పంట పండించిన రైతులకే కొనుగోలు కేంద్రాల్లో ప్రవేశం

తెలంగాణలో పంట పండించిన రైతులు మాత్రమే తమ ఉత్పత్తులను మార్క్‌ఫెడ్‌, ఇతర ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో విక్రయించాలి. తప్పనిసరిగా వారు ఆధార్‌ కార్డు కలిగి ఉండాలి. ధ్రువీకరణ కోసం కొనుగోలు కేంద్రాల్లో ఇ పోస్‌ (ఎలక్ట్రానిక్‌ పాయింట్‌ ఆఫ్‌ సేల్‌) యంత్రాలతో ధ్రువీకరణ అనంతరమే రైతుల నుంచి పంట తీసుకుంటారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో పెసలు, కందులు, జొన్నలు, సోయా, పొద్దుతిరుగుడు వంటి పంటలకు సరైన ధరలు రానప్పుడు ప్రభుత్వం మార్కెఫెడ్‌ ద్వారా వాటిని మద్దతు ధరకు కొంటోంది. ఈ కేంద్రాలకు దళారుల బెడద ఎక్కువైంది. రైతుల వద్ద తక్కువ ధరకు పంట కొన్న వ్యాపారులు.. కొనుగోలు కేంద్రాలకు వచ్చి ఎక్కువ ధరకు విక్రయిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. వీరికి అడ్డుకట్ట వేసేందుకు అన్ని రాష్ట్రాల్లో ఆధార్‌ కార్డుల నమోదు ఆధారిత కొనుగోళ్ల విధానం చేపట్టాలని, దీనికోసం నోడల్‌ ఏజెన్సీని ఏర్పాటు చేయాలని ఆదేశిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు ఇటీవల లేఖ రాసింది. దీనికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం మార్క్‌ఫెడ్‌ను నోడల్‌ ఏజెన్సీగా నియమిస్తూ కొత్త విధానంపై ఉత్తర్వులు జారీ చేసింది.రాష్ట్రంలో ప్రతి కొనుగోలు కేంద్రంలో ఇపోస్‌ యంత్రం ఏర్పాటు చేసి వాటిలో రైతులందరి భూముల సర్వే నంబర్లు, పంటల సమాచారం (వ్యవసాయశాఖ పంట నమోదు) ద్వారా అనుసంధానం చేస్తారు. రైతులు తమ పంట ఉత్పత్తులతో ఆయా కేంద్రాలకు వచ్చినప్పుడు ముందుగా ఆధార్‌ కార్డుతో ఇపోస్‌ నమోదు చేసుకోవాలి. అందులో రైతు సాగు చేసిన పంట వివరాలను, తెచ్చిన పంట సరిచూసి.. తర్వాత కొనుగోళ్లకు అనుమతిస్తారు. ఇపోస్‌ యంత్రంలో రైతు భూమి, పంటల వివరాలున్నా.. ఆధార్‌ కార్డు లేకపోయినా, పేరు, ఇతర వివరాల్లో తప్పులున్నా.. జాయింట్‌ కలెక్టర్‌ వద్దకు వెళ్లి దరఖాస్తు చేసుకొని ఆ పత్రాన్ని తెచ్చి సమర్పిస్తే పంటను కొనుగోలు చేస్తారు. ప్రస్తుతం ధాన్యం, పత్తేతర కొనుగోలు కేంద్రాలకే పరిమితం చేశారు. త్వరలో పౌరసరఫరాల శాఖ, సీసీఐల ద్వారా జరిగే వరి, పత్తి కేంద్రాల్లోనూ అమలు చేయనున్నారు. ప్రభుత్వ ఉత్తర్వులకు అనుగుణంగా కొత్త విధానం అమలుకు మార్క్‌ఫెడ్‌ సిద్ధమైంది. తమ పరిధిలోని అన్ని కొనుగోలు కేంద్రాలు, సహకార సంఘాల్లో వెంటనే ఇపోస్‌ యంత్రాలను కొనుగోలు చేయాలని సంస్థ ఎండీ శ్రీనివాస్‌ రెడ్డి ఆదేశాలు జారీచేశారు. రాష్ట్రంలో త్వరలో పెసలు కొనుగోళ్లు ప్రారంభం కానున్నాయి. 58,728 ఎకరాల్లో పెసర పంట వేయగా.. 16,326 క్వింటాళ్ల దిగుబడిని అంచనా వేస్తున్నారు. దీంతో ఖమ్మం, సంగారెడ్డి, వికారాబాద్‌ తదితర జిల్లాల్లో కొనుగోలు కేంద్రాలను ప్రారంభించనున్నారు.

