ఒకే చెట్టుకు 12 రకాల మామిడి పండ్లు

సాధారణంగా ఒక మామిడి చెట్టుకు ఒకటి లేదా రెండు రకాల పండ్లే కాస్తుంటాయి. గుజరాత్‌లోని అమ్రేలీ జిల్లా దిట్ల గ్రామంలో ఓ చెట్టుకు 12 రకాల పండ్లు కాస్తున్నాయి. రంగు, రుచి, సువాసన, పరిమాణం, బరువుల్లో అవన్నీ వేర్వేరు. 50 గ్రాముల నుంచి 2 కేజీల దాకా బరువున్న మామిడి పండ్లు ఆ చెట్టుకు కాస్తున్నాయి. ఉకాభాయ్‌ అనే రైతుకు చెందిన మామిడితోటలో ఈ చెట్టు ఉంది. అన్ని సీజన్లలోనూ డజను రకాల మామిడి పండ్లు కాస్తుండటం ఈ మామిడి చెట్టు ప్రత్యేకత. మొదటి నుంచీ ఉకాభాయ్‌ మామిడి సాగులోనే ఉన్నారు. అంటుకట్టే పద్ధతి ద్వారా మేలురకం మామిడి వంగడాల తయారీకి ఆయన నిత్యం ప్రయోగాలు చేస్తుంటారు. వీటి ఫలితంగానే 12 రకాల పండ్లను అందించే మామిడిచెట్టు ఏర్పడింది.

ఎలా అంటుకట్టారంటే..
మేలు రకం మామిడి వంగడాల తయారీకి ఉత్తమ లక్షణాలు కలిగిన ఒక మామిడి మొక్కను సేకరించాలి. దాని వేర్ల భాగాన్ని తొలగించాలి. మరో మేలు రకం మామిడి మొక్కను సేకరించాలి. దాని కాండం ఎగువ భాగాన్ని సగానికి పైగా కత్తిరించి తొలగించాలి. ఈ మామిడి మొక్కకు వేర్లు ఉంటాయి. అందువల్ల దీన్నే నేలలో నాటాలి. అనంతరం దీనిలోని సగం కాండంపై, అంతకుముందు మనం సిద్ధం చేసుకున్న మొక్క కాండాన్ని అతికించి కట్టు కట్టాలి. ఇలా ఒకేచెట్టుకు తీరొక్క పండ్లను చూసి ఉకాభాయ్‌ ఉప్పొంగిపోతున్నారు. మామిడి వంగడాల తయారీకి ఇకపైనా తన ప్రయోగాలను కొనసాగిస్తానని ఆయన ‘ఈటీవీ భారత్‌’కు చెప్పారు. ఇలాంటి మామిడి చెట్లు పెద్దసంఖ్యలో అందుబాటులోకి వస్తే రైతులకు లాభదాయకంగా ఉంటుందన్నారు.

Read More

పెరిగిన భూగర్భ జలమట్టం

గతేడాది మే నెలతో పోల్చితే 0.30 మీటర్లు పైకి

  • 18 జిల్లాల్లో పెరుగుదల..
  • 2024-25 నీటి సంవత్సరంలో 32 శాతం అధికంగా వర్షాలు ముందుగానే వచ్చిన నైరుతి రుతుపవనాలతో ప్రారంభమైన వర్షాలకు భూగర్భం కూడా చల్లబడింది. మండుటెండలతో అడుగంటాల్సిన మే నెలలో రాష్ట్ర సగటు భూగర్భ జల మట్టం 0.30 మీటర్లు పెరిగింది. గతేడాది మే నెలతో పోల్చితే 18 జిల్లాల్లో పెరుగుదల నమోదైంది. రాష్ట్ర భూగర్భ జల వనరుల శాఖ ఈ మేరకు నివేదిక విడుదల చేసింది.

