విత్తన స్వయం సంవృద్ధి లక్ష్యంగా గ్రామ గ్రామానికి నాణ్యమైన విత్తన పంపిణి రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా జూన్ 2 నుండి ప్రారంభం – మంత్రి తుమ్మల

ఎంపిక చేసిన అభ్యుదయ రైతులకు ఐదు ప్రధాన పంటలకు సంబంధించిన (వరి, కంది, పెసర, మినుము మరియు జొన్న) విత్తనాలు 11000 గ్రామాల్లో సుమారు 40000 మందికి పంపిణీరాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో రేపు జరగనున్న రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల్లో గౌరవ మంత్రులు, ప్రజాప్రతినిధులు చేతుల మీదుగా కార్యక్రమ ఆరంభం నకు యేర్పాట్లు మంత్రి తుమ్మల

Read More

ఆయిల్‌ పాం సాగు ప్రోత్సాహానికి అడ్డంకిగా మారనున్న దిగుమతి సుంకం తగ్గింపు – మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

క్రూడ్‌ పామ్‌ ఆయిల్‌ దిగుమతులపై సుంకాన్ని తగ్గించాలనే కేంద్ర ప్రభుత్వం నిర్ణయాన్ని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తప్పుబట్టారు. ఇప్పటికే దేశీయ ఆయిల్‌ పామ్‌ రైతుల ప్రయోజనార్థం దిగుమతి సుంకాన్ని 27.5% నుంచి 40%కి పెంచాలంటూ రాష్ట్ర ప్రభుత్వం తరపున అభ్యర్థించినప్పటికి, దీనికి విరుద్ధంగా కేంద్రం దిగుమతి సుంకాన్ని తగ్గించడం బాధాకరమని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ నిర్ణయం వలన ఆయిల్‌ పామ్‌ రైతులకు గెలల ధర తగ్గడంతో పాటు దీర్ఘకాలికంగా దేశీయ ఆయిల్‌ పామ్‌ సాగును తీవ్రంగా ప్రభావితం చేస్తుందన్నారు. ప్రస్తుతం సాగు సీజన్‌ ప్రారంభమైన నేపథ్యంలో రాష్ట్రాలు, రైతులకు తగిన ప్రోత్సాహం కల్పిస్తూ, ఈ పంట సాగు పెంపుపై దృష్టిసారిస్తున్న తరుణంలో, కేంద్ర నిర్ణయం రైతుల నమ్మకాన్ని దెబ్బతీసే విధంగా ఉందన్నారు. ఈ దిగుమతి సుంకం తగ్గింపు వలన కొత్తగా ఆయిల్‌ పామ్‌ సాగు ప్రారంభించాలనుకునే రైతులు వెనక్కి తగ్గే అవకాశం ఉందని మంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. ఇది స్వదేశీ నూనె ఉత్పత్తిని ప్రోత్సహించాలన్న కేంద్ర – రాష్ట్రాల ఉద్దేశ్యాలకు విరుద్ధంగా ఉంటుందని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆయిల్‌ పాం సాగును ప్రోత్సహించేందుకు పలు ప్రోత్సాహక కార్యక్రమాలతో పాటు మౌలిక సదుపాయాల అభివృద్ధి, పెద్ద ఎత్తున రైతుల అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నదని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ దిగుమతి సుంకాన్ని తగ్గించాలన్న నిర్ణయం వల్ల చేపడుతున్న కార్యక్రమాలన్నింటికి తగిన ఫలితాలు రాకపోవచ్చని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో, క్రూడ్‌ పామ్‌ ఆయిల్‌ పై దిగుమతి సుంకం తగ్గింపు నిర్ణయాన్ని పునఃసమీక్షించాలని కేంద్ర వాణిజ్య మరియు పరిశ్రమలశాఖ మంత్రి పియూష్‌ గోయల్‌ని లేఖ ద్వారా కోరడం జరిగింది. ఇదేవిషయాన్ని కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహన్‌ దృష్టికి లేఖ ద్వారా తీసుకొచ్చినట్టు తెలిపారు. అదేవిధంగా రైతుల ఆకాంక్షలు నిలబెట్టడంకోసం, దేశ ఆత్మనిర్భరత లక్ష్యాన్ని సాధించేందుకు ఆయిల్‌ పామ్‌ వంటి నూనె పంటల ఉత్పత్తికి భరోసా కల్పించే విధానాలను అమలు చేయాలని కేంద్రాన్ని కోరినట్టు వెల్లడించారు.

