సన్న రకాల వరి సాగుకు ప్రోత్సాహం.. ప్రత్యేక బోనస్
- వ్యవసాయ విద్యార్థుల ఉపకారవేతనం రూ.10వేలు, రూ.12వేలకు పెంపు
- వర్సిటీ ఉద్యోగుల పదవీ విరమణ వయసు 62 ఏళ్లకు పెంపు
- వ్యవసాయ, అనుబంధ రంగాలపై సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సన్న రకాల వరి సాగును ప్రోత్సహించాలని.. పండించే రైతులకు ప్రత్యేక బోనస్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా పేదలకు అందిస్తున్న బియ్యంలో అధికశాతం రీసైక్లింగ్ అవుతున్న నేపథ్యంలో.. వారికి సన్న రకాల బియ్యాన్ని పంపిణీ చేయాలనేది సర్కారు ఆలోచన. అందుకు అనుగుణంగా ఆయా వరి రకాల సాగుకు ప్రణాళికలు రూపొందించి అమలు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. మిరప సహా వివిధ పంటలకు మద్దతు ధరలు నిర్ణయించి.. అంతకంటే తగ్గితే వెంటనే ప్రభుత్వం ద్వారా సేకరించాలని ఆయన స్పష్టం చేశారు. యాదవ, కురబలకు బీసీ కార్పొరేషన్ ద్వారా రాయితీపై గొర్రెలు, మేకల పంపిణీకి చర్యలు తీసుకోవాలని చెప్పారు. వ్యవసాయ, అనుబంధ రంగాలపై శుక్రవారం సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా తీసుకున్న నిర్ణయాలు, సీఎం సూచనలను.. వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు విలేకరులకు వివరించారు. అవి ఇలా ఉన్నాయి.
పదవీ విరమణ వయసు 62 ఏళ్లకు
- వ్యవసాయ, ఉద్యాన, పశువైద్య విశ్వవిద్యాలయాల్లో పనిచేసే వారి ఉద్యోగ విరమణ వయసు 60 నుంచి 62 ఏళ్లకు పెంచారు. వ్యవసాయ, పశువైద్య విద్యార్థుల ఉపకారవేతనం రూ.7 వేల నుంచి రూ.10 వేలు.. పీజీ విద్యార్థులకు రూ.12 వేలకు పెంచారు.
కోకో, అంతరపంటల సాగుకు ప్రోత్సాహం
- ఆయిల్ పామ్‌లో అంతరపంటగా కోకో సాగుకు ప్రోత్సాహం, ఆయిల్‌పామ్ విస్తరణ.. పీపీపీ విధానంలో పరిశ్రమల ఏర్పాటు అంతరపంటలు సాగు చేసే రైతులకు అధిక ప్రోత్సాహకాలు, చిరుధాన్యాలు సాగుకు చేయూత… రైతులకు రాయితీలు, రైతు బజార్లలో పండ్లు, పూలు, కూరగాయల నిల్వకు సబ్జీ కూలర్లు.. 50% రాయితీపై అందజేత, జూన్‌లోనే నారుమళ్లకు సాగు నీరు విడుదల, ఆక్వా, ఉద్యాన, పశుసంవర్ధక రంగాల వారీగా సెమినార్లు. రైతులు, శాస్త్రవేత్తల భాగస్వామ్యంతో కార్యశాలలు ఉపాధి హామీ పథకంలో ఉద్యాన రంగానికి అధిక నిధులు. ఈ ఏడాది రూ.200 కోట్లతో పనులు, ఉద్యాన హబ్ రాయలసీమ.. అనంతపురం జిల్లాలో పైలట్ ప్రాజెక్టు డ్రాగన్, అవకాడో తదితర పంటల సాగుకు ప్రోత్సాహం. ఆక్వా జోన్/ వెలుపల చెరువులు తవ్వాలంటే అనుమతులు తప్పనిసరి. అనుమతి లేకుండా సాగు చేస్తే జరిమానా.
















