ఆంధ్రప్రదేశ్‌లో 30 లక్షల టన్నుల బియ్యం సేకరణకు అనుమతి

భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ) ద్వారా బియ్యం సేకరణ లక్ష్యాన్ని ఆంధ్రప్రదేశ్‌లో 30 లక్షల టన్నులకు కేంద్రం పెంచిందని ఎఫ్‌సీఐ రాష్ట్రస్థాయి సంప్రదింపుల కమిటీ చైర్మన్‌, ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు తెలిపారు. విజయవాడలోని ఎఫ్‌సీఐ కార్యాలయంలో సోమవారం ఆయన ధాన్యం సేకరణ, నిల్వ, పంపిణీ తదితర అంశాలపై సమీక్షించారు. అనంతరం విలేకరులతో మాట్లా డుతూ.. ”గతేడాది రబీలో రాష్ట్రంలో 9.33 లక్షల టన్నుల బియ్యం సేకరిం చారు. ఈ ఏడాది మరింత పెరుగుతుంది. పల్నాడు జిల్లాలో రాష్ట్ర ప్రభుత్వం స్థలం కేటాయిస్తే, గోదాములు నిర్మించేందుకు ఎఫ్‌సీఐ సంసిద్ధత తెలిపింది. ఈ గోదాముల్లో 45 మెగావాట్ల సామర్ధ్యం కలిగిన సౌర విద్యుత్తు ప్యానెల్స్‌ ఏర్పాటుకు అవకాశం ఉంది. ఎఫ్‌సీఐ ద్వారా ప్రతి నెల 1.54 లక్షల టన్నుల ఫోర్టిఫైడ్‌ బియ్యం పంపిణీ అవుతోంది” అని తెలిపారు. సమావేశంలో రాష్ట్ర గోదాముల సంస్థ చైర్మన్‌ రావి వెంకటేశ్వరరావు, రాష్ట్ర ఎఫీసీఐ జీఎం విజయ్‌కుమార్‌ యాదవ్‌, పౌరసరఫరాల అధికారులు పాల్గొన్నారు.

Read More

ధాన్యం తడిస్తే కొనుగోలు కేంద్రాల నిర్వాహకులదే బాధ్యత

తెలంగాణాలో ఖరీఫ్‌ ధాన్యం సేకరణకు సంబంధించి కొనుగోలు కేంద్రాల నిర్వాహకులకు, రైస్‌ మిల్లర్లకు మార్గదర్శకాలు జారీ అయ్యాయి. ధాన్యం కొనుగోలు, నిర్వహణ, రవాణా, లెక్కల నమోదులో అనుసరించాల్సిన నియమ నిబంధనల్ని స్పష్టం చేస్తూ జిల్లాల వారీగా ఆదేశాలు జారీ అయ్యాయి.
కౌలు రైతులు తాము సాగుచేసిన భూమి వివరాల్ని ముందుగానే వ్యవసాయశాఖ ఓపీఎంఎస్‌ లాగిన్‌లో కౌలు రైతు కింద రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలి.
కొనుగోలు కేంద్రాలు ఎత్తయిన ప్రదేశంలో రవాణాకు అనుకూలంగా ఉండాలి. సెంటర్లో ధాన్యం తడిస్తే నిర్వాహకులదే పూర్తి బాధ్యత.
సన్న ధాన్యం నింపే బస్తాలను గుర్తించేందుకు వీలుగా ఎర్రదారంతో, దొడ్డు ధాన్యం బస్తాలను ఆకుపచ్చ దారంతో కుట్టాలి. సన్నధాన్యం బస్తాలపై ‘ఎస్‌’ అనే అక్షరం రాయాలి.
రైతులు మద్దతు ధర పొందాలంటే తేమ 17% మించొద్దు. చెత్త, తాలు 1%, మట్టిపెళ్లలు, రాళ్లు 1%, చెడిపోయిన, రంగుమారిన, మొలకెత్తిన, పురుగు పట్టిన ధాన్యం 5%, పూర్తిగా తయారుకాని ధాన్యం 3% దాటొద్దు.
ఏ రోజు కొనుగోలు చేసిన ధాన్యాన్ని అదేరోజు మిల్లుకు పంపించాలి. ధాన్యం రవాణా చేసే ముందే ఓపీఎంఎస్‌ లో వివరాల్ని పీపీసీ సెంటర్‌ నిర్వాహకులు నమోదుచేయాలి.

