ముత్యంపేటలో మూతబడిన చక్కెర పరిశ్రమ పునరుద్దరణకు ప్రభుత్వం సిద్ధం

మల్లాపూర్‌ మండలం ముత్యంపేటలో మూతపడిన చక్కెర పరిశ్ర మను పరిశ్రమల శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి సంజయ్‌కుమార్‌, వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి రఘునందన్‌రావు, చెరకు అభివృద్ధి సంస్థ డైరెక్టర్‌ సీహెచ్‌ నర్సిరెడ్డిలతో కూడిన అధ్యయన కమిటీ శుక్రవారం పరిశీలించింది. అనంతరం చెరకు రైతులతో సమావేశం నిర్వహించి అభిప్రాయాలు సేకరించింది. కమిటీ వెంట తెలంగాణ రాష్ట్ర సంక్షేమశాఖా మంత్రి లక్ష్మణ్‌కుమార్‌తో పాటు ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌, కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్‌, కలెక్టర్‌ సత్యప్రసాద్‌ తదితరులున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. జగిత్యాల జిల్లాలో ఏకైక వ్యవసాయాధారిత పరిశ్రమ అయిన ముత్యంపేట ఎన్‌డీఎస్‌ఎల్‌ చక్కెర కర్మాగారం పునరుద్ధరణకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని పేర్కొన్నారు. బ్యాంకులకు చెల్లించాల్సిన పాత బకాయిలు రూ.172 కోట్లను ఇప్పటికే ప్రభుత్వం విడుదల చేసినట్లు తెలిపారు. పరిశ్రమలో యంత్రాలను పరిశీలించామని, వాటిని పూర్తిగా తొలగించడమా? ఉన్న వాటిని పునరుద్ధరించడమా? అన్న విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామన్నారు. రైతులకు కనీస మద్దతు ధర, ఉచిత విత్తన సరఫరా, హార్వెస్టింగ్‌ వంటి విషయాల్లో అండగా ఉంటామన్నారు. కార్యక్రమంలో మాజీ మంత్రి జీవన్‌ రెడ్డి, కాంగ్రెస్‌ నేత జువ్వాడి నర్సింగరావు తదితరులున్నారు.

