* ఉడికించిన గుడ్లు, మాంసాన్ని వినియోగదారులు తీసుకోవచ్చు

* పశుసంవర్థకశాఖ డైరెక్టర్‌ దామోదరనాయుడు

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో కోళ్లు చనిపోయాయని, పెరటి కోళ్లతో పోలిస్తే, పౌల్ట్రీ ఫారాల్లో అధికంగా కోళ్లు మరణించినట్లు గుర్తించామని పశుసంవర్ధకశాఖ సంచాలకుడు దామోదరనాయుడు తెలిపారు. పశ్చిమగోదావరి జిల్లా కొల్లేరు సరస్సు ప్రాంతానికి ఈ ఏడాది వలస పకక్షులు అధికంగా రావడం కూడా దీనికి ఒక కారణమని ఆయన మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. కోళ్ల రైతులు సరైన జీవ భద్రతా చర్యలు పాటించకపోవడంతో కొన్నిచోట్ల వ్యాధులు వ్యాప్తి చెందాయన్నారు. కోళ్ల పెంపకందారులకు పశువైద్యాధికారుల బృందాల ద్వారా వైద్య సలహాలు అందిస్తున్నామని.. నమూనాలను విజయవాడలోని రాష్ట్రస్థాయి పశువ్యాధి నిర్ధారణశాలతోపాటు భోపాల్లోని హైసెక్యూరిటీ ల్యాబ్‌కు పంపామని వివరించారు. కోడిగుడ్లు, మాంసం వినియోగం వల్ల అనారోగ్య సమస్యలు సంభవించినట్లు నిర్ధారణ కాలేదన్నారు. వినియోగదారులు ఎలాంటి అపోహలకు లోనుకావద్దని, నిస్సంకోచంగా ఉడికించిన కోడిగుడ్లు, మాంసం తీసుకోవచ్చని సూచించారు.