ఆంధ్రప్రదేశ్‌లో మూడు వ్యవసాయ ప్రయోగశాలలకు ఎన్‌ఏబీఎల్‌ గుర్తింపు

ఎన్‌ఏబీఎల్‌ (నేషనల్‌ అక్రెడిటేషన్‌ బోర్డ్‌ ఫర్‌ టెస్టింగ్‌ అండ్‌ కాలిబ్రేషన్‌ లాబొరేటరీస్‌) గుర్తింపు వ్యవసాయశాఖ ఆధ్వర్యంలోని మూడు ప్రయోగశాలలకు లభించింది. నెల్లూరులోని జీవ, సేంద్రియ ఎరువుల నాణ్యత నియంత్రణ ప్రయోగశాల, బాపట్లలోని ఎరువుల నియంత్రణ ప్రయోగశాల, కర్నూలులోని పురుగుమందుల పరీక్ష కేంద్ర ప్రయోగశాలలకు ఈ గుర్తింపు దక్కింది. వ్యవసాయరంగంలో నాణ్యతా ప్రమాణాలను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో వీటికి ఈ గుర్తింపు లభించిందని వ్యవసాయశాఖ డైరెక్టర్‌ ఢిల్లీరావు తెలిపారు. ఈ సందర్భంగా సిబ్బందిని ఆయన అభినందించారు. మిగిలిన అన్ని ప్రయోగశాలలకూ ఎన్‌ఏబీఎల్‌ గుర్తింపు తెచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలియచేశారు.

Read More

ఆశ’ కంది రకంలో చిగురు ముడత తెగులును నిరోధించే జన్యువు!

కంది, పెసర, మినుములు, చిక్కుడు వంటి పప్పు జాతి పంటల్లో ఆశించే చిగురు ముడత తెగులు(స్టెరిలిటీ మెజాయిక్‌ డిసీజ్‌)ను నిరోధించే జన్యువును ‘ఆశ’ కందిలో ఇక్రిశాట్‌ శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ తెగులు సోకితే మొక్కలలో ఆకులు కుంచించుకుపోయి కాత, పూత ఉండదు. దీనిపై సీనియర్‌ శాస్త్రవేత్త మనీశ్‌ పాండే నేతృత్వంలో గంగశెట్టి ప్రకాశ్‌, ఇతర శాస్త్రవేత్తలు విస్తృతస్థాయిలో పరిశోధనలు చేశారు. ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పల్సెస్‌ రీసెర్చ్‌ (యూపీ), డాక్టర్‌ రాజేంద్రప్రసాద్‌ సెంట్రల్‌ అగ్రికల్చరల్‌ యూనివర్సిటీ(బిహార్‌), ఇండియన్‌ అగ్రికల్చరల్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌(అస్సాం)ల సహకారంతో కంది సంప్రదాయ రకాలైన ‘ఆశ, మారుతి’లపై ప్రయోగాలు జరిపి… చివరికి ‘ఆశ’ రకంలో ఈ తెగులును నిరోధించే జన్యువును గుర్తించి దానికి సీసీఎస్‌ఎండీ 04 అని పేరు పెట్టారు. మరోవైపు మారుతి రకంలో ఈ జన్యువు లేక పోవడంతో అది తెగులు బారిన పడుతుందని గ్రహించారు. దీంతో సీసీఎస్‌ఎండీ 04 జన్యువుపై మరిన్ని పరిశోధనలు చేసి తక్కువ కాలంలో సాగయ్యే సరికొత్త వంగడాన్ని రూపొందించాలని భావిస్తున్నారు.

