దేశ ఆకలి తీర్చే పెద్దన్నగా తెలంగాణ

– గతేడాది రికార్డు స్థాయిలో పంటల ఉత్పత్తులు

– 275 లక్షల టన్నుల ధాన్యం దిగుబడి

– రాష్ట్ర అర్థ, గణాంకశాఖ అంచనాల్లో వెల్లడి

దేశ ప్రజల ఆకలి తీర్చే బృహత్కార్యంలో పెద్దన్న పాత్ర పోషించే రాష్ట్రంగా తెలంగాణ అవతరించింది. రికార్డుస్థాయి బియ్యం ఉత్పత్తితో దేశంలోనే ముందుందని రాష్ట్ర అర్థ, గణాంకశాఖ తెలిపింది. వాతావరణం అనుకూలించడం, ప్రభుత్వ సానుకూల విధానాలతో గతేడాది (2024-25) రాష్ట్రంలో రికార్డు స్థాయిలో పంటల సాగు విస్తీర్ణం, దిగుబడులు పెరిగాయని ఈ శాఖ తాజాగా విడుదల చేసిన అంచనాల్లో వెల్లడించింది. బియ్యం ఒకటే కాకుండా పలు ఇతర పంటల దిగుబడి సైతం అంతకుముందుతో పోలిస్తే గణనీయంగా పెరిగినట్లు వివరించింది. తాజా నివేదికను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఈ శాఖ అందజేసింది. *సాధారణ సాగు విస్తీర్ణానికి మించి..* అంతకుముందు ఏడాది (2023-24)లో 168.75 లక్షల టన్నుల ఉత్పత్తి చేసిన తెలంగాణ మరుసటి ఏడాది (2024-25) దాన్ని అధిగమించి ఏకంగా 183.57 లక్షల టన్నులు సాధించింది. దేశంలోనే అత్యధికంగా బియ్యం పండిస్తున్న రాష్ట్రంగా అగ్రస్థానంలో నిలిచిందని అర్థ, గణాంకశాఖ రాష్ట్ర ప్రభుత్వానికి తెలిపింది. తెలంగాణ తర్వాత వరుసగా ఉత్తర్‌ప్రదేశ్‌, పశ్చిమ బెంగాల్‌, పంజాబ్‌ ఉన్నాయి. రాష్ట్రంలో సాధారణ సాగు విస్తీర్ణానికి మించి వరి వేయడంతో దిగుబడులు వెల్లువెత్తాయి. ఉదాహరణకు గత రబీ (యాసంగి సీజన్‌లో సాధారణ సాగు విస్తీర్ణం 16 లక్షల హెక్టార్లు కాగా… గతేడాది ఏకంగా 24.04 లక్షల హెక్టార్లలో సాగయింది. రాష్ట్రవ్యాప్తంగా రైతులు 29 లక్షల వ్యవసాయ బోర్లకు కరెంటు కనెక్షన్లు తీసుకున్నారు. వీటికి నిరంతరాయ ఉచిత కరెంటు సరఫరాతో కర్షకులు వరి సాగుకే మొగ్గుచూపారు. ఫలితంగా తెలంగాణ చరిత్రలోనే అత్యధికంగా 2025 మార్చి 20న 17,162 మెగావాట్ల కరెంటు డిమాండు నమోదైనట్లు విద్యుత్‌ పంపిణీ సంస్థలు తెలిపాయి. గతేడాది ఖరీఫ్‌ (వానాకాలం), రబీ(యాసంగి)లో కలిపి మొత్తం 275 లక్షల టన్నులకు పైగా ధాన్యం దిగుబడి వచ్చింది. దీని నుంచి 183 లక్షల టన్నుల బియ్యం ఉత్పత్తయినట్లు నివేదిక తెలిపింది. ఏటా రెండు సీజన్లలో సాగు, దిగుబడులపై క్షేత్రస్థాయిలో పంటకోత ప్రయోగాల ద్వారా శాఖ అంచనాలు వేసి నాలుగుసార్లు నివేదిక పంపుతుంది. తాజాగా మూడో ముందస్తు అంచనాల నివేదిక పంపింది. దీని ప్రకారం రాష్ట్రంలో గతేడాది మొత్తం 224 లక్షల టన్నుల ఆహారధాన్యాలు పండినట్లు కేంద్రం ప్రకటించింది. బియ్యం, పప్పు, తృణధాన్యాల దిగుబడులను మాత్రమే కేంద్రం ఆహారధాన్యాల కింద చూపుతుంది. వరిధాన్యం దిగుబడి లెక్కను పరిగణనలోకి తీసుకోదు. తృణ, చిరుధాన్యాలు కలిపి తెలంగాణలో 37.19 లక్షల టన్నులు, కందులు 1.99 లక్షల టన్నులు, శనగలు 1.10 లక్షల టన్నులు, మినుములు 43,570, పెసలు 24,170, నూనెగింజలు 5.50 లక్షల టన్నులు పండినట్లు శాఖ వివరించింది.*రాష్ట్రంలో బియ్యం దిగుబడి (లక్షల టన్నుల్లో)* 2022-23 158.77 2023-24 168.75 2024-25 183.57*తెలంగాణలో ప్రధాన పంటల దిగుబడి తీరు (టన్నుల్లో)* పంట 2023-24 2024-25 వరి 2,60,89,000 2,75,30,800 మొక్కజొన్న 27,76,000 34,13,000 వేరుశనగ 2,25,000 2,29,510 సోయా 2,69,000 2,90,630

