వ్యవసాయపరంగా తక్కువ ఉత్పాదకత ఉన్న 100 జిల్లాలను ఎంపిక చేసి అక్కడ ఉత్పత్తి పెంచే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్రధానమంత్రి ధనధాన్య కృషి యోజన కింద తెలంగాణ నుంచి ఎంపికైన జోగులాంబ గద్వాల, నాగర్‌కర్నూల్, నారాయణపేట, జనగామ జిల్లాలకు ఐఏఎస్ అధికారులను నోడల్ అధికారులుగా నియమిస్తూ కేంద్ర సిబ్బంది వ్యవహారాలశాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శిగా ఉన్న పౌసుమి బసుకు జోగులాంబ గద్వాల, మత్స్యశాఖ సంయుక్త కార్యదర్శిగా ఉన్న నీతూ కుమారి ప్రసాద్‌కు నాగర్‌కర్నూల్ జిల్లాల బాధ్యతలు అప్పగించారు. వీరిద్దరూ తెలంగాణ కేడర్ అధికారులు. కేంద్ర సహకారశాఖ సంయుక్త కార్యదర్శిగా ఉన్న బిహార్ కేడర్ ఐఏఎస్ అధికారి రమణకుమార్‌కు నారాయణపేట, హోంశాఖ సంయుక్త కార్యదర్శిగా ఉన్న ఏజీఎంయూటీ కేడర్ అధికారిణి సుష్మాచౌహాన్‌కు జనగామ జిల్లా బాధ్యతలు అప్పగించారు. ఈ పథకం క్రింద పంట మార్పిడిని ప్రోత్సహించడంతో పాటు సాగునీటి వసతిని, దిగుబడుల నిల్వ సామర్థ్యాన్ని మెరుగుపరుస్తారు. రైతులకు రుణాలు అందిస్తారు. మొత్తం ఆరేళ్లకాలంలో ఈ పథకం కింద రూ.24 వేల కోట్లు ఖర్చు చేస్తారు. తద్వారా 1.7 కోట్ల మంది రైతులకు ప్రయోజనం కలుగుతుందన్నది అంచనా. ఈ నెల నుంచే ఈ పథకం అమల్లోకి రానుంది. కేంద్రంలోని 11 మంత్రిత్వ శాఖల పరిధిలోని 36 పథకాలను సమ్మిళితం చేసి దీని కింద అమలుచేస్తారు.

4 Oct, 2025
