తెలంగాణ రాష్ట్ర పశుసంవర్ధకశాఖకు కేంద్ర ప్రశంసాపత్రం

జాతీయ పశుపోషణ పారిశ్రామిక అభివృద్ధి కార్యక్రమం (నేషనల్‌ లైవ్‌ స్టాక్‌ మిషన్‌ ఎంటర్‌ ప్రెన్యూర్‌షిప్‌ డెవలప్‌మెంట్‌ ప్రోగ్రాం) అమలులో అగ్రస్థానం సాధించిన తెలంగాణ పశుసంవర్ధకశాఖకు కేంద్రం ప్రశంసా పత్రం ఇచ్చింది. మహారాష్ట్రలోని పుణెలో శుక్రవారం ఉదయం జరిగిన కార్యక్రమంలో కేంద్ర పశుసంవర్ధక శాఖ కమిషనర్‌ ఈ పత్రాన్ని రాష్ట్ర అధికారులకు అందజేశారు. ఆత్మనిర్భర్‌ భారత్‌ పథకం అమలులోనూ తెలంగాణ రాష్ట్ర పనితీరు ప్రశంసనీయమని కమిషనర్‌ అభినందించారు. కేంద్రం నుంచి ప్రశంసాపత్రం పొందిన రాష్ట్ర పశుసంవర్ధక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సబ్యసాచి ఘోష్‌, అదనపు సంచాలకురాలు మల్లీశ్వరిలను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సలహాదారు వేం నరేందర్‌రెడ్డి ప్రశంసించారు.

Read More

పోలవరం డయాఫ్రం వాల్‌ నిర్మాణం నేడు ప్రారంభం

పోలవరం ప్రాజెక్టులో కీలకమైన కొత్త డయాఫ్రం వాల్‌ నిర్మాణానికి కేంద్ర జలసంఘం అనుమతించింది. టీ5 ప్లాస్టిక్‌ కాంక్రీటు సమ్మేళనంతో దీన్ని నిర్మించాలని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నిర్ణయించింది. గతంలో దెబ్బతిన్న డయాఫ్రం వాల్‌కు ఆరు మీటర్ల ఎగువన 1396.6 మీటర్ల పొడవు, 1.5 మీటర్ల మందంతో దీన్ని నిర్మిస్తారు. కనిష్ఠంగా 20 మీటర్లు, గరిష్ఠంగా 90 మీటర్ల లోతు నుంచి ఈ వాల్‌ నిర్మించుకుంటూ రావాలి. ఈ పనులను విదేశీ కంపెనీ బావర్‌ చేపడుతోంది. ఇందుకోసం మూడేసి చొప్పున ట్రెంచి కట్టర్లు, భారీ గ్రేబర్లు, డీశాండింగు యూనిట్ల వంటి యంత్ర పరికరాలను జర్మనీ నుంచి ఇక్కడికి తెప్పించారు. మొత్తం 383 ప్యానెళ్లతో లక్ష క్యూబిక్‌ మీటర్లకు పైగా ప్లాస్టిక్‌ కాంక్రీటు మిశ్రమంతో నిర్మాణం చేపడతారు. డయాఫ్రం వాల్‌ సగం నిర్మించాక ప్రధాన డ్యాం నిర్మాణం మొదలు పెట్టాలని భావిస్తున్నారు.

Read More

లైవ్‌ స్టాక్‌ మిషన్‌ ద్వారా రైతులకు లబ్ధి

జాతీయ లైవ్‌ స్టాక్‌ మిషన్‌ కింద యూనిట్లు ఏర్పాటు చేయడం ద్వారా రైతులకు ఎంతో లబ్ధి కలుగుతోందని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర పశుసంవర్థకశాఖ డైరెక్టర్‌ దామోదర్‌ నాయుడు పేర్కొన్నారు. జాతీయ లైవ్‌ స్టాక్‌ మిషన్‌లో భాగంగా 50% రాయితీపై గొర్రెలు, మేకలు, నాటుకోళ్లు, పందులు, సైలేజి యూనిట్ల ఏర్పాటుకు రూ.20 లక్షల నుంచి రూ. కోటి వరకు పశు సంవర్ధకశాఖ మంజూరు చేస్తోందని తెలిపారు. ఈ యూనిట్లను విజయవంతంగా నిర్వహిస్తున్న 20 మంది రైతులను కేంద్ర పశుసంవర్ధకశాఖ మంత్రి రాజీవ్‌ రంజన్‌ సింగ్‌, సహాయ మంత్రి జార్జ్‌ కురియన్‌ ఈ నెల 13న పుణెలో సత్కరించారు. ఈ గౌరవం పొందిన పశ్చిమగోదావరి జిల్లా బాదరాలకు చెందిన మిరియాల రామకుమార్‌ (కోళ్ల పెంపకం), ప్రకాశం జిల్లా కొత్తూరుకు చెందిన నారు బసివి రెడ్డి (గొర్రెల పెంపకం) గురువారం దామోదర్‌ నాయుడిని కలిశారు. ఆయన వారికి శుభాకాంక్షలు తెలిపి సత్కరించారు.

