ప్రపంచం అసూయపడే స్థాయికి అరకు కాఫీని తీసుకెళ్తాం

కేంద్రమంత్రి పీయూష్‌ గోయల్‌

పార్లమెంటులో స్టాళ్ల ప్రారంభం

గిరిజనులు పండించే అరకు కాఫీ బ్రాండ్‌ను విస్తృత పరచడానికి పార్లమెంటు ఆవరణలో రెండు స్టాళ్లను గిరిజన సహకార సంఘం సోమవారం ప్రారంభించింది. కూటమి ఎంపీల విజ్ఞప్తి మేరకు లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా అనుమతి ఇవ్వగా లోక్‌సభ, రాజ్యసభ సభ్యుల క్యాంటీన్లలో.. కేంద్ర వాణిజ్య శాఖామంత్రి పీయూష్‌ గోయల్‌, పార్లమెంటరీ వ్యవహారాలశాఖ మంత్రి కిరణ్‌రిజిజు, గిరిజన వ్యవహారాల శాఖ మంత్రి జుయెల్‌ ఓరం, పౌర విమానయానశాఖ మంత్రి రామ్మోహన్‌నాయుడు స్టాళ్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా పీయూష్‌ గోయల్‌ మాట్లాడుతూ… భౌగోళిక ప్రత్యేక గుర్తింపు ఉన్న అరకు కాఫీ బ్రాండ్‌ను ప్రోత్సహించడానికి ఏపీ ప్రభుత్వం తీసుకున్న చొరవను అభినందించారు. ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలోని డబుల్‌ ఇంజిన్‌ ప్రభుత్వాలు.. అరకు కాఫీని అత్యంత ప్రాధాన్య ఉత్పత్తిగా ప్రపంచం అసూయపడేలా ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లాయని చెప్పారు. జుయెల్‌ ఓరం మాట్లాడుతూ.. అరకులోయలో కాఫీ పెంపకం వాజ్‌పేయి ప్రధానిగా ఉన్నప్పుడు ప్రారంభించామన్నారు. అప్పట్లో ఇందుకోసం రూ. 200 కోట్లు ఇచ్చినట్లు గుర్తుచేశారు. కిరణ్‌ రిజిజు మాట్లాడుతూ…. ‘గిరిజనులు అంకితభావంతో పండించిన సుసంపన్నమైన కాఫీని ఇక్కడ విక్రయించడం గర్వకారణం. ఇది గిరిజనుల సాధికారత, స్వావలంబనకు నిదర్శనం’ అని అన్నారు.

*చంద్రబాబు ప్రయత్నాల వల్లే…*

రామ్మోహన్‌నాయుడు మాట్లాడుతూ…సీఎం చంద్రబాబు చేపట్టిన విస్తృత కార్యక్రమాల వల్ల అరకు కాఫీ ప్రపంచస్థాయి గుర్తింపు పొందిందన్నారు. ఆయన దావోస్‌లోనూ అందరికీ అరకు కాపీని ఇచ్చి అంతర్జాతీయ గుర్తింపు తెచ్చే ప్రయత్నం చేశారన్నారు.

Read More

అకాలవర్షాలపై రైతులు అప్రమత్తంగా ఉండాలి

తెలంగాణ రాష్ట్రంలో అకాల వర్షాల దృష్ట్యా రైతులు అప్రమత్తంగా ఉండాలని ఉద్యాన విశ్వ విద్యాలయం ఉపకులపతి దండా రాజిరెడ్డి సూచించారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. కూరగాయలు, పండ్లతోటలు, పసుపు తదితర పంటలపై అన్ని రకాల ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నారు. పంట పొలాల్లో నిలిచిన నీటిని 24 గంటల్లోపు బయటకు పంపాలని, టమాటాలకు పగుళ్లు రాకుండా నివారణ చర్యలు చేపట్టాలని సూచించారు.

