మినుము సాగుపై దృష్టి పెట్టాలి – వ్యవసాయశాఖ డైరెక్టర్‌ ఢిల్లీరావు

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో మినుము సాగు, ఉత్పత్తి పెంపుపై ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పనిచేయాలని వ్యవసాయశాఖ డైరెక్టర్‌ ఢిల్లీరావు సూచించారు. ఏడు జిల్లాలకు సంబంధించి గురువారం విజయవాడలో జరిగిన ‘జాతీయ ఆహార, పోషక భద్రత మిషన్‌’ సదస్సులో మాట్లాడారు. అధిక దిగుబడినిచ్చే వంగడాల రూపకల్పనకు ప్రాధాన్యమివ్వాలన్నారు.

Read More

చిన్న సంచుల్లో వరి విత్తనాల పంపిణీ

రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ ఛైర్మన్‌

రైతుల సౌలభ్యం కోసం వచ్చే వానాకాలం సీజన్‌ నుంచి చిన్న సంచుల్లో వరి విత్తనాలను విక్రయిస్తామని తెలంగాణ రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్‌ అన్వేష్‌ రెడ్డి తెలిపారు. బుధవారం హైదరాబాద్‌లో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. పెద్ద సంచుల వల్ల విెత్తనాల రవాణాకు రైతులు ఇబ్బందులు పడుతున్నారని, దీన్ని దృష్టిలో పెట్టుకుని 10, 15, 25 కిలోల బస్తాల్లో వరి వంగడాలను విక్రయించనున్నట్లు వివరించారు. ప్రభుత్వం రైతులను సంస్థలో భాగస్వాములుగా చేసేందుకు చర్యలు తీసుకుంటోందని కూడా అన్నారు.

Read More

కోళ్లు, గుడ్ల రవాణాపై ఆంక్షలు లేవు

పశుసంవర్ధకశాఖ సంచాలకులు దామోదర్‌నాయుడు

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో కొత్తగా ఎక్కడా బర్డ్‌ ఫ్లూ నిర్ధారణ కాలేదని, ప్రజలు ఎలాంటి ఆందోళనా చెందవద్దని పశుసంవర్ధకశాఖ సంచాలకులు టి.దామోదర్‌నాయుడు తెలిపారు. నిఘా పరిధిలోని 5 గ్రామాల్లో తప్ప రాష్ట్రంలో మరెక్కడా కోళ్లు, గుడ్ల రవాణాపై ఆంక్షలు లేవని వివరించారు. ఎక్కడైనా కోళ్లు, గుడ్ల రవాణాను అడ్డుకుంటే కాల్‌ సెంటర్‌కు (0866-2472543, 9491168699)కు ఫోన్‌ చేయాలని సూచించారు. అసత్య ప్రచారం కారణంగా కోళ్ల పరిశ్రమపై ఆధారపడిన వారు జీవనోపాధి కోల్పోతున్నారని తెలిపారు. కోడి మాంసం, గుడ్ల వాడకాన్ని ప్రోత్సహించేందుకు స్వచ్ఛంద సంస్థల సహకారంతో చికెన్‌, ఎగ్‌ మేళాలు నిర్వహించనున్నట్లు ఒక ప్రకటనలో వివరించారు.