Read More

భూముల్లో విషాలపై సూక్ష్మ బాణాలు!

చీడపీడల నివారణకు రైతులు వినియోగిస్తున్న క్రిమిసంహారక మందులు తర్వాత శాపంగా మారుతున్నాయి. వీటిలోని రసాయన అవశేషాలు పొలాలను విషతుల్యంగా మార్చుతున్నాయి. భూముల సారాన్ని సర్వనాశనం చేస్తున్నాయి. దీనికి విరుగుడుగా కృత్రిమ సూక్ష్మజీవులను అభివృద్ధి చేస్తోంది ఉస్మానియా విశ్వవిద్యాలయం మైక్రో బయాలజీ విభాగం!

ఈ సూక్ష్మజీవులు ప్రత్యేకం…
ఓయూ మైక్రో బయాలజీ విభాగంలో ప్రొఫెసర్‌ సందీప్త బూర్గుల ఆధ్వర్యంలో విద్యార్థులు మూడేళ్ల నుంచి ఈ పరిశోధన చేస్తున్నారు. ముందుగా దేశ, విదేశాల్లో జరుగుతున్న పరిశోధనల వివరాలు సేకరించి వాటికి భిన్నంగా ప్రయోగాలు ప్రారంభించారు. రైతులు పంట పొలాల్లో మోతాదుకు మించి పెస్టిసైడ్స్‌ వినియోగించినా… ఆ భూముల్లో కొన్ని సూక్ష్మజీవులు బతికే ఉన్నాయని గుర్తించారు. వీటిలో 12 రకాల సూక్ష్మజీవులను సేకరించి ప్రయోగశాలలో వడపోసి అయిదింటిని ఎంపిక చేసుకున్నారు. వీటిని కృత్రిమంగా పెంచి పంట పొలాల్లో ప్రవేశపెడితే భూముల్లో విష ప్రభావాన్ని గణనీయంగా తగ్గించేందుకు వీలుంటుందని నిర్ధారణకు వచ్చారు.

ఏం చేశారంటే…
ఇంక్యుబేటర్‌లో పెంచిన సూక్ష్మజీవులను విషతుల్యమైన నేలల్లో విడిచి పెడితే 75 నుంచి 90 శాతం వరకు క్రిమిసంహారక మందుల అవశేషాలను తొలగించాయని రుజువు చేశారు. వీరి పరిశోధనల పత్రాలను అంతర్జాతీయ జర్నల్‌ బ్రెజిలియన్‌ జర్నల్‌ ఆఫ్‌ మైక్రోబయాలజీ ఇటీవలే ప్రచురించింది. ఈ విధానంపై ప్రపంచవ్యాప్తంగా పరిశోధన సంస్థలు ప్రయోగాలు చేస్తున్నా.. 90 శాతం వరకు క్రిమిసంహారక మందుల అవశేషాలను తొలగించడం మెరుగైన విధానమని ప్రొఫెసర్‌ సందీప్త బూర్గుల తెలిపారు. రైతులకు ఉపయోగపడేలా దీన్ని రూపొందించి పూర్తి వివరాలను వెల్లడిస్తామని వివరించారు.

