- ఐకార్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ ఎస్ఎన్ ఝ
- వ్యవసాయ యాంత్రీకరణను విస్తరించేందుకు వీలుగా దేశవ్యాప్తంగా పెద్దఎత్తున ఇంజినీరింగ్ కళాశాలలను ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టినట్లు భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి (ఐకార్) డిప్యూటీ డైరెక్టర్ జనరల్ ఎస్ఎన్ ఝా తెలిపారు. అన్ని రాష్ట్రాల్లో వ్యవసాయ శాఖ పరిధిలో ఇంజినీరింగ్ విభాగం ప్రత్యేకంగా ఏర్పాటుకు, సాంకేతిక నైపుణ్యం గల ఇంజినీర్లను జిల్లా, మండల స్థాయిలో అందుబాటులోకి తెచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నామని చెప్పారు. 2047 నాటికి సాగులో 75% యాంత్రీకరణ సాధించాలన్నది లక్ష్యమని వివరించారు. అఖిల భారత యాంత్రీకరణ ప్రాజెక్టు వర్క్‌షాపులో పాల్గొనేందుకు హైదరాబాద్ వచ్చిన ఆయన ఈ విషయాలు మాట్లాడారు. ”యాంత్రీకరణ దృష్టితో 1966లో కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ ఇంజినీరింగ్ కళాశాలలను ఏర్పాటు చేయాలని ఆదేశాలు ఇచ్చింది. ఇవి కొద్ది సంఖ్యలో మాత్రమే ఉన్నాయి. తెలంగాణలో ఒక్క సంగారెడ్డిలోనే స్థాపించారు. కేంద్ర ప్రభుత్వం యాంత్రీకరణకు పెద్దపీట వేస్తోంది. ఇందుకోసం పెద్ద ఎత్తున పథకాలను అమలు చేస్తోంది.. నిధులను కేటాయిస్తోంది. వ్యవసాయం.. రాష్ట్రాల జాబితాలో ఉంది. రాష్ట్రస్థాయిలో వీటి నిర్వహణకు ప్రత్యేక విభాగం, యంత్రాంగం ఉండాలి. భారీఎత్తున మానవ వనరులు అవసరం. అలాగే యంత్రపరికరాల తయారీ, నిర్వహణ, మరమ్మత్తులకు నిపుణుల కొరత తీవ్రంగా ఉంది. ఈ పరిస్థితి యాంత్రీకరణ పురోగతికి అవరోధంగా మారింది. రాష్ట్రంలో ప్రత్యేక విభాగం ఏర్పాటుకు, వ్యవసాయ ఇంజినీరింగ్ కళాశాలలు నెలకొల్పేందుకు వీలుగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు కేంద్ర వ్యవసాయ శాఖ కార్యదర్శి లేఖలు రాశారు.
నాలుగేళ్ల కోర్సు…
వ్యవసాయ ఇంజినీరింగ్ నాలుగేళ్ల కోర్సు. దీనికి భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి గుర్తింపునిస్తుంది. ఇంటర్మీడియట్ ఎంపీసీతో ప్రవేశాలు ఉంటాయి. ఈ ఇంజినీర్లకు వ్యవసాయం, దాని అనుబంధ రంగాల్లో విస్తృత ఉద్యోగావకాశాలున్నాయి. కేంద్ర ప్రభుత్వ లేఖపై అన్ని రాష్ట్రాలు స్పందిస్తున్నాయి. వచ్చే విద్యా సంవత్సరం నుంచి వ్యవసాయ ఇంజినీరింగ్ కళాశాలలు ప్రారంభించేందుకు ముందుకొస్తున్నాయి. రానున్న నాలుగేళ్లలో దాదాపు 30 వేల మంది వ్యవసాయ ఇంజినీర్లను తయారు చేయాలన్నది కేంద్ర ప్రభుత్వం సంకల్పం. దీనికి సంబంధించి అన్ని రకాలుగా రాష్ట్రాలకు సహకారం అందిస్తుంది. ప్రస్తుతం బీటెక్ చేసిన ఇంజినీర్లకు వ్యవసాయ పరిజ్ఞానం లేదు. దీని కోసం ప్రత్యేక సబ్జెక్టులు, శిక్షణతో కూడిన విద్య అవసరం. వ్యవసాయ ఇంజినీరింగ్ ఈ కొరతను తీరుస్తుంది” అని ఝా తెలిపారు.