  • దళారులు ధాన్యంకొంటే కొనుగోలు కేంద్రం నిర్వాహకులపై చర్యలుంటాయి.
Read More

నైరుతి రుతుపవనాలు రెండు రోజుల్లో నిష్క్రమణ

3,4 రోజుల్లో ‘ఈశాన్యం’ ఆగమనం
నైరుతి రుతుపవనాలు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వేగంగా నిష్క్రమిస్తున్నాయి. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌, ఉత్తర్‌ప్రదేశ్‌, బిహార్‌, ఒడిశా, పశ్చిమబెంగాల్‌, తెలంగాణ తదితర రాష్ట్రాల నుంచి సోమ, మంగళవారాల్లో నైరుతి వెనుదిరిగేందుకు పరిస్థితులు అనుకూలంగా మారాయని భారత వాతావరణ విభాగం తెలిపింది. రెండు రోజుల్లో ఆంధ్రప్రదేశ్‌ నుంచి కూడా ‘నైరుతి’ నిష్క్రమిస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. మరో మూడు, నాలుగు రోజుల్లో ఆంధ్రప్రదేశ్‌లోకి ఈశాన్య రుతు పవనాలు ప్రవేశించవచ్చని భావిస్తున్నారు. సోమ, మంగళవారాల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది.

Read More

ఆయకట్టు వివరాలు పక్కాగా అందచేయాలి

తెలంగాణా రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టుల కింద ఉన్న ఆయకట్టు వివరాలను తేడాలు లేకుండా పక్కాగా అందజేయాలని చీఫ్‌ ఇంజినీర్లకు నీటిపారుదల శాఖ సూచించింది. జిల్లా కలెక్టర్లు, సీఈలు ఇస్తున్న డేటాకు మధ్య పొంతన ఉండటం లేదని, పలు అనుమతులకు కేంద్రానికి ఆయకట్టు వివరాలు సమర్పించే సమయంలో ఇబ్బందులు వస్తున్నాయని పేర్కొంది. ఈ మేరకు ఆయకట్టు అభివృద్ధి, సాగునీటి విభాగం సీఈ రఘునాథరావు శుక్రవారం నిర్వహించిన సమీక్షలో ఈ మేరకు పలు సూచనలు చేశారు.

Read More

గేదె బరువు వెయ్యి కిలోలు

గుజరాత్‌లోని సౌరాష్ట్ర ప్రాంతంలో ఎక్కువగా కనిపించే జాఫరాబాదీ జాతి గేదెలు సాధార ణంగా 700 నుంచి 800 కిలోల బరువు ఉంటాయి. జునాగఢ్‌లోని కామధేను విశ్వవిద్యాలయ పశుసంవర్ధక కేంద్రంలో ఏడేళ్ల వయసున్న ఒక గేదె ఏకంగా వెయ్యి కిలోల బరువుతో అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ గేదె ఇటీవల ఒక దూడకు జన్మనిచ్చింది. ఎక్కువ పాలను ఉత్పత్తి చేయడం వల్ల ఇది ఆర్ధిక ప్రయోజనాలనూ అందిస్తుందని, వీటి పాలలో 11 నుంచి 14 శాతం వెన్న అదనంగా ఉంటుందని పాడి రైతులు చెబుతున్నారు.

