భూధార్‌ ద్వారా భూమికి సంబంధించిన అన్ని వివరాలు తెలుసుకోవచ్చు

ఒక వ్యక్తి ఆధార్‌ సంఖ్యతో వారి వయసు, చిరునామా, సిమ్‌కార్డులు, ఆదాయ వివరాలు తెలుసుకొనే తరహాలోనే భూమికి సంబంధించిన సర్వే, ఉప సర్వే నంబర్లు, విస్తీర్ణం, సరిహద్దులు, నేల రకం, ఎలా సంక్రమించింది, మ్యాప్‌, లింక్‌ డాక్యుమెంట్లు, బీమా, బ్యాంకు రుణాలు, మార్టిగేజ్‌ తదితర సమగ్ర సమాచారం తెలుసుకునేలా త్వరలోనే ‘భూధార్‌’ అమల్లోకి తీసుకురావాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి రెవెన్యూ శాఖను ఇటీవల ఆదేశించారు. భూధార్‌ అమలు లోకి వస్తే.. భూ ఆక్రమణలు, నకిలీ పత్రాల సృష్టికి అడ్డుకట్ట పడనుందని ప్రభుత్వం భావిస్తోంది. భూధార్‌ జారీకి ప్రతి భూమిని సర్వే చేయాల్సి ఉంటుంది. భూమి సరిహద్దులను అక్షాంశాలు, రేఖాంశాలతో గుర్తించి భూధార్‌ నమోదు చేస్తారు. సర్వే పూర్తికాక ముందు తాత్కాలిక, పూర్తయ్యాక శాశ్వత భూధార్‌ జారీ చేయనుంది. ప్రతి రిజిస్ట్రేషన్‌-మ్యుటేషన్‌కు సర్వేను తప్పనిసరి చేస్తూ భూభారతి చట్టంలో సెక్షన్లు ఏర్పాటు చేశారు. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా ప్రతి మండలానికి కనీసం 43 మంది చొప్పున లైసెన్స్‌డ్‌ సర్వేయర్లను ప్రభుత్వం నియమిస్తోంది. ప్రస్తుతం ఏడు వేల మంది శిక్షణ పూర్తి చేసుకున్నారు. ఇటీవల సర్వే నిర్వహించిన పైలట్‌ గ్రామాల్లో భూధార్‌ కార్డులను తొలుత జారీ చేసి, తరువాత రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తామని రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు.
తెలంగాణ రాష్ట్రంలో 70.50 లక్షల మంది రైతులకు 1.40 కోట్ల ఎకరాల సాగు భూములున్నాయి. భూ దస్త్రాలు యాజమాన్య హక్కుల చట్టం (ఆర్వోఆర్‌) కింద ప్రతి కమతానికి పట్టా పాసుపుస్తకం జారీ చేస్తుండగా.. అందులో పలు సర్వే నంబర్ల కింద ఉన్న భూమి వివరాలు తప్ప ఏమీ ఉండటం లేదు.
భూధార్‌లో ఒక రైతుకు చెందిన భూమి సమగ్ర వివరాలు అందుబాటులోకి రానున్నాయి. ఇందులో భాగంగా కమతాలన్నింటినీ కంప్యూటరీకరించడం, ప్రభుత్వం వద్ద భూమికి సంబంధించిన పథకాలన్నింటినీ జోడించే ప్రక్రియలను చేపట్టనున్నారు.
అనంతరం ఆర్వోఆర్‌ 2025 భూభారతి చట్టంలోని సెక్షన్‌ (రూల్‌ 9) ప్రకారం రాష్ట్రంలోని ప్రతి కమతానికి ఒక ప్రత్యేక గుర్తింపు సంఖ్యను జారీ చేయనున్నారు.
ఆన్‌లైన్‌లో ఈ సంఖ్యను నమోదు చేస్తే భూమి సమగ్ర వివరాలు ఇట్టే తెలుసుకునే అవకాశాలు ఉంటాయి. దీనికోసం రెవెన్యూశాఖ ఇప్పటికే కార్యాచరణ చేపట్టింది.
డిజిటల్‌ ఇండియా భూ దస్త్రాల ఆధునికీకరణ పథకంలో భాగంగా ప్రతి కమతానికి యూఎల్‌పిన్‌/భూ ఆధార్‌ / భూధార్‌ జారీ చేయాలని కేంద్రం సూచిస్తోంది. పలు రాష్ట్రాలు ఇప్పటికే తాత్కాలిక లేదా శాశ్వత భూధార్‌ కార్డుల జారీని ప్రారంభించాయి.

