ఇది దాదాపు 10 మీ. ఎత్తు వరకు పెరిగే బహువార్షిక మొక్క. పత్రాలు సంయుక్తమై ఉంటాయి. పత్రకాలు దాదాపు 20 -40 వరకు వుండి దీర్ఘచతురస్రాకారంలో ఉంటాయి. పుష్పాలు లేత గులాబి రంగులో గాని, తెల్లగా గాని ఉండి నారింజ పసుపు రంగులోకి మారతాయి. ఫలాలు చిన్న చిక్కుడు కాయల వలే ఉంటాయి. గింజలు అండాకారంలో కోలగా, ఎర్రగా లేదా తెల్లగా ఒక చివర నల్లని మచ్చ కలిగి ఉంటాయి. తెల్లపూలు వచ్చే తీగలకు గింజలు తెల్లగా ఉంటాయి, ఈ గింజలు ఫిబ్రవరి నుండి జూన్ వరకు లభిస్తాయి. గురివింద విత్తనాల ద్వారా వ్యాప్తి చెందుతుంది. పొదల మీద ప్రాకుతూ కన్పిస్తుంది.

సాధారణనామం : ఇండియన్ లిఖోరిస్ శాస్త్రీయ నామం: ఆబ్రస్ ప్రికటోరియస్ కుటుంబం: ఫాబేసి
ఉపయోగాలు : ఔషధ రంగంలో ….
- గింజలు, వేర్లు, ఆకులు ఔషధ గుణాలు కలిగి ఉంటాయి. వేర్లు, ఆకులలో గ్లైకోరైజిన్ అనే రసాయనముంటుంది. గింజలలో యాబ్రిన్, ఇండోల్ అనే ఆల్కలాయిడ్లు, ఆంథోసయనిన్ ఉంటాయి. యాబ్రిన్ విషపూరితం.
- గ్లైకోరైజిన్ కఫాన్ని తొలగించడమే గాకుండా వాపులను, అలర్జీలను తగ్గిస్తుంది.
గురివింద గింజ విషతుల్యం. క్రిమిసంహారక, గర్భనిరోధక శక్తి కలిగి ఉంది. కేశ వృద్ధికరం. - ఆకులు, వేర్లు వీర్యవృద్ధికరం. మూత్ర విసర్జనకు, వాపులకు, గాయాలకు, ఉబ్బసం, బొల్లి తదితర చర్మవ్యాధులు, తీవ్ర దాహార్తి నివారణకు ఉపయోగపడుతుంది.
- వేర్లను ఆవు పాలలో కలిపి మిశ్రమం తయారు చేసి అతిసారం మరియు రక్తవిరేచనాల నివారణకుపయోగిస్తారు.

వ్యవసాయరంగంలో …
- గురివింద ఆకులు, గింజల నీటి, మిథనాల్ ఆధారిత ద్రావణాలు కోపోటెర్మెస్ జెస్ట్రాయ్ మరణశాతాన్ని గణనీయంగా పెంచాయి (ప్రసాద్,అతని అనుచరులు, 2016)
- గురివింద గింజలలోని అబ్రిన్ అనే రసాయనం పిండినల్లి, మాకోనెల్లికోకస్ హిర్సూటస్లో సుగర్స్ పరిమాణాన్ని తగ్గించింది. ప్రోటీన్ పరిమాణాన్ని కూడా గణనీయంగా తగ్గించింది. సుగర్స్, ప్రోటీన్, లిపిడ్ పరిమాణాన్ని తగ్గించడం ద్వారా అబ్రిన్ పిండి నల్లుల సంఖ్యపై తీవ్ర ప్రభావాన్ని చూపింది (అనిత, ఆమె అనుచరులు, 1998).
- గురివింద నీటి ద్రావణాన్ని వర్మ్స్ నివారణలో ఉపయోగిస్తారు. ఉగాండ రైతులు గురివింద ఆకులు, కాండాలను పురుగుల నివారణలో ఉపయోగిస్తారు (నువగచి, 2016)
- గురివింద గింజ మిథనాల్ ద్రావణం రాల్స్టోనియా సొలనేసియారం, స్ట్రెప్టోమెసిస్ స్కాబీస్పై కన్నా పెక్టోబాక్టీరియం కరటోవోరంపై అధిక శక్తివంతమైన ప్రభావాన్ని చూపింది. గురివింద గింజలోని ఫ్లేవనాయిడ్స్, ఆల్కలాయిడ్స్, రెసిన్స్, ఫినాల్స్, గ్లైకోసైడ్స్, స్టిరాల్స్, ట్రైటెర్పిన్స్ యాంటి బాక్టీరియల్ ప్రభావాన్ని చూపించవచ్చు. ఇథైల్ ఎసిటేట్ఇథనాల్ మిశ్రమ (80:20) ద్రావణం స్ట్రెప్టోమైసిన్ స్కాబీస్పై అధిక శక్తివంతమైన ప్రభావాలను చూపుతుంది. గింజల ద్రావణంలో ఉన్న డై (2ఇథైల్ హెక్సైల్) ఫ్తాలేట్ స్ట్రెప్టోమైసిస్ స్కాబీస్పై అధిక బాక్టీరియా నాశక చర్యను ప్రదర్శించింది (అబ్బాసి, అతని అనుచరులు, 2016).
- గురివింద గింజల నీటి ద్రావణం, ఇథైల్ ఆల్కహాల్ ద్రావణం రెండు మచ్చల ఎర్రనల్లి, టెట్రానైకస్ ఉర్టికె పెద్ద ఆడ పురుగులను అత్యంత సమర్ధవంతంగా నివారించాయి. పెట్రోలియం ఈథర్ ద్రావణం గుడ్డు దశపై సమర్థవంతంగా పనిచేస్తుంది (అమర్, అతని అనుచరులు, 1989).
- గురువింద ఆకులు, కాండాలు కీటకనాశక లక్షణాలు కలిగి వున్నాయి (ఓక్యుటె, 2012).
గురువింద గింజల క్రూడ్ ద్రావణం ఆల్టర్నేరియా సొలాని శిలీంద్ర పెరుగుదలను అరికట్టింది. ఈ ద్రావణం ఫ్యుజేరియం సొలాని పెరుగుదలను కూడా అరికట్టింది (యాస్మిన్, ఆమె అనుచరులు, 2015). - గురివింద పెట్రోలియం ఈథర్ ద్రావణాలు మానవుల తలలోని పేలు, పెడిక్యులస్ హ్యూమనస్ కాపిటిస్ని సమర్ధవంతంగా నివారించాయి (ఉపాధ్యాయ్, అతని అనుచరులు, 2011).
- గురివింద మిథనాల్ ద్రావణాలు స్పోడోప్టెరా లిటూర గుడ్లపై 100% గుడ్లనాశక చర్యను ప్రదర్శించాయి. మిథనాల్ ద్రావణం (500 పిపియం) గణనీయమైన లార్విసైడల్ చర్యను ప్రదర్శించింది (ఎలుమలైకుప్పుసామి, అతని అనుచరులు, 2015), బోడయ్య, అతని అనుచరులు, 2016).
- ఈడిస్ ఈజిప్టి చికెన్గునియా, యెల్లో మరియు డెంగ్యు జ్వరాల ముఖ్య వాహకం. గురివింద గింజల ద్రావణం ఈడెస్ ఈజిప్టి లార్వాలపై అదిక లార్విసైడల్ చర్యను ప్రదర్శించింది (అడెబాజొ, అతని అనుచరులు, 2014).