Read More

డిజిటల్‌ అగ్రికల్చర్‌తో తెలంగాణ వ్యవసాయరంగంలో నూతన ఒరవడి

మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

పురుగుల మందుల, ఎరువుల వాడకాన్ని తగ్గే విధంగా 'ఏఐ' సాంకేతికతను వినియోగించాలి
  • తెలంగాణ రాష్ట్రం మరో పంజాబ్‌ లా కాకూడదు
  • నాణ్యమైన ఉత్పత్తులు తీసే విధంగా తెలంగాణ వ్యవసాయ విధానములో సమూలంగా మార్పులు తెచ్చే దిశలో యోచిస్తున్న తెలంగాణ ప్రభుత్వం
  • శాటిలైట్‌ డేటాతో నేలలో పోషకాల లభ్యతను పరీక్షించే సాంకేతికతను వివరించిన జర్మనీ ప్రతినిధులు
  • నేడు సెక్రటేరియట్‌లో ACRAT ప్రతినిధులతో సమావేశమై చర్చించిన మంత్రి తుమ్మల డిజిటల్‌ అగ్రికల్చర్‌తో తెలంగాణ వ్యవసాయరంగంలో నూతన ఒరవడి తేవాలని, పర్యావరణానికి మేలు చేసే స్మార్ట్‌ వ్యవసాయాన్ని ఆదర్శంగా తీసుకోవాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఈ రోజు సచివాలయంలో జర్మనీకి చెందిన ACRAT ప్రతినిధులతో జరిగిన సమావేశంలో అన్నారు. ఈ సందర్భంగా ప్రతినిధులు ”డిజిటల్‌ అగ్రికల్చర్‌ తెలంగాణ రోడ్‌మ్యాప్‌” పత్రాన్ని మంత్రివర్యులకు అందజేశారు.
    మంత్రి తుమ్మల గారు మాట్లాడుతూ.. AI, IoT ఆధారిత డిజిటల్‌ వ్యవసాయ సేవలతో ఎరువులు, పురుగుమందుల వినియోగాన్ని తగ్గించాలి. పంజాబ్‌లా మరో క్యాన్సర్‌ బెల్ట్‌గా తెలంగాణ మారకూడదు. నేల ఆరోగ్యాన్ని కాపాడే, రైతు ఆదాయాన్ని పెంచే, పర్యావరణానికి అనుకూలమైన వ్యవసాయం మన లక్ష్యం కావాలి” అన్నారు. జర్మనీ – భారత్‌ భాగస్వామ్యంతో అభివృద్ధి చేసిన ప్రపంచంలోని తొలి ITU ప్రమాణిత డిజిటల్‌ వ్యవసాయ యూజ్‌కేస్‌ను వేములవాడలో విజయవంతంగా అమలు చేసినట్లు ప్రతినిధులు వివరించారు. ఉపగ్రహ, డ్రోన్‌, మరియు సెన్సర్‌ ఆధారిత ఈ మోడల్‌ ద్వారా నేలలోని N,P,K మరియు సూక్ష్మ పోషకాల లభ్యత విశ్లేషణ చేసి, అవసరమైన ఎరువుల పరిమాణాన్ని మాత్రమే సిఫారసు చేస్తున్నామని, AI ఆధారిత పంట గుర్తింపు మోడల్‌, ఉపగ్రహ డేటాతో సబ్సిడీలు, బీమా, రుణాల పారదర్శక పంపిణీ వంటి అంశాలను కూడా మంత్రికి వివరించారు. సమగ్ర డిజిటల్‌ వ్యవసాయ ప్లాట్‌ఫార్మ్‌ను రూపొందించి, రైతులు, పరిశోధకులు మరియు విద్యార్థులు, అందరూ ఉపయోగించుకోగల వేదికగా అభివృద్ధి చేయాలని మంత్రి గారు సూచించారు. ”ఈ సాంకేతికత రైతుల వ్యయాన్ని తగ్గించేలా, నేల ఆరోగ్యాన్ని కాపాడేలా మరియు పంట నాణ్యతను పెంచేలా ఉండాలన్నారు. ”రైతు ఆలోచన దిశగా వ్యవసాయ విధానాలు రూపకల్పన చేస్తేనే స్థిరమైన, సురక్షితమైన భవిష్యత్తు సాధ్యమవుతుంది” అని మంత్రి అభిప్రాయపడ్డారు. ఈ సమావేశంలో డా. గోపి డైరెక్టర్‌, వ్యవసాయ శాఖ, డా రఘు చాలిగంటి (ITU-T SG20), డా. సెబాస్టియన్‌ బోసె (ఫ్రాన్హోఫర్‌ హెచెచ్‌ఐ), శ్రీ యాన్‌-క్రిస్టియన్‌ రెడ్‌లిచ్‌ (బాండ్‌ కన్సల్టింగ్‌ GmbH), ప్రొఫెసర్‌ జానయ్య గారు (వైస్‌ ఛాన్సలర్‌, పీజేటీఎస్‌ఏయూ), మరియు రమేశ్‌ రెడ్డి (చైర్మన్‌, పర్యాటక శాఖ) పాల్గొన్నారు.
Read More

