కర్ణాటక విధానంపై అధ్యయనం చేయనున్న అధికారులు
అంగన్వాడీ కేంద్రాల్లో ప్రస్తుతం ఇస్తున్న పోషకాహారంతో పాటు కర్ణాటక తరహాలో జొన్నలతో చేసే రొట్టె, ఇతర పదార్థాలను అందించాలని తెలంగాణా ప్రభుత్వం భావిస్తోంది. మహిళా సంఘాలతో వీటిని తయారు చేయించి సరఫరా చేసేందుకు యోచిస్తోంది. అంగన్వాడీ కేంద్రాలపై సీఎం తాజాగా నిర్వహించిన సమీక్షలో కర్ణాటక తరహాలో ఇక్కడా జొన్నరొట్టె ఇవ్వాలని, మహిళా సంఘాలతో తయారు చేయించాలని సూచించారు. దీంతో అధికారులు దీనిపై దృష్టిసారించారు. ప్రస్తుతం కర్ణాటక అంగన్వాడీ కేంద్రాల్లో అనుబంధ పోషకాహార కార్యక్రమం కింద సంవత్సరంలో మూడు వందల రోజులపాటు జొన్నలతో ఉప్మా, రొట్టె, లడ్డూలు, చిక్కీలు, కిచిడీ తయారు చేసి ఇస్తున్నారు. అక్కడి విధానంపై అధ్యయనానికి త్వరలో తెలంగాణ స్త్రీ శిశుసంక్షేమ, పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) అధికారుల బృందాన్ని పంపించనున్నారు. వారు తుది నివేదిక సమర్పించిన తర్వాత దీనిపై నిర్ణయం తీసుకోనున్నారు. జొన్నరొట్టెలను మహిళలు, కౌమార బాలికలకు, ఇతర పదార్థాలను పిల్లలకు ఇచ్చే అవకాశం ఉందని రాష్ట్ర ప్రభుత్వ అధికారులు తెలిపారు. రాష్ట్రంలో జొన్నల వినియోగం ఇప్పుడిప్పుడే పెరుగుతోంది. సాగు వానాకాలంలో 50 వేల ఎకరాలు, యాసంగిలో 4 లక్షల ఎకరాలు ఉంది. అంగన్వాడీలకు ఆహార పథకంగా చేపట్టిన పక్షంలో సాగు విస్తీర్ణం మరింత పెరిగే అవకాశం ఉందని వ్యవసాయ వర్గాలు అంచనా వేస్తున్నాయి.