హోలీ వేడుకలకు ఆవుపేడతో గులాల్‌

ఉత్తర్‌ ప్రదేశ్‌లోని సహారన్‌పుర్‌లోగల ‘శ్రీ శాకంబరి కన్హా ఉపవన్‌ గోశాల’లో హోలీ వేడుకల కోసం ఆవుపేడతో గులాల్‌ తయారుచేశారు. దీని వాడకం వల్ల ఆరోగ్యపరంగా ఎటువంటి సమస్యలు ఉండవని చెబుతున్న నిర్వాహకులు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి, యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు పర్యావరణ హితమైన ఈ గులాల్‌ను పంపే ఏర్పాట్లు చేస్తున్నారు. మున్సిపల్‌ కమిషనర్‌ సంజయ్‌ చౌహాన్‌ పర్యవేక్షణలో ప్రకృతి సిద్ధంగా రూపొందిన ఈ గులాల్‌ సింథటిక్‌ రంగులతో కలిగే హాని బారిన పడకుండా చక్కటి ప్రత్యామ్నాయమని అంటున్నారు. మున్సిపల్‌ కార్పొరేషను ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ గోశాల ప్రయోగాలకు ఐఎస్‌వో ధ్రువపత్రం కూడా ఉందని, గతంలో పర్యావరణహిత పెయింటు కూడా తయారుచేసినట్లు సంజయ్‌ చౌహాన్‌ తెలిపారు. 4 రంగుల్లో రూపొందించిన గులాల్‌ ప్యాకెట్లను అన్‌లైనులో అందుబాటులో ఉంచినట్లు గోశాల చీఫ్‌ ఇంజినీరు బీకే సింగ్‌ వెల్లడించారు.

Read More

ప్రకృతి సాగు.. ఆరోగ్యానికెంతో బాగు

అన్నదాతలకు అవగాహన కల్పించిన పాలేకర్‌

సాగులో రసాయనాల వాడకం వల్ల పంట ఉత్పత్తులు విషపూరితంగా మారుతున్నాయని ప్రకృతి వ్యవసాయ నిపుణులు సుభాష్‌ పాలేకర్‌ ఆందోళన వ్యక్తం చేశారు. వాటి వల్ల ప్రజల్లో మధుమేహం, క్యాన్సర్‌, గుండెజబ్బుల ముప్పు పెరుగుతోందన్నారు. సహజ పద్ధతుల్లో పండించిన ఆహార ఉత్పత్తులు ఆరోగ్యానికి మేలు చేకూరుస్తాయని సూచించారు. మహారాష్ట్రలోని నాసిక్‌ జిల్లా పడ్లి గ్రామంలో సహజ వ్యవసాయం ద్వారా మంచి దిగుబడి సాధిస్తున్న రైతు ధ్యానేశ్వర్‌ రేవ్‌గడేకు చెందిన పొలంలో పాలేకర్‌ నేతృత్వంలో ఆదివారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. దీనికి దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి సుమారు వెయ్యి మంది అన్నదాతలు హాజరయ్యారు. వీరిలో ఏపీ, తెలంగాణకు చెందిన సుమారు 700 మంది రైతులు ఉన్నారు. రసాయనాలు వినియోగించే ఏ వ్యవసాయ విధానమైనా ఆరోగ్యానికి చేటు చేసేదేనని ఈ సందర్భంగా పాలేకర్‌ పేర్కొన్నారు. ఆరోగ్యకరమైన ఆహార ఉత్పత్తులకు ప్రకృతి వ్యవసాయం ఒక్కటే మార్గమని పేర్కొన్నారు. ధ్యానేశ్వర్‌ తన మూడెకరాల పొలంలో అయిదు రకాల అరటి, 20 రకాల కూరగాయలు, స్ట్రాబెర్రీలు, దోసకాయలు, పుచ్చకాయలు పండిస్తూ మంచి ఆదాయం పొందుతున్నారని పాలేకర్‌ వివరించారు. సాధారణంగా స్ట్రాబెర్రీలు శీతల వాతావరణంలో పెరుగుతాయని, అయితే 38 డిగ్రీల ఉష్ణోగ్రత ఉండే నాసిక్‌లోనూ ప్రకృతి వ్యవసాయం ద్వారా వాటిని పండించడం అభినందనీయమన్నారు. ముంగసరే గ్రామానికి చెందిన రైతు హితేశ్‌ పటేల్‌ పొలాన్ని కూడా అన్నదాతల బృందం సందర్శించింది.

