శుద్ధి, నిల్వ సౌకర్యాల కోసం అన్నదాతలకు సాయం

కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ డైరెక్టర్‌

పంటల సాగుతో పాటు అన్న దాతలు ఉత్పత్తుల శుద్ధి, నిల్వ సౌకర్యాలతో అదనపు ఆదాయం పొందాలని కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ డైరెక్టర్‌ ఆర్కే మీనా సూచించారు. మౌలిక వసతుల నిధి కింద కేంద్ర ప్రభుత్వం సాయం అందిస్తోందని, ఏఐఎఫ్‌లో తక్కువ వడ్డీతో రుణసాయం లభిస్తోందని దానిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. గురువారం హైదరాబాద్‌లో జరిగిన తెలంగాణ వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధి(ఏఐఎఫ్‌) సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. గోదాములు, శీతల గిడ్డంగులు, శుద్ధి యూనిట్లు, కస్టమ్‌ హైరింగ్‌ కేంద్రాల ఏర్పాటుకు ఏఐఎఫ్‌ ద్వారా సాయం అందిస్తున్నామన్నారు. మౌలిక సదుపాయాల ఖర్చులు పెరుగుతున్న నేపథ్యంలో రైతులు కేంద్ర పథకాల ద్వారా లబ్ధి పొందాలన్నారు. జాతీయ వ్యవసాయ గ్రామీణాభివృద్ధి బ్యాంకు (నాబార్డు) చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌ ఉదయ్‌ భాస్కర్‌ మాట్లాడుతూ మౌలిక సదుపాయాల నిధి రైతుల ఆర్థికాభివృద్ధికి దోహదపడుతుందని తెలిపారు. ఏఐఎఫ్‌ కింద సత్వరమే రుణాలు అందిస్తున్నామని రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ జీఎం ప్రశాంతకుమార్‌ వెల్లడించారు. ఏఐఎఫ్‌ ప్రగతిలో తెలంగాణ రెండో స్థానంలో నిలిచినందుకు తెలంగాణ విభాగం అధికారి భుజంగరావు, రవితేజ ఇతర సిబ్బందిని ఆర్కే మీనా సత్కరించి జ్ఞాపికను బహుకరించారు.

Read More

నాబార్డ్‌ స్టేట్‌ ఫోకస్‌ పేపర్‌ ఆవిష్కరణలో పాల్గొన్న ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

తెలంగాణ రాష్ట్రంలోని వ్యవసాయ రంగ అభివృద్ధికి బ్యాంకర్లు మరింత సహకరించాల్సిన అవసరం ఉందని రాష్ట్ర మార్కెటింగ్‌, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. నాబార్డ్‌ స్టేట్‌ ఫోకస్‌ పేపర్‌ ఆవిష్కరణ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క గారితో కలిసి ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ, వ్యవసాయ అనుబంధ రంగాలకు విరివిగా రుణాలు అందించాల్సిన అవసరాన్ని బ్యాంకర్ల దృష్టికి తీసుకెళ్లారు. పశుపోషణ, మత్స్యపరిశ్రమ, కృషి ఆధారిత పరిశ్రమలు వంటి రంగాల్లో పెట్టుబడులకు అనుకూలమైన వాతావరణం ఏర్పడేలా చర్యలు తీసుకోవాలని కోరారు. రైతుల ఆదాయాన్ని పెంచడం, పోషకాహార భద్రతను మెరుగుపరచడం కోసం చిరుధాన్యాల సాగు ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని మంత్రి తుమ్మల అన్నారు. చిరుధాన్యాల ఉత్పత్తి, ప్రాసెసింగ్‌, మార్కెటింగ్‌కు ప్రత్యేక ప్రణాళిక రూపొందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఉన్నతాధికారులు, నాబార్డ్‌ తెలంగాణ చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌ బి. ఉదయ భాస్కర్‌ , ప్రతినిధులు, బ్యాంకింగ్‌ రంగ ప్రముఖులు, రైతు సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