మే నెలలో అరుదుగా…
సాధారణంగా భూగర్భ జలాలు జూన్‌ నుంచి అక్టోబరు వరకు పెరుగుతాయి. అక్కడి నుంచి ఒకటి రెండు నెలలు నిలకడగా కొనసాగి ఆ తరువాత క్రమంగా లోతుకు వెళ్తాయి. అయితే, ఈ ఏడాది మే రెండో వారం చివర నుంచి వాతావరణం చల్లబడింది. ఉష్ణోగ్రతలు కూడా తార స్థాయిలో లేవు. దీంతోపాటు చాలా అరుదుగా వేసవి ముగియకుండానే రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించి వర్షాలు కురిశాయి. భూగర్భ జల వినియోగం తగ్గడంతోపాటు వర్షాలు కురవడం కారణంగా క్రమంగా నీటిమట్టం పైకి రావడం ప్రారంభమయింది. మే నెలలో ఇది చాలా అరుదు అని నిపుణులు పేర్కొంటున్నారు.

  • మే నెల రాష్ట్ర సరాసరి నీటి మట్టం 10.06 మీటర్లు. 2025 మే నెలలో ఇది 10.36 మీటర్లు. అంటే 0.30 మీటర్లు పెరిగింది.
  • గతేడాదితో పోల్చితే మే నెలలో 18 జిల్లాల్లో నీటి మట్టం పెరుగుదల ఉండగా భూపాలపల్లిలో అత్యధికంగా 3.05 మీటర్ల పెరుగుదల నమోదైంది. నాగర్‌ కర్నూల్‌ జిల్లాలో 2.74, నల్గొండలో 2.32, సూర్యాపేటలో 1.70 మీటర్లు పెరిగింది. హైదరాబాద్‌, హనుమకొండలలో అత్యల్పంగా 0.17 మీటర్లు మాత్రమే పెరుగుదల రికార్డయింది.
  • 2024 మేతో పోల్చితే ఈ ఏడాది మేలో 15 జిల్లాల్లో తగ్గుదల నమోదయింది. ఎక్కువగా సంగారెడ్డి జిల్లాలో 1.61, వరంగల్‌ 0.04 మీటర్ల లోతుకు నీటిమట్టం పడిపోయింది. అయితే, ఈ ఏడాది ఏప్రిల్‌ కన్నా మే నెలలో మాత్రం ఈ జిల్లాల్లో భూగర్భ జలాలు పైకి వచ్చాయి. ఈ ఏడాది భూగర్భ జలాల పురోగతి బాగుంటుందని రాష్ట్ర భూగర్భ జల వనరుల శాఖ డైరెక్టర్‌ లక్ష్మా పేర్కొన్నారు.

32 శాతం అధికంగా వర్షాలు
2024-25 నీటి సంవత్సరంలో (జూన్‌ నుంచి మే) 32 శాతం అధికంగా వర్షాలు కురిశాయి. రాష్ట్ర సాధారణ వార్షిక వర్షపాతం 919 మి.మీటర్లకు గాను 1,216 మి.మీటర్లు అంటే 32 శాతం అధికంగా నమోదయింది. రాష్ట్రంలోనే అత్యధిక వర్షపాతం నమోదైన జిల్లా నారాయణపేట. ఈ జిల్లా సాధారణ వర్షపాతం 618.9 మి.మీటర్లు కాగా 1,184.1 మి.మీటర్లు (91 శాతం) నమోదైంది. వనపర్తిలో 80 శాతం, మహబూబ్‌నగర్‌, జోగులాంబ గద్వాలలలో 71 శాతం చొప్పున, నాగర్‌కర్నూల్‌లో 58 శాతం నమోదయింది. మహబూబాబాద్‌ జిల్లాలో 49 శాతం అధికంగా వర్షాలు కురిశాయి. అతి తక్కువగా ఆదిలాబాద్‌లో 11 శాతం వర్షపాతం నమోదయింది. మరోవైపు రాష్ట్రంలో సగటున 116 రోజులు వర్షం కురిసింది. ఎక్కువ రోజులు వర్షం కురిసిన జిల్లాలలో కుమురంభీం ఆసిఫాబాద్‌ మొదటి స్థానంలో ఉంది. ఈ జిల్లాలో 101 రోజులు వర్షాలు పడ్డాయి. ములుగు జిల్లాలో 99 రోజులు, మహబూబాబాద్‌లో 97. రాజన్న సిరిసిల్ల, వరంగల్‌, భద్రాద్రి కొత్తగూడెంలలో 92 రోజుల చొప్పున.. కామారెడ్డి, రంగారెడ్డి జిల్లాలో 91 రోజుల చొప్పున వర్షం కురిసింది.