Read More

పామాయిల్‌ రైతులకు శుభవార్త

టన్నుకు 20871/- రూపాయాలకు చేరుకున్న పామాయిల్‌ గెలల ధర – మంత్రి తుమ్మల

తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ రంగానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నదని, రాష్ట్రంలో పంట మార్పిడి ఆవశ్యకత మరియు వంట నూనెల డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకొని ఆయిల్‌ పామ్‌ సాగును రాష్ట్రంలో పెద్ద ఎత్తున్న చేపట్టడానికి ప్రభుత్వం నిర్ణయించిందని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలియజేసారు. గత సంవత్సరం ఫిబ్రవరిలో టన్నుకి ఆయిల్‌ పామ్‌ గెలల ధర రూ13135/- ఉండగా ఈ నెల ఆయిల్‌ పామ్‌ గెలల ధర రూ20871/-కి పెరగడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారన్నారు. పెరుగుతున్న ధరలను దృష్టిలో ఉంచుకొని రైతులు ఆయిల్‌ పామ్‌ సాగుకు ముందుకు రావాలని మంత్రి పేర్కొన్నారు. ఆయిల్‌ పామ్‌ రైతులకు అధిక ధరలను అందించి ఆయిల్‌ పామ్‌ సాగును లాభ సాటిగా చేయటమే ప్రభుత్వ లక్ష్యం అని మంత్రివర్యులు పేర్కొన్నారు.

ఆయిల్‌ ఫెడ్‌ వారి ప్రోసెసింగ్‌ మిల్లులలో నూనె రికవరీ శాతం మరియు ముడి పామాయిల్‌ అమ్మకం ధరల ఆధారంగా ప్రతి నెల ఆయిల్‌ పామ్‌ గెలల ధర నిర్ణయించడం జరుగుతుంది. అయితే తెలంగాణ ఆయిల్‌ ఫెడ్‌ ద్వారా నడపబడుతున్న అప్పరావ్‌ పేట మరియు అశ్వరావుపేటలోని ఆయిల్‌ పామ్‌ కర్మాగారాలలో నూతన టెక్నాలజీతో కొత్త యంత్రాలు ఏర్పాటు చేయడం మరియు ఉన్న యంత్రాలను అధునికరించడం వల్ల ఆయిల్‌ పామ్‌ గెలల నుండి వచ్చే నూనె రికవరీ 19.02 శాతం నుండి 19.42 శాతముకు పెరగడం వల్ల ఆయిల్‌ పామ్‌ గెలల ధర పెరుగుదలతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారని మంత్రి తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో నిర్ణయించబడిన ఆయిల్‌ పామ్‌ గెలల ధరను ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఇవ్వాల్సిరావడంతో అక్కడ పామ్‌ ఆయిల్‌ రైతులకు కూడా ప్రయోజనం చేకూరుతున్నది. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని ఆయిల్‌ పామ్‌ కంపెనీలు కొంత మంది బ్రోకర్లను ఏర్పాటు చేసి వారి ద్వారా తెలంగాణ ఆయిల్‌ ఫెడ్‌ ప్రతిష్టను దిగజార్చే ప్రయత్నం చేస్తున్నారని, వారు ఎన్ని ప్రయత్నాలు చేసినా తెలంగాణ ఆయిల్‌ ఫెడ్‌ రైతుల సంక్షేమం కోసం పని చేస్తూ నూనె రికవరీ శాతం పెంచుతూ ఆయిల్‌ పామ్‌ రైతుల మన్నలను అందుకుంటున్నదని మంత్రి పేర్కొన్నారు. రాష్ట్రంలో 1992-93 నుంచి ఇప్పటి వరకు 2.39 లక్షల ఎకరాలను ఆయిల్‌ పామ్‌ సాగులోకి తీసుకురావడం జరిగిందని, వచ్చే సంవత్సరంలో మరో లక్ష ఎకరాలలో ఆయిల్‌ పామ్‌ సాగు చేపట్టేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతున్నదని మంత్రివర్యులు పేర్కొన్నారు. రైతులను ఆయిల్‌ పామ్‌ సాగు వైపు ప్రోత్సహించేందుకు ఏకరాకు రూ. 50918/- రాయితీని నాలుగు సంవత్సరాల కాలానికి ఇవ్వడం జరుగుతున్నదని, రైతులు పెద్ద ఎత్తున ఆయిల్‌ పామ్‌ సాగు చేయడానికి ముందుకు రావాలని మంత్రి కోరారు.