Read More

దేశ ఆహార భద్రతను స్వామినాథన్‌ తన జీవిత లక్ష్యంగా చేసుకున్నారు

మన వ్యవసాయ రంగం పోషకాహార భద్రత, పంటల్లో భిన్నత్వం, వాతావరణాన్ని తట్టు కునే పంటలు, టెక్నాలజీలు ఈ నాలుగు చతుర్విధ లక్ష్యాలతో ముందుకు సాగాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. హరిత విప్లవ పితామహుడు, వ్యవసాయ శాస్త్రవేత్త డా. ఎం.ఎస్‌. స్వామినాథన్‌ శత జయంతి సందర్భంగా గురువారం ఢిల్లీలో నిర్వహించిన అంతర్జాతీయ సదస్సులో ప్రధాని పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వామినాథన్‌కు నివాళిగా ప్రత్యేక నాణేన్ని, పోస్టల్‌ స్టాంపును విడుదల చేశారు. ‘వ్యవసాయ రంగంలో కృత్రిమ మేధను, మెషీన్‌ లెర్నింగ్‌ను ఉపయోగించుకుని కరవును, వేడిని, వరదలను తట్టుకునే పంటలను అభివృద్ధి చేయాలి. రియల్‌ టైమ్‌లో నిర్ణయాలు తీసుకునే వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలి. దీనిని ప్రతి జిల్లాలో అందుబాటులోకి తేవాలి. తద్వారా పంటల దిగుబడిని, తెగుళ్ల నివారణను, సాగు విధానాలను పర్యవేక్షించాలి. భూములకు సరిపడే పంటలను నిర్ణయించాలి. పంటల మార్పిడిపై పరిశోధనలు జరగాలి. సౌర విద్యుత్తు ఆధారిత మైక్రో ఇరిగేషన్‌ వ్యవస్థలను అభివృద్ధి చేయాలి’ అని మోదీ పిలుపునిచ్చారు. దేశ వ్యవసాయ రంగానికి దివంగత స్వామినాథన్‌ చేసిన కృషిని ప్రధాని కొనియాడారు. ఆయన మన దేశానికి ఓ రత్నం లాంటి వారని పేర్కొన్నారు. దేశ ఆహార భద్రతను తన జీవిత లక్ష్యంగా చేసుకున్నారు. ఆయన ఆలోచనలు నేటి వ్యవసాయ రంగంలోనూ స్పష్టంగా కనిపిస్తు న్నాయి’ అని పేర్కొన్నారు.

ఎం.ఎస్‌.స్వామినాథన్‌ శత జయంతి అంతర్జాతీయ సదస్సులో పాల్గొన్న ప్రధాని మోదీతో ఎంఎస్‌ఎస్‌ రీసెర్చ్‌ ఫౌండేషన్‌ ఛైర్పర్సన్‌ సౌమ్యా స్వామినాథన్‌, కేంద్ర మంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ తదితరులు

Read More

తెలంగాణ బియ్యం నాణ్యతను అభినందించిన ఫిలిప్పీన్స్‌ వ్యవసాయ మంత్రి

20 లక్షల టన్నుల బియ్యం, వడ్లు రాబోయే సంవత్సరంలో ఫిలిప్పీన్స్‌కి అవసరమని, సరఫరా చేయడానికి తెలంగాణ ప్రభుత్వం సహకరించాలని ఫిలిప్పీన్స్‌ వ్యవసాయశాఖ మంత్రి ఫ్రాన్సిస్కో పి. టియు లారెల్‌ జూనియర్‌ బుధవారం ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో తెలంగాణ పౌరసరఫరాలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డిని కోరారు. తెలంగాణ బియ్యం నాణ్యత బాగున్నాయని, అక్కడి నుంచి బియ్యం, వడ్లను దిగుమతి చేసుకోవాలని ఆసక్తితో ఉన్నామని ఫ్రాన్సిస్కో పేర్కొన్నారు. అందుకు ఉత్తమ్‌ సుముఖత వ్యక్తం చేశారు. తెలంగాణ బియ్యం నాణ్యతను అభినందించినందుకు ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ ఫిలిప్పీన్స్‌ మధ్య వాణిజ్య సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. తెలంగాణ నుంచి మొక్కజొన్న దిగుమతి చేసుకోవడానికీ ఫిలిప్పీన్స్‌ వ్యవసాయ మంత్రి ఆసక్తి చూపారని ఉత్తమకుమార్‌ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.