జన్యువుల వృద్ధితో వేరుశనగ పంట దిగుబడి పెరిగింది

పంటలో జన్యువులు వృద్ధి కారణంగా వేరుశనగ దిగుబడిలో ప్రతి యేటా పెరుగుదల కనిపిస్తోందని అంతర్జాతీయ మెట్టప్రాంతాల పంటల పరిశోధనా సంస్థ (ఇక్రిశాట్‌) అధ్యయనంలో వెల్లడైంది. భారత్‌తోపాటు వివిధ ఆసియా, ఆఫ్రికా దేశాల్లోని స్పానింగ్‌బంచ్‌, వర్జీనియాబంచ్‌ అనే రెండు ప్రధాన రకాలలో కాయ దిగుబడి, గింజ శాతం, గింజ బరువు ప్రాతిపదికన రెండేళ్లలో నాలుగు పంట సీజన్లలో విస్తృత పరిశోధనలు చేసిన శాస్త్రవేత్తల బృందం ఈ విషయం తేల్చింది. మూడు నుంచి నాలుగు నెలల కాలంలో పండే పంటకు యేటా హెక్టారుకు సుమారు 27 కిలోలు.. ఆరు నెలల్లో కాతకొచ్చే రకాల్లో హెక్టారుకు 25 కిలోల దిగుబడి పెరుగుదలను శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇక్రిశాట్‌ గత 20 ఏళ్లలో 240 వేరుశనగ రకాలను అభివృద్ధి చేసింది. కంప్యూటెడ్‌ టోమోగ్రఫీ, జన్యు ఎంపికల వంటి అధునాతన సాధనలతో పరిశోధనలు జరిపి, మరిన్ని మెరుగైన ఫలితాలు సాధిస్తామని ఇక్రిశాట్‌ డైరెక్టర్‌ జనరల్‌ హిమాన్ష్‌ పాఠక్‌ తెలిపారు.

Read More

జీలుగ బెల్లం, నీరా తయారీకి ప్రోత్సాహం

జీలుగ బెల్లం, నీరా తయారీకి ప్రోత్సాహంజీలుగ బెల్లం, నీరా తయారీని ప్రోత్సహించి అరకు కాఫీ మాదిరిగా గుర్తింపు తీసుకురావాలని ఆంధ్రప్రదేశ్‌ సీఎం చంద్రబాబు ఆదేశించినట్లు పందిరిమామిడి ఉద్యాన పరిశోధన స్థానం అధిపతి, సీనియర్‌ శాస్త్రవేత్త డాక్టరు వెంగయ్య తెలిపారు. హెచ్‌ఐర్‌ ఎస్‌ శాస్త్రవేత్తలు, డాక్టరు వైఎస్సార్‌ ఉద్యాన విశ్వవిద్యాలయం పరిశోధన సంచాలకులు డాక్టరు మధుమతితో జీలుగ నీరా, బెల్లం తయారీపై గురువారం అమరావతిలో సీఎం సమీక్ష జరిపారు.

Read More

తెలంగాణ రాష్ట్ర ఉద్యాన అభివృద్ధి ప్రణాళిక-2035’ను ఆవిష్కరించిన ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌ రెడ్డి

శ్రీ కొండా లక్ష్మణ్‌ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం రూపొందించిన ‘తెలంగాణ రాష్ట్ర ఉద్యాన అభివృద్ధి ప్రణాళిక-2035’ను ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌ రెడ్డి ఆవిష్కరించారు. ఉద్యాన పంటల ఉత్పత్తిని పెంచేందుకు 2035 వరకు అనుసరించాల్సిన లక్ష్యాలను ఈ ప్రణాళికలో నిర్ధేశించారు. వచ్చే పది సంవత్సరాలలో అనుసరించాల్సిన అభివృద్ధి ప్రణాళిక ఇది.
డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి ఈ ప్రణాళికను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు, ఉద్యాన విశ్వవిద్యాలయం వైస్‌చాన్సలర్‌ డి. రాజిరెడ్డి మరియు అధికారులు పాల్గొన్నారు. రాబోయే ఐదు సంవత్సరాల్లో 1.32 లక్షల ఎకరాల్లో పండ్ల తోటలు, 2.45 లక్షల ఎకరాల్లో కూరగాయల పంటల విస్తీర్ణం, దిగుబడులు, ఉత్పత్తిని పెంచడం లక్ష్యంగా ప్రణాళికలో నిర్ధేశించారు. వచ్చే ఐదు సంవత్సరాల్లో రూ. 921.40 కోట్లు సాగు పెట్టుబడిగా, అలాగే రూ. 942.50 కోట్లు డ్రిప్‌ కోసం పెట్టుబడిగా కేటాయిస్తే, ఒక్క రూపాయి పెట్టుబడికి నాలుగు రూపాయల లాభం పొందే అవకాశం ఉందని ప్రణాళిక పేర్కొంది. ఉద్యాన విశ్వవిద్యాలయం రూపొందించిన రకాలు, సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రస్తుత విస్తీర్ణంలో అమలు చేయడం వల్ల ఏటా రూ. 1,341 కోట్ల ఉత్పత్తి విలువను సాధించవచ్చని అంచనా వేసింది.
వివిధ పంటల్లో మిగులు, ఉత్పత్తి లోటు ప్రాతిపదికగా కార్యాచరణను అమలు చేయాలని, మిగులు ఉత్పత్తి ఉన్న పంటలు, లోటు ఉత్పత్తి ఉన్న పంటలు గుర్తించి, వాటికి అనుగుణంగా విస్తీర్ణం పెంచడం, ఉత్పాదకత సామర్థ్యాన్ని అభివృద్ధి చేయడం, పంట యాజమాన్యం, మార్కెటింగ్‌ వంటి అంశాలను ప్రణాళికలో సమగ్రంగా వివరించారు.
ప్రణాళికలోని ప్రధాన అంశాలు
విస్తీర్ణం పెంచడం: పండ్లు, కూరగాయలలో విస్తీర్ణం పెంచడానికి అనువైన జిల్లాలను నేల స్వభావం, వాతావరణ పరిస్థితులను పరిగణలోకి తీసుకొని ఉద్యాన విశ్వవిద్యాలయం ఎంపిక చేసింది. పండ్ల పంటలలో జామ, బొప్పాయి, అరటి, సపోటా, దానిమ్మ, డ్రాగన్‌ ఫ్రూట్‌ (కమలం పండు). ద్రాక్ష, ఖర్జూరం అంజీర్‌, నేరేడు, ఉసిరి మరియు సీతాఫలం 1.32 లక్షల ఎకరాలలో 2030 వరకు అనువైనవిగా నిర్ధారించిన జిల్లాలలో విస్తీర్ణం పెంచుకోవచ్చు. కూరగాయలలో 2030కు 2.45 లక్షల ఎకరాలలో అనువైనవిగా నిర్ధారించిన జిల్లాలలో టమాటో, వంగ, క్యారెట్‌, క్యాబేజ్‌, దోస, కాలిఫ్లవర్‌, ముల్లంగి, ఉల్లి, ఆలుగడ్డ, ఆకుకూరలు, బీర, సొర, మిరప, బెండ, కాకర మరియు చిక్కుడు పంటల విస్తీర్ణం పెంచడానికి కృషి చేయాలి. ఆఫ్‌ సీజన్‌ కూరగాయలు పెంపకంపై విశ్వవిద్యాలయం తయారు చేసిన ప్రణాళిక అమలుపరచాలి. సంవత్సరం పొడుగునా కూరగాయల లభ్యతకు, వివిధ వ్యవధుల్లో కూరగాయల సాగు, షేడ్‌ నెట్లో, రక్షిత వసతులలో కూరగాయలు పెంచడం వంటి పద్ధతులను అవలంబించాలి.
ఉత్పాదకత పెంచడం: ఉద్యాన విశ్వవిద్యాలయం పెంపొందించిన సాంకేతికతను పండ్లు, కూరగాయలు, ఔషధ మరియు సుగంధ ద్రవ్యాల పంటలలో అమలుపరిచి అధిక దిగుబడి పొందేందుకు ప్రయత్నం చేయాలి. పంట నష్టాలను తగ్గించడానికి వాతావరణ ఆధారిత సూచనలు సమయానుకూలంగా విడుదల చేయాలి. ప్రతి మండలంలో వ్యవసాయ యంత్రాల కొరకు కనీసం ఒక కస్టమ్‌ హైరింగ్‌ సెంటర్‌ను ఏర్పాటు చేయడం ద్వారా రైతులు సకాలంలో సాగు పనులు పూర్తి చేయగలిగి నష్టాలను తగ్గించు కోగలుగుతారు. ఉద్యాన అధికారులు, విస్తరణ అధికారులు, శాస్త్రవేత్తలు మరియు రైతులు నైపుణ్యాలను పెంపొందించే కార్యక్రమాలను రూపొందించి అమలు చేయాలి.
కోతానంతర పంట యాజమాన్యం: కోత అనంతరం పంట నష్టం తగ్గించడానికి కావలసిన శీతల నిల్వ గిడ్డంగులు, పండ్లను మాగబెట్టే కేంద్రాలు, నిల్వ వసతులతో మార్కెటింగ్‌ యార్డ్‌, శీతల రవాణా వంటి మౌలిక వసతులు కల్పించాలి. ఉల్లి పండించే ప్రాంతాలలో తక్కువ ఖర్చుతో నిల్వ సదుపాయాలు కల్పించాలి. ఎగుమతులు ప్రోత్సహించడానికి హైదరాబాదులోని అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో తగిన మౌలిక సదుపాయాలతో సమీకృత ప్యాక్‌ హౌస్‌ ఏర్పాటు చేయాలి. నాణ్యత పెంచడం, నిల్వ మరియు కోతానంతర పంటల నిర్వహణ, పురుగుమందు అవశేషాలు లేని ఉత్పత్తి, నిల్వకాలం పెంచడం, విలువ జోడింపు పై పరిశోధనలు విస్తృతం చేయాలి.
మార్కెటింగ్‌: రైతు ఉత్పత్తి సంఘాల ద్వారా సామూహిక క్రయవిక్రయాలను, పంట సాగు మరియు కోతానంతర పంట యాజమాన్యంలో సామూహిక కార్యకలాపాలను ప్రోత్సహించాలి. తెలంగాణ ప్రభుత్వం మొదలుపెట్టిన వ్యవసాయ మార్కెట్‌ యార్డులలో పండ్లు, కూరగాయల క్రయవిక్రయాలను సక్రమంగా అమలుపరిచేలా చర్యలు చేపట్టాలి, ఉద్యాన పంటల ధరల ముందస్తు సూచనలపై మార్కెటింగ్‌ ఇంటెలిజెన్స్‌ కేంద్రాన్ని ఉద్యాన విశ్వవిద్యాలయం, వ్యవసాయ మార్కెటింగ్‌ శాఖ కలిసి నిర్వహించేలా శ్రీ కొండా లక్ష్మణ్‌ తెలంగాణ ఉద్యాన విశ్వ విద్యాలయంలో నెలకొల్పాలి. ఈ సూచనలు రైతులకు సకాలంలో అందాలి.