పండ్లు, కూరగాయల్లో…
రైతులు పండిస్తున్న పండ్లు, కూరగాయాల్లో ఈ అవశేషాలు ఎక్కువగా ఉన్నాయని పరిశోధకులు గుర్తించారు. అందుకే తోటలున్న రైతులకు కృత్రిమ సూక్ష్మజీవులను అందించి ప్రయోగాత్మకంగా ఆ నేలల్లో వాటిని విడిచి పరీక్షించాలన్న ప్రణాళికను సిద్ధం చేసుకున్నారు. హైదరాబాద్‌ శివారు ప్రాంతాల్లో కూరగాయలు, పండ్లు పండించే కొందరు రైతులతో మాట్లాడి వారి అనుమతితో సూక్ష్మజీవులను పంట పొల్లాల్లో చొప్పించనున్నారు. సంతృప్తికరమైన ఫలితాలొచ్చాక ఈ విధానానికి పేటెంట్‌ కోసం దరఖాస్తు చేయనున్నామని పరిశోధక విద్యార్థులు తెలిపారు.

ప్రయోగం ఇలా…

  • ముందుగా ఎంపిక చేసిన ప్రాంతాల్లో నల్ల రేగడి, ఎర్రనేలల మట్టిని సేకరించారు. అందులోకి రైతులు సాధారణంగా వినియోగించే మోతాదు కంటే నాలుగైదు రెట్లు అధికంగా క్రిమి సంహారక మందును ఇంజక్షన్ల ద్వారా చొప్పించారు..
  • సహజ సిద్ధమైన గాలి, వెలుతురు లభించే చోట ఆ మట్టి నమూనాలను ఉంచి, వాటిలోకి ఇంక్యుబేటర్‌లో పెంచిన సూక్ష్మజీవులను పంపించారు. వారం రోజులకోసారి మట్టి నమూనాలు, సూక్ష్మజీవులను పరిశీలించారు. ప్రతి 40 నిమిషాలకు సూక్ష్మజీవులు రెట్టింపు అవుతున్నాయని గుర్తించారు.
  • మూడు వారాల్లో మట్టి నమూనాల్లో క్రిమి సంహారక మందుల అవశేషాలు 75 నుంచి 90 శాతం తగ్గాయి. ఈ ఫలితాల ఆధారంగా మరింత మెరుగైన స్థితికి చేరుకునేందుకు మళ్లీ ప్రయోగాలు చేశారు.
  • ఇంక్యుబేటర్‌ నుంచి వెలుపలికి తీసిన సూక్ష్మజీవులు ఎదగాలంటే 37 డిగ్రీల ఉష్ణోగ్రత ఉండాలని తెలుసుకున్నారు. రెండున్న రేళ్లు ప్రయోగాలు చేశాక అనుకున్న ఫలితాలు వచ్చాయని ప్రొఫెసర్‌ సందీప్త తెలిపారు.
Read More

నేడు అగ్రి, హార్టి, వెటర్నరీ కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్‌

తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ, ఉద్యాన, పశువైద్య విశ్వవిద్యాలయాల్లోని డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలకు ఈరోజు నోటిఫికేషన్‌ వెలువడనుంది. ఈ మేరకు వ్యవసాయ విశ్వవిద్యాలయం సన్నాహాలు పూర్తి చేసింది. ఏటా ప్రవేశాల్లో జాప్యం జరిగి తరగతులు ఆలస్యమవుతుండడంతో ఈసారి కౌన్సెలింగ్‌ ప్రక్రియను త్వరగా నిర్వహించాలని వ్యవసాయ యూనివర్సిటీ ప్రతిపాదించగా.. ఉద్యాన, పశువైద్య వర్సిటీలు ఆమోదించాయి. గతంలో నీట్‌ కౌన్సెలింగ్‌ పూర్తయిన తర్వాత ప్రవేశాలు నిర్వహించేవారు. ఈసారి నీట్‌ కౌన్సెలింగ్‌తో సంబంధం లేకుండా నెలరోజుల్లో మొదటి విడత ప్రవేశాలను పూర్తి చేసి తరగతులను ప్రారంభించాలని భావిస్తున్నారు. నోటిఫికేషన్‌ తర్వాత దరఖాస్తుల నమోదుకు మూడు వారాల గడువు ఇచ్చి ఆ తర్వాత కౌన్సెలింగ్‌ చేపట్టనున్నారు. ఈ ఏడాది సూర్యాపేట, నిజామాబాద్‌, వికారాబాద్‌ జిల్లాల్లో కొత్త వ్యవసాయ కళాశాలలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావించినా ఇప్పటి వరకు వాటికి సంబంధించిన సన్నాహాలు పూర్తి కాలేదు. దీంతో ప్రస్తుతం ఉన్న కళాశాలలకే నోటిఫికేషన్‌ జారీ కానుంది.