Read More

వ్యవసాయ మరియు సహకార రంగానికి సంబంధించి అనేక అంశాల మీద చర్చించిన తుమ్మల, కోదండరెడ్డి

ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యవసాయశాఖ చైర్మన్‌ కోదండ రెడ్డి, వ్యవసాయశాఖా మాత్యులు తుమ్మల నాగేశ్వరరావును కలిసి, వ్యవసాయ మరియు సహకార రంగానికి సంబంధించి అనేక అంశాల మీద చర్చించారు. ఈ సందర్భంగా చైర్మన్‌ మాట్లాడుతూ, సహకార రంగానికి సంబంధించి దీర్ఘకాలికంగా ఉన్న సమస్యల పరిష్కారానికి సంబంధిత అధికారులు మరియు ప్రజాప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేయాల్సిందిగా కోరారు. ప్రాథమిక సహకార సంఘాల బలోపేతం దిశగా చర్చలు చేపట్టడానికి అనువుగా ఈ సమావేశం నిర్వహించుకోవాలని అభిప్రాయపడ్డారు. అదేవిధంగా మట్టి నమూనా ఫలితాలు ప్రతీ రైతుకు అందించేటందుకు ప్రభుత్వము కట్టుబడి ఉంది కనుక దానికి తగ్గ విధివిధానాల రూపకల్పనలో కమిషన్‌ అభిప్రాయాలు తెలియజేశారు. తరువాత సమావేశంలో పాల్గొన్న వ్యవసాయ శాస్త్రవేత్తలు, వ్యవసాయ డైరెక్టర్‌ గోపిని ఉద్ధేశించి మాట్లాడుతూ, రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు అమలు అవుతున్న కార్యక్రమ అమలు తీరు తెలుసుకొని, ఇదే పద్ధతిలో కేంద్ర ప్రభుత్వము నిర్వహించ తలపెట్టిన వికసిత్‌ కృషి సంకల్ప్‌ అభియాన్‌ 29 మే 2025 నుండి 12 జూన్‌ 2025 వరకు కార్యక్రమంలో విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు పాల్గొని కార్యక్రమం విజయవంతం చేయాల్సిందిగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మట్టి నమూనా పరీక్షలు త్వరితగతిన పూర్తిచేయడానికి సాయిల్‌ టెస్టింగ్‌ లాబ్స్‌ను ఎఫ్‌పిఓలకు అందచేయడం ద్వారా, రైతువేదికలలో పెట్టడం ద్వారా, ప్రతీ అవసరమున్న రైతుకు మట్టినమూనా పరీక్ష చేసుకొనే వెసులుబాటు కల్పించడానికి డైరెక్టర్‌ గోపికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా యూనివర్సిటీ ద్వారా ప్రతీ రెవిన్యూ గ్రామాలలో ముగ్గురు ఎంపిక చేసిన రైతులకు మూల విత్తనము (ఫౌండేషన్‌ సీడ్‌) ను ఇవ్వడానికి, డిపార్ట్‌ మెంట్‌ సమన్వయంతో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, అదేవిధంగా మూలవిత్తనం సరఫరా చేసిన రైతుల పొలాల నిరంతర పర్యవేక్షణ చేస్తూ, అలా ఉత్పత్తి చేసిన విత్తనాన్ని రైతులకు తిరిగి చేరేవిధంగా చూడాలని, అప్పుడే కార్యక్రమం యొక్క లక్ష్యం నేరవేరుతుందని అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ మీడియా కమిటీ చైర్మన్‌ సామా రామ్మోహన్‌ రెడ్డి కూడా పాల్గొన్నారు.