Read More

హైదరాబాద్‌లో గ్లోబల్‌ సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ ఆన్‌ మిల్లెట్స్‌ శంకుస్థాపన

కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌, కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ శాఖ సహాయ మంత్రి భగీరథ్‌ చౌధరి మరియు తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, హైదరాబాద్‌లోని ఐసీఏఆర్‌ – భారత ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మిల్లెట్స్‌ రీసెర్చ్‌ (ఐసిఏఆర్‌-ఐఐఎంఆర్‌) ప్రాంగణంలో గ్లోబల్‌ సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ ఆన్‌ మిల్లెట్స్‌ (సీఓఈ) శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సంస్థ సిరిధాన్యాల పరిశోధన, అభివృద్ధి, శిక్షణ మరియు ప్రాచుర్యం దిశగా కీలక మైలురాయిగా నిలవనుంది. ప్రపంచవ్యాప్తంగా మిల్లెట్ల ప్రాముఖ్యతను పెంపొందించేందుకు ఇది మార్గదర్శకంగా పనిచేస్తుంది.
ఈ కార్యక్రమంలో కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, వ్యవసాయ పరిశోధకులు, శాస్త్రవేత్తలు, రైతులు మరియు ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.

Read More

వ్యవసాయ శాఖలో ఏడు కార్పొరేషన్ల విలీనం!

తెలంగాణ వ్యవసాయ అనుబంధ ప్రభుత్వరంగ సంస్థ (కార్పొరేషన్‌)ల విలీనానికి రంగం సిద్ధమవుతోంది. ఏడింటిని ఒకే కార్పొరేషన్‌గా ఏర్పాటు చేసేందుకు అధికారులు ప్రతిపాదనలు రూపొందిస్తున్నారు. ఈ శాఖలో ప్రస్తుతం రాష్ట్ర మార్కెటింగ్‌ సమాఖ్య (మార్క్‌ ఫెడ్‌), వ్యవసాయ పారిశ్రామికాభివృద్ధి సంస్థ (ఆగ్రోస్‌), హైదరాబాద్‌ వ్యవసాయ సహకార సంఘం (హాకా), విత్తనాభివృద్ధి సంస్థ, విత్తన ధ్రువీకరణ సంస్థ, నూనె గింజల ఉత్పత్తిదారుల సమాఖ్య (ఆయిల్‌ ఫెడ్‌), రాష్ట్ర గిడ్డంగుల సంస్థలున్నాయి. హాకా, ఆయిల్‌ ఫెడ్‌, విత్తనాభివృద్ధి సంస్థలకు ప్రస్తుతం పూర్తిస్థాయి ఎండీలు లేరు. మిగిలిన సంస్థల్లోనూ అధికారులు, సిబ్బంది పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ సంస్థలన్నీ నష్టాల్లో ఉన్నాయి. వీటి ఆస్తులు సైతం ఆక్రమణలకు గురవుతున్నాయి. ఈ విషయమై వ్యవసాయ మంత్రి తుమ్మల పలు సమీక్షల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. వాటిని మార్చాలనే ఉద్దేశంతో ఆయన కార్పొరేషన్లను విలీనం చేసి ఒక సంస్థగా మార్చాలని ఆదేశాలు ఇచ్చారు. దీనికి అనుగుణంగా అధికారులు ప్రణాళికను సిద్దం చేస్తున్నారు. ఈ మేరకు అన్ని కార్పొరేషన్లను కలిపి ఒక ప్రత్యేక కార్పొరేషన్‌గా ఒక కార్యాలయంలో ఏర్పాటు చేసి సీనియర్‌ ఐఏఎస్‌ను అధికారిగా నియమిస్తారు.

