ఎర్రచందనం రైతులకు రూ.3 కోట్లు

‘యాక్సెస్‌ అండ్‌ బెనిఫిట్‌ షేరింగ్‌ ఫ్రేమ్‌ వర్క్‌’ కింద ఆంధ్రప్రదేశ్‌లో ఎర్రచందనం పండిస్తున్న 198 మంది రైతులతోపాటు ఆంధ్ర యూనివర్సిటీకి రూ.3 కోట్లు విడుదల చేస్తున్నట్లు జాతీయ జీవవైవిధ్య ప్రాధికార సంస్థ (ఎన్‌బిఏ) ప్రకటించింది. ఎర్రచందనం పరిమాణాన్ని బట్టి ఇందులో ఒక్కో రైతుకు రూ. 33 వేల నుంచి రూ. 22 లక్షల దాకా అందుతుందని తెలిపింది. జీవవైవిధ్య సంరక్షణ కోసం గతంలో ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక అటవీ శాఖలు, ఆంధ్రప్రదేశ్‌ జీవవైవిధ్య మండళ్లకు రూ.48 కోట్లు, తమిళనాడు రైతులకు రూ.55 లక్షలు విడుదల చేసినట్లు ఎన్‌.బి.ఏ. వెల్లడించింది. ప్రస్తుతం ఏపీకి విడుదల చేసిన రూ. 3 కోట్ల మొత్తం చిత్తూరు, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు, తిరుపతి, వైఎస్సార్‌ కడప జిల్లాల్లోని 48 గ్రామాల్లో ఉన్న 198 మంది రైతులకు వెళ్తుందని తెలిపింది.

Read More

మక్కల కొనుగోలు పరిమితి ఎకరానికి 25 క్వింటాళ్ళు

తెలంగాణలో మద్దతు ధరలతో మొక్కజొన్న కొనుగోలు పరిమితిని పెంచుతూ ఎకరానికి 25 క్వింటాళ్ల వరకు పెంచేందుకు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అనుమతించారు. దీనికి అనుగుణంగా ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది.గతంలో ఎకరానికి 18 క్వింటాళ్ల వరకే కొనుగోలు పరిమితి ఉంది. పలు జిల్లాల్లో పరిమితికి మించి రైతులు మక్కలను తీసుకురాగా.. అధికారులు వాటిని నిరాకరించారు. దీనిని ప్రజాప్రతినిధులు, రైతులు రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిమితి పెంచాలని కోరారు. మక్కలను కేంద్రం ప్రభుత్వం కొనుగోలు చేయడం లేదు. దీంతో రాష్ట్ర ప్రభుత్వమే మార్క్‌ఫెడ్‌ ద్వారా వీటిని కొనుగోలు చేయిస్తోంది. ఇప్పటికే రూ.2400 కోట్ల మేరకు కొనుగోళ్లకు వెచ్చించింది.

Read More

తల్లి వర్ధంతి సందర్భంగా రైతుల అప్పు తీర్చిన బాబూభాయ్‌

గుజరాత్‌లోని సూరత్‌కు చెందిన వ్యాపార వేత్త బాబూభాయ్‌ జిరావాలా (ఛాద్వాడియా).. తన తల్లి వర్ధంతి సందర్భంగా 290 మంది రైతుల అప్పులను తీర్చారు. మొత్తం రూ. 89,89,209 ను ఆయన రైతులకు అందజేశారు. ఈ రుణ సమస్య అమ్రేలీ జిల్లాలోని జిరా గ్రామస్థులను 1995 నుంచీ వేధిస్తోంది. 290 మంది రైతులు ఎంత రుణం తీర్చినా ఇంకా మిగిలిపోతోంది. దీనికి శాశ్వత పరిష్కారంగా బాబూ భాయ్‌.. రుణాన్ని తీర్చాలని నిర్ణయించి తీర్చేశారు.