Read More

జిల్లా కేంద్రాల్లోని మార్కెట్ల ఆధునికీకరణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

తెలంగాణా రాష్ట్రంలో అన్ని జిల్లా కేంద్రాల్లోని మార్కెట్లను ఆధునికీకరించడంతోపాటు వరంగల్‌, నిజామాబాద్‌, ఖమ్మం వంటి పెద్ద మార్కెట్లను మరింత అభివృద్ధి చేసేందుకు నివేదికలు సిద్ధం చేశామని వ్యవసాయ, మార్కెటింగ్‌, సహకార, చేనేత, జౌళిశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. హైదరాబాద్‌ సమీపంలోని కొహెడ వద్ద అత్యాధునిక మెగా మార్కెట్‌ను నిర్మిస్తామని.. దీన్ని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారని చెప్పారు. ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌ యార్డులో గురువారం మంత్రి విలేకరులతో మాట్లాడారు. ఔటర్‌, రీజినల్‌ రింగు రోడ్డు మధ్యలో 400 ఎకరాల్లో కొహెడ వద్ద విస్తృతమైన మార్కెట్‌నుతత నిర్మించనున్నట్లు వివరించారు.

Read More

ఖరీఫ్‌లో కరవు.. 1.06 లక్షల హెక్టార్లలో పంట నష్టంరూ. 151.77 కోట్ల సాయం అందించండికేంద్ర బృందానికి నివేదిక

ఖరీఫ్‌లో కరవు పరిస్థితుల కారణంగా 5 జిల్లాల పరిధిలో 1.06 లక్షల హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నాయని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి నివేదించింది. కరవు కారణంగా నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు రూ. 151.77 కోట్ల సాయం అందించాలని కోరింది. కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమశాఖ సంయుక్త కార్యదర్శి పెరిన్‌దేవి నేతృత్వంలోని అధికారుల బృందం బుధ, గురువారాల్లో రాష్ట్రంలో పర్యటించింది. వారు అనంతపురం, అన్నమయ్య, చిత్తూరు, శ్రీసత్యసాయి, కర్నూలు జిల్లాల్లోని రైతులతో మాట్లాడి.. పంటనష్టం తీరును తెలుసుకున్నారు. అనంతరం గురువారం తాడేపల్లిలోని విపత్తుల నిర్వహణ సంస్థ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రెవెన్యూశాఖ (భూములు, విపత్తుల నిర్వహణ, స్టాంపులు, రిజిస్ట్రేషన్లు) ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోదియా వారికి కరవు పరిస్థితులపై నివేదిక ఇచ్చారు.
ఉపశమన చర్యలు చేపట్టాం
కరవు ప్రభావంతో పత్తి, జొన్న, వేరుశనగ, కంది, శనగ, మొక్కజొన్న తదితర 14 రకాల పంటలు దెబ్బతిన్నాయని వ్యవసాయశాఖ డైరెక్టర్‌ ఢిల్లీరావు, విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్‌ వివరించారు. ‘రూ. 16.67 కోట్లతో 80% రాయితీపై విత్తనాలు, రూ.55.47కోట్లతో పశుగ్రాస విత్తనాలు అందించాం. 60% రాయితీపై చాప్‌కట్టర్లు ఇచ్చాం. పశువైద్యశాలలకు మందులు సరఫరా చేశాం’ అని ఆయన పేర్కొన్నారు. కరవు నష్టంపై పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ ఇచ్చారు.
రైతులను ఆదుకునేలా చూస్తాం
కరవు ప్రభావ ప్రాంతాల్లో రైతులతో మాట్లాడి.. వాస్తవ నష్టాన్ని తెలుసుకున్నామని పెరిన్‌దేవి చెప్పారు. ‘కేంద్రానికి త్వరితగతిన నివేదిక ఇస్తాం. పంట నష్టపోయిన రైతుల్ని ఆదుకునేలా చూస్తాం’ అని హామీ ఇచ్చారు.

కరవు జిల్లాలు : కర్నూలు, అనంతపురం, శ్రీసత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు
పంట నష్టం : 1.06 లక్షల హెక్టార్లు
నష్టపోయిన రైతులు : 1.44 లక్షలు
ఉత్పత్తి నష్టం : రూ.240 కోట్లు

రంగాలవారీగా కేంద్రాన్ని కోరిన సాయం
రంగం సాయం (రూ. కోట్లలో)
వ్యవసాయం (పెట్టుబడి రాయితీ) 90.63
పశుసంవర్థక శాఖ 55.47
గ్రామీణ నీటి సరఫరా 0.78
పట్టణ నీటిసరఫరా 4.89
మొత్తం 151.77

Read More

3 జలాశయాలు.. 4.24 కోట్ల టన్నులుపూడికతీతతో ఇసుక విక్రయానికి నిర్ణయంటెండర్లు పిలిచిన నీటిపారుదల శాఖ