Read More

ఆదుకుంటాం.. ఆందోళన చెందొద్దు

అకాల వర్షాలు, వడగళ్ల వానతో జరిగిన పంటనష్టంపై చంద్రబాబు సమీక్ష


ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో అకాలవర్షాలు, వడగళ్ల వానతో పంట నష్టపోయిన రైతుల్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని, అన్నదాతలెవరూ ఆందోళన చెందొద్దని ముఖ్యమంత్రి చంద్రబాబు భరోసా ఇచ్చారు. ప్రభుత్వ పరంగా సాయం అందించాలని అధికారులను ఆదేశించారు. జిల్లాల్లో జరిగిన పంటనష్టం, అనంతపురం జిల్లా యల్లనూరు మండలం నీరజంపల్లిలో ఇద్దరు అరటి రైతుల ఆత్మహత్యాయత్నంపై వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు, ఆ శాఖ ఉన్నతాధికారులతో ఆదివారం చంద్రబాబు సమీక్షించారు. రైతుల ఆరోగ్యపరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. ”వడగళ్ల వాన కారణంగా వైఎస్సార్‌, అనంతపురం, శ్రీసత్యసాయి, ప్రకాశం జిల్లా లోని 10 మండలాలకు చెందిన 40 గ్రామాల్లో పంట నష్టం జరిగింది. 1,670 హెక్టార్లలో ఉద్యానపంటలు దెబ్బతిన్నాయి. సుమారు 1,364 మంది రైతులు నష్ట పోయారు” అని అధికారులు సీఎంకు తెలిపారు. క్షేత్రస్థాయికి వెళ్లి వివరాలను పరిశీలించినట్లు నివేదించారు. అంతకుముందు వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ఉద్యానశాఖ అధికారులతో టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. వడగళ్ల వాన కారణంగా జరిగిన పంట నష్టాన్ని అంచనా వేయాలని ఆదేశించారు.

Read More

మహిళాశక్తిలో ఆహారశుద్ధి పరిశ్రమలు

  • ఇక్రిశాట్‌ సాంకేతిక సహకారం
  • త్వరలో సీఎం సమక్షంలో ఒప్పందానికి సెర్ప్‌ కార్యాచరణ

మహిళాశక్తి పథకం కింద తెలంగాణలో భారీఎత్తున ఆహారశుద్ధి యూనిట్లు ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. స్వయం సహాయక సంఘాల ద్వారా రానున్న మూడేళ్లలో 2,500 పరిశ్రమల ఏర్పాటుకు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్‌) ప్రతిపాదనలు రూపొందించింది. హైదరాబాద్‌ శివారులోని ఇక్రిశాట్‌ సంస్థ దీనికి సాంకేతిక సహకారం అందించనుంది. త్వరలో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి సమక్షంలో ఒప్పందం కుదుర్చుకోనుంది. అందులో భాగంగా జిల్లాల వారీగా అందుబాటులో ఉన్న పంట ఉత్పత్తులను గుర్తించి, స్థానిక మహిళా సంఘాల ద్వారా వాటి శుద్ధి కోసం పరిశ్రమలను ఏర్పాటు చేస్తుంది. సెర్ప్‌ ప్రతిపాదనలకు పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి సీతక్క ఆమోదం తెలిపారు.

ఏయే జిల్లాల్లో… ఏయే పరిశ్రమలంటే
వరంగల్‌లో మిర్చి, పసుపు మెదక్‌లో శనగలు, సీతాఫలాలు, ఉల్లిగడ్డ, మహబూబ్‌నగర్‌లో తృణ దాన్యాలు, సీతాఫలాలు, నిజామాబాద్‌లో పసుపు, మొక్కజొన్న, వికారాబాద్‌లో తృణ దాన్యాలు, కూరగాయలు, భద్రాద్రి-కొత్తగూడెంలో మిర్చి, జీడిపప్పు, సూర్యాపేటలో కూరగాయలు, పాలు, కరీంనగర్‌లో కూరగాయలు, జోగులాంబ గద్వాలలో వేరుశనగ, మహబూబాబాద్‌లో మిర్చి, పండ్లు, హనుమకొండలో పప్పులు, తృణధాన్యాలు, ములుగులో మిర్చి, సిద్దిపేటలో కూరగాయలు, మొక్కజొన్న, పండ్లు, కుమురంభీం ఆసిఫాబాద్‌లో పప్పుధాన్యాలు, పెద్దపల్లిలో కూరగాయలు, నల్గొండలో బత్తాయి, మేడ్చల్‌ – మల్కాజిగిరిలో ద్రాక్ష యాదాద్రి భువనగిరిలో పాడి ఉత్పత్తులు, జయశంకర్‌ భూపాలపల్లిలో కూరగాయలు, జగిత్యాలలో మామిడి, రంగారెడ్డిలో పండ్లు, కూరగాయలు, ఖమ్మంలో మిర్చి, పండ్లు, కూరగాయలు సిరిసిల్లలో చేపలు, కామారెడ్డిలో మొక్కజొన్న, చెరకు, నాగర్‌ కర్నూల్‌లో మామిడి, వేరుశనగ, నారాయణపేటలో సేంద్రియ పప్పు, మంచిర్యాలలో కూరగాయలు, పండ్లు, ఆదిలాబాద్‌లో సోయాబీన్‌, సీతాఫలాలు, కూరగాయలు, వనపర్తిలో వేరుశనగ, జనగామలో బంగాళాదుంప, సంగారెడ్డిలో అల్లం శుద్ధి యూనిట్లకు ప్రతిపాదించారు.

