పంటల వైవిధ్యీకరణలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న చర్యలతో ఈ ఖరీఫ్‌లో పప్పుధాన్యాల సాగు గత ఖరీఫ్‌తో పోలిస్తే 36 శాతం పెరిగి, దేశంలోనే రెండో స్థానంలో తెలంగాణ నిలిచిందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. జాతీయ రబీ సదస్సులో తెలంగాణ వ్యవసాయ రంగంలో సాధిస్తున్న ప్రగతిని వివరించడంతో పాటు, రాష్ట్ర రైతుల ప్రయోజనాలకు సంబంధించిన పలు కీలక అంశాలను కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ దృష్టికి తీసుకెళ్లారు.
ఎల్‌నినో ప్రభావం, వర్షపాతంలో మార్పులు, దీర్ఘకాలిక పొడి పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని తెలంగాణలో పంటల వైవిధ్యీకరణకు ప్రాధాన్యత ఇస్తున్నామని మంత్రి తెలిపారు. నీటి లభ్యత, వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా రైతులు ప్రత్యామ్నాయ పంటల వైపు మళ్లేలా ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. ఇందులో భాగంగానే పప్పుధాన్యాల సాగు గణనీయంగా పెరిగి, గత ఏడాదితో పోలిస్తే 36 శాతం వృద్ధితో దేశంలో తెలంగాణ రెండో స్థానంలో నిలిచిందని తెలిపారు.

కూరగాయల సాగు లక్ష్యాన్ని లక్ష ఎకరాలకు పెంచి, అవసరమైన ఆర్థిక సహాయం అందించాలి:
తెలంగాణలో కూరగాయల సాగుకు విస్తృత అవకాశాలు ఉన్నాయని మంత్రి తెలిపారు. ప్రస్తుతం ఉన్న 8,800 ఎకరాల లక్ష్యాన్ని లక్ష ఎకరాలకు పెంచేందుకు కేంద్రం అనుమతితో పాటు అవసరమైన ఆర్థిక సహాయం అందించాలని కోరారు. పెరుగుతున్న కూరగాయల డిమాండ్‌ను తీర్చడంతో పాటు పంటల వైవిధ్యీకరణకు ఇది దోహదపడుతుందని తెలిపారు.
ఎల్‌నినో, కరువు పరిస్థితులకు ప్రత్యేక కేంద్ర సహాయం ఇవ్వాలి…
ఎల్‌నినో పరిస్థితులు, మారుతున్న వర్షపాత సరళి, దీర్ఘకాలిక పొడి పరిస్థితుల కారణంగా తెలంగాణలోని అనేక మండలాలు లోటు, తీవ్ర లోటు వర్షపాతాన్ని ఎదుర్కొంటున్నాయని మంత్రి తెలిపారు. ఆయా మండలాలకు సూక్ష్మ సాగునీరు, రక్షిత సాగునీరు, నీటి సంరక్షణ నిర్మాణాల కోసం ప్రత్యేక కేంద్ర సహాయం అందించాలని కోరారు.
అదేవిధంగా ఎల్‌నినో, కరువు పరిస్థితులను ఎదుర్కొనే ప్రత్యేక చర్యగా మొక్కజొన్న, జొన్నను ధరల మద్దతు పథకం (ఆఐఐ) పరిధిలోకి తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా నీటి ఒత్తిడిని తట్టుకునే జొన్న కరువు ప్రభావిత ప్రాంతాలకు అనుకూలమైన పంట కావడంతో కనీసం జొన్ననైనా పీఎస్ ఎస్ లో చేర్చాలని కోరారు.
ఆయిల్‌పామ్ రైతులకు స్థిరమైన ధరలు కల్పించాలి…
కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన పిలుపునకు స్పందిస్తూ తెలంగాణలో అదనంగా దాదాపు 1.10 లక్షల హెక్టార్లలో ఆయి…పామ్ సాగు విస్తరించిందని, సుమారు 72 వేల మంది కొత్త రైతులు ఆయిల్‌పామ్ సాగులోకి వచ్చారని మంత్రి తెలిపారు. ఆయిల్‌పామ్ దీర్ఘకాలిక పంట కావడంతో రైతులు సులభంగా మరో పంటకు మారే అవకాశం ఉండదని, అందువల్ల రైతులకు స్థిరమైన, గిట్టుబాటు ధరలు కల్పించడం అత్యంత కీలకమని పేర్కొన్నారు.
