లాభదాయక పంట ఆయిల్‌పామ్‌

వరి, పత్తి రైతులతో పోలిస్తే ఆయిల్‌ పామ్‌ రైతులు ఎక్కువగా లబ్ది పొందుతున్నారని, దేశంలో ఇతర అన్ని పంటల కంటే ఆయిల్‌ పామ్‌ అత్యంత లాభదాయక పంట అని కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ అధ్యయనంలో వెల్లడయింది. దేశీయ అవసరాలకు వినియోగించే నూనెల్లో పామాయిల్‌ దిగుమతులు అత్యధికంగా 21 శాతంగా ఉన్నాయని, దాన్ని తగ్గించే దిశగా సాగు మరింత పెరగాలని, 2047 నాటికి 50% వరకు స్వయం సమృద్ధి సాధించాలని నిర్దేశించింది. దేశవ్యాప్తంగా ఆయిల్‌పామ్‌ సాగు, వినియోగం, ఇతర ప్రయోజనాలపై భారత వ్యవసాయ పరిశోధన మండలి (ఐకార్‌) నేతృత్వంలో కేంద్రం అధ్యయనం నిర్వహించి, ఆ నివేదిక-2025 ను తాజాగా విడుదల చేసింది. ముఖ్యాంశాలిలా ఉన్నాయి.
దేశంలో వంట నూనెల వార్షిక తలసరి వినియోగం 19.7 కిలోలుగా ఉంది. వినియోగంలో 16.9 మిలియన్‌ టన్నులు భారత్‌ దిగుమతి చేసు కుంటోంది. అందులో 56% పామాయిలే. ఇది ప్రపంచ పామాయిల్‌ దిగు మతులలో 21 శాతం. వినియోగం ఇదే స్థాయిలో ఉంటే 2047 నాటికి డిమాండ్‌ 66.8 మిలియన్‌ టన్నులకు చేరుతుంది.
లాభం-ఖర్చు నిష్పత్తి పామాయిల్‌ పంటకు అధికంగా ఉంది. ఆయిల్‌పామ్‌కు పెట్టిన రూ. 1 ఖర్చుకు రూ.1.49 లాభం వస్తోంది. వరిలో అయితే రూ.1 ఖర్చుకు.. లాభం రూ.1.03, పత్తిలో రూ.1 ఖర్చుకు లాభం 1.13 శాతంగా ఉంది.
అభివృద్ధికి సూచనలు
ఆయిల్‌పామ్‌ దిగుబడి హెక్టారుకు 2.4 మెట్రిక్‌ టన్నులుగా ఉంది. దాన్ని 4-5 మెట్రిక్‌ టన్నులకు పెంచే దిశగా ప్రణాళిక అవసరం.
దేశంలో ప్రస్తుతం వరి, పత్తి తదితర పంటలు సాగయ్యే 1.6 కోట్ల ఎకరాలు ఆయిల్‌పామ్‌ సాగుకు అనుకూలంగా ఉన్నాయి.
నర్సరీలు, శుద్ధి సామర్థ్యాలు పెంచేదిశగా పెట్టుబడులను ప్రోత్సహించాలి.
రైతులకు మార్కెటింగ్‌ వనరులను అందుబాటులోకి తేవాలి. చిన్న రైతులకు తేలికగా రుణ లభ్యత ఉండేలా చూడాలి.

Read More

సేంద్రియ సేద్యంపై 3 నెలల శిక్షణ

వచ్చే నెల 6 నుంచి ఫిబ్రవరి 5 వరకు హైదరాబాద్లోని కేంద్ర వ్యవసాయ అనుబంధ జాతీయ మొక్కల ఆరోగ్య యాజమాన్య సంస్థలో సేందియ, ప్రకృతి వ్యవసాయంపై 3 నెలల సర్టిఫికెట్ కోర్సు నిర్వహిస్తున్నట్లు సంస్థ కో-ఆర్డినేటర్ దామోదరాచారి తెలిపారు. వివరాలకు 9542638020 నంబర్లో సంప్రదించాలన్నారు.