Read More

బొప్పాయి పాలు.. రైతులకు ఆదాయ వనరు

ఆంధ్రప్రదేశ్‌ లోని నంద్యాల జిల్లా చిన్నవంగలితో పాటు సమీపంలోని గ్రామాలైన వైఎస్సార్‌ కడప జిల్లా కానగూడూరు, క్రిష్ణంపల్లె గ్రామాల్లో రైతులు అధికంగా బొప్పాయి సాగు చేస్తుంటారు. మొక్క నాటిన కాలం నుంచి తొమ్మిది నెలలకు పంట చేతికొస్తుంది. పండ్ల సేకరణ అనంతరం 13 నెలల తర్వాత మిగిలినవి, ముదురు కాయలకు గాట్లు పెట్టి పాలను సేకరిస్తున్నారు. తెల్లవారుజాము సమయంలోనే కాయలకు గాట్లు పెడితే కేవలం రెండు గంటల్లోనే పాలు ఊరుతాయి. ఇలా సేకరించిన పాలను రాయచోటి, రాజంపేటకు చెందిన వ్యాపారులు రైతుల నుంచి కొనుగోలు చేస్తున్నారు. 20 లీటర్ల పాలు రూ.6 వేలకు విక్రయిస్తున్నారు. సేకరించిన పాలను పరిశ్రమల్లో మందులు, కాస్మోటిక్స్‌, సబ్బుల తయారీలో ఉపయోగిస్తున్నారు. బెంగళూరు, చెన్నైతో పాటు నాణ్యతను బట్టి విదేశాలకు సైతం పాలను ఎగుమతి చేస్తున్నారు.

Read More

ఎకరానికి ఏడు క్వింటాళ్ళు మాత్రమే అన్న నిబంధనను సీసీఐ ఎత్తివేయాలి

కేంద్ర ప్రభుత్వం వెంటనే ఎకరానికి ఏడు క్వింటాళ్ల పత్తినే కొనుగోలు చేయాలనే సీసీఐ నిబంధనను ఎత్తివేయాలని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు డిమాండ్‌ చేశారు. 20 తేమ శాతం ఉన్నా కొనాలని కోరారు. ఈ మేరకు కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్‌ సింగ్‌కు, సీసీఐ ఎండీ లలిత్‌ కుమార్‌ గుప్తాలకు సోమవారం ఆయన లేఖ రాశారు. ”అమెరికా ఒత్తిళ్లకు తలొగ్గి… దిగుమతి సుంకాలు ఎత్తి వేయడం వల్ల పత్తి రైతులకు మార్కెట్లో గిట్టుబాటు ధర లభించడం లేదు. ఈ తరుణంలో కేంద్రం అసంబద్ద ఆంక్షలతో వారిని ఇబ్బందులకు గురిచేస్తోంది. కిసాన్‌ కపాస్‌ యాప్‌లో నమోదు, జిన్నింగ్‌ మిల్లులను ఎల్‌1, ఎల్‌2గా విభజించడం, తేమ శాతాన్ని 8-12కు పరిమితం చేయడం సమస్యగా మారింది. రాష్ట్రంలో ఎకరానికి 15 క్వింటాళ్ల దిగుబడి వస్తోంది. ఈ సీజన్‌లో ఇప్పటికే సీసీఐ ఒక్కో రైతు నుంచి ఎకరానికి 12 క్వింటాళ్ల చొప్పున కొనుగోలు చేసింది. ఈ తరుణంలో 7 క్వింటాళ్ల కంటే ఎక్కువ కొనవద్దంటూ కొనుగోలు కేంద్రాల అధికారులను సీసీఐ ఆదేశించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ నిబంధనను వెంటనే ఎత్తివేయాలి. రైతులతో పాటు జిన్నింగ్‌ మిల్లర్ల సమస్యలను పరిష్కరించాలి” అని లేఖలో తుమ్మల కోరారు.

Read More

పకడ్బందీగా కొత్త విత్తన చట్టం-2025

తెలంగాణా రైతులకు అన్ని విధాలుగా న్యాయం జరిగేలా కొత్త విత్తన చట్టం-2025 ముసాయిదాను పకడ్బందీగా రూపొందించాలని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు సూచించారు. ఆదివారం సచివాలయంలో కొత్త విత్తన చట్టం ముసాయిదా రూపకల్పన కమిటీతో తుమ్మల సమావేశమయ్యారు. వ్యవసాయ శాఖ సంచాలకుడు గోపి, విత్తనాభివృద్ధి సంస్థ ఛైర్మన్‌ అన్వేష్‌ రెడ్డి, ముసాయిదా కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ‘నాణ్యమైన విత్తనోత్పత్తికి కంపెనీలను ప్రోత్సహించేలా, మోసం చేసే వాటి పట్ల కఠినంగా వ్యవహరించేలా ముసాయిదా రూపొందించాలి. అది న్యాయ సమీక్షకు అనుగుణంగా ఉండాలి. పంట నష్టపోయే రైతులకు సంపూర్ణ పరిహారం అందేలా చొరవ చూపాలన్నారు. కొత్త విత్తన చట్టం రూపకల్పన అనంతరం అవసరమైతే కేంద్ర ప్రభుత్వం ఆమోదానికి పంపుతాం’ అని తుమ్మల పేర్కొన్నారు. కమిటీ సభ్యులు మాట్లాడుతూ.. ‘విత్తన రైతులకు రుణ సౌకర్యం, సాంకేతిక శిక్షణ వంటి అంశాలను జోడించాలి. విత్తనోత్పత్తి సంఘాల ఏర్పాటు, లైసెన్సు కలిగిన సంస్థలకే విక్రయ అనుమతివ్వాలి. రైతు, ఆర్గనైజర్‌, కంపెనీల మధ్య త్రైపాక్షిక ఒప్పందం ఉండాలి’ అని సూచించారు.