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ నీటిపారుదల శాఖ జలాశయాలలో పేరుకు పోయిన పూడిక వెలికితీత ద్వారా భారీ రాబడితో పాటు జలాశయాల్లో నీటి నిల్వ పెంపునకు చర్యలు ప్రారంభించింది. దీనికోసం సెడిమెంటేషన్‌ ప్రణాళికలో భాగంగా పైలట్‌ ప్రాజెక్టు కింద తొలుత కడెం, మధ్య మానేరు, దిగువ మానేరు జలాశయాల్లో పూడికతీతకు గురువారం టెండర్లు పిలిచింది. ఈ మూడు జలాశయాల నుంచి పూడికతీత ద్వారా 4.24 కోట్ల టన్నుల ఇసుక వెలికితీయవచ్చని ప్రాథమిక అంచనా. అయితే, టన్నుకు రూ.339.36 గుత్తేదారుల నుంచి నీటిపారుదలశాఖ వసూలు చేయనుంది.
20 ఏళ్ల సమయానికి టెండర్లు
ఈ మూడు జలాశయాల్లో పూడిక వెలికితీత కాల పరిమితిని 20 ఏళ్లుగా నిర్ధారించారు. పని అంచనా విలువను రూ.1439.55 కోట్లుగా నిర్ణయించారు. ఈ మేరకు టెండర్ల ప్రకటనలో నీటిపారుదలశాఖ(కరీంనగర్‌ సర్కిల్‌) పేర్కొంది. నిర్మల్‌ జిల్లాలోని కడెం నారా యణరెడ్డి ప్రాజెక్టు నుంచి 3.28 కోట్ల టన్నులు, రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలంలోని మనువాడలోని మధ్యమానేరు నుంచి 63 లక్షల టన్నులు, కరీంనగర్‌ జిల్లా తిమ్మాపూర్‌ మండలం అలుగునూర్లోని దిగువ మానేరు నుంచి 33 లక్షల టన్నుల ఇసుకను వెలికి తీయవచ్చని అంచనా వేస్తున్నారు. టెండర్ల దాఖలుకు ఈనెల 21 వరకు గడువు ఇచ్చారు. రాష్ట్ర భూగర్భగనులు, ఖనిజాల శాఖ విధివి ధానాలను అనుసరించి గుత్తేదారులు పన్నులు చెల్లించాలి. ఇసుక నిర్వహణ బాధ్యతలను కూడా టీజీఎండీసీ, నీటిపారుదల శాఖల సంయుక్త పర్యవేక్షణలో నిర్వహించనున్నారు. దీనికోసం ఇసుక తరలించే ప్రాంతాల్లో వే బ్రిడ్జిలను ఏర్పాటు చేయనున్నారు. ఈ మూడు జలాశయాల్లో పూడికతీత అనంతరం గుత్తేదారులు మట్టిని, ఇసుకను వేరు చేయనున్నారు. మట్టిని రైతులకు ఉచితంగా ఇచ్చేందుకు నీటిపారుదలశాఖ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.

Read More

తెలంగాణ వ్యవసాయ రంగ అభివృద్ధికి అగ్రికల్చర్‌ ఇన్ఫ్రాస్ట్రక్చర్‌ ఫండ్‌ (ఏఐఎఫ్‌) ద్వారా కీలక అడుగు

తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సచివాలయంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ అధికారులతో పాటు నాబ్‌కాన్స్‌ ఉపాధ్యకక్షురాలు శ్రీమతి శిల్పా దేశ్‌పాండేతో కీలక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధి (అగ్రి ఇన్‌ఫ్రా ఫండ్‌-పియంయు) పథకం మానిటరింగ్‌ సెల్‌తో విలీనం గురించి చర్చించి, దీని ద్వారా రైతులకు మరింత లాభదాయకమైన విధంగా పథకాలను అమలు చేయడంపై సమగ్ర కార్యాచరణ రూపొందించారు.
తెలంగాణ రాష్ట్రం అగ్రికల్చర్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఫండ్‌ (ఏఐఎఫ్‌) పథకంలో జాతీయ స్థాయిలో ప్రస్తుతం రెండవ స్థానంలో నిలిచిందని భుజంగరావు తెలిపారు. ఆయన ప్రకారం, గత ఏడాది న్యూ ఢిల్లీలో నిర్వహించిన ప్రతిష్టాత్మక కార్యక్రమంలో తెలంగాణ అగ్రికల్చర్‌ ఇన్ఫ్రాస్ట్రక్చర్‌ ఫండ్‌ ప్రాజెక్ట్‌ మేనేజ్మెంట్‌ యూనిట్‌ కు కేంద్రం అవార్డు అందినట్లు పేర్కొన్నారు.
తెలంగాణలో ప్రగతి
తెలంగాణ రాష్ట్రం అగ్రికల్చర్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఫండ్‌ (ఏఐఎఫ్‌) పథకంలో ఇప్పటివరకు రూ.3,046 కోట్ల నిధులు పొందింది. ఈ నిధులతో మొత్తం 2,246 మౌలిక సదుపాయాల యూనిట్లు ఏర్పాటు చేయబడ్డాయి. వీటిలో 1,450 వ్యవసాయ ప్రాథమిక ప్రాసెసింగ్‌ యూనిట్లు, 785 గిడ్డంగులు, 209 కస్టమ్‌ హైరింగ్‌ సెంటర్లు, 101 పోస్ట్‌-హార్వెస్ట్‌ సౌకర్యాలు ఉన్నాయి. రాష్ట్ర ప్రగతిని దృష్టిలో ఉంచుకొని, రాష్ట్రం ఇప్పటికే రూ.3,075 కోట్ల లక్ష్యాన్ని పూర్తిగా సాధించిందని, తద్వారా వచ్చే ఆర్థిక సంవత్సరం కోసం రూ.4,000 కోట్ల లక్ష్యాన్ని కేంద్రం వద్ద అభ్యర్థించినట్లు తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి మరియు వ్యవసాయ సహకార శాఖ కమిషనర్‌ తెలిపారు.
స్కీమ్‌ ప్రయోజనాలు:
స్కీమ్‌ కింద రైతులకు 3% వడ్డీ సబ్సిడీ లభిస్తోంది. తద్వారా రైతులు ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ నిర్మాణానికి తీసుకునే లోన్లపై కేవలం 6% వడ్డీ చెల్లించవలసి ఉంటుంది. రెండు కోట్ల రుణము వరకు వేరే హామీ అవసరం లేదు.
ఇతర పథకాల సమన్వయం:
నేషనల్‌ హార్టికల్చర్‌ మిషన్‌, అగ్రి మార్కెటింగ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌, మరియు ఫుడ్‌ ప్రాసెసింగ్‌ స్కీమ్‌ వంటి ఇతర ప్రభుత్వ పథకాలతో ఈ స్కీమ్‌ సమన్వయంతో కొనసాగుతుంది. ఈ పథకాల కింద 25% నుండి 33% వరకు సబ్సిడీలు అందుబాటులో ఉన్నాయి.
ఈ పథకం ప్రధాన లక్ష్యాలు:

