శాస్త్రీయ పద్ధతుల ద్వారా పశువుల ఎంపిక
రైతు సోదరులు, పశుపోషణలో సరైన జంతువులను ఎంపిక చేసుకోవడం అనేది లాభనష్టాలను శాసించే అత్యంత ముఖ్యమైన నిర్ణయం. నాణ్యమైన, ఆరోగ్యకరమైన పశువులను శాస్త్రీయ పద్ధతుల ద్వారా ఎంపిక చేసుకోవాలి.
- పాడి పశువుల ఎంపిక (ఆవులు మరియు గేదెలు)
పాడి పరిశ్రమలో అధిక పాల దిగుబడి మరియు నిరంతర ఆదాయం కోసం ఆవులు, గేదెలను ఎంచుకునేటప్పుడు ఈ క్రింది శారీరక, ఉత్పాదక లక్షణాలను గమనించాలి:
ఆ. శారీరక నిర్మాణం (Body Conformation)
• త్రిభుజాకార శరీరం (Wedge Shape): మంచి పాడి పశువు వెనుక భాగం వెడల్పుగా, ముందు భాగం (తల మరియు మెడ) సన్నగా ఉండి, పక్క నుండి చూస్తే త్రిభుజాకారంలా కనిపించాలి. ఇది పాలు ఇచ్చే సామర్థ్యానికి ప్రతీక.
• చర్మం మరియు కళ్లు: చర్మం పల్చగా, మెరుస్తూ, పట్టుకుంటే వదిలేసేలా వదులుగా ఉండాలి. కళ్లు చురుగ్గా, స్పష్టంగా ఉండాలి.
• వెన్నెముక మరియు కాళ్లు: వెన్నెముక నిటారుగా ఉండాలి. కాళ్లు బలంగా, నిలబడే పద్ధతి సరిగ్గా ఉండి, గిట్టలు ఎలాంటి పగుళ్లు లేకుండా ఆరోగ్యంగా ఉండాలి.
బి. పొదుగు మరియు చనుమొనల లక్షణాలు (Udder and Teats)
• పొదుగు పరిమాణం: పొదుగు పెద్దదిగా, వెనుక కాళ్ల మధ్య భాగంలో బాగా అమర్చబడి ఉండాలి. పాలు పితికిన తర్వాత పొదుగు పూర్తిగా ముడుచుకుపోవాలి (ఇది పొదుగులో కొవ్వు తక్కువగా, పాల గ్రంథులు ఎక్కువగా ఉన్నాయని సూచిస్తుంది).
• పాల నరాలు (Milk Veins): పొదుగు ముందరి భాగం నుండి పొట్ట కింది వరకు సాగే పాల నరాలు లావుగా, వంకరలు తిరిగి స్పష్టంగా కనిపించాలి.
• చనుమొనలు: నాలుగు చనుమొనలు సమానమైన పొడవు, లావు కలిగి, ఒకదానికొకటి సమాన దూరంలో చతురస్రాకారంలో అమరి ఉండాలి. పొదుగు గట్టిగా ఉండకూడదు (పొదుగు వాపు వ్యాధి లక్షణాలు లేవని నిర్ధారించుకోవాలి).
సి. వయస్సు మరియు ఈత (Age and Lactation)
• ఈత: మొదటి లేదా రెండవ ఈతలో ఉన్న పశువులను ఎంచుకోవడం ఉత్తమం. ఇవి ఎక్కువ కాలం పాలు ఇస్తాయి.
• వయస్సు నిర్ధారణ: పశువు నోటిలోని పళ్లను చూసి వయస్సును శాస్త్రీయంగా అంచనా వేయవచ్చు. 4 నుండి 6 శాశ్వత పళ్లు (దాదాపు 3 నుండి 5 సంవత్సరాల వయస్సు) ఉన్న పశువులు కొనుగోలుకు అనువైనవి.
డి. ఇతర ముఖ్యాంశాలు
• వీలైతే పశువును కొనేముందు వరుసగా మూడు పూటల పాలు పితికి చూసి, సగటు పాల దిగుబడిని లెక్కించాలి.
