కంది, పెసర, మినుములు, చిక్కుడు వంటి పప్పు జాతి పంటల్లో ఆశించే చిగురు ముడత తెగులు(స్టెరిలిటీ మెజాయిక్ డిసీజ్)ను నిరోధించే జన్యువును ‘ఆశ’ కందిలో ఇక్రిశాట్ శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ తెగులు సోకితే మొక్కలలో ఆకులు కుంచించుకుపోయి కాత, పూత ఉండదు. దీనిపై సీనియర్ శాస్త్రవేత్త మనీశ్ పాండే నేతృత్వంలో గంగశెట్టి ప్రకాశ్, ఇతర శాస్త్రవేత్తలు విస్తృతస్థాయిలో పరిశోధనలు చేశారు. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పల్సెస్ రీసెర్చ్ (యూపీ), డాక్టర్ రాజేంద్రప్రసాద్ సెంట్రల్ అగ్రికల్చరల్ యూనివర్సిటీ(బిహార్), ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్(అస్సాం)ల సహకారంతో కంది సంప్రదాయ రకాలైన ‘ఆశ, మారుతి’లపై ప్రయోగాలు జరిపి… చివరికి ‘ఆశ’ రకంలో ఈ తెగులును నిరోధించే జన్యువును గుర్తించి దానికి సీసీఎస్‌ఎండీ 04 అని పేరు పెట్టారు. మరోవైపు మారుతి రకంలో ఈ జన్యువు లేక పోవడంతో అది తెగులు బారిన పడుతుందని గ్రహించారు. దీంతో సీసీఎస్‌ఎండీ 04 జన్యువుపై మరిన్ని పరిశోధనలు చేసి తక్కువ కాలంలో సాగయ్యే సరికొత్త వంగడాన్ని రూపొందించాలని భావిస్తున్నారు.

9 Aug, 2025