  • గిడ్డంగులు / సైలోస్‌ (గాదె) / కోల్డ్‌ స్టోరేజ్‌ శుభ్రం చేయటం/ఎండబెట్టడం / సార్టింగ్‌ / గ్రేడింగ్‌
  • వ్యవసాయప్రాథమిక ప్రాసెసింగ్‌ యూనిట్లు (రైస్‌ / పప్పు విత్తనశుద్ధి ప్రాసెసింగ్‌ మిల్లు మొదలైనవి)
  • అద్దె ప్రాతిపదిక వ్యవసాయ యాంత్రీకరణ కేంద్రం వ్యవసాయ / పంటలు యాంత్రీకరణ
  • స్మార్ట్‌ మరియు ప్రెసిషన్‌ వ్యవసాయం, డ్రోన్లు, రిమోట్‌ సెన్సింగ్‌- వంటి ఆధునిక సాంకేతిక పద్ధతులను ప్రోత్సహించడం
  • రైతుల ఆదాయాన్ని పెంపొందించడం
  • రైతు నేస్తం ద్వారా అగ్రికల్చర్‌ ఇన్ఫ్రాస్ట్రక్చర్‌ ఫండ్‌ పథకానికి సంబందించి వివరాలను రైతులకు వివరించాల్సిందిగా వ్యవసాయ అధికారులను మంత్రి ఆదేశించారు.
    మంత్రివర్యుల ఉద్ఘాటన:
    ఈ నిర్ణయాలు తెలంగాణ వ్యవసాయ రంగ అభివృద్ధికి కీలకంగా నిలుస్తాయని, మౌలిక సదుపాయాల అభివృద్ధి ద్వారా రైతుల ఆదాయాన్ని పెంచడంలో మరింత విజయాలు సాధించగలమని మంత్రి విశ్వాసం వ్యక్తం చేశారు.
Read More

రైతులకు లాభాలు పెంచేలా ప్రకృతి సేద్యం20 సూత్రాల కార్యక్రమ అమలు కమిటీ ఛైర్మన్‌ దినకర్‌

ప్రకృతి సేద్యంలో రైతులకు లాభాలు వచ్చేలా చూడాలని 20 సూత్రాల కార్యక్రమ అమలు కమిటీ ఛైర్మన్‌ లంకా దినకర్‌ సూచించారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర సచివాలయంలో మంగళవారం ఆయన ఆర్గానిక్‌ ప్రొడక్ట్‌ సర్టిఫికేషన్‌ అథారిటీ చైర్మన్‌ దేవదత్తు, అత్తలూరిపాలెం ఆర్గానిక్‌ ఫార్మర్స్‌ ప్రొడ్యూసర్స్‌ ఎండీ సురేంద్రబాబు తదితరులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ప్రకృతి సేద్యం, ప్రజలకు ఆరోగ్యం, రైతుకు లాభాలపై చర్చించారు. దేశంలో ఆర్గానిక్‌ సేద్యం అభివృద్ధి చేసేలా ప్రధాని మోదీ ప్రోత్సాహకాలు ప్రకటించారని, ఏపీని ఆర్గానిక్‌ ఫార్మింగ్‌ హబ్‌గా మార్చేందుకు సీఎం చంద్రబాబు కార్యాచరణ చేపట్టారని పేర్కొన్నారు. ఆర్గానిక్‌ ప్రొడక్ట్‌ సర్టిఫికేషన్‌ అథారిటీ చైర్మన్‌ ఆధ్వర్యంలో విజయనగరం జిల్లాలో ప్రకృతి సేద్యాన్ని విజయవంతం చేయడానికి కార్యాచరణ రూపొందించాలని నిర్ణయించారు.
Read More