బ్రాండ్‌ ఖరారుకు కసరత్తు
ఆహారశుద్ధి పరిశ్రమలకు మార్గనిర్దేశం చేసేందుకు వీలుగా ఇక్రిశాట్‌కు అందులో భాగస్వామ్యం కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. సంస్థతో సెర్ప్‌ సీఈవో దివ్యదేవరాజన్‌ సంప్రదింపులు జరిపారు. త్వరలో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి సమక్షంలో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంటారు. ఒప్పందంలో భాగంగా శుద్ధి విధానాలు, యంత్రాల వినియోగం, పరిశ్రమల నిర్వహణపై సంఘాల సభ్యులకు శిక్షణ ఇస్తారు.. పంట ఉత్పత్తుల కొనుగోళ్లు, ఎగుమతులకు అవసరమైన సహకారం అందించనున్నారు. వీటి ఏర్పాటుకు ప్రభుత్వం బ్యాంకు రుణాల సదుపాయం కల్పించనుంది. పరిశ్రమల స్థాపన అనంతరం… ఆయా ప్రాంతాల చారిత్రక నేపథ్యం, పర్యాటక స్థలాలు తదితరాలు ప్రాతిపదికన వీటికి బ్రాండ్‌ను ఖరారు చేయనున్నారు.

సొంత పొదుపు నిధులతోనే…
ఆహారశుద్ధి పరిశ్రమల ఏర్పాటుకు జాతీయ ఫుడ్‌ ప్రాసెసింగ్‌ మిషన్‌, ప్రధాన మంత్రి సూక్ష్మ ఆహార ఉత్పత్తి తయారీ సంస్థల వ్యవస్థీకరణ పథకం తదితరాలు తోడ్పాటు అందిస్తున్నాయి. వీటికి సబ్సిడీ ఉన్నా బ్యాంకు రుణాలతో ముడిపడి ఉన్నందున.. ప్రస్తుతం మహిళా సంఘాలకు పొదుపు నిధులతో సొంతంగా పరిశ్రమలను స్థాపించేలా సెర్ప్‌ ప్రణాళిక రూపొందించింది. అనంతర కాలంలో భారత చిరుధాన్యాల నిర్వహణ సంస్థ(ఐఐఎంఆర్‌), జాతీయ గ్రామీణ వ్యవసాయాభివృద్ధి బ్యాంకు (నాబార్డు) తదితర సంస్థలతోనూ ఒప్పందాలు చేసుకొని మరిన్ని పరిశ్రమలను స్థాపించాలని భావిస్తోంది.

Read More

పత్తికి ప్రాణం పోద్దాం

అఖిల భారత కాటన్‌ వార్షిక సమావేశంలో శాస్త్రవేత్తలుగులాబీ రంగు పురుగు విజృంభణ, దిగుబడి తగ్గుదలపై ఆందోళనఆంధ్రాలో పూర్తిగా పడిపోయిన సాగు విస్తీర్ణం