Read More

బి.ఎస్సీ అగ్రికల్చర్‌ డ్యూయల్‌ డిగ్రీ కోర్స్‌లో ప్రవేశాలకు 18న కౌన్సెలింగ్

ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం మరియు ఆస్ట్రేలియాకు చెందిన వెస్ట్రన్‌ సిడ్నీ యూనివర్సిటీలు సంయుక్తంగా అందిస్తున్న బి.ఎస్సి అగ్రికల్చర్‌ డ్యూయల్‌ డిగ్రీ కోర్స్‌లో ప్రవేశాల కోసం ఈ నెల 18వ తేదీన కౌన్సిలింగ్‌ నిర్వహిస్తున్నట్లు రిజిస్ట్రార్‌ డాక్టర్‌ జిఈసిహెచ్‌ విద్యాసాగర్‌ తెలిపారు. విశ్వవిద్యాలయం విడుదల చేసిన నోటిఫికేషన్‌కు అనుగుణంగా ఇదివరకే దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఈ కౌన్సిలింగ్‌కు హాజరు కావాలని ఆయన సూచించారు. వెస్ట్రన్‌ సిడ్నీ యూనివర్సిటీ మరియు ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలు అందిస్తున్న ఈ కోర్సులో ప్రవేశాలకు సంబంధించిన కౌన్సిలింగ్‌ రాజేంద్రనగర్‌లోని నీటి సాంకేతిక పరిజ్ఞాన కేంద్రం, ఆడిటోరియంలో 18వ తేదీ ఉదయం 10 గంటలకు నిర్వహిస్తున్నారు.

Read More

భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో ‘పశు పోషకులు అప్రమత్తంగా ఉండాలి’

ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో వరదలు వచ్చే అవకాశం ఉన్నందున పశుపోషకులంతా అప్రమత్తంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్‌ పశు సంవర్ధక శాఖ సంచాలకుడు డాక్టర్‌ టి. దామోదర్‌ నాయుడు తెలిపారు. ఈ మేరకు కొన్ని సూచనలు చేశారు. ‘పశువులు సహా ఇతర జీవాల షెడ్లను పొడిగా ఉంచి వాటి చుట్టూ బ్లీచింగ్‌ పౌడర్‌ వంటివి చల్లాలి. ఈ కాలంలో సంభవించే వ్యాధుల నుంచి వాటిని రక్షించుకుంటూ ప్రభుత్వం ఉచితంగా అందించే నట్టల నివారణ మందులు, వ్యాధి నిరోధక టీకాలను వేయించాలి. లేగదూడలకు వెచ్చని వాతావరణం కల్పించాలి. పశువులకు సురక్షిత నీటిని అందించాలి. తడిసిన దాణా పెట్టకూడదు. పశువులకు అనారోగ్య లక్షణాలు కనిపించినా లేదా చనిపోయినా సమీప పశువైద్యశాలలో తప్పకుండా తెలియజేయాలి’ అని దామోదర్‌ వివరించారు.

Read More

ఉచిత చేపపిల్లల పంపిణీకి అనుమతి

గత కొన్నేళ్లుగా తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతున్న ఉచిత చేపపిల్లల పంపిణీ పథకాన్ని ఈ ఏడాదీ అమలు చేసేందుకు అనుమతిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. 2025-26 సంవత్సరానికి 90 కోట్ల చేపపిల్లలను రూ. 122 కోట్లతో కొనుగోలు చేసి పంపిణీ చేయాలని ఆదేశించింది. నెలాఖరు వరకు టెండర్లు పిలిచి వచ్చేనెల 15 నాటికి వాటిని ఖరారు చేయాలని మత్స్యశాఖ ఉన్నతాధికారులు భావిస్తున్నారు.