Read More

బడ్జెట్‌ సందర్భంగా వ్యవసాయం మరియు అనుబంధ రంగాల గురించి శాసనసభలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఆర్థిక శాఖామంత్రి పయ్యావుల కేశవ్‌ అసెంబ్లీలో చేసిన ప్రసంగం

ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్‌ ఎం. ఎస్‌. స్వామినాథన్‌ గారి మాటలు నాకు గుర్తుకొస్తున్నాయి.*

”వ్యవసాయం గాడి తప్పితే మరేదీ సక్రమంగా సాగడానికి అవకాశం ఉండదు.”*

మన రాష్ట్ర వ్యవసాయ రంగం 62 శాతం జనాభాకు ఆసరాగా ఉంటూ, మన ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలుస్తోందన్నది వాస్తవం. వ్యవసాయ రంగం ఎంతో ప్రాముఖ్యతను కలిగి ఉంది. వివిధ వ్యవసాయ పథకాల క్రింద చెల్లించవలసిన 5,510 కోట్ల రూపాయల బకాయిలలో 693 కోట్ల రూపాయల బకాయిలను మా ప్రభుత్వం చెల్లించింది. రాష్ట్రీయ కృషి వికాస్‌ యోజన క్రింద చేపట్టే డ్రిప్‌ ఇరిగేషన్‌ పథకం కొన్ని సంవత్సరాలుగా అమలు కాలేదు. ఈ సందర్భంగా డ్రిప్‌ ఇరిగేషన్‌ ఈ దేశంలోకి తొలి అడుగు ఎలా పెట్టిందనేది ఈ తరానికి తెలియచెప్పాల్సి ఉంది. డ్రిప్‌ ఇరిగేషన్‌ గురించి ఎవ్వరూ ఆలోచన చేయని 90వ థకంలో ఇజ్రాయిల్‌ టెక్నాలజీని రాష్ట్రానికి తేవాలన్నారు చంద్రబాబు గారు. అధ్యయనానికి ఇజ్రాయిల్‌కి వెళ్లిన కమిటీలో నేను సభ్యుడిగా ఉన్నాను. ముగ్గురు ఐ.ఏ.ఎస్‌. అధికారులను, నన్ను సభ్యుడిగా ఆ కమిటీలో నియమించారు. నాటి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబుగారి సూచనల మేరకు దాన్ని అధ్యయనం చేసి అందించిన నివేదిక ఆధారంగా దేశంలోనే తొలిసారిగా ఉమ్మడి రాష్ట్రంలో డ్రిప్‌ ఇరిగేషన్‌ పైలెట్‌ ప్రాజెక్టును ప్రారంభించారు. ఆ తర్వాత డ్రిప్‌ ఇరిగేషన్‌ పై జాతీయ స్థాయిలో వేసిన టాస్క్‌ ఫోర్సుకు ఆయనే నేతృత్వం వహించారు. ఇవాళ డ్రిప్‌ లేని రాష్ట్రంలేదు.. పొలం లేదు. వాట్‌ చంద్రబాబు నాయుడు గారు థింక్స్‌ టుడే… నేషన్‌ థింక్స్‌ టుమారో…. చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఏం ఆలోచిస్తారో… అదే రేపు దేశం ఆలోచిస్తుందనడానికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి. ప్రస్తుత ప్రభుత్వం ఏర్పడిన తర్వాత డ్రిప్‌ ఇరిగేషన్‌ కోసం 176 కోట్ల రూపాయలను విడుదల చేసి, అదనంగా 85 వేల హెక్టార్లను డ్రిప్‌ ఇరిగేషన్‌ క్రింద తీసుకురావడానికి అనుమతులు ఇచ్చింది. జీవితంలో ఒక్కసారైనా డాక్టర్‌, లాయర్‌, పోలీస్‌ మరియు బోధకుడు అవసరమని చెబుతూ ఉంటారు. కానీ రైతు ప్రతిరోజూ అవసరం. మూడు పూటలా అవసరం. కాబట్టి అలాంటి అన్నదాతలకు ప్రగాఢ కృతజ్ఞతా భావంతో మేం మరో సూపర్‌ సిక్స్‌ హామీని నెరవేర్చడానికి సిద్ధమవుతున్నామని తెలియచేయడానికి ఎంతో సంతోషంగా ఉంది. ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా… అన్నదాత సుఖీభవ పథకం కింద ప్రతి రైతుకు ఏటా 20 వేల రూపాయలు అందించేలా కేటాయింపులు చేశామని చెప్పడానికి గర్విస్తున్నాం. వ్యవసాయ రంగానికి ఊతమిచ్చేందుకు రాష్ట్రవ్యాప్తంగా 21.87 లక్షల వ్యవసాయ పంపుసెట్లకు 9 గంటల ఉచిత పగటిపూట విద్యుత్‌ను సరఫరా చేస్తోంది. చేపల వేట నిషేధ కాలంలో మత్స్యకారులకు అందించే ఆర్థిక సహాయాన్ని 10,000 రూపాయల నుంచి 20,000 రూపాయలకు రెట్టింపు చేస్తామనే మ్యానిఫెస్టోలోని మరో హామీని నెరవేర్చడానికి తగిన కేటాయింపులు చేశామని సంతోషంగా ప్రకటిస్తున్నాను. 2025-26 ఆర్థిక సంవత్సరానికి వ్యవసాయం మరియు అనుబంధ రంగాలకు 13,487 కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను.