ఈ ప్రణాళిక పుస్తకాన్ని డాక్టర్‌ డి. రాజి రెడ్డి, డాక్టర్‌ ఎ. భగవాన్‌, డాక్టర్‌ జి.పి. సునందిని రూపొందించారు.

Read More

ఆంధ్రప్రదేశ్‌లో నాలుగు సాగునీటి ప్రాజెక్టులకు నిధులు మంజూరు

ఆంధ్రప్రదేశ్‌లో రూ.136.29 కోట్లతో రెండు ఎత్తిపోతల పథకాలకు, మరో రెండు డ్యాంల మరమ్మతులకు పనులు చేపట్టేందుకు జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్‌ బుధవారం ఉత్తర్వులు ఇచ్చారు. అనంతపురంలోని హంద్రీనీవా నుంచి ఉరవకొండ నియోజకవర్గంలో ఎత్తయిన ప్రాంతాల్లోని ఆయకట్టుకు నీటిని ఎత్తిపోసేందుకు, అక్కడ డిస్ట్రిబ్యూటరీల పనులు పూర్తి చేసేందుకు ఆమోదం తెలియజేశారు. వజ్రకరూరు మండలంలో నీటిని ఎత్తిపోసేందుకు రాగులపాడు గ్రామం వద్ద కొట్టాలపల్లి ఎత్తిపోతలను నిర్మించనున్నారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. కొత్తగా స్లూయిస్ల నిర్మాణం, నూతన కట్టడాలతో పాటు వరద కట్ట, రోడ్డు నిర్మించాలని నిర్ణయించిన నేపథ్యంలో.. నెల్లూరులోని డి. వి.సత్రం, సూళ్లూరుపేట, తడ మండలాల్లోని కాళింగ వరద కట్టల నిర్మాణానికి గతంలో అప్పగించిన ప్యాకేజీకి సంబంధించిన రెండు పనులను ముందస్తుగా ముగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది.


ప్రాజెక్టు కొత్త నిర్మాణం/మరమ్మతులు మంజూరు చేసిన మొత్తం (రూపాయల్లో)
అమిద్యాల ఎత్తిపోతల నిర్మాణం 72,30,00,000
కొట్టాలపల్లి ఎత్తిపోతల నిర్మాణం 55.60.00.000
మైలవరం డ్యాం గేట్ల బలోపేతం, ఇతర మరమ్మతులు 3,19,48,000
మిడ్‌ పెన్నార్‌ డ్యాం రేడియల్‌ గేట్ల మరమ్మతులు, ఇతర పనులు 5,20,00,000
మొత్తం 136,29,48,000

Read More