Read More

మంగళగిరిలో ఆహారశుద్ధి సొసైటీ, ఏపీటీపీసీ కార్యాలయాలు

ప్రారంభించిన మంత్రి టీజీ భరత్‌ ఆహారశుద్ధి రంగంలో ఐదేళ్లలో రూ. 30 వేల కోట్ల పెట్టుబడులు సాధించాలని లక్ష్యంగా నిర్ణయించామని పరిశ్రమలు, వాణిజ్యం, ఆహారశుద్ధి శాఖ మంత్రి టీజీ భరత్‌ తెలిపారు. ఈ రంగంలో యూనిట్ల ఏర్పాటుకు అపార అవకాశాలున్నాయని పేర్కొన్నారు. మంగళగిరిలోని ఆటోనగర్‌ (పీవీఎస్‌ ల్యాండ్‌మార్క్‌)లో ఆహారశుద్ధి సొసైటీ, ఆంధ్రప్రదేశ్‌ ట్రేడ్‌ ప్రమోషన్‌ కార్పొరేషన్‌ (ఏపీటీపీసీ) కార్యాలయాలను శుక్రవారం ఆయన ప్రారంభించారు. కార్యక్రమంలో ఏపీటీపీసీ చైర్మన్‌ వజ్జా బాబూరావు, ఆహారశుద్ధి శాఖ ఎక్స్‌ అఫిషియో కార్యదర్శి చిరంజీవి చౌదరి, ఆహారశుద్ధి సొసైటీ ఎండీ శేఖర్‌బాబు తదితరులు పాల్గొన్నారు.

Read More

ఖరీఫ్‌ పంటలకు సరిపడా ఎరువుల నిల్వ

ఖరీఫ్‌ పంటలకు సరిపడా ఎరువులు అందుబాటులో ఉన్నాయని.. రైతులకు ఇబ్బందులు రానివ్వమని వ్యవసాయశాఖ డైరెక్టర్‌ ఢిల్లీరావు తెలిపారు. శుక్రవారం నాటికి ఆంధ్రప్రదేశ్‌లో 11.09 లక్షల టన్నుల నిల్వ ఎరువులకు గాను 2 లక్షల టన్నుల విక్రయాలు జరిగాయని ఓ ప్రకటనలో పేర్కొన్నారు. సహకార సంఘాలు, రైతు సేవా కేంద్రాల్లోని గోదాముల్లో రైతులకు ఎరువులు అందుబాటులో ఉన్నాయన్నారు. ఈ నెలకు సంబంధించి 2.35 లక్షల టన్నుల ఎరువులు కేంద్రం నుంచి వస్తున్నాయని, రాష్ట్రంలో ఎరువుల కొరత లేదన్నారు. ఎమ్మార్పీ ధరకే కొనుగోలు చేయాలని రైతులకు సూచించారు.