వ్యవసాయంలోనూ ఇంజినీరింగ్‌ దేశవ్యాప్తంగా కళాశాలలు

  • ఐకార్‌ డిప్యూటీ డైరెక్టర్‌ జనరల్‌ ఎస్‌ఎన్‌ ఝ
  • వ్యవసాయ యాంత్రీకరణను విస్తరించేందుకు వీలుగా దేశవ్యాప్తంగా పెద్దఎత్తున ఇంజినీరింగ్‌ కళాశాలలను ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టినట్లు భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి (ఐకార్‌) డిప్యూటీ డైరెక్టర్‌ జనరల్‌ ఎస్‌ఎన్‌ ఝా తెలిపారు. అన్ని రాష్ట్రాల్లో వ్యవసాయ శాఖ పరిధిలో ఇంజినీరింగ్‌ విభాగం ప్రత్యేకంగా ఏర్పాటుకు, సాంకేతిక నైపుణ్యం గల ఇంజినీర్లను జిల్లా, మండల స్థాయిలో అందుబాటులోకి తెచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నామని చెప్పారు. 2047 నాటికి సాగులో 75% యాంత్రీకరణ సాధించాలన్నది లక్ష్యమని వివరించారు. అఖిల భారత యాంత్రీకరణ ప్రాజెక్టు వర్క్‌షాపులో పాల్గొనేందుకు హైదరాబాద్‌ వచ్చిన ఆయన ఈ విషయాలు మాట్లాడారు. ”యాంత్రీకరణ దృష్టితో 1966లో కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ ఇంజినీరింగ్‌ కళాశాలలను ఏర్పాటు చేయాలని ఆదేశాలు ఇచ్చింది. ఇవి కొద్ది సంఖ్యలో మాత్రమే ఉన్నాయి. తెలంగాణలో ఒక్క సంగారెడ్డిలోనే స్థాపించారు. కేంద్ర ప్రభుత్వం యాంత్రీకరణకు పెద్దపీట వేస్తోంది. ఇందుకోసం పెద్ద ఎత్తున పథకాలను అమలు చేస్తోంది.. నిధులను కేటాయిస్తోంది. వ్యవసాయం.. రాష్ట్రాల జాబితాలో ఉంది. రాష్ట్రస్థాయిలో వీటి నిర్వహణకు ప్రత్యేక విభాగం, యంత్రాంగం ఉండాలి. భారీఎత్తున మానవ వనరులు అవసరం. అలాగే యంత్రపరికరాల తయారీ, నిర్వహణ, మరమ్మత్తులకు నిపుణుల కొరత తీవ్రంగా ఉంది. ఈ పరిస్థితి యాంత్రీకరణ పురోగతికి అవరోధంగా మారింది. రాష్ట్రంలో ప్రత్యేక విభాగం ఏర్పాటుకు, వ్యవసాయ ఇంజినీరింగ్‌ కళాశాలలు నెలకొల్పేందుకు వీలుగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు కేంద్ర వ్యవసాయ శాఖ కార్యదర్శి లేఖలు రాశారు.

నాలుగేళ్ల కోర్సు…
వ్యవసాయ ఇంజినీరింగ్‌ నాలుగేళ్ల కోర్సు. దీనికి భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి గుర్తింపునిస్తుంది. ఇంటర్మీడియట్‌ ఎంపీసీతో ప్రవేశాలు ఉంటాయి. ఈ ఇంజినీర్లకు వ్యవసాయం, దాని అనుబంధ రంగాల్లో విస్తృత ఉద్యోగావకాశాలున్నాయి. కేంద్ర ప్రభుత్వ లేఖపై అన్ని రాష్ట్రాలు స్పందిస్తున్నాయి. వచ్చే విద్యా సంవత్సరం నుంచి వ్యవసాయ ఇంజినీరింగ్‌ కళాశాలలు ప్రారంభించేందుకు ముందుకొస్తున్నాయి. రానున్న నాలుగేళ్లలో దాదాపు 30 వేల మంది వ్యవసాయ ఇంజినీర్లను తయారు చేయాలన్నది కేంద్ర ప్రభుత్వం సంకల్పం. దీనికి సంబంధించి అన్ని రకాలుగా రాష్ట్రాలకు సహకారం అందిస్తుంది. ప్రస్తుతం బీటెక్‌ చేసిన ఇంజినీర్లకు వ్యవసాయ పరిజ్ఞానం లేదు. దీని కోసం ప్రత్యేక సబ్జెక్టులు, శిక్షణతో కూడిన విద్య అవసరం. వ్యవసాయ ఇంజినీరింగ్‌ ఈ కొరతను తీరుస్తుంది” అని ఝా తెలిపారు.