Read More

పిజెటిఏయు వ్యవసాయ విశ్వవిద్యాలపరిధిలోని వ్యవసాయ విద్యార్థుల అడ్వెంచర్‌ క్యాంప్‌

హిమాచల్‌ ప్రదేశ్‌, మనాలిలోని అటల్‌ బిహారీ వాజ్‌పేయ్‌ ఇన్స్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మౌంటెనీరింగ్‌ అండ్‌ అలైడ్‌ స్పోర్ట్స్‌లో జరిగిన నేషనల్‌ సర్వీస్‌ స్కీమ్‌ – నేషనల్‌ అడ్వెంచర్‌ క్యాంప్‌- 2024 లో ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలోని ఎనిమిది కళాశాలలకు చెందిన విద్యార్థినీ, విద్యార్థులు పాల్గొన్నారు. 2024 నవంబర్‌ 15-24 తేదీల మధ్య 10 రోజులపాటు ఈ క్యాంపు జరిగింది. ఈ అడ్వెంచర్‌ క్యాంప్‌లో భాగంగా రాక్‌ క్లయింబింగ్‌, రివర్‌ క్రాసింగ్‌, ట్రెక్కింగ్‌ తదితర అంశాల్లో విద్యార్థులు పాల్గొని తమ ప్రతిభ, సామర్థ్యాలను చాటారు. అందుకుగాను వారందరికీ ప్రతిభా పురస్కార పత్రాలని హిమాచల్‌ ప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం అందజేసింది. ఈ సందర్భంగా ఈ అడ్వెంచర్‌ క్యాంపులో పాల్గొన్న విద్యార్థినీ, విద్యార్థులు ఈరోజు పరిపాలన భవనంలో పిజెటిఏయు ఉపకులపతి ప్రొఫెసర్‌ ఆల్దాస్‌ జానయ్యని కలిశారు. ఉపకులపతి విద్యార్థినీ, విద్యార్థులని అభినందించారు. విద్యతో పాటు క్రీడలలో కూడా విద్యార్థినీ, విద్యార్థులు చురుకుగా పాల్గొనాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో డీన్‌ ఆఫ్‌ స్టూడెంట్‌ అఫైర్స్‌ డాక్టర్‌ సి.హెచ్‌ వేణుగోపాల రెడ్డి, సైఫాబాద్‌ కాలేజ్‌ ఆఫ్‌ కమ్యూనిటీ సైన్స్‌, ఎన్‌ఎస్‌ఎస్‌ ప్రోగ్రాం ఆఫీసర్‌ డాక్టర్‌ లక్ష్మీ చల్లా పాల్గొన్నారు.

Read More

సహకార శాఖ మరియు ఉద్యానశాఖ అధికారులతో మంత్రి తుమ్మల సమీక్ష

సిద్దిపేట జిల్లా, నర్మెట్టలో ఆయిల్‌ పాం ఫ్యాక్టరీ నిర్మాణ పనులను వేగవంతం చేయాలని, మే నెలాఖరు వరకు ఆయిల్‌ పాం గెలల ప్రాసెసింగ్‌ ప్రారంభించాలని, టిజి ఆయిల్‌ ఫెడ్‌లో అంతర్జాతీయ స్థాయి కంపెనీలలో ఉండే ఆర్గనైజేషన్‌ స్ట్రక్చర్‌ ఏర్పాటు కోసం చర్యలు తీసుకోవాలని ఈ రోజు సచివాలయంలో సహకార శాఖ మరియు ఉద్యానశాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు తెలంగాణ రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. గద్వాల జిల్లా బీచుపల్లి ఆయిల్‌ పాం ఫ్యాక్టరీ నిర్మాణ పనులను ప్రారంభించేందుకు కూడా చర్యలు తీసుకోవాలన్నారు.

టిజి ఆయిల్‌ ఫెడ్‌ను అంతర్జాతీయ స్థాయిలో ఉన్న సంస్థల మాదిరిగా అభివృద్ధి చేయడానికి ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేయాలని మంత్రి ఆదేశించారు. ఆయిల్‌ ఫెడ్‌ సంస్థలోని ఫ్యాక్టరీ, నర్సరీ, ప్లాంటేషన్‌, ఫైనాన్స్‌, మార్కెటింగ్‌ మరియు ఇతర విభాగాల్లో అత్యంత నైపుణ్యం కలిగిన సిబ్బందిని నియమించి, సంస్థను సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు. మార్చి నాటికి ఆయిల్‌ పాం కంపెనీలు తమ నిర్దేశిత ప్లాంటేషన్‌ లక్ష్యాన్ని పూర్తి చేయించాలని డైరెక్టర్‌ గారికి సూచించారు. లక్ష్యాన్ని పూర్తి చేయనివారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

సహకార సంఘాల నిర్వహణపై దృష్టి పెట్టాలని, గడువు ముగిసిన అన్ని సహకార సంఘాల ఓటర్ల జాబితాను ఎప్పటికప్పుడు సరిచేసి సిద్ధంగా ఉంచాలని మంత్రిగారు అధికారులను ఆదేశించారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న విచారణలను త్వరగా పూర్తి చేసి, తేలిన మొత్తాలను వెంటనే రికవరీ చేయడానికి తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.