Read More

ఇజ్రాయెల్‌ కంపెనీ ప్రతినిధులు తుమ్మల నాగేశ్వరరావుతో మర్యాదపూర్వక భేటీ

ఇజ్రాయెల్‌ కంపెనీ యం.డి. హెచ్‌ఏఐ ఆర్‌ అండ్‌ డి ప్రతినిధులు మరియు విండ్‌ పొనిక్స్‌ కంపెనీ ప్రతినిధులు తెలంగాణ రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును మర్యాదపూర్వకంగా కలిసి, వారి సంస్థ ద్వారా వ్యవసాయరంగంలో చేపడుతున్న కార్యక్రమాలను మంత్రికి వివరించడం జరిగింది. స్మార్ట్‌ అగ్రికల్చర్‌, ఏ.ఐ సెన్సార్‌ మరియు ఆటోమేషన్‌ పద్ధతులు, డిజిటల్‌ రెయిన్‌ హార్వెస్టింగ్‌, గ్రే వాటర్‌ ట్రీట్‌ మెంట్‌ వంటి పద్ధతులపై వివరించి ఇజ్రాయిల్‌ మరియు భారతదేశం మధ్య కుదిరిన ఒప్పందం అనుసరించి యం.డి. హెచ్‌ఏఐ ఆర్‌ అండ్‌ డి భాగస్వామ్యంతో, తెలంగాణ రాష్ట్రంలో పైలట్‌ పద్ధతిలో వ్యవసాయరంగములో వస్తున్న ఆధునిక టెక్నాలజీని మన దగ్గర రైతులకు శిక్షణ ఇచ్చేందుకు, విండ్‌ పొనిక్స్‌ సంస్థ సిద్ధంగా ఉందని, అదేవిధంగా యూనివర్సిటీల మధ్య కూడా ఒప్పందాల ద్వారా ఇజ్రాయిల్‌ టెక్నాలజీని తెలంగాణ రాష్ట్రములో ప్రవేశపెట్టడానికి సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు.
దానికి మంత్రి స్పందిస్తూ, తాను 1995 సంవత్సరములో ఇజ్రాయిల్‌ దేశంలో పర్యటించినపుడు అప్పటి ముఖ్యమంత్రి ప్రోత్సహముతో ప్రవేశపెట్టిన డ్రిప్‌ ఇరిగేషన్‌ ప్రాచుర్యంలోకి రావడానికి దాదాపు 25 ఏళ్లు పట్టిందని, అదేవిధంగా కొత్త టెక్నాలజీని ఒడిసిపట్టి, అది మన రాష్ట్రంలో ప్రవేశపెట్టి రైతులకు సేద్యరంగములో తోడ్పడేందుకు తమ ప్రభుత్వము ఎల్లప్పుడు సిద్ధంగా ఉంటుందని, త్వరలోనే సంబంధిత అధికారులతో పూర్తి స్థాయిలో సమావేశమై, వారి ప్రాజెక్ట్‌ నివేదికను సమర్పించాల్సిందిగా ఆ ప్రతినిధులను కోరారు. ఈ సమావేశంలో వ్యవసాయశాఖ డైరెక్టర్‌ గోపి, హార్టికల్చర్‌ డైరెక్టర్‌ శ్రీమతి యాస్మిన్‌ బాషా, కంపెనీ ప్రతినిధులు పాల్గొన్నారు.

Read More

నిజామాబాద్‌ వ్యవసాయ మార్కెట్లో పసుపు ప్రత్యక్ష కొనుగోలు కేంద్రాల ఏర్పాటు : మంత్రి తుమ్మల

రాష్ట్రంలో పసుపు రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు దృష్టికి రావడంతో నిజామాబాద్‌ వ్యవసాయ మార్కెట్లో ప్రత్యక్ష కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి, వెంటనే కొనుగోళ్లు చేయాల్సిందిగా అధికారులను మంత్రి ఆదేశించడం జరిగింది. ఈ నేపథ్యంలో పసుపు రైతులు అందరు గరిష్ట మద్ధతు ధర పొందేందుకు వీలుంటుందని మంత్రి పేర్కొన్నారు.

అదేవిధంగా సీసీఐ సెంటర్లలో రైతుల ఆధార్‌ ప్రామాణికత సమస్య వలన నిలిచిపోయిన పత్తి కొనుగోళ్ల ప్రక్రియను, వెంటనే పునరుద్ధరించి పత్తి కొనుగోళ్లను ప్రారంభించాలని కేంద్ర జౌళిశాఖ మంత్రి గిరిరాజ్‌ సింగ్‌కు మంత్రి తుమ్మల లేఖ రాయడం జరిగింది. 

