తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఏపిసి & ప్రభుత్వ కార్యదర్శి, వ్యవసాయ డైరెక్టర్, మార్కెటింగ్ డైరెక్టర్ మరియు ఇతర ఉన్నతాధికారులు శ్రీమతి రేబెక్కా రిడ్డర్, డివిజన్ హెడ్- ఆసియా, బిఎంఇఎల్ గారి ఆధ్వర్యంలో జర్మనీ నుండి వచ్చిన ప్రతినిధుల బృందంతో సచివాలయంలో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో వ్యవసాయ రంగంలో నూతన సాంకేతికతల అన్వయం, మార్కెటింగ్, డిజిటల్ వ్యవసాయ అభివృద్ధి వంటి ముఖ్య అంశాలపై విస్తృతంగా చర్చించడం జరిగింది.
సిరిసిల్ల జిల్లా వేములవాడలో పైలట్ ప్రాతిపదికన హెచ్హెచ్ఐ, జర్మనీ సంస్థ సహకారంతో నిర్వహిస్తున్న పరిశోధన గురించి మంత్రికి బృందసభ్యులు వివరించడం జరిగింది. ఈ పరిశోధనలో భాగంగా 3 ఎఫ్పీఓల నుండి 55 మంది రైతులను ఎంపిక చేసి, ఉత్పత్తి ఖర్చులను తగ్గించడం, సాంకేతికతను ఉపయోగించి కూలీ ఖర్చు తగ్గించడం, డిజిటల్ వ్యవసాయం, పంట దిగుబడులను పెంచడం, డ్రోన్లను ఉపయోగించి నేల యొక్క సారాన్ని పరీక్షించడం, వాతావరణ పరిస్థితులను ఎప్పటికప్పుడు అంచనా వేయడానికి వాతావరణ స్టేషన్ను నిర్వహిస్తూ, రైతులకు ఎప్పటికప్పుడు వాతావరణ సంబంధిత సమాచారాన్ని అందచేయడం జరుగుతుందని మంత్రికి వివరించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ…
భారత-జర్మనీ ప్రభుత్వాల సహకారంతో వ్యవసాయ రంగం అభివృద్ధికి నూతన ప్రణాళికలు చేపట్టాల్సిన అవసరాన్ని తెలిపారు. ప్రస్తుత ప్రాజెక్ట్ను రాష్ట్రవ్యాప్తంగా విస్తరించాలని, తద్వారా తెలంగాణలోని అందరు రైతులు ఈ ప్రయోజనాలను పొందగలుగుతారని తెలిపారు. వ్యవసాయ విశ్వవిద్యాలయం & ఏజిహబ్ డిజిటల్ వ్యవసాయంపై దృష్టి సారించి, తెలంగాణ రైతులు ఆధునిక వ్యవసాయం సాంకేతికతలను వినియోగించే విధంగా ప్రోత్సహించాలన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో పండించే పంటలు అంతర్జాతీయ ఎగుమతి ప్రమాణాలకు అనుగుణంగా పండించేవిధంగా రైతులను ప్రోత్సహించాలని, దీనివలన ఎగుమతులు పెరిగి రైతులకు అధిక ధరలు పొందుతారని తెలిపారు. దీనికి జర్మనీ ప్రభుత్వంతో కలిసి వ్యవసాయ అనుబంధ శాఖ, ఏజిహబ్, వ్యవసాయ విశ్వవిద్యాలయం కలసి ప్రాసెసింగ్ యూనిట్లు, ఎగుమతి అవకాశాలు, ఇతర అభివృద్ధి కార్యక్రమాలను అందించే అవకాశాలను పరిశీలించాలని అధికారులను ఆదేశించారు.