Read More

పాడి రైతులకు అండగా పశువుల బీమా

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం పశుసంవర్ధక శాఖ ద్వారా అమలు చేస్తున్న పశువుల బీమా పథకం పాడి రైతులను ఆదుకుంటోంది. ఇటీవల అంతుపట్టని వ్యాధులు, విద్యుత్‌ఘాతాలు, చెరువులు, నదీ జలాల్లో పశువులు మునిగి చనిపోవడం వంటి ఘటనల వలన ఆసరాగా ఉంటున్న పాడి పశువు మృతితో పోషకులు జీవనోపాధి కోల్పోతున్నారు. మరో పాడి పశువు కొనుగోలుకు ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఆయా సమస్యలకు బీమా పథకంలో చేరడం ఒక్కటే పరిష్కార మార్గమని పశువైద్యాధికారి కె. మాధవ రావు సూచిస్తున్నారు.

  • 80 శాతం రాయితీపై గేదెలు, ఆవులకు పథకం అమలు చేస్తారు.
  • ఎస్సీ, ఎస్టీ, దారిద్య్రరేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు వర్తిస్తుంది.
  • ఒకసారి బీమా చెల్లిస్తే మూడేళ్లపాటు అమల్లో ఉంటుంది.
  • పశువుకు చెవి పోగు వేయించి బీమా నమోదు చేసుకోవాలి.
  • పూర్తి వివరాలకు రైతు సేవా కేంద్రం, సమీప పశు వైద్యశాలలో సంప్రదించాలి.
Read More

అగ్రి, హార్టీ, వెటర్నరీ కోర్సుల్లో ప్రవేశాలకు 19 నుంచి కౌన్సెలింగ్‌

తెలంగాణాలోని వ్యవసాయ, ఉద్యాన, పశువైద్య విశ్వవిద్యాలయాల పరిధిలోని కళాశాలల్లో బీఎస్సీ, బీవీఎస్సీ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు హైదరాబాద్‌ రాజేంద్రనగర్‌లోని అగ్రివర్సిటీ ఆడిటోరియంలో ఈ నెల 19 నుంచి కౌన్సెలింగ్‌ నిర్వహిస్తున్నట్లు అగ్రివర్సిటీ రిజిస్ట్రార్‌ వెల్లడించారు. తొలిరోజు ఉదయం పది గంటల నుంచి టీజీఈఏపీసెట్‌లో 1450 వరకు ర్యాంకులు సాధించినవారికి కౌన్సెలింగ్‌ నిర్వహిస్తామని, ఈ నెల 23 నాటికి 4499 వరకు ర్యాంకులు సాధించిన వారికి కౌన్సెలింగ్‌ జరుగుతుందని తెలిపారు.

Read More

వ్యవసాయ పరిశోధనలు రైతులకు ఉపయోగపడాలి

వ్యవసాయం వాటి అనుబంధరంగాల పరిశోధనలు రైతులకు ఉపయోగపడాలని జాతీయ వ్యవసాయ పరిశోధన నిర్వహణ సంస్థ (నార్మ్‌)లో సోమవారం వ్యవసాయ పరిశోధన సర్వీసు (ఏఆర్‌ఎస్‌) 115వ ఫౌండేషన్‌ కోర్సు ప్రారంభోత్సవంలో పాల్గొన్న కేంద్ర పరిపాలన ట్రైబ్యునల్‌ సభ్యుడు, ఐకార్‌ మాజీ కార్యదర్శి చబిలేంద్రరౌల్‌ అన్నారు. పోషకాహార భద్రత, వాతావరణ మార్పులను ఎదుర్కొనే విధానాలు, సహజ వనరుల పరిరక్షణ తదితర కోణాల్లో నూతన ఆవిష్కరణలకు వ్యవసాయ శాస్త్రవేత్తలు ప్రాధాన్యమివ్వాలని సూచించారు. ఐకార్‌ డిప్యూటీ డైరెక్టర్‌ జనరల్‌ జయకృష్ణజెనా, మిసైల్‌ సైంటిస్ట్‌ అరుణ్‌ తివారి, నార్మ్‌ డైరెక్టర్‌ గోపాల్‌లాల్‌ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 108 మంది ఏఆర్‌ఎస్‌ ప్రొబేషనర్లకు మూడు నెలల పాటు ఈ శిక్షణ కొనసాగుతుంది.