అంతర్జాతీయ విపణిలో చోటుచేసుకొన్న పరిణామాల నేపథ్యంలో మిర్చి ధరలు తగ్గడంతో రాష్ట్రంలో మిర్చి రైతులు ఆందోళనలో ఉన్నారని, రాష్ట్రంలోని మిర్చి రైతుల శ్రేయస్సు కోసం శ్రీజుఓజూఈ ద్వారా మార్కెట్‌ ధరకు ఎండుమిర్చిని కొనుగోలు చేయాలని కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహన్‌కు మంత్రి తుమ్మల లేఖ రాశారు.
Read More

అడవి జంతువులు, కోతుల నుండి పంటల రక్షణకు సోలార్‌ పెన్సింగ్‌ స్కీంను ప్రవేశపెట్టే యోచనలో ప్రభుత్వం – మంత్రి తుమ్మల

– పామాయిల్‌తో పాటు ఇతర పంటలకు డ్రిప్‌ మరియు తుంపర సేద్య పరికరాలను అవసరం మేరకు రైతులకు అందించాలని ఆదేశాలు- రాష్ట్ర అవసరాలు తీర్చే విధంగా కూరగాయల సాగు పెంపునకు పెరి అర్బన్‌ క్లస్టర్లను ఏర్పాటుచేయాల్సిందిగా ఆదేశాలు – జూన్‌ మొదటి వారంలోపు రాష్ట్రంలో మరో ఆయిల్‌ పామ్‌ కర్మాగారం అందుబాటులోకి, మరో రెండు ఫ్యాక్టరీల నిర్మాణ పనులు ఆరంభించేలా చర్యలు-