Read More

ఉల్లి కొనుగోలు విధానంలో మార్పులు

ఉల్లిని మార్క్‌ఫెడ్‌ ద్వారా క్వింటాలు రూ.1200 మద్దతు ధరతో కొనుగోలు చేయిస్తామని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రకటించడంతో అన్నదాతలు సంతోషించారు. కానీ వారి ఆనందం కాసేపట్లోనే ఆవిరైంది. కర్నూలు మార్కెట్‌ యార్డులో మూడు రోజులు మాత్రమే మార్క్‌ఫెడ్‌ ద్వారా ఉల్లి కొనుగోలు చేశారు. ప్రస్తుతం వ్యాపారులు, మార్క్‌ఫెడ్‌ కలిసి కొనుగోలు చేసేలా కొత్త విధానాన్ని తెరపైకి తేవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. శనివారం ప్రయోగాత్మకంగా అమలుచేయగా ఈ విధానం తొలిరోజే వికటించింది.

కొత్త విధానంతో ఇబ్బందులు
నూతన విధానంలో రైతుల నుంచి తొలుత వ్యాపారులు నిర్ణీత ధరకు ఉల్లిని కొనుగోలు చేస్తారు. మార్క్‌ ఫెడ్‌ ద్వారా క్వింటాలు రూ.1200కు కొనుగోలు చేయించాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో.. వ్యాపారులు అంతకంటే తక్కువ ధరకు కొంటే.. మిగతా మొత్తాన్ని ప్రభుత్వం రైతులకు చెల్లిస్తుంది.
కానీ వ్యాపారులు సరకును ఎప్పుడు కొనుగోలు చేస్తారు? అసలు కొంటారా లేదా? అన్న విషయంపై స్పష్టత లేక కర్షకులు ఆందోళన చెందుతున్నారు. కొందరి సరకును మాత్రమే కొనుగోలు చేస్తున్నారని మిగతా రైతులు వాపోతున్నారు. మొత్తం సరకును నేరుగా మార్క్‌ ఫెడ్‌ అధికారులే కొనుగోలు చేస్తే ఇబ్బంది ఉండదంటున్నారు. కొత్త విధానంతో తాము వ్యాపారుల దయా దాక్షిణ్యాలపై ఆధారపడాల్సిన పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

  • ఉల్లిని కొనుగోలు చేస్తున్న వ్యాపారులు ఆ సరకు మార్కెట్‌ నుంచి బయటకు వెళ్లే వరకు రైతులే కాపలా ఉండాలంటూ షరతు విధిస్తున్నారు. దీంతో దిగుబడులు విక్రయించిన తర్వాత కూడా వారు మార్కెట్‌లోనే ఉండాల్సి వస్తోంది.
  • శనివారం మార్కెట్‌ యార్డుకు సుమారు 1659 టన్నుల సరకు వచ్చింది. ఇందులో 776 టన్నులే కొన్నారు. గత నాలుగు రోజులుగా మార్క్‌ ఫెడ్‌ ద్వారా కొన్న సరకు, కొనుగోలు చేయనిది మొత్తం 27 వేల క్వింటాళ్లకు పైగా ప్రస్తుతం మార్కెట్‌ యార్డులోనే నిల్వ ఉంది.