ఈ సమావేశంలో వ్యవసాయ సహకారశాఖ కార్యదర్శి రఘునందన్‌ రావు, హార్టికల్చర్‌ డైరెక్టర్‌ శ్రీమతి యాస్మిన్‌ బాషా, సహకార శాఖ డైరెక్టర్‌ ఉదయ్‌ కుమార్‌, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.
Read More

సూక్ష్మసేద్యంలో ఆటోమేషన్‌ అమలుపై కమిటీ

సూక్ష్మసేద్యంలో ఆటోమేషన్‌ అమలు, ధర నిర్ణయం, వాటి విధివిధానాలపై ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసింది. ఈ మేరకు సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. దీనికి ఉద్యానవన డైరెక్టర్‌ ఛైర్మన్‌గా, రాష్ట్ర సూక్ష్మసేద్య అధికారి కన్వీనర్‌గా వ్యవహరిస్తారని పేర్కొంది. ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి ఓ శాస్త్రవేత్తతో పాటు వివిధ సంస్థల నుంచి మరో నలుగురు సభ్యులుగా కొనసాగుతారని తెలిపింది.

Read More

పొగాకు బోర్డు ఈడీగా విశ్వశ్రీ

మార్చి 11 తర్వాత బాధ్యతల స్వీకరణ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఉన్న పొగాకు బోర్డుకు ఈడీగా త్రిపుర కేడర్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారి బి. విశ్వశ్రీ నియమితులయ్యారు. ఆమెను నాలుగేళ్ల కాలానికి డిప్యుటేషన్‌పై నియమిస్తూ డీవోపీటీ (డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ పర్సనల్‌ అండ్‌ ట్రైనింగ్‌) ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఈడీగా పనిచేస్తున్న అద్దంకి శ్రీధర్‌ బాబు పదవీ కాలం మార్చి 11తో ముగియనుంది. ఆ తర్వాత విశ్వశ్రీ బాధ్యతలు స్వీకరించనున్నారు.

Read More

చిరుధాన్యాలు ఊరూరా సాగవ్వాలి.. ఇంటింటికీ చేరాలి ఐఐఎంఆర్‌ వ్యవస్థాపక దినోత్సవంలో డైరెక్టర్‌ తారాసత్యవతి

ఊరూరా చిరుధాన్యాలు సాగు కావాలని.. ఇంటింటికీ వాటి ఆహారం చేరాలని భారత చిరుధాన్యాల పరిశోధన సంస్థ (ఐఐఎంఆర్‌) డైరెక్టర్‌ సి. తారాసత్యవతి ఆకాంక్షించారు. ప్రతిఒక్కరు చిరుధాన్యాలను ప్రాథమిక అవసరంగా గుర్తించి వినియోగించాలన్నారు. ఐఐఎంఆర్‌ పదో వ్యవస్థాపక దినోత్సవం ఆదివారం రాజేంద్రనగర్‌లోని సంస్థ ప్రాంగణంలో జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ”రైతులు పెద్దఎత్తున చిరుధాన్యాల సాగు చేపట్టి వాటికి పూర్వవైభవం తీసుకురావాలి. ఇందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెద్దఎత్తున ప్రోత్సాహం అందించాలి. ఐఐఎంఆర్‌ దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలతో కలిసి పనిచేస్తోంది. సాగు విస్తరణతోపాటు ఆహార శుద్ధి, వినియోగం, ఉత్పత్తుల తయారీకి ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. వచ్చే నెల 2, 3 తేదీల్లో ఏపీ, తెలంగాణతోపాటు మరో అయిదు రాష్ట్రాల రైతులతో కిసాన్‌ మేళా నిర్వహిస్తున్నాం. ఆయా రాష్ట్రాల్లో సాగు ప్రణాళికలను వెల్లడిస్తాం” అని తారాసత్యవతి తెలిపారు. భారత వ్యవసాయ పరిశోధన మండలి డిప్యూటీ డైరెక్టర్‌ జనరల్‌, నార్మ్‌ ఇన్‌ఛార్జి డైరెక్టర్‌ ఆర్సీ అగర్వాల్‌ మాట్లాడుతూ.. చిరుధాన్యాలకు ఉజ్వల భవిష్యత్తు ఉందన్నారు. వీటిపై అంకురాల ద్వారా విస్తృత ప్రయోగాలు జరగాలన్నారు. కార్యక్రమంలో ఐసీఐసీఐ బ్యాంకు ఫౌండేషన్‌ జోనల్‌ విభాగాధిపతి ఆసిఫ్‌ ఇక్బాల్‌, ఐఐఎంఆర్‌ శాస్త్రవేత్తలు, విద్యార్థులు, పరిశోధకులు, అంకుర వ్యవస్థాపకులు పాల్గొన్నారు.

