాదనలు పెట్టినా ఆ పథకం చేపట్టేందుకు అనుమతి లభించలేదు. దీంతో అత్యవసర పరిస్థితుల దృష్ట్యా మంత్రిమండలి ముందు ప్రత్యేకంగా ప్రతిపాదన ఉంచి జలవనరులశాఖ నిధులు తెచ్చుకుంది.
తెలంగాణ రాష్ట్రంలో సాగవుతున్న పంటల వివరాలు అంచనా వేసేందుకు ప్రొ. జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం వారు ప్రతిపాదించిన ప్రాజెక్టుపై రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సచివాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో సాగవుతున్న పంటల విస్తీర్ణం అంచనా వేయటం ద్వారా రానున్న కాలంలో ప్రభుత్వ పథకాలను సమర్థవంతంగా అమలు చేయడానికి వీలుంటుంది కావున వ్యవసాయ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తల బృందం ముందస్తు అంచనా వేయటానికి అవసరమైన సాంకేతిక పరిజ్ఞానం మరియు ఇతర వసతులను ఉపయోగించి ఆగస్టు, సెప్టెంబర్ మాసాల వరకు రాష్ట్రంలో పంటల వారిగా సాగవుతున్న విస్తీర్ణాన్ని అంచనా వేయడానికి తగిన ప్రణాళికలు సిద్ధం చేయాలని, వాటి అమలుకు అవసరమైన నిధులు ప్రభుత్వం అందించడానికి సిద్ధంగా ఉందని తెలిపారు. అదేవిధంగా రానున్న కాలంలో ప్రభుత్వం అమలు చేయనున్న పంటల భీమా పథకానికి సమగ్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని వ్యవసాయ విశ్వవిద్యాలయం అందించాలని విశ్వవిద్యాలయ అధికారులను ఆదేశించారు. ఇంతకుముందు వివిధ సాంకేతిక సంస్థలతో జరిపిన సంప్రదింపులకు కొనసాగింపుగా జరిగిన ఈ సమావేశంలో యూనివర్సిటీ శాస్త్రవేత్తలు తాము ఇంతకుముందు Synthetic Aperture Data ఆధారంగా స్విట్జర్లాండ్ సంస్థ భాగస్వామ్యంతో కలిసి చేసిన ప్రయోగాలను మరియు ఆ సాంకేతికత ఆధారంగా వానాకాలంలో పంటల నమోదులో వివిధ రాష్ట్రాలలో సాధించిన ఖచ్చితత్వాన్ని మంత్రికి తెలియజేశారు.
అంతేకాకుండా వివిధ పంటలను ఆశించు చీడపీడల వివరాలను కూడా సెన్సార్ అమర్చడం ద్వారా ముందుగానే తెలుసుకునే వీలుందని, ఈ దిశగా యూనివర్సిటీ శాస్త్రవేత్తలు వివిధ పంటలలో ఈ పంటకాలం నుంచే ప్రయోగాలు చేపట్టాలని ఉపకులపతికి మంత్రిగారు సూచించారు. ప్రపంచవ్యాప్తంగా మనకు అందుతున్న వివరాలను బట్టి శాటిలైట్ టెక్నాలజీ ద్వారా లభించే సమాచారం కంటే కూడా సెన్సార్ల ద్వారా అందే సమాచారం ద్వారా చీడపీడల నివారణ సమర్థవంతంగా నిర్వహించవచ్చని యూనివర్సిటీ శాస్త్రవేత్తలు మంత్రికి తెలియజేశారు. ఈ సమావేశంలో ప్రొఫెసర్ ఆఫ్ ప్రాక్టీస్ డా. సమీరేండు మోహంతి మరియు శాస్త్రవేత్త డా. టి.ఎల్. నీలిమ, పరిశోధన సంచాలకులు డా. యం బలరాం, డిజిటల్ అగ్రికల్చర్ సెంటర్ డైరెక్టర్ డా. బి. బాలాజీ నాయక్ పాల్గొన్నారు.