Read More

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం నుంచి 34,196 టన్నుల ఉద్యాన ఉత్పత్తులు కిసాన్‌ రైలు ద్వారా రవాణా

2020 ఆగస్టు 7 నుంచి ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్‌ నుంచి అస్సాం, బిహార్‌, పశ్చి మబెంగాల్‌, దిల్లీ, త్రిపుర రాష్ట్రాలకు కిసాన్‌ రైలు 116 ట్రిప్పులు తిరిగింది. దీని ద్వారా 34,196 టన్నుల పండ్లు, కూరగాయల రవాణా జరిగింది. ఇందులో అరటి, మామిడి, ఉల్లి రకాలు కూడా ఉన్నాయి. 2024-25లో కంటెయినర్‌ కార్పొరేషన్‌ సంస్థ ఆంధ్రప్రదేశ్‌లోని తాడిపత్రి నుంచి 524, విశాఖపట్నం నుంచి 113 కంటెయినర్ల సరకును రవాణా చేసింది. బుధవారం లోక్‌సభలో తెదేపా ఎంపీలు కేశినేని శివనాథ్‌, దగ్గుమళ్ల ప్రసాదరావు, లావు శ్రీకృష్ణదేవరాయలు అడిగిన ప్రశ్నకు రైల్వేమంత్రి అశ్వినీవైష్ణవ్‌ ఈమేరకు సమాధానం ఇచ్చారు.

Read More

కలెక్టరేట్‌లో సేంద్రియ కూరగాయల స్టాల్‌

ఆంధ్రప్రదేశ్‌ ఎన్‌.టి.ఆర్‌. జిల్లా కలెక్టరేట్‌లో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి వచ్చే వారి కోసం అదే ఆవరణలో రైతు సాధికార సంస్థ ఆధ్వర్యంలో రసాయన పురుగు మందులు, ఎరువులు వాడకుండా సేంద్రియ పద్ధతుల్లో రైతులు పండించిన కూరగాయలతో స్టాల్‌ ఏర్పాటు చేస్తున్నారు. సేంద్రియ కూరగాయలు, ఆకుకూరలు కావడంతో ప్రజలు, అధికారులు వాటిని కొనడానికి ఆసక్తి చూపుతున్నారు

Read More

తెలంగాణలో ప్రతి జిల్లాలో రైతు విజ్ఞాన కేంద్రం!

పంటల సాగులో ఆధునిక సాంకేతికతను అందుబాటులో ఉంచడంతోపాటు ప్రయోగాలు, ఆవిష్కరణల ఫలాలను తెలంగాణ రాష్ట్రంలోని రైతులకు అందించేందుకు వీలుగా ప్రతి జిల్లాకో రైతు విజ్ఞాన కేంద్రం (ఆర్‌వీకే) స్థాపించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆచార్య జయశంకర్‌ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఈ మేరకు ఆర్‌వీకేలపై ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా 9 ఏరువాక కేంద్రాలు, 8 కృషి విజ్ఞాన కేంద్రా(కేవీకే)లు పనిచేస్తున్నాయి. ఇందులో కొద్దిమంది శాస్త్రవేత్తలే పని చేస్తున్నారు. ఏకంగా 15 జిల్లాల్లో శాస్త్రవేత్తలు లేరు. రైతులకు వాతావరణ మార్పులపై అవగాహన కల్పించడం, పంటల మార్పిడి ఆవశ్యకతను వివరించడం, నేరుగా వరి విత్తనం వేయడం, పత్తిలో కలుపు మొక్కల నివారణ వంటి వాటిని ప్రోత్సహించాలని ప్రభుత్వం భావిస్తోంది. డ్రోన్లు, యంత్రాల వినియోగం, కృత్రిమ మేధ, రోబోటిక్స్‌ వంటి ఆధునిక సాంకేతిక సేవలను అందించాలని యోచిస్తోంది. వీటన్నింటి అమలుకు ప్రత్యేకంగా రైతు విజ్ఞాన కేంద్రాల ఏర్పాటుపై దృష్టి సారించింది. దీనిపై ప్రతిపాదనలు రూపొందించాలని అగ్రివర్సిటీని ఆదేశించింది.

తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న 17 ఏరువాక, కేవీకేలను ఆర్‌వికెలుగా మారుస్తారు. మరో 15 జిల్లాల్లో కొత్త ఆర్‌వికెలను ఏర్పాటు చేస్తారు. అప్పుడు 32 జిల్లాల్లో విజ్ఞాన కేంద్రాలు అందుబాటులోకి వస్తాయి. ప్రతి కేంద్రంలో ఆరుగురు చొప్పున శాస్త్రవేత్తలను నియమిస్తారు. ఇతర సహాయ సిబ్బంది ఉంటారు. వాటిలో ప్రయోగశాలలు ఏర్పాటు చేస్తారు. వాటికి అనుబంధంగా విత్తన, సాగు క్షేత్రాలు ఉంటాయి. వాటిలో డ్రోన్లు, యంత్రాలపై శిక్షణ ఇస్తారు. నిత్యం పరిశోధనలు, ప్రయోగాలకు, రైతు శిక్షణ కార్యక్రమాలకు అవకాశం కల్పిస్తారు. అంకుర సంస్థలకు సైతం స్థలాలను కేటాయిస్తారు.

Read More

అటవీ ఏనుగుల సమస్య పరిష్కారానికి ఆపరేషన్‌ కుంకీ

కుంకీ ఏనుగుల ద్వారా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో చేపట్టిన తొలి ఆపరేషన్‌ విజయ వంతమైందని ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ తెలిపారు. చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలం పరిధిలోని మొగిలి వద్ద మామిడితోటలు ధ్వంసం చేస్తున్న అటవీ ఏనుగుల గుంపును కుంకీ ఏనుగులు విజయవంతంగా తరిమికొట్టాయని చెప్పారు. శనివారం రాత్రి నుంచి ఆదివారం ఉదయం వరకూ కొనసాగిన ఈ ఆపరేషన్‌లో కృష్ణ, జయంత్‌, వినాయక్‌ అనే కుంకీ ఏనుగులు పాల్గొనగా కర్ణాటక నుంచి తీసుకొచ్చిన కృష్ణ అనే కుంకీ ఏనుగు చాలా చురుగ్గా పాల్గొందని వివరించారు. ఏనుగుల సంచారంతో ఇబ్బందులు పడుతున్న సరిహద్దు ప్రాంతాల రైతులు, ప్రజలకు ఈ ఆపరేషన్‌ ద్వారా భరోసా కల్పించామని చెప్పారు. పుంగనూరు అటవీ ప్రాంతంలో తదుపరి ఆపరేషన్‌ చేపట్టనున్నట్లు చెప్పారు.

Read More

పర్యావరణ మార్పులను తట్టుకోవడంలో ఉద్యాన పంటలసాగు దోహదపడుతుంది

ఉద్యాన విశ్వవిద్యాలయం వీసీ దండా రాజిరెడ్డి

పర్యావరణ మార్పులను అదుపులో ఉంచడానికి ఉద్యాన పంటలను విరివిగా పెంచాలని ఆచార్య కొండా లక్ష్మణ్‌ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం వీసీ డాక్టర్‌ దండా రాజిరెడ్డి అన్నారు. పర్యావరణ మార్పులు, పంటలు సంబంధిత అంశాలపై లోతైన పరిశోధన చేసేందుకుగాను ప్రత్యేక పరిశోధన స్థానం ఏర్పాటు చేసేందుకు కసరత్తు చేస్తున్నట్టు తెలిపారు. వనపర్తి జిల్లా మోజెర్లలోని ఉద్యాన కళాశాలలో పర్యటించాక మదనాపురంలోని విద్యార్థుల ఉద్యాన బోధనా క్షేత్రాన్ని పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ.. పండ్లతోటల సాగుతో పాటు అంతర పంటలు సాగు చేయాలని, ఇంకుడు గుంతలను ఏర్పాటు చేసుకుంటే వర్షాభావ పరిస్థితుల్లో తోటలకు నీటిని అందించవచ్చన్నారు. తక్కువ నీటితో బాగా దిగుబడినిచ్చే ఉద్యాన పంటలైన ఉసిరి, చింత, నేరేడు, సపోటా, వాక్కాయ, కుంకుడు, దానిమ్మ, సీతాఫలం, మునగ లాంటి వాటిపై దృష్టి సారించాలని అన్నారు. తక్కువ కాలంలో కోతకొచ్చే కూరగాయలు, ఆకుకూరలు, ఏక వార్షిక రకాలు, ప్రాంతానికి అనువైన ఔషధ మొక్కలను సాగుచేయాలని తెలిపారు.