Read More

వ్యవసాయ విద్య, పరిశోధన, విస్తరణలో ప్రపంచస్థాయికి ఎదగాలి

  • తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ

2047 నాటికి వ్యవసాయ రంగంలో ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రపంచ స్థాయికి ఎదగాలని విశ్వవిద్యాలయం కులపతి, తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ ఆకాంక్షించారు. భాగస్వాముల అందరితో సమన్వయం చేసుకుంటూ వ్యవసాయ విద్య, పరిశోధన, విస్తరణలో పురోగతి సాధించాలని సూచించారు. రాజేంద్రనగర్‌లో 2 రోజులపాటు జరుగుచున్న వ్యవసాయ విశ్వవిద్యాలయం వజ్రోత్సవాలకు ఆయన ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. రాజేంద్రనగర్‌లోని పి.జె.టి.ఎ.యు. క్రీడా మైదానంలో కిసాన్‌ మేళా, వ్యవసాయ ప్రదర్శనల్ని ప్రారంభించారు. వివిధ స్టాళ్లను పరిశీలించారు. తర్వాత ఆడిటోరియంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు. వజ్రోత్సవాల మీనియేచర్‌ పైలాన్‌ని రాష్ట్ర వ్యవసాయ, సహకార, చేనేత, జౌళి శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, పి.జె.టి.ఎ.యు. ఉపకులపతి అల్దాస్‌ జానయ్యతో కలిసి ప్రారంభించారు. కాన్సాస్‌ స్టేట్‌ యూనివర్సిటీ గుర్తింపు పత్రాలని అందజేశారు. తర్వాత విశ్వవిద్యాలయం అధికారులు, బోధన, బోధనేతర సిబ్బంది, విద్యార్థినీ విద్యార్థులని ఉద్దేశించి ప్రసంగించారు. 60 ఏళ్లుగా వ్యవసాయ విశ్వవిద్యాలయం వ్యవసాయ అభివృద్ధికి అసమాన సేవల్ని అందించిందన్నారు. సొనామసూరి, తెలంగాణ సోనా వంటి వంగడాలు రూపొందించిందన్నారు. భవిష్యత్‌ ప్రణాళికల అమలులో విశ్వవిద్యాలయ పూర్వ విద్యార్థుల సహకారం తీసుకోవాలన్నారు. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌, రోబోటిక్స్‌, రెన్యూవబుల్‌ ఎనర్జీ వంటి అధునాతన పరిజ్ఞానాన్ని వ్యవసాయ రంగంలోకి విస్తృతంగా తీసుకురావాలని గవర్నర్‌ సూచించారు. భారతీయ స్టేట్‌ బ్యాంక్‌ సహాయంతో విశ్వవిద్యాలయం త్వరలో ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ల్యాబ్‌నీ ప్రారంభించడం అభినందనీయమన్నారు. వ్యవసాయ విద్యని అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ఫీజులు తగ్గించడం స్వాగతించదగినదన్నారు. జై జవాన్‌, జై కిసాన్‌ అనే నినాదం ఇచ్చిన మాజీ ప్రధాని లాల్‌ బహుదూర్‌ శాస్త్రి చేతుల మీద ప్రారంభమైన ఈ విశ్వవిద్యాలయం వాతావరణ మార్పులు వంటి కొత్త సవాళ్లని ఎదుర్కొని మంచి భవిష్యత్తు దిశగా అడుగులు వేసేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని గవర్నమెంట్‌ పిలుపునిచ్చారు. ఉదయం ఉత్సవాల ప్రారంభ సదస్సులోనూ.
స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌లో నిర్వహించిన కిసాన్‌ మేళాలోను తుమ్మల నాగేశ్వరరావు రైతులని ఉద్దేశించి ప్రసంగించారు. 60 ఏళ్ల చరిత్ర కలిగిన విశ్వవిద్యాలయం భవిష్యత్తులో దేశానికి దిక్సూచిగా మారాలన్నారు. వాతావరణ మార్పులకు అనుగుణంగా డిమాండ్‌ ఉన్న పంటలు, మన నేల స్వభావానికి తగ్గట్లుగా అనువైన పంటలు, అందుకు అవసరమైన సాంకేతిక సలహాలు, సూచనలను రైతులకు అందించాలని విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలకి ఆయన సూచించారు. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి రైతు వ్యవసాయ సంక్షేమానికి పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తున్నారన్నారు. రైతు బీమా, రైతు రుణమాఫీలతో పాటు సంక్రాంతి తర్వాత రైతు భరోసాను అమలు చేస్తామన్నారు. హార్టికల్చర్‌, పంటలు, కూరగాయలు పామాయిల్‌ సాగు పెరగాలన్నారు. బిందు, తుంపర సేద్యం, వ్యవసాయ యాంత్రీకరణ పనిముట్లు, శీతల గిడ్డంగుల నిర్మాణానికి చేయుతనిస్తామన్నారు. భవిష్యత్తులో పెద్ద సంఖ్యలో వ్యవసాయ పట్టభద్రులు రావాలని వ్యవసాయ రంగంలో అధిక జనాభా నిమగ్నం కావాలని తుమ్మల ఆకాంక్షించారు. దేశ ప్రధానుల చేతుల మీద ప్రారంభమైన విశ్వవిద్యాలయం రైతాంగానికి ఎల్లప్పుడూ చేదోడువాదోడుగా ఉందని ఆయనన్నారు. గత కొన్నేళ్లుగా ఈ విశ్వవిద్యాలయం వెనుకబాటుకి గురి అయింది అని.. దాని అధిగమించి పూర్వ వైభవం తీసుకురావటానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ చారిత్రాత్మక సందర్భాన్ని ఉపయోగించుకుని పరిశోధన, విస్తరణ విద్యలో ముందుకెళ్లాలని మంత్రి సూచించారు. రానున్న రోజుల్లో వ్యవసాయ విశ్వవిద్యాలయం మొదటి 10 ర్యాంకుల్లో నిలవాలని తుమ్మల నాగేశ్వరరావు ఆకాంక్షించారు.
రాష్ట్ర ప్రభుత్వం తరఫున వ్యవసాయ విశ్వవిద్యాలయానికి అన్ని విధాల తోడ్పాటు అందిస్తుందన్నారు. ప్రతి వ్యవసాయ కళాశాల పరిధిలో ఒక ”మోడల్‌ అగ్రికల్చర్‌ ఫార్మ్‌”ను అభివృద్ధి చేయాలన్నారు. వాతావరణ మార్పుల కనుగుణంగా కరికులమ్‌లో రీసెర్చ్‌లో మార్పులు తీసుకురావాలని, ఆర్టిఫిషియల్‌, డిజిటల్‌ టెక్నాలజీలను వినియోగించుకోవాలని తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. వజ్రోత్సవ ఉత్సవాల ప్రారంభ సమావేశంలో భారత ప్రభుత్వ నీతి ఆయోగ్‌ సభ్యులు రమేష్‌ చంద్‌ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ప్రస్తుత ఉపకులపతి అల్దాస్‌ జానయ్యతో తనకు పూర్వం నుంచి పరిచయం ఉందని ఆయన నాయకత్వంలో విశ్వవిద్యాలయ అభివృద్ధి పథాన సాగుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. గత విజయాలతో సంతృప్తి చెందకుండా భవిష్యత్తు లక్ష్యాల్ని నిర్దేశించుకోవాలన్నారు. నిధుల లభ్యత తగ్గడం వల్ల పరిశోధనలు వెనుకబడుతున్నాయని ఆ విషయంపై దృష్టి సారించాలన్నారు. దేశంలోనూ, రాష్ట్రంలోనూ ఆహార ధాన్యాల ఉత్పాదక గణనీయంగా పెరిగిందన్నారు. తెలంగాణలో నీటిపారుదల సౌకర్యాలు, ఆహార ధాన్యాలు ఉత్పత్తి బాగా పెరిగిందన్నారు. అయితే కూరగాయలు, ఉద్యానవన పంటలు, పప్పు ధాన్యాలు, నూనె గింజల ఉత్పత్తిలో వెనుకబడి ఉన్నామని దీన్ని అధిగమించాలన్నారు. అదేవిధంగా వ్యవసాయ విద్యనభ్యసించిన వాళ్ళు కేవలం ఉద్యోగాల కోసమే చూడకుండా ఎంటర్‌ ప్రెన్యూర్‌లుగా తయారు కావాలని రమేష్‌ చంద్‌ సూచించారు. గతంలో రైతులకి దక్కిన గౌరవం నేడు దక్కడం లేదని తెలంగాణ వ్యవసాయ రైతు సంక్షేమ కమిషన్‌ చైర్మన్‌ ఎం. కోదండ రెడ్డి అన్నారు. రైతుకి వ్యవసాయానికి మూలమైన విత్తనాలు 90 శాతం ప్రైవేట్‌ కంపెనీల చేతుల్లోకి వెళ్లడం దురదృష్టకరమని ఆయనన్నారు. ఈ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డికి రైతులు, వ్యవసాయ సంక్షేమం ప్రథమ ప్రాధాన్యాలని అందుకు అనుగుణంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పనిచేయాలన్నారు. శాస్త్రవేత్తలు గ్రామాల్ని దత్తత తీసుకోవాలన్నారు. భవిష్యత్తులో సహకార వ్యవసాయ విధానం అవసరమని కోదండ రెడ్డి అన్నారు. రైతు సుఖంగా ఉంటేనే దేశం సుభిక్షంగా ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్‌ రెడ్డి అన్నారు. భూమి, విత్తనం, నీరు, రైతు చెమట వ్యవసాయానికి ఆధారాలన్నారు. మన వ్యవసాయ విశ్వవిద్యాలయం దేశానికి తలమానికంగా ఉండాలని ఆకాంక్షించారు. పురుగుమందుల రహిత వ్యవసాయం కోసం మనమందరం కృషి చేయాలని పోచారం శ్రీనివాస్‌ రెడ్డి పిలుపునిచ్చారు. ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి హయంలో అమెరికా అధ్యకక్షుడు జార్జి బుష్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయం సందర్శించడం గొప్ప అనుభవం అని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యకక్షులు జి. చిన్నా రెడ్డి అన్నారు. వ్యవసాయ విశ్వవిద్యాలయంలో పెద్ద సంఖ్యలో ఖాళీలు ఉన్నాయని, వాటిని భర్తీ చేయడానికి చర్యలు తీసుకోవాలన్నారు. ఈమధ్య ప్రధాని 131 కొత్త వంగడాలు విడుదల చేశారని వాటిలో కనీసం మన విశ్వవిద్యాలయం వంగడాలు లేకపోవడం దురదృష్టకరమన్నారు.
