లారాస్ ఛారిటబుల్ ట్రస్టుతో కలిసి హైదరాబాద్‌లోని ఇక్రిశాట్ రైతుల కోసం సంచార భూసార పరీక్షల ప్రయోగశాలను ప్రారంభించింది. రాష్ట్రంలో ఇదే తొలి సంచార భూసార పరీక్ష ప్రయోగశాల. ఇప్పటివరకు రైతులు ప్రయోగశాలలకు వెళ్లి మట్టి పరీక్షలు చేయించుకోవడం, శాస్త్రవేత్తలు, వ్యవసాయాధికారులు పొలాలకు వెళ్లి మట్టి నమూనాలు తీసుకొని ప్రయోగశాలకు పంపే పద్ధతులే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇక్రిశాట్ సంచార భూసార పరీక్ష ప్రయోగశాల రైతులకు ఎంతో ఉపయుక్తం కానుంది. ఈ వాహనం మొదటగా మేడ్చల్ జిల్లాలోని శామీర్‌పేట, మూడుచింతలపల్లి మండలాల్లోని 22 గ్రామాలకు సేవలందిస్తుంది. ఆ తర్వాత మిగిలిన జిల్లాలకు విస్తరిస్తారు. ఈ ప్రయోగశాలలో ఇద్దరు శాస్త్రవేత్తలు ఉంటారు. పొలాల్లో మట్టి నమూనాలను తీసుకొని 13 సూక్ష్మపోషకాల తీరును తక్షణమే వెల్లడిస్తారు. నీటి నాణ్యత పరీక్షల సదుపాయం కూడా అందుబాటులో ఉంది. పర్యావరణ పరిరక్షణ, పంటల సాగు లాభదాయకమయ్యేలా చేసేందుకు తెలంగాణలో తొలి సంచార భూసార పరీక్ష ప్రయోగశాలను ప్రారంభించామని ఇక్రిశాట్ డీజీ హిమాన్షు పాఠక్ ఈ సందర్భంగా తెలిపారు. తమ సంస్థ ద్వారా 2023 జనవరి నుంచి 2025 ఫిబ్రవరి వరకు 2,400 మట్టి నమూనాలను పరీక్షించామని తెలిపారు.

7 Jun, 2025