Read More

స్థానిక జాతి మొక్కలు, చెట్లనే పెంచుదాం

మొక్కలు నాటడమంటే తంతు కాదు.. అదో యజ్ఞం. సరైన చోట సరైన వృక్షజాతులను పెంచితేనే మంచి ఫలితాలొస్తాయి. కానీ చాలాచోట్ల పచ్చదనం పేరుతో ఏవేవో రకాలను పెంచుతున్నారు. అవి ఫలించి, పుష్పించి, పచ్చగా కనిపించినా పర్యావరణానికి మాత్రం చేటు చేస్తున్నాయి. మనవైన మొక్కలతోనే ఈ ఉపద్రవాన్ని అరికట్టగలుగుతాం. గతంలో మనం చూసిన చాలా పకక్షులు, ఉడతల వంటి జీవులు. ఇప్పుడు కనిపించట్లేదు. అందమైన సీతాకోకచిలుకలూ కనుమరుగైపోతున్నాయి. దేశీయ మొక్కలు, చెట్లు లేకపోవడం వీటన్నిటికీ కారణం. పట్టణాలు విస్తరిస్తున్నకొద్దీ పచ్చదనం మాయమవుతోంది. పచ్చదనం పెంచాలన్న లక్ష్యంతో వేల మొక్కలు నాటుతున్నా వాటిలో ఎక్కువ స్థానికేతర జాతులే ఉంటున్నాయి. దేశవాళీ వృక్ష సంపద తగ్గిపోయే కొద్దీ జీవ వైవిధ్యంపై తీవ్ర ప్రభావం పడుతోంది. అంతేకాదు భూగర్భ జలాలు, వర్షపాతం, ఉష్ణోగ్రతలపైనా ఈ ప్రభావం పడుతోందని పర్యావరణ వేత్తలు హెచ్చరిస్తున్నారు.*వలసపోతున్న పక్షులు*స్థానిక వృక్ష జాతుల వల్ల చాలా ప్రయోజనాలున్నాయి. ఇవి మన నేలలకు అలవాటు పడ్డ రకాలు. వీటిపైనే పకక్షులు ఎక్కువగా వాలతాయి. గూళ్ళు కట్టుకుంటాయి. మన వృక్షాలు లేకపోవడం వల్ల చాలా పకక్షులు వలసపోతున్నాయి. పకక్షులకు సహజ ఆవాసాలుగా మారే తుమ్మ వంటి చెట్లు లేకపోవడంతో చిలుకలు, మైనా వంటివి తగ్గిపోయాయి. తాటి, ఈత చెట్లు, వడ్రంగి పిట్టలు, పాలపిట్టలకు సహజసిద్ధ అవాసాలు. ఉమ్మడి రాష్ట్ర పక్షిగా గుర్తించిన పాలపిట్ట ఇపుడు అంతరించిపోయే పరిస్థితి ఉంది.సీతాకోక చిలుకలు తేనెటీగలను దేశీజాతి ఫల, పుష్పాలు ఆకర్షిస్తాయి. ఆ చెట్ల సంఖ్య తగ్గేకొద్దీ అవి కనుమరుగవుతాయి. పిచ్చుకల్లో చాలా రకాలు ఉండేవి. ఇప్పుడు ఇందులో కేవలం ఒకటి మాత్రమే కనిపిస్తోంది.*గాలి నాణ్యతకు దోహదం*వేప, మద్ది, రావి, మర్రి, వంటివి క్షామాన్ని తుపాన్లను కూడా తట్టుకుని నిలబడతాయి. ఎక్కువ ప్రాణవాయువును విడుదల చేస్తాయి. నగరాల్లో వాయు కాలుష్యం పరిమితికి మించి పెరిగింది. గాలిలోని ధూళి కణాలను శుద్ధి చేయడంలో ఈ చెట్లు బాగా పనికివస్తాయి. ఈ రకం చెట్లు పడిన వాననీటిని భూగర్భంలో ఇంకేలా చేస్తాయి. వీటి వల్ల భూగర్భ నీటి మట్టం పెరుగుతుంది. మేఘాలను ఆకర్షించి వర్షం కురిసేలా. చేయడంలోనూ అవి చాలా ముఖ్య పాత్ర పోషిస్తాయి.