దేశవ్యాప్తంగా సంభవించిన వాతావరణ మార్పులతో జీవచ్చవంలా మారిన పత్తికి ప్రాణం పోయాల్సిన తరుణం ఆసన్నమైందని శాస్త్రవేత్తలు అభిప్రాయపడ్డారు. గుంటూరు సమీపంలోని లాం ఫామ్‌లోని ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో అఖిల భారత పత్తి వార్షిక సమావేశం-2025 శుక్రవారం ఆరంభమయింది. మూడు రోజులు పాటు జరగనున్న ఈ సమావేశంలో జాతీయ స్థాయికి చెందిన 160 మంది శాస్త్రవేత్తలు పాల్గొన్నారు. సమావేశాలకు ముఖ్యఅతిథిగా హాజరైన భారతదేశ పత్తి మనిషిగా పిలువబడే డాక్టర్‌ సీడీ మాయీ మాట్లాడుతూ దివంగత ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయి ప్రారంభించిన మొదటి ‘టెక్నాలజీ మిషన్‌ ఆఫ్‌ కాటన్‌’ దేశంలో సాగు రూపురేఖలు మార్చిందన్నారు. అప్పుడు ప్రవేశపెట్టిన మొదటి మిషన్‌లోనే బీటీ పత్తి వంగడం రూపుదిద్దుకున్నది చెప్పారు. దాని ఫలితంగా పత్తి పంటలో ఉత్పత్తి, ఉత్పాదకత, లాభదాయకత పెరిగాయన్నారు. కొన్ని థాబ్దాల తర్వాత గులాబిరంగు పురుగు తిరిగి రావడం ఆందోళనకరమన్నారు. దాన్ని తట్టుకొని, వాతావరణ పరిస్థితులను ఎదిరించే నూతన వంగడాల సృష్టి ద్వారానే దేశ భవిష్యత్‌ వస్త్ర అవసరాలు తీర్చగలమని పేర్కొన్నారు. నూతనంగా ఆరంభం కానున్న రెండవ మిషన్‌లో ‘మిషన్‌ ఫర్‌ కాటన్‌ ప్రొడక్టివిటీ’ నినాదాన్ని ముందుకు తీసుకుపోవాలని అన్నారు. ఈ మిషన్‌ ఉత్పాదకత, సుస్థిరతను పెంపొందించడం, అతి పొడవైన స్టేపుల్‌ పత్తి రకాల సాగును (పొడవు పింజ పత్తి) ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకుందన్నారు. యూనివర్సిటీ రీసెర్చ్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ పీవీ సత్యనారాయణ మాట్లాడుతూ ముఖ్యంగా పత్తి దిగుమతులపై భారతదేశం ఆధారపడటాన్ని దృష్టిలో ఉంచుకొని వార్షిక దిగుమతులు 3 మిలియన్‌ బేళ్లను మించడం ఆందోళన కలిగిస్తుందన్నారు. స్వదేశీ ఉత్పత్తిని పెంచడానికి తక్షణ విధి విధానాలు అవసరమని చెప్పారు. విశ్వవిద్యాలయం వీసీ డాక్టర్‌ ఆర్‌ శారదా జయలక్ష్మీ మాట్లాడుతూ భారతదేశంలో పత్తి కాయతొలిచే పురుగును సమర్థవంతంగా నియంత్రించడం ద్వారా పురుగుమందుల వినియోగాన్ని తగ్గించడంలో బీటీ వంగడాలు సమర్థవంతంగా పనిచేశాయని అన్నారు. ఎన్‌ జీ రంగా విశ్వవిద్యాలయం అభివృద్ధి చేసి విడుదల చేసిన పత్తి రకం ‘నరసింహ (ఎన్‌ ఏ-1325)’ గణనీయమైన విజయాన్ని సాధించినదని అన్నారు. నాగపూర్‌ ఐసీఏఆర్‌ – సీఐసీఆర్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ జి. ప్రసాద్‌ మాట్లాడుతూ పత్తి ఉత్పత్తి 15 సంవత్సరాల కనిష్ట స్థాయికి చేరుకుందని, ఒకప్పుడు రెండవ అతిపెద్ద పత్తి ఉత్పత్తిదారుగా ఉన్న ఏకీకృత ఆంధ్రప్రదేశ్‌ ప్రాంతం ఇప్పుడు వాతావరణ మార్పుల కారణంగా సాగు విస్తీర్ణం తగ్గుతుందని పేర్కొన్నారు. డాక్టర్‌ ఎస్‌.కె. శుక్లా మాట్లాడుతూ భారతీయ పత్తిలో అధిక కలుషిత స్థాయిలపై ఆందోళన వ్యక్తం చేశారు. డాక్టర్‌ ప్రశాంత కుమార్‌ దాస్‌ మాట్లాడుతూ ప్రతికూల పరిస్థితులలో పత్తి నిరోధకతను, ఉత్పాదకతను పెంచడానికి జన్యుమార్పిడి సాంకేతికత చాలా అవసరమని అభిప్రాయ పడ్డారు.

రాష్ట్రంలో పాతాళానికి పడిపోయిన పత్తి సాగు..

