విజయవంతంగా ముగిసిన గ్రామగ్రామాన నాణ్యమైన విత్తన పంపిణీ కార్యక్రమం- మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం మరియు రాష్ట్ర వ్యవసాయ శాఖ సహకారంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన “గ్రామ గ్రామాన నాణ్యమైన విత్తనం” కార్యక్రమం విజవంతంగా ముగిసిందని వ్యవసాయశాఖ మంత్రి శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారు తెలిపారు. జూన్ రెండో తేదీన ప్రారంభమైన ఈ కార్యక్రమం ద్వారా ఎంపిక చేయబడిన అభ్యుదయ రైతులకు రాష్ట్రంలోని వివిధ జిల్లాలలో ఆయా జిల్లాల మంత్రులు, ప్రజా ప్రతినిధులు, మరియు అధికారుల చేతుల మీదుగా విత్తన పాకెట్లను లాంచనంగా పంపిణీ చేయడం జరిగిందన్నారు.
ఈ కార్యక్రమం కింద ఇప్పటివరకు సుమారు 2500 క్వింటాళ్ల నాణ్యమైన మూల విత్తనాన్ని రాష్ట్రంలోని అన్ని రెవిన్యూ గ్రామాల్లో ఎంపిక చేయబడిన 35,000 మంది అభ్యుదయ రైతులకు పంపిణీ చేయడం జరిగిందని మంత్రిగారు తెలపారు. వరిలో 20,000, జొన్నలో 1,522, కందిలో 4,568, పెసరలో 8,910 విత్తన కిట్లను రైతాంగానికి అందించడం జరిగిందని, నల్లగొండ జిల్లాలో అత్యధికంగా 2,192 కిట్లను, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో జిల్లాలో అత్యల్పంగా 379 విత్తన కిట్లను పంపిణీ చేయడం జరిగిందన్నారు.
ఈ సందర్భంగా వ్వయసాయ శాఖ మంత్రి శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారు మాట్లాడుతూ… ఈ నాణ్యమైన విత్తనాన్ని అందుకున్న రైతులు, సరైన యాజమాన్య పద్దతులు పాటించి వచ్చిన దిగుబడిని గ్రామంలోని ఇతర రైతులకు పంపిణీ చేయడం ద్వారా రానున్న రెండు, మూడు సంవత్సరాలలో ప్రతీ గ్రామం విత్తన స్వయం సమృద్ధి సాధించగలదని విశ్వాసం వ్యక్తం చేశారు.
రైతాంగానికి నాణ్యమైన విత్తనం అందించాలనే లక్ష్యంతో గత నాలుగు నెలలుగా ప్రణాళికలు సిద్ధం చేసి, ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం మరియు వ్యవసాయ శాఖ సహకారంతో ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేసామని తెలిపారు.
భవిష్యత్తులో కూడా ఇలాంటి రైతు ప్రయోజనకరమైన వినూత్న కార్యక్రమాలను వ్యవసాయ విశ్వవిద్యాలయం వారు మరిన్ని చేపట్టాలని వ్యవసాయ శాఖ మంత్రి ఆకాంక్షించారు. ఈ సందర్భంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉపకులపతితో పాటు విశ్వవిద్యాలయ అధికారులు, శాస్త్రవేత్తలు మరియు వ్యవసాయ శాఖ అధికారులను మంత్రిగారు అభినందించారు.

Read More

ప్రకృతి వ్యవసాయంతో సమగ్ర పరిష్కారాలు

– వ్యవసాయశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి.రాజశేఖర్‌

వ్యవసాయరంగం ఎదుర్కొంటున్న సమస్యలకు ప్రకృతి వ్యవసాయం సమగ్ర పరిష్కారాలు అందిస్తుందని ఆంధ్రప్రదేశ్‌ వ్యవసాయశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి. రాజశేఖర్‌ పేర్కొన్నారు. రైతు సాధికార సంస్థ ఆధ్వర్యంలో రాష్ట్రంలోని జిల్లాల్లో మూడు రోజుల పాటు శిక్షణ శిబిరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమం ముగింపు సందర్భంగా ఆయన మాట్లాడారు. కొందరు రైతులు ప్రకృతి వ్యవసాయాన్ని చేయటాన్ని అభినందించారు. ఈ సమావేశంలో రైతు సాధికార సంస్థ వైస్‌ చైర్మన్‌ విజయ్‌ కుమార్‌ పాల్గొన్నారు. రసాయనాల వాడకంతో ఆహారంలో పోషకాలు తగ్గుతున్నాయని తెలిపారు. భూసారం పెరగడానికి, రైతు శ్రేయస్సుకు ప్రకృతి వ్యవసాయం అవసరమని వివరించారు. దీనిలో సత్ఫలితాలను సాధిస్తున్న గుంటూరు జిల్లా నూతక్కి రైతు శ్రీనివాసులు రెడ్డి, ఎన్టీఆర్‌ జిల్లా వీరపనేనిగూడెం రైతు హేమలత విజయాలను అధికారులు వివరించారు. సమావేశంలో వ్యవసాయశాఖ డైరెక్టర్‌ ఢిల్లీరావు, ఉద్యానశాఖ డైరెక్టర్‌ శ్రీనివాసులు, రైతు సాధికార సంస్థ సీఈఓ బి. రామారావు పాల్గొన్నారు.