విద్య, పరిశోధన, విస్తరణలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. కొంతమంది వ్యతిరేకిస్తున్నప్పటికీ జన్యు మార్పిడి పంటల సాగు నీ అనుసరించవలసిందేనన్నారు. రాష్ట్రంలో ఉన్న ఇక్రిసాట్‌, క్రిడా వంటి సంస్థల సహకారం తీసుకోవాలని, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌, టెక్నాలజీలని వ్యవసాయ రంగంలో విస్తృతంగా వినియోగించుకోవాలని చిన్నారెడ్డి సూచించారు. రైతుల కష్టాలు నాటికి నేటికి అలానే ఉన్నాయని మాజీ ముఖ్యమంత్రి, మాజీ వ్యవసాయ శాఖ మంత్రి నాదెండ్ల భాస్కరరావు అన్నారు. ధరల పెరుగుదల, వాతావరణ మార్పులకి అనుగుణంగా రైతులకి చాలా చేయవలసి ఉందని ఆయన అన్నారు. వందేళ్ళ క్రితమే వ్యవసాయంగా ప్రాముఖ్యత గురించి మహాత్మా గాంధీ చెప్పారని మరో మాజీ వ్యవసాయ శాఖ మంత్రి సమరసింహా రెడ్డి అన్నారు. వ్యవసాయానికి అవసరమైన అన్నింటిని రైతులకు అందుబాటులో ఉంచాలని సమరసింహారెడ్డి సూచించారు. 60 ఏళ్ల వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రస్తానాన్ని పి.జె.టి.ఎ.యు. ఉపకులపతి అల్దాస్‌ జానయ్య వివరించారు. నాటి ప్రధానులు లాల్‌ బహుదూర్‌ శాస్త్రి, ఇందిరాగాంధీలు, రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్‌, ఉపరాష్ట్రపతి మొరార్జీ దేశాయ్‌లు వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని సందర్శించారన్నారు. వ్యవసాయ విశ్వవిద్యాలయం చుట్టూ సుమారు 10 భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి సంస్థలు ఉన్నాయన్నారు. అదేవిధంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం వల్ల హైదరాబాద్‌ విత్తన రాజధానిగా రూపొందిందని జానయ్య వివరించారు. 60 ఏళ్లలో సుమారు 500 వంగడాలని విడుదల చేశామన్నారు. అదేవిధంగా సుమారు 32 వేల మంది గ్రాడ్యుయేట్లు బయటకొచ్చారన్నారు. 12 రాష్ట్రాల్లో సుమారు 3 కోట్ల ఎకరాల్లో విశ్వవిద్యాలయం రూపొందించిన వరి విత్తనాలు సాగు చేస్తున్నారని తెలిపారు. ఇతర పంటల్లోనూ విశ్వవిద్యాలయం రూపొందించిన వంగడాలు విస్తృత వ్యాప్తి పొందాయన్నారు. 21 పేటెంట్లు సాధించామన్నారు అలాగే పౌల్ట్రీ, పశుసంవర్ధక రంగాల్లోనూ వ్యవసాయ విశ్వవిద్యాలయం అపూర్వ ప్రగతి సాధించిందని అల్దాస్‌ జానయ్య అన్నారు. ఈ సందర్భంగా 60 ఏళ్ల విశ్వవిద్యాలయం ప్రయాణం పై ఒక లఘు చిత్రాన్ని విడుదల చేశారు. అలాగే వివిధ సాగు పద్ధతులపై అనేక ప్రచురణల్ని కూడా విడుదల చేశారు.
ఈ కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు ప్రకాష్‌ గౌడ్‌, వ్యవసాయ శాఖ కార్యదర్శి ఎ.పి.సి. రఘునందన్‌ రావు, కమిషనర్‌ బి. గోపి, విత్తనాభివృద్ధి కార్పొరేషన్‌ చైర్మన్‌ అన్వేష్‌ రెడ్డి, ఆగ్రోస్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ బాల్‌ రాజు, కొండా లక్ష్మణ్‌ బాపూజీ హార్టికల్చర్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉపకులపతి డి. రాజి రెడ్డి, రంగారెడ్డి కలెక్టర్‌ నారాయణరెడ్డి, పద్మశ్రీ గ్రహీతలు చింతల వెంకటరెడ్డి, వై. వెంకటేశ్వర రావు, విశ్వవిద్యాలయం మాజీ ఉపకులపతులు రఘువర్ధన్‌ రెడ్డి, రాఘవ రెడ్డి, పద్మరాజు, వెటర్నరీ విశ్వవిద్యాలయం మాజీ ఉపకులపతి ప్రభాకర్‌ రావు, పూర్వ అధికారులు, బోధన, బోధనేతర సిబ్బంది, పరిశ్రమల ప్రతినిధులు, విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కిసాన్‌ మేళా వేదికపై పలువురు తమ రైతులకు ఈ సందర్భంగా అవార్డులను బహుకరించారు.

Read More