మెకడమియా పంట సాగుకు అవసరమైన పరిస్థితులను, అనువైన ప్రాంతాలను అధ్యయనం చేయాల్సిందిగా ఉద్యానశాఖ అధికారులకు ఆదేశాలు- ప్రగతి చూపని ఆయిల్‌ పామ్‌ కంపెనీలపై చర్యలు ఆరంభం, ఇప్పటికే విశ్వతేజ ఆయిల్‌ పామ్‌ కంపెనీకి ఇచ్చిన అనుమతులు రద్దు కోతులు, ఇతర అడవి జంతువుల వల్ల ఇబ్బంది ఉన్న అన్ని జిల్లాలలో ఉద్యాన పంటల రక్షణకు సోలార్‌ పెన్సింగ్‌ ఏర్పాటు చేసేందుకు వీలుగా సోలార్‌ పెన్సింగ్‌ స్కీం అమలవుతున్న హిమాచల్‌ ప్రదేశ్‌ లాంటి రాష్ట్రాలలో పర్యటించి, రాష్ట్ర ప్రభుత్వం తరపున సబ్సిడీపై అందచేయుటకు విధివిధానాలు వెంటనే సిద్ధం చేయాలని ఈ రోజు సచివాలయంలో ఉద్యానశాఖ అధికారులతో వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు జరిపిన సమీక్షా సమావేశంలో అధికారులను ఆదేశించారు. దీనివల్ల కూరగాయలు మరియు ఉద్యాన పంటల సాగు చేయడానికి రైతులు ముందుకు రావడానికి అవకాశం ఏర్పడుతుందన్నారు. హైదరాబాద్‌ నగరానికి 100 కిలోమీటర్ల పరిధిలోపు ఉన్న అన్ని ప్రాంతాలలో కూరగాయాల సాగు చేపట్టేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అందుకోసం పెరి అర్బన్‌ క్లస్టర్లను ఏర్పాటుచేసి, రైతులకు ప్రోత్సహకాలు కూడా అందించేలా చూడాలన్నారు. కూరగాయల సాగు కోసం అవసరం మేరకు యంత్ర పరికరాలు సబ్సిడిపై అందించి, సాగును పెద్ద ఎత్తున ప్రోత్సహించాలన్నారు. రాబోయే రెండు, మూడు సంవత్సరాలలో కూరగాయల పంటలను పెద్ద ఎత్తున ఉత్పత్తిచేసి, కూరగాయలను దిగుమతి చేసుకొనే స్థితి నుండి ఎగుమతి చేసే స్థితికి తీసుకురావాలని మంత్రిగారు తెలియజేశారు. వచ్చే ఆర్థిక సంవత్సరం సంబంధించి కూడా ముందస్తుగా డ్రిప్‌ మరియు స్ప్రింక్లర్ల పంపిణీ కోసం ధరఖాస్తులను స్వీకరించి, గ్రౌండింగ్‌ మొదలు పెట్టాల్సిందిగా ఆదేశించారు. ఇతర రాష్ట్రాలలో సాగు చేస్తు లాభాలు పొందుతున్న మెకడమియా పంటను రాష్ట్రంలో ప్రవేశపెట్టడానికి గల వాతావరణ స్థితిగతులు, నేలలు, నర్సరీలు, మార్కెటింగ్‌ అవకాశాలను అధ్యయనం చేయాలని ఉద్యానశాఖ అధికారులను మంత్రి తుమ్మల ఆదేశించారు. మార్చి నెలాఖరుకల్లా ఆయిల్‌పామ్‌ సాగు లక్ష్యాన్ని చేరుకునేలా చర్యలు తీసుకోవాలని, తక్కువ పురోగతి ఉన్న కంపెనీలకు నోటిసులు జారీ చేసి, ఏఏ జిల్లాలలో తక్కువ పురోగతి ఉందో వాటికి అనుమతులు రద్దు చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఆయిల్‌పామ్‌ చట్టంలో ఉన్న నిబంధనలను అనుసరించి చర్యలు తీసుకోవడం జరుగుతుందని, ఇప్పటికే విశ్వతేజ ఆయిల్‌ పామ్‌ కంపెనీకి ఇచ్చిన అనుమతులు రద్దు చేసి మల్టి నేషనల్‌ కంపెనీ అయిన హిందుస్థాన్‌ యూనిలివర్‌ లిమిటెడ్‌ కంపెనీకి సదరు ప్రాంతాన్ని అప్పగించడం జరిగిందని, అలాగే ఇంకా ఎక్కడైతే కంపెనీలు మూడు, నాలుగు సంవత్సరాలు అయినప్పటికి ప్రాసెసింగ్‌ ప్లాంట్‌ నిర్మాణానికి భూమి గుర్తించక పోవడం, ప్లాంటేషన్‌ లక్ష్యాన్ని చేరుకోని కంపెనీలను తొలగించి, వాటి స్థానంలో ఆయిల్‌ఫెడ్‌కు బాధ్యతలు అప్పగించడం జరుగుతుందని తెలియజేశారు. వచ్చే ఆర్థిక సంవత్సరానికి ఆయిల్‌పామ్‌ సాగు కోసం 2 లక్షల ఎకరాలను లక్ష్యంగా పెట్టుకొని పనిచేయాలని ఆదేశించారు. ఆయిల్‌ ఫెడ్‌ సిబ్బందికి కూడా లక్ష్యాలు నిర్ధేశించి వాటిని చేరుకొనే విధంగా పనిచేసేటట్లు చూడాలని ఆదేశించారు. అదేవిధంగా ప్రైవేట్‌ కంపెనీలు కూడా లక్ష్యానికి అనుగుణంగా ప్లాంటేషన్‌ పూర్తి చేసేట్టుగా, ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహించి పర్యవేక్షణ చేయాలని ఉద్యానశాఖ డైరెక్టర్‌కు సూచించారు. వచ్చే సంవత్సరం చివరికల్లా ఉమ్మడి జిల్లాలలో కనీసం ఒక పామ్‌ఆయిల్‌ ఫ్యాక్టరీ నిర్మాణం జరిగేలా చూడాలని, పామ్‌ ఆయిల్‌ ఫ్యాక్టరీ నిర్మాణానికి కనీసం సంబంధింత జిల్లాలలో 6 వేల ఎకరాలకు పైన ప్లాంటేషన్‌ ఉండేట్టుగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. టిఎస్‌ ఆయిల్‌ ఫెడ్‌ ఆధ్వర్యంలో సిద్దిపేట జిల్లా నర్మెట్ట గ్రామంలో నిర్మాణం జరుగుతున్న ఆయిల్‌పామ్‌ కర్మాగారాన్ని మే నెలాఖరుకల్లా పూర్తి చేయాలని, అదేవిధంగా గద్వాల జిల్లా బీచుపల్లిలో, ఖమ్మం జిల్లా కల్లూరిగూడంలో ఆయిల్‌పామ్‌ కర్మాగారాల ఏర్పాటుకు టెండర్ల ప్రక్రియను వెంటనే పూర్తిచేసి, పనులు ప్రారంభించి, ఈ డిసెంబర్‌ కల్లా వాటి నిర్మాణం పూర్తి చేయాలని సూచించారు. అదేవిధంగా 6 వేల ఎకరాలపైన ప్లాంటేషన్‌ పూర్తి చేసిన ప్రైవేట్‌ కంపెనీలు కూడా వెంటనే పామ్‌ఆయిల్‌ కర్మాగారాలను ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సమీక్షా సమావేశంలో వ్యవసాయశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ రఘునందన్‌ రావు, హార్టికల్చర్‌ డైరెక్టర్‌ శ్రీమతి యాస్మిన్‌ బాషా, ఆయిల్‌ఫెడ్‌ అధికారులు, ఉద్యానశాఖ అధికారులు పాల్గొన్నారు