*రూ.48,340 కోట్లతో వ్యవసాయ బడ్జెట్‌*

అసెంబ్లీలో ప్రవేశపెట్టిన మంత్రి అచ్చెన్నాయుడు రైతులకు భారీ మేలు కలిగేలా కేటాయింపులు రాష్ట్ర రైతుకు వెన్నుదన్నుగా నిలిచేలా 2025-25 వార్షిక వ్యవసాయ బడ్జెట్‌ను ఇవాళ అసెంబ్లీలో వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ప్రవేశ పెట్టారు. సాధారణ బడ్జెట్‌ అనంతరం దీనిని అసెంబ్లీ ముందుకు తెచ్చారు. రూ.48,340 కోట్లతో వ్యవసాయ బడ్జెట్‌ ప్రతిపాదనలను అచ్చెన్నాయుడు అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ దేశం, రాష్ట్రం అభివృద్ధికి దోహదపడేది వ్యవసాయ రంగమన్నారు. ప్రకృతి వ్యవసాయంపై దృష్టి పెట్టినట్లు తెలిపారు. ప్రజల భాగస్వామ్యంతో ప్రకృతి వ్యవసాయంపై కూటమి సర్కార్‌ ఫోకస్‌ పెట్టిందని తెలిపారు. వ్యవసాయం ప్రాథమిక రంగంగా గుర్తింపు ఉందని పేర్కొన్నారు. రాష్ట్రంలో భూమి కలిగిన వారికి ప్రత్యేక గుర్తింపు సంఖ్య ఇవ్వనున్నట్టు మంత్రి వెల్లడించారు. రైతులను స్థితిమంతులుగా చూడాలని ఆకాంక్షిస్తూ స్వర్ణాంధ్ర-2047 లక్ష్యాన్ని సాధించే దిశగా అడుగులు వేస్తున్నట్లు చెప్పారు. వికసిత్‌ భారత్‌కు అనుసంధానంగా ఏపీని ప్రగతిపథంలో ముందుకు తీసుకెళ్తామని తెలిపారు. 2047 నాటికి 2.4 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా రాష్ట్రాన్ని మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నామని వెల్లడించారు.

*భారీగా కేటాయింపులు*

వ్యవసాయ బడ్జెట్‌ ప్రవేశపెట్టిన ప్రభుత్వం ఆయా రంగాలకు భారీగా కేటాయింపులు చేసింది. ఎరువులు, ప్రకృతి వ్యవసాయం, వ్యవసాయ యంత్రాల రాయితీ, డ్రోన్ల రాయితీకి సంబంధించి భారీగా కేటాయించారు. ఈ కేటాయింపుల వల్ల రైతులకు భారీగా మేలు చేకూరనుంది. శాసనమండలిలో వ్యవసాయ బడ్జెట్‌ 2025-26 ను మంత్రి పి. నారాయణ ప్రవేశపెట్టారు.

Read More

మత్స్య రంగానికి మరింత ఊతంభారీ రాయితీలు, ప్రోత్సాహకాలు

తెలంగాణాలో చేపల పెంపకాన్ని మరింత ప్రోత్సహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. కేంద్ర ప్రభుత్వ పథకమైన ప్రధానమంత్రి మత్స్య కిసాన్‌ సమృద్ధి సహ యోజనను (పీఎంఎంకేఎస్‌ఎస్‌వై) 2025-26 నుంచి ప్రారంభించేందుకు కార్యాచరణను సిద్ధం చేస్తోంది. మత్స్యకారులు, రైతులు, రైతు ఉత్పత్తి సంఘాలు, ప్రాథమిక సహకార సంఘాలు, స్వయం సహాయక సంఘాలకు అవకాశం కల్పించనుంది. ఈ పథకం కింద రాష్ట్రానికి రూ.250 కోట్లు వస్తాయి.

*చేపల పెంపకం ఇలా…*

ఎకరం నుంచి నాలుగెకరాల్లో చేపలు పెంచాలి. చెరువులు, కుంటల తవ్వకం, చేపపిల్లల కొనుగోలు, పెంపకానికి కేంద్రం సాయం అందిస్తుంది.