నిలిచిన శీతల గిడ్డంగిని పూర్తిచేయాలని నిర్ణయం
కర్నూలు మార్కెట్‌ యార్డుకు వచ్చిన రైతులు నష్టపోకుండా ఉల్లిని శాస్త్రీయ విధానాల్లో నిల్వచేసేందుకు గతంలో ప్రభుత్వం కేంద్ర గ్రామీణాభివృద్ధి నిధులు (ఆర్డీఎఫ్‌) రూ.5 కోట్లతో భారీ శీతల గిడ్డంగి నిర్మాణం చేపట్టింది. సుమారు 50 శాతం పనులు పూర్తయ్యాయి. ఇది అందుబాటులోకి వస్తే 5 లక్షల టన్నుల ఉల్లిని నిల్వచేసుకునే అవకాశం ఉంటుంది. కానీ తర్వాత దాని నిర్మాణం నిలిచిపోయింది. ఆ పథకం సమయం ముగిసిపోవడంతో కేంద్రం నుంచి నిధులు రాని పరిస్థితి. ప్రస్తుత ప్రభుత్వం గిడ్డంగి నిర్మాణాన్ని పూర్తిచేయాలని నిర్ణయించింది.

Read More

నానో బయోటెక్నాలజీతో సేంద్రియ సాగులో ఎన్నో ప్రయోజనాలు

ఉద్యానపంటలు, కూరగాయలు, ఆకుకూరల్లో సేంద్రీయ వ్యవసాయ పద్ధతిలో నానో బయోటెక్నాలజీతో పోషక విలువలు పెంచవచ్చని, అధిక దిగుబడి సాధించవచ్చని హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయం, బయోఫాక్టర్‌ సంస్థలు ప్రయోగాలు చేస్తున్నాయి.
తెలుగు రాష్ట్రాలు, మహారాష్ట్రలోని కొన్ని జిల్లాల్లో సేంద్రీయ వ్యవసాయం చేస్తున్న రైతులకు నానో బయోటెక్నాలజీని ప్రయోగాత్మకంగా పరిచయం చేసి కూరగాయలు పండించారు. ఆయా కూరగాయల మొక్కలకు 40 శాతం పోషకాలు పెరగడంతోపాటు 15శాతం అధికంగా దిగుబడి వచ్చింది.
ఈ ప్రయోగ ఫలితాలను ధ్రువీకరించేందుకు ఇక్రిశాట్‌లోనిని వరల్డ్‌ వెజిటెబుల్‌ సెంటర్‌ ఆసియా శాఖకు తాజాగా హెచ్‌సీయూ, బయోఫాక్టర్‌ ప్రతినిధులు నమూనాలు పంపించారు. ధ్రువీకరణ లభించిన వెంటనే తెలుగు రాష్ట్రాల్లోని రైతులను సేంద్రీయ సాగు వైపు ప్రోత్సహించనున్నారు.
రసాయన ఎరువుల వినియోగాన్ని ఉద్యాన పంటల్లో 20-30 శాతం తగ్గించేందుకు హెచ్‌ సీయూ ఆచార్యులు డా. దివాకర్‌దాస్‌, బయోఫాక్టర్‌ శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు. సేంద్రీయ సాగులో ఫాలియర్‌ పిచికారీతో మొక్కలకు పోషకాలు అందుతాయి. పంటల ఉత్పత్తి పెరుగుతుంది. రసాయన ఎరువుల వినియోగం తగ్గడంతో కూరగాయలు రుచి పెరుగుతుంది.
నానో బయోటెక్నాలజీ పరిజ్ఞానంపై మూడేళ్లపాటు హెచ్‌సీయూ విద్యార్థులు, బయోఫాక్టర్‌ శాస్త్రవేత్తలు పరిశోధనలు చేయనున్నారు. భవిష్యత్తులో కోళ్ల పరిశ్రమ, మత్స్యసంపద పరిరక్షణపై పరిశోధనలు చేసే అవకాశాలున్నాయి.
నానో బయోటెక్నాలజీ ఆకుకూరలు, కాయగూరలపై ప్రయోగించడం ద్వారా ఉద్యానపంటలకు ప్రయోజనం. యూరియా, రసాయన ఎరువులు వినియోగించినప్పుడు వర్షాలు కురిస్తే మొక్కలకు అవి ఎక్కువగా అందవు. భూమిలోకి వెళ్తాయి. నానోటెక్నాలజీతో నేరుగా మొక్కల్లోకే పోషకాలు వెళ్తాయి. రైతులకు ఈ సాంకేతికతో రైతులకు ప్రయోజనకరం కలుగుతుందని డా.శ్రీనివాసరెడ్డి, సీనియర్‌ శాస్త్రవేత్త, ఇక్రిశాట్‌ అన్నారు.
ఉద్యాన పంటల్లో విచక్షణారహితంగా రసాయన ఎరువులు, పిచికారీ మందులను వినియోగిస్తున్నందువలన రసాయన అవశేషాలు మన శరీరంలోకి వెళ్తున్నాయి. రైతులను సేంద్రీయ వ్యవసాయం వైపు మళ్లించాలి. ఇందుకు నానో బయోటెక్నాలజీ అవసరం. తద్వారా భూసారం పెరుగుతుంది. ప్రస్తుతం పొలాల్లో ఎక్కడా కనిపించని వానపాములు ఉనికి పెరుగుతుందని డాక్టర్‌ లక్ష్మీనారాయణరెడ్డి, సీఈవో, బయోఫాక్టర్‌ అన్నారు.