Read More

ఉద్యాన పంటలకు కేంద్రం ఊతం

కొత్తగా 50 వేల ఎకరాల్లో కూరగాయలు, తోటల పెంపకమే లక్ష్యం – సమీకృత ఉద్యాన అభివృద్ధి పథకం కింద రూ.145 కోట్లు కేటాయింపు – మెట్రో అర్బన్‌ వెజిటబుల్‌ క్లస్టర్ల విభాగానికి హైదరాబాద్‌ ఎంపిక – జీహెచ్‌ఎంసీ పరిధిలో రూ.333 కోట్లు మంజూరయ్యే అవకాశం*

తెలంగాణలో కూరగాయలు, పండ్ల తోటల పెంపకానికి భారీగా సాయం చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు రెండు పథకాల కింద నిధులను విడుదల చేయనుంది. సమీకృత ఉద్యాన అభివృద్ధి కార్యక్రమం (మిషన్‌ ఫర్‌ ఇంటిగ్రేటెడ్‌ డెవలప్‌మెంట్‌ ఆఫ్‌ హార్టికల్చర్‌-ఎంఐడీహెచ్‌) కింద రాష్ట్రానికి రూ.145కోట్లను కేటాయించింది. దీంతోపాటు మెట్రో అర్బన్‌ వెజిటబుల్‌ క్లస్టర్‌ పథకానికి హైదరాబాద్‌ను ఎంపిక చేసింది. ఫలితంగా రాష్ట్రానికి త్వరలో రూ.333 కోట్లు రానున్నాయి. దేశంలో కూరగాయలు, పండ్లు, పూలు, సుగంధ ద్రవ్యాల పెంపకాన్ని ప్రోత్సహించేందుకు కేంద్రం ఎంఐడీహెచ్‌ని అమలు చేస్తోంది. 2025-26 సంవత్సరానికి కార్యాచరణ ప్రణాళికను తాజాగా విడుదల చేసింది. దీనికి ముందు అన్ని రాష్ట్రాల నుంచి ప్రతి పాదనలు కోరగా… మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశాల మేరకు తెలంగాణ ఉద్యాన శాఖ డైరెక్టర్‌ యాస్మిన్‌బాషా ప్రతిపాదనలను పంపారు. తెలంగాణలో ఉద్యాన పథకాల అమలులో పురోగతిని పరిగణనలోనికి తీసుకున్న కేంద్రం…. 2025-26 సంవత్సరానికి రూ.145 కోట్లను కేటాయించింది. నిరుడు ఇచ్చిన రూ. 60 కోట్లకంటే ఇది రూ.85 కోట్లు అధికం కావడం గమనార్హం. మొత్తం రూ.145 కోట్లలో కేంద్రం 60% రాష్ట్రం 40% నిధులను భరిస్తాయి.*అన్నదాతలకు భారీగా ప్రోత్సాహకాలు:* రాష్ట్రంలో 2025-26 కార్యాచరణ ప్రణాళిక కింద ఉద్యాన సాగు విస్తీర్ణాన్ని భారీగా పెంచేందుకు ప్రభుత్వం లక్ష్యాలను నిర్దేశించింది. ఇందులో ప్రధానంగా… కూరగాయలు 5,000 ఎకరాలు, మామిడి 2,000 ఎకరాలు, నారింజ 1,000 ఎకరాలు, కోకో 2,500 ఎకరాల చొప్పున… మొత్తంగా 50 వేల ఎకరాల మేరకు పెంచాలంది. వీటికోసం అధికారులు… రాయితీలు, ప్రోత్సాహకాలను భారీగా పెంచారు. గతంలో మామిడి సాగుకు మూడేళ్లలో ఎకరానికి రూ.81,581 సాయం అందేది. దాన్ని ఇప్పుడు రూ.2 లక్షలకు పెంచారు. నారింజ, బత్తాయి, నిమ్మ, దానిమ్మ, జామ, అరటి, బొప్పాయి తోటల సాగుకు సైతం మొక్కలు, ఎరువులు, పురుగుమందులు, అంతర పంటలు, నీటి సదుపాయానికి 40% రాయితీ ఇవ్వనున్నారు. పాత తోటలను నరికి వాటి స్థానంలో తోటల పునరుద్ధరణ, ఉత్పత్తి, ఉత్పాదకతను పెంచడానికి ఎరువులు, పురుగుమందులు, కత్తిరింపు పరికరాలు, సెక్యూటర్ల కొనుగోలుకు సాయమూ అందించనున్నారు. రక్షిత సాగు కార్యక్రమాల (గ్రీన్‌ హౌస్‌/షేడ్‌ నెట్‌ హౌస్‌ / మల్చింగ్‌)కు, అంకురోత్పత్తి, తెగుళ్ల నియంత్రణకు, కోల్డ్‌ స్టోరేజీలకు, ప్యాక్‌ హౌస్‌లకూ సాయం అందిస్తారు. వ్యవసాయ యాంత్రీకరణ కింద చిన్న ట్రాక్టర్లు, పవర్‌ టిల్లర్లు, రోటోవేటర్లు, పవర్‌ వీడర్లు, తైవాన్‌, హ్యాండ్‌ స్ప్రేయర్లు మొదలైనవి సమకూరుస్తారు. సౌర కంచెలు ఏర్పాటుకు రుణమిస్తారు. పంటల శుద్ధి, మార్కెటింగ్‌కు ఊతమిస్తారు.*ఆరుజిల్లాల్లో విస్తరణకు చేయూత:* మెట్రో నగరాల్లో కూరగాయల కొరతను తీర్చేందుకు కేంద్ర ప్రభుత్వం రూ.2,000 కోట్లతో కూరగాయల సమూహాల పథకం (మెట్రో అర్బన్‌ వెజిటబుల్‌ క్లస్టర్ల) ప్రారంభించింది. అందులో భాగంగా ఐదు మెట్రో సిటీలకు 50 కిలోమీటర్ల నుంచి 100 కిలోమీటర్ల వరకున్న ప్రాంతాల్లో కూరగాయల సాగును పెద్దఎత్తున పెంచాలని నిర్ణయించింది. ఢిల్లీ, ముంబయి, చెన్నై, కోల్‌కతా, బెంగళూరుతోపాటు తాజాగా హైదరాబాద్‌ను సైతం చేర్చింది. ఇందులో భాగంగా జీహెచ్‌ఎంసీ శివార్లలో కూరగాయల పెంపకాన్ని భారీగా చేపడతారు. ఇకపై వికారాబాద్‌, సంగారెడ్డి, మహబూబ్‌ నగర్‌, నల్గొండ, నిజామాబాద్‌, వరంగల్‌ వరకు కూరగాయల సమూహాల పథకం వర్తిస్తుంది. దీనికింద కూరగాయల సాగుకు రైతులు, రైతు సమూహాలు, రైతు ఉత్పత్తిదారుల సంఘాలను ప్రోత్సహిస్తారు. అవసరమైన విత్తనాలు, నారు, మొక్కలు, సేంద్రియ ఎరువులను అందిస్తారు.