Read More

ఈ-క్రాప్ నమోదునుఈ నెల 25లోగా పూర్తి చేయండి

e-Cropఈనెల 25లోగా ఈ శాప్ నమోదు పూర్తి చేయాలని.. ఈ-కాల్ నమోదులో భూకమతానికి రూ.10 చొప్పున ప్రోత్సాహకంగా రైతు సేవా కేంద్రాల్లోని సహాయకులకు అందిస్తామని వ్యవసాయశాఖ డైరెక్టర్ ఢిల్లీరావు తెలిపారు. 100% లక్ష్యం సాధించాలని నిర్దేశించారు. కలెక్టర్ల సహకారంతో అదనంగా గ్రామ సచివాలయ సిబ్బందినీ నియమించుకుని ఈ-పంట నమోదును వేగవంతం చేయాలని సూచించారు. ఈ-క్రాప్ నమోదుపై వ్యవసాయ శాఖ ఎక్స్ అఫీషియో కార్యదర్శి రాజశేఖర్ మంగళవారం సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయనకు నమోదు వివరాలను ఢిల్లీరావు వివరించారు.

Read More

రెడ్‌ బగ్స్‌తో పంటలకు నష్టం చాలా ఎక్కువ

రెడ్‌ కొరీడ్‌ బగ్స్‌ చీడపురుగులు పంటను ఆశిస్తే రైతుకు తీవ్ర నష్టం తప్పదు. పత్తి, వేరుసెనగ వంటి పంటలను ఎక్కువగా ఆశిస్తాయి. ఆకుల రసం పీల్చే యడం వల్ల దిగుబడి తగ్గడంతో పాటు పంట నాణ్యత పూర్తిగా దెబ్బతింటుందని దర్శి కృషివిజ్ఞాన కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త సీహెచ్‌ వరప్రసాదరావు తెలి పారు. వేపనూనె పిచికారీ ద్వారా వీటిని నివారించవచ్చని వివరించారు. ప్రకాశం జిల్లాలో వర్షాలు పడుతుండడంతో ఒంగోలు సమీపంలోని త్రోవగుంట వద్ద ఓ పొలంలో కనిపించాయి.

Read More

టమాట పంటకు తీగల సపోర్టు

అధిక వర్షాలు పడినప్పుడు టమాటలు నేలను తాకి తడిసి మురిగిపోతుంటాయి. ఈ నేపథ్యంలో రంగారెడ్డి జిల్లా షాబాద్‌ మండలం నరెడ్లగూడలో రైతు మిట్ట బాలకృష్ణారెడ్డి పంటను కాపాడుకునేందుకు ఉద్యాన శాస్త్రవేత్తల సలహా కోరారు. మొక్కలు ఎదిగే దశలో కొమ్మలను లేపడం వల్ల కాయలకు నష్టం తగ్గుతుందని చెప్పారు. ఆయన తన రెండు ఎకరాల కూరగాయల తోటలో వరుసకు వరుసకు మధ్య రెండు అడుగుల స్థలం వదిలి, ప్రతి సాలు పొడవునా ఎనిమిది అడుగుల ఎత్తైన కట్టెలను పాతారు. ఆ కట్టెలకు తీగ కట్టారు. మొక్క అడుగు ఎత్తు పెరగగానే దాని కొమ్మలను లేపి తీగకు తాడుతో కట్టారు. ఇలా మూడు అడుగుల వరకు మొక్క పెరిగిన కొద్దీ తీగ ఎత్తు పెంచుకుంటూ వెళ్లారు. గత నెలలో భారీ వర్షాలతో నీరు చేరినా టమాటకు నష్టం జరగలేదు. కర్రలు, తీగలకు ఎకరానికి రూ.20 వేల ఖర్చు అయిందని అయినా రూ.80 వేల పంట దక్కిందని బాలకృష్ణా రెడ్డి చెప్పారు.

Read More

ప్రధానమంత్రి ధనధాన్యయోజన కింద తెలంగాణ నుంచి జోగులాంబ గద్వాల, నాగర్‌కర్నూల్‌, నారాయణపేట, జనగామ జిల్లాల ఎంపిక