Read More

జూరాల గేట్ల ద్వారా దిగువకు వెళ్తున్న కృష్ణా ప్రవాహం

మే నెలలోనే.. బిరబిరా కృష్ణమ్మ తెరుచుకున్న జూరాల ప్రాజెక్టు గేట్లు

నిండు వేసవిలో అరుదైన దృశ్యం. ఎండిపోయి ఎడారిలా మారిన కృష్ణానది ఉరకలెత్తుతోంది. ఏకంగా ఇందిరా ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు గేట్లు తెరుచుకునేలా వరద వచ్చి చేరుతోంది. కర్ణాటక- తెలంగాణ సరిహద్దుల్లో కురుస్తున్న వర్షాలతో తెలంగాణలో ఉమ్మడి మహబూబ్‌ నగర్‌ జిల్లాలో కృష్ణా నదిపై ఉన్న మొదటి ప్రాజెక్టు జూరాలకు వరద వచ్చింది. జూరాల ఎగువ ప్రాజెక్టు కర్ణాటకలోని నారాయణపూర్‌కు ప్రవాహమేదీ లేదు. సాధారణంగా జూన్‌, తరువాత ఈ ప్రాజెక్టుకు ఎగువ నుంచి వరద వస్తూ ఉంటుంది. దీనికి భిన్నంగా మే నెలలో వరదలు రావడం అరుదు. ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు ముందుగా రావడంతో కృష్ణానదిలో ప్రవాహం పెరిగింది. 16వ తేదీ నుంచి కొంచెం ప్రారంభమైన ప్రవాహం గురువారం రాత్రికి 90 వేల క్యూసెక్కులకు చేరుకుంది. దీంతో ప్రాజెక్టు 12 గేట్లు తెరిచి 82,000 క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. జూరాల పూర్తిస్థాయి నిల్వ సామర్థ్యం 9.65 టీఎంసీలు (1045 అడుగులు). ఒకే నీటి సంవత్సరంలో(2024 జూన్‌- 2025 మే) మధ్య నైరుతి రుతుపవనాలతో గేట్లు ఎత్తడం అరుదైన విషయం.