Read More

అమెరికాలోకి ప్రమాదకర ఫంగస్‌.. ఇద్దరు చైనీయుల అరెస్టు

ఆహార ధాన్యాల పంటలకు విస్తృత నష్టం కలిగించడంతోపాటు మనుషుల్లో, జంతువుల్లో తీవ్ర అనారోగ్యాన్ని కలిగించే ఒక ప్రమాదకర ఫంగస్‌ను అమెరికాలోకి ప్రవేశ పెట్టిన ఇద్దరు చైనా జాతీయుల్ని అరెస్టు చేసినట్టు ఫెడరల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌ (ఎఫ్‌బీఐ) సంస్థ డైరెక్టర్‌ కాష్‌ పటేల్‌ వెల్లడించారు. ”ఫ్యుసేరియం గ్రామినేరియం” అనే ఈ ఫంగస్‌.. గోధుమ, బార్లీ, మొక్కజొన్న, వరి వంటి పంటల్లో ”తల తెగులు”(హెడ్‌ బ్రైట్‌) అనే వ్యాధిని కలిగిస్తుంది. మొక్కల పూతను ఈ వ్యాధి దెబ్బతీసి దిగుబడిని నాశనం చేస్తుంది. తెగులు సోకిన ఆహారధాన్యాలు సేవించిన మనుషులు, జంతువుల్లో తీవ్రమైన ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఈ ఫంగస్‌ను చైనా నుంచి అమెరికాలోకి తీసుకొచ్చిన యున్‌కింగ్‌ జియాన్‌ అనే మిషిగన్‌ విశ్వవిద్యాలయ పరిశోధకురాలిని, ఆమె స్నేహితుడు జుయోంగ్‌ లియులను అరెస్టు చేశామని కాష్‌ పటేల్‌ చెప్పారు. అత్యంత ప్రమాదకర వ్యాధికారకమైన ఫంగస్‌పై మిషిగన్‌ విశ్వవిద్యాలయంలో పరిశోధన జరిపేందుకు దాన్ని అమెరికాలోకి తీసుకొచ్చినట్లు గుర్తించామని ఆయన తెలిపారు. చైనా కమ్యూనిస్టు పార్టీకి జియాన్‌ విధేయురాలని, ఆమె ఈ వ్యాధి కారకంపై గతంలో చైనాలో కూడా పరిశోధన జరిపేందుకు నిధులు పొందారని పటేల్‌ తెలిపారు. ఫంగస్‌ నమూనాను అమెరికాలోకి తేవడంలో తన ప్రమేయం లేదని తొలుత బుకాయించిన చైనా పరిశోధకురాలు ఆ తర్వాత నేరాన్ని అంగీకరించారని పటేల్‌ వివరించారు. ఈ చర్యను ఆగ్రో టెర్రరిజంగా అభివర్ణించారు.