రసాయన ఎరువుల బస్తాలు ఎన్ని ఎక్కువ వాడితే.. పంట దిగుబడి అంత ఎక్కువగా వస్తుందనే ఆలోచనే రైతులను పరిమితికి మించిన వాడకం దిశగా నడిపిస్తోంది. పెట్టుబడి వ్యయం పెరగడానికి ఇదీ ఒక కారణం. ఆంధ్రప్రదేశ్‌లో 2024-25 సంవత్సరంలో పంటల వారీగా చూస్తే ఎరువుల వాడకంలో మిరప అగ్రస్థానంలో ఉండగా మొక్కజొన్న రెండోస్థానంలో నిలిచింది. జొన్న, వేరు శనగ, పసుపు, పప్పుధాన్యాలు తదితర పంటలకూ యూరియాను కుమ్మరిస్తున్నారు. *మిరపలో ఎరువుల వాడకం అధికం* రాష్ట్రంలో రసాయన ఎరువులు అత్యధికంగా వాడే పంట మిరప.. వ్యవసాయశాఖ లెక్కల ప్రకారమే హెక్టారుకు 1,325 కిలోల వాడకం ఉంది. సిఫార్సు చేసిన మోతాదు కంటే యూరియా 78%, భాస్వరం 122% అధికంగా వాడుతున్నారు. వాస్తవంగా చూస్తే రైతులు ఇంతకు రెట్టింపుస్థాయిలోనే వాడుతున్నారు. ఫలితంగా మిరపకు ఎకరాకు రూ. 3 లక్షల పెట్టుబడి అవుతోంది. తీరా చూస్తే ధరలు దక్కడం లేదు. క్వింటాలుకు రూ.10 వేలు ఉన్నా గిట్టుబాటు కాని పరిస్థితి. లక్షల్లో నష్టపోతున్నారు. ఎరువుల వాడకం తగ్గించుకుంటే పెట్టుబడి కూడా తగ్గుతుందని ఆలోచించడం లేదు.*మొక్కజొన్న సాగులోనూ భారీగా…* ఎరువుల వినియోగం అధికంగా ఉండే రెండో పంట మొక్కజొన్న. హెక్టారుకు 565 కిలోలు వాడుతున్నట్లు వ్యవసాయశాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. వాస్తవ వినియోగం ఇంకా ఎక్కువే. రెండు మూడేళ్లుగా గిట్టుబాటు ధరలు లభిస్తుండటంతో అధిక శాతం రైతులు మొక్కజొన్న సాగుకు మొగ్గుచూపిస్తున్నారు. ఇతర పంటల సాగులో నష్టాలతో.. ప్రత్యామ్నాయ పంటగా మొక్కజొన్ననే ఎంచుకుంటున్నారు
.*జొన్న సాగుకు 417% అధికంగా యూరియా:* జొన్న సాగులో సిఫారసు చేసిన మోతాదుకు మించి 417% అధికంగా యూరియాను వినియోగిస్తున్నారు. వేరుశనగకు కూడా 303% అధికంగా వేస్తున్నారు. గడ్డి పెంపకానికి 283% అధికంగా వాడటం గమనార్హం.
*అపోహ మాత్రమే* భూసార పరీక్షలు చేయించుకుని.. అవసరం మేరకు రైతులు ఎరువులు వాడాలి. ఎక్కువ వేస్తే దిగుబడి పెరుగుతుందనేది కేవలం అపోహ మాత్రమే. నత్రజని ఎక్కువగా వాడితే చీడపీడలు పెరుగుతాయి. వాటి నివారణకు పురుగుమందులు ఎక్కువగా చల్లాలి. పంటల నాణ్యత దెబ్బతింటుంది. భూగర్భజలాలు కలుషితమవుతాయి. ఎరువుల్ని సిఫార్సు మేరకు మాత్రమే అందించాలి. లేదంటే మొక్కల్లో రోగనిరోధకత తగ్గుతుంది. కరవు పరిస్థితుల్లో నానో ఎరువులు పిచికారి చేస్తే మంచి ప్రయోజనం ఉంటుంది. అయితే నేల ద్వారా అందించడమూ ముఖ్యమే.- *వి. శైలజ,* ప్రధాన శాస్త్రవేత్త, సాయిల్ సైన్స్, ప్రాంతీయ పరిశోధనాస్థానం, లాం, గుంటూరు
గోదావరి బేసిన్‌లోని రిజర్వాయర్లలోకి నీటి ప్రవాహం ఆశాజనకంగా లేదు కాబట్టి శ్రీరామసాగర్ నుంచి ఎల్లంపల్లి వరకు దాదాపు అన్ని రిజర్వాయర్లలోనూ నాలుగోవంతు నీటి నిల్వలు మాత్రమే ఉన్నాయి. కృష్ణా పరీవాహకంలోని అన్ని రిజర్వాయర్లు జలకళను సంతరించుకున్నాయి.