Read More

అమరావతిలో అంతర్జాతీయ గార్డెన్‌ సెంటర్‌ ఏర్పాటుకు ఇజ్రాయెల్‌ ప్రతినిధుల ఆసక్తి

అమరావతిలో అంతర్జాతీయ స్థాయి గార్డెన్‌ సెంటర్‌ నెలకొల్పేందుకు ఇజ్రాయెల్‌ ప్రతినిధులు ఆసక్తి కనబర్చారు. విజయవాడలోని అమరావతి డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (ఏడీసీ) ప్రధాన కార్యాలయంలో సంస్థ చైర్మన్‌ అండ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ డి. లక్ష్మీపార్థసారథితో ఇజ్రాయెల్‌ ప్రతినిధులు సోమవారం భేటీ అయ్యారు. శీతోష్ణస్థితిని బట్టి పెంచగలిగే వివిధ రకాల పండ్లు, పూలు, కూరగాయలు తదితరాల గురించి దృశ్య మాధ్యమం ద్వారా వివరించారు. వారి సొంత నర్సరీల్లో పండించిన కూరగాయలు, ఇతర ఉత్పత్తులను సమావేశానికి తీసుకొచ్చారు. తమ ప్రతిపాదనలను సీఎండీకి వివరించారు. సమావేశంలో గ్రీన్‌టెక్‌ లిమిటెడ్‌ ఇజ్రాయెల్‌ ప్రతినిధులు డేవిడ్‌ మిజ్రహి, ప్రశాంత్‌, కిషోర్‌, ఏడీసీ హార్టీకల్చర్‌ విభాగాధిపతి వి. ధర్మజ, అర్బన్‌ ప్లానింగ్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ప్లానింగ్‌ అధికారులు పి.సురేష్‌ బాబు, కె.వి. గణేష్‌ బాబు తదితరులు పాల్గొన్నారు.

Read More

భారతీయ వరి పరిశోధన సంస్థ – ప్రొఫెసర్‌ జయశంకర్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయాల మధ్య అవగాహన ఒప్పందం

హైదరాబాదులోని భారతీయ వరి పరిశోధనా సంస్థ, ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంల మధ్య సోమవారం అవగాహన ఒప్పందం కుదిరింది. రాజేంద్రనగర్‌లోని వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిపాలన భవనంలో జరిగిన కార్యక్రమంలో విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్‌ డాక్టర్‌ జి.ఇ.సిహెచ్‌. విద్యాసాగర్‌, భారతీయ వరి పరిశోధనా సంస్థ (ఐఐఆర్‌ఆర్‌) సంచాలకులు డాక్టర్‌ ఆర్‌. మీనాక్షి సుందరం పి.జె.టి.ఎ.యు. ఉపకులపతి ప్రొఫెసర్‌ ఆల్దాస్‌ జానయ్య సమక్షంలో అవగాహన ఒప్పంద పత్రాలపై సంతకాలు చేసి పరస్పరం మార్చుకున్నారు.
ఈ సందర్భంగా ప్రొఫెసర్‌ జానయ్య మాట్లాడుతూ వాతావరణ మార్పులకు అనుగుణంగా వ్యవసాయ పరిశోధనలు ప్రాధాన్యతా పద్ధతిలో చేపట్టాలని, వరిలో ఉత్పత్తి, ఉత్పాదకతల పెంపుతో పాటు రైతులకు, వినియోగదారులకు కూడా ప్రయోజనాలు కలిగించే విధంగా ఇరు సంస్థలు కలిసి పనిచేయాలన్నారు. వరిలో కార్భన్‌ క్రెడిట్‌ ద్వారా రైతులు మరింత ఆర్థికపరమైన ప్రయోజనం కలిగించే విధానాలపై దృష్టి నిలపాలన్నారు. వరిలో వాతావరణ మార్పులను తట్టుకునే వరి రకాల రూపకల్పన ప్రస్తుతం అవసరమన్నారు. అంతేకాకుండా ప్రస్తుతం తెలంగాణ 5 మిలియన్‌ టన్నుల మేర వరి ధాన్యం మిగులు ఉత్పత్తి చేస్తోందని, అందుకు ఎగుమతులే సరైన విధానమని, రైతులను అటువైపు మళ్లించడానికి అవసరమైన సాంకేతిక అంశాలపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రపంచంలో వరి ధాన్యాన్ని దిగుమతి చేసుకునే దేశాలలో అత్యంత ఎక్కువగా దిగుమతి చేసుకునే దేశమైన ఫిలిప్పైన్స్‌కు మన రాష్ట్రం నుండి ఎగుమతి చేయడానికి ఉన్న అద్భుత అవకాశాలను వినియోగించుకునే విధంగా వరి పంట సాగును ఒక ఆధునికమైన పరిశ్రమగా మార్చే అవకాశాలున్నాయని అభిప్రాయపడ్డారు. దీనికి అనుగుణంగా రెండు సంస్థలు తదనుగుణంగా పనిచేయాల్సిన ఆవశ్యకతను గుర్తించాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో భారతీయ వరి పరిశోధన సంస్థ సంచాలకులు డాక్టర్‌ ఆర్‌. మీనాక్షి సుందరం మాట్లాడుతూ రైతులకు మేలైన సేవలు అందించేందుకు ఇరు సంస్థలు సమన్వయంతో పనిచేసేందుకు ఈ అవగాహన ఒప్పందం దోహదం చేస్తుందన్నారు.
ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయ ఉన్నతాధికారులు, ఐఐఆర్‌ఆర్‌ సంస్థకు చెందిన శాస్త్రవేత్తలు పాల్గొన్నారు.