Read More

తెలంగాణలో 311 రైతు ఉత్పత్తిదారుల సంఘాలు

కేంద్ర పథకం కింద ఏర్పాటు

దేశంలోని చిన్న, సన్నకారు రైతుల అభ్యున్నతి, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఆర్థిక స్వావలంబనకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన రైతు ఉత్పత్తిదారుల సంఘా(ఫార్మర్‌ ప్రొడ్యూసర్స్‌ ఆర్గనైజేషన్‌-ఎఫ్పీవో)ల ఏర్పాటు, ప్రోత్సాహక పథకం కింద తెలంగాణలో 311 సంఘాలు ఏర్పాటు కానున్నాయి. 2025లో అంతర్జాతీయ సహకార సంవత్సరాన్ని పురస్కరించుకొని దేశ వ్యాప్తంగా 10వేల సంఘాల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అందులో తెలంగాణకు 311 కేటాయించింది. అన్నదాతల ఆదాయం పెంపు, పెట్టుబడి రాయితీలు, నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, క్రిమిసంహారక మందులు, వ్యవసాయ యంత్రాల కొనుగోళ్ల కోసం సభ్యులకు తక్కువ వడ్డీకి రుణాల పంపిణీ, పంట ఉత్పత్తులశుద్ది, గిట్టుబాటు ధరలు కల్పించేలా మార్కెట్‌ అనుసంధానానికి ప్రస్తుతం దేశంలోని ఎఫ్పీవోలు కృషి చేస్తున్నాయి. ఇదే తరహాలో తెలంగాణలోనూ అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.

ఎఫ్‌పీవోలో ఇలా..: కేంద్ర పథకం కింద ఎంపికయ్యే సంఘాలలో కనీసం 300 మంది సభ్యులు ఉండాలి. రూ.2 వేలు వాటాధనం చెల్లించి పేర్లు నమోదు చేసుకోవాలి. సంఘం యాజమాన్య బోర్డులలో మహిళా రైతులు ప్రాతినిధ్యం ఉండాలి. సంఘాల సభ్యులకు వ్యాపార ప్రణాళికల తయారు, వాటి అమలులో ఎదురయ్యే సమస్యల పరిష్కారానికి అవసరమైన శిక్షణ ఇస్తారు. ప్రతి సంఘానికి ఈక్విటీ గ్రాంట్‌ కింద కేంద్రం రూ.15 లక్షలు, నిర్వహణకు ఏటా రూ.6 లక్షల చొప్పున మూడేళ్లు గ్రాంటు ఇస్తుంది. కేంద్ర పథకం కింద ప్రత్యేక క్రెడిట్‌ గ్యారంటీ ఫండ్‌ రూ.1500 కోట్లు కేటాయించారు. దీని కింద సంఘాలకు రుణాలు ఇస్తారు. ఇందులో 85 శాతం వరకు పూచీకత్తును కేంద్రం ఇస్తుంది. తెలంగాణలో ప్రస్తుతం ఉన్న ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల(పీఏసీఎస్‌)నే ఎఫ్‌పీవోలుగా మార్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. సమర్థంగా నడుస్తున్న పీఏసీఎస్‌లను ఎంపిక చేయాలని సహకార యూనియన్‌ను ఆదేశించింది.

Read More

అమరావతిలో 5న ప్రపంచ పర్యావరణ దినోత్సవ కార్యక్రమం

హాజరై మొక్కలు నాటనున్న ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర రాజధాని గ్రామం అనంతవరం సమీపంలో అమరావతి అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న పార్కులో ఈ నెల 5న ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ ముఖ్య అతిథులుగా హాజరై మొక్కలు నాటి ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. రాష్ట్ర అటవీ శాఖ, సెంట్రల్‌ పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా పార్కులో 1,000 మొక్కలు నాటనున్నారు. అనంతరం జరిగే సమావేశంలో సుమారు 1,500 మంది పాల్గొనే అవకాశం ఉంది. పార్కు మొత్తం విస్తీర్ణం 34 ఎకరాల్లో 15 ఎకరాలను ఈ కార్యక్రమం కోసం సిద్ధం చేస్తున్నారు. ప్రస్తుతం భారీ యంత్రాలతో శరవేగంగా నేలను చదును చేసే పనులు జరుగుతున్నాయి. మంగళవారం తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణకుమార్‌ ఏర్పాట్లను పరిశీలించారు. జిల్లా అటవీశాఖ అధికారిణి హిమ శైలజ, సీఎఫ్‌వో కాశీవిశ్వనాథరావు తదితరులు పాల్గొన్నారు.