Read More

తెలంగాణ ఉద్యాన స్టాలుకు ప్రథమ బహుమతి

అక్టోబరు 29 నుంచి నవంబరు 2 వరకు ఉత్తర్‌ప్రదేశ్‌లోని ముజఫర్‌ నగర్‌లో జరిగిన రాష్ట్రీయ కృషి ప్రగతి ఉద్యాన ప్రదర్శనలో తెలంగాణ ఉద్యానశాఖ స్టాల్‌కు ప్రథమ బహుమతి లభించింది. ఈ ప్రదర్శనలో 20 రాష్ట్రాలు స్టాళ్లను ఏర్పాటు చేశాయి. అందులో కూరగాయలు, పండ్లు, సుగంధద్రవ్యాల ఉత్పత్తులు, వాటి ఉపయోగాలను వివరిస్తూ రాష్ట్ర ఉద్యానశాఖ స్టాల్‌ను ఏర్పాటు చేసింది. ప్రదర్శన చివరి రోజు ప్రథమ బహుమతికి ఎంపిక చేసి, కేంద్ర సహాయ మంత్రి ఎస్పీ సింగ్‌ రాష్ట్ర ఉద్యాన అధికారులకు జ్ఞాపికను బహూకరించారు.

Read More

ఆంధ్రప్రదేశ్‌లో పంట నష్టం జాబితాలపై గ్రామస్థాయిలో సామాజిక తనిఖీ

గ్రామస్థాయిలో పంటనష్టం నమోదు జాబితాలను సామాజిక తనిఖీకి సిద్ధంగా ఉంచాలని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యవసాయశాఖ డైరెక్టర్‌ మనజీర్‌ జిలానీ మండల వ్యవసాయ అధికారుల్ని ఆదేశించారు. పంట నష్టపోయిన ప్రతి రైతు వివరాలు జాబితాలో ఉండాలని, వారి నుంచి వినతులు తీసుకోవాలని సూచించారు.