వ్యవసాయపరంగా తక్కువ ఉత్పాదకత ఉన్న 100 జిల్లాలను ఎంపిక చేసి అక్కడ ఉత్పత్తి పెంచే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్రధానమంత్రి ధనధాన్య కృషి యోజన కింద తెలంగాణ నుంచి ఎంపికైన జోగులాంబ గద్వాల, నాగర్‌కర్నూల్‌, నారాయణపేట, జనగామ జిల్లాలకు ఐఏఎస్‌ అధికారులను నోడల్‌ అధికారులుగా నియమిస్తూ కేంద్ర సిబ్బంది వ్యవహారాలశాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శిగా ఉన్న పౌసుమి బసుకు జోగులాంబ గద్వాల, మత్స్యశాఖ సంయుక్త కార్యదర్శిగా ఉన్న నీతూ కుమారి ప్రసాద్‌కు నాగర్‌కర్నూల్‌ జిల్లాల బాధ్యతలు అప్పగించారు. వీరిద్దరూ తెలంగాణ కేడర్‌ అధికారులు. కేంద్ర సహకారశాఖ సంయుక్త కార్యదర్శిగా ఉన్న బిహార్‌ కేడర్‌ ఐఏఎస్‌ అధికారి రమణకుమార్‌కు నారాయణపేట, హోంశాఖ సంయుక్త కార్యదర్శిగా ఉన్న ఏజీఎంయూటీ కేడర్‌ అధికారిణి సుష్మాచౌహాన్‌కు జనగామ జిల్లా బాధ్యతలు అప్పగించారు.  ఈ పథకం క్రింద పంట మార్పిడిని ప్రోత్సహించడంతో పాటు సాగునీటి వసతిని, దిగుబడుల నిల్వ సామర్థ్యాన్ని మెరుగుపరుస్తారు. రైతులకు రుణాలు అందిస్తారు. మొత్తం ఆరేళ్లకాలంలో ఈ పథకం కింద రూ.24 వేల కోట్లు ఖర్చు చేస్తారు. తద్వారా 1.7 కోట్ల మంది రైతులకు ప్రయోజనం కలుగుతుందన్నది అంచనా. ఈ నెల నుంచే ఈ పథకం అమల్లోకి రానుంది. కేంద్రంలోని 11 మంత్రిత్వ శాఖల పరిధిలోని 36 పథకాలను సమ్మిళితం చేసి దీని కింద అమలుచేస్తారు.
Read More

ప్రధానమంత్రి ధనధాన్యయోజన కింద ఏపీ నుంచి అల్లూరిసీతారామరాజు, శ్రీసత్యసాయి, అనంతపురం, అన్నమయ్య జిల్లాల ఎంపిక

వ్యవసాయపరంగా తక్కువ ఉత్పాదకత ఉన్న 100 జిల్లాలను ఎంపికచేసి అక్కడ ఉత్పాదకతను పెంచే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం జులై 16న ప్రకటించిన ప్రధానమంత్రి ధనధాన్య కృషి యోజన కింద ఆంధ్రప్రదేశ్‌ నుంచి అల్లూరిసీతారామరాజు (ఏఎస్‌ఆర్‌), శ్రీ సత్యసాయి, అనంతపురం, అన్నమయ్య జిల్లాలను ఎంపిక చేశారు. వీటికి నోడల్‌ అధికారులుగా నలుగురు ఐఏఎస్‌ అధికారులను నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. ఇందులో ఏఎస్‌ఆర్‌ జిల్లాకు కేంద్ర ఆర్థిక వ్యవహారాల సంయుక్త కార్యదర్శి అమిత్‌సింగ్లా (ఏజీఎంయూటీ కేడర్‌), శ్రీసత్యసాయి జిల్లాకు సహకారశాఖ సంయుక్త కార్యదర్శి సిద్ధార్థ్‌ జైన్‌, అనంతపురం జిల్లాకు పెట్రోలియం సహజవాయువుల శాఖ సంయుక్త కార్యదర్శి సుజాతశర్మ (ఇద్దరూ ఏపీకేడర్‌), అన్నమయ్య జిల్లాకు కార్పొరేట్‌ వ్యవహారాలశాఖ సంయుక్త కార్యదర్శి బాలమురుగన్‌ (బిహార్‌ కేడర్‌) నియమితులయ్యారు. ఈ పథకం కింద పంట మార్పిడిని ప్రోత్సహిస్తారు. సాగునీటి సౌకర్యం, పంటల సామర్థ్యం మెరుగుపరుస్తారు. రైతులకు రుణాలు అందిస్తారు. మొత్తం ఆరేళ్లకాలంలో అమలుచేస్తున్న ఈ పథకం కింద రూ.24 వేల కోట్లు ఖర్చుచేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. కేంద్రంలోని 11 మంత్రిత్వశాఖల పరిధిలో ఉన్న 36 పథకాలను సమ్మిళితంచేసి దీని కింద అమలుచేస్తారు. తద్వారా 1.7 కోట్ల మంది రైతులకు ప్రయోజనం కలుగుతుందన్నది అంచనా. ఈ పథకం కింద ఎంపికచేసిన జిల్లాల్లో వ్యవసాయ ఉత్పాదకతను పెంచడానికి వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, నీతిఆయోగ్‌ సాయంతో కలెక్టర్లు జిల్లాస్థాయి ప్రణాళికలు రూపొందించి అమలుచేస్తారు. దీని అమలుతీరు పర్యవేక్షణకోసం డిజిటల్‌ డ్యాష్‌ బోర్డు, రైతులకోసం యాప్‌, జిల్లా ర్యాంకింగ్‌ వ్యవస్థను అమల్లోకి తెస్తారు.