Read More

రానున్న సంవత్సరాలలో ప్రకృతి వ్యవసాయానికి తెలంగాణలో అధిక ప్రాధాన్యం

తెలంగాణ రాష్ట్రంలో ప్రకృతి వ్యవసాయాన్ని పెద్ద ఎత్తున ప్రోత్సహించే విధంగా ప్రణాళికను రూపొందిస్తున్నామని వ్యవసాయశాఖా మంత్రి తెలిపారు. సెక్రటేరియట్‌లో ఏపిసిఎన్‌ఎఫ్‌ ప్రతినిధులు విశ్రాంత ఐఏఎస్‌ విజయ కుమార్‌, ఇతరులు, పక్క రాష్ట్రాలలో, వివిధ దేశాలలో అమలు చేస్తున్న ప్రకృతి వ్యవసాయ విధానాలను మరియు వారి అనుభవాలు ప్రకృతి వ్యవసాయం ఆచరించి అధిక ఆదాయం పొందుతున్న రైతుల విజయ గాధలు, ప్రకృతి వ్యవసాయంలో మెరుగైన నేల ఆరోగ్యం మరియు ఆరోగ్యకర ఉత్పత్తులను మంత్రికి వివరించి తాము తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పని చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేసారు.
సమావేశంలో పాల్గొన్న వ్యవసాయ కార్యదర్శి రఘునందన్‌, వ్యవసాయ శాఖా సంచాలకులు డా. గోపి ఈ సంవత్సరం నుండి ఆరంభించిన ప్రకృతి వ్యవసాయం యొక్క ప్రగతిని వివరించి ఇప్పటికే రాష్ట్రంలో 489 క్లస్టర్లు ఏర్పాటు చేసి 61,125 రైతులను ఎంపిక చేసినట్లు (50 హెక్టార్లు ప్రతి క్లస్టర్లు), దీనికి గాను కేంద్ర ప్రభుత్వ నిధులతో పాటు రాష్ట్ర ప్రభుత్వం 42.07 కోట్లు కేటాయించిందని రిసోర్స్‌ పర్సన్‌లకు వాలంతరి ఆధ్వర్యంలో శిక్షణను పూర్తి చేశామని తెలియచేసారు. ఏపిసిఎన్‌ఎఫ్‌ ప్రతినిధులు సూచించిన విధంగా ప్రకృతి వ్యవసాయాన్ని రాష్ట్రంలో ముందుకు తీసుకువెళ్తామని తెలియజేసారు.
తరువాత తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ ఇప్పటిదాకా రైతులలో ప్రకృతి వ్యవసాయంలో దిగుబడులు తగ్గుతాయని ఒక అపోహ ఉందని, కానీ ఏపిసిఎన్‌ఎఫ్‌ ప్రతినిధుల అనుభవాలు మరియు నా అనుభవం, తోటి రైతుల అనుభవాలు ఇది తప్పని నిరూపించాయని, రైతుల నికరాదాయం, మొదటి సంవత్సరం నుండి పెరగడం ఆరంభమైందని తెలియజేసారు. ప్రకృతి వ్యవసాయం ద్వారా ఆరోగ్యకర ఉత్పత్తులు తీసి మార్కెటింగ్‌ అవకాశాలను పెంచుకొనే అవకాశం కలదని, వర్షాధార ప్రాంతాలలో కూడా 3 పంటలు తీసే అవకాశం కలదని, అలాగే కలుపు, చీడపీడల సమస్య కూడా గణనీయంగా తగ్గించవచ్చని తెలిపారు. ప్రస్తుత కర్తవ్యం నేల ఆరోగ్యాన్ని కాపాడడం తద్వారా మానవాళి ఆరోగ్యం కాపాడడమే కాకుండా రైతుకు నికర ఆదాయం పెంచడమని, ఇది ఒక్క ప్రకృతి వ్యవసాయంతోనే సాధించగలమని విశ్వాసం వ్యక్తం చేశారు.

Read More

పశువైద్యశాలల బలోపేతానికి నిధులు విడుదల

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో పశువైద్యశాలలు, డిస్పెన్సరీలు, సంచార పశు వైద్యశాలల అభివృద్ధి, బలోపేతానికి రూ. 32.83 కోట్ల విడుదలకు ప్రభుత్వం పరిపాలన అనుమతి ఇచ్చింది. ఈ నిధులను ఇతర ఏ పథకాలకూ మళ్ళించడానికి వీల్లేదని ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్వి బి. రాజశేఖర్‌ ఉత్తర్వులు జారీ చేశారు.

Read More

ఆధునిక సాంకేతికతతోనే అన్నదాతలకు మేలు

వ్యవసాయ పరిశోధనలు, ఆధునిక సాంకేతికతతో అన్నదాతలకు శారీరక శ్రమతో పాటు సాగు వ్యయం తగ్గుతుందని, ఆదాయం పెరుగుతుందని శాస్త్రవేత్తలు చెప్పారు. హైదరాబాద్‌లో బుధవారం జాతీయ వ్యవసాయ పరిశోధన నిర్వహణ సంస్థ (నార్మ్‌), కేంద్ర ప్రభుత్వ ప్రధాన శాస్త్ర సలహాదారు కార్యాలయం సంయుక్తంగా గ్రామీణ సాంకేతికతపై నిర్వహించిన జాతీయ సదస్సులో శాస్త్రవేత్తలు, నిపుణులు, అధికారులు, ఆవిష్కర్తలు పాల్గొన్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన భారత ప్రధాన శాస్త్ర సలహాదారు కార్యాలయం శాస్త్రవేత్త రాకేశ్‌ కౌర్‌ మాట్లాడుతూ.. వ్యవసాయ రంగం విస్తరణ లక్ష్యంగా పరిశోధనలు జరగాలన్నారు. వ్యవసాయ సాంకేతికత, యంత్రాలు, పరికరాలు, మత్స్య, పశుసం వర్ధక రంగాల్లో ఆవిష్కరణలు విస్తరించాలని, గ్రామీణ సాంకేతికతకు పెద్దపీట వేయాలన్నారు. వ్యవసాయ అంకురాలను ప్రోత్సహించాలన్నారు. నార్మ్‌ డైరెక్టర్‌ గోపాల్‌ లాల్‌, ఎ- ఐడియా సీఈవో సెంథిల్‌ వినాయగం తదితరులు మాట్లాడారు. ఈ సందర్భంగా ఆధునిక యంత్ర పరికరాలను ప్రదర్శించారు.