ఆంధ్రప్రదేశ్‌లో పత్తి సాగు విస్తీర్ణం పాతాళానికి పడిపోయింది. 2001-2002 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్‌లో 10.02 లక్షల హెక్టార్లలో పత్తి సాగుచేయగా, 2023-2024 సంవత్సరంలో సాగు విస్తీర్ణం 4.27 లక్షలకు పడిపోయింది. రాష్ట్ర విభజన తర్వాత రెండు తెలుగు రాష్ట్రాల్లో పత్తి విస్తీర్ణం, దిగుబడి పూర్తిగా పడిపోయినట్లు వార్షిక సమావేశం 2025 నివేదిక స్పష్టం చేస్తున్నది. పత్తి ధరల పతనం, గులాబీ రంగు పురుగు వల్ల రైతాంగం ప్రత్యామ్నాయ పంటల వైపు దృష్టి సారించినట్లు శాస్త్రవేత్తలు వెల్లడించారు.

Read More

రైతులకు రాయితీపై బ్రీడర్‌ విత్తనాలు

రైతులకు బ్రీడర్‌ విత్తనాలను రాయితీపై సరఫరా చేసేందుకు కేంద్ర వ్యవసాయశాఖ విత్తన విభాగం ఆమోదం తెలిపింది. 7 రకాల పంటలకు సంబంధించి, 1,736 క్వింటాళ్ల బ్రీడర్‌ విత్తనాలను ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ఇవ్వడానికి అనుమతించింది. వరి, కంది, పెసర, మినుము, రాగి, వేరుశనగ, సజ్జ పంటలకు సంబంధించి, బ్రీడర్‌ విత్తనాలు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి సరఫరా కానున్నాయి. న్యూఢిల్లీలో జరిగిన సమీక్షలో ఈ నిర్ణయాలు తీసుకున్నట్లు రాష్ట్ర వ్యవసాయశాఖ డైరెక్టర్‌ ఢిల్లీరావు తెలిపారు.

Read More

ఆయిల్‌పామ్‌ సాగు పెరగాలి

తెలంగాణలో ఆయిల్‌పామ్‌ సాగు మరింత పెంచాలని కేంద్ర వ్యవసాయ కార్యదర్శి దేవేశ్‌ చతుర్వేది సూచించారు. దేశవ్యాప్తంగా ఆయిల్‌ పామ్‌ సాగుపై ఆయన శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర ఉద్యాన సంచాలకులు యాస్మిన్‌ బాషా ఇందులో పాల్గొని రాష్ట్ర ప్రగతిని వివరించారు. నేషనల్‌ మిషన్‌ ఆన్‌ ఎడిబుల్‌ ఆయిల్స్‌ ఆయిల్‌ పామ్‌ పథకం కింద 2021-22 నుంచి ఇప్పటివరకు 39,515 ఎకరాల్లో 11,685 మంది రైతులు సాగు చేపట్టి.. రూ.103 కోట్ల రాయితీలు పొందారని తెలిపారు.

Read More

ఉద్యాన నగరి.. ఉపాధి సిరి

పచ్చదనం నిర్వహణపై యువత, రైతు కూలీలకు శిక్షణ ఉద్దండరాయునిపాలెంలో నైపుణ్యాభివృద్ధి కేంద్రం

అమరావతిని హరిత నగరంగా తీర్చిదిద్దేందుకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. దీనిని దృష్టిలో పెట్టుకునే గత తెదేపా సర్కారు హయాంలోనే బృహత్‌ ప్రణాళిక తయారైంది. అందులో భాగంగానే రహదారులు, కూడళ్లలో పచ్చదనాన్ని అభివృద్ధి చేస్తోంది. భవిష్యత్తులో నర్సరీలు, పచ్చదనం నిర్వహణలో ఉపాధి అవకాశాలు భారీగా రానున్నట్లు సీఆర్డీఏ అంచనా వేస్తోంది. దీనిని దృష్టిలో ఉంచుకుని రాజధానిలోని యువత, రైతులు, రైతు కూలీలకు ఈ రంగంలో శిక్షణ ఇచ్చేందుకు ప్రత్యేకంగా కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు అడుగులు వేస్తోంది.