Read More

ఎక్కువ మాంసం ఇచ్చే గొర్రె

జన్యు సవరణ ద్వారా సృష్టి

ఎక్కువ మాంసం ఇచ్చే గొర్రె సంతతిని జన్యు సవరణ (జీన్‌ ఎడిటింగ్‌) ద్వారా సృష్టించడంలో జమ్మూ కశ్మీర్‌లోని షేర్‌-ఎ-కశ్మీర్‌ యూనివర్సిటీ ఆఫ్‌ అగ్రికల్చరల్‌ సైన్సెస్‌ అండ్‌ టెక్నాలజీకి (ఎస్‌కేయూఏఎస్‌టీ) చెందిన పరిశోధకులు విజయం సాధించారు. ఇది భారత్‌లో తొలి జన్యు సవరణ గొర్రె అని, చరిత్రాత్మక మైలురాయి అని వారు వివరించారు. గొర్రెల్లో కండరాల అభివృద్ధిని నియంత్రించే మయోస్టాటిన్‌ జన్యువును సవరించడం ద్వారా వారు దీనిని సాధించగలిగారు. నాలుగేళ్లుగా సాగిన ఈ పరిశోధనకు విశ్వవిద్యాలయ పశు వైద్య విభాగం డీన్‌ రియాజ్‌ అహ్మద్‌ షా నాయకత్వం వహించారు. ‘జన్యు సవరణ ద్వారా 30 శాతం ఎక్కువ మాంసం ఇచ్చే గొర్రె సంతతిని సృష్టించగలిగాం. భారతీయ రకాల్లో సహజంగా మాంసం వాటా తక్కువగా ఉంటుంది. అయితే కొన్ని ఐరోపా గొర్రె జాతుల్లో మాంసం అధికంగా ఉండేలా జన్యు నిర్మాణం ఉంటుంది’ అని అహ్మద్‌ షా తెలిపారు. ‘సంకరం ద్వారా కాకుండా జన్యు సవరణ ద్వారా జన్యు మార్పిడి సాధించడం ఒక నవ్య సాంకేతిక ఘన విజయం. ఇది 21వ శతాబ్దంలో ఆవిర్భవించిన కృత్రిమ మేధ లాంటిదే’ అని పేర్కొ న్నారు. ‘ఇది కేవలం ఒక గొర్రె పిల్లను పుట్టించడం కాదు. జన్యు ఆధారిత పశుగణాభివృద్ధిలో ఒక కొత్త ఆవిష్కారం. కొత్త జన్యు పదార్థాన్ని ప్రవేశపెట్టకుండా ప్రయోజనకరమైన జన్యు సవరణ చేసే సత్తా మనకుందని చాటుకున్నాం’ అని ఆయన వివరించారు. అహ్మద్‌ షా నేతృత్వంలోని పరిశోధక బృందం 2012లో అత్యంత ఖరీదైన ఉన్నిని అందించే కశ్మీరీ పష్మీనా గొర్రె ‘నూరీ’ అనే జన్యు సమరూప జీవిని (క్లోన్‌) ఆవిష్కరించింది. తద్వారా ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు అందుకుంది.

Read More

వ్యవసాయ డిగ్రీ కోర్సుల్లో ప్రకృతి సేద్యం

ప్రకృతి సేద్యాన్ని పెద్దఎత్తున ప్రోత్సహించేందుకు దేశంలోని వ్యవసాయ విశ్వవిద్యాలయాల డిగ్రీ కోర్సుల్లో దాన్ని చేర్చాలని అగ్రి వర్సిటీల డీన్‌ల జాతీయ సదస్సు తీర్మానించింది. హైదరాబాద్‌లోని జాతీయ వ్యవసాయ పరిశోధన నిర్వహణ సంస్థ (నార్మ్‌)లో డీన్‌ల సదస్సు జరిగింది. వ్యవసాయ విద్యా విధానాలు, సవాళ్లు, పురోగమనం అంశాలపై ఇందులో చర్చించారు. 45 రాష్ట్ర, కేంద్ర, డీమ్డ్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయాలకు చెందిన 56 మంది డీన్లు, డైరెక్టర్లు హాజరయ్యారు. నార్మ్‌ డైరెక్టర్‌ జనరల్‌ ఆర్‌సీ అగర్వాల్‌ తదితరులు పాల్గొన్నారు.

Read More

ఏరువాకలో ముందస్తు సందడి

  • రాష్ట్రంలో మొదలైన వానాకాలం సీజన్‌
  • నారు పోస్తూ.. దుక్కులు దున్నుతూ పొలాల్లో రైతులు
  • 1.34 కోట్ల ఎకరాల సాగు లక్ష్యం
  • ప్రభుత్వపరంగా సన్నద్ధత

తెలంగాణా రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాలు ముందస్తుగా ప్రవేశించడంతో వానాకాలం సీజన్‌ మొదలైంది. రోజూ వర్షాలు కురుస్తుండటంతో రైతులు సైతం ముందస్తు సాగుకు సన్నద్ధమవుతున్నారు. ఇప్పటికే వరి నారు పెంపకం ప్రారంభించగా, ఇతర పంటలకు దుక్కులు దున్ని విత్తనాలు వేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం వానాకాలం కార్యాచరణ ప్రణాళిక అమలుకు సన్నాహాలు ప్రారంభించింది. ఈ సీజన్‌లో 1.34 కోట్ల ఎకరాల్లో పంటల సాగు లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. గత వానాకాలం సీజన్‌లో 1.29 కోట్ల ఎకరాల్లో సాగు కాగా.. ఈసారి అదనంగా 5 లక్షల ఎకరాలు ప్రతిపాదించింది. సాధారణంగా జూన్‌ నెలలో రైతులు పొలాలను దున్ని సాగుకు సిద్ధం చేసుకుంటారు. ఈసారి మార్చి నుంచే అడపాదడపా వర్షాలు పడుతూనే ఉన్నాయి. గత పది రోజుల నుంచి భారీ వర్షాలు కురుస్తుండడంతో రైతులు పంటల సాగుపై దృష్టి సారించారు.