Read More

యువతకి ఉపాధి లక్ష్యంగా పీజీ డిప్లొమా

పంటల రక్షణతో పాటు యువతకు ఉపాధి లక్ష్యంగా మొక్కల ఆరోగ్య నిర్వహణపై తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం, జాతీయ మొక్కల నిర్వహణ యాజమాన్య సంస్థ(ఎన్‌ఎఐపీ హెచ్‌ఎం) సంయుక్తంగా ఏడాది కాల పరిమితి గల పీజీ డిప్లొమా కోర్సు నిర్వహించాలని నిర్ణయించాయి. ఈ మేరకు బుధవారం హైదరాబాద్‌లోని అగ్రివర్సిటీలో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఎన్‌ఐపీ హెచ్‌ఎం డైరెక్టర్‌ జనరల్‌ సాగర్‌ హనుమాన్‌సింగ్‌, అగ్రివర్సిటీ వీసీ అల్దాస్‌ జానయ్యల సమక్షంలో రెండు సంస్థల రిజిస్ట్రార్లు శ్రీనివాస్‌, విద్యాసాగర్‌ ఒప్పందంపై సంతకాలు చేశారు. కోర్సులో భాగంగా మూడు నెలలు ఇంటర్న్‌షిప్‌ ద్వారా అభ్యర్థులు పరిశ్రమల్లో పనిచేసే అవకాశాలు లభిస్తాయని, శిక్షణ పూర్తి చేసుకున్న అనంతరం ఉపాధి అవకాశాలు లభిస్తాయని వారు తెలిపారు.

Read More

విద్యుత్‌ రాయితీకి చేపలు, రొయ్యల చెరువులకు లైసెన్సులు సరైన మార్గం

ఆంధ్రప్రదేశ్‌లో చేపలు, రొయ్యల చెరువుల తవ్వకాలకు లెసెన్స్‌ తీసుకోవడం తప్పనిసరి చేస్తూ ఆంధ్రప్రదేశ్‌ వ్యవసాయ, మత్స్యశాఖ మంత్రి అచ్చెన్నాయుడు శాసనసభలో ప్రవేశపెట్టిన బిల్లును సభ్యులు ఏకగ్రీంగా ఆమోదించారు. ప్రభుత్వం కల్పించిన విద్యుత్తు రాయితీ ఆక్వా రైతులు పొందేందుకు లైసెన్స్‌ తీసుకోవడం సరైన మార్గమని మంత్రి అన్నారు. గడువు తీరిన పాత లైసెన్సులను నిర్దేశించిన ఫీజుతో పాటు 50% ఆలస్యపు రుసుములు చెల్లించి పునరుద్ధరించుకోవచ్చని మంత్రి పేర్కొన్నారు. తీర ప్రాంతంలో చేపలు, రొయ్యల పెంపకం కార్యకలాపాల కాలవ్యవధి జీవితకాలం నుంచి ఐదేళ్లకు తగ్గించారు. ఆక్వా దుకాణాలకు సంబంధించిన జీవితకాలం ఏడాదికి తగ్గిస్తూ చట్ట సవరణ చేశారు.