రెండెకరాల్లో…

ఉద్దండరాయునిపాలెంలో పెద్ద నర్సరీ ఏర్పాటుకు సీఆర్డీఏకు 25 ఎకరాల స్థలాన్ని గతంలో ప్రభుత్వం కేటాయించింది. ఇది గతంలో ప్రధాని నరేంద్రమోదీ శంకుస్థాపన చేసిన ప్రాంతానికి ఎదురుగా.. కరకట్ట దిగువున ఉంది. ఇక్కడ ఉద్యానశాఖతో కలిసి ఉమ్మడిగా నైపుణ్యాభివృద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని అధికారులు తలపోస్తున్నారు. తొలుత ఎకరా స్థలంలో నిర్మించాలని నిర్ణయించారు. అనంతరం మరో ఎకరా స్థలాన్ని శిక్షణ అవసరాల కోసం ఉపయోగించనున్నారు. ఈ కేంద్రం నిర్మాణానికి రూ.75 లక్షల వ్యయమవుతుందని అంచనా వేశారు. రాజధాని నిర్మాణం కారణంగా వ్యవసాయ పనుల్లేక కూలీలు ఇబ్బందులు పడకుండా స్థానికంగా ఉపాధి అవకాశాలు కల్పించేందుకే దీనిని ఉద్దేశించారు. రైతులకిచ్చే రిటర్నబుల్‌ ప్లాట్లలో పెద్ద ఎత్తున పచ్చదనాన్ని పెంచనున్నారు. పలుచోట్ల నైబర్‌ హుడ్‌ పార్కులు, చిన్న, పెద్దవి కలిపి దాదాపు 400 ఉద్యానవనాలు అభివృద్ధి చేస్తున్నారు. ప్రతీ రహదారి పక్కన అవెన్యూ ప్లాంటేషన్‌ చేయనున్నారు. ఈ రంగంలో నిపుణులను తయారు చేసేందుకు సీఆర్డీఏ ఉద్యాన శాఖ సహకారం తీసుకోనుంది. తర్ఫీదు ఇవ్వడం ద్వారా రాజధానిలోని నిరుద్యోగ యువత, రైతు కూలీలకు జీవనోపాధులు పెరుగుతాయని భావిస్తున్నారు. మొక్కలకు అంట్లు కట్టడం, కొమ్మలు కత్తిరించడం, నర్సరీల నిర్వహణలో మెలకువలు, మొక్కల సంరక్షణ, తదితర అంశాల్లో శిక్షణ ఇవ్వనున్నారు. అవసరమైన వారిని గుర్తించి, ప్రతి బ్యాచ్‌కు 50 మందికి చొప్పున తర్ఫీదు ఇస్తారు. ప్రభుత్వం నుంచి సూత్రప్రాయంగా ఆమోదం లభించిన తర్వాత పనులు ప్రారంభించనున్నారు.

Read More

మామిడిపండు రూ.10,000/-లుఖరీదైన ‘మియాజాకీ’ పండించిన నాందేడ్‌ మహిళా రైతు

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మియాజాకీ మామిడి పండ్లను మహారాష్ట్రలోని నాందేడ్‌ జిల్లా భోసీ గ్రామానికి చెందిన సుమన్‌బాయి గైక్వాడ్‌ అనే మహిళా రైతు పండించారు. ఇటీవల నిర్వహించిన వ్యవసాయ ప్రదర్శనలో ఒక్కో మామిడి పండును ఆమె రూ. 10,000/- లకు అమ్మారు. సుమన్‌బాయి కుమారుడు నంద కిశోర్‌ గైక్వాడ్‌ ఆలోచనల్లోంచి పుట్టుకొచ్చిందే ఈ మామిడిపండ్ల సాగు. యూపీఎస్సీ పరీక్షల కోసం పుణెలోని కోచింగ్‌ సెంటర్‌లో చేరిన ఆయన.. కరోనా కారణంగా అది మూతపడటంతో ఇంటికి తిరిగివచ్చారు. ఇంట్లోనే ఉండి పరీక్షలకు సిద్ధమవుతూ.. ఆన్‌లైన్‌లో జపనీస్‌ రకానికి చెందిన మియాజాకీ మామిడి పండ్ల గురించి తెలుసుకున్నారు. అనంతరం తల్లిని ఆ సాగువైపు ప్రోత్సహించారు. ఒక్కొక్క దానికి రూ.6,500/-లు చొప్పున చెల్లించి ఫిలిప్పీన్స్‌ నుంచి 10 మొక్కలను తెప్పించారు. రెండేళ్ల కిందట వాటిని నాటగా ఈ ఏడాది ఒక్కో చెట్టుకు 11 నుంచి 12 కాయలు వచ్చాయి. ఆ పండ్లను వ్యవసాయ ప్రదర్శనలో విక్రయించారు.

