జాతీయ లైవ్‌ స్టాక్‌ మిషన్‌ కింద యూనిట్లు ఏర్పాటు చేయడం ద్వారా రైతులకు ఎంతో లబ్ధి కలుగుతోందని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర పశుసంవర్థకశాఖ డైరెక్టర్‌ దామోదర్‌ నాయుడు పేర్కొన్నారు. జాతీయ లైవ్‌ స్టాక్‌ మిషన్‌లో భాగంగా 50% రాయితీపై గొర్రెలు, మేకలు, నాటుకోళ్లు, పందులు, సైలేజి యూనిట్ల ఏర్పాటుకు రూ.20 లక్షల నుంచి రూ. కోటి వరకు పశు సంవర్ధకశాఖ మంజూరు చేస్తోందని తెలిపారు. ఈ యూనిట్లను విజయవంతంగా నిర్వహిస్తున్న 20 మంది రైతులను కేంద్ర పశుసంవర్ధకశాఖ మంత్రి రాజీవ్‌ రంజన్‌ సింగ్‌, సహాయ మంత్రి జార్జ్‌ కురియన్‌ ఈ నెల 13న పుణెలో సత్కరించారు. ఈ గౌరవం పొందిన పశ్చిమగోదావరి జిల్లా బాదరాలకు చెందిన మిరియాల రామకుమార్‌ (కోళ్ల పెంపకం), ప్రకాశం జిల్లా కొత్తూరుకు చెందిన నారు బసివి రెడ్డి (గొర్రెల పెంపకం) గురువారం దామోదర్‌ నాయుడిని కలిశారు. ఆయన వారికి శుభాకాంక్షలు తెలిపి సత్కరించారు.