Read More

తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయానికి 24వ ర్యాంక్

  • జయశంకర్ వ్యవసాయ వర్సిటీకి NIRF (National Institutional Ranking Framework) 2025 లో 24వ ర్యాంక్ – గత ఏడాదితో పోలిస్తే 13 ర్యాంకుల మెరుగుదల.
  • ప్రభుత్వ మద్దతు, సిబ్బంది కృషి ప్రధాన కారణాలు – ఉపకులపతి అల్థాస్ జానయ్య

దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల పనితీరుపై భారత ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖ నిర్వహించిన సర్వే నివేదిక NIRF (National Institutional Ranking Framework) 2025 ఈరోజు విడుదల అయ్యింది. ఈ జాబితాలో దేశంలోని అన్ని వ్యవసాయ, వ్యవసాయ అనుబంధ విశ్వవిద్యాలయాలు, సంస్థల జాబితాలో ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం (PJTAU) 24వ ర్యాంక్ ను సాధించింది. 2015 లో PJTAU ఆరవ ర్యాంక్ సాధించగా, 2023లో ఆ ర్యాంక్ 37కు పడిపోయింది. ఇప్పుడు పనితీరు మెరుగు పరుచుకుని 24 ర్యాంకు సాధించిందని PJTAU ఉపకులపతి అల్దాస్ జానయ్య వివరించారు. దక్షిణాదిలోని అన్ని వ్యవసాయ, వ్యవసాయ అనుబంధ విశ్వవిద్యాలయాలు, సంస్థల్లో 4వ స్థానంలో PJTAU నిలవడం గర్వకారణమని జానయ్య అన్నారు. 10 నెలల క్రితం తాను PJTAU ఉపకులపతిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత విశ్వవిద్యాలయ ర్యాంకింగ్ మెరుగుదలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి అనేక కార్యక్రమాలు చేపట్టడం వల్ల ఈ ఏడాది ర్యాంకు మెరుగుపడిందని ఆయన తెలిపారు. విశ్వవిద్యాలయం పరిధిలో ప్రత్యేకంగా 4 ఆధునిక పరిశోధన కేంద్రాలు ప్రారంభించానన్నారు. మానవ రహిత వ్యవసాయమే ధ్యేయంగా డిజిటల్ టెక్నాలజీ వినియోగం పెంపునకు సెంటర్ ఫర్ డిజిటల్ అగ్రికల్చర్ ను, సహజ వనరులు, పర్యావరణ పరిరక్షణ పరిశోధనలకు గాను సెంటర్ ఫర్ నేచురల్ రిసోర్స్ అండ్ ఎన్విరాన్మెంట్ ను, అదేవిధంగా సెంటర్ ఫర్ సస్టైనబుల్ అగ్రికల్చర్ సిస్టమ్స్ ను, అలాగే బోధన, బోధనేతర సిబ్బంది లో నైపుణ్యాల పెంపుదలకి సెంటర్ ఫర్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అదేవిధంగా సహజ వనరుల పరిరక్షణ, యూరియా, ఇతర రసాయన ఎరువుల వినియోగం తగ్గింపు, నీటి సమర్థ యాజమాన్యం వంటి ముఖ్యమైన అంశాలపై రాష్ట్రవ్యాప్తంగా ”రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు” అనే వినూత్న కార్యక్రమాన్ని అమలు చేసి సుమారు 1200 గ్రామాల్లో 1,20,000 మంది రైతులని శాస్త్రవేత్తలు ప్రత్యక్షంగా కలిసి ఆ అంశాలపై అవగాహన కల్పించారని జానయ్య వివరించారు. అలాగే సుమారు 11వేల గ్రామాల్లో ఎంపిక చేసిన అభ్యుదయ రైతులకి నాణ్యమైన 40 వేల విత్తన కిట్లను పంపిణీ చేశామని జానయ్య పేర్కొన్నారు. సామాన్యులకి, గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు వ్యవసాయ విద్యను చేరువ చేయాలన్న ఉద్దేశంతో సీట్లను పెంచి, ఫీజులు తగ్గించామని, వ్యవసాయ కూలీల పిల్లలకు ప్రత్యేక సీట్లు కేటాయించామని జానయ్య వివరించారు. అలాగే అనేక జాతీయ, అంతర్జాతీయ సంస్థలతో ఒప్పందాలు చేసుకొని విస్తృత పరిశోధనలు చేపట్టామని జానయ్య తెలిపారు. భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి (ICAR), రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ తుమ్మల నాగేశ్వరరావు, వ్యవసాయ కార్యదర్శి శ్రీ M. రఘునందన్ రావు ల నిరంతర మార్గదర్శకత్వం, తోడ్పాటుతో ఈ ర్యాంకు సాధించగలిగామన్నారు. అదేవిధంగా బోధన, బోధనేతర సిబ్బంది, విద్యార్థుల కృషి, తోడ్పాటు ర్యాంకుల పెరుగుదలకు దోహదం చేసిందని జానయ్య అన్నారు. వారందరికీ ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఇదే స్ఫూర్తితో 2026 లో 10వ ర్యాంకు, 2027లో 5వ ర్యాంకు సాధిస్తామని అల్థాస్ జానయ్య ధీమా వ్యక్తం చేశారు.

