ఆర్గనైజర్ల వ్యవస్థను రద్దు చేసి, విత్తన కంపెనీలు నేరుగా పత్తి విత్తనోత్పత్తి రైతులతో ఒప్పందాలు చేసుకోవాలని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. పెండింగ్‌లో ఉన్న రూ.700 కోట్ల బకాయిలను నెల రోజుల్లో రైతులకు విడుదల చేయాలని, జాప్యం చేస్తే లైసెన్స్‌ల రద్దుకూ వెనకాడబోమని స్పష్టం చేశారు. జోగులాంబ గద్వాల జిల్లా పత్తి రైతులకు రావాల్సిన పెండింగ్ బిల్లుల సమస్యపై సోమవారం సచివాలయంలో పర్యాటక, ఆబ్కారీశాఖల మంత్రి జూపల్లి కృష్ణారావుతో కలిసి తుమ్మల సమీక్ష నిర్వహించారు. వ్యవసాయ సంచాలకుడు గోపి, విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ అన్వేష్ రెడ్డి, ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, విత్తన కంపెనీల ప్రతినిధులు, రైతు సంఘాల నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తుమ్మల మాట్లాడుతూ… ”50 వేల ఎకరాల్లో పత్తి విత్తనోత్పత్తితో దేశంలోనే గద్వాల జిల్లా ప్రథమ స్థానంలో ఉంది. పత్తి సాగు చేసినవారికి నిధులు వెను వెంటనే ఇవ్వకపోవడంతో రైతులు ఇబ్బంది పడుతున్నారు. విత్తన కంపెనీలు ఆర్గనైజర్లకు బాధ్యతలు అప్పగించి చేతులు దులిపేసుకొంటున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా రైతులతో నేరుగా ఒప్పందాలు చేసుకొని వెనువెంటనే బిల్లులు చెల్లించాలి” అని సూచించారు.

29 Jul, 2025