మార్కెట్ అధికారుల నిర్లక్ష్యంపై కమిషన్ చైర్మన్ కోదండ రెడ్డి సీరియస్
సికింద్రాబాద్ బోయిన్‌పల్లి వ్యవసాయ మార్కెట్ నిర్వహాణపై రైతు కమిషన్ అసంతృప్తి వ్యక్తం చేసింది. మార్కెట్ అధికారులు కూడా అందుబాటులో లేకపోవడంపై కమిషన్ చైర్మన్ కొదండరెడ్డి ఆగ్రహాం వ్యక్తం చేశారు. ఈరోజు ఉదయం 6 గంటలకే రైతు కమిషన్ చైర్మన్‌తో పాటు సభ్యులు రాములు నాయక్, భవానీ రెడ్డి..మార్కెట్‌ను అకస్మిక తనిఖీ చేశారు. దాదాపు గంటన్నర పాటు అక్కడే ఉండి.. మార్కెట్ యార్డులో సమస్యలు, రైతులు పడుతున్న ఇబ్బందులు, అధికారుల నిర్లక్ష్యాన్ని గుర్తించారు. చాలా సేపు మార్కెట్ యార్డులో తిరిగి అక్కడికి వివిధ రాష్ట్రాల నుండి వచ్చే రైతులు, వ్యాపారస్తులు, హామాలీలతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.మార్కెట్ కార్యాలయంలోని రికార్డులను, అటెండెన్స్ రిజిస్టర్లను కమిషన్ బృందం పరిశీలించింది. గత మూడు, నాలుగు రోజులు మార్కెట్ సెక్రెటరీ అందుబాటులో లేకపోవడం, కింది స్థాయి సిబ్బంది కూడా సమయానికి రాకపోవడంపై కమిషన్ చైర్మన్ ఆగ్రహాం వ్యక్తం చేశారు. ఒకే ఒక డేటా ఎంట్రీ ఆపరేటర్ విధుల్లో ఉండడం చూసి.. కమిషన్ ఆశ్చర్యానికి లోనైంది. ఇంత పెద్ద మార్కెట్లో ఒకే ఒక అవుట్ సోర్సింగ్ సిబ్బంది అందుబాటులో ఉండడం ఏంటనీ ప్రశ్నించింది. ప్రతిరోజు బోయిన్‌పల్లి మార్కెట్ కు ఏఏ రాష్ట్రాల నుండి కూరగాయలు, ఇతర నిత్యావసర వస్తువులు వస్తాయో అడిగి తెలుసుకున్నారు. మార్కెట్లో కూరగాయల వ్యర్ధాలతో గ్యాస్ ఉత్పత్తి చేయడానికి గతంలో బయో గ్యాస్ ప్లాంట్‌ను ఏర్పాటు చేశారు. అయితే గత మూడు నెలల నుండి ప్లాంట్ నడవకపోవడంతో.. కూరగాయల వ్యర్ధాలను తరలించడానికి ప్రతినెల మార్కెట్ కమిటి నాలుగున్నర లక్షల రూపాయలను ఖర్చుచేస్తున్న విషయం కమిషన్ దృష్టికి వచ్చింది. మార్కెట్ యార్డులో కూరగాయల అమ్మకాలు, కొనుగోళ్ల వివరాలపై కమిషన్ ఆరా తీసింది. బోయినపల్లి మార్కెట్ కమిటీలో ఉద్యోగుల వివరాలు, ఆదాయ, వ్యయాలు, షాపుల వివరాలు అన్ని కమిషన్‌కు నివేదిక రూపంలో అందించాలని సూచించింది. మార్కెట్‌ను సందర్శించిన వారిలో కమిషన్ అధికారులు హారివెంకట ప్రసాద్, మహేష్ నాయక్ తదితరులు వున్నారు.