Read More

బర్డ్‌ఫ్లూపై దుష్ప్రచారం చేసే వారిపై చర్యలు తీసుకోండి

కలెక్టర్లకు సీఎస్‌ విజయానంద్‌ ఆదేశాలు

బర్డ్‌ ఫ్లూ వైరస్‌పై తప్పుడు వార్తలు ప్రసారం చేసే వారిపై చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌) విజయానంద్‌ కలెక్టర్లను ఆదేశించారు. గురువారం ఆయన సచివాలయం నుంచి కలెక్టర్లతో బర్డ్‌ ఫ్లూ, దాని నియంత్రణ చర్యలపై సమీక్షించారు. వైరస్‌ వ్యాప్తి చెందకుండా కేంద్రం జారీ చేసిన మార్గదర్శకాలను పకడ్బందీగా అమలు చేయాలని సూచించారు. చనిపోయిన కోళ్లను సరైన విధానంలో పూడ్చిపెట్టేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు.

మనుషులకు సోకడం అత్యంత అరుదు
ఏవియన్‌ ఇన్ఫ్లుయెంజా వైరస్‌ రాష్ట్రంలో మనుషులకు సోకినట్లు ఎక్కడా నమోదు కాలేదని వైద్య ఆరోగ్య శాఖ ప్రధాన కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు చెప్పారు. మనుషులకు ఈ వైరస్‌ అత్యంత అరుదుగా సోకుతుందని, గత అయిదేళ్లలో హరియాణా, మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్‌ తదితర రాష్ట్రాల్లో కేవలం నాలుగు కేసులు నమోదయ్యాయని వివరించారు.

15 రోజులకోసారి నివేదికలివ్వాలి
ప్రతి జిల్లా, మండలంలో ఏర్పాటు చేసే కోళ్ల ఫారాలను తప్పనిసరిగా రిజిస్టర్‌ చేయించేలా చూడాలని కేంద్ర పశుసంవర్ధక శాఖ కమిషనర్‌ డాక్టర్‌ అభిజిత్‌ మిత్రా అధికారులకు సూచించారు. ప్రతి 15 రోజులకు కోళ్లకు సంబంధించిన నమూనాలు తీసి, నివేదికలు సమర్పించాలని ఆదేశించారు. వ్యాధి సోకిన ఫారాలకు కిలోమీటరు పరిధిని రెడ్‌ జోన్‌ ప్రకటించి ముందు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. సమావేశంలో వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజశేఖర్‌, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్‌ వీరపాండియన్‌, పశు సంవర్ధక శాఖ డైరెక్టర్‌ దామోదర్‌ నాయుడు పాల్గొన్నారు.

Read More