*మన పెరట్లో…*బయటే కాకుండా మన ఇళ్లల్లోని పెరట్లో కూడా స్థానిక జాతి మొక్కలు, చెట్లను పెంచుదాం. దీంతో జీవావరణం వృద్ధి చెందుతుంది. జీవవైవిధ్యానికి కూడా మేలు చేసిన వారమవుతాం.కరివేపాకు, జామ, సీతాఫలం, బొప్పాయి, వాటర్‌ యాపిల్‌, స్టార్‌ ఫ్రూట్‌ వంటి పండ్ల రకాలను నాటొచ్చు. రూఫ్‌టాప్‌పై సోర, బీర, టమోటా, వంగ, వంటి వాటిని పెంచితే మంచిది. మల్లె, సన్నజాజి, జాజి, బంతి, తదితర దేశీయ పూల మొక్కలను పెంచొచ్చు.*శేషాచలంపైనా….*శేషాచలం కొండల్లో 80వ థకంలో అటవీ ప్రాంత విస్తరణ కోసం పెద్దఎత్తున ఆకాసియా ఔరిక్యలిఫార్మిస్‌ అనే ఆస్ట్రేలియన్‌ మొక్కలను భారీగా నాటారు. ఇవి నేలలో క్షార గుణాన్ని పెంచి, స్థానిక మొక్కలను బతకనీయకుండా చేస్తున్నాయి. లాంటానా కామారా అన్న స్థానికేతర జాతి చెట్లు తెలుగు రాష్ట్రాల్లోని అడవులు, పచ్చిక బయళ్లను ఆక్రమించాయి. వీటిపై పకక్షులు గూళ్ళు కట్టి, ఆహారం సేకరించే అవకాశాలు ఉండడం లేదు. పూలు, ఫలాలు లేకపోవడం వల్ల తేనెటీగలు.. సన్‌బర్డ్‌, బుల్‌బుల్‌ వంటి పుప్పొడి రవాణా చేసే పకక్షులు గణనీయంగా తగ్గిపోయాయి. *ఏవి దేశీయ జాతులు?:* మర్రి, రావి, మేడి, వేప, మారేడు, వెలగ, గానుగ, తుమ్మ, మునగ, ఇప్ప, జువ్వి గంగరావి, నేరేడు, ఉసిరి, కుంకుడు, కొబ్బరి, తాటి, మద్ది, తదితర రకాలు*ఇవి స్థానికేతర రకాలు :* బూరుగు, కోనోకార్పస్‌, జామాయిల్‌, మలేషియా వేప, మహాగని, పుమేరియా, బాటిల్‌ బ్రష్‌. *కాపాడాల్సిన బాధ్యత మనదే..*పార్కుల్లో అందం కోసం, లెక్క కోసం స్థానికేతర స్థానిక రకాలకు ప్రాధాన్యం ఇవ్వాలి. రహదారుల విస్తరణలో చింత చెట్లను విచ్చలవిడిగా కొట్టేస్తున్నారు. వీటిని విస్తారంగా పెంచితే పేదలు ఆర్థికంగా నిలదొక్కుకునేందుకూ ఆసరాగా ఉపయోగపడతాయి.- *ప్రొ.తుమ్మల శ్రీకుమార్‌,* పర్యావరణవేత్త, విజయవాడ

Read More