Read More

జర్మనీ ప్రతినిధుల బృందంతో మంత్రి తుమ్మల సమావేశం

తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఏపిసి & ప్రభుత్వ కార్యదర్శి, వ్యవసాయ డైరెక్టర్‌, మార్కెటింగ్‌ డైరెక్టర్‌ మరియు ఇతర ఉన్నతాధికారులు శ్రీమతి రేబెక్కా రిడ్డర్‌, డివిజన్‌ హెడ్‌- ఆసియా, బిఎంఇఎల్‌ గారి ఆధ్వర్యంలో జర్మనీ నుండి వచ్చిన ప్రతినిధుల బృందంతో సచివాలయంలో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో వ్యవసాయ రంగంలో నూతన సాంకేతికతల అన్వయం, మార్కెటింగ్‌, డిజిటల్‌ వ్యవసాయ అభివృద్ధి వంటి ముఖ్య అంశాలపై విస్తృతంగా చర్చించడం జరిగింది.
సిరిసిల్ల జిల్లా వేములవాడలో పైలట్‌ ప్రాతిపదికన హెచ్‌హెచ్‌ఐ, జర్మనీ సంస్థ సహకారంతో నిర్వహిస్తున్న పరిశోధన గురించి మంత్రికి బృందసభ్యులు వివరించడం జరిగింది. ఈ పరిశోధనలో భాగంగా 3 ఎఫ్‌పీఓల నుండి 55 మంది రైతులను ఎంపిక చేసి, ఉత్పత్తి ఖర్చులను తగ్గించడం, సాంకేతికతను ఉపయోగించి కూలీ ఖర్చు తగ్గించడం, డిజిటల్‌ వ్యవసాయం, పంట దిగుబడులను పెంచడం, డ్రోన్లను ఉపయోగించి నేల యొక్క సారాన్ని పరీక్షించడం, వాతావరణ పరిస్థితులను ఎప్పటికప్పుడు అంచనా వేయడానికి వాతావరణ స్టేషన్‌ను నిర్వహిస్తూ, రైతులకు ఎప్పటికప్పుడు వాతావరణ సంబంధిత సమాచారాన్ని అందచేయడం జరుగుతుందని మంత్రికి వివరించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ…
భారత-జర్మనీ ప్రభుత్వాల సహకారంతో వ్యవసాయ రంగం అభివృద్ధికి నూతన ప్రణాళికలు చేపట్టాల్సిన అవసరాన్ని తెలిపారు. ప్రస్తుత ప్రాజెక్ట్‌ను రాష్ట్రవ్యాప్తంగా విస్తరించాలని, తద్వారా తెలంగాణలోని అందరు రైతులు ఈ ప్రయోజనాలను పొందగలుగుతారని తెలిపారు. వ్యవసాయ విశ్వవిద్యాలయం & ఏజిహబ్‌ డిజిటల్‌ వ్యవసాయంపై దృష్టి సారించి, తెలంగాణ రైతులు ఆధునిక వ్యవసాయం సాంకేతికతలను వినియోగించే విధంగా ప్రోత్సహించాలన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో పండించే పంటలు అంతర్జాతీయ ఎగుమతి ప్రమాణాలకు అనుగుణంగా పండించేవిధంగా రైతులను ప్రోత్సహించాలని, దీనివలన ఎగుమతులు పెరిగి రైతులకు అధిక ధరలు పొందుతారని తెలిపారు. దీనికి జర్మనీ ప్రభుత్వంతో కలిసి వ్యవసాయ అనుబంధ శాఖ, ఏజిహబ్‌, వ్యవసాయ విశ్వవిద్యాలయం కలసి ప్రాసెసింగ్‌ యూనిట్లు, ఎగుమతి అవకాశాలు, ఇతర అభివృద్ధి కార్యక్రమాలను అందించే అవకాశాలను పరిశీలించాలని అధికారులను ఆదేశించారు.