Read More

విత్తనోత్పత్తితో నష్టపోయిన రైతులకు పరిహారం అందించాలి

వ్యవసాయ కమిషన్‌ ఛైర్మన్‌ ఆదేశాలు

ములుగు జిల్లాలో మొక్కజొన్న విత్తనోత్పత్తితో నష్టపోయిన రైతులకు వెంటనే పరిహారం అందించాలని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ, రైతు కమిషన్‌ చైర్మన్‌ కోదండరెడ్డి ఆ జిల్లా కలెక్టర్‌ దివాకరను ఆదేశించారు. సోమవారం ఆయన కమిషన్‌ కార్యాలయం నుంచి ఈ విషయంపై వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. రాష్ట్ర వ్యవసాయ సంచాలకుడు గోపి, కమిషన్‌ సభ్యులు, కలెక్టర్‌ పాల్గొన్నారు. కోదండరెడ్డి మాట్లాడుతూ.. తాము క్షేత్రస్థాయిలో పర్యటించి ఆదేశాలు ఇచ్చినా ఇప్పటి వరకు రైతులకు న్యాయం జరగలేదన్నారు. కార్పొరేట్‌ కంపెనీలు పరిహారం ఇవ్వని పక్షంలో వాటిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

Read More

ఈ నెల 5న వనమహోత్సవం

కోటి మొక్కలు నాటాలని లక్ష్యం

ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 5న ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమం, ప్లాస్టిక్‌ కాలుష్య నివారణ కార్యక్రమాలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర స్థాయిలో ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ మొక్కలు నాటి వనమహోత్సవాన్ని ప్రారంభిస్తారు. అదే రోజు జిల్లాల్లో ఇన్‌ఛార్జి మంత్రులు, ఇతర మంత్రులు, ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ఆ ఒక్కరోజే రాష్ట్రవ్యాప్తంగా కోటి మొక్కలు నాటాలనేది లక్ష్యం. నియోజకవర్గ, మండల, గ్రామస్థాయి వరకూ ఈ కార్యక్రమం జరుగుతుంది. అలాగే ప్లాస్టిక్‌ కాలుష్య నివారణపై అవగాహన కార్యక్రమాలు, విద్యార్థులకు పోటీలు నిర్వహించనున్నారు. ఈ అంశంపై సామాజిక మాధ్యమాల్లో ప్రజల నుంచి అభిప్రాయాలు, సూచనలు, సలహాలు స్వీకరిస్తారు. ఈ మేరకు విధివిధానాలు ఖరారు చేస్తూ అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అనంతరాము సోమవారం రెండు వేర్వేరు ఉత్తర్వులు జారీ చేశారు.

Read More

సహజ వ్యవసాయ పరిశోధనలకు గ్రాంటు

జాతీయ సహజ వ్యవసాయ పథకం (నేషనల్‌ మిషన్‌ ఆన్‌ నేచురల్‌ ఫార్మింగ్‌) విధానంలో పరిశోధన వ్యవస్థను బలోపేతం చేసేందుకు గరిష్ఠంగా రూ.50 లక్షల వరకు గ్రాంట్లను ఇవ్వనున్నట్లు తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ సంచాలకుడు గోపి తెలిపారు. కేంద్ర, రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, ప్రభుత్వ గుర్తింపు పొందిన సంస్థలు, ప్రభుత్వేతర సంస్థలు, ప్రకృతి వ్యవసాయం రైతులు, గుర్తింపు పొందిన పరిశోధన సంస్థలు జూన్‌ 5న సాయంత్రంలోపు దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. మరిన్ని వివరాల కోసం https://nmnfresearch.in వెబ్‌సైట్‌ను సందర్శించాలని కోరారు.

Read More

ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయ నాణ్యమైన విత్తన పంపిణీ ప్రారంభం ః ఉపకులపతి ప్రొఫెసర్‌ ఆల్దాస్‌ జానయ్య

12వ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం చేపట్టిన ”గ్రామ గ్రామానికి నాణ్యమైన విత్తనం” కార్యక్రమం ఈరోజు లాంఛనంగా రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభం అయింది. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగిన రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలలో ఎంపిక చేసిన పది మంది రైతులకు నాణ్యమైన విత్తన కిట్లను అందజేశారు. అదేవిధంగా రంగారెడ్డి జిల్లాలో జరిగిన రాష్ట్ర అవతరణ దినోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి సలహాదారులు వేం నరేందర్‌ రెడ్డి, విశ్వవిద్యాలయ ఉపకులపతి ప్రొఫెసర్‌ అల్దాస్‌