Read More

మూడు జిల్లాల్లో కేవీకేలు

వ్యవసాయ వర్సిటీ నిర్ణయంతో రైతులకు మేలు

తెలంగాణ రాష్ట్రంలోని 17 జిల్లాల్లో కృషి విజ్ఞాన కేంద్రాలు (కేవీకే), ఏరువాక (డాట్‌ సెంటర్‌) కేంద్రాలున్నాయి. హైదరాబాద్‌ మినహా మిగిలిన 15 జిల్లాల్లో ఏరువాక కేంద్రాలు లేదా కృషివిజ్ఞాన కేంద్రాలను ఏర్పాటు చేస్తామని ప్రొఫెసర్‌ జయశంకర్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్‌ అల్దాస్‌ జానయ్య ఇటీవల జగిత్యాలకు వచ్చిన సందర్భంగా ప్రకటించారు. ఈ మేరకు ఉమ్మడి జిల్లా పరిధిలో 3 విస్తరణ కేంద్రాలు ఏర్పాటయ్యే అవకాశం ఉండటంతో రైతులకు ఎంతగానో ఉపకరించనుంది. ఇదివరకే దేశవ్యాప్తంగా జిల్లాకొక ‘కృషివిజ్ఞాన కేంద్రాన్ని (కేవీకే) నెలకొల్పాలన్న కేంద్రప్రభుత్వ నిర్ణయం మేరకు జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో కేవీకేలను ఏర్పాటు చేసేందుకు రాష్ట్రప్రభుత్వం, రాష్ట్ర వ్యవసాయ వర్సిటీ చర్యలు చేపట్టింది. ఇప్పటికే కరీంనగర్‌ జిల్లా జమ్మికుంటలో భారత వ్యవసాయ పరిశోధన మండలి, స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో, పెద్దపల్లి జిల్లా రామగిరిఖిల్లాలో ఉద్యాన వర్సిటీ ఆధ్వర్యంలో కేవీకేలు పనిచేస్తున్నాయి. తాజాగా వ్యవసాయ వర్సిటీ నిర్ణయంతో పెద్దపల్లి జిల్లాలో కేవీకే ఏర్పాటు కానుండగా ప్రభుత్వ హామీ మేరకు జగిత్యాల జిల్లా మల్యాల మండలంలో ఉద్యాన కేవీకేను ఏర్పాటు చేయాల్సి ఉంది. ఇదివరకున్నవి, నూతనంగా ఏర్పాటుచేసే అన్ని కేవీకేలను సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌గా, జిల్లాస్థాయి సమగ్ర వ్యవసాయకేంద్రాలుగా తీర్చి దిద్దనున్నారు. కేంద్రరాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో పనిచేసే కేవీ కేల నిర్వహణ, జీతభత్యాలను పూర్తిగా కేంద్ర వ్యవసాయశాఖనే భరిస్తుంది. పరిశోధన స్థానాల్లో అభివృద్ధి చేసిన నూతన వంగడాలను తొలుత కేవీకేల్లోని క్షేత్రాల్లో సాగుచేసి ఫలితాలను సమీక్షిస్తారు. కేవీకేల్లోని శాస్త్రవేత్తలు నూతన వంగడాలు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, పరిశోధన ఫలితాలపై ఎప్పటికప్పుడు రైతులకు అవగాహన, శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తారు. నూతన సాగు విధానాలపైనా వీటిల్లో పరిశోధనలు చేపడతారు. భూసార పరీక్ష కిట్లు, వ్యవసాయ యంత్రాలు, పరికరాలను రైతులకు అందిస్తారు. వాతావరణ సమాచారం, చీడపీడల నివారణపై రైతులకు ఎప్పటికప్పుడు సమాచారాన్ని చేరవేస్తారు. ఒక్కో కేవీకేలో ఒక సీనియర్‌ సైంటిస్టు, వ్యవసాయ, ఉద్యాన, పశుసంవర్ధక శాస్త్రవేత్తలు ఆరుగురితో పాటు ఒక మేనేజర్‌, ఇద్దరు కార్యక్రమ సహాయకులు, మరో ఇద్దరు పరిపాలన సిబ్బంది, ఒక ట్రాక్టర్‌ డ్రైవర్‌, ముగ్గురు సాంకేతిక ఉద్యోగులను నియమిస్తారు. ఒక్కో కేవీకేను దాదాపు 50-75 ఎకరాల స్థలంలో ఏర్పాటు చేయనున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, భారత వ్యవసాయ పరిశోధన మండలి, రాష్ట్ర వ్యవసాయ వర్సిటీలు చొరవ తీసుకొని స్థలాన్ని సమకూర్చి కేవీకేలు, డాటా సెంటర్లను ఏర్పాటుచేస్తే వ్యవసాయ, ఉద్యాన, పశుపోషణ సమాచారం ఒకేచోట లభించి ఉమ్మడి జిల్లాలోని రైతులకు సాగు సంబంధిత సేవలు మరింతగా దరిచేరతాయి.

Read More

రైతులకు రాయితీపై వేరుశనగ విత్తనాలు

ఏజెన్సీ ప్రాంత మండలాల్లోని గిరిజన రైతులకు ఖరీఫ్‌లో 90% రాయితీపై వేరుశనగ విత్తనాలు పంపిణీ చేయాలని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రాయలసీమ, ఇతర జిల్లాల్లోని రైతులకు 40% రాయితీపై వీటిని అందించనుంది. ఒక్కో రైతుకు సాగు విస్తీర్ణానికి అనుగుణంగా గరిష్ఠంగా మూడు బస్తాలు (బస్తా 30 కిలోలు) రాయితీపై అందిస్తారు. కే6, టీసీజీఎస్‌ 1694, టీఏజీ 24 రకాలు క్వింటాలుకు రూ.9,300, నారాయణి రకం క్వింటాలుకు రూ. 9,500, కదిరి లేపాక్షి రకం క్వింటాలుకు రూ.8,200 చొప్పున ధరలు నిర్ణయించారు. డి-కృషి యాప్‌ ద్వారా పంపిణీ చేయనున్నట్లు వ్యవసాయశాఖ డైరెక్టర్‌ ఢిల్లీరావు తెలిపారు. అరెకరా వరకు ఒకటి, ఎకరా విస్తీర్ణానికి రెండు, అంతకు పైన మూడు బస్తాలు చొప్పున అందజేస్తారు.