• తెలంగాణ వాతావరణానికి గేదెలలో ముర్రా (Murrah) లేదా స్థానిక గ్రేడెడ్ ముర్రా, ఆవులలో జెర్సీ క్రాస్ (Jersey Cross), హెచ్.ఎఫ్ క్రాస్ (HF Cross) లేదా దేశవాళీ జాతులైన గిర్ (Gir), సాహివాల్ (Sahiwal) అనుకూలమైనవి.
- గొర్రెలు మరియు మేకల ఎంపిక (Sheep and Goat Selection)
మాంసం ఉత్పత్తి మరియు పిల్లల ద్వారా లాభాలు పొందడానికి జీవాల ఎంపికలో చాలా జాగ్రత్తలు అవసరం.
ఆ. పోతు జీవాల ఎంపిక (Breeding Rams / Bucks)
మంద అభివృద్ధి అంతా పోతు జీవం పైనే ఆధారపడి ఉంటుంది. కాబట్టి దీని ఎంపిక అత్యంత కీలకం.
• లక్షణాలు: పోతు జీవం చురుగ్గా, పొడవుగా, ఎత్తైన శరీరంతో, వెడల్పాటి ఛాతి కలిగి ఉండాలి.
• ప్రజనన అవయవాలు: రెండు వృషణాలు (Testicles) సమాన పరిమాణంలో, బాగా అభివృద్ధి చెంది, కిందికి వేలాడుతూ ఉండాలి. వృషణాలలో ఎలాంటి వాపులు లేదా గడ్డలు ఉండకూడదు.
• వయస్సు: 1 నుండి 1.5 సంవత్సరాల వయస్సు (రెండు పళ్ల ప్రాయం) ఉన్న పోతులను మాత్రమే ప్రజననం (దాటించడం) కోసం వాడాలి.
బి. ఆడ జీవాల ఎంపిక (Ewes / Does)
• శరీర రూపురేఖలు: ఆడ జీవాల వెనుక భాగం వెడల్పుగా ఉండాలి, ఇది సులభంగా ఈనడానికి తోడ్పడుతుంది. నోరు, దవడలు సరిగ్గా అమరి ఉండి మేతను సులభంగా నమలగలగాలి.
• సంతానోత్పత్తి చరిత్ర: త్వరగా ఎదకు వచ్చేవి, తక్కువ వ్యవధిలో ఈనేవి మరియు ఒకే ఈతలో రెండు పిల్లలను (ముఖ్యంగా మేకలలో) కనే హిస్టరీ ఉన్న తల్లుల నుండి వచ్చిన పిల్లలను ఎంచుకోవాలి.
• పొదుగు ఆరోగ్యం: పొదుగును తాకి చూసినప్పుడు మెత్తగా ఉండాలి. చనుమొనలు మూసుకుపోయి ఉండకూడదు.
సి. వయస్సు మరియు జాతులు
• వయస్సు: 1 నుండి 2 సంవత్సరాల వయస్సు ఉన్న ఆడ జీవాలు మొదటి ఈతకు సిద్ధంగా ఉంటాయి.
• తెలంగాణకు అనువైన జాతులు:
o గొర్రెలు: నెల్లూరు (జోడిపి, బ్రౌన్), నల్లగొండ స్థానిక జాతులు.
o మేకలు: మహబూబ్‌నగర్ లోకల్, ఉస్మానాబాదీ, తలచ్చేరి/బీటల్ క్రాస్ జాతులు.
- పెరటి కోళ్ల ఎంపిక (Backyard Poultry Selection)
తక్కువ పెట్టుబడితో ఇళ్ల వద్ద, పెరట్లో కోళ్ల పెంపకం ద్వారా అదనపు ఆదాయం మరియు పోషకాహారం పొందవచ్చు.
ఆ. పిల్లల (Chicks) మరియు పెరిగే కోళ్ల ఎంపిక
• చురుకుదనం: కోడిపిల్లలు చురుగ్గా కదులుతూ, శబ్దాలకు త్వరగా స్పందిస్తూ ఉండాలి. కళ్లు ప్రకాశవంతంగా, గుండ్రంగా ఉండాలి.
• శరీర నాణ్యత: పొట్ట భాగం మెత్తగా ఉండాలి (సరిగ్గా కరగని సొన వల్ల పొట్ట గట్టిగా ఉండకూడదు). ఈకలు పొడిగా, శుభ్రంగా ఉండాలి. కాళ్లు బలంగా, నిటారుగా ఉండి ఎలాంటి వైకల్యాలు ఉండకూడదు.