Read More

మిర్చి మరియు కందుల కొనుగోళ్లపై మంత్రి తుమ్మల సమీక్ష

మిర్చి మరియు కందుల కొనుగోళ్లపై ఈ రోజు తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వ్యవసాయశాఖ సెక్రటరీ రఘునందన్‌ రావు, అగ్రికల్చర్‌ డైరెక్టర్‌ గోపి, మార్కెటింగ్‌ డైరెక్టర్‌ ఉదయ్‌ కుమార్‌లతో సచివాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. మార్కెట్‌ యార్డులలో రైతులకు ఎలాంటి సమస్యలు ఎదురవకుండా తగిన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. రైతులు నష్టపోకుండా గిట్టుబాటు ధర పొందేలా జిల్లాలలో రిజనల్‌ మరియు సీనియర్‌ ఆఫీసర్లను పంపించాలని అధికారులను ఆదేశించారు.

Read More

ఏవియన్‌ ఇన్‌ఫ్లుయెంజా వైరస్‌పై రైతులకు అవగాహన కల్పించండి

ఇతర రాష్ట్రాల్లో ఏవియన్‌ ఇన్‌ఫ్లుయెంజా ప్రభావం ఉన్నందున రాష్ట్రవ్యాప్తంగా కోళ్లఫారాలను తనిఖీ చేసి ముందుజాగ్రత్త చర్యలపై అవగాహన కల్పించాలని తెలంగాణ పశుసంవర్ధకశాఖ సంచాలకుడు గోపి పశుసంవర్థకశాఖ జిల్లా అధికారులను ఆదేశించారు. ఫారాల్లో కోళ్లను పరిశీలించి, వాటి ఆరోగ్య పరిస్థితులను ఆరా తీయాలని, పెంపకందారులకు భరోసా కల్పించాలన్నారు.

Read More

81 మందికి గొర్రెలు, మేకల పెంపకం ప్రాజెక్టులు

నేషనల్‌ లైవ్‌ స్టాక్‌ మిషన్‌ (ఎన్‌ఎల్‌ఎం) కింద తెలంగాణలో 81 మందికి గొర్రెలు, మేకల పెంపకం ప్రాజెక్టుల మంజూరుకు రాష్ట్ర పశుసంవర్ధకశాఖ కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. ఈ మేరకు శుక్రవారం రాష్ట్ర పశుసంవర్ధకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సబ్యాసాచి ఘోష్‌ అధ్యక్షతన సచివాలయంలో జరిగిన సమావేశంలో లబ్ధిదారులను ఎంపిక చేశారు. ఎన్‌ఎల్‌ఎం కింద ఒక్కో లబ్ధిదారుకు గొర్రెలు, మేకల పెంపకానికి రూ.కోటితో ప్రాజెక్టు మంజూరవుతుంది. ఇందులో రూ.50 లక్షలు సబ్సిడీ కాగా బ్యాంకుల నుంచి రూ.40 లక్షల రుణం పొందాలి. మిగిలిన రూ.10 లక్షలు లబ్ధిదారు వాటా. ఈ యూనిట్లకు 240 మంది దరఖాస్తు చేసుకోగా.. క్షేత్రస్థాయి పరిశీలన అనంతరం తుదిజాబితా ఎంపిక కోసం సమావేశం నిర్వహించారు. పశుసంవర్ధకశాఖ సంచాలకుడు గోపి, అదనపు సంచాలకురాలు మల్లీశ్వరి; గొర్రెలు, మేకల అభివృద్ధి సమాఖ్య ఎండీ సుబ్బరాయుడు పాల్గొన్నారు.

Read More