Read More

భారీగా ఫుడ్‌ ప్రాసెసింగ్‌లో పెట్టుబడులు

రూ.1.02 లక్షల కోట్ల పెట్టుబడులు మన దేశ ఫుడ్‌ ప్రాసెసింగ్‌ రంగంలోకి రాబోతున్నాయి. ‘వరల్డ్‌ ఫుడ్‌ ఇండియా’ సమ్మిట్‌లో 26 విదేశీ, దేశీయ సంస్థలతో ప్రభుత్వం ఈ మేరకు ఒప్పందాలు కుదుర్చుకుంది. అంచనాలకు మించి, పెట్టుబడులు పెట్టేందుకు కంపెనీలు ముందుకొచ్చాయని మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ప్రభుత్వంతో వివిధ కంపెనీలు కుదుర్చుకున్న అవగాహనా ఒప్పందాలు కార్యరూపం దాల్చాక 64,000 మందికి పైగా ప్రత్యక్ష ఉద్యోగాలు, 10 లక్షల మందికి పైగా పరోక్ష ఉపాధి లభిస్తుందని మంత్రిత్వ శాఖ అంచనా వేసింది.
ఒప్పందం కుదుర్చుకున్న కంపెనీలు: రిలయన్స్‌ కన్జూమర్‌ ప్రోడక్ట్స్‌, ది కోక-కోలా సిస్టమ్‌ ఇన్‌ ఇండియా, గుజరాత్‌ కోఆపరేటివ్‌ మిల్క్‌ మార్కెటింగ్‌ ఫెడరేషన్‌ (అమూల్‌), ఫెయిర్‌ ఎక్స్‌పోర్ట్స్‌ (ఇండియా) ప్రై.లి. (లూలు గ్రూప్‌), నెస్లే ఇండియా, టాటా కన్జూమర్‌ ప్రోడక్ట్స్‌ లిమిటెడ్‌, కార్ల్స్‌బర్గ్‌ ఇండియా ప్రై.లి., బీఎల్‌ అగ్రో ఇండస్ట్రీస్‌, ఏబీఐఎస్‌ ఫుడ్స్‌ అండ్‌ ప్రోటీన్స్‌, ఏస్‌ ఇంటర్నేషనల్‌, పతంజలి ఫుడ్స్‌, గోద్రేజ్‌ అగ్రోవెట్‌, అగ్రిస్టో మాసా, టివానా న్యూట్రిషన్‌ గ్లోబల్‌, హల్దిరామ్‌ స్నాక్స్‌ ఫుడ్‌, ఇండియన్‌ పౌల్ట్రీ అలియన్స్‌, మిస్సెస్‌ బెక్టార్స్‌ ఫుడ్‌ స్పెషాల్టీస్‌ లిమిటెడ్‌, డాబర్‌ ఇండియా, అల్లానా కన్జూమర్‌ ప్రోడక్ట్స్‌, ఓలమ్‌ ఫుడ్‌ ఇన్‌ గ్రేడియంట్స్‌, ఏబీ ఇన్‌బెవ్‌, క్రెమికా ఫుడ్‌ పార్క్‌, డెయిరీ క్రాఫ్ట్‌, సన్‌ డెక్స్‌ బయోటెక్‌, నాసో ఇండస్ట్రీస్‌, బ్లూపైన్‌ ఫుడ్స్‌.