Read More

పిజెటిఏయు, వెస్టర్న్‌ సిడ్నీ యూనివర్సిటీల మధ్య కీలక ఒప్పందం

ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉపకులపతి ప్రొఫెసర్‌ అల్దాస్‌ జానయ్య నేతృత్వంలో విశ్వవిద్యాలయం డీన్స్‌ బృందం సిడ్నీలోని వెస్టర్న్‌ సిడ్నీ విశ్వవిద్యాలయాన్ని నేడు సందర్శించింది. డబ్ల్యుఎస్‌యు ఉపకులపతి, ప్రెసిడెంట్‌ జార్జ్‌ విలియం ఏవో, ఇతర అధికారులతో పిజెటిఏయు బృందం అనేక అంశాలపై విస్తృత చర్చలు జరిపింది. బిఎస్సీ (అగ్రికల్చర్‌) కోర్సుని సంయుక్తంగా అందించేందుకు వీలు కల్పించే కీలక ఒప్పందంపై రెండు విశ్వవిద్యాలయాల ఉపకులపతులు సంతకాలు చేశారు. దేశంలోనే తొలిసారిగా అందించే ఈ నాలుగేళ్ల సంయుక్త కోర్సులో విద్యార్థులు మూడేళ్లు రాజేంద్రనగర్‌ లోని కళాశాలలోనూ, మరో ఏడాది డబ్ల్యుఎస్‌యు లోనూ విద్యను అభ్యసించే అవకాశం ఈ ఒప్పందం ద్వారా కలుగుతుంది. సుమారు 40 మంది తెలంగాణ విద్యార్థులు ఏడాది పాటు డబ్ల్యుఎస్‌యులో చదువుకునే అవకాశాన్ని ఈ ఒప్పందం కల్పించనుందని పిజెటిఏయు ఉపకులపతి అల్దాస్‌ జానయ్య తెలిపారు. అదే విధంగా ఆసక్తి కలిగిన విద్యార్థులు మరో ఏడాది చదివి ఎంఎస్సీ డిగ్రీ పొందే అవకాశం ఉందని జానయ్య ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పిజెటిఏయులో చేపట్టిన వివిధ సంస్కరణల్లో భాగంగా ఈ ఒప్పందం ద్వారా విద్య, పరిశోధన విభాగాల్ని ప్రముఖ అంతర్జాతీయ సంస్థలతో అనుసంధానించి సంయుక్త పరిశోధనలు చేపట్టే అవకాశం కలుగుతుందని జానయ్య వివరించారు. ఈ సంయుక్త డిగ్రీ కోర్సులో ఇప్పటికే 25 మంది విద్యార్థులు చేరారని త్వరలో మరో 10 మంది చేరడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. సెల్ఫ్‌ ఫైనాన్స్‌ విధానంలో ఈ కోర్సుని నిర్వహించనున్నట్లు జానయ్య తెలిపారు. అదేవిధంగా పిజెటిఏయు అధికారుల బృందం డబ్ల్యుఎస్‌యు లోని వివిధ అధునాతన ప్రయోగశాలల్ని, పరిశోధనా విభాగాల్ని సందర్శించింది. వ్యవసాయ రంగంలో అగ్రి రోబోటిక్స్‌, ఆర్టిఫిషియల్‌ ఇంటలిజెన్స్‌ ఆధారిత పరిశోధనలకు సంబంధించి కూడా రెండు విశ్వవిద్యాలయాల మధ్య అవగాహన కుదిరిందని అల్దాస్‌ జానయ్య వివరించారు. ఈ కార్యక్రమంలో డబ్ల్యుఎస్‌యు ఉపకులపతి, ప్రెసిడెంట్‌ జార్జ్‌ విలియం ఏవో, ప్రొ. విసి ప్రొఫెసర్‌ ఇయాన్‌ అండర్సన్‌ (రీసెర్చ్‌ అండ్‌ ఎంటర్‌ ప్రెజ్‌), ప్రొ. విసి (ఎడ్యుకేషనల్‌ పార్టర్న్‌ షిప్స్‌ అండ్‌ క్వాలిటీ) డాక్టర్‌ నికోలెన్‌ ముర్డోఖ్‌, పిజెటిఏయు ఉపకులపతి ప్రొఫెసర్‌ అల్దాస్‌ జానయ్య, డీన్‌ ఆఫ్‌ అగ్రికల్చర్‌ డాక్టర్‌ కె. ఝాన్సీ రాణి, పరిశోధన సంచాలకులు డాక్టర్‌ మరాఠి బలరాం, విద్యార్థి వ్యవహారాల డీన్‌ డాక్టర్‌ సీహెచ్‌. వేణుగోపాల్‌ రెడ్డి, అగ్రికల్చరల్‌ ఇంజనీరింగ్‌ టెక్నాలజీ డీన్‌ డాక్టర్‌ కెవి రమణరావు, డీన్‌ ఆఫ్‌ పీజీ స్టడీస్‌ డాక్టర్‌ కెబి ఈశ్వరిలు పాల్గొన్నారు.

Read More

పంట నష్ట అంచనాను పారదర్శకంగా చేపట్టాలి

ఆంధ్రప్రదేశ్‌లో మొంథా తుపాను వల్ల జరిగిన పంట నష్టం అంచనాను పారదర్శకంగా చేపట్టాలని, ఏపీ ఎయిమ్స్‌ పంట నమోదు యాప్‌ ద్వారా మాత్రమే పంట నష్టాన్ని అంచనా వేయాలని వ్యవసాయశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బుడితి రాజశేఖర్‌ తెలిపారు. పంట నష్ట నమోదు నుంచి జియో కోఆర్డినేట్‌, క్షేత్రస్థాయి ఫొటోలు అప్‌లోడ్‌ను ప్రభుత్వం మినహాయించినట్లు ఆయన చెప్పారు. ఈ-పంటలో నమోదైన వాస్తవ సాగుదారులనే నమోదు చేయాలన్నారు.

Read More