నూతన వ్యవసాయ పద్ధతులు, ఆధునిక యంత్రాలు ఉపయోగించడం ద్వారా కూలీల కొరతను అధిగమించడమే కాకుండా, అధిక దిగుబడులు రైతులు పొందే విధంగా సాంకేతికతను అనుసంధానం చేయాలన్నారు. ప్రస్తుతం దేశంలో జర్మన్ సహకారంతో రాజస్థాన్, ఒడిశా, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాలలో వివిధ ప్రాజెక్ట్లు ప్రగతిలో ఉన్నాయని బృంద సభ్యులు వివరించగా, తెలంగాణ ప్రభుత్వం నుండి ఒక అధ్యయన బృందాన్ని ఈ రాష్ట్రాలకు పంపి వాటియొక్క ఫలితాలను అధ్యయనం చేసి తెలంగాణ రైతులను కూడా అక్కడికి పంపించి వారికి శిక్షణ ఇచ్చి, పంట ఉత్పత్తులను అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఉత్పత్తి చేసి, ఎగుమతి చేసే విధంగా చూడలన్నారు. పిజెటిఏయు, ఏజిహబ్ వంటి సంస్థలు, డిజిటల్ వ్యవసాయాన్ని తెలంగాణ రైతులకు అందించేందుకు ప్రముఖంగా పనిచేయలన్నారు. ఏసిఆర్ఏటి ప్రాజెక్ట్ ద్వారా తెలంగాణ రైతులకు అధునాతన వ్యవసాయ విధానాల ప్రయోజనాలు అందించేందుకు ఇది ఒక గొప్ప అవకాశమని మంత్రి తెలిపారు. ఫ్రౌన్హోఫర్ పర్ బృందంతో రాష్ట్ర స్థాయి వ్యవసాయ శాఖ మరియు యూనివర్సిటీలు మరింత సమిష్టిగా పనిచేయాలన్నారు. ఏఐ మరియు ఐఓటి వంటి సాంకేతికతలను ఉపయోగించి అధిక దిగుబడి, ఆహార ప్రాసెసింగ్, మార్కెట్ లింకేజెస్ వంటి అంశాలను అభివృద్ధి చేయాలని సూచించారు. ఏసిఆర్ఏటి ప్రాజెక్ట్ ద్వారా వచ్చిన అనుభవాలను విస్తృతం చేసేందుకు వ్యవసాయ శాఖ సంపూర్ణ సహకారం అందిస్తుందని తెలిపారు. బిఎంఇఎల్ ప్రతినిధులు, తెలంగాణ వ్యవసాయ రంగ అభివృద్ధికి ఫుడ్ ప్రాసెసింగ్, అంతర్జాతీయ మార్కెట్ లింకేజెస్ వంటి రంగాల్లో మరింత సహకారం అందిస్తామన్నారు.
ఈ సమావేశం ఇండో-జర్మన్ వ్యవసాయ సహకారాన్ని బలోపేతం చేసేందుకు, తెలంగాణలో స్థిరమైన వ్యవసాయ అభివృద్ధికి దోహదపడే కీలక ముందడుగు అని తెలుపుతూ, సాంకేతికతను ఉపయోగించి వ్యవసాయ రంగాన్ని లాభదాయకంగా చేయాలని మంత్రి పేర్కొన్నారు.
ఈ సమావేశంలో జర్మన్ ప్రతినిధులైన డా. రఘు చలిగంటి, శాస్త్రవేత్త (డిజిటల్ అగ్రికల్చర్), ఫ్రౌన్హోఫర్-హెచ్హెచ్ఐ, డా. సెబాస్టియన్, హెడ్- టెలికమ్యూనికేషన్స్, ఫ్రౌన్హోఫర్-హెచ్హెచ్ఐ, శ్రీ మార్టిన్, ప్రాజెక్ట్ మేనేజర్, బిఎంఇఎల్, శ్రీ స్వెన్, డైరెక్టర్, ఐఏకె కన్సల్టింగ్ మరియు రాష్ట్రం నుండి డా. బి. గోపీ, వ్యవసాయ డైరెక్టర్, సురేంద్ర మోహన్ ఐఏఎస్, మార్కెటింగ్ డైరెక్టర్, ఎన్. శ్రీధర్, ఏపిసి & కార్యదర్శి, ప్రొ. అల్దాస్ జనయ్య, వైస్ చాన్స్లర్, పిజెటిఏయు, డా. డి. రాజిరెడ్డి, వైస్ చాన్స్లర్, ఎస్కెఎల్టిఎస్హెచ్యు, డా. బాలరాం, డైరెక్టర్ ఆఫ్ రీసెర్చ్, డా. రాములు, డైరెక్టర్ – ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్స్, పిజెటిఏయు, డా. కల్పనా శాస్త్రి, యండి, ఏజిహబ్, విజయ్ నడిమింటి, సిఇఓ, ఏజిహబ్ లు పాల్గొన్నారు.

20 Mar, 2025