రాష్ట్రంలో పదేళ్లుగా సాగు, ఉత్పత్తులు ఏటేటా పెరుగుతున్నాయి. ఆ మేరకు విత్తనాల సరఫరాకు వ్యవసాయశాఖ సిద్ధమవుతోంది. సన్న ధాన్యానికి బోనస్‌ దృష్ట్యా 40 లక్షల ఎకరాల్లో సాగయ్యే అవకాశం ఉందని అంచనా వేసింది. ఇందుకోసం 16.70 లక్షల క్వింటాళ్ల విత్తనాలు అవసరమవుతాయి. వీటి కంటే అధిక అంచనాలతో 60.11 లక్షల ఎకరాల్లో సన్నాలు, 38.21 లక్షల ఎకరాల్లో దొడ్డు రకాలు కలిపి 98.32 లక్షల ఎకరాలకు సరిపడా విత్తనాలను వ్యవసాయశాఖ సిద్ధం చేసింది. పత్తికి సైతం 1.08 కోట్ల ఎకరాలకు అవసరమైన విత్తనాల పంపిణీకి ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే పచ్చిరొట్ట విత్తనాల పంపిణీ ప్రారంభమైంది. 

రాష్ట్రవ్యాప్తంగా విత్తనోత్పత్తి కోసం వచ్చే నెల 2న వ్యవసాయ విశ్వవిద్యాలయం సిద్ధం చేసిన విత్తనాలను గ్రామానికి ముగ్గురు చొప్పున ఆదర్శ రైతులకు పంపిణీ చేయనున్నారు. వ్యవసాయవర్సిటీ.. 3వ తేదీ నుంచి సాగు విత్తనాలను రైతులకు అందించనుంది. 

వానాకాలం సీజన్‌కు రాష్ట్రానికి 9.80 లక్షల టన్నుల యూరియా సరఫరా చేయడానికి కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. ఇందులో ఏప్రిల్‌, మే నెలల్లో 1.72 లక్షల టన్నులు వచ్చింది. వచ్చే నెల మొదటి వారం నుంచి పంపిణీ చేసే అవకాశం ఉంది.

పంటల బీమా అమలు:
ఈ సీజన్‌లో ప్రధానమంత్రి ఫసల్‌ బీమా యోజన పథకం అమలుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ప్రీమియంలో సగం కేంద్రం, మరో సగం రాష్ట్ర ప్రభుత్వం భరించనున్నాయి. రైతులందరికీ పంటల బీమా వర్తింపజేయడంతో స్థూల పంట విస్తీర్ణంలో 98 శాతానికి ఈ పథకం వర్తిస్తుందని అధికార వర్గాలు భావిస్తున్నాయి.

నకిలీల నివారణపై దృష్టి:
రాష్ట్రంలో నకిలీ విత్తనాలు, ఎరువుల బెడద లేకుండా పోలీసు, వ్యవసాయశాఖలు సంయుక్తంగా టాస్క్‌ఫోర్స్‌లను ఏర్పాటు చేసి తనిఖీలు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. వరంగల్‌, మేడ్చల్‌ మల్కాజిగిరి, వికారాబాద్‌ జిల్లాల్లో ఈ బృందాలు దాడులు నిర్వహించి నకిలీ విత్తనాల ముఠాలను పట్టుకున్నాయి. ఎరువుల నివారణకు వ్యవసాయశాఖ ద్వారా గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలను చేపట్టారు. ఈ నెల 5 నుంచి రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమం జరుగుతోంది.