• నాభి (Navel): పిల్లల నాభి భాగం పూర్తిగా ఎండిపోయి, మూసుకుపోయి ఉండాలి. తడి నాభి ఉంటే ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉంది.
బి. గుడ్లు పెట్టే కోళ్ల ఎంపిక (Layers)
• కలగిరి (Comb) మరియు గడ్డం (Wattles): గుడ్లు పెట్టే కోడి యొక్క కలగిరి/శిఖ పెద్దదిగా, ఎర్రగా, వెచ్చగా మరియు మెరుస్తూ ఉంటుంది. గుడ్లు పెట్టని కోళ్లలో ఇది చిన్నదిగా, తెల్లగా మారుతుంది.
• శరీర సామర్థ్యం (Pelvic Bones): కోడి వెనుక భాగంలోని తుంటి ఎముకల (Pelvic bones) మధ్య కనీసం 2 నుండి 3 వేళ్ల వెడల్పు స్థలం ఉండాలి. అలాగే తుంటి ఎముకకు, రొమ్ము ఎముక చివరి భాగానికి (Keel bone) మధ్య 3 నుండి 4 వేళ్ల ఖాళీ ఉంటే అది ఎక్కువ గుడ్లు పెట్టే మంచి కోడి అని అర్థం.
• గుభ్రం (Vent): గుడ్లు పెట్టే కోడి యొక్క గుభ్రం (మల విసర్జన ద్వారం) వెడల్పుగా, తేమగా మరియు గుండ్రంగా ఉంటుంది.
సి. మాంసం కోళ్ల ఎంపిక (Broilers/Cockerels)
• తక్కువ కాలంలో ఎక్కువ బరువు పెరిగే సామర్థ్యం, వెడల్పాటి రొమ్ము భాగం మరియు బలమైన తొడలు ఉన్న కోళ్లను మాంసం కోసం ఎంచుకోవాలి.
డి. తెలంగాణకు అనువైన పెరటి కోళ్ల రకాలు
• రాజశ్రీ (Rajasri), వనరాజ (Vanaraja), గ్రామప్రియ (Gramapriya) మరియు స్థానిక నాటు కోళ్లు పెరటి పెంపకానికి, తెలంగాణ వాతావరణానికి ఎంతో అనుకూలమైనవి. ఇవి వ్యాధి నిరోధక శక్తిని కలిగి ఉండి, తక్కువ మేత ఖర్చుతో ఎక్కువ గుడ్లు మరియు మాంసాన్ని ఇస్తాయి.
రైతులకు సాధారణ ఆరోగ్య సూత్రాలు (Health Check-list)
ఏ జంతువు లేదా పక్షిని కొనుగోలు చేసినా ఈ క్రింది ఉమ్మడి ఆరోగ్య లక్షణాలను తప్పక గమనించాలి:
- ఆకలి మరియు నెమరు: జంతువు మేతను బాగా తింటూ, చురుగ్గా నెమరు వేస్తూ ఉండాలి.
- మలమూత్ర విసర్జన: పేడ లేదా విసర్జితాలు సాధారణ రంగు, గట్టిదనం కలిగి ఉండాలి (సారగా/డయేరియా ఉండకూడదు).
- కళ్ల నుండి నీరు: కళ్లు, ముక్కు మరియు నోటి నుండి ఎలాంటి అసాధారణ జిగట స్రావాలు కారకూడదు.
- టీకాల రికార్డు: కొనుగోలు చేసే ముందే సదరు పశువులకు/జీవాలకు సకాలంలో టీకాలు (FMD, PPR, గాలికుంటు, పిడుగు రోగం, కోళ్లలో ఆర్.డి.వి వంటివి) వేశారో లేదో కనుక్కోవాలి.
ఈ రకమైన శాస్త్రీయ పద్ధతులను పాటించి పశుసంపదను ఎంపిక చేసుకుంటే పశుపోషణలో నష్టాలు రాకుండా నివారించవచ్చు.
డా జె. సాయి కిరణ్ ( శాస్త్రవేత, ఎల్ పి ఎం), ఫోన్: 8121451017
కృషి విజ్ఞాన కేంద్రం, పీవీ నరసింహారావు తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీ, మామునూరు, వరంగల్
