Read More

ప్రకృతి వ్యవసాయమే పరిష్కారం: సుభాష్‌ పాలేకర్‌

పర్యావరణ సమతుల్యానికి యూరియా, రసాయన ఎరువుల వాడకంతో ఏర్పడుతున్న సమస్యల కారణంగా గ్రామాల నుంచి పెద్దఎత్తున నిధులు బయటకు వెళ్తున్నాయని, ‘మారిన ఆహారపు అలవాట్లు, రసాయనాలతో పండించిన పంటలే ఇందుకు కారణమని, గ్రామాల నుంచి ఇంతలా నిధులు బయటకు వెళ్తుంటే అభివృద్ధి ఎలా జరుగుతుంది? ప్రకృతి వ్యవసాయమే దీనికి పరిష్కారం. ఆరోగ్యకరమైన ఆహారం వల్ల క్యాన్సర్‌, డయాబెటిస్‌, గుండె జబ్బులు దరిచేరవు. ప్రకృతి వ్యవసాయంతో పర్యావరణం సమతుల్యమవుతుంది’ అని నిన్న హైదరాబాదులో జరిగిన వై.ఎస్‌. రాజశేఖరరెడ్డి స్మారక పురస్కారాల సభలో పాల్గొన్న సుభాష్‌ పాలేకర్‌ అన్నారు.