Read More

ఈసారి వర్షాలు పుష్కలం!

ఐఎండీ అంచనా

నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఈ సారి దేశంలో పుష్కలంగా వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) అంచనా వేస్తోంది. జూన్‌ నెలలో సాధారణం కంటే ఎక్కువ వానలు కురిసి, గరిష్ట ఉష్ణోగ్రతలు తగ్గే అవకాశం ఉందని వెల్లడించింది. దీర్ఘకాలిక సగటు (166.9 మి.మీ.) తో పోలిస్తే 108% వర్షాలు కురుస్తాయని తెలిపింది. జూన్‌ నుంచి సెప్టెంబరు మధ్య సగటు (87 మి.మీ.) కంటే 106% వర్షపాతం నమోదవుతుందని పేర్కొంది. మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, మహారాష్ట్ర, ఒడిశా, చుట్టుపక్కల ప్రాంతాల్లో సాధారణం కంటే ఎక్కువగా, వాయవ్య భారతదేశంలో సాధారణంగా, ఈశాన్య రాష్ట్రాల్లో తక్కువగా వర్షాలు పడతాయని తెలిపింది. మధ్య, దక్షిణ ద్వీపకల్ప ప్రాంతాల్లో కూడా సాధారణ సగటుకు మించిన వానలు పడతాయని ఐఎండీ డైరెక్టర్‌ జనరల్‌ మృత్యుంజయ్‌ మహాపాత్ర తెలిపారు. మరోవైపు పసిఫిక్‌ ప్రాంతంలో ఎల్‌నినో తటస్థంగా ఉంది. ఈసారి రుతుపవనాలపై ఎల్‌నినో ప్రభావం చూపబోదని ఐఎండీ తెలిపింది.

Read More

ముమ్మరంగా పొగాకు కొనుగోళ్లు

క్వింటా రూ.12 వేలకు తగ్గకుండా కొనాలని సీఎం ఆదేశం

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేకంగా చొరవ తీసుకొని అధికారులు, కంపెనీల ప్రతినిధులకు ఆదేశాలివ్వడంతో రాష్ట్రంలో పొగాకు కొనుగోళ్లు ముమ్మరంగా సాగుతున్నాయి. హెచ్‌డీ బర్లే పొగాకు 75 మిలియన్‌ కిలోల దిగుబడి రాగా, ఇప్పటికే 21 మిలియన్‌ కిలోలు కొనుగోలు చేశారు. పొగాకు రైతుల సమస్యలపై ఈ నెల 16న సీఎం చంద్రబాబు.. అధికారులు, పలు పొగాకు కంపెనీల ప్రతినిధులతో సమీక్షించారు. రైతుల వద్ద 54 మిలియన్‌ కిలోల నిల్వలుండగా, 20 మిలియన్‌ కిలోలు కొనుగోలు చేస్తామని జీపీఐ, ఐటీసీ సంస్థలు తెలిపాయి. 30 మిలియన్‌ కిలోల మేర క్వింటాలుకు రూ.12 వేల ధర తగ్గకుండా వారంలో కొనుగోళ్లు పూర్తిచేయాలని సీఎం ఆదేశించారు. దీనిపై ప్రతి రెండు రోజులకు తనకు నివేదిక ఇవ్వాలని సూచించడంతో అధికారులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తున్నారు. రైతుల వద్ద ఉన్న నిల్వల వివరాలను గ్రామ వ్యవసాయ సహాయకులు సర్వే చేసి, నమోదు చేసేందుకు వీలుగా ప్రభుత్వం యాప్‌ను రూపొందించింది. అమ్మకాలను సమీక్షించేందుకు పొగాకు బోర్డు కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేసి 0863-2358531 నంబరును అందుబాటులో ఉంచింది. ఈ చర్యలతో కొనుగోళ్లు వేగం అందుకున్నాయి.

Read More