Read More

‘నాటుకోళ్ల’ పెంపకంకు రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల్లో యువతకు, మహిళలకు కొత్త ఆదాయ మార్గాలను సృష్టించడానికి, రైతులకు అదనపు రాబడిని కల్పించడానికి నూతన, సంప్రదాయ విధానాలను అన్వేషిస్తోంది. అందులో భాగంగా తిన్నవారికి ప్రొటీన్లు… పెంచిన వారికి ఆదాయం అందుతుందనే భావనతో నాటుకోళ్ల పెంపకాన్ని భారీ ఎత్తున చేపట్టాలని నిర్ణయించింది. గతంలో ప్రతి పల్లెలో నాటుకోళ్లు ఉండేవి. కాలక్రమంలో వాటి సంఖ్య భారీగా తగ్గింది. జాతీయ పశుగణన గణాంకాల ప్రకారం… తెలంగాణలో 2014లో 8,20,134 నాటుకోళ్లు ఉండగా 2025 నాటికి 5,10,552 తగ్గాయి. మరోవైపు పట్టణాల్లో నాటుకోడి మాంసానికి అధిక గిరాకీ ఉంటోంది. ఈ నేపథ్యంలో ప్రతి గ్రామంలో కోళ్ల పంపిణీకి కార్యాచరణ సిద్ధం చేసింది.
కార్యాచరణ…
వ్యవసాయ, పశుసంవర్ధక, ఉద్యాన, పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖలతోపాటు సంబంధిత విశ్వవిద్యాలయాల ద్వారా పథకాన్ని అమలు చేస్తారు.
దళిత, గిరిజనుల కుటుంబాలకు ఎస్సీ, ఎస్టీ సబ్‌ ప్లాన్‌ కింద కోళ్లను పంపిణీ చేస్తారు. ఇప్పటికే మహబూబాబాద్‌, ములుగు, నల్గొండ జిల్లాల్లో దళితులు, గిరిజనులకు ఉద్యాన విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ఆరు వేల చొప్పున నాటుకోళ్లను అందజేశారు.
రైతులు తక్కువ పెట్టుబడితో పెరట్లో, వ్యవసాయ క్షేత్రాల్లో కోళ్ల షెడ్లను ఏర్పాటు కోవచ్చు. గుడ్లు, మాంసం సంతల్లో, స్థానిక మార్కెట్లలో అమ్మకాల ద్వారా లాభాలు పొందవచ్చు.
షెడ్లను ఉపాధి హామీ పథకం కింద నిర్మించుకోవచ్చు. మదర్‌ యూనిట్‌ కింద పెద్దషెడ్‌ నిర్మాణానికి రూ.3 లక్షలు ఇస్తున్నారు. దీనిలో కోడిపిల్లలను పెంచి గ్రామంలో ఇతరులకు పెంపకానికి ఇస్తారు. చిన్న యూనిట్లకు రూ. లక్ష ఇస్తారు. ఈ మేరకు రాయితీపై కోళ్లను, కిసాన్‌ క్రెడిట్‌ కార్డుల ద్వారా రుణసాయాన్ని అందజేస్తారు.
మహిళాశక్తి పథకం కింద ప్రతి మండలానికి రెండు చొప్పున యూనిట్లు, 100 చొప్పన చిన్న యూనిట్లను మంజూరు చేస్తోంది. దీనికి రుణసాయాన్ని సెర్ప్‌ అందజేస్తుంది.

Read More

గేదెల మరణాలపై నివేదిక

తూర్పుగోదావరి జిల్లా తాళ్లపూడి మండలం పెద్దేవంలో గేదెల మరణాలు పరాన్నజీవి, వైరల్‌ సంక్రమణ (ఇన్ఫెక్షన్‌) వ్యాధుల కారణంగానే సంభవించినట్లు జిల్లా పశుసంవర్ధకశాఖ అధికారి టి. శ్రీనివాస్‌ తెలిపారు. వ్యాధి సోకిన పశువుల నుంచి సేకరించిన నమూనాలను ప్రయోగశాలలో పరిశీలించగా ఈ విషయం వెల్లడైనట్లు శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ”చనిపోయిన గేదెల్లో మొదట మెడవద్ద వాపు కనిపించి, తర్వాత చర్మం ఊడిపోవడం, బలహీనపడడం, మేత తీసుకోకపోవడం, నోటి నుంచి చొంగ కారడం, శ్వాసకోశ సమస్యలు, కొన్నింటికి జ్వరం వచ్చింది. విజయవాడకు చెందిన వీబీఆర్‌ఐ, కాకినాడకు చెందిన ఆర్‌ఎఏడీడీఎల్‌ నిపుణుల బృందం వ్యాధిని నిర్ధారించింది. నీరు, పశుగ్రాసంలో ఎలాంటి విషపదార్థాలూ లేవని చెప్పింది”. పశువులకు క్రమం తప్పకుండా డీవార్మింగ్‌ చేయించి అవసరమైన టీకాలు వేయించాలని, గేదెలు, గొర్రెలు, మేకలకు వేర్వేరుగా మేత వేయాలని రైతులకు ఆయన సూచించారు. రాష్ట్రంలో పశుపోషకులు ఎదుర్కొంటున్న ఆర్థిక నష్టాన్ని తగ్గించడానికి పశు కిసాన్‌ క్రెడిట్‌ కార్డుల ద్వారా స్వల్పకాలిక రుణాలు అందించేందుకు ప్రభుత్వం ప్రతిపాదన సిద్ధం చేస్తోందని శ్రీనివాస్‌ చెప్పారు.

Read More