Read More

ఎగుమతుల్లో అగ్రస్థానం.. తేడాలొస్తే ఆగమాగం

మన రొయ్య, మిరప, పొగాకుకు విదేశీ ఆర్డర్లే కీలకం- ఏటా సుమారు రూ.40 వేల కోట్లపైనే ఎగుమతులు – అక్కడ డిమాండు లేకున్నా, పన్ను పెరిగినా సాగుదారులకు భారీ నష్టం – మొన్న రొయ్య, నిన్న మిరప.. నేడు పొగాకు రైతుల పరిస్థితి ఇదే – ప్రభుత్వాల చొరవే కీలకం.. ప్రత్యేక యంత్రాంగం అవసరం రొయ్య, పొగాకు, మిరప పంట ఉత్పత్తి, ఎగుమతుల్లో అగ్రస్థానం ఆంధ్రప్రదేశ్‌దే. ఏడాదికి రూ.40 వేల కోట్ల పైనే ఉత్పత్తులు ఎగుమతి అవుతాయి. వీటికి పెట్టుబడి ఎకరాకు రూ.3 లక్షల నుంచి రూ. 5 లక్షలపైనే! అంతర్జాతీయంగా ప్రతికూల పరిణామాలతో ధరలు పతనమవుతున్నా.. ఆదుకునే యంత్రాంగం లేదు. ఎగుమతులన్నీ కేంద్రం పరిధిలోనివే అంటూ రాష్ట్రం పట్టించుకోవట్లేదు. దీంతో మన రైతులు విలవిల్లాడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వమే ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసి ఎగుమతులను ప్రోత్సహిస్తే, ఇక్కడి పంటలకు ధరలు దక్కుతాయి.

*కేంద్రానిదే బాధ్యత.. అయినా దృష్టి తక్కువే*

ఎగుమతులు విరివిగా ఉంటేనే రైతుకు ప్రయోజనం. విదేశాలతో చర్చించి ఎగుమతులు పెంచేలా చూడాల్సిన బాధ్యత కేంద్రానిదే. దేశం నుంచి జరిగే మొత్తం ఎగుమతుల్లో బియ్యం 2.85%, సముద్ర ఉత్పత్తులు 1.69%, సుగంధ ద్రవ్యాలు 1.02%, పొగాకు 0.45% మాత్రమే. అందుకే కేంద్రం పట్టించుకోవట్లేదని నిపుణులు అంటున్నారు. రాష్ట్ర రైతుల భవిష్యత్తుకు వీటి ఎగుమతులే ఆధారం. ఇంకా బియ్యం, పండ్లు, కూరగాయల ఎగుమతులకూ ఎన్నో అవకాశాలున్నా, సరైన ప్రోత్సాహం లేదు.

*ఎగుమతుల డిమాండ్‌ లేకుంటే.. మిరప రైతుకు మంటలే*

దేశంలోని మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే.. ఆంధ్రప్రదేశ్‌లో మిరప సాగు, ఉత్పత్తి మాత్రమే కాదు, ఎగుమతులు కూడా అధికమే. దేశం నుంచి ఎగుమతయ్యే రూ.12 వేల కోట్ల మిరపలో సింహభాగం ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానిదే.- ఉమ్మడి గుంటూరు, కృష్ణా, ప్రకాశం జిల్లాలతో పాటు అనంతపురం, కర్నూలు జిల్లాల్లో సగటున 4.50 లక్షల ఎకరాల నుంచి 6.50 లక్షల ఎకరాల వరకు సాగు చేస్తుంటారు. ఉత్పత్తి సగటున 7-14 లక్షల టన్నులు ఉంది.- కౌలు, విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు, కోత ఖర్చులు, రవాణా, కమీషన్‌ సహా మొత్తంగా ఎకరాకు సగటున రూ.3లక్షల పెట్టుబడి అవుతోంది.- గతేడాది జనవరి వరకు మిరప క్వింటాలుకు రూ.20 వేల వరకు ఉండేది. తర్వాత ఎగుమతులకు డిమాండు లేకపోవడంతో.. రూ.8-13వేల మధ్యకు దిగజారింది. ఎకరానికి రూ. 75 వేల నుంచి రూ. లక్ష వరకు నష్టపోతున్నారు.

*మిరప ఎగుమతులు ఇలా…*

సంవత్సరం ఎగుమతులు (టన్నుల్లో) విలువ (రూ. కోట్లలో) 2023-24 6,01,084 12,492 2022-23 5,16,177 10,444 2021-22 5,57,144 8,585 2020-21 6,49,815 9,241 అధిక ఎగుమతులు: చైనా, అమెరికా, బంగ్లాదేశ్‌, యూఏఈలకు.