*సబ్సిడీలు…*

వ్యక్తిగతంగా చేపల పెంపకం యూనిట్‌కు జనరల్‌ కేటగిరీలో రూ.35 లక్షల గరిష్ఠ పరిమితితో 35 శాతం సబ్సిడీ ఉంటుంది. ఎస్సీ, ఎస్టీలకు, మహిళలకు రూ. 45 లక్షల పరిమితితో 35 శాతం సబ్సిడీని ఇస్తారు. రైతు ఉత్పత్తి సంఘాలు, స్వయంసహాయక సంఘాలు, సమాఖ్యలకు రూ.2 కోట్ల పరిమితితో 35 శాతం సబ్సిడీ లభిస్తుంది. ఏదైనా సంస్థ పేరిట యూనిట్‌ను స్థాపిస్తే రూ.75 లక్షల పరిమితితో 25 శాతం సబ్సిడీ అందుతుంది. ఎస్సీ, ఎస్టీ, మహిళల యాజమాన్యంలోని చిన్న సంస్థలకు రూ. కోటి పరిమితితో 35% సబ్సిడీ ఇస్తారు. కిసాన్‌ కార్డులున్న వారికి పీఎంఎంకేఎస్‌ఎస్‌వై కింద బ్యాంకులు రుణాలిస్తాయి. లబ్ధిదారులకు రుణ సాయంలో సంవత్సరానికి 3% వరకు వడ్డీ రాయితీని కేంద్ర ప్రభుత్వం కల్పిస్తుంది. పీఎంఎంకేఎస్‌ఎస్‌వై కోసం నేషనల్‌ ఫిషరీస్‌ డిజిటల్‌ ప్లాట్‌ఫాం వెబ్‌సైట్‌లో విధిగా నమోదు చేసుకోవాలి. తర్వాత రాష్ట్ర మత్స్యశాఖ అధికారులు ఆరా తీసి కేంద్రానికి నివేదిస్తారని మత్స్యశాఖ సంచాలకురాలు ప్రియాంక అభిప్రాయపడ్డారు. పథకానికి విస్తృత ప్రచారం కల్పిస్తామన్నారు.

Read More

కృష్ణా డెల్టాకు సమగ్ర నీటి ప్రణాళిక

తాగునీటి చెరువులు నింపేందుకు కసరత్తు ఏప్రిల్‌ 15 వరకు 17.2 టీఎంసీల విడుదల

కృష్ణా డెల్టా పరిధిలో ఉమ్మడి గుంటూరు, కృష్ణా, ఏలూరు, ప్రకాశం జిల్లాల్లో వేసవిలో నీటి కొరత రాకుండా జలవనరుల శాఖ ప్రణాళిక సిద్ధం చేసింది. ప్రస్తుతం కృష్ణా తూర్పు, పశ్చిమ డెల్టాలో సాగులో ఉన్న పంటలకు నీరిస్తూనే… తాగు అవసరాలకు అనుగుణంగా కసరత్తు చేస్తున్నారు. పులిచింతల, ప్రకాశం బ్యారేజీలో నిల్వ నీటిని సమర్థంగా ఉపయోగిస్తూనే.. వచ్చే ఖరీఫ్‌లో పంటల సాగుకు ప్రారంభంలో నీటి విడుదలకు వీలుగా కార్యాచరణ ప్రణాళిక రూపొందించారు.

తూర్పు డెల్టాలోని పంటలు తుదిథకు చేరుకున్నాయి. ఇక్కడ పెద్దగా సాగునీటి అవసరాలు లేవు. పశ్చిమ డెల్టా పరిధిలో మొక్కజొన్న, జొన్న సాగు ఎక్కువగా ఉండటం, కొంత ఆలస్యంగా రబీలో పంటలు వేయడంతో మార్చి నెలాఖరు వరకు సాగు నీటి అవసరాలు ఉన్నాయి. వీటిని దృష్టిలో ఉంచుకుని ఏప్రిల్‌ 15 వరకు తూర్పు డెల్టా కాలువలకు 8.6 టీఎంసీలు, పశ్చిమ డెల్టా కాలువలకు 8.6 టీఎంసీలు కలిపి బ్యారేజీ నుంచి 17.2 టీఎంసీల నీరిచ్చేలా రోజువారీ ప్రణాళిక సిద్ధం చేశారు. తాగునీటి చెరువులను నింపుతూ నీటి విడుదల ఆపే నాటికి వంద శాతం నీటినిల్వ సామర్థ్యంతో ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. తాగునీటి చెరువుల్లో నిల్వ చేసిన నీరు సగటున 90 రోజుల వరకు సరఫరాకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఈ లెక్కన జులై నెలలో మళ్లీ కాలువలకు నీటిని విడుదల చేస్తారు