Read More

వెయ్యి కాయలకు రూ.24 వేలు పలికిన పచ్చి కొబ్బరి కాయలు

మూడు రోజుల క్రితం వరకు వెయ్యి కాయల ధర రూ.22 వేలు ఉండగా ఇప్పుడు రూ.23 వేల నుంచి రూ.24 వేలకు చేరింది. కోనసీమ మార్కెట్‌ చరిత్రలో ఇది అరుదైన రికార్డుగా చెబుతున్నారు. ప్రాంతాలను బట్టి కొందరు వ్యాపారులు ఈ ధరకు కొనుగోలు చేస్తున్నారు. కాయల పరిమాణం, నాణ్యత, బరువును బట్టి కొన్ని ప్రాంతాల్లో వెయ్యి పచ్చి కాయలు రూ.25 వేలకు చేరువలో ఉన్నట్లు వ్యాపారులు చెబుతున్నారు. ఈ నెలలో కాయల పరిమాణం ఆశాజనకంగా ఉంటుంది. దీంతో వర్తకులు రైతుల వద్ద నుంచి ఇప్పుడే పెద్దఎత్తున కొని నిల్వ చేసుకుంటున్నారు. రానున్న దసరాకు మంచి ధర వస్తుందని ఆశిస్తున్నారు. దిగుబడులు సన్నగిల్లాయి. గతంలో ఎక రాకు వెయ్యి కాయలు వస్తే ఇప్పుడు సగానికి తగ్గిపోయి కొరత ఏర్పడింది. దీంతో రోజుల వ్యవధిలోనే ధరలో పెరుగుదల కనిపిస్తోంది. పొరుగు రాష్ట్రాలతో పాటు ఏపీలోని పలు జిల్లాలకు ఎగుమతులు జోరందుకున్నాయి.

Read More

వాతావరణ మార్పులను అడ్డుకోవడానికి అన్ని దేశాలు సహకరించుకోవాలి

వాతావరణ మార్పులను అడ్డుకోవడంలో సంపన్న దేశాలు, వర్థమాన దేశాల మధ్య సత్వరం అంగీకారం కుదరకపోతే సమయం మించిపోతుందని 30వ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ (కాప్ 30) సభ అధ్యక్షుడు ఆందే కొరియా డు లాగో సోమవారం హెచ్చరించారు. వాతావరణ మార్పుల నిరోధం గురించి చర్చించడానికి, ప్రపంచ దేశాలతో సమన్వయం నెరపడానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిరాకరించడాన్ని ఆయన తప్పుబట్టారు. కర్బన ఉద్గార రహిత అభివృద్ధి సాధనకు సంపన్న దేశాలు చేయూతనివ్వాలని వర్ధమాన దేశాలు కోరుతుంటే.. సంపన్న దేశాలు దానికి నిరాకరించడమే కాకుండా వర్ధమాన దేశాలు తమ పాట్లు తాము పడాలన్నట్లు వ్యవహరిస్తున్నాయని విమర్శించారు. కాలుష్య కారక శిలాజ ఇంధనాల స్థానంలో జీవ ఇంధనాల వినియోగాన్ని బ్రెజిల్, భారత్లో పెద్ద ఎత్తున చేపట్టాయని వివరించారు. అయితే ఇది ఖరీదైన పరిష్కారమార్గం కాబట్టి.. దాన్ని అందరికీ అందుబాటులోకి తీసుకురావడంపై ప్రపంచ దేశాలు దృష్టి పెట్టాలని సూచించారు.

Read More

వ్యవసాయ యాజమాన్య, విస్తరణ శిక్షణ సంస్థకు పూర్వ వైభవం తేవాలి

తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ యాజమాన్య, విస్తరణ శిక్షణ సంస్థ ప్రస్తుత పరిస్థితులపై పూర్తిస్థాయి నివేదికను ప్రభుత్వానికి అందించి సంస్థకు పూర్వవైభవం తెస్తామని వ్యవసాయ, రైతు కమిషన్ ఛైర్మన్ కోదండరెడ్డి సూచించారు. సోమవారం ఆయన మలక్ పేటలోని ఆ సంస్థను తమ సభ్యులతో కలిసి సందర్శించారు.