నూతన వ్యవసాయ పద్ధతులు, ఆధునిక యంత్రాలు ఉపయోగించడం ద్వారా కూలీల కొరతను అధిగమించడమే కాకుండా, అధిక దిగుబడులు రైతులు పొందే విధంగా సాంకేతికతను అనుసంధానం చేయాలన్నారు. ప్రస్తుతం దేశంలో జర్మన్‌ సహకారంతో రాజస్థాన్‌, ఒడిశా, ఉత్తర ప్రదేశ్‌ రాష్ట్రాలలో వివిధ ప్రాజెక్ట్‌లు ప్రగతిలో ఉన్నాయని బృంద సభ్యులు వివరించగా, తెలంగాణ ప్రభుత్వం నుండి ఒక అధ్యయన బృందాన్ని ఈ రాష్ట్రాలకు పంపి వాటియొక్క ఫలితాలను అధ్యయనం చేసి తెలంగాణ రైతులను కూడా అక్కడికి పంపించి వారికి శిక్షణ ఇచ్చి, పంట ఉత్పత్తులను అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఉత్పత్తి చేసి, ఎగుమతి చేసే విధంగా చూడలన్నారు. పిజెటిఏయు, ఏజిహబ్‌ వంటి సంస్థలు, డిజిటల్‌ వ్యవసాయాన్ని తెలంగాణ రైతులకు అందించేందుకు ప్రముఖంగా పనిచేయలన్నారు. ఏసిఆర్‌ఏటి ప్రాజెక్ట్‌ ద్వారా తెలంగాణ రైతులకు అధునాతన వ్యవసాయ విధానాల ప్రయోజనాలు అందించేందుకు ఇది ఒక గొప్ప అవకాశమని మంత్రి తెలిపారు. ఫ్రౌన్హోఫర్‌ పర్‌ బృందంతో రాష్ట్ర స్థాయి వ్యవసాయ శాఖ మరియు యూనివర్సిటీలు మరింత సమిష్టిగా పనిచేయాలన్నారు. ఏఐ మరియు ఐఓటి వంటి సాంకేతికతలను ఉపయోగించి అధిక దిగుబడి, ఆహార ప్రాసెసింగ్‌, మార్కెట్‌ లింకేజెస్‌ వంటి అంశాలను అభివృద్ధి చేయాలని సూచించారు. ఏసిఆర్‌ఏటి ప్రాజెక్ట్‌ ద్వారా వచ్చిన అనుభవాలను విస్తృతం చేసేందుకు వ్యవసాయ శాఖ సంపూర్ణ సహకారం అందిస్తుందని తెలిపారు. బిఎంఇఎల్‌ ప్రతినిధులు, తెలంగాణ వ్యవసాయ రంగ అభివృద్ధికి ఫుడ్‌ ప్రాసెసింగ్‌, అంతర్జాతీయ మార్కెట్‌ లింకేజెస్‌ వంటి రంగాల్లో మరింత సహకారం అందిస్తామన్నారు.
ఈ సమావేశం ఇండో-జర్మన్‌ వ్యవసాయ సహకారాన్ని బలోపేతం చేసేందుకు, తెలంగాణలో స్థిరమైన వ్యవసాయ అభివృద్ధికి దోహదపడే కీలక ముందడుగు అని తెలుపుతూ, సాంకేతికతను ఉపయోగించి వ్యవసాయ రంగాన్ని లాభదాయకంగా చేయాలని మంత్రి పేర్కొన్నారు.
ఈ సమావేశంలో జర్మన్‌ ప్రతినిధులైన డా. రఘు చలిగంటి, శాస్త్రవేత్త (డిజిటల్‌ అగ్రికల్చర్‌), ఫ్రౌన్హోఫర్‌-హెచ్‌హెచ్‌ఐ, డా. సెబాస్టియన్‌, హెడ్‌- టెలికమ్యూనికేషన్స్‌, ఫ్రౌన్హోఫర్‌-హెచ్‌హెచ్‌ఐ, శ్రీ మార్టిన్‌, ప్రాజెక్ట్‌ మేనేజర్‌, బిఎంఇఎల్‌, శ్రీ స్వెన్‌, డైరెక్టర్‌, ఐఏకె కన్సల్టింగ్‌ మరియు రాష్ట్రం నుండి డా. బి. గోపీ, వ్యవసాయ డైరెక్టర్‌, సురేంద్ర మోహన్‌ ఐఏఎస్‌, మార్కెటింగ్‌ డైరెక్టర్‌, ఎన్‌. శ్రీధర్‌, ఏపిసి & కార్యదర్శి, ప్రొ. అల్దాస్‌ జనయ్య, వైస్‌ చాన్స్‌లర్‌, పిజెటిఏయు, డా. డి. రాజిరెడ్డి, వైస్‌ చాన్స్‌లర్‌, ఎస్‌కెఎల్‌టిఎస్‌హెచ్‌యు, డా. బాలరాం, డైరెక్టర్‌ ఆఫ్‌ రీసెర్చ్‌, డా. రాములు, డైరెక్టర్‌ – ఇంటర్నేషనల్‌ ప్రోగ్రామ్స్‌, పిజెటిఏయు, డా. కల్పనా శాస్త్రి, యండి, ఏజిహబ్‌, విజయ్‌ నడిమింటి, సిఇఓ, ఏజిహబ్‌ లు పాల్గొన్నారు.

Read More