Read More

రైతుముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమానికి అనూహ్య స్పందన – PJTAU ఉపకులపతి ప్రొఫెసర్ అల్దాస్ జానయ్య

600 గ్రామాల్లో 37,000 రైతులతో అవగాహన కార్యక్రమం

  • రైతుల్లో అసంతృప్తి లేదు.. కానీ చేయాల్సింది చాలా ఉంది

ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం వ్యవసాయ శాఖ సహకారంతో నిర్వహిస్తున్న వినూత్న కార్యక్రమం ‘రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు’ రాష్ట్రవ్యాప్తంగా నిరాటంకంగా, విజయవంతంగా సాగుతోంది. మే 5వ తేదీన వికారాబాద్ జిల్లా ధరూర్ లో ఈ కార్యక్రమాన్ని శాసనసభాపతి శ్రీ గడ్డం ప్రసాద్ కుమార్, రాష్ట్ర వ్యవసాయ శాఖమంత్రి శ్రీ తుమ్మల నాగేశ్వరరావు, రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ శ్రీ M. కోదండ రెడ్డి, PJTAU ఉపకులపతి డాక్టర్ అల్దాస్ జానయ్య లాంచనంగా ప్రారంభించారు. ఆరోజు నుండి ఈ కార్యక్రమం నేటి వరకు 600 గ్రామాల్లో నిర్వహించగా సుమారు 31,000 మంది పురుషులు, 6,000 మంది మహిళలు పాల్గొనటం జరిగింది. ఈ కార్యక్రమంలో మొత్తం 37,000 మంది రైతులతో శాస్త్రవేత్తలు మరియు వ్యవసాయ విద్యార్థులు ముఖాముఖిగా మాట్లాడారు. ఇప్పటివరకు ఈ కార్యక్రమంలో నాగర్ కర్నూల్ MP డాక్టర్ మల్లురవి, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ G. చిన్నారెడ్డి, రైతు సంక్షేమ కమిషన్ సభ్యులు, ఎమ్మెల్సీలు, సుమారు 25 మంది శాసనసభ్యులు, వివిధ స్థాయి ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. అదేవిధంగా శాస్త్రవేత్తలు మరియు వ్యవసాయ విద్యార్థులతో పాటు వారంలో ఒకరోజు ఉపకులపతి, ఇతర విశ్వవిద్యాలయ ఉన్నతాధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. PJTAU శాస్త్రవేత్తలు, విద్యార్థులు, వ్యవసాయ, అనుబంధ రంగాల అధికారులు, అభ్యుదయ రైతులు, రైతు గ్రూపులు, సంఘాల ప్రతినిధులు, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో ఈ రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమంలో భాగస్వాములు అవుతున్నారు. ఈ కార్యక్రమంలో ప్రధానంగా ఆరు అంశాలైన తక్కువ యూరియా వాడి సాగు ఖర్చును తగ్గించడం, అవసరం మేరకే రసాయనాలను వాడి నేలతల్లి ఆరోగ్యాన్ని కాపాడడం, వివిధ ఇన్ పుట్స్ కొనుగోలుకు సంబంధించిన రశీదులని భద్రపరచుకోవడం, సాగునీటిని ఆదా చేయడం, పంట మార్పిడులను పాటించి సుస్థిరాదాయాన్ని పొందడం, చెట్లను నాటి పర్యావరణాన్ని రక్షించడం వంటి వాటిపై శాస్త్రవేత్తలు, వ్యవసాయ విద్యార్ధులు రైతాంగానికి అవగాహన కల్పిస్తున్నారు. అలాగే రైతులు అడుగుతున్న అనేక సందేహాలను శాస్త్రవేత్తలు ఈ కార్యక్రమంలో నివృత్తి చేస్తున్నారు.