Read More

ధాన్యం కొనుగోలు కేంద్రాలలో రైతులకు మంచి ఏర్పాట్లు

సన్న, దొడ్డు వడ్లకు వేర్వేరు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తామని ఖరీఫ్‌ (వానాకాలం) సీజన్‌లో తెలంగాణా రాష్ట్రవ్యాప్తంగా రైతుల నుంచి 75 లక్షల టన్నుల ధాన్యం సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని..  పౌరసరఫరాలశాఖ ముఖ్య కార్యదర్శి, కమిషనర్‌ డీఎస్‌ చౌహాన్‌ స్పష్టం చేశారు. హైదరాబాద్‌లో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ధాన్యం సేకరణ కార్యాచరణను వెల్లడించారు. 'రైతులు వడ్లను కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చి కుప్పపోసిన తరువాత తడిసినా, మరే ఇతర నష్టం వాటిల్లినా మేం బాధ్యత తీసుకుంటాం. వర్షాలు పడుతున్నాయన్న భయంతో తక్కువ ధరకు బయట అమ్ముకోవద్దు. మద్దతు ధరతో పాటు సన్నాలకు క్వింటాకు రూ.500 బోనస్‌నూ ప్రభుత్వం చెల్లిస్తుంది. మిల్లులకు ధాన్యం చేరుకున్నాక వడ్లు నాణ్యంగా లేవని, తూకంలో కోత పెడతామంటూ మిల్లర్లు ఫోన్‌ చేస్తే అంగీకరించొద్దు. కొనుగోలు కేంద్రాల్లో అయినా, మిల్లర్లయినా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం' అని చౌహాన్‌ వెల్లడించారు.

సేవలు ఉచితం
‘పలు కొనుగోలు కేంద్రాల్లో ఆటోమేటిక్‌ ప్యాడీ డ్రైయర్లు, క్లీనర్లను వినియోగిస్తున్నాం. దేశంలో వీటిని వాడుతున్న తొలి రాష్ట్రం తెలంగాణే. ప్రస్తుత సీజన్‌లో రైతులకు ఉచితంగా వీటి సేవలందిస్తాం. తూకంలో తేడాలు రాకుండా తూనికలు-కొలతల శాఖ ఎలక్ట్రానిక్‌ వెయింగ్‌ స్కేల్స్‌ను ముందే తనిఖీ చేస్తుంది. మధ్యమధ్యలో ఆకస్మిక తనిఖీలుంటాయి. వర్ష సమాచారాన్ని ప్రతిరోజు ఉదయం 6 గంటలకే కొనుగోలు కేంద్రాలకు పంపిస్తాం. ధాన్యం తడిసిపోకుండా కంటెయినర్‌ తరహా ఏర్పాట్లు చేస్తాం. రైతులపై పిడుగుల ప్రభావం పడకుండా జాగ్రత్తలు తీసుకుంటాం. సన్నాలకు బోనస్‌ తెలంగాణ రైతులకే చెల్లిస్తాం. నిబంధనల మేరకు హార్వెస్టర్లను ఉపయోగించకపోతే వాటి యజమానులపై కఠిన చర్యలు తప్పవు’ అని చౌహాన్‌ పేర్కొన్నారు. రాష్ట్రంలో రేషన్‌ కార్డుల సంఖ్య 1.01 కోట్లకు, లబ్ధిదారుల సంఖ్య 3.26 కోట్లకు చేరుకుందని వివరించారు. బ్యాంకు గ్యారంటీ ఇచ్చిన మిల్లర్లకే ధాన్యం కేటాయిస్తున్నట్లు తెలిపారు.