Read More

తెలంగాణాలో తొలి సంచార భూసార పరీక్ష ప్రయోగశాల

లారాస్‌ ఛారిటబుల్‌ ట్రస్టుతో కలిసి హైదరాబాద్‌లోని ఇక్రిశాట్‌ రైతుల కోసం సంచార భూసార పరీక్షల ప్రయోగశాలను ప్రారంభించింది. రాష్ట్రంలో ఇదే తొలి సంచార భూసార పరీక్ష ప్రయోగశాల. ఇప్పటివరకు రైతులు ప్రయోగశాలలకు వెళ్లి మట్టి పరీక్షలు చేయించుకోవడం, శాస్త్రవేత్తలు, వ్యవసాయాధికారులు పొలాలకు వెళ్లి మట్టి నమూనాలు తీసుకొని ప్రయోగశాలకు పంపే పద్ధతులే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇక్రిశాట్‌ సంచార భూసార పరీక్ష ప్రయోగశాల రైతులకు ఎంతో ఉపయుక్తం కానుంది. ఈ వాహనం మొదటగా మేడ్చల్‌ జిల్లాలోని శామీర్‌పేట, మూడుచింతలపల్లి మండలాల్లోని 22 గ్రామాలకు సేవలందిస్తుంది. ఆ తర్వాత మిగిలిన జిల్లాలకు విస్తరిస్తారు. ఈ ప్రయోగశాలలో ఇద్దరు శాస్త్రవేత్తలు ఉంటారు. పొలాల్లో మట్టి నమూనాలను తీసుకొని 13 సూక్ష్మపోషకాల తీరును తక్షణమే వెల్లడిస్తారు. నీటి నాణ్యత పరీక్షల సదుపాయం కూడా అందుబాటులో ఉంది. పర్యావరణ పరిరక్షణ, పంటల సాగు లాభదాయకమయ్యేలా చేసేందుకు తెలంగాణలో తొలి సంచార భూసార పరీక్ష ప్రయోగశాలను ప్రారంభించామని ఇక్రిశాట్‌ డీజీ హిమాన్షు పాఠక్‌ ఈ సందర్భంగా తెలిపారు. తమ సంస్థ ద్వారా 2023 జనవరి నుంచి 2025 ఫిబ్రవరి వరకు 2,400 మట్టి నమూనాలను పరీక్షించామని తెలిపారు.

Read More

ఆర్మూర్‌ పసుపు రకానికి భౌగోళిక గుర్తింపుకు సన్నాహాలు

తెలంగాణా రాష్ట్రంలోని నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌లో పండించే పసుపు పంటకు భౌగోళిక గుర్తింపు (జీఐ) కోసం కొండా లక్ష్మణ్‌ బాపూజీ తెలంగాణ ఉద్యాన వర్సిటీ ఆధ్వర్యంలో గురువారం అధ్యయనం ప్రారంభమైంది. విశ్వ విద్యాలయ ప్రధాన పరిశోధకులు పిడిగం సైదయ్య నేతృత్వంలో కమ్మర్‌పల్లి లోని పసుపు పరిశోధన స్థానం అధిపతి బి. మహేందర్‌, నాబార్డు నిజామాబాద్‌ జిల్లా అభివృద్ధి అధికారి ప్రవీణ్‌, రైతులతో కూడిన బృందం.. ఆర్మూర్‌, జక్రాన్‌పల్లి, నందిపేట మండలాల్లో పర్యటించింది. సాగు భూములు, పసుపు రకాలు, వాటి లక్షణాలు, పంట విత్తుకొనే దూరం, సాగుకు ఉపయోగించే సాంకేతిక పరిజ్ఞానం, ఎరువులు, సాగునీటి పారుదల తదితర అంశాలపై సమగ్ర సమాచారం సేకరించింది. నిజామాబాద్‌లోని వ్యవసాయ మార్కెట్‌ కమిటీని సందర్శించి పసుపు ధరలు, కొనుగోళ్ల తీరును తెలుసుకుంది.

Read More

తోటకూర విత్తనాల్లో పోషకాలు మెండు

తోటకూర మొక్కకున్న లేత ఆకులు తెంపుకొని.. గింజ థకు రాగానే తొలగించేస్తాం. కానీ, గింజలే అసలైన పోషకాల గనులంటున్నారు.. శాస్త్రవేత్తలు. బియ్యం, గోధుమలకు ప్రత్యామ్నాయంగా మన మెనూలో తోటకూర ధాన్యం చేర్చాలంటున్నారు. ఇలా చేస్తే పోష కాహార లోపం, అధిక బరువు వంటి సమస్యలు తప్పుతాయని ప్రకాశం జిల్లా దర్శిలోని ఉద్యాన పరిశోధనా స్థాన శాస్త్రవేత్తలు వెల్లడిస్తున్నారు. సుపరిచితమైన తోటకూర గింజల(కింగ్‌ సీడ్‌) పై ఇక్కడి శాస్త్రవేత్తలు ఏడాదిగా పరిశోధనలు చేస్తున్నారు. ఇప్పటికీ కొన్ని రాష్ట్రాల్లో, ఇతర దేశాల్లో వీటిని సాగుచేస్తూ, ఆహారంగా తీసుకుంటున్నారని గుర్తించారు. తెలుగు రాష్ట్రాల్లో సాగుకు అనువైన రకాలు ఎంపిక చేసే పనిలోపడ్డారు. గింజల ప్రాధాన్యంపై ప్రజలకు అవగాహన కల్పించి, సాగుకు ప్రణాళికలు వేస్తున్నారు. ”బియ్యం, మొక్కజొన్న, గోధుమల మాదిరిగానే తోటకూర గింజల్లో 14-16% ప్రొటీన్లు ఉంటాయి. నాణ్యమైన లైసిన్‌లు, అమైనోయాసిడ్స్‌, కాల్షియం, ఫాస్పరస్‌, ఐరన్‌, బీటా కెరోటిన్‌కు కొదవలేదు. వీటితో ఐరన్‌, విటమిన్‌-ఏ లోపాన్ని అధిగమించవచ్చు. గింజలను వేయించి పొడిగా మార్చి లడ్డూ, చిక్కీలు, పిండి వంటలతోపాటు బేకరీ ఉత్పత్తులు చేయొచ్చు. త్వరగా జీర్ణం అవుతాయి. మెక్సికన్‌ సంప్రదాయ మిఠాయి అలెగ్రియా ఈ పొడితోనే చేస్తారు” అని సీనియర్‌ శాస్త్రవేత్త మువ్వ రవీంద్రబాబు వివరించారు.

Read More

పొగాకు, మామిడి, కోకో రైతులకు ఊరట

నేటి నుంచి 7 మార్కెట్‌ యార్డుల్లో హెచ్‌డీ బర్లీ పొగాకు కొనుగోలు

ప్రాసెసింగ్‌ మామిడి రకాలకు కిలో రూ.12 – కోకో కిలో ధర రూ.500..- సీఎం సమీక్షలో నిర్ణయం ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఏడు మార్కెట్‌ యార్డుల ద్వారా హెచ్‌డీ బర్లీ పొగాకు కొనుగోలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఉమ్మడి గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో పర్చూరు, ఇంకొల్లు, మార్టూరు, పెదనందిపాడు, ప్రత్తిపాడు, చిలకలూరిపేట, మద్దిపాడు యార్డుల ద్వారా శుక్రవారం నుంచే సేకరణ ప్రారంభించనున్నారు. ఇక, ప్రాసెసింగ్‌ రకం మామిడికి కిలో రూ.12 చొప్పున చెల్లించి కొనుగోలు చేయాలని ఆహారశుద్ధి పరిశ్రమలు, ట్రేడర్లను ఆదేశించింది. ఇందులో వ్యాపారులు రూ.8, ప్రభుత్వం రూ.4 చొప్పున భరించాలని నిర్ణయించింది. కోకో రైతులకు కిలోకు రూ.500 దక్కేలా… వ్యాపారులు రూ.450, ప్రభుత్వం రూ.50 చొప్పున చెల్లించనుంది. పొగాకు, మామిడి, కోకో పంటలకు గిట్టుబాటు ధరలపై గురువారం ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం చంద్రబాబు సమీక్షించారు. ఈ సందర్భంగా తీసుకున్న నిర్ణయాలను వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు విలేకరులకు వివరించారు. గిట్టుబాటు ధరలతో కొనుగోలు చేయడం వల్ల రాష్ట్ర ప్రభుత్వంపై రూ. 550 కోట్ల వరకు భారం పడుతుందన్నారు. *సీఎం సమీక్షలోని ప్రధానాంశాలు*- హెచ్‌డీ బర్లీ పొగాకును ఐటీసీ, జీపీఐ సంస్థలు కలిపి 25 మిలియన్‌ కిలోలు, చిన్న కంపెనీలు 20 మిలియన్‌ కిలోల చొప్పున కొనాలి. రెండు, మూడు గ్రేడ్ల రకాలు కొనేలా కంపెనీలతో మాట్లాడాలి. ప్రధాన రకాన్ని క్వింటాలుకు రూ.12 వేలకు తగ్గకుండా సేకరించాలి. మిగతా రెండు రకాలకు పరిస్థితులను బట్టి ధర నిర్ణయిస్తాం. ఈ పొగాకు కొనుగోళ్లతో ప్రభుత్వం పై రూ.300-350 కోట్ల భారం పడనుంది.- ఈ ఏడాది చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాల్లో 5.5 లక్షల మెట్రిక్‌ టన్నుల మామిడి ఉత్పత్తి వచ్చింది. ఇదంతా ప్రాసెసింగ్‌ రకం, ఇప్పటికే ప్రాసెసింగ్‌ సంస్థల వద్ద 43 వేల టన్నుల మామిడి గుజ్జు నిల్వలున్నాయి. పార్లే ఆగ్రో, కోకకోలా, పెప్సికో సంస్థల నుంచి ఆర్డర్లు రాకపోవడమే సమస్యకు కారణం, రైతులు, ట్రేడింగ్‌ కంపెనీలు, ప్రాసెసర్లను రిజిస్టర్‌ చేయాలి. రికార్డులు నిర్వహించాలి. కంపెనీలు కిలోకు రూ.8 ఇస్తే, ప్రభుత్వం రైతుల ఖాతాల్లో నేరుగా కిలోకు రూ.4 చొప్పున జమ చేస్తుంది. ఇందుకు రూ.100-150 కోట్ల వరకు భరించనుంది.- రైతుల నుంచి ఇప్పటికే 465 టన్నుల కోకో కోనుగోలు చేశారు. ఇంకా 745 టన్నుల నిల్వలు రైతుల వద్దే ఉన్నాయి. కనీసం కిలోకు రూ.500 దక్కేలా చేసేందుకు ప్రభుత్వం కిలోకు రూ. 50 చొప్పున చెల్లించనుంది. మొత్తం రూ.10.50 కోట్లు ఖర్చవుతుంది. – రాష్ట్రంలో కోకో పాలసీ తీసుకురావాలి. నాణ్యత కలిగిన ఉత్పత్తులు వచ్చేలా రైతుల్ని చైతన్యపరచాలి. రైతుబజార్లను 116 నుంచి 200కు పెంచాలి. మొబైల్‌ మార్కెట్లు తీసుకురావాలి.- పీఎం కిసాన్‌ డేటాకు అనుగుణంగా అన్నదాతా సుఖీభవ లబ్దిదారుల జాబితా రూపొందించాలి.- పామోలిన్‌ పై దిగుమతి సుంకం తగ్గించడం వల్ల రైతులు ఎలా నష్టపోతున్నారో కేంద్రం దృష్టికి తీసుకెళ్ళాలి. నిర్ణయం వెనక్కి తీసుకునేలా కేంద్రాన్ని ఒప్పించే బాధ్యతను కేంద్ర మంత్రులు, ఎంపీలు తీసుకోవాలి.- ధరలు లేనప్పుడు ప్రత్యామ్నాయ పంటల వైపు రైతుల్ని మళ్లించే బాధ్యత వ్యవసాయ శాఖదే.

Read More