తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ, ఉద్యాన, పశువైద్య విశ్వవిద్యాలయాల్లోని డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలకు ఈరోజు నోటిఫికేషన్ వెలువడనుంది. ఈ మేరకు వ్యవసాయ విశ్వవిద్యాలయం సన్నాహాలు పూర్తి చేసింది. ఏటా ప్రవేశాల్లో జాప్యం జరిగి తరగతులు ఆలస్యమవుతుండడంతో ఈసారి కౌన్సెలింగ్ ప్రక్రియను త్వరగా నిర్వహించాలని వ్యవసాయ యూనివర్సిటీ ప్రతిపాదించగా.. ఉద్యాన, పశువైద్య వర్సిటీలు ఆమోదించాయి. గతంలో నీట్ కౌన్సెలింగ్ పూర్తయిన తర్వాత ప్రవేశాలు నిర్వహించేవారు. ఈసారి నీట్ కౌన్సెలింగ్‌తో సంబంధం లేకుండా నెలరోజుల్లో మొదటి విడత ప్రవేశాలను పూర్తి చేసి తరగతులను ప్రారంభించాలని భావిస్తున్నారు. నోటిఫికేషన్ తర్వాత దరఖాస్తుల నమోదుకు మూడు వారాల గడువు ఇచ్చి ఆ తర్వాత కౌన్సెలింగ్ చేపట్టనున్నారు. ఈ ఏడాది సూర్యాపేట, నిజామాబాద్, వికారాబాద్ జిల్లాల్లో కొత్త వ్యవసాయ కళాశాలలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావించినా ఇప్పటి వరకు వాటికి సంబంధించిన సన్నాహాలు పూర్తి కాలేదు. దీంతో ప్రస్తుతం ఉన్న కళాశాలలకే నోటిఫికేషన్ జారీ కానుంది.