Read More

వికసిత్ భారత్ సాధనలో వ్యవసాయానిది కీలకపాత్ర

PJTAU పరిధిలోని అగ్రి హబ్ ఇన్నోవేషన్ సెంటర్లో ఈరోజు 15 వ్యవసాయ ఆధారిత అంకుర సంస్థలకు గుర్తింపు పత్రాలని ఉపకులపతి ప్రొఫెసర్ అల్థాస్ జానయ్య అందజేశారు. ఈ సంస్థలు PJTAU అగ్రి హబ్ ఇన్నోవేషన్ సెంటర్ లో విజయవంతంగా సాంకేతిక శిక్షణ పూర్తి చేసుకున్నాయి. అగ్రి హబ్ తరఫున ఇప్పటికి సుమారు 150 అంకుర సంస్థలకు నాబార్డ్ సహాయంతో తోడ్పాటు నందించామని జానయ్య వివరించారు. ఇందులో భాగంగా కూరగాయల సాగులో మానవ ప్రమేయం తగ్గించి రైతులకు తోడ్పాటు అందించేందుకు ఇంజనీరింగ్ విద్యార్థులు ఆవిష్కరించిన రోబో ని అల్దాస్ జానయ్య ఈ కార్యక్రమంలో లాంఛనంగా ప్రారంభించారు. అలాగే గ్రామీణ యువత, అభ్యుదయ రైతులకు చేయూతనందించే కార్యక్రమంలో భాగంగా నాబార్డ్ ఆర్థిక సహకారాన్ని ఆరుగురికి అందజేశారు. అంతేకాకుండా మరో రెండు అంకుర సంస్థలకు ఒక్కొక్క దానికి 40 లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సాయం PJTAU అగ్రి హబ్ ద్వారా అందజేశారు. 2047 నాటికి భారతదేశాన్ని వికసిత భారత్ గా రూపొందించాలన్న లక్ష్యంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రణాళికాబద్ధంగా పనిచేస్తున్నాయని అల్థాస్ జానయ్య అన్నారు. ఆ వికసిత్ భారత్ సాధనలో వ్యవసాయానిది కీలకపాత్ర అని ఆయన స్పష్టం చేశారు. దేశ సంపద మూలాలు ఈనాటికీ గ్రామీణ భారతంలో, వ్యవసాయ రంగంలోనే కేంద్రీకృతమై ఉన్నందున ఈ రంగాలకి పెద్దపీట వేసి వ్యవసాయంతో పాటు వ్యవసాయ పరిశ్రమలు, వ్యవసాయ ఆధారిత అంకుర సంస్థలను పెద్ద ఎత్తున ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని జానయ్య తెలిపారు.
ఈ కార్యక్రమంలో విశిష్ట అతిథులుగా నాబార్డ్ DGM దీప్తి, WE HUB ప్రతినిధి సీత, PJTAU రిజిస్ట్రార్ డాక్టర్ G.E.CH విద్యాసాగర్, AG HUB MD G. వెంకటేశ్వర్లు, వివిధ అంకుర సంస్థల ప్రతినిధులు, విద్యార్థులు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు.

Read More

వ్యవసాయ విద్యుత్‌ కనెక్షన్లకు సౌర విద్యుత్తు

ఆంధ్రప్రదేశ్‌ పీఎం కుసుమ్‌ పథకం రెండో థను 4 లక్షల వ్యవసాయ కనెక్షన్లకు అమలు చేయాలని ఇంధన శాఖ నిర్ణయించింది. దీని ప్రతిపాదనను అధికారులు కేంద్రానికి పంపారు. పథకం అమలు కోసం ఫీడర్‌ స్థాయిలో మినీ సౌర విద్యుత్‌ ప్రాజెక్టులను ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. రెండోథ ప్రాజెక్టును 2026 నుంచి కేంద్రం అమలుచేయనుంది. వాటి ద్వారా 2027-28 నుంచి సుమారు 2,000 మెగావాట్ల విద్యుత్‌ వస్తుందని అంచనా. 19 శాతం కెపాసిటీ యుటిలైజేషన్‌ ఫ్యాక్టర్‌ (సీయూఎఫ్‌)గా అధికారులు పరిగణించారు. ఈ లెక్కన సుమారు 3,200 మిలియన్‌ యూనిట్ల (ఎంయూ) విద్యుత్‌ ఉత్పత్తి వస్తుందని అంచనా. అప్పటికి యూనిట్‌ విద్యుత్‌ వ్యయం ఆధారంగా లెక్కిస్తే.. ఏటా సుమారు రూ. 254.04 కోట్లు విద్యుత్‌ కొనుగోలు వ్యయంలో ఆదా అవుతుందని అధికారుల అంచనా. విద్యుత్‌ కొనుగోలు ఒప్పందం (పీపీఏ) అమలులో ఉండే 25 ఏళ్లలో సుమారు రూ.6,351 కోట్లు ఆదా అవుతుందని అధికారులు లెక్కలు తేల్చారు.
మూడోవంతు కనెక్షన్లకు సౌర విద్యుత్‌