. *37 టీఎంసీల నీటి లభ్యత…*

పులిచింతల ప్రాజెక్టులో 34.24 టీఎంసీలు, ప్రకాశం బ్యారేజీలో 3.03 టీఎంసీలు ఉన్నాయి. ప్రస్తుతం నీటి విడుదల కొనసాగుతున్న వాటితో లెక్కిస్తే ఏప్రిల్‌ 15 నాటికి పులిచింతలలో 20 టీఎంసీల నీరు ఉంటుంది. దీనిని నిల్వచేసి రాబోయే ఖరీఫ్‌ సీజన్‌లో ముందస్తుగా నారుమళ్లు వేసుకోవడానికి, వర్షాలు ఆలస్యమైతే తాగునీటి అవసరాలకు అనుగుణంగా విడుదల చేయనున్నారు. పులిచింతల, ప్రకాశం బ్యారేజీలో వేసవిలో సైతం నీటిని నిల్వ చేయడంతో పరిసర ప్రాంతాల్లో భూగర్భ జలాలకు లోటుండదు. ప్రభుత్వం ముందుచూపుతో గోదావరి నీటిని ప్రకాశం బ్యారేజీకి తరలించి పులిచింతలలో నీటినిల్వలు తగ్గకుండా చూడటంతో ఇప్పుడు అవసరాలకు పులిచింతల నీరు అక్కరకు వస్తోంది.

*రెండు పంటలకు పుష్కల నీరు..*

కృష్ణా డెల్టా పరిధిలో 13 లక్షల ఎకరాల ఆయకట్టుకు ఖరీఫ్‌, రబీ సీజన్‌లో పుష్కలంగా సాగునీరు సరఫరా చేశారు. కృష్ణానదికి గతేడాది నీటిప్రవాహం ఉండటం, అవసరమైనప్పుడు గోదావరి నది నీటిని పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా ఎత్తిపోసి ప్రకాశం బ్యారేజీకి తరలించి పంటలకు సాగునీరు అందించారు. సాగునీటి సమస్య లేకపోవడంతో ఈసారి ఆయిల్‌ఇంజిన్లు పెట్టి పంటలకు నీరందించాల్సిన దుస్థితి తప్పి… పెట్టుబడి వ్యయమూ తగ్గింది. రబీ లోనూ పంటలు పూర్తయ్యే వరకు నీటి విడుదల కొనసాగుతుండటంతో రైతులకు కలిసొచ్చింది. ప్రస్తుతం మినుము, పెసర, జొన్న, మొక్కజొన్న పంటలు సాగులో ఉన్నాయి. కాలువల చివర, సముద్రతీర ప్రాంత ఆక్వా చెరువులకు కూడా ఈసారి నీటిసమస్య రాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. కూటమి ప్రభుత్వం స్పష్టమైన ప్రణాళికలతో నీటి వనరులు సద్వినియోగంతో అన్నదాతల కష్టాలు తొలిగాయి.

Read More

అగ్రివర్సిటీలో మానవ వనరుల అభివృద్ధి కేంద్రం

తెలంగాణ వ్యవసాయ విశ్వ విద్యాలయంలో మానవ వనరుల అభివృద్ధి కేంద్రం (సెంటర్‌ ఫర్‌ హ్యూమన్‌ రిసోర్సెస్‌ డెవలప్‌మెంట్‌) ఏర్పాటు చేసినట్లు ఉపకులపతి అల్దాస్‌ జానయ్య తెలిపారు. ఒక వ్యవసాయ విశ్వవిద్యాలయంలో హెచ్‌ఆర్‌డీ కేంద్రం ఏర్పాటు కావడం ఇదే తొలిసారి అన్నారు. విశ్వ విద్యాలయంలోని సెంటర్‌ ఫర్‌ అడ్వాన్స్‌డ్‌ ఫ్యాకల్టీ ట్రైనింగ్‌ ఇన్‌ కమ్యూనిటీ సైన్స్‌, పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ రీసెర్చ్‌ సెంటర్‌లో దేశంలోని వివిధ విశ్వవిద్యాలయాలకు 21 రోజుల శిక్షణ కార్యక్రమాన్ని మంగళవారం ఆయన ప్రారంభించారు. విశ్వవిద్యాలయాల్లో విద్యార్థులతో పాటు సిబ్బందికి శిక్షణ కార్యక్రమాలు కొనసాగాలన్నారు.