Read More

విజయవాడ ఉత్సవంలో వ్యవసాయ ప్రదర్శన

విజయవాడ ఎక్స్‌పోలో 11 రోజులు ఈ వ్యవసాయ ప్రదర్శన ఉంటుంది. వ్యవసాయం, ఆక్వా, పశుసంవర్థక, ఉద్యాన శాఖలవి 90 ప్రత్యేక స్టాళ్లు ఏర్పాటు చేస్తున్నారు. వ్యవసాయ ఉత్పత్తుల మొదలు పరికరాల వరకు అనేక అంశాలు వీటిలో ప్రతిబింబించనున్నాయి. తెలుగు రాష్ట్రాల నుంచి భారీగా రైతులు వస్తారని అంచనా. వీరి కోసం ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ, వైఎస్సార్‌ ఉద్యాన, వేంకటేశ్వర వెటర్నరీ, ఫిషరీస్‌ విశ్వవిద్యాలయాల శాస్త్రవేత్తలు, అధ్యాపకులు రానున్నారు. పెదవేగి ఆయిల్‌పాం పరిశోధన స్థానం నుంచి సైతం శాస్త్రవేత్తలు వస్తారు. ఈ స్టాళ్లలో రైతులకు అవసరమైన పరికరాలు, యంత్రాలు, ఉత్పత్తులు, విత్తనాలు, చేప పిల్లలు, మేత, పశువులను ప్రదర్శిస్తారు. సాగులో ప్రయోగాలు చేసి విజయం సాధించిన రైతులను సన్మానిస్తారు. ప్రభుత్వం రైతుల ప్రగతికి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, వాటి అర్హతలు ఎలా దరఖాస్తు చేయాలి? అంశంపై వ్యవసాయ, ఉద్యాన, ఆక్వా, వెటర్నరీ విభాగాల అధికారులు అవగాహన కల్పిస్తారు. సాగులో సమస్యలు, తీసుకోవాల్సిన సస్య రక్షణ, డ్రోన్‌ వినియోగం, రసాయనాల పిచికారీ, విత్తనాలు వేయడం, ఏఐ, రోబోల ద్వారా సాగు చేసే సాంకేతిక విధానాలపై అవగాహన కల్పిస్తారు. మామిడి, ఆయిల్‌పాం, అరటి సాగులో అధిక నాణ్యత, దిగుబడి సాధనకు అనుసరించాల్సిన సాగు పద్ధతులు వివరిస్తారు. సాంకేతిక విధానాలతో పాల ఉత్పత్తి, నాణ్యత పెంపు, పశుగ్రాసాలపై అవగాహన కల్పిస్తారు.
Read More

నారింజ రంగు పుట్టగొడుగులు నేలకు నేస్తాలు

వైఎస్సార్‌ కడప జిల్లా యోగి వేమన విశ్వవిద్యాలయ పరిశోధక విద్యార్థులు నారింజ రంగులోని ఈ పుట్టగొడుగులను గుర్తించారు. ఏపీలో మొదటిసారి తమ వర్సిటీలో గుర్తించినట్లు వైవీయూ వృక్షశాస్త్ర ఆచార్యులు మధుసూదన్‌రెడ్డి తెలిపారు. వీటిని కేశర పుట్టగొడుగులు అంటారని, తినడానికి పనికిరావని చెప్పారు. మొదట శ్రీలంకలో, ఆ తర్వాత ఖమ్మం, వరంగల్‌ అటవీ ప్రాంతాల్లో వీటిని కనుగొన్నారని పేర్కొన్నారు. రాలిపోయిన ఆకులు, కలప దుంగలపై పెరిగే ఈ పుట్టగొడుగులు వాటిని త్వరగా కుళ్లిపోయేలా చేసి మట్టిలో కలిపేస్తాయని వివరించారు. భూమిని గుల్లబరచడంలో కీలకపాత్ర పోషిస్తాయన్నారు.
Read More

సన్న వడ్లకు బోనస్‌ వలన ఇతర పంటల విస్తీర్ణం తగ్గుతుంది

వరి సన్నాలకు బోనస్‌ ఇవ్వడంతో దాని సాగు వైపు రైతులు మొగ్గు చూపుతున్నారు. దీని వల్ల ఇతర పంటల విస్తీర్ణం తగ్గుతుంది కాబట్టి తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం వరితో పాటు ఇతర పంటలను ప్రోత్సహించాలని ప్రొఫెసర్‌ హరగోపాల్‌ సూచించారు. సోమవారం ఆయన వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్‌ కార్యాలయంలో ఛైర్మన్‌ కోదండరెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో పాల్గొన్నారు. వ్యవసాయ నిపుణుడు నరసింహారెడ్డి, కమిషన్‌ సభ్యులు, అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరగోపాల్‌ మాట్లాడుతూ.. ఆ పంటల విస్తీర్ణం పెరిగేందుకు కృషి చేయాలన్నారు. కొత్త విత్తన చట్టం వస్తే రైతులకు మేలు జరుగుతుందని తెలిపారు.

Read More