అధిక దిగుబడుల కోసం రైతులు యూరియా విచక్షణా రహితంగా వాడటంతో నేల ఆరోగ్యం పాడవడంతోపాటు పర్యావరణానికి నష్టం చేకూరుతోంది. పంటలు ఏపుగా పెరిగినా చీడపీడల ఉధృతి మాత్రం బాగా పెరుగుతోంది. వీటి నివారణకు మళ్లీ పురుగుమందులు వాడటంతో రైతులకు పెట్టుబడి వ్యయం పెరుగుతోంది. ఖరీఫ్ సీజన్లో కృష్ణా పశ్చిమ డెల్టాలో వరి పంట సాగు చేసిన రైతులు రబీ సీజన్లో జొన్న, మొక్కజొన్న సాగు చేస్తున్నారు. తొలి పంట మొత్తం పెట్టుబడులు, కౌలు సొమ్ము చెల్లించడానికి సరిపోతుండగా, రెండో పంటలోనే కొంత మిగులుతోంది. దీంతో కౌలు రైతులు వీలైనంత ఎక్కువ దిగుబడి తీసుకోవాలన్న ఉద్దేశంతో యూరియా ఎకరాకు 10 నుంచి 15 బస్తాల వరకు వాడుతున్నారు. అతిగా వాడటం వల్ల భూమి ఆరోగ్యం దెబ్బతింటోంది. మరోవైపు ఆయా జిల్లాలకు కేటాయించిన యూరియా ఎరువులు సరిపోకపోవడంతో పొరుగు జిల్లాల నుంచి తెప్పించుకోవాల్సి వస్తోంది. జొన్న, మొక్కజొన్న పంటల్లోనే వినియోగం ఎక్కువగా ఉంది. మొక్కజొన్న పంటకు 4 నుంచి 5 బస్తాలు (100 నుంచి 120 కిలోలు నత్రజని) వేస్తే సరిపోతుంది. మొక్కథలో 15-20 రోజులకు, రెండోసారి మొక్కకు 45 రోజులకు, మూడోసారి 60-65 రోజుల్లో యూరియా వేస్తే సరిపోతుంది. జొన్నకు రెండుసార్లు వేస్తే సరిపోతుంది. ఇంతకు మించి వేసినా పెద్దగా ప్రయోజనం ఉండదని వ్యవసాయాధికారులు, శాస్త్రవేత్తలు చెబుతున్నా రైతుల్లో మార్పు రావడం లేదు. 5 బస్తాల తర్వాత యూరియా వల్ల నష్టాలు తప్ప లాభాలు లేవని చెబుతున్నా పట్టించుకోవడం లేదు.

చౌడుగా మారుతున్న భూమి
యూరియా నిర్ణీత పరిమాణం కంటే ఎక్కువగా వస్తే భూమి చౌడు బారిపోతుంది. పాలచౌడు, కారుచౌడుతో భూమి నిస్సారవుతుందని వ్యవసాయాధికారులు చెబుతున్నారు. భూమి ఆరోగ్యం పూర్తిగా దెబ్బతింటుంది. అధిక ఎరువుల వల్ల మొక్కజొన్న, జొన్న ఏపుగా పెరిగి చీడపీడల బారినపడటం. వీటి నివారణకు అధికంగా రసాయనాలు పిచికారీ చేయడం వల్ల వాతావరణం కలుషితం కావడంతో రైతుకు ఖర్చు పెరుగుతుంది. ఒక్క బస్తా యూరియా తయారీకి రూ.2500 ఖర్చవుతుంది. రాయితీపై రూ.266.50 ధరకు రైతులకు సరఫరా చేస్తున్నారు. మిగిలిన మొత్తాన్ని ప్రభుత్వం భరిస్తోంది. అవసరం లేకపోయినా ఎక్కువగా వినియోగించడం వల్ల ప్రభుత్వంపై భారంతో పాటు పొలాలు పాడవుతున్నాయని. వివరిస్తున్నారు.

