కేంద్రమంత్రి పీయూష్ గోయల్
పార్లమెంటులో స్టాళ్ల ప్రారంభం
గిరిజనులు పండించే అరకు కాఫీ బ్రాండ్‌ను విస్తృత పరచడానికి పార్లమెంటు ఆవరణలో రెండు స్టాళ్లను గిరిజన సహకార సంఘం సోమవారం ప్రారంభించింది. కూటమి ఎంపీల విజ్ఞప్తి మేరకు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా అనుమతి ఇవ్వగా లోక్‌సభ, రాజ్యసభ సభ్యుల క్యాంటీన్లలో.. కేంద్ర వాణిజ్య శాఖామంత్రి పీయూష్ గోయల్, పార్లమెంటరీ వ్యవహారాలశాఖ మంత్రి కిరణ్‌రిజిజు, గిరిజన వ్యవహారాల శాఖ మంత్రి జుయెల్ ఓరం, పౌర విమానయానశాఖ మంత్రి రామ్మోహన్‌నాయుడు స్టాళ్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా పీయూష్ గోయల్ మాట్లాడుతూ… భౌగోళిక ప్రత్యేక గుర్తింపు ఉన్న అరకు కాఫీ బ్రాండ్‌ను ప్రోత్సహించడానికి ఏపీ ప్రభుత్వం తీసుకున్న చొరవను అభినందించారు. ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలోని డబుల్ ఇంజిన్ ప్రభుత్వాలు.. అరకు కాఫీని అత్యంత ప్రాధాన్య ఉత్పత్తిగా ప్రపంచం అసూయపడేలా ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లాయని చెప్పారు. జుయెల్ ఓరం మాట్లాడుతూ.. అరకులోయలో కాఫీ పెంపకం వాజ్‌పేయి ప్రధానిగా ఉన్నప్పుడు ప్రారంభించామన్నారు. అప్పట్లో ఇందుకోసం రూ. 200 కోట్లు ఇచ్చినట్లు గుర్తుచేశారు. కిరణ్ రిజిజు మాట్లాడుతూ…. ‘గిరిజనులు అంకితభావంతో పండించిన సుసంపన్నమైన కాఫీని ఇక్కడ విక్రయించడం గర్వకారణం. ఇది గిరిజనుల సాధికారత, స్వావలంబనకు నిదర్శనం’ అని అన్నారు.
*చంద్రబాబు ప్రయత్నాల వల్లే…*
రామ్మోహన్‌నాయుడు మాట్లాడుతూ…సీఎం చంద్రబాబు చేపట్టిన విస్తృత కార్యక్రమాల వల్ల అరకు కాఫీ ప్రపంచస్థాయి గుర్తింపు పొందిందన్నారు. ఆయన దావోస్‌లోనూ అందరికీ అరకు కాపీని ఇచ్చి అంతర్జాతీయ గుర్తింపు తెచ్చే ప్రయత్నం చేశారన్నారు.