  • ఆంధ్రరాష్ట్రంలో 21 లక్షల వ్యవసాయ విద్యుత్‌ కనెక్షన్లు ఉన్నాయి. వాటిలో పీఎం కుసుమ్‌ కింద మొదటిథలో 3 లక్షల కనెక్షన్లకు సౌర విద్యుత్‌ అందించేందుకు కేంద్రం అనుమతించింది. రెండోథలో ప్రతిపాదించిన 4 లక్షలతో కలిపి.. మొత్తంగా 7 లక్షల కనెక్షన్లకు సౌర విద్యుత్‌ అందించేలా ప్రభుత్వం ప్రాజెక్టు రూపొందించింది.
  • ఏటా వ్యవసాయానికి ఉచిత విద్యుత్‌ కోసం ప్రభుత్వం రాయితీ కింద సుమారు రూ.8వేల కోట్లు డిస్కంలకు చెల్లిస్తోంది. మొత్తం వ్యవసాయ కనెక్షన్లలో మూడోవంతు వాటికి సౌర విద్యుత్‌ అందించడం వల్ల ఆ మేరకు ప్రభుత్వం ఏటా చెల్లించే రాయితీ మొత్తంలో
    మిగులుతుంది.
  • ఫీడర్‌ స్థాయిలో సౌర విద్యుత్‌ ప్రాజెక్టుల ఏర్పాటుకు మహారాష్ట్రలో అమలవుతున్న విధానాన్ని అధికారులు ఇప్పటికే పరిశీలించారు. అందుకు మెరుగైన విధానాన్ని రాష్ట్రంలో అమలు చేసేలా ప్రణాళిక సిద్ధం చేశారు.
    మొదటి థలో రూ.2,035 కోట్లు ఆదా
    పీఎం కుసుమ్‌ మొదటి థలో 3 లక్షల వ్యవసాయ కనెక్షన్లకు ఫీడర్‌ స్థాయిలో మినీ సౌర ప్రాజెక్టుల ఏర్పాటుకు ఇప్పటికే టెండరు ప్రక్రియను అధికారులు పూర్తి చేశారు. గుత్తేదారుల నుంచి 50 బిడ్లు దాఖలయ్యాయి. సంప్రదింపుల తర్వాత యూనిట్‌ తక్కువ ధరకు ఇచ్చేందుకు అంగీకరించిన గుత్తేదారులకు అధికారులు ఎల్‌వోఏ ఇచ్చారు.
  • మూడు డిస్కంల పరిధిలో కలిపి యూనిట్‌కు సగటున రూ.3.17 చొప్పున గుత్తేదారులు కోట్‌ చేశారు. ప్రస్తుతం ఆ కనెక్షన్లకు ఉచిత విద్యుత్‌ పథకం కింద ప్రభుత్వం రాయితీగా చెల్లించే మొత్తంతో పోలిస్తే మినీ సౌర ప్రాజెక్టుల ద్వారా వచ్చే విద్యుత్‌ తీసుకోవడం వల్ల ఏటా రూ.81 కోట్లు ఆదా అవుతుందని అధికారులు లెక్కించారు.
  • పీపీఏ వ్యవధిలో 25 ఏళ్లలో రూ.2,035 కోట్లు ఆదా అవుతుందని అంచనా. మూడు డిస్కంలలో కలిపి 1,162.80 మెగావాట్ల విద్యుత్‌ అందుబాటులోకి రానుంది.
Read More