నిజామాబాద్ జిల్లాలో రేపు కొత్త వ్యవసాయ కళాశాలకు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన

తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయ విద్యను మరింత విస్తరించి, రైతు సంక్షేమం-వ్యవసాయ అభివృద్ధికి బలమైన పునాది వేయాలనే లక్ష్యంతో నిజామాబాద్ జిల్లాలో కొత్త వ్యవసాయ కళాశాల నిర్మాణానికి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆమోదం తెలిపారని మంత్రి తుమ్మల పేర్కొన్నారు.

నిజామాబాద్ జిల్లాలోని సుద్దపల్లి మరియు నడపల్లి గ్రామాల పరిధిలో ఉన్న తెలంగాణ యూనివర్సిటీ క్యాంపస్‌లోని సర్వే నంబర్లు 265/1, 277 మరియు 334లో మొత్తం 120 ఎకరాల విస్తీర్ణంలో ఈ ఆధునిక వ్యవసాయ కళాశాల నిర్మించబడనుంది. వ్యవసాయ రంగంలో నూతన సాంకేతికతలు, పరిశోధన, శిక్షణ మరియు రైతు సేవలను ఒకేచోట అందించేందుకు ఈ కళాశాల రూపుదిద్దుకోనుంది. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ఏర్పడనున్న ఈ కళాశాల రాష్ట్ర వ్యవసాయ రంగానికి ఒక ముఖ్య మైలురాయిగా నిలవనుంది. విద్యార్థులకు ఆధునిక వ్యవసాయ విద్యను అందించడంతో పాటు రైతులకు ప్రత్యక్ష ప్రయోజనం చేకూరే విధంగా ప్రణాళికలు రూపొందించబడ్డాయని మంత్రి తుమ్మల తెలిపారు.

ఈ వ్యవసాయ కళాశాలలో ఏర్పాటు చేయనున్న ముఖ్య సౌకర్యాలు:

  • 5 ఎకరాలలో ఆధునిక అకడమిక్ బ్లాక్ మరియు పరిపాలన భవనాలు
  • 2 ఎకరాలలో అత్యాధునిక 10 ప్రయోగశాలలు
  • 2 ఎకరాలలో 1000 మంది విద్యార్థులకు వసతి కలిగిన హాస్టళ్లు
  • 1 ఎకరంలో లైబ్రరీ
  • 50 ఎకరాలలో విస్తృత పరిశోధన ఫార్మ్‌లు మరియు సీడ్ ఫార్మ్‌లు
  • 20 ఎకరాలలో విద్యార్థుల ప్రాక్టికల్ శిక్షణ కోసం ప్రత్యేక ఫార్మ్‌లు
  • 10 ఎకరాలలో మోడల్ ఫార్మ్ మరియు రైతు శిక్షణ బ్లాక్
  • 10 ఎకరాలలో సైన్స్ మ్యూజియం, బొటానికల్ గార్డెన్
  • 8 ఎకరాలలో స్పోర్ట్స్ కాంప్లెక్స్ మరియు ఇండోర్ స్టేడియం
  • 3 ఎకరాలలో ఆడిటోరియం, గ్యాలరీ మరియు సెమినార్ హాళ్లు
  • 3 ఎకరాలలో అధ్యాపకులు మరియు సిబ్బందికి నివాస వసతులు
  • 1 ఎకరంలో ఆరోగ్య కేంద్రం మరియు ఇతర మౌలిక సదుపాయాలు ఈ సదుపాయాలన్నీ పూర్తిస్థాయిలో ఏర్పాటవడంతో విద్యార్థులకు ప్రాక్టికల్ శిక్షణ, ఆధునిక పరిశోధన, రైతులకు ప్రత్యక్ష శిక్షణ మరియు నూతన సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి రానుందని మంత్రిగారు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కళాశాల ద్వారా ఉత్తర తెలంగాణ ప్రాంతంలోని విద్యార్థులకు ఉన్నత స్థాయి వ్యవసాయ విద్య అందుబాటులోకి రానుండగా, రైతులకు నూతన పంట విధానాలు, సాంకేతిక పరిజ్ఞానం, విత్తనాల అభివృద్ధి మరియు సాగు విధానాలపై శిక్షణలు అందించి వ్యవసాయ ఉత్పాదకత పెంపునకు దోహదం చేస్తుందని మంత్రి తుమ్మల తెలిపారు. రాష్ట్రంలో వ్యవసాయాన్ని ఆధునీకరించడం, యువతను వ్యవసాయ రంగంలో ఆకర్షించడం మరియు రైతుల ఆదాయాన్ని పెంచడం లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం ఈ కొత్త వ్యవసాయ కళాశాల నిర్మాణాన్ని చేపట్టిందని, ప్రతి ఉమ్మడి జిల్లాలో వ్యవసాయ కళాశాల ఉండేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని, ఈ నేపథ్యంలో గౌరవ ముఖ్యమంత్రి గారు రేపు నిజామాబాద్ జిల్లా పర్యటనలో భాగంగా ఈ ప్రతిష్ఠాత్మక వ్యవసాయ కళాశాలకు శంకుస్థాపన చేసి, రాష్ట్ర వ్యవసాయ అభివృద్ధికి మరో నూతన అధ్యాయానికి శ్రీకారం చుట్టనున్నారని మంత్రి తుమ్మల వెల్లడించారు. వ్యవసాయ రంగంలో విశేష అనుభవంతో ఆధునిక సాగు పద్ధతులతో మార్గదర్శి గా నిలిచిన మంత్రి తుమ్మల వ్యవసాయ విద్యకు మూడు దశాబ్దాల క్రితమే బాటలు వేశారు. అశ్వరావుపేటలో వ్యవసాయ కళాశాల స్థాపనకు రూపకల్పన చేసిన తుమ్మల నాటి అనుభవాలతో సీఎం రేవంత్ రెడ్డికి వ్యవసాయ విద్య విస్తరణ ప్రాధాన్యంపై ప్రతిపాదనలు చేయగా, వ్యవసాయ రంగానికి ఎంతో ప్రాధాన్యం ఇచ్చే రేవంత్ రెడ్డి గారు వ్యవసాయ కళాశాల స్థాపనకు సంతోషంగా ఆమోదం తెలిపారు. వ్యవసాయ కళాశాల స్థాపనలో మంత్రి తుమ్మల తనదైన ముద్ర వేస్తున్నారని వ్యవసాయ విశ్వ విద్యాలయం ప్రొఫెసర్లు, రైతు సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రేపు జరగనున్న వ్యవసాయ కళాశాల శంకుస్థాపన కార్యక్రమంలో రైతులు, వ్యవసాయ విద్యార్ధులు పెద్ద ఎత్తున పాల్గొనాలని మంత్రి తుమ్మల కోరారు.
Read More

విత్తన కంపెనీలు రైతులతో నేరుగా ఒప్పందాలు చేసుకోండి

ఆర్గనైజర్ల వ్యవస్థను రద్దు చేసి, విత్తన కంపెనీలు నేరుగా పత్తి విత్తనోత్పత్తి రైతులతో ఒప్పందాలు చేసుకోవాలని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. పెండింగ్‌లో ఉన్న రూ.700 కోట్ల బకాయిలను నెల రోజుల్లో రైతులకు విడుదల చేయాలని, జాప్యం చేస్తే లైసెన్స్‌ల రద్దుకూ వెనకాడబోమని స్పష్టం చేశారు. జోగులాంబ గద్వాల జిల్లా పత్తి రైతులకు రావాల్సిన పెండింగ్‌ బిల్లుల సమస్యపై సోమవారం సచివాలయంలో పర్యాటక, ఆబ్కారీశాఖల మంత్రి జూపల్లి కృష్ణారావుతో కలిసి తుమ్మల సమీక్ష నిర్వహించారు. వ్యవసాయ సంచాలకుడు గోపి, విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్‌ అన్వేష్‌ రెడ్డి, ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, విత్తన కంపెనీల ప్రతినిధులు, రైతు సంఘాల నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తుమ్మల మాట్లాడుతూ… ”50 వేల ఎకరాల్లో పత్తి విత్తనోత్పత్తితో దేశంలోనే గద్వాల జిల్లా ప్రథమ స్థానంలో ఉంది. పత్తి సాగు చేసినవారికి నిధులు వెను వెంటనే ఇవ్వకపోవడంతో రైతులు ఇబ్బంది పడుతున్నారు. విత్తన కంపెనీలు ఆర్గనైజర్లకు బాధ్యతలు అప్పగించి చేతులు దులిపేసుకొంటున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా రైతులతో నేరుగా ఒప్పందాలు చేసుకొని వెనువెంటనే బిల్లులు చెల్లించాలి” అని సూచించారు.