Read More

మార్చి 31లోగా పశుగణన పూర్తి చేయాలి

పశుగణన కార్యక్రమాన్ని మార్చి 31 లోగా పూర్తి చేయాలని కేంద్ర పశు సంవర్ధక, మత్స్య మంత్రిత్వ శాఖ రాష్ట్రాలను ఆదేశించింది. ఫిబ్రవరి 28 నాటికి ఈ ప్రక్రియను ముగించాలని గతంలో ఆదేశాలు ఇవ్వగా, తాజాగా మరో నెల పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఇప్పటికే పశుగణన పూర్తి కావొచ్చింది. మార్చి నుంచి సేకరించిన లెక్కలు, సమాచారాన్ని ధ్రువీకరించుకొని అవసరమైన దిద్దుబాట్లు చేయనున్నారు.

Read More

9.8 కోట్ల రైతుల ఖాతాల్లోకి రూ.22 వేల కోట్లు

పీఎం కిసాన్‌ నిధులు విడుదల చేసిన మోదీ

‘పీఎం కిసాన్‌ ‘సమ్మాన్‌ నిధి’ పథకం 19వ విడత కింద 9.8 కోట్ల మంది రైతుల ఖాతాల్లోకి రూ.22,000 కోట్లను ప్రధాని మోదీ సోమవారం బదిలీ చేశారు. బిహార్‌ లోని భాగల్పుర్‌లో జరిగిన కార్యక్రమంలో ఈ నిధులు విడుదల చేశారు. దేశ అన్నదాతలు తనకు గర్వకారణమని అంతకుముందు ఆయన ‘ఎక్స్‌’లో పోస్టు చేశారు. పీఎం కిసాన్‌ పథకం కింద ఇప్పటి వరకూ రైతుల ఖాతాల్లో రూ. 3.5 లక్షల కోట్లు జమచేశామని పేర్కొన్నారు. గడచిన పదేళ్లుగా తమ ప్రభుత్వం చేసిన కృషి ఫలితంగా వ్యవసాయ రంగం త్వరితగతిన అభివృద్ధి చెందిందని తెలిపారు. పంట వేయడానికి అయ్యే ఖర్చు తగ్గి రైతుల ఆదాయం పెరిగిందని అన్నారు.

Read More

పీవీ నరసింహారావు పశువైద్య విశ్వవిద్యాలయం ఉపకులపతిగా డా|| మంథని జ్ఞాన ప్రకాశ్‌

తెలంగాణ రాష్ట్రంలోని పీవీ నరసింహారావు పశువైద్య విశ్వవిద్యాలయం ఉపకులపతిగా డా|| మంథని జ్ఞాన ప్రకాశ్‌ నియమితులయ్యారు. వీరు పదవీ బాధ్యతలు చేపట్టినప్పటినుంచి మూడు సంవత్సరాలపాటు ఈ పదవిలో కొనసాగుతారు. డా. జ్ఞాన ప్రకాశ్‌ పశువైద్య విశ్వవిద్యాలయం పరిశోధన సంచాలకులు, రిజిస్ట్రార్‌, కంప్ట్రోలర్‌గా పలు హోదాల్లో సేవలు అందించారు. రైతునేస్తం వీరికి అభినందనలు తెలియచేస్తుంది.

Read More