ప్రధానమంత్రి ధనధాన్యయోజన కింద తెలంగాణ నుంచి జోగులాంబ గద్వాల, నాగర్‌కర్నూల్‌, నారాయణపేట, జనగామ జిల్లాల ఎంపిక

వ్యవసాయపరంగా తక్కువ ఉత్పాదకత ఉన్న 100 జిల్లాలను ఎంపిక చేసి అక్కడ ఉత్పత్తి పెంచే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్రధానమంత్రి ధనధాన్య కృషి యోజన కింద తెలంగాణ నుంచి ఎంపికైన జోగులాంబ గద్వాల, నాగర్‌కర్నూల్‌, నారాయణపేట, జనగామ జిల్లాలకు ఐఏఎస్‌ అధికారులను నోడల్‌ అధికారులుగా నియమిస్తూ కేంద్ర సిబ్బంది వ్యవహారాలశాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శిగా ఉన్న పౌసుమి బసుకు జోగులాంబ గద్వాల, మత్స్యశాఖ సంయుక్త కార్యదర్శిగా ఉన్న నీతూ కుమారి ప్రసాద్‌కు నాగర్‌కర్నూల్‌ జిల్లాల బాధ్యతలు అప్పగించారు. వీరిద్దరూ తెలంగాణ కేడర్‌ అధికారులు. కేంద్ర సహకారశాఖ సంయుక్త కార్యదర్శిగా ఉన్న బిహార్‌ కేడర్‌ ఐఏఎస్‌ అధికారి రమణకుమార్‌కు నారాయణపేట, హోంశాఖ సంయుక్త కార్యదర్శిగా ఉన్న ఏజీఎంయూటీ కేడర్‌ అధికారిణి సుష్మాచౌహాన్‌కు జనగామ జిల్లా బాధ్యతలు అప్పగించారు.  ఈ పథకం క్రింద పంట మార్పిడిని ప్రోత్సహించడంతో పాటు సాగునీటి వసతిని, దిగుబడుల నిల్వ సామర్థ్యాన్ని మెరుగుపరుస్తారు. రైతులకు రుణాలు అందిస్తారు. మొత్తం ఆరేళ్లకాలంలో ఈ పథకం కింద రూ.24 వేల కోట్లు ఖర్చు చేస్తారు. తద్వారా 1.7 కోట్ల మంది రైతులకు ప్రయోజనం కలుగుతుందన్నది అంచనా. ఈ నెల నుంచే ఈ పథకం అమల్లోకి రానుంది. కేంద్రంలోని 11 మంత్రిత్వ శాఖల పరిధిలోని 36 పథకాలను సమ్మిళితం చేసి దీని కింద అమలుచేస్తారు.
Read More

ప్రధానమంత్రి ధనధాన్యయోజన కింద ఏపీ నుంచి అల్లూరిసీతారామరాజు, శ్రీసత్యసాయి, అనంతపురం, అన్నమయ్య జిల్లాల ఎంపిక

వ్యవసాయపరంగా తక్కువ ఉత్పాదకత ఉన్న 100 జిల్లాలను ఎంపికచేసి అక్కడ ఉత్పాదకతను పెంచే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం జులై 16న ప్రకటించిన ప్రధానమంత్రి ధనధాన్య కృషి యోజన కింద ఆంధ్రప్రదేశ్‌ నుంచి అల్లూరిసీతారామరాజు (ఏఎస్‌ఆర్‌), శ్రీ సత్యసాయి, అనంతపురం, అన్నమయ్య జిల్లాలను ఎంపిక చేశారు. వీటికి నోడల్‌ అధికారులుగా నలుగురు ఐఏఎస్‌ అధికారులను నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. ఇందులో ఏఎస్‌ఆర్‌ జిల్లాకు కేంద్ర ఆర్థిక వ్యవహారాల సంయుక్త కార్యదర్శి అమిత్‌సింగ్లా (ఏజీఎంయూటీ కేడర్‌), శ్రీసత్యసాయి జిల్లాకు సహకారశాఖ సంయుక్త కార్యదర్శి సిద్ధార్థ్‌ జైన్‌, అనంతపురం జిల్లాకు పెట్రోలియం సహజవాయువుల శాఖ సంయుక్త కార్యదర్శి సుజాతశర్మ (ఇద్దరూ ఏపీకేడర్‌), అన్నమయ్య జిల్లాకు కార్పొరేట్‌ వ్యవహారాలశాఖ సంయుక్త కార్యదర్శి బాలమురుగన్‌ (బిహార్‌ కేడర్‌) నియమితులయ్యారు. ఈ పథకం కింద పంట మార్పిడిని ప్రోత్సహిస్తారు. సాగునీటి సౌకర్యం, పంటల సామర్థ్యం మెరుగుపరుస్తారు. రైతులకు రుణాలు అందిస్తారు. మొత్తం ఆరేళ్లకాలంలో అమలుచేస్తున్న ఈ పథకం కింద రూ.24 వేల కోట్లు ఖర్చుచేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. కేంద్రంలోని 11 మంత్రిత్వశాఖల పరిధిలో ఉన్న 36 పథకాలను సమ్మిళితంచేసి దీని కింద అమలుచేస్తారు. తద్వారా 1.7 కోట్ల మంది రైతులకు ప్రయోజనం కలుగుతుందన్నది అంచనా. ఈ పథకం కింద ఎంపికచేసిన జిల్లాల్లో వ్యవసాయ ఉత్పాదకతను పెంచడానికి వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, నీతిఆయోగ్‌ సాయంతో కలెక్టర్లు జిల్లాస్థాయి ప్రణాళికలు రూపొందించి అమలుచేస్తారు. దీని అమలుతీరు పర్యవేక్షణకోసం డిజిటల్‌ డ్యాష్‌ బోర్డు, రైతులకోసం యాప్‌, జిల్లా ర్యాంకింగ్‌ వ్యవస్థను అమల్లోకి తెస్తారు.

Read More