ఆయిల్‌పామ్ రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని క్రూడ్ పామ్ ఆయిల్ దిగుమతి సుంకాన్ని గతంలో ఉన్న 44 శాతానికి పునరుద్ధరించాలని మంత్రి తుమ్మల కేంద్రాన్ని కోరారు. దేశీయంగా ఆయిల్‌పామ్ సాగును ప్రోత్సహిస్తున్న సమయంలో దిగుమతి విధానాలు కూడా దేశీయ రైతులకు అనుకూలంగా ఉండాల్సిన అవసరం ఉందని తెలిపారు. దీనిపై స్పందించిన కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్, ఆయిల్‌పామ్ ధరలపై ప్రత్యేక కమిటీని నియమించి రైతుల సమస్యలను పరిశీలిస్తామని హామీ ఇచ్చినట్లు మంత్రి తుమ్మల తెలిపారు.

రైతులకు రియల్‌టైమ్ నేల ఆరోగ్య సమాచారం అందించేలా చర్యలు తీసుకోవాలి….
సాంప్రదాయ మట్టి పరీక్షల ద్వారా ప్రతి రైతుకు సకాలంలో నేల ఆరోగ్య సమాచారం అందించడం సాధ్యం కావడం లేదని మంత్రి తెలిపారు. రైతులకు రియల్‌టైమ్‌లో నేల ఆరోగ్య వివరాలను అందించేందుకు శాటిలైట్ ఆధారిత సాయిల్ హెల్త్ టెక్నాలజీని కేంద్ర ప్రభుత్వం అందుబాటులోకి తీసుకురావాలని కోరారు. మారుతున్న అంతర్జాతీయ పరిస్థితులకు అనుగుణంగా యూరియా, డీఏపీ, కాంప్లెక్స్ ఎరువుల సబ్సిడీ విధానాన్ని కూడా ఎప్పటికప్పుడు సమీక్షించాలని విజ్ఞప్తి చేశారు.
తెలంగాణకు అదనంగా 16 కృషి విజ్ఞాన కేంద్రాలు మంజూరు చేయాలి..
తెలంగాణలో 33 జిల్లాలు ఉండగా ప్రస్తుతం 16 కృషి విజ్ఞాన కేంద్రాలు మాత్రమే ఉన్నాయని మంత్రి తెలిపారు. వ్యవసాయ విద్య, పరిశోధన ద్వారా అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానం వేగంగా రైతులకు చేరేందుకు వ్యవసాయ విస్తరణ వ్యవస్థను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణకు అదనంగా 16 కృషి విజ్ఞాన కేంద్రాలను ఐసీఏఆర్ ద్వారా మంజూరు చేయాలని కేంద్రాన్ని కోరారు.
కొడంగల్ అగ్రి బిజినెస్ పార్క్, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌కు కేంద్ర సహకారం అందించండి…
కొడంగల్‌లో అగ్రి బిజినెస్ పార్క్, సెమీ-అరిడ్ హార్టికల్చర్ క్రాప్స్ కోసం సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం సమర్పించిన డీపీఆర్‌లకు కేంద్ర ప్రభుత్వం అవసరమైన సహకారం అందించాలని మంత్రి కోరారు. తెలంగాణలోని ప్రత్యేక వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా సెమీ-అరిడ్ హార్టికల్చర్ కు ఈ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు.
రైతు ప్రయోజనాలకు అనుగుణంగా కొత్త సీడ్ బిల్ తీసుకురావాలి…
తెలంగాణలో విత్తన రంగానికి ఉన్న ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకుని రైతు ప్రయోజనాలను కాపాడేలా కొత్త సీడ్ బిల్లును త్వరగా తీసుకురావాలని మంత్రి కోరారు. పంట నష్టాల సందర్భంలో రైతులకు పరిహారం అందించే తగిన నిబంధనలతో పాటు, నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠినమైన చర్యలు తీసుకునేలా బిల్లులో నిబంధనలు ఉండాలని విజ్ఞప్తి చేశారు. పప్పుధాన్యాలు, నూనెగింజల ఉత్పత్తిని పెంచే జాతీయ కార్యక్రమాల నేపథ్యంలో రైతు ప్రయోజనాలకు అనుగుణమైన విత్తన చట్టం అవసరమని తెలిపారు.
తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఈ కీలక ప్రతిపాదనలు రాష్ట్రంలో వాతావరణ మార్పులను తట్టుకునే వ్యవసాయాన్ని బలోపేతం చేయడంతో పాటు, పంటల వైవిధ్యీకరణ, వ్యవసాయ విస్తరణ సేవలు, రైతుల ఆదాయ భద్రతను మరింత బలోపేతం చేస్తాయని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. రాష్ట్ర అవసరాలను కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా పరిశీలించి అవసరమైన సహకారం అందించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