*రొయ్య రైతులకు గుండె దడే!*

సముద్ర ఉత్పత్తుల ఎగుమతుల్లో రాష్ట్ర వాటా 32-36% వరకు ఉంటోంది. అందులో అధికభాగం రొయ్యలే. ఈక్వెడార్‌ నుంచి పోటీతో రెండేళ్ల క్రితం ధరలు పతనమయ్యాయి. అమెరికా సుంకాల బాదుడుతో ఇటీవల మళ్లీ రేటు తగ్గించారు. అంతర్జాతీయంగా ఏం తేడా వచ్చినా.. ఇక్కడ ధర తగ్గించేస్తారు. ఉమ్మడి ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాల్లో

రొయ్యల చెరువులు అధికం.- చెరువు తవ్వకం, విద్యుత్తు కనెక్షన్‌, బోరు ఇతర ఖర్చులతోపాటు.. చెరువు నిర్వహణ, రొయ్య పిల్ల, మేత, మందులు, కూలీలు, అన్నీ కలిపితే రెండున్నర నెలలకే (ఒక పంటకు) ఎకరానికి రూ.5 లక్ష లకు పైనే ఖర్చవుతుంది. వాతావరణం అనుకూలించి రెండు టన్నుల (50 కౌంట్‌) దిగుబడి వస్తే రూ. 6.50 లక్షల ఆదాయం. వ్యాధులు సోకితే.. పెట్టుబడి మొత్తం పోయినట్లే! రాష్ట్రంలో 2.64 లక్షల మంది రైతులు 5,72,065 ఎకరాల్లో ఆక్వా సాగు చేస్తున్నారు.

*రొయ్య ఎగుమతుల పరిస్థితి*

సంవత్సరం విలువ (రూ. కోట్లలో) ఏపీ వాటా (%) 2023-24 60,523 32.09 2022-23 63,969 31.02 2021-22 57,586 34.79 2020-21 43,717 36.21 అధిక ఎగుమతులు: అమెరికా, చైనా, జపాన్‌ తదితర దేశాలకు…

*పొగాకు.. అంతా ఎగుమతులే!*

పొగాకు అంటే పూర్తిగా ఎగుమతి ఆధారిత పంటే. ఇక్కడే ఉత్పత్తి అధికం. 2024-25లో దేశం నుంచి రూ.16,884 కోట్ల ఉత్పత్తుల్ని ఎగుమతి చేయగా, అందులో ఆంధ్రప్రదేశ్‌ వాటా 67.15%. వర్జీనియా, బర్లీ రకాల సాగు గతేడాది భారీగా పెరిగింది. ధరలు అనుకూలించడంతో ఈ ఏడాది 3.40 లక్షల ఎకరాల్లో సాగుచేశారు.- బోర్డు నియంత్రణలో సాగయ్యే వర్జీనియా పొగాకు సాగుకు ఎకరానికి బ్యారన్‌ అద్దె, ఇతర ఖర్చులు కలిపితే రూ.1.80 లక్షల పెట్టుబడి అవుతోంది.- గతేడాది 140 మిలియన్‌ కిలోలకు అనుమతి ఇస్తే. 211 మిలియన్‌ కిలోల ఉత్పత్తి లభించింది. సగటు ధర కిలోకు రూ.288.65 దక్కింది. ఈ ఏడాది 167 మిలియన్‌ కిలోల ఉత్పత్తికి అనుమతించగా.. 240 మిలియన్‌ కిలోలు వస్తుందని అంచనా. వ్యాపారులు ధరలు తగ్గించడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.

*దేశం నుంచి పొగాకు ఉత్పత్తుల ఎగుమతులు*

సంవత్సరం ఎగుమతుల విలువ (రూ.కోట్లలో) 2024-25 16,884 2023-24 12,006 2022-23 9,739 2021-22 6,880 అధిక ఎగుమతులు: యూఏఈ, బెల్జియం, ఇండోనేషియా, ఈజిప్ట్‌, అమెరికాలకు..

*ఏం చేస్తే ప్రయోజనం*-

వ్యవసాయ మిషన్‌ను బలోపేతం చేయాలి. అందులో వివిధ రంగాల నిపుణులను నియమించాలి. – ఎగుమతి ఆధారిత పంటలపై నిరంతరం సమీక్షించాలి. ఎంపెడా, అపెడా, ఎగుమతి సంస్థలతో చర్చించాలి.- విదేశీ సంస్థలను సంప్రదిస్తూ.. ఆర్డర్లు తెచ్చే సంస్థలను నియమించాలి.- పంట ఎగుమతులు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై నిపుణులు, శాస్త్రవేత్తలతో రైతులకు శిక్షణ ఇప్పించాలి

Read More