Read More

వరల్డ్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డుల కెక్కిన విత్తన బంతుల కార్యక్రమం

ఈ నెల 9న కేరళ రాజధాని తిరువనంతపురం మున్సిపల్‌ కార్పొరేషన్‌ చేపట్టిన విత్తన బంతుల ప్రాజెక్టు.. వరల్డ్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డుల కెక్కింది. విద్యార్థులతో కలిసి చేపట్టిన ఈ ప్రాజెక్టును లండన్‌ కేంద్రంగా పని చేసే సంస్థ గుర్తించిందని మేయర్‌ ఆర్య ఎస్‌ రాజేంద్రన్‌ సోమవారం వెల్లడించారు. ఇందులో 6 వేల మంది విద్యార్థులు పాల్గొని 3 గంటల్లో తిరువనంతపురంలోని పుథరీకందం మైదానంలో 4 లక్షల విత్తన బంతులను విసిరామని తెలిపారు.

Read More

పంటలలో తెగుళ్ల ఉధృతి నమోదు ఏవోలు చేయాలి





ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో పంటల్లో తెగుళ్ల ఉధృతి అధికంగా ఉన్న ప్రాంతాల్లో వ్యవసాయాధికారులు వారంలో ఒకరోజు పర్యటించి, తెగుళ్ళ వివరాలను యాప్‌లో నమోదు చేయాలని వ్యవసాయ శాఖ డైరెక్టర్‌ ఢిల్లీరావు సూచించారు. ఈ-పంట, డిజిటల్‌ అప్లికేషన్లపై వీడియో కాన్ఫరెన్స్‌లో సోమవారం ఆయన అధికారులతో సమీక్షించారు. ‘ఇప్పటి వరకు 4,41,167 ఎకరాల్లో 1,65,843 మంది రైతులకు సంబంధించి పంటలను ఈ- క్రాప్‌లో నమోదు చేశాం. బహువార్షిక ఉద్యాన పంటలను కూడా పరిగణనలోకి తీసుకోవాలి’ అని వెల్లడించారు. ఉద్యాన పంటల నమోదు సమయంలో పంటల రకాలను పేర్కొనాలని ఆ శాఖ డైరెక్టర్‌ శ్రీనివాసులు వివరించారు.

Read More

ఆగస్టు నెలలో ప్రారంభం కానున్న నర్మెట్ట ఆయిల్‌ పామ్‌ పరిశ్రమ

రూ.300 కోట్ల వ్యయంతో తెలంగాణలోని సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం నర్మెట్టలో నిర్మిస్తున్న ఆయిల్‌పామ్‌ పరిశ్రమను ఆగస్టు నెలాఖరుకు ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలో ప్రస్తుతం అశ్వారావుపేటలో మాత్రమే ఆయిల్‌పామ్‌ శుద్ధి పరిశ్రమ ఉంది. ఆ తర్వాత మరో 14 పరిశ్రమలు ఏర్పాటుకు మూడేళ్ల క్రితం ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఇందులో తెలంగాణ ఆయిల్‌ఫెడ్‌ ఆధ్వర్యంలో నర్మెట్టలో రెండేళ్ల క్రితం నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. 62 ఎకరాల్లో చేపట్టిన పనులు తుది థకు చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదివారం ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డిని ఆయన నివాసంలో కలిసి పరిశ్రమ ప్రారంభోత్సవానికి రావాలని ఆహ్వానించారు.

Read More