Read More

రూ.150కే పెయ్య దూడ

  • నేటి నుంచి రైతులకు అందుబాటులో వీర్యం
  • రాష్ట్ర వ్యాప్తంగా ఏడాదికి 10 లక్షల డోసులు

గేదెలకు పెయ్యదూడలు మాత్రమే పుట్టేందుకు వీలుగా రూపొందించిన లింగ నిర్ధారిత వీర్యం రూ.150కే అందజేయనున్నట్లు ఆంధ్రప్రదేశ్‌ పశుగణాభివృద్ధి సంస్థ సీఈఓ మర్రిపూడి శ్రీనివాసరావు వెల్లడించారు. ఆయన సోమవారం గుంటూరులోని తన కార్యాలయంలో మాట్లాడారు. ‘లింగ నిర్ధారిత వీర్యం విలువ బహిరంగ మార్కెట్‌లో ఎక్కువగా ఉంటుంది. ప్రస్తుతం అందుబాటులోకి తెస్తున్న వీర్యం ఒక్కో డోసు రూ.300 వరకు ఉండగా, రైతులకు రూ.150 సబ్సిడీతో ప్రభుత్వం సరఫరా చేస్తుంది. మంత్రి అచ్చెన్నాయుడు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవటం వల్ల అతి తక్కువ ధరకే రైతులకు అందుబాటులోకి తీసుకువచ్చే అవకాశం దక్కింది. గతంలో ఇదే లింగ నిర్ధారిత వీర్యం కోసం రైతులు రూ.550 చెల్లించాల్సి వచ్చేది. పశు యజమానులపై భారం తగ్గించేందుకు నేషనల్‌ డెయిరీ డెవలప్‌మెంట్‌ బోర్డుతో సంప్రదింపులు జరిపి తక్కువ ధరకు రైతులకు పంపిణీ చేసేలా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా 10 లక్షల డోసులు (ఒక్కో గేదెకు రెండు డోసులు) లింగ నిర్ధారిత వీర్యం గేదెలకు వేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఈ వీర్యం వేయటం వల్ల గర్భం దాల్చే ఐదు లక్షల గేదెల్లో కనీసం 90 శాతం పెయ్యదూడలు పుట్టే అవకాశం ఉంటుంది. ఈ కార్యక్రమం చేపట్టటం వలన నేరుగా 20 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరుతుంది. 2030 నాటికి పశు గణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో 30 లక్షల డోసులు లింగ నిర్ధారిత వీర్యం వేయటం ద్వారా ఆంధ్రప్రదేశ్‌ను ముర్రా గేదెలు, సంకర జాతి ఆవుల హబ్‌గా తీర్చి దిద్దాలన్న లక్ష్యాన్ని చేరుకోగలుగుతాం. దానివల్ల రానున్న ఐదు సంవత్సరాల్లో పశువుల్లో స్త్రీ సంపద పెరిగి పాల ఉత్పత్తి గణనీయంగా పెరుగుతుంది. లింగ నిర్ధారిత వీర్యం అతి తక్కువ ధరకే అందజేసే కార్యక్రమాన్ని మంగళవారం నుంచి ప్రారంభిస్తున్నాం. పునరుత్పత్తి అవకాశం ఎక్కువగా ఉన్న గేదెలను ఎంపిక చేసి వీర్యం డోసులు ఇస్తాం. ఈ అవకాశం వినియోగించుకోవాలి’ అని కోరారు.

Read More