ఉపకులపతి సమీక్ష :-

   మూడు వారాలుగా సాగుతున్న 'రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు' కార్యక్రమం పై ఉపకులపతి అల్దాస్ జానయ్య ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపకులపతి మాట్లాడుతూ కార్యక్రమానికి రైతాంగం నుంచి మంచి స్పందన వస్తుందని వివరించారు. ప్రభుత్వం రైతాంగానికి అమలు చేస్తున్న కార్యక్రమాలు, ప్రస్తుత వ్యవసాయ పరిస్థితుల పై రైతాంగంలో ఎటువంటి అసంతృప్తి లేదని జానయ్య స్పష్టం చేశారు. అయితే మారుతున్న వాతావరణ పరిస్థితులు, అకాల వర్షాల కారణంగా రైతుల్లో ఆందోళన వ్యక్తం అవుతుందని తెలిపారు. అలాగే ఇంకా కొన్ని వ్యవసాయ అంశాలకి ప్రభుత్వపరంగా ప్రోత్సాహం ఇవ్వవలసిందిగా రైతులు కోరుతున్నారని జానయ్య అన్నారు.  ముఖ్యంగా ప్రతికూల వాతావరణ పరిస్థితుల వల్ల ఎదురయ్యే నష్టాల్ని అధిగమించేందుకు తెలంగాణ ప్రభుత్వం పంటల బీమా సదుపాయం ప్రవేశపెట్టాలని రైతులు కోరుకుంటున్నారని, అలాగే చిన్న, సన్నకారు రైతులకి ఆధునిక వ్యవసాయ పనిముట్లని మరియు పచ్చి రొట్ట విత్తనాలను రాయితీపై  అందించాలని, విస్తృతంగా భూసార పరీక్షలు నిర్వహించాలని రైతాంగం కోరుకుంటున్నారని అల్దాస్ జానయ్య వివరించారు. ఇదే స్ఫూర్తితో రైతు సోదరులు, మహిళలు, అభ్యుదయ రైతులు, రైతు గ్రూపులు, సంఘాల ప్రతినిధులు, పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు ఈ కార్యక్రమంలో పాల్గొని  దీన్ని ఒక సామాజిక ఉద్యమంగా ముందుకు తీసుకెళ్లాలని ఈ సందర్భంగా ఉపకులపతి కోరారు.
Read More

విద్యార్థులతో జీవ ఎరువుల తయారీ

వ్యవసాయ విశ్వవిద్యాలయం నిర్ణయం

బీఎస్సీ వ్యవసాయ డిగ్రీ కోర్సులో భాగంగా విద్యార్థులతో జీవఎరువు (బయోఫెర్టిలైజర్‌)ల తయారీపై శిక్షణ ఇవ్వాలని తెలంగాణ వ్యవసాయ వర్సిటీ నిర్ణయం తీసుకుంది. జీవ ఎరువుల ప్రాధాన్యం దృష్ట్యా ఉత్పత్తిని పెంచేందుకు పూనుకుంది. ప్రస్తుతం డిగ్రీ కోర్సులో విద్యాబోధన, సాగు క్షేత్రాల సందర్శన వంటివి ఉన్నాయి. జీవఎరువుల తయారీతో పాటు వాటి వినియోగం, నిర్వహణ, వ్యాపారంపై శిక్షణ ఇవ్వాలని భావించింది. మంగళవారం హైదరాబాద్‌ రాజేంద్రనగర్‌లోని వర్సిటీ విద్యార్థులకు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. జీవన ఎరువుల విశిష్టత, ప్రయోగశాలలో తయారీ, వాడే విధానాన్ని వివరించారు. ఈ సందర్బంగా అసోసియేట్‌ డీన్‌ గోవర్ధన్‌ మాట్లాడారు. ”ప్రస్తుతం జీవన ఎరువుల వినియోగం, లభ్యత తక్కువగా ఉన్నందున విద్యార్థులకు దీని తయారీపై అవగాహన కల్పించాలని నిర్ణయం తీసుకున్నాం. చదువు అనంతరం స్వయం ఉపాధికి ఇది దోహదపడుతుంది” అని డీన్‌ తెలిపారు.

Read More

తెలంగాణలో ప్రకృతి వ్యవసాయం

480 సమూహాల్లో కేంద్ర ప్రభుత్వ పథకం అమలు
2025-26లో 60 వేల ఎకరాల్లో సాగు

కేంద్ర ప్రభుత్వ జాతీయ ప్రకృతి వ్యవసాయ పథకాన్ని (ఎన్‌ఎంఎన్‌ఎఫ్‌) తెలంగాణలో రెండేళ్ల పాటు అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. సంప్రదాయ వ్యవసాయాన్ని శాస్త్రీయ దృక్పథంతో పునరుద్ధరించడం, వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చి పర్యావరణ పరిరక్షణకు దోహదపడుతూ రైతు కుటుంబాలకు, వినియోగదారులకు రసాయనాల బెడద లేని ఆరోగ్యకర ఆహారాన్ని అందుబాటులోకి తేవాలనే లక్ష్యంతో కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమశాఖ వచ్చే రెండేళ్ల కాలానికి రూ.2,481 కోట్లతో ఎన్‌ఎంఎన్‌ఎఫ్‌ పథకానికి రూపకల్పన చేసింది. కేంద్ర ప్రభుత్వం 60 శాతం వాటా కింద సుమారు రూ.1584 కోట్లు ఖర్చు చేయనుండగా, రాష్ట్రాలు 40 శాతం వాటా కింద సుమారు రూ. 897 కోట్లు భరించాలి. రాష్ట్రంలో 2025-26 సంవత్సరంలో 60 వేల ఎకరాల్లో ఈ పథకం కింద సాగు చేపట్టనున్నారు. ఒక్కో సమూహం (క్లస్టర్‌)లో 125 ఎకరాల చొప్పున రాష్ట్రవ్యాప్తంగా 480 సమూహాల్లో ప్రారంభించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.
అమలు ఇలా…: సేంద్రియ వ్యవసాయానికి అవసరమయ్యే సహజ ఉత్పత్తులను రైతులకు అందుబాటులో ఉంచేందుకు.. అవసరాన్ని బట్టి జీవాధార వనరుల కేంద్రాలు ఏర్పాటు చేస్తారు. రాష్ట్రంలోని కృషి విజ్ఞాన్‌ కేంద్రాలు, వ్యవసాయ, ఉద్యాన, పశువైద్య విశ్వవిద్యాలయాలు, రైతుల పొలాల్లో దాదాపు 200 వరకు సహజ పద్ధతుల నమూనా వ్యవసాయ క్షేత్రాలు నెలకొల్పుతారు. ప్రతి సమూహంలో 8 మంది రైతులకు శిక్షణ ఇస్తారు. క్లస్టర్లలో కొత్త పథకంపై అవగాహన కల్పించేందుకు, రైతుల మధ్య సహకారం పెంపొందించేందుకు, ఇతరత్రా సాయం అందించేందుకు 500 మంది సాగు సహాయకులను నియమిస్తారు. జిల్లా, బ్లాక్‌, గ్రామపంచాయతీల స్థాయిల్లో రైతుబజార్లు, మార్కెట్‌ కమిటీలు, డిపోలతో అనుసంధానం ద్వారా సహజ వ్యవసాయ ఉత్పత్తులకు మార్కెటింగ్‌ అవకాశాలు కల్పిస్తారు. కేంద్రం ఇచ్చే నిధులతో పాటు రాష్ట్ర ప్రభుత్వపరంగా రైతులను అన్నివిధాలా ప్రోత్సహిస్తామని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. వారికి విత్తనాలు, పరికరాలు అందిస్తామని పేర్కొన్నారు.

Read More

సాగు నీటి సంఘాల ఆధ్వర్యంలో జలవనరుల నిర్వహణ పనులు: మంత్రి రామానాయుడు

కాలువలు, కొన్ని ప్రాజెక్టుల్లో నిర్వహణ పనులను సాగునీటి సంఘాల ఆధ్వర్యంలో చేపట్టాలని ఆంధ్రప్రదేశ్‌ నీటిపారుదల శాఖా మంత్రి నిమ్మల రామానాయుడు సూచించారు. రూ. 10 లక్షల్లోపు ఖర్చయ్యే పనులను సాగు నీటి సంఘాలు నామినేషన్‌పై చేయడానికి ఆస్కారం ఉటుందన్నారు. ఖరీఫ్‌ ప్రారంభానికి ముందే ఈ పనుల పూర్తికి ఎమ్మెల్యేలు చొరవ చూపాలని పేర్కొన్నారు. వివిధ నియోజకవర్గాల్లో చేపట్టాల్సిన అత్యవసర పనులను అక్కడి ఎమ్మెల్యేలు, అధికారులు కలిసి గతంలో ప్రతిపాదించారు. వీటికి ఆర్థికశాఖ ఆమోదం తెలపకపోవడంతో మంత్రి రామానాయుడు గతంలోనే మంత్రిమండలి ముందుకు తీసుకెళ్ళి సిఎం చంద్రబాబుకు వివరించారు. మొత్తం రూ. 344.39 కోట్లకు ఆమోదం పొందారు. ఈ పనులు ప్రతిపాదించిన సుమారు 100 మంది ఎమ్మెల్యేలు, అధికారులు, రాష్ట్ర జలవనరుల శాఖ ఉన్నతాధికారులతో మంత్రి సోమవారం టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. అధికారులు, ఎమ్మెల్యేలను సమన్వయం చేసేలా ఈ స్థాయిలో సమావేశం ఏర్పాటు చేయడం ఇదే తొలిసారి. ఈ సందర్భంగా మంత్రి రామానాయుడు మాట్లాడుతూ… తూడు తొలగించడానికి డ్రోన్లతో మందు పిచికారి చేయాలని సూచించారు. సమావేశంలో జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్‌, ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ కె. నరసింహమూర్తి, సలహాదారు ఎం. వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Read More

మార్కెటింగ్‌, ఆయిల్‌ఫెడ్‌, వ్యవసాయ అధికారులతో మంత్రి తుమ్మల సమీక్ష

నాబార్డ్‌, ఆర్‌ఐడిఎఫ్‌ నిధులను ఉపయోగించి మార్కెటింగ్‌ శాఖ ఆధ్వర్యంలో గోదాములు, కోల్డ్‌ స్టోరేజీల నిర్మాణం చేపట్టాలని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. ఈ రోజు సచివాలయంలో మార్కెటింగ్‌, ఆయిల్‌ ఫెడ్‌, వ్యవసాయశాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన మంత్రి ఇప్పటికే ఉన్న గోదాముల సామర్థ్యం మరియు కోల్డ్‌ స్టోరేజీల సామర్థ్యాన్ని పెంచే విధంగా రాష్ట్రంలో మరిన్ని గోదాములు మరియు కోల్డ్‌ స్టోరేజీలు నిర్మించాలని అధికారులకు సూచించారు. ఇందుకోసం నాబార్డ్‌, ఆర్‌ఐడిఎఫ్‌ నిధులను ఉపయోగించుకోవాలని సూచించారు. రైతులు మాత్రమే ఉత్పత్తులను అమ్ముకునేలా రైతుబజార్లను పకడ్భందిగా నిర్వహించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఇందుకోసం అన్ని మార్కెట్లు మరియు రైతు బజార్లలో సీసీటీవీ కెమేరాలను ఏర్పాటు చేయాలన్నారు. మార్కెట్లలో డిజిటల్‌ బోర్డుల ఏర్పాటుపై ఆరా తీశారు. మార్కెట్‌ యార్డుల పునర్విభజనకు ప్రజాప్రతినిధుల నుండి వచ్చిన ప్రతిపాదనలను పరిశీలించి, నిబంధనలకు అనుగుణంగా ఉన్నవాటిని వెంటనే ఏర్పాటు చేయుటకు తగిన చర్యలు తీసుకోవాలని మార్కెటింగ్‌ అధికారులకు మంత్రి తుమ్మల సూచించారు.
వానాకాలం సీజన్‌ ప్రారంభంకానున్న నేపథ్యంలో ఇప్పటికే 40 లక్షల పత్తి విత్తన ప్యాకెట్లను జిల్లాల వారిగా సిద్ధం చేసామని, రానున్న 10,15 రోజుల్లో 2 కోట్ల విత్తన ప్యాకెట్లు రైతులకు అందుబాటులో ఉంచుతామని వ్యవసాయశాఖ సంచాలకులు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, రైతులకు సరిపడా విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంచుకోవాలని వ్యవసాయశాఖ అధికారులకు మంత్రి సూచించారు. పచ్చిరొట్ట విత్తనాల అందుబాటుపై మంత్రి ఆరా తీశారు. సరిపడా పచ్చిరొట్ట విత్తనాలు అందుబాటులో ఉంచుకోవాలన్నారు. అలాగే మే నెలాఖరు వరకు 2 లక్షల మట్టి నమూనాల సేకరణ పూర్తి చేసి, వాటి ఫలితాలు రెండు నెలలలోపు రైతులకు అందేవిధంగా చర్యలు తీసుకోవాలన్నారు. అంతేగాక ప్రతి రైతుకు మట్టి నమూనా పరీక్ష ఫలితాలు అందేవిధంగా తగు ప్రణాళికలు సిద్ధం చేయాలని, అన్ని మార్కెట్‌ యార్డులలో, రైతు వేదికలలో ఈ సౌకర్యాన్ని కల్పించేలా చూడాలని అధికారులను ఆదేశించారు. మట్టి నమూనా పరీక్షల ఆధారంగా ఎలాంటి పంటలు వేయాలో రైతులకు తెలియజేయాలని అధికారులను ఆదేశించారు.
మార్క్‌ ఫెడ్‌ ఆధ్వర్యంలో వివిధ రకాల పంట ఉత్పత్తుల సేకరణ గురించి ఆరా తీసిన మంత్రిగారు, గతంలో ఎన్నడూలేని విధంగా ఈసారి ఇప్పటికే లక్ష మెట్రిక్‌ టన్నుల జొన్నలను సేకరించామని, ప్రభుత్వానికి నష్టం వాటిల్లినా కూడా రైతులకు గిట్టుబాటు ధర అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, అదే సమయంలో జొన్నల సేకరణలో ఎటువంటి పొరపాట్లకు తావివ్వకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
పిఏసిఎస్‌ సీఈఓల బదిలీలపై ప్రభుత్వం ఇప్పటికే వెసులుబాటు కల్పించిందని, తదనుగుణంగా స్టేట్‌ లెవల్‌ కమిటీ ద్వారా బదిలీలపై వెంటనే చర్యలు చేపట్టాలని మంత్రిగారు ఆదేశించారు. కొత్తగా ప్రతిపాదించిన పిఏసిఎస్‌ లను పరిశీలించి, రైతులకు ఉపయోగపడే విధంగా నిబంధనలకు అనుగుణంగా తుదిజాబితా తయారుచేయాలన్నారు. అలాగే 311 పిఏసిఎస్‌ లను ఎఫ్‌పిఓ లుగా మార్చే ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. పిఏసిఎస్‌ మరియు డిసిసిబి లకు సంబంధించి ఎంక్వైరీ పూర్తయి, సర్‌ చార్జీ ఉత్తర్వులు జారీచేయడమైనదని, దానిలో భాగంగా ఇప్పటివరకు 6 కోట్ల 38 లక్షల రివకరి పూర్తి అయిందని, ఇంకా 19 కోట్లు రికవరీ చేయాల్సి ఉందని, అలాగే 74 సర్‌ చార్జ్‌ లు పెండింగ్‌ ఉన్నాయని అధికారులకు మంత్రికి తెలియజేయగా, మిగిలిన రికవరీని త్వరగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.
గత పదిసంవత్సరాలుగా అపెక్స్‌ సహకార సంఘాల ఆడిట్‌ ఎందుకు జరగలేదని ఆడిట్‌ అధికారులపై మంత్రి అసహనం వ్యక్తం చేశారు. సంబంధిత ఆడిట్‌ అధికారులపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఆర్‌సిఎస్‌ కమిషనర్‌ ను ఆదేశించారు. అదేవిధంగా అన్ని అపెక్స్‌ సహకార సంఘాలను ఆడిట్‌ చేయాలన్నారు.
2021 లో ఆయిల్‌ పాం ప్లాంటేషన్‌ చేసిన 2800 మంది రైతులనుండి పంట వస్తుందా? లేదా అని మంత్రిగారు ఆరా తీశారు. ఒకవేళ పంట రాకపోతే అందుకు గల కారణాలు తెలుసుకొని, దానికి నివారణ చర్యలను రైతులకు తెలియజేయాలన్నారు. రైతు పొలంలోకి ఎట్టిపరిస్థితులలో కూడా ఆఫ్‌ టైప్‌ మొక్కలు వెళ్లకూడదని మంత్రిగారు స్పష్టం చేశారు. ఆయిల్‌ఫెడ్‌ సంస్థ మిగతా అన్ని కంపెనీలకు మార్గదర్శకంగా ఉండేలా చూడాలన్నారు.
ఈ సమావేశంలో వ్యవసాయశాఖ సెక్రటరీ రఘునందన్‌ రావు, వ్యవసాయశాఖ డైరెక్టర్‌ గోపి, ఉద్యానశాఖ డైరెక్టర్‌ శ్రీమతి యాస్మిన్‌ బాషా, సహకార అడిషనల్‌ రిజిస్ట్రార్‌, మార్కెటింగ్‌ శాఖ డైరెక్టర్‌ శ్రీమతి లక్ష్మీబాయి మరియు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Read More

కంద.. చేమ.. క్యారెట్‌..!

దుంపల సాగు విస్తీర్ణం పెంపుపై తెలంగాణా ప్రభుత్వం దృష్టి
నష్టాల నుంచి రైతులను గట్టెక్కించాలని నిర్ణయం

అకాల వర్షాలు, వరదలతో పంటలను కోల్పోతున్న రైతులను నష్టాల నుంచి గట్టెక్కిస్తూ ప్రజలకు పోషకాహారాన్ని అందుబాటులోకి తీసుకొచ్చేందుకు తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం దుంపల సాగు విస్తీర్ణాన్ని పెంచాలని నిర్ణయించింది. రైతులను కంద, చేమ, బంగాళాదుంప, క్యారెట్‌, ముల్లంగి, బీట్‌రూట్‌, కర్రపెండలం వంటి పంటల సాగువైపు మళ్లించాలని యోచిస్తోంది. రాష్ట్రంలో ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్‌, మే నెలల్లో కురిసిన, కురుస్తున్న అకాల వర్షాలకు వరి, మొక్కజొన్న, కూరగాయలు, ఆకుకూరలు, మామిడి, నిమ్మ తదితర పంటలు దెబ్బతిని రైతులు భారీగా నష్టపోతున్నారు. ఈ నేపథ్యంలో నష్టాల నివారణకు ప్రత్యామ్నాయాలను సూచించాలని ఉద్యాన విశ్వవిద్యాలయ అధికారులను వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. వారి సూచనలతో ఎక్కువగా దుంప పంటలను సాగుచేసేలా రైతులను ప్రోత్సహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఎన్నో పోషక విలువలు ఉన్న దుంప పంటలు 3,700 ఎకరాల మేరకే సాగవుతున్నాయి. అత్యధికంగా 2,200 ఎకరాల్లో కందగడ్డ (మొరంగడ్డ/ చిలగడదుంప) సాగవుతోంది. బంగాళాదుంప వినియోగం ఎక్కువగానే ఉన్నా.. రాష్ట్రంలో ఆ పంట కేవలం 452 ఎకరాల్లోనే సాగు అవుతుండటం గమనార్హం. రాష్ట్రంలో ఏటా 6 లక్షల టన్నుల మేరకు దుంపల వినియోగం ఉంటుండగా.. ఇక్కడ తక్కువగా సాగు అవుతుండటంతో వాటిని ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. రానున్న ఖరీఫ్‌లో రాష్ట్రంలో 2 లక్షల ఎకరాల మేరకు దుంప పంటలను సాగుచేసేలా అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు.

తక్కువ నీరు.. ఎక్కువ నిల్వ: అకాల వర్షాలు, వరదలతో ఇతర పంటలు దెబ్బతింటున్నా.. దుంపలకు ఎలాంటి నష్టం కలగదని అధ్యయనాల్లో తేలింది. కోతకు వచ్చిన తర్వాత ఇతర పంటలు ఎక్కువ కాలం నిల్వ ఉండవు. దుంప పంటలను మాత్రం ఎక్కువ కాలం పాటు నిల్వ చేసే అవకాశముంటుంది. వీటిని పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం దుంపల సాగు వైపు రైతులను ప్రోత్సహించాలని, అధిక దిగుబడినిచ్చే